జైశ్రీరామ్.
ఆర్యులారా!ఒక భువనవిజయసభలో తెనాలిరామకృష్ణపండితునిపాత్రలో పండితకవి, శతావధాని కీ.శే.గాడేపల్లి కుక్కుటేశ్వరరావుగారు చేసిన పద్యపూరణ చూడండి.
సమస్య: "ఒకరా?యిద్దర?ముగ్గురా?నలుగురా?
పూరణ:
ఒకతాతంగని "ఊతునా?"యనుచు పైనుమ్మేసితిన్, ప్రగ్గరా
ట్సుకవీంద్రున్ "విరసా,తుసా,బుస"యటంచుం దిట్టితిన్, "దోమకు
త్తుకలో నెక్కడజొచ్చె తొత్తుకొడకా! దుర్దాంతమౌ కుంజర
ప్రకరం"బంచొక పండితుం దెగడితిన్, అంతంబుదీపింప పి
ల్లికి పాల్వోయక, నేనెద్రావి "యిసి! పాలేయొల్లదీ పిల్లికూ
న కటా!" యంచును దానిమాడ్చితిని, నానాబ్రాహ్మణవ్రాతమిం
టికిరాన్ మజ్జనయిత్రి జచ్చునెడ "తండ్రీ! వాతరో, వాతలం"
చు కనుల్ మూసినదంచు వీపుపయి పెచ్చుల్ లేవ నంటించితిన్,
ఒకయుద్దండునిబట్టి "యర్థమదియేదో తేల్చుమీ" యంచు "మే
కకుతోకా,తొకతోకమేక,తొకతోకా"యంచు వల్లించి, గ్రు
డ్లకు నీర్దిర్గనొనర్చితిన్, వికటలీలన్ మత్పరాభూతులి
ట్లొకరా? యిద్దర? ముగ్గురా? నలుగురా?ఊహింపగానెందరో?
చూచారు కదా! మరి మీరైతే ఏ పాత్రలో ఉంటే ఏవిధంగా పూరిస్తారో పూరించి చూపగలరని ఆశిస్తున్నాను.
జైహింద్.
4 comments:
గురువుగారికి వందనములు.
తెనాలి రామకృష్ణుడి పాత్రనే యూహించి మీరుదహరించిన కవిగారి స్పూర్తితో......
ఒకచోటన్ సరస ప్రధాన కవనంబూహింపగాజేసి వే
రొకచోటన్ భగవచ్చరణ్యమను భావోద్వేగమున్ చూపితిం
కొకచోటన్ మరి పండితాధములకుద్యోగార్హతన్ ద్రుంచి వే
రొకచోటన్ కవితాప్రహర్షమున ప్రేమోద్వేగమున్ బంచితిన్
ప్రకటస్పూర్తికవిత్వభావకలితాప్రజ్ఞాధురంధర్యతన్
సకలశ్రేణి కవీశ్వరప్రముఖులన్ స్థంబింపగాజేసితి
ట్లొకరా యిద్దర ముగ్గురా నలుగురా యూహింపగానెందరో.
శ్రీగురుభ్యోనమ:
గురువుగారికి నమస్సులు. ధూర్ఝటి మహాకవి వలె వ్రాయలేను. తప్పిదములను మన్నించి సవరింప ప్రార్థన.
ఒకరా?యిద్దర?ముగ్గురా?నలుగురా?ఊహింపగానెందరో
సకలైశ్వర్య యశోవిభూతి కలుగన్ సాహిత్యసామ్రాట్టులై
రి కదా త్వచ్చరణారవిందముల నర్చింపంగ, నీపాదము
ద్రికలన్ నిల్పుము నాదు మస్తకముపై శ్రీకాళహస్తీశ్వరా
శ్రీపతిశాస్త్రి గారు,
అద్భుతమైన పద్యాన్ని ఆవిష్కరించారు. మన:పూర్వకాభినందనలు
శ్రీయుతులు శ్రీపతి, సంపత్ కుమార్ ల పూరణలు చాలా బాగున్నాయి. అభినందనలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.