గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జనవరి 2010, ఆదివారం

పురుష సూక్తము. ఆంధ్రానువాదము. 10 వ (చివరి) భాగము.

0 comments

ఓం నమో నారాయణాయ.
పురుష సూక్తము (10 వ భాగము)
తస్య ధీరా: పరిజానన్తి యోనిమ్, మరీచీనాం పదమిచ్ఛన్తి వేధస:, యోదేవేభ్య ఆతపతి, యోదేవానాం పురోహిత: పూర్వో యో దేవేభ్యో జాత: నమో రుచాయ బ్రాహ్మయే, రుచం బ్రాహ్మం జనయన్త:, దేవా అగ్రే త దభ్రువన్, యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్, తస్య దేవా అసన్వసే.2
హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ, అహో రాత్రే పార్శ్వే, నక్షత్రాణి రూపమ్, అశ్వినౌ వ్యాత్తమ్, ఇష్టం మనిషాణ, అముం మనిషాణ, సర్వ మనిషాణ.
ప్రతిపదార్థము:-
ధీరా: = జ్ఞానులు
తస్య = ఆ ప్రజాపతియొక్క
యోనిం = స్వరూపమును
పరిజానన్తి తెలిసికొనుచున్నారు
వేధస: = బ్రహ్మలు
మరీచినామ్ = మరీచి మొదలైన వారి యొక్క
పదమ్ = స్థానమును
ఇచ్ఛంతి  =  కోరుచున్నారు.
య: = ఏ పరమేశ్వరుఁడు
దేవేభ్య: దేవతల కొఱకు
ఆతపతి = అంతటఁ బ్రకాశించుచున్నాఁడో
య: ఎవఁడు?
దేవానాం = దేవతలకు
పురోహిత: = ముందఱ హితమును జేయువాఁడో
య: = ఎవఁడు
దేవేభ్య: = దేవతలకంటె
పూర్వ: మొదటివాఁడై
జాత: = పుట్టెనో (అటువంటి)
రుచాయ = స్వయం ప్రకాశమైన
బ్రాహ్మయే = పరబ్రహ్మ రూపమునకుఁగాను
నమ: = నమస్కారము.
దేవా: = సమస్త దేవతలును
అగ్రే = సృష్ట్యాదియందు
తత్ ఆ బ్రహ్మ తత్వమును గుఱించి,
(సంబుద్ధ్య = సంబోధించి)
అభ్రువన్ పలికిరి.
హే పరమాత్మాన్ ఓ స్వామీ!
య: 
బ్రాహ్మణ: బ్రాహ్మణుఁడు
ఏవం = ఈ ముందు చెప్పిన ప్రకారము
విద్యాత్ = తెలిసికొనునో
తస్య = ఆ బ్రహ్మకు
దేవా: = సమస్త దేవతలు
వశే ఆసన్ స్వాధీనమం దుండిరి.
హ్రీ: = లజ్జాభిమానిని యగు దేవతయును
లక్ష్మీశ్చ = ఐశ్వర్యాభిమానిని యగు దేవతయును
తే నీకు
పత్నౌ = భార్యలు.
అహోరాత్రే = రేయుం బవళ్ళు
పార్శ్వే = పార్శ్వద్వయ స్థానీయములు.
నక్షత్రాణి = నక్షత్రములు
రూపం = శరీరము.
అశ్వినౌ అశ్వినీ దేవతలు
వ్యాత్తం తెఱవఁ బడిన ముఖము. (అట్టి విరాట్టూ!)
ఇష్టం మేము కోరు దానిని
మనిషాణ = ఇమ్ము.
అముమ్ = ఈ ఆత్మ బోధను
మనిషాణ = ఇమ్ము.
సర్వం = ఐహికాముష్మిక రూపమైన సమస్తేష్టమును
మనిషాణ ఇమ్ము.
దండాన్వయము:-
జ్ఞానులు ఆ ప్రజాపతియొక్క స్వరూపమును తెలిసికొనుచున్నారు.బ్రహ్మలు మరీచి మొదలైన వారి యొక్క స్థానమును కోరుచున్నారు. ఏ పరమేశ్వరుఁడు దేవతల కొఱకు అంతటఁ బ్రకాశించుచున్నాఁడో,  ఎవఁడు? దేవతలకు ముందఱ హితమును జేయువాఁడో ఎవఁడు దేవతలకంటె మొదటివాఁడై పుట్టెనో(అటువంటి) స్వయం ప్రకాశమైన పరబ్రహ్మ రూపమునకుఁగాను నమస్కారము..సమస్త దేవతలును సృష్ట్యాదియందు  ఆ బ్రహ్మ తత్వమును గుఱించి,
(సంబోధించి) పలికిరి.ఓ స్వామీ! ఏ బ్రాహ్మణుఁడు ఈ ముందు చెప్పిన ప్రకారము తెలిసికొనునో ఆ బ్రహ్మకు సమస్త దేవతలు స్వాధీనమందుండిరి. లజ్జాభిమానిని యగుదేవతయును ఐశ్వర్యాభిమానిని యగు దేవతయును నీకు
భార్యలు. రాత్రింబవళ్ళు పార్శ్వద్వయ స్థానీయములు. నక్షత్రములు శరీరము. అశ్వినీ దేవతలు తెఱవఁ బడిన ముఖము(అట్టి విరాట్టూ) మేము కోరు దానిని ఇమ్ము. ఈ ఆత్మ బోధను ఇమ్ము.ఐహికాముష్మిక రూపమైన సమస్తేష్టమును ఇమ్ము.
సీ:-
జ్ఞానుల్ ప్రజాపతి సద్రూపమెఱుఁగుదు 
ర్బ్రాహ్మల్మరీచాది పదవు లడుగు.
ఎవఁడుదేవతలకై యినుని ప్రకాశుఁడౌన్ 
దేవ హితముఁజేయు దేవుఁడెవఁడొ
దేవతలకు మున్నె దీపించెనెవ్వఁడో 
యట్టి ప్రకాశున కంజలింతు.
దేవతలెల్లరు  దివ్య తత్వమరయ 
సృష్ట్యాదినె పలికె సృష్టి ప్రభుని.
స్వామి ! యే బ్రాహ్మఁడీ సకలమ్ము నెఱుఁగును,
దివ్యు నాతనిఁ జేరు దేవతలును.
హ్రీయు శ్రీయును భార్య లై యలర్చును నిన్ను,
రాత్రియు పవలు పార్శ్వములు నీకు.
గీ:-
తార లెల్లను నీదు శరీరమయ్య!
అశ్వినుల కనుచు వికసితా! విరాట్టు!
ఇమ్ము కోరిన దానిని. ఇమ్ము బోధ!.
ఐహికాముష్మికములెల్ల యరసి యిమ్ము.
వివరణ:-
జ్ఞానులు యోగముచే  నిరోధింపఁ బడిన ఇంద్రియములు గలవారై ఆ ప్రజాపతి యొక్కనిజ రూపమును యెఱుఁగు చున్నారు. బ్రహ్మలు ప్రజాపతి యొక్క , ఆ స్వరూపముచే నియమించు వారలై మరీచి మొదలగు వారి స్థానమును గోరు చున్నారు. ఏ పరమాత్మ దేవతలకు గాను సర్వత్ర ప్రకాశించుచు ఆ దేవతలకు దేవత్వము సిద్ధించుటకు వారి మనస్సులలో చైతన్య రూపమునఁ బ్రవేశించి ఆవిర్భవించు చున్నాఁడో ఎవఁడు దేవతల గురువగు బృహస్పతి అయెనో, ఎవఁడు దేవతలకన్నా పూర్వుఁడగు హిరణ్య గర్భుఁడో, అట్టి పరబ్రహ్మ స్వరూపమునకు నమస్కార మగుఁ గాక. దేవత లందరును బ్రహ్మ సంబంధమైన చైతన్యమును జ్ఞానముచే నుద్భవింపఁజేయుచు ఆ పరబ్రహ్మ తత్వమును సంబోధించి, ఓ పరమాత్మా! ఏ బ్రాహ్మణుఁడు, మరలజన్మించి నిన్నే విధి ప్రకారము తెలియునో అట్టి బ్రహ్మ వేత్తకు ఎల్ల దేవతలును స్వాధీను లగుచున్నారు. వాఁడే తానా దేవతలకెల్లఱకును అంతర్యామి యగు పరమాత్మ యగుచున్నాఁడు.  ఓ పరమాత్మా! లజ్జాభిమానిని యగు దేవతయును, ఐశ్వర్యాభిమానిని యగు దేవతయును నీ భార్యలు. రాత్రింబవళ్ళే నీ పార్శ్వములు. ఆకాశమందలి నక్షత్రములు నీ రూపము. అస్వినీ దేవతలే నీ ముఖము. అట్టి విరాట్ పురుషుఁడా! మేము కోరు జ్ఞానము నిమ్ము. ఈ ప్రపంచమునందలి సంపదలన్నిటినీ యిమ్ము.ఐహికాముష్మికమైన సమస్తమును దయచేయుము. ఇది 10 వ భాగము. సమాప్తము.
పురుష సూక్తము ముగిసెను.
ఓం తత్సత్. 
జైహింద్.

పురుష సూక్తము. ఆంధ్రానువాదము. 9 వ భాగము.

0 comments


ఓం నమో నారాయణాయ.
పురుష సూక్తము (9 వ భాగము)

అద్భ్యస్సంభూత: పృథివ్యై రసాచ్చ, విశ్వకర్మణ స్సమవర్తతాధి, తస్య త్వష్టా విదధ ద్రూప మేతి, తత్ పురుషస్య విశ్వమాజానమగ్రే, వేదాహ మేతం పురుషం మహాన్తం, ఆదిత్య వర్ణం తమస: పరస్తాత్, తమేవం విద్వా నమృత ఇహ భవతి, నాన్య: పన్థా విద్యతే z యనాయ. ప్రజాపతిశ్చరతి గర్భే అంత:, అజాయమానో బహుథా విజాయతే. ౧.
ప్రతిపదార్థము:-
(నారాయణుఁడు)
అద్భ్య: నీళ్ళ నుండి,
(సంభూత: = పుట్టెను.)
పృథివ్యై = భూ సంబంధ మైన
రసాచ్చ ద్రవము నుండియును
(సంభూత: పుట్టెను.)
విశ్వ కర్మణ: పరమేశ్వరుని వలన
అధిసమవర్తత = ఆధిక్యముగ పుట్టెను.
తస్య = ఆవిరాట్టు యొక్క
రూపమ్ ఆకృతిని
విదధత్ కలుగఁ జేయుచున్న
త్వష్టా = జగదీశ్వరుఁడు
ఏతి పొందుచున్నాఁడు.
పురుషస్య విరాట్టు సంబంధమైన
తత్ ఆ ప్రసిద్ధమగు
విశ్వమ్ జగత్తు
అగ్రే సృష్యాదియందు
అజానం = పుట్టెను.
ఏతం 
పురుషం విరాట్టును
మహాన్తం = అధికునిగాను,
ఆదిత్య వర్ణం = సూర్యుని వలెఁ బ్రకాశించు వానిఁ గాను,
అహం నేను
వేద తెలిసికొను చున్నాను.
సచ ఆ విరాట్టే
తమస: = అజ్ఞానమను చీఁకటికి
పరస్తాత్ బయట
(వర్తతే = ఉన్నాఁడు)
తం = వానిని
ఏవం ఈ ప్రకారము
విద్వాన్ = తెలుసుకొనువాఁడు
ఇహ ఇచ్చటనే
అమృత: భవతి చావు లేనివాఁ డగుచున్నాఁడు.
అయనాయ = ముక్తి కొఱకు
అన్య: = ఇతరమగు
పంథా: మార్గము
నవిద్యతే లేదు.
గర్భే గర్భమందు
అంత: లోపల
ప్రజాపతి: ప్రజాపతి
చరతి = ఉన్నాఁడు.
అజాయమాన: = పుట్టనివాఁడైనను
బహుథా అనేక ప్రకారములుగా
విజాయతే పుట్టుచున్నాఁడు.
దండాన్వయము:-
నారాయణుఁడు నీళ్ళ నుండి, పుట్టెను. భూ సంబంధ మైన ద్రవము నుండియును ( పుట్టెను). పరమేశ్వరుని వలన ఆధిక్యము పుట్టెను. ఆవిరాట్టు యొక్క ఆకృతిని కలుగఁ జేయు చున్నజగదీశ్వరుఁడు పొందు చున్నాఁడు. విరాట్టు సంబంధమైన ఆ ప్రసిద్ధమగు జగత్తు సృష్యాదియందు పుట్టెను. ఈవిరాట్టును అధికునిగా సూర్యుని వలెఁ బ్రకాశించు వానిని గాను, నేను తెలుసుకొను చున్నాను. ఆ విరాట్టే అజ్ఞానమను చీఁకటికి బయట ఉన్నాఁడు. వానిని ఈ ప్రకారము తెలుసుకొనువాఁడు ఇచ్చటనే చావు లేనివాఁడగుచున్నాఁడు. ముక్తి కొఱకు ఇతరమగు మార్గము లేదు. లోపల ప్రజాపతి ఉన్నాఁడు..పుట్టనివాఁడైనను అనేక ప్రకారములుగా పుట్టుచున్నాఁడు.
సీ:-
ఆదినారయణుం డంబువుననుఁ బుట్టె
పృథివి రసములను పేర్మిఁ బుట్టె.
అతని వలన గల్గె నాధిక్యమది చూడ. 
ఆ విరాట్కర్తయె అందె దాని.
ఆవిరాట్ సంబంధమాప్రసిద్ధ జగత్తు 
సృష్టికాదినె పుట్టె స్పష్టముగను.
ఆ విరాట్టధికుగా యా వెల్గు సూర్యుగా 
తలతు నతని నేను తనివి తీర.
గీ:-
ఆత డజ్ఞాన మవతల నరయ నుండు.
అతనినెఱిఁగిన మృతి లేని యతఁడు ఇతఁడు.
అన్య మార్గము ముక్తికి నరయ లేదు.
లోననుండు ప్రజాపతి జ్ఞాని యరయ.
పుట్టుకయెలేని వాఁడును పుట్టు మిగుల.

వివరణ:-
నారాయణుఁడెవఁడో అతఁడు నీళ్ళ నుండి జనించెను. ఎల్లెడలనుండు నీళ్ళలో బ్రహ్మాండము పుట్టెను. ఇది ముఖ్యముగా నీళ్ళ వలననే పుట్టినది గాదు. భూ సంబంధమైన యుదకము నుండి పుట్టినది. ఇది పరమేశ్వరుని వలన అధికముగఁ బుట్టినది. ఇట్టి బ్రహ్మాండమునకు అభిమాని యైన చేతన స్వరూపుఁడగు పురుషుఁడు ఎవఁడోవాఁడు ఈశ్వరుని యంశము. అట్టి విరాట్టుకు చత్య్ర్దశ లోకావయవ సంస్థితి యైన రూపమును గలుగఁ జేయుచుండెడి విశ్వ కర్మ యైనజగదీశ్వరుఁడు కలఁడు. ఆ విరాట్టు సంబంధమైన ప్రసిద్ధమగు ఈ మనుష్యాది రూపమైన సమస్త ప్రపంచము సృష్యాదియందు అంతట పుట్టెను. ఇట్టి విరాట్టును గొప్ప వానినిఁ గాను, అజ్ఞానమునకు బైట ఆదిత్యుని వలెనే ప్రకాశించు వానినిఁగా నెఱిఁగి ధ్యానించెడి వాఁడు ఇక్కడనే మరణ రహితుఁడగు చున్నాఁడు. ముక్తి కొఱకు యిట్టియుపాసన కంటె నితర మార్గము లేదు. ఈ బ్రహ్మాండము లోపల ప్రజాపతి యున్నాఁడు. నిజమైన యాకారము కలవాఁడు కాఁడు. ఈ ప్రజాపతి పుట్టుక లేనివాఁడైనను నా సంబంధమైన రూపముతో స్థావర జంగమాదికమై అనేక విధములుగాఁ బుట్టు చున్నాఁడు.
ఇది 9 వ భాగము. (స శేషము)
జైహింద్.