జైశ్రీరామ్.
|| 11-23 ||
శ్లో. రూపం మహత్తే బహువక్త్రనేత్రం
మహాబాహో బహుబాహూరుపాదమ్|
బహూదరం బహుదంష్ట్రాకరాలం
దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్.
తే.గీ. నీయనేకబాహుల్వక్త్ర నేత్రములును
పాదములునూరువులుదరభాగములును,
కోరలును కడు భీతిని గొలుపుచుండె,
నేనునున్ భీతినొందితి నీరజాక్ష!
భావము.
ఓ మహాబాహో! అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను,
చేతులను, ఊరువులను, పాదములను, ఉదరములను, కోరలను
కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమునుచూచి, అందఱును
భయకంపితులగుచున్నారు. నేనుకూడ భయముతో వణికిపోవుచున్నాను.
|| 11-24 ||
శ్లో. నభఃస్పృశం దీప్తమనేకవర్ణం
వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్|
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాన్తరాత్మా
ధృతిం న విన్దామి శమం చ విష్ణో.
తే.గీ. నభము దాకె నీ రూపమనంత దీప్తి
వర్ణముల్ పెక్కు కలుగుచు, పరగు కనులు
కాంతులన్జిందనొప్పునీ ఘన ముఖంబు,
భీతిలెన్గని యందరున్, భీతియయ్యె.
భావము.
ఏలనన హే విష్ణో! నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది.
అదే అనేకవర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను
విరజిమ్ముచున్న విశాలనేత్రములతో, విస్తరించినముఖములతో
అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా
మనస్సు తత్తరపడుచున్నది. అందువలన నా దైర్యము సడలినది.
శాంతి దూరమైనది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.