గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జూన్ 2025, శనివారం

శ్రీ అవధానశతపత్ర (ఏకప్రాస శతకము) రచన.... చింతా రామకృష్ణారావు.

 శ్రీ అవధానశతపత్ర

(ఏకప్రాస శతకము)

రచన.... చింతా రామకృష్ణారావు.

శ్రీమన్మంగళ భావనా భరితుఁడున్ శ్రేయోభిలాషుండు నీ

ధీమంతుండగు నాముదాల మురళిన్ దీపించు గీర్వాణియే

ప్రేమన్ జేసెశతావధాన హవమున్ విశ్వంబె కీర్తింపగా,

ధీమంతుల్ శతపత్రసత్కవులిటన్ దీపింతురీవేదికన్.

జైశ్రీమన్నారాయణ.

ఆర్యులారా!

శ్రీ అవధానశతపత్రము అను పేరున వాట్సేప్ ఒక సాహితీ సమాఖ్య నిర్వహింపఁబడుచున్నది. దీని నిర్మాణ నిర్వాహకులు డా. ఆముదాల మురళి, మరియు శ్రీ తాతా సందీప్ శర్మ.ఈ సమూహమున నన్ను కూడా సభ్యునిగా చేర్చుకొనిన వారి ఔదార్యమునెన్నఁజాలను.అందులకు కృతజ్ఞతాపూర్వకముగా ప్రతీ దినము సుప్రభాతసమయమున శుభోదయాభినందనలుచేయు సందర్భముగా దినమునకొక మహనీయకవులయిన సభ్యులనుద్దేశించి ఈ శతకమును వ్రాసియుంటిని.

ఇందు క్రమసంఖ్యలో అమర్చిన పద్యములు ఆయా కవులను వివరిస్తూ పద్యములు కాననగును.

 01. దైవస్తుతి.                                            02. బాసర శారదా స్తుతి.

 03. అష్టకాల నరసింహరామశర్మ.              04. ఆముదాల మురళి.

 05. రాణీ సదాశివమూర్తి.                            06. ధూళిపాళమహాదేవమణి.

 07. మేడసాని మోహన్.                              08. పాలపర్తిశ్యామలానంద.

 00. నేమాని సోమయాజి.                            09. నేమాని సోమయాజి.                           

 10. సురేంద్రనాథ.                                    11. మైలవరపు మురళి.

 12. రాజశేఖరు.                                         13. కడిమెళ్ళ వరప్రసాదు.

 14. తాతా సందీప్.                                    15. మాడుగుల అనిల్కుమార్

 00. రాజశేఖరు.                                         16. బులుసు వేంకటేశ్వర్లు.

 17. కంది శంకరయ్య.                                18. గన్నవరం లలిత్.

 19. పాలడుగు శ్రీచరణ్.                             20. శేషఫణి శర్మ.

 21. చక్రాల రాజారావు.                             22. సురభి శంకర శర్మ.

 23. పూడి లక్ష్మీపతి.                                   24. గంగుల ధర్మరాజు.

 25. విభీషణ శర్మ.                                      00. మునగపాటి శివరామకృష్ణ 

 26. నొస్సము నరసింహమ్.                       27. పండి ఢిల్లీశ్. రాజపురం.

 28. జోస్యుల లక్ష్మీకాంత్.                           29. తొగట సురేషుబాబు 

 30. ఆకెళ్ళ బాలభాను.                               31. కన్నెపల్లి వరలక్ష్మి.

 32. ఓంప్రకాశ్.                                           33. లోకా జగన్నాథ శాస్త్రి.

 34. పొన్నపల్లి రామారావు.                          35. మహేంద్రవాడ సింహాచలాచార్య

 36. చెరుకూరి వేంకట.                               37. మద్దూరి రామమూర్తి.

 38. బేతవోలు రామబ్రహ్మమ్.                     39. నాగశాంతి.

 40. కొరిడే విశ్వనాథశాస్త్రి.                          41. వేంకటరాయశర్మ.

 42. కందర్ప రామకృష్ణ.                             43. రెడ్డప్ప.

 44. మెరుగుమిల్లి వేంకటేశ్వరరావు.            45. ఐతగోని వేంకటేశ్వర్లు

 46. కొణతల రామశర్మ.                              47. ధవళ సుధాకర్.

 48. కోట లక్ష్మీనరసింహమ్.                       49. గరికపాటి గురజాడ.

 50. మరడాన శ్రీనివాసరావు.                       51. దేవరకొండ శర్మ.

 52. మరుమామల దత్తాత్రేయ శర్మ.         53. గుజ్జు రామయ్యరెడ్డి

 54. కొట్టే కోటారావు.                                   55. నారాయణం బాలసుబ్రహ్మణ్యం

 56. చిటితోటి విజయకుమార్.                    57. ముత్తేవి శ్రీనివాస శశికాంత్. 

 58. కొప్పరపు మారుతి శర్మ.                      59. గొల్లాపిన్ని శేషగిరి.

 60. కట్టా నరసింహులు.                            61. అద్దంకి తాతాచార్య.

 62. మల్లెల నాగరాజు.                               63. మల్లాప్రగడ శ్రీమన్నారాయణ.

 64. నరాల రామారెడ్డి.                               65. నార్కెడమిల్లి సత్యశ్రీనివాస్.

 66. అక్కిరాజు విరోధి.                                67. సుబ్బయ్య.

 68. కల్యాణగౌరి.                                        69. గాలి గుణశేఖర్.

 70. అజ్ఞాత                                                71. రాంభట్ల పార్వతీశ్వరశర్మ.

ఓం శ్రీమాత్రే నమః.

 శ్రీ అవధానశతపత్ర

(ఏకప్రాస శతకము)

రచన.... చింతా రామకృష్ణారావు.

01. చ. అవనతునై గణేశుని జయంబును కోరి మదిం దలంతు. మా

ధవునికినంజలింతు. పరతత్త్వవివేకకవీశుపాళికిన్

ప్రవరవధానసంహతికి భక్తిగ వందనమాచరింతునో

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీ సతీ!

02. చ. కవిజన హృద్విభాస, శుభ కారక బాసర భారతాంబవై

నవరస పూర్ణ సత్కృతులనంతము కొల్పఁగ నుంటివమ్మ. నిన్

శ్రవణమనోహరంబుగ ప్రశంసలఁ దేల్చఁగ శక్తినీయుమా.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి!భారతీసతీ!

03. చ. ప్రవరులు, భారతీవిజయ భవ్య మహోజ్వల యజ్ఞదీక్షితుల్,

శ్రవణ మనోజ్ఞ గాత్రులకు, సన్నుతదేహులకష్టకాల స

త్కవి నరసింహరాములకు గౌరవ భాసుర తేజమీవెగా.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి!భారతీసతీ!

04. చ. అవధులు లేని నైపుణిని హాయిగ పద్యములల్లు నాముదా

ల వినుత వంశ భాక్ మురళి లాలిత దివ్య కవిత్వ భాతివై

శ్రవణ సుఖంబుగా వెలసి చక్కఁగ మాకు ముదంబు కూర్చితే!

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

మీ ఆశుధార అనన్యసామాన్యం

అన్నారు శ్రీ ఆముదాల మురళి.

05. చ. ప్రవిమల చిత్తశోభితులు రాణి సదాశివమూర్తి వర్యు స

న్నవనవ కాంతులన్ విరియు నవ్య సుధామయ శ్లోక దీప్తివై 

భవుఁడును మెచ్చునట్లు మము వర్ధన మార్గమునందునిల్పుమో

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

సుప్రభాతం మహోదయులకు. 

శ్లో.  సరసమసృణవాచా పద్యనిర్మాణదక్షాః

కవిగణహృది తోషం చాటువాక్యైస్సృజన్తః।

ప్రతిదినమిహ చిన్తా రామకృష్ణాః లసన్తి 

స్వయమతినిపుణాంస్తాన్ స్తౌమి నౌమ్యాత్మబంధూన్।।

శ్రీ రాణీ సదాశివమూర్తి మహోదయేన రచితమిదం శ్లోకమ్. 

మీ ఆదరానికి ముగ్ధుడను. ధన్యుడను. సదా కృతజ్ఞుడను.

అన్నారు శ్రీ రాణీ సదాశివమూర్తి.

06. చ. ప్రవరులు ధూళిపాళ వరవంశజ శ్రీ మహదేవునాకృతిన్

శ్రవణమనోజ్ఞ పద్యతతి చక్కగ మాకుననుగ్రహించుచున్

భవితకు సద్వధానులను వారసులన్ సృజియించుమమ్మ! మా

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

07. చ. అవధియె లేని వేగమున నందరు మెచ్చు కవిత్వ భాతిలో

ప్రవరులు మేడసానివయి వర్ధిలు మోహన రాగయుక్తవై

కవులకు మార్గదర్శివయి గౌరవమున్ గలిగించుమమ్మ. మా 

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

08. చ. అవిరళరీతిలో కవితలచ్చతెలుంగున సద్వధానిగా

భువి వెలయించు పండిత సుపూజ్య గుణాన్విత పాలపర్తివై

భవితను కూర్చు తెల్గునకు పండిత పాళి ముదంబునందగా

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ.

00. చ. కవినుత సన్నుతాత్ముఁడు ప్రశాంత మనస్కుఁడు సోమనార్యుఁడా 

ప్రవిమల సద్వధాని వరభాస్కరతేజమునొప్పి మమ్ములన్

ప్రవర కవిత్వ మార్గమున వర్ధనఁ జేయుచు వెల్గుమ్మరో.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

09. చ. కవనము సంస్కృతాంధ్రముల గౌరవమొప్పఁగ చెప్పు సోమయా

జి వర నుతావధానిగ ప్రసిద్ధిగ మాకడనుండి నిత్యమున్

కవన కుతూహలంబు కలుగంగ మదిన్ మము గాంచి ప్రోవుమా.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

10. చ. శ్రవణసుపేశలమ్ముగ ప్రశాంత మనమ్మున భారతాదులన్ 

ప్రవచనమున్ ఘటించు గుణవర్యుఁడు దివ్య సురేంద్రనాథుగా

ప్రవర లసత్ కవిత్వమున పండుగచేయుము మాకు నిత్యమున్

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

11. చ. భువి ఘనమైన మైలవరపున్ జనియించిన సద్వధాని సం

స్తవగుణ గణ్యుఁడౌ మురళి సన్నుత రూపున మమ్ము గాంచుచున్

భవితను కూర్చుమమ్మ వర పద్యకవిత్వమునెన్నువారికిన్.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

శ్రీ చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలు.. 

వివిధార్థామలశబ్దబద్ధకవితావిన్యాససంపత్తిచే

నవధానాబ్దకవీశవర్ణనలతోనానందమందించుచున్

నవగీతుల్ రచియించుచుంటిరిట చింతా రామకృష్ణాహ్వయా ! 

అవధానిప్రముఖా ! నమస్సులివె కొమ్మా ! సాహితీమిత్రమా !! 

అన్నారు శ్రీ మైలవరపు ములళీకృష్ణ. వెంకటగిరి.

12. చెవువకు తృప్తికల్గునటు చిద్విలసమ్ముగ రాజశేఖరుం

డవిలళగాత్రమాధురిని హాయిగ పద్యమువ్రాసి పాడునా

కవి మహనీయ రూపమున  గౌరవమొప్ప వసించు మాదరిన్. 

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

13. భువి కడిమిళ్ళ వంశ శశి, పూజ్య వధాని వరప్రసాదువై,

నవనవలాడు సత్కవిత నవ్యమనోహర భావ రమ్యమై

శ్రవణకుతూహలమ్ముగ నిరంతరమందఁగనిమ్ము మాకు మా

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ

14. ప్రవిమల తాత వంశజుఁడు, వర్యుఁడు, సంస్తుత దీపువై సదా

జవన మహాశ్వధాటి విలసన్నవ నిర్మల సత్ కవిత్వమున్

ప్రవరులు మెచ్చఁగా పలుకు వర్ధిలఁ జేయఁగ మమ్ము నెమ్మితో.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

15. ప్రవరుఁడు వేంకటేశ్వరుని భక్త శిఖామణి మాడ్గులాన్వయుం

డవిరళ సత్కవిత్వమున కంజలిపట్టు మహాత్ముడీ యనిల్

నవకవితా స్వరూపివయి నవ్యత నిత్యము కొల్పు మాకు. మా

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

00. కవితల, గాన మాధురిని, కంది సమస్యల పూరణాన, సం

స్తవుఁడగు సధ్వధాని విలసన్మణి శాంతుఁడు రాజశేఖరుం

డవయి నిరంతరంబు సభనందరికిన్ శుభముల్ పొనర్చుమో

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

16. చ. ప్రవర బుధాగ్రజుల్బులుసు వంశసుధాకర వేంటేశ్వరుల్

కువలయమందు మహత్కవిగ గొప్పగ పేరును గన్నవారలా

కవివరునాకృతిన్ సతము కావ్యసుధల్ విరజిమ్ముమమ్మరో.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

17. చ. కవన కుతూహలంబు కలుగంగ సమస్యలనిచ్చుచుండు ప్రా

భవమున శంకరయ్య. కవిపాళిని పెంచెడి కల్పవల్లిగా.

కవుల మనంబులంగెలుచు కందిగనీవయి కాచు మమ్ములన్

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

18. చ. కవులను బాలకుండు. వర గన్పవరం లలీతాఖ్యుఁ రూపునన్

ప్రవిమల సద్వధాన కళ వల్ధనఁ జేయుము దీక్ష పూని, సత్

కవనము వెల్వరించుచు ప్రకాశము కొల్పుము తెల్గు భాషకున్.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

19. చ. కవినుతుఁడైన పాలడుగు గౌరవ మూర్తి వధాని  శ్రీచరణ్

కువలయ మిత్రుఁడే కృతులఁ గూర్చెడి వెన్నెల పద్యరాశిచే.

ప్రవర గుణాఢ్య పాలడుగువై సభకీర్తిని పెంచుమెప్పుడున్

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

20. చ. ప్రవర వరుండు శేషఫణి భక్తశిఖామణి. సత్కవీంద్రుడున్,

శ్రవణసుపేశలాంచిత ప్రశస్త కవిత్వ పటుత్వ సంపదన్

రవియననొప్పునట్టి కవి. రాజిలుమీకవివై కృపంగనన్

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

21. చ. కవినుత రాజరావిట ప్రకాశము చేయుచు ఛందమున్ సదా

సువిదితమౌనటుల్ తెలిపి శోభిలఁ జేయుచునుండిరందరిన్.

కవివరులైనవీరలుగ గౌరరవమొప్పఁగనుండుమా మహత్

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

22. చ. ఛవి గలవైన యీ సురభి శంకర శర్మ మనోజ్ఞ వాగ్ఝరుల్

భవితను గొల్పు భాషకు. ప్రభాస వినిర్మల మానసుండతం

డవిరళ ధర్మతేజస మహాత్మునిగా నిటనొప్పియుండుమో

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

23. చ. ప్రవరుఁడు పూడివంశజుఁడు పావన శ్రీపతి నామధేయుఁడీ

భువి సుగుణాభిరాముఁడని పుణ్య ఫలంబుల పంటయంచు  సం

స్తవములముంచు పండితులు. తద్వర మూర్తిగ వెల్గుమిచ్చపన్.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

24. చ. భువి కవిరాజుగా పరగు పూజ్యుఁడు గంగుల ధర్మరాజు. భా

రవిగ వెలుంగనర్హుఁడు నిరంతరమద్భుత పద్యసాధనన్.

ధర కవిరాజు రూపమున తప్పక తెల్గు సముద్ధరింపుమో

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

25. చ. వివరముకాగ భావన విభీషణ శర్మ వచించు సౌమ్య సం

స్తవ మహనీయమూర్తి.విలసద్గుణ పూజ్య మనోజ్ఞ తేజుఁ డా

కవినుత శర్మగానిచట గౌరమున్ కలిగించు భాషకున్.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

00. చ. ప్రవరవరుండు తాన్ మునగపాటివరాన్వయ రామకృష్ణ, స

త్కవనమునందు హాస్యమున, తత్వము దెల్పెడి హాస్య చిత్రమున్

స్తవనమునందగా మలచు. తన్మహితాత్ముని రూపునొప్పుమా.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

26. చ. స్తవనము నంద తగ్గ ఘన సన్నుత నొస్సము నారసింహులీ

భువనములేలు శ్రీపతి ప్రభున్ మురిపించెడి సేవ చేయుచున్ 

ప్రవరవరుండుగా నిలిచె. తద్వరుడీవయి యొప్పుమిచ్చటన్.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

27. చ. భవగుణ గణ్యుఁడైన ఘన పండి ఢిలీశుడమేయ సజ్జనుం

డవిరళ కర్షకుండితఁడు. హారతిపట్టగఁజాలు మానసుం

డవగుణ హీనుడాతఁడుగ హాయిగ వెల్గుమ కావ్యతేజమై

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

28. చ. సువిదిత జోస్యులాన్వయుఁడు, శోభిలు సత్కవి. లక్ష్మికాంతుడీ

ప్రవరవరిష్టుడాంధ్రకవిపాళిని పేరును గన్నవాడు. సం

స్తవగుణగణ్యునాకృతిని చక్కఁగ మాకు శుభాళిఁ గూర్చుమో

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

29. చ. కవన కుతూహలున్, తొగట గౌరవ వంశ సురేషుబాబునిన్

నవ కవితాంబ శారద ఘనంబుగు ప్రేమను గాంచుచుండెనా

ప్రవిమలమూర్తి రూపమున పన్నుగ నిల్చి శుభాళిఁ గూర్చుమో

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

30. చ. శ్రవణ మనోజ్ఞ పద్యములు చక్కఁగనాకెళ బాలభాను సం

స్తవ శుభమార్గమున్ రచన ధన్యతఁ జేసెడి సద్వధాని. మా

ధవుని మహత్కృపన్ గనెడి తద్వర రూపున వెల్గుమిచ్చటన్. 

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

31.  చ. ప్రవర గుణాలవాలమయి, భక్తి విధేయతలొప్పు, కన్నెప

ల్లి వర సుజాత లక్ష్మి భువి లీలగ పద్యములల్లు యుక్తిగా.

భవహర సాహితిన్ గొలుపుమీమెగ నీవిట వెల్గుచుండి. మా

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

00. చ. కవన కుతూహలున్, తొగట గౌరవ వంశ సురేషుబాబునిన్

నవ కవితాంబ శారద ఘనంబుగు ప్రేమను గాంచుచుండెనా

ప్రవిమలమూర్తి రూపమున పన్నుగ నిల్చి శుభాళిఁ గూర్చుమో

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

32. చ. కవివరుఁడోంప్రకాశకవి. కమ్మని తేనెలతెల్గు పద్యముల్

శ్రవణమనోజ్ఞమై తనర వ్రాయఁగ, పాడఁగ చాలువాడు. తత్

కవి మహనీయరూపమున గౌరవమొప్పఁగ వెల్గుమిచ్చటన్.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

33. చ. ప్రవరుఁడు, లోక వంశజుఁడు, భవ్య గుణాళి, జగత్ సునాథుడీ

కవివరులందు గణ్యుఁడు, ప్రకాశ మనస్కుఁడు. వాని రూపునన్

కవన మనోజ్ఞ తేజసము కమ్మగ జూపఁగ నుండుమిచ్చటన్.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

34. చ. కవి, ఘన పొన్నపల్లి కుల గణ్యులు శ్రీ యుత రామరావు. సం

స్తవ శుభ సద్గుణాన్వితులు. సత్ కమనీయ కవిత్వవేత్తలున్

కవివరులైనవీరుగ సుఖంబును గొల్పగ నుండమిచ్చటన్.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

35. చ.  కవిగ మహేంద్రవాడ కుల గౌరవ వర్ధక సింహశైలమన్

బ్రవరుఁడు, సద్గుణాలముగ వర్ధిలు సౌమ్యుఁడు, భక్తియుక్తుఁడీ

కవి మహనీయ రూపమున గౌరవమొప్పఁగనుండుమిచ్చటన్.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

36. చ. కువలయమందునున్న  చెఱుకూరి కులోద్భవ వేంకటాఖ్య స

ద్భవుని కవిత్వ భాతిగణుతంబగుచుండె మహాత్మపాళిలో.

భవితను గొల్ప తెల్గునకు పన్నుగ నీతనినుండి వెల్గుమో

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ! 

37. చ. శ్రవణకుతూహలంబవగ చక్కఁగ మద్దురి రామమూర్తి గా

రవధులు లేని కీర్తిఁ గననద్భుత పద్యములన్ రచించు. త

త్ప్రవర కవీశుగా నిచట ప్రాభవమొప్పఁగ వెల్గుమొప్పుగన్.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

38. చ. కవికుల చంద్రశేఖరుఁడు, గౌరవ సద్వర బేతవోలు స

ద్భవ మహనీయ మూర్తి. గుణభాసిత సన్నుత రామ బ్రహ్మమై

భువినిట తెల్గుతేజమును బ్రోవఁగ నుండుమ సంతసంబుతో

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

39. చ. స్తవగుణ నాగశాంతి విలసన్మహనీయ కవిత్వవేది. సు

శ్రవణ మనోజ్ఞ పద్యములు  చక్కఁగ వ్రాసెడి సద్వధాని. స

త్కవినుత నాగశాంతిగ ప్రకాశము గొలల్పుము తెల్గుభాషకున్.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

40. చ. భువి కొరిడే కులాన్వయ సూపూజ్యులు పండిత విశ్వనాథ. మా

ధవ చరణాబ్జ సేవకులు ధార్మికులున్, మహదాంధ్ర సత్కవుల్.

సవినయులైన శర్మగ ప్రశంసలనొందగ వెల్గుమిచ్చటన్.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

41. చ. కవన కుతూహలుండు వర గౌరవ వేంకటరాయశర్మ శ్రీ

ధవుని మనంబునన్నిలిపి తత్వమెఱింగిన మాన్యమూర్తి. తత్

ప్రవరుఁడె నీవుగా నిలిచి పద్యసుమంబులనందఁజేయుమో

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

42. చ. భువి వరణీయ కందరప పూజ్య కులోద్భవ రామకృష్ణ స

త్కవివరునార్ద్ర చిత్తమున కమ్మని భావ విపంచి మ్రోగు. తత్

కవివరునాకృతిన్ కవితధారలు నీవిటనందఁజేయుమో

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

43. చ. భువి కమనీయ సత్కవి సుపూజ్యుఁడు సన్నుత రెడ్డపాఖ్య స

ద్భవుఁడు మనోజ్ఞ భావకుఁడు దర్పమొకింతయు లేనివాడు త

ద్వరకవి రూపమున్ నిలిచి పద్యమనోజ్ఞత చాటిచెప్పుమో

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

44. చ. ప్రవరుఁడు మెర్గుమిల్లి వర వంశ సుధాకరు వేంకటేశ సత్

కవివరు డాంధ్రతేజము దిగంతము వ్యాప్తము సేయజాలు నా

కవివరుఁడీవెయై ఘన ప్రకాశము గొల్పు మహాంధ్ర భాషకున్.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

45. చ. భువి పయినైతగోని యను పూజ్య కుటుంబ సుధాకరుండు. స

త్కవి యగు వేంకటేశ్వరులు కల్మష దూరుఁడు. సత్య సంధుఁడున్.

యువ నవ సత్కవీంద్రమహిమోన్నతుఁడాతని రూపునుండుమో

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

46. చ. అవగుణమెన్నరీ పణతులాన్వయ రామ, మహేశ సన్నిభుల్.

కవితలు సుప్రభాతములు గౌరవమొప్ప రచించినారు. సం

స్తవగుణులీమహాత్ములుగ సన్నుతినొప్పుమిటన్ కృపామతిన్

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

47. చ. ధవళ మనస్కుఁడెన్న నవధాన కుటుంబ సుధాకరుండు. సత్

కవనము నేర్చినట్టి కవిగౌరవ వర్ధకుఁడీతడట్టి సత్

కవియగునీ మహాత్మునిగ గౌరవమొప్ప రహించుమిచ్చటన్.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

48. చ. శివునిగ తోచు కోట నరసింహుఁడు శాంత సమంచితాకృతిన్.

శ్రవణ మనోజ్ఞ పద్యములు చక్కఁగ పాడుచు వ్రాయు మాన్యుడీ

నివహమునందు నాతనిగ నిత్యము నీవు రహించుమమ్మరో!

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

49. చ. ప్రవరుఁడు బాలుఁడున్ గరికిపాటిజుఁడౌ గురజాడ సద్ధృతిన్

నవకవితాసుధారసమనంతముగా ప్రవహింపఁజేయఁగా

కవులునుతింప నాతనిగ గౌరవమొప్పఁగ నీవిటుండుమో

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

50. చ. భువి మరడాన వంశజుఁడు  పుణ్యగుణాలము శ్రీనివాసు సత్

కవివరుడున్ వధానియును. కమ్మనిపద్యము వ్రాయునైపుణిన్

ప్రవరుల మెప్పుగాంచె.కవిరాజగునీతనిరూపునొప్పుమో

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

51. చ. దివిజులు కూడ మెచ్చునటు దేవరకొండ సుశర్మ సద్గుణం

బెవరు ప్రశంస చేయఁగల రెల్లవిధంబులసద్గుణాఢ.య సం

స్తవశుభ శీలి. నీవతని సన్నుత రూపముతో రహింపుమా.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీ!

52. చ. ధవళిత సత్కవిత్వ వర దర్పులు శ్రీమరుమాములాన్వయుల్

భవితకు మార్గదర్శులయి పద్యములల్లెడి దత్త నామకుల్.

భువి సరసాత్ములాకవిగ పూజ్యతనొప్పుచునుండుమమ్మ మా

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

53. చ. భవితను కోరి బాలురకు పాటల, పద్యములన్ రచించు సత్

కవివరు గుజ్జు వంశజుని గౌరవ రామయరెడ్డి సత్ కవిన్, 

ప్రవరుఁడనందగున్. మహితరామయరూపున వెల్గుమిచ్చటన్. 

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

54. చ. భువిని ప్రసిద్ధ పండిత సుపూజ్యుల పెట్టని *కోట రావు*. సా

ధువరుఁడు. సాహితీ ప్రభ విదుండును సౌమ్యుఁడు, *కొట్టె* వంశజుం

డవని మహత్వ మూర్తియగు  నాతని రూపున వెల్గుమిచ్చటన్.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

55. చ. భువి న,ర,దీర్ఘముల్ యణము{ నారాయణం } పూజ్య మహాన్వయ బాలభాను సత్

కవన విధాన తేజము ప్రకాశము కొల్పును తెల్గు భాషకున్.

కవివరుఁడైన 'సుబ్బు'వయి కమ్మని పద్యములల్లుమిచ్చటన్.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

56. చ. చివురులు తెల్గు భాషకు రచించెడు శ్రీచిటితోటి వంశజుం

డవిరళ సాధనన్ విజయ మందుటలో విజయుండె చూడఁగా.

నవనినివాని రూపమున హాయిగనుండి శుభాళిఁ గూర్చుమా,

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

57. చ. కవన ప్రియుండు ముత్తెవి ప్రకాశ ప్రభాకరతేజసుండు.  సత్

కవినుత శ్రీనివాస శశికాంతు మహాత్ముఁడు. వాని రూపునన్

ప్రవరులు మెచ్చునట్టుల ప్రభావము చూపఁగనుండుమిచ్చటన్.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

58. చ. భువి నుతిఁ గన్న కొప్పరపు పుణ్యకులోద్భవ మారుతిన్ మహత్

ప్రవరుని, సాహితీప్రియులు ప్రస్తుతి చేతురు మంచినెంచుచున్.

కవికులజున్ , మహోత్తముని గౌరవ రూపముతోడనొప్పుమో

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

59. చ. కవియగు గొల్లపిన్ని కుల గౌరవ శేషగి రీశ్వరార్చనా

ప్రవరవరుండు. సత్ కవి. ప్రవర్ధనఁ జేయఁగ పద్య విద్య సం

స్తవమహనీయ సాధకుఁడు. తన్మహనీయురూపునొప్పుమో

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

60. చ. కవికుల భానుడైన వర కట్ట నృసింహులు జ్ఞాన భాసి. సత్

కవినుతుఁడున్, శుభాస్పదుఁడు, కైఫియతుల్ కథలల్లినట్టి సం

స్తవమహితాత్ముఁడానుతుని సన్నుతరూపుననిచ్చటొప్పుమో 

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

61. చ. దివిజులఁ బోలు సజ్జనుఁడీ., ధీనిధి, తిర్మల తాతనామకుం (అద్దంకి తిరుమల తాతాచార్య)

డవగుణహీన సత్కవి. మహాత్ములమన్ననలందగల్గు యీ

కవివరు రూపమున్ నిలిచి గౌరవమున్ బ్రబలింపఁజేయుమో

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

62. చ. కవన కుతూహలుండయిన గౌరవ  మల్లెల నాగరాజు మా

ధవుని కృపామృతంబుఁగొన ధారగ వ్రాయుచునుండె పద్యముల్.

కవియగు నాగరాజువయి గౌరవమొప్ప వెలుంగుమిచ్చటన్

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

63. చ. భవహర మల్ల సత్ప్రగడ భవ్య కుటుంబజ నారయార్య, సం

స్తవగుణ భాసితుల్. సుగుణ సన్నుత భాగవతోత్తముల్. ప్రభా

రవిగ వెలుంగు నాతనిగ ప్రస్ఫుటరీతి వెలుంగుమిచ్చటన్

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

64. చ. ప్రవర నరాలవంశజుఁడు  రామశుభాహ్వయ రెడ్డి సత్కవిన్

కవికుల మార్గదర్శి యనఁ గాంచుదురందరు నట్టి ధీమతిన్

రవియన వెల్గునాతనిగ రంజిలుమిచ్చట గౌరవంబుగా

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

65. చ. నవకవితా దురంధరుఁడు  నార్కెడమిల్లిజ సత్యశ్రీనివాస్.

కవికులమాన్యుఁడున్, సుగుణ గణ్యుఁడు, సూనృతవాగ్విరాజి. యీ

ప్రవరుని తేజమై సుగుణ వర్ధనఁజేయుచునుండుమమ్మరో.

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

66. చ. అవగుణహీనుఁడారయఁగనాంధ్రమహాకవి అక్కిరాజు వం

శ వర కవీశ్వరుండవని సద్గుణగణ్య విరోధి నామ సం

స్తవ మహనీయుఁడాతనిగ వర్ధిలుమిచ్చట ప్రేమతోడుతన్. 

ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

67. చ. భువిని ప్రశాంత చిత్తులగు పూజ్యవరాన్వయ సుబ్బయాఖ్యులీ

కవులకమోఘ శక్తి. గుణగణ్యులు, సత్కవితా నిధానమున్.

కవియగు వాని తేజమున గౌరవమొప్ప వసించుమిచ్చటన్.

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

68. చ. కవనకుతూహలంబునను గౌరి ప్రశస్తిని గాంచినారు. ప్రా

భవమును చూపఁజాలుదురు భక్తిసమంచిత పద్యవిద్యలో.

భవితను గొల్ప మాకు గుణవర్ధన గౌరిగ వెల్గుమిచ్చటన్

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

69. చ. శివనుతిఁ జేయు గాలి గుణశేఖర సత్కవి సౌమ్యమూర్తియున్

ధవళ యశస్సమున్నతుఁడు, ధాత్రిని వెల్గెడి సత్యమూర్తియున్.

ప్రవిమల సత్యమూర్తి కవివై వెలుఁగొందుమ మాకుఁ దృప్తి కాన్.

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

70. చ. కవన కుతూహలంబున ప్రకాశము గాంచిన సత్ కవీశ్వరుల్

సవినయులై వధాన ఘన సన్నుతమార్గమునుండిరెందరో

కవికులమందు చేర్చుమిట గౌరవమొప్ప వెలుంగఁజేయుమా

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!.

71. చ. కవి నుత రామభట్ల కవి. గౌరవ తేజుఁడు పార్వతీశు డా

రవియన వెల్గు పండితుఁడు. రమ్యగుణాకర సద్వధాని. సం

స్తవమగురీతినాతనిగ చక్కగ వెల్గుమనన్యతేజవై

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

72. చ. కవులననేకున్ గలిపి గౌరవమందఁగ పూర్ణ రూపునన్

శ్రవణ మనోజ్ఞ పద్య సుమ సౌరభమున్ విదఁజల్లుచుండి నీ

వెదయెద తాకుచుండి ప్రభవించఁగఁ జేయుము సంతసంబునో

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

73. చ. కవుల మనంబులన్ కవిత కల్మిని కొల్పుము. గౌరవార్హులై

భవిత బాటవేయునటు పద్యచయంబు రచింపఁ జేసి సం

స్తవముగవెల్గనట్టంలిట తప్పక చేయఁగ నిన్ను వేడెదన్

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

74. చ. కవులిహమున్ పరంబునిట కానఁగ జేయుచు హృద్యపద్యముల్

శ్రవణ మనోజ్ఞమౌనటుల చక్కఁగ వ్రాయుచు ప్రోత్సహించినన్

భువిని కవిత్వవాంఛ కొలుపున్ గద. నీవటు చేయఁజేయుమో

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

75. చ. రవి కనరాని భావి గతి ప్రాభవమున్ కవి కానఁ గల్గు నా

కవి నిరతంబునైహికము గౌరవమున్ గన శ్రద్ధ చూపుటన్

భవిత గణింపడాయె. వర భావిని చూపఁగ జేయుమమ్మరో

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

76. చ. కవి శతకంబు కల్గునెడ కమ్మగనీ శతకంబు వ్రాయఁగా

భవనుత సద్వధాన శత పత్రము సార్థక నామధేయగా

భువి నిలుపంగనెంచితిని. పూర్తిగలేరికనేమి చేయుదున్.

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

77. చ. కవితలు చెప్ప నేర్చిన ప్రకాండ మహాకవిపుంగవుల్ సతం

బవిరళ సేవనానిరతినందరికిన్ కనువిప్పుగొల్పు స

న్నవ కవితానువర్తులయి తప్పక నీదరినుండఁజేయుమో

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

78. చ. కవులకు పుట్టినిల్లగుము. కావ్య మహాద్భుత కల్పకమ్ములన్

భవితకు నందఁజేయుచు ప్రబంధ సుగంధములందఁజేయుమా.

నవనుత మార్గమున్ నడిపి నాకముగా భువి మార్చివేయుమా.

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

79. చ. కవనమనంగ ఛందము ప్రకాశము గాగ రచించుటాయెనే.

శ్రవణ మనోజ్ఞమై రసవిరాజితమై సమలంకృతంబునై

నవనుతమార్గసూచిగ ఘనంబుగనిచ్చట వెల్గఁ జేయుమా.

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

80. చ. రవియును గాంచలేని రసరమ్య జగద్గతిఁ గాంచి సత్కవుల్

నవరస రమ్య కావ్యగతి నాటకరీతిని వ్రాసిరేని యీ

భువనము మేలు గాంచును. ప్రపూజ్యులచే రచియింపఁ జేయుమో 

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

81. చ. ఎవరి కలంబు శ్రీహరిననేక విధంబులఁ జూపఁ గల్గునో

ప్రవరుఁడనంగనాకవియె, భద్రతఁగొల్పు మహాత్మపాళికిన్.

కవివరులెల్ల తత్సుగుణ గౌరవమందగ నిల్పుమిచ్చటన్ 

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

82. చ.  కవనము కావ్య రూపమునఁ గాంచఁగ చేయవలెన్ సదా హరిన్.

శ్రవణమనోహరంబుగ పరాత్పరు వర్ణన చేయ నేర్చు స

త్కవులను చేర్చుకొమ్మిట ప్రకాశము చేయఁగ నీ మహత్వమున్

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

83. చ. కవికుల గౌరవార్హులిట కల్గిరి నీదు మహత్వమెన్నగా

పలువురు సత్కవుల్ పరమ పావన సత్కవితా విశారరదుల్.

భువివరలించు తెల్గు మెఱుపున్ దిశలెల్లెడ వ్యాప్తమౌనటుల్

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

84. చ. కవులు మహాత్ములాంధ్రమున గౌరవమొప్ప వసించి యుండు వా

రెవరెవరెచ్చటెచ్చట మహిన్ గలరోకద, భారతాంబకున్

భవితను కొల్ప, వారలను పన్నుగనిచ్చట చేర్చుకొమ్మికన్

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

85.  చ. భువినవధాన భాతి కవిపుంగవులాంధ్రమునందు చేయుటన్

నవనవలాడు భాషగ యనంత మహత్ప్రభతోడనొప్పుచుండె నే

డవిరళ తేజసంబిడమహాత్ముల నెన్ని గ్రహింపుమీవిటన్

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!.

86.  చ. శ్రవణ కుతూహలంబునిడు చక్కఁగ శోభిలు తెల్గు పద్యముల్.

కవన కుతూహలంబుగల గణ్య మహాకవులల్లు తెల్గునన్

నవనవలాడు కాంతులు ఘనంబుగ చూడగనౌను గాంచితే.

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

87. చ. కవనకుతూహలంబెటుల కల్గెనొ బాలునకక్కజంబుగా.

రవివలె నీ వధానమున రాజిలెనీ లలితాఖ్యు డమ్మరో

కవనవిధానమున్ గరిపి కాంచుము తెల్గజనాళికీవె మా

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

88. చ. అవని మహాంధ్రభారతి మహత్వ పటుత్వకవిత్వ తత్వమున్

నవయువకుల్ గ్రహించుచు ఘనంబగు విజ్ఞతతోడ నేర్చి సం

స్తవకవిమాన్యులై ప్రబలఁ దప్పక చేయుము తల్లి నీ కృపన్.

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

89. చ. భువన మనోహరీ! కనుమ పూజ్య కవీశుల దివ్య భావనల్.

భువినవధానభారతిని పూజ్యముగా నిరతంబు నిల్పుచున్

కవనసుమంబులన్విరియఁ కాంతురు నీవె రచింపఁజేయుమో

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

90. చ. అవగుణముల్ కనంబడని ఆర్యులు సత్కవులిక్కడుండిరీ

నివహమునందునీ కవులు నిత్యము లోకహితంబు కోరుచున్

శ్రవణ సుఖంబుగా రచన చక్కఁగ చేయఁగ చేయుమమ్మ. మా

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

91. చ. ప్రవరులు, నా సహోదరికి భర్త, గతించుట చేసి, మానసం

బవిరళ దుఃఖమగ్నమయెనల్పుని తీరున, నందుచేత, ప్రా

భవమున సుప్రభాత శుభవర్ధన కోరఁగ జాలనైతి, నో 

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

92. చ. నవరసముల్రహించునటు నవ్య మహోన్నత సత్కవిత్వమున్

ప్రవర కవీశ్వరుల్ రచన వర్ధిలఁజేయఁగలారలంద రా

కవులిట పూరణంబులనె కాలము బుచ్చుచునుండిరమ్మరో.

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

93. చ. శ్రవణకుతూహలంబవఁగ చక్కని పద్యములల్ల నేర్చి, మా

ధవు పదపల్లవాక్షయ పథంబు కనంబడఁ జేయఁ గల్గు సత్

కవులది చేయకుండిరి. ప్రకాశమదెట్టుల కల్గు నీకు మా

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

94. చ. కవికులశేఖరుల్ హరిని కామితముల్ నిరుపేదవారికిన్ 

ఠవఠవలెన్నఁబోవక హుటాహుటి తీర్చుమటంచు కోరుచున్

కవితలు చేయఁబూనునటు గౌరవమొప్పఁగ చేయుమమ్మరో.

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

95. చ. భువిఁ గల శతృరాక్షసులు పూజ్య సుసైనికపాళిఁ జంపి రా

నివహము రూపుమాయునటు నిస్తుల సత్కవిపాళి కోరుచున్

కవితలు వ్రాయనా దురితగార్దభముల్ నశియించితీరునో

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

96. చ. భువి మహనీయులౌ ప్రథమ పూజ్యులు సైనికులెన్ని చూడగా.

కవుల కలంబు వారికయి గౌరవ సత్కవితామృతంబు సం

స్తవమహనీయసద్గతిని చక్కగ చిల్కిన గౌరవార్హమో

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

97. చ. కవుల కలమ్ములద్భుత ప్రకాశము తేవలె సజ్జనాళికిన్

రవియును కాన నేరని నిరంతర దుస్థితులెల్ఁ బాపుచున్

భవహరమై రహింపవలె భక్తినిగొల్పుచు భూజనాళికిన్

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

98. చ. యువకవులన్ సృజించుచు నయోచితసత్కవితా స్రవంతి సం

స్తవముగ పారఁజేయుము నిధానము కాగ తెలుంగు సాహితీ

ప్రవర వధూటికిన్, జయకరంబుగ భారతదేశమాతకున్.

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

99. చ. భవహరు దీవనంబులనవద్యముగా లభియింపఁజేయుమా

కవివరపాళికిన్, శతక గౌరవమున్గను పాఠకాళికిన్.

భువి కవితామృతంబు గుణబోధన చేయఁగ పంచుమెప్పుడున్.

ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

100. చ. కవివరులెల్లఁ గాంచుత ప్రకాశము, సంపద, మంగళంబులన్.

ప్రవరమహద్వధాన శతపత్రమిలన్ నడిపించువారికిన్,

భువిఁగలధర్మమూర్తులకు, పూజ్యులకెల్లను మంగళంబగున్. 

ప్రవిమల సద్వధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

స్వస్తి.

తే.. ౨౨ - ౦౨ - ౨౦౧౯.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.