శ్రీరస్తు. శుభమస్తు అవిఘ్నమస్తు.
బ్రహ్మశ్రీ పండరి రాధాకృష్ణగారికి భక్తి సాధన పురస్కారమ్.
పంచరత్నములు.
శా. శ్రీమన్మంగళ పండరీ కులజ! రాశీభూత సచ్చేతనో
ద్ధామా! సన్నుత భక్తి సాధకుఁడ! రాధాకృష్ణ! సద్భాసుఁడా!
శ్రీమాతాపరమేశ్వరప్రభలు చేరెన్ మిమ్ము మీ భక్తిచే,
ధీమంతా శుభ సంహతిన్ బడసి ధాత్రిన్ వెల్గుమా ప్రీతితో.
ఉ. దేవుని నిత్యమున్ గొలుచు దీక్ష వహించితొ? దీప్తిఁ గొల్పగా
భావనఁ జేసి సత్ కవుల పద్యసుమాళిని దేవదేవు సం
సేవలకై రచించునటు చిత్తము పెట్టి రచింపఁ జేసి, శో
భావహమై వెలుంగుదువొ? భవ్యుఁడవీవు, శుభాస్పదా! సుధీ!
ఉ. లక్షకు మించుపద్యములు లక్ష్యముతో రచియింపఁ జేసి, స
ల్లక్షణ లక్షితుండవయి, ధర్మనిబద్ధత నొప్పుచుంటివా?
మోక్షము గొల్పు సత్కవిత పూజ్య కవీశులకంచు నెంచి, యా
రక్షణమార్గమున్ గొలిపి, రాజిలఁ జేయుచునుంటివో భువిన్.
శా. నీ సత్ప్రేరణ పద్యపుష్పచయమున్ నిత్యంబు కల్పించు, స
ద్ధ్యాసన్ సత్ కవులద్భుతంపు కవితల్ తత్త్వజ్ఞులై వ్రాయుచున్
భాషాయోషి సుసేవనాపరులుగా భాసింతురిద్ధాత్రిపై,
నీ సత్ సేవలు భక్తి సాధనమునన్ నిల్చుంధరిత్రిన్ సదా.
ఉ. మంగళ భావనాభరిత మాన్యమహోదయ! నీకు నిత్యమున్
మంగళముల్ రచించు వరమంగళ దేవత వాసరాంబ, స
న్మంగళముల్ కవీశులకు, మంగళముల్ వర గాయకాళికిన్,
మంగళ భక్తి సాధక సమస్త జనాళికి మంగళంబగున్.
సద్విధేయుఁడు …. చింతా
రామకృష్ణారావు.
తేదీ. 16 – 8 - 2022
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.