జైశ్రీరామ్.
|| 11-17 ||
శ్లో. కిరీటినం గదినం చక్రిణం చ
తేజోరాశిం సర్వతో దీప్తిమన్తమ్|
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమన్తాద్
దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్.
తే.గీ. గదను, చక్రమును, కిరీట ము ధరియించి
యంతటను తేజ వారాశి నమర నిల్పి
యున్న నిను గాంచుచుంటిని, కన్నుల నిను
గాంచజాలని తేజంబు కలిగితివిగ.
భావము.
హే విష్ణో! కిరీటమును, గదను, చక్రమును ధరించి, అంతటను
తేజఃపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను.
ప్రజ్వలితాగ్నివలెను, జ్యోతిర్మయుడైన సూర్యునివలెను
వెలుగొందుచున్న నీ అప్రమేయరూపము దుర్నిరీక్ష్యమై యున్నది.
|| 11-18 ||
శ్లో. త్వమక్షరం పరమం వేదితవ్యం
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్|
త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా
సనాతనస్త్వం పురుషో మతో మే.
తే.గీ. అక్షరుం డవవేద్యుడ వాదరువువు
లోకముల కవ్యయుండవు, లోక ధర్మ
రక్షకుండవును, సనాతనాక్షయుడవు
గ తలతును నేను నిన్ను భోగ శయనుండ!
భావము.
పరమ - అక్షరస్వరూపుడవైన పరబ్రహ్మపరమాత్మవు నీవే, కనుక
అందరికిని తెలుసుకొనదగినవాడవు. ఈజగత్తునకు నీవే పరమాశ్రయుడవు.
సనాతన ధర్మరక్షకుడవు. నీవు అవ్యయుడవు. అని నా విశ్వాసము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.