గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, జనవరి 2010, శనివారం

ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.







శ్రీ గురుభ్యో నమ:
భక్త బంధువులారా! 
లోక బంధువైన ప్రత్యక్ష దైవం మన సూర్య భగవానునికి అత్యంత ప్రీతికరమైన  మాఘమాసం రాబోతున్న సందర్భంగా ఆ లోక బంధువును ఆయురారోగ్య ఐశ్వర్యముల కొఱకు కొలవ దలచుకొన్నవారు పఠించుట కనుకూలంగా ఉంటుందనే ఆలోచనతో, 
మకుటం లేని మహా కవి రాజు, లబ్ధ ప్రతిష్ఠులు, విశ్రాంత సంస్కృత కళాశాలాధ్యక్షులు, శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారి ప్రియ శిష్యులు అయిన 
శ్రీ మానాప్రగడ శేషశాయి హృదయం నుండి ఉప్పొంగిన భక్తి భావంతో కలం నుండి జాలువారిన కవితాస్రవంతి 
 "మకుటం లేని మహా శతకం" గా
అనేకమంది మహా పండితుల, కవుల మన్నన లందుకొన్నది ప్రసన్న బాస్కరము అనే ఈ శతక రాజము.ఇది కేవలము నియమిత పరిధిగల పుస్తకాలలోనే ఉండిపోవడం అనేకమంది పాఠకులకు అలభ్యంగా ఉంది. ముందుగా మాగురు దేవులైన శ్రీ మానాప్రగడ శేషశాయి పాదారవిందములకు ప్రణమిల్లుతూ, . . . ఆసక్తిగల ప్రతీ ఒక్కరికీ ఈ మహనీయుని రచన అయిన " ప్రసన్న భాస్కరము"  పఠన యోగ్యంగా ఉండటం కొఱకు ఆంధ్రామృతంలో 13 భాగాలుగా  ప్రచురిస్తున్నాను. ఇది 1/13వ భాగము. ఉదార స్వభావులైన పాఠకులెల్లరు సరస హృదయులై పఠించఁగలందులకు మనవి. ధన్య వాదములు. 
జైహింద్.
Sri Manapragada Seshs sai garu0001.jpg
ప్రసన్న భాస్కరము
రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.
1.శ్రీమదపూర్వ కాంతి శబలీ కృత సర్వ చరాచరా! త్రిలో
కీ మణి దీపమా! సుగుణ కీర్తిత రాఘవ వంశ దీపకా!
కామిత కోటి కల్పతరు! కాల పితా! ఋతు సంప్రవర్తకా!
నీ మహిమంబదేమి? కమనీయ ఘృణీ! తరణీ! వియన్మణీ!
2.ఓ ముదితారుణారుణ మహోదయ మండల రశ్మి! మేలుకో.
కామిత కల్పకా! ప్రథిత కాంచన పల్లవ కాంతి! మేలుకో.
ప్రేమ కటాక్ష భృంగ ముఖరీకృత పద్మిని! వేగ మేలుకో.
స్వామి! సహస్ర దీధితి!అపాంపతి! ఛాయ మెలంగి మేలుకో.
3.ప్రొద్దు మలంచుపై నిలిచి, లోకము లేలెడి సామి! మేలుకో.
సిద్ధ సురాసురాంగనల సేవలతోఁ దనివార ఏలుకో.
ఇద్ధరుచీ! చరాచర మహీశుచి దైవమ! మమ్మునేలుకో.
అద్దుమయా! దయారుణ నతాంశువులన్ భువనైక పావనా!
4.ఉదయ గిరీంద్ర సాను శయనోత్థిత శింహ కిశోర కేసరా
భ్యుదయ సవర్ణ శోణిమము ప్రొద్దు మలంబరతెంచె, బెంగతో
అదవద పొందెఁ జీఁకటి, ద్విజారవమై మిను రేఁగె, నాకమై 
పొదలెనిలాతల, మ్మరుణ ముగ్ధ శుభాకృతి! రమ్య దీధితీ!
5.బారులు తీర్చి దేవతలు బంగరు పాదములన్ భజింప సం
భారము లెల్లఁ గూర్చికొని వచ్చిరి భాస్కర!  పద్మ హస్తులై,
ఆరతులందుకో మకుట హారి మణిస్ఫుట రోచిరున్నతుల్.
సౌర సముల్లసన్మహిమ! చారు ఘృణీ! జగమేల మేలుకో!
6.దోయిలిదే  మహాద్యుమణి! దుందుడుకెల్ల భరించి మేలుకో.
యీ యఖిల ప్రపంచమున కీవె వెలుంగు. బిరాన మెలుకో.
ఆయు రరోగ భోగ విభవాది సమస్త మొసంగి మేలుకో.
వేయి వెలుంగు లుల్లసిల, విశ్వ వికాసముఁ గూర్ప మేలుకో.
7.చుట్టపుఁ జూపుగా కిరణ సుందర మండల మధ్య వర్తియై
చుట్టి సమస్త లోకములు సూర్య నమస్కరణార్ఘ్య పాద్యముల్
పట్టిన సిద్ధ సాధ్య సుర భక్త సమాజము నార్ద్ర పాణితో
తట్టి, వరా లొసంగు రవి తత్వము మాకుఁ బ్రసన్నమయ్యెడున్.
8.వ్యోమ తరు ప్రవాళ రుచిపూర్వ దిశాముఖ కుంకుమంబు, శో
భా మృదులాంశు కాంతము, జవాశ్వ ఖురోచ్చలితాద్రి ధూళి రే
ఖా మహితాభ, మంబురుహ గర్భ హరిప్రియ, ముజ్వల త్ప్రభా
ధామము సూర్య మండలము  తత్వము మాకుఁ బ్రసన్నమయ్యెడున్.
9.అలఘు తమిస్ర భంజన మహామహముల్ దళితేంద్ర కోర్ముకో
చ్చలిత నవాంశ రమ్యములు.  సారస పేశల హాస రేఖ లా
వలిత శిర స్తురంగమ జవ ప్రసభోద్ధృత ధూళి రాశు, లు
జ్జ్వల దుదయార్క దీధితులు చయ్యన మాకుఁ బ్రసన్నమయ్యెడున్.
10.అమిత త్రివిక్రమ స్ఫురణ మత్రి భృగు ప్రముఖర్షి ధామ మూ
లము నమితానురాగ రస రమ్య ముదంచిత రోచి రుల్లస
త్కమల భవాండ, మంబుజ వికాసము, లోధ్ర సుమస్ఫుటాభ దీ
ప్తము, రవి మండలారుణిమ తత్వము మాకుఁ బ్రసన్నమయ్యెడున్.
11.హరిత మణి చ్ఛటా చకిత హారి తురంగమ సప్తక ప్రభా
పరిణత, మద్భుత ప్రణమితామర మౌళి గుళుచ్ఛ కాంతి భా
సురము, జగత్త్రయీ  సదన సుందర కాంచన తోరణమ్ము, భా
స్కర నవ రత్న మండలము చయ్యన మాకుఁ బ్రసన్నమయ్యెడున్.
12.లలిత వసంత పల్లవ విలాసము లద్భుత పద్మరాగ మం
జులములు, శోణ కాంతికర చుంబిత దిగ్వనితా ముఖమ్ము లా
కులిత తమిస్రముల్, ప్రసవ కోమలముల్, సరసీజ హాస పే
శలములు భాను తేజములు, చయ్యన మాకుఁ బ్రసన్నమయ్యెడున్.
Print this post

2 comments:

కథా మంజరి చెప్పారు...

మన గురు దేవుల ప్రసన్న భాస్కరమును అందరకు అందించాలనే నీ సంకల్పం కొనియాడతగినది. విజయోస్తు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ధన్య వాదాలు మిత్రమా!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.