జైశ్రీరామ్.
|| 11-13 ||
శ్లో. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా|
అపశ్యద్దేవదేవస్య శరీరే పాణ్డవస్తదా.
తే.గీ. విశ్వరూపంబునన్ గాంచె వివిధములుగ
కలుగునన్నిటినొకచోటె కలవిగాను,
సృష్టిమొత్తంబునచటనే దృష్టిపెట్టి
కాంచె పార్ధుండు కృష్ణుని కరుణ వలన.
భావము.
అపుడు అర్జునుడు దేవదేవుడగు భగవానుని శరీరములోనే
అనేక విధములుగా విభజింపబడిన సర్వ ప్రపంచమును
ఒకేచోటనున్న దానినిగా చూచెను.
|| 11-14 ||
శ్లో. తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనఞ్జయః|
ప్రణమ్య శిరసా దేవం కృతాఞ్జలిరభాషత.
తే.గీ. విస్మయము పొంది పార్థుడు విశ్వరూప
మును గని పులకితాంగుడై ప్రణతి చేసె
తాను సాష్టాంగముగ భక్తి తత్పరుడయి,
కృష్ణున కపుడు, ధన్యత, కీర్తి బడసి.
భావము.
పిమ్మట ధనంజయుడు విస్మయముతో పులకాంకితదేహుడై
భగవానునికి సాష్టాంగ ప్రణామము చేసి అంజలి బద్ధుడై ఇట్లనెను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.