ఓం శివాయ నమః
రమాలలామ శతకము
07 . 04 . 2021 వ తేదీన ఉదయం 11 గంటలకు పరమపదించిన
నా రెండవ మరదలు శ్రీమతి సింహంభట్ల రమాదేవికి
నా నివాళి.
చింతా రామకృష్ణారావు.
రమాలలామ శతకము.
తే.గీ. శ్రీ రమాదేవి పుట్టిల్లు శ్రీకరమగు
పైడిపిల్లి, పిఠాపుర వాసి, తల్లి
మహిత వేంకటలక్ష్మి, రామజనకు సుత,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 1.
తే.గీ. వినుతులందుచు భువిపైన వెలుగు నాదు
జీవితేశ్వరి విజయకు చిత్తమందు
మెలగు రెండవ చెల్లె లమలిన హృదయ,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 2
తే.గీ. తనకు చిన్నక్క రత్నము, ధర్మనిరత,
చెల్లెలౌ లలితనిల పెంచె లలితముగ
రామలక్ష్మి, దేవిగనయి రాణగాంచె
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 3.
తే.గీ. ఉదయలక్ష్మి యన్ బినతల్లి ముదముతోడ
నీమె ననుపమ రీతిగా ప్రేమతోడ
పెంచె చిననాటి నుండియు విజ్ఞత కని,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 4.
తే.గీ. రామకృష్ణాఖ్యునయిన నా ప్రాణ సఖికి
చెల్లెలయి నాకు కూతురై చెలగెఁ బ్రీతి
నాదు వడిలోన మెలిగెడి నయ గుణాఢ్య
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 5.
తే.గీ. పిన్నగా నున్న వేళనే పేరు గాంచె
కన్నతల్లి యీ జగతికే, కనులపంట
లోకమునకంచు, సద్గుణ లోల యగుచు,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 6.
తే.గీ. చదువె బీ.యేను, జగతినే చదివె నీమె,
సదయ సన్నుత హృదయ యీ సత్ స్వరూపి,
మిత్రులందున నీమెయే మేలుబంతి,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 7.
తే.గీ. చచ్చి బ్రతికెను చిననాడు, జగతి కొఱకె
బ్రతుక చేసెను దైవమీ వనితనపుడు,
నాడు యముని జయించిన నయ నిధాన,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 8.
తే.గీ. శత్రు షట్కము లేనట్టి సన్నుత మతి,
మిత్రవర్గమునకు నిల మేలు చేసి
వారి హృదయముల్ గొన్నట్టి వారిజాక్షి,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 9
తే.గీ. బంధువులయెడ ప్రీతిని వరలు వనిత,
కందు నామెకు మది ప్రజ కలతలఁ గని,
మందమందస్మితోద్భాస మహిత ముఖియు,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 10.
తే.గీ. తలచి చూడగ తానుదార చరిత,
లోకమే తన బంధువు, శ్రీకరమగు
భావనలతోడ నొప్పెడి భవ్య చరిత,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 11
తే.గీ. వర్ణ భేదము లెఱుగదు ప్రగతి శీల,
మతము నెన్నదు, తన యభిమతమునరయ
లోక కల్యాణకర కృషిలో రహింపు
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 12.
తే.గీ. లోచనంబులఁ బ్రగతి యాలోచనములె
మనకుఁ గనిపించు నామెను మనము చూడ,
నిరుపమానంద సామ్రాజ్ఞి, పరిణత మతి,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 13.
తే.గీ. ధరణి సింహముభట్ల సుదర్శనునికి
సతిగ చేరిన దాదిగా నతులిత గతి
పూర్ణ సహకారమందించె పుణ్య రాశి,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 14.
తే.గీ. కలహమెన్నడున్ లేనట్టి కాపురమది,
సహన సౌశీల్యములతోడ సన్నుతముగ
పతికి మదిలోన మెలగుఛు పరవశించు
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 15.
తే.గీ. శ్రావణీ ప్రియాంకలు తమ చక్షువులన
కలిగిరిద్దరు కొమరితల్ వెలయఁ జేయ
వీరి సత్కీర్తి జగతిలో విస్తృతముగ,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 16.
తే.గీ. భర్త యాదర్శజీవనస్ఫూర్తిని గొని
భార్యగా తాను తన్మార్గవర్తిగనయి
జయ పథంబున పతినుంచె భయవిదూర,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 17.
తే.గీ. సత్ పథంబున కూతులన్ సరిగ నడిపి
వారి కాదర్శ జీవన కారిగనయి
కీర్తి చంద్రికల్ విరియించె కృషి యొనర్చి,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 18.
తే.గీ. ధర ప్రజాపత్రికను తాను వరల నడుప
కంకణము కట్టుకొని, గొప్ప గణుతిఁ గాంచ
విఘ్నమే లేని విధముగ ప్రీతి నడిపె,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 19.
తే.గీ. భర్త యాదర్శ జీవన ప్రమిదలోన
చమురుగా మారి వెలుగులు సంతసముగ
పంచె జగతికి, లోకాన మంచి నిలిపె,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 20.
తే.గీ. స్వార్థమన్నది లేనట్టి సదయ హృదయ,
నిత్య దారిద్ర్యమున క్రుంగు భత్య రహితు
లకిల సహకారమందించు లక్ష్మి కనగ,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 21.
తే.గీ. పెట్టుటే కాని యనబోదు పెట్టితినని,
కట్టు బట్టలన్ సహితము కరుణ తోడ
పేదవారలకందించు పెద్ద మనసు,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 22.
తే.గీ. పరుల కష్టముల్ గాంచిన కరిగిపోవు
జాలి గుండెతో చింతించు సదయ హృదయ,
తనకు కలిగినదిచ్చుచు దయను కాచు
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 23.
తే.గీ. మతముతో పని లేదదే మతము తనది,
మానవత్వమే మతముగా మదిని తలచి
సేవ చేసెడి జనయిత్రి, జీవితమున
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 24.
తే.గీ. పిల్లలకు వండి వడ్డించు వేళనయిన
పరులు కోరిన వారికిఁ బంచిపెట్టు
పిదప పిల్లలకును వండు ప్రీతితోడ,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 25.
తే.గీ. అతిథి సత్కారమును చేయు యతివలందు
నగ్రగణ్యగా చెప్పుదు రతిథులెల్ల
పూర్వపుణ్యంపు ఫలమీమె పుడమికరయ
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 26.
తే.గీ. ఎఱుగ సహధర్మచారిణి, హృదయమందు
భర్త భావన గ్రహియించి వరలఁ జేయు,
పతికి తగినట్ట్లు నడచెడి సతి, కనంగ
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 27.
తే.గీ. ప్రకృతి మాత రమను గాంచి పరవశింప
మ్రొక్కలను పెంచు ప్రేమగా, చక్కఁదనము
నొప్పు ప్రకృతియే రమ యన నుత్సుకముగ,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 28.
తే.గీ. పేద విద్యార్థులకు సొమ్ము మోదమునను
తానె చెల్లించి చదివించు దయను చూపి,
పేదలకునీమె దైవమే వినిన తెలియు
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 29.
తే.గీ. స్నేహితులపట్ల ప్రేమయే నిరుపమముగ
నందఁ జేయుచు ప్రీతితో ననితర గతి
పొంగి సంతసంబును పొందు పొణ్యమూర్తి.
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 30.
తే.గీ. ఉన్నవారలనొప్పించి యుత్సహముగ
లేనివారలకిప్పించు జ్ఞాని యీమె
చదువు కొనసాగ నిప్పించు సన్నుత మతి,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 31.
తే.గీ. వంట చేయును గొప్పగానింటిలోన,,
పలువురికి పెట్టు తనయింటివంట సతము,
వరలె నన్నపూర్ణే యన వసుధపైన
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 32.
తే.గీ. పచ్చడులు పెట్టుటందునన్ ఖచ్చితముగ
సాటి లేరనన్ జేసెడి మేటి యీమె,
యూరగాయలన్ బరులకు నొసగు సుగుణ,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 33.
తే.గీ. తన కుటుంబముతోడ యాత్రలను చేయ
నుత్సహించుచు చేసె ననుపమముగను
పెక్కు యాత్రలు భువిపైన ప్రీతి తోడ,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 34.
తే.గీ. కాశికాపురి చూచి లోకమునె చదివె,
వరలు రామేశ్వరము గాంచె, ప్రకృతిలోని
మర్మమెఱిఁగనీ యిల్లాలు, మాన్య చరిత,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 35.
తే.గీ. కనిరి కాశ్మీరు, డార్జ్లింగు జ్ఞానమంద
కనిరి యూటీని పతితోడ ఘనతరమగు
చూడఁ దగినట్టి వెల్లను జూచినారు
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 36.
తే.గీ. ఆర్థిక క్రమ శిక్షణ నర్థితోడ
నేర్వవలెనీమెనుండియే నేర్పు కనగ,
వ్యర్థమైనట్టి ఖర్చులా యసలు లేవు,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 37.
తే.గీ. అక్షరంబగు సత్యమీయమ్మ, నిజము,
సతము వ్యయమునాదాయమున్ మతిని నిలిపి
వ్రాయు పుస్తకమందున వాసిగాను,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 38.
తే.గీ. ఆత్మయు ననాత్మ నెఱుగదీ యనుపమ రమ,
గనుచునాత్మీయులుగ నందరిని జగాన,
యింతకన్నను పరమార్థమేమియుండు?
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 39.
తే.గీ. బంధుజనులను సతతంబు పరవశింపఁ
జేయుచుండును మాటలన్ జేతల నిల,
మాయయును మర్మ మెఱుగని మహిళ యీమె,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 40.
తే.గీ. తనను ద్వేషించినను గాని తాను ప్రేమ
చూపు చుండును వారిపై కోపగించ
నేర్వదెప్పుడున్, మెచ్చగ సర్వజగతి,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 41.
తే.గీ. కోపమెఱుగదు తనలోని లోపములను
తెలుసుకొనుచుండి మారును తీరుగాను,
లోపమే లేని తనలోన కోపమున్నె?
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 42.
తే.గీ. బ్రహ్మ జిజ్ఞాసనెఱుగదు, భక్తి కలదు
ప్రజలపైననుపేదలపైన కనగ
లోక సుజ్ఞాన కాంక్ష లోలోన కలుగు
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 43.
తే.గీ. క్రొత్తవారైన గాని తా కూర్మితోడ
పలుకరించుచు సేవించు కలుష రహిత,
సులలితాత్మగా భువిపైన శోభగాంచె,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 44.
తే.గీ. సహనమున ధాత్రియే కన సన్నుతాంగి,
యిహమె పరమని తలచుచు నహరహంబు
శ్రమకు నోర్చుచు సేవించు జగతి జనుల,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 45.
తే.గీ. పరిసరంబుల శుభ్రత నిరుపమముగ
చేయుచుండును నిరతంబు చేవఁ జూపి,
శుభ్ర సంపూర్ణ చిత్త సంశోభితయగు
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 46.
తే.గీ. గృహమునే చూడ గృహలక్ష్మి కీర్తి తెలియు
నిత్య సంశోభితమ్ముగా ముత్యమటుల
గృహమునే సర్దుకొనెడిదీ గృహిణి సతము,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 47.
తే.గీ. పిల్లలను పెంచు వేళలో ప్రేమతోడ
మిత్రురాలుగ మెలగెడు మేల్మి పసిడి,
వారి మనసులు గెలిచిన వారిజాక్షి,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 48.
తే.గీ. పతికి కష్టంబు కలిగిన పరితపించు
చీమ కుట్టినన్ దాళదు, ప్రేమతోడ
బాధ తగ్గింప యత్నించు భవ్య చరిత,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 49.
తే.గీ. భర్తకే కాదు కష్టంబు పరులకైన
తానె తల్లడమందును తనకె కష్ట
కాలమ్మన్నట్లు కన్నీరు కార్చుచుండు,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 50.
తే.గీ. గ్రంథపఠనమందాసక్తి కలిగి యీమె
పెక్కు గ్రంథముల్ చదివెను మిక్కుటమగు
జ్ఞాన ధనము సంపాదించె కన్నతల్లి,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 51.
తే.గీ. కని ప్రహేళికల్ (ఫజిల్స్) ముడివిప్పు ఘనతరముగ,
జ్ఞాని, మేధస్సు పాదరసంబు కనగ
నబ్బురంబగు చూచిననందరికిని,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 52.
తే.గీ. (వీడియో గేమ్సులో) జాల కేళిలో మేటి యీ జ్ఝాన తేజ,
పాడ లేక తా పాడించు పరుల చేత
పరులకుత్సాహమును గొల్పు పాడునపుడు,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 53.
తే.గీ. మేటి, పేకాటలో తాను వాటి లోని
మంచినే చూపు, నైపుణ్యమెంచి చూపు,
నీమెకన్నిటనరయంగ నీమె సాటి
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 54.
తే.గీ. కాంచ చదరంగమున మేటి కానరారు
ఘనముగా నీమె నోడించు ఘనులనైన,
నింత నిపుణత నొప్పు నీ యిందువదన,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 55.
తే.గీ. తాను సంతోషముగనుండు, ధాత్రి జనుల
నిత్య సంతోషముగనుండ నిరుపమగతి
కోరి సంతోషమున్ గొల్పు కూర్మితోడ,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 56.
తే.గీ. వృద్ధులకునాశ్రయంబును ప్రీతిఁ గొలుప
యత్నముండియు తీరలేదమలినకిల
మృత్యుదేవత గొనిపోవ మిన్నుఁ జేరె,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 57.
తే.గీ. ఆభరణముల పైన నేయాస లేదు,
శోభ మనిషికి గుణమని చూపెనీమె,
జ్ఞాన గుణ శోభశోభిత కమలనయన,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 58.
తే.గీ. తృప్తి పడులక్షణంబును తెలిపెనీమె
నిత్యసంతోషి తృప్తుఁడే నిరుపముడని
తాను తృప్తినొందుచు పరుల్ తనియ మప్పె,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 59.
తే.గీ. వ్యయము మితముగ నున్నచో భయవిదూర
జీవనంబును గడపుట శ్రీకరమని
వ్యర్థమగు వ్యయమణచెను భవ్యముగను,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 60.
తే.గీ. భేషజములేని సన్మూర్తి విస్తృతమగు
సేవలందించుచుండియు, చిత్స్వరూప,
పొగడ చిఱునవ్వు చిందించు, ద్విగుణితముగ,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 61.
తే.గీ. నమ్మునందరిన్ మదిలోన, నయము తప్పి
మెలగు కుజనుల కడ చేరి మేలుగూర్చు
వర్తనంబును తెలుపెడి భవ్య భావ,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 62.
తే.గీ. తండ్రి నుండి తా బడసిన తత్వమిదియె
చేయుటుపకారమెప్పుడున్ జేవఁ జూపి
దుష్టులకునైన భువిపైన కష్టమనక,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 63.
తే.గీ. మానవత్వ నిర్వచనమీ మానవతియె,
జ్ఞానమే రూపముగనైన్న కంబుకంఠి,
ధీనిధానమె రమణిగా దీపితమగు
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 64.
తే.గీ. తప్పు చేయదు, చేసినన్ దప్పు పరులు
నచ్చచెప్పుచు వారించు, మెచ్చుచుండ
పరులలో మంచి, భువిపైన పరమ సాధ్వి,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 65.
తే.గీ. ధరణి కొరగాని వేళలో దారి తప్పి
భుక్తి కోరుచు వచ్చినన్ భక్తితోడ
వండి వడ్డించు వారికి పరమ సాధ్వి,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 66.
తే.గీ. భర్త చీకాకుగా నుండి వదరడెపుడు,
వదరినన్ గోపమొందదు బాధ నెఱిగి
బాపి, యోదార్చునతనిని కోపమణచి,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 67.
తే.గీ. కూలి చేయగ వచ్చిన, జాలి చూపి
కన్న తల్లినాఁ గృప జూపి కడుపు నిండ
భోజనము పెట్టునీ యన్న పూర్ణ తనియ,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 68.
తే.గీ. చుట్టపక్కములొచ్చినన్ చూపి వారి
మంచి వర్ణించి చెప్పు సన్మాన్యులకును,
దొడ్డ గుణముల సుగుణాల బిడ్డ యీమె,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 69.
తే.గీ. మూర్ఖ విశ్వాసములు లేని పూజ్యురాలు
మూఢతత్వంబులను బాప గాఢ మైన
యత్నమును చేయు, వెలయించి నూత్న సుగతి,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 70.
తే.గీ. పలువురికి సేవ చేయుట వరమటంచు
చేరవచ్చిన వారికి చెప్పి, చేయు,
చేయఁ జేయుచు, మహనీయ సేవ నిలను,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 71.
తే.గీ. శాస్త్రవిజ్ఞానమదియేల? చక్కనైన
భక్తితోఁ బ్రజన్ సేవించు భావమున్న,
దేవి కున్నట్టి గుణ మదే, దివ్య చరిత
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 72.
తే.గీ. పలుకరించుటలో హాయి పంచునీమె,
కనికరించుటలో గొప్ప కల్పవల్లి,
యినుమడించుత మనలకునిట్టి గుణము
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 73.
తే.గీ. మనిషి జీవించియుండినన్, చనిన గాని
దేహ మితరులసేవకు దేవి నిలిపె,
మృతికి పూర్వమే కనులిచ్చె మేలటంచు,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 74.
తే.గీ. వైద్యవిద్యార్థులకు తాను భక్తి నొసగె
తనదు దేహంబు పూర్వమే ఘనతరముగ,
మోక్షమదియున్న రాకున్నె పూజ్య రమకు,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 75.
తే.గీ. రోగికిచ్చి ప్రియాంక శిరోజములను
బాహ్యసౌందర్యహీనకాన్ బాధపడక
పొంగె నీ తల్లి గని సుతన్ పూజ్యవనుచు,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 76.
తే.గీ. జీవనాధారమైనట్టి జీతమెల్ల
భర్త తనకీయ వెచ్చించు పరుల కొఱకు
కష్టములు బాప వారికి కరుణ తోడ,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 77.
తే.గీ. ఆడపడచు తా భర్తతో నమర యింట
తిష్ట వేసినన్ బోషీంచె కష్టమనక,
యింగితజ్ఞాన హీనులకిదియె సుఖము,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 78.
తే.గీ. తిట్టుచున్ననునేమియు పట్టనట్లు
తాను సర్దుకొనుచు పోవు దయను రమయు
నాడపడచు నేమనలేక, యడరెనయ్యొ,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 79.
తే.గీ. ఎన్ని బాధలు పడినదో యింటిలోన
బంధువులపోటు మాటలన్ పాపమీమె,
భర్తకెన్నడు చెప్పదు పరువునెంచి,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 80.
తే.గీ. భవ్యమైనట్టి యా ప్రజా పత్రిక నిల
నడుప చేపట్టి మిగుల సుజ్ఞాన మొప్ప
నిర్వహించెను రేబవల్ నిత్యమీమె,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 81.
తే.గీ. వీధిలోనున్న పేదలన్ బ్రీతితోడ
చేరదీయుచి మప్పుచు చిత్తమలర
బ్రతుకు మార్గము, వారలు వరలిరట్లు,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 82.
తే.గీ. ప్రస్తుతము రాజమండ్రిలో ప్రబలు ఘనుల
నెన్ని సత్కృల్ చేసి రహింపఁ జేయు
సంస్కృతీప్రభనొప్పిన సద్వరేణ్య,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 83.
తే.గీ. ఘనులనేకులు మార్మూలలను వెలుంగ
వారి ప్రఖ్యాతి నెన్నుచు భవ్యముగను
పత్రికన్ వ్రాసి లోకాన వరలఁ జేసె,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 84.
తే.గీ. సేద తీర్చుటయే కాని సేదతీర
కోరనట్టి మహా సాధ్వి, కూలె భువిని
శాశ్వితమ్ముగ నిదురించె సడియె లేక,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 85.
తే.గీ. బావగారండి రండని పరవశమున
పలుకరించెడి మరదలు వాలె భువిని,
ప్రేమతో నన్ను పిలిచెడి పిచ్చి తల్లి,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 86.
తే.గీ. చెల్లెలను చూచి పొంగెడి చిట్టితల్లి,
దివికినేగగ లల్లీ మదిన్ కలంగి
యేడ్చుచేడ్చుచుక్రుంగె, హా! యేమనందు,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 87.
తే.గీ. మొదటి ముద్దను భర్త తా ముందు తనకె
యిచ్చుటలవాటు యిప్పుడట్లీయ జూచి
దుఃఖమున కూరు నాభర్త తోడు వీడ,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 88.
తే.గీ. శ్రావణీప్రియ లీతల్లి చనగ దివికి
కానరమ్మంచు పిలుతు రీ కాంతనెంచి
యెంత యేడ్చిన ఫలము రవ్వంత లేదు,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 89.
తే.గీ. తిండి మానిరి యేడ్చుచునుండిరమ్మ
నీదు భర్తయు పిల్లలున్ నీవురమ్మ
టంచు పిలిచితి పిచ్చిగా నంగలార్చి,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 90.
తే.గీ. రెండువేలిరువదొకటి, మండుటేండ,
ఏప్రెలేడవ తేదీనె యీమె దివికి
నేగె పదకొండుకే పగల్, వేగలేక,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 91.
తే.గీ. నాదు జననికపరకర్మ నయముతోడ
చేయుచున్నట్టి వేళలో చేదు వార్త
నేను విజయయు వింటిమి దీనముగను,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 92.
తే.గీ. వైద్య లోపంబు జరిగెనా వైద్యులపుడు
శ్రద్ధ చేయక చంపి రశ్రద్ధ మ్రింగె
మా రమాలలామను, విధి మాయ చేసె,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 93.
తే.గీ. చిఱుత ప్రాయముదాటని చిన్నదీమె,
మృత్యువెట్టులు మ్రింగెనో, మిధ్యలోన
బ్రతుకు వారికి తప్పదీ బ్రహ్మ వ్రాత,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 94.
తే.గీ. కంటిపాప లా యంధుల కంటికమరె,
దేహవిజ్ఞాన బోధకై దేహమమరె,
ప్రాణమొక్క టే ప్రాంతాన వరలునొ కద?
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 95.
తే.గీ. ఈ రమాదేవి సత్స్ఫూర్తి యెందరికిల
వంటబట్టునో చూతము, ప్రజలలోన
సేవ చేసెడి బాధ్యత చేరుగాక,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 96.
తే.గీ. ఇల సుదర్శన హృదయాన మెలగును రమ,
నిత్యమున్ స్ఫూర్తిగొలుపుచు నిలుపునతని,
ప్రజల సేవకై పురికొల్పునిజము నిలుపు,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 97.
తే.గీ. స్ఫూర్తిదాయి రమాదేవి కీర్తి దిశల
వెలుగుచుండును ప్రజలలో మెలగునీమె,
దైవ మెవ్వరు? వీరలే దైవమిలను
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 98.
తే.గీ. ఈమె వాగ్ధాటి, నిపుణత, ప్రేమ జ్ఞాన
మమరుగావుత సుతలకు ననుపమమగు
శ్రీ రమాదేవికే కీర్తి చేర్చ దిశల
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 99.
తే.గీ. శ్రీ ప్రజాపత్రికను జనుల్ చేతఁ బట్టి
చదువునప్పుడీ దేవియే, మెదలు మదుల,
శాంతితోదివి మెలగునీ శాంతమూర్తి,
మాన్య గుణ గణ్య భువిని రమాలలామ.. 100.
ఓమ్ శాంతిః, శాంతిః, శాంతిః.
అంకితము.
శ్రీ రమాసాధ్వికిన్, శాస్త్రి చిత్తమందు
వెలుగు దేవికి, శ్రావణీప్రియల జనని
కి విజయ సహోదరికి నాదు కృతినొసంగి
ధన్యుతనుపొంది వరలెద ధరణిపైన.
చింతా రామకృష్ణారవు. 07 . 4 . 2021.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.