,జైశ్రీరామ్.
శ్రీమద్భగవద్గీత
3వ అధ్యాయము. కర్మయోగము.
|| 3-41 ||
శ్లో. తస్మాత్త్వమిన్ద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ|
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్.
తే.గీ. జ్ఞాన విజ్ఞాన నాశినిన్ గామము నిక,
వదిలి పెట్టుము పార్థుఁడా! పట్టుపట్టి
యింద్రియములను గెలువుమో యింద్ర తనయ!
మహిత కర్తవ్యదీక్షతో మహిని నీవు.
భావము.
అందువలన భరత కుల శ్రేష్టుడా! ముందుగా నీవు ఇంద్రియాలని నిగ్రహించి,
జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే పాపిష్టి కామాన్ని నిర్మూలించు.
|| 3-42 ||
శ్లో. ఇన్ద్రియాణి పరాణ్యాహురిన్ద్రియేభ్యః పరం మనః|
మనసస్తు పరా బుద్ధి ర్యో బుద్ధేః పరతస్తు సః.
తే.గీ. ఇంద్రియంబులు ఘనమని యందురనఘ!
అంతకన్నను మనసెయౌ నధిక ఘనము,
మనసుకన్నను బుద్ధియఘ మరియు ఘనము,
బుద్ధికన్న నాత్మ ఘనము బుద్ధినరయ.
భావము.
ఇంద్రియాలు గొప్పవని చెబుతారు. ఇంద్రియాలకన్నా అధికమైనది మనస్సు.
మనస్సు కన్నాగొప్పది బుద్ధి, బుద్ధి కంటే శ్రేష్టమైనది ఆత్మ.
|| 3-43 ||
శ్లో. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మాన మాత్మనా|
జహి శత్రుం మహాబాహో! కామరూపం దురాసదమ్
తే.గీ. బుద్ధి కన్న నాత్మయె ఘనంబుగఁ గ్రహించి,
నిగ్రహించుచు నిను నీవు, నేర్పు మీర
కామమను శత్రువున గెల్చి, ఘనతరముగ
చేయఁ దగినట్టి ధర్మంబు చేయుమరసి.
భావము.
మహాబాహుడా! ఇలా ఆత్మను బుద్ధికన్నా ఎక్కువైన దానిగా తెలుసుకొని, నిన్ను నీవు
నిగ్రహించుకొని,కామరూపి అయిన శత్రువునను జయించుము.
3వ అధ్యాయము. కర్మ యోగము సమాప్తము.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.