గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జూన్ 2025, శనివారం

రామ కృష్ణ నీతి శతకము. రచన - చింతా రామ కృష్ణ రావు

 రామ కృష్ణ నీతి శతకము.

రచన - చింతా రామ కృష్ణ రావు



రామ కృష్ణ మాట రాచ బాట

శ్రీవైష్ణవీ పబ్లికేషన్స్. మియాపూర్.

అంకితము

శ్రీ సాధు శ్యాం ప్రసాద్ గారికి,

శా.  శ్రీమన్మంగళ సాధువంశజుఁడు శ్రీ సీతాకుమారీ పతిన్

ప్రేమోదారుని, శ్యాంప్రసాదు మహితున్ విఖ్యాతుఁడంచెంచి నే

శ్రీమంతంబగు రామకృష్ణశతకశ్రీకన్యనే యంకితం

బోమాతా! యొనరించుచుంటి, కృపతోనొప్పార రక్షింపుమా.


రామ కృష్ణ నీతి శతకము.

ఆ:- శ్రీల నిచ్చు దైవ చింతన యనుచు, నిన్ - దలతు నయ్య! రామ! కొలుతునయ్య,

      ముక్తిఁ గొల్పి, నీదు భక్తులఁ గాపాడు! - రామ కృష్ణ మాట రాచ బాట.1.

ఆ:- సజ్జనాళి జూచి, సద్వర్తనము నేర్చు - సరస మతులు, కాన, సర్వ జనులు

      మంచి నడత కలిగి, మాన్యులై మెలఁగుత! - రామ కృష్ణ మాట రాచ బాట.2.

ఆ:- బాల్యమందు దుష్ట భావంబు లెఱుఁగక - యనుభవంబు నేర్పనరయు చుంద్రు,

      దౌష్ట్య హీన లోక ధర్మంబు వెలయుత! - రామ కృష్ణ మాట రాచ బాట. 3.

ఆ:- శిష్ట వర్తనంబు శివుని జేర్చునటంచు - మంచి మాటలాడి మహిమ చూపు,

      శిష్టులట్లు మెలఁగ శిష్టులా? తెలియుఁడు, - రామ కృష్ణ మాట రాచ బాట. 4.

ఆ:- తెలియనపుడు చెడ్డ తీరున నడచినన్ - దెలిసి చెడ్డ చేయ వలదు మనము,

      మంచి చేయు జనులు మహనీయు లిలలోన, - రామ కృష్ణ మాట రాచ బాట. 5. 

ఆ:- ధర్మ వర్తనంబు, దానంబు, శీలమున్ - గలిగి యున్న వారు ఘనులు భువిని,

      మనసు పరిమళించి మహనీయు లగుదురు, - రామ కృష్ణ మాట రాచ బాట. 6.

ఆ:- నీటిపైని వ్రాత నియమ హీనుని మాట, - చిత్త శుద్ధి లేక చెరిగి పోవు,

      మనసు వశము నున్న మాట నిలుపుటబ్బు, - రామ కృష్ణ మాట రాచ బాట. 7.

ఆ:- ప్రజల మధ్య నుండు పరమాత్మ నెఱుఁగక - పరుగు తీయుటేల భక్తి తోడ 

      కొండ లెక్కి చూడ కోనేటి రాయునిన్? - రామ కృష్ణ మాట రాచ బాట. 8.

ఆ:- గో మయంబు, సులభ గో మూత్ర, గో క్షీర, - గోవు దధియు, మరియు గో ఘృతంబు

      వైద్య గుణము కలిగి వరలించు సేవింప, - రామ కృష్ణ మాట రాచ బాట. 9.

ఆ:- సాధు గుణము కలిగి సత్పూజ్యమైనట్టి - గోవులిహము పరము కొలుపు నిజము,

      గోప బాలకుండె గోసేవ చేసెను! - రామ కృష్ణ మాట రాచ బాట. 10.

ఆ:- జీవమున్న మనిషి చేసిన పాపంబు  - జీవి యనుభవించు చెడిన పిదప,

      చేయనట్టి తనకు చెందుట ధర్మమా? - రామ కృష్ణ మాట రాచ బాట. 11.

ఆ:- శాశ్వతమ్ము కాదు విశ్వమే తలపోయ, - బ్రతుకు శాశ్వతమను భావ మేల?

      శాశ్వతుండు హరియె, సాక్షి యీ జగతికి, - రామ కృష్ణ మాట రాచ బాట. 12.

ఆ:- పాఠశాలలోని పంతుళ్ళ మాటకు - పరవశింత్రు, పిల్ల లరయు విద్య,

      పాఠశాలలోని పంతుళ్ళు దేవుళ్ళు, - రామ కృష్ణ మాట రాచ బాట. 13.

ఆ:- బుద్ధి చెప్ప దగిన పూజ్యులే దౌష్ట్యంబు - చేయుచున్న నేమి చేయ నగును?

      బుద్ధి నేర్చునట్టి బుడుతలే దండింత్రు, - రామ కృష్ణ మాట రాచ బాట. 14.

ఆ:- ఆకలికి తిననగు నధికంబు తిన రాదు, - పారవేయరాదు, బ్రహ్మ మదియె,

      ఆక లన్నవాని కది కాస్త పెట్టుడు, - రామ కృష్ణ మాట రాచ బాట. 15.

ఆ:- విత్త మమరి యున్న మత్తిల్ల బోకుండ - మంచి పనులు చేసి మసలఁ దగును,

      మత్తు డబ్బు, మనను చిత్తు చేయును కదా! - రామ కృష్ణ మాట రాచ బాట. 16.

ఆ:- అన్న వస్త్రములకు నారాట పడఁదగు,  - నధిక ధనము కొఱకు నాశ పడకు,

      పేదవాని కొఱకు ప్రాధేయ పడఁదగు, - రామ కృష్ణ మాట రాచ బాట. 17.

ఆ:- రామ రామ యనుచు రమ్యంబుగా పల్కఁ - బ్రేమతోడఁ గాచు రామ విభుఁడు,

      వట్టి మాటలాడి వదరుట మేల్కాదు, - రామ కృష్ణ మాట రాచ బాట. 18.

ఆ:- పత్నికన్న హితులు పరికింపఁగా లేరు, - పత్ని దైవ దత్త రత్నమయ్య,

      నీతి తప్పనట్టి నెలతయే దేవత, - రామ కృష్ణ మాట రాచ బాట. 19.

ఆ:- భర్త సాటి వాడు భార్యకెన్నగ లేడు, - భర్త ధర్మ బద్ధ వర్తనమున

      భార్య జీవితంబు ప్రాశస్త్యమును పొందు, - రామ కృష్ణ మాట రాచ బాట. 20.

ఆ:- పెద్దలైన వారు ప్రీతితో బుద్ధులు  - చెప్ప వలయు నెపుడు గొప్పగానుమ,

పిన్న లెన్న వలెను పెద్దల మాటలు, - రామ కృష్ణ మాట రాచ బాట. 21.

ఆ:- శాశ్వతమ్ము కాని సౌందర్య కాంక్షతో - పరుగు తీయ తగదు, ప్రజ్ఞ కలిగి

      శాశ్వతు హరి సేవ చక్కగా చేయుఁడు , - రామ కృష్ణ మాట రాచ బాట. 22.

ఆ:- జ్ఞాన ధనము కలుగ సర్వంబు సమకూరు, - జ్ఞాన ధనము సర్వ శక్తి కరము,

      జ్ఞాన హీనులకిల సౌఖ్యంబు కలుగదు, - రామ కృష్ణ మాట రాచ బాట. 23.

ఆ:- మత్తుమందు ధనము, మత్తురా మదిరాక్షి, - మత్తు స్వార్థ బుద్ధి మనుజులకును,

      మత్తు వీడ వలయు మహనీయ భక్తిచే, - రామ కృష్ణ మాట రాచ బాట. 24. 

ఆ:- తండ్రి చెప్పు నట్టి తత్వంబు కనఁ దగు - తండ్రి కన్న గురువు తలప లేడు,

      తండ్రి సేవ చేసి తరియింప తగునుగా! - రామ కృష్ణ మాట రాచ బాట. 25.

ఆ:- తల్లి ప్రేమ ముందు తండ్రి ప్రేమయు కూడ - నిలువ జాలదెపుడు,    

       నిరుపమమది,

      తల్లి దండ్రి మించు దైవంబు లేదుగా,- రామ కృష్ణ మాట రాచ బాట. 26.

ఆ:- తల్లి మనసు కన్న చల్లనైనది లేదు, - తండ్రి కన్న గొప్ప దాత లేడు,

      పిల్లలెపుడు గనుత ప్రేమతో వారిని, -  రామ కృష్ణ మాట రాచ బాట. 27.

ఆ:- బుద్ధి నిచ్చినట్టి పూజ్యుండు దైవంబు, - దైవ భక్తి తోడఁ దనియ వలయు,

      బుద్ధి హీనమైన పోకడ తగదిల, - రామ కృష్ణ మాట రాచ బాట. 28.

ఆ:- దైవ భక్తి కల్గి దైవ శక్తియు కల్గి - లోక సేవ చేయు శ్రీకరులను

      గౌరవించ వలయు, కల్యాణకరమది, - రామ కృష్ణ మాట రాచ బాట. 29.

ఆ:- దివ్యులందు మెలగు భవ్యుఁ డా దైవంబు, - మానవాళి నుండు మాధవుండు,

      మనుజ సేవ చేయ మాధవ సేవయౌ, -  రామ కృష్ణ మాట రాచ బాట. 30.

ఆ:- సత్వ భావముండి సన్మార్గ వర్తియౌ - ధైర్య వర్తనుండు ధక్షుఁడిలకు,

      దక్షులైనవారిఁ దనుపుట ధర్మంబు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 31.

ఆ:- కామ క్రోధ లోభ ఘన మద మాత్సర్య - మోహ వర్తులు ధర మూర్ఖులెన్న,

      ధర్మ బద్ధులైన దైవాంశు లటు కారు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 32.

ఆ:- రామ పాద ధూళి రాతినే నాతిగా  - చేసె, ధర్మ మదియె వాసి గొల్పె,

      ధర్మ బద్ధుల కిల దక్కును సత్కీర్తి, -  రామ కృష్ణ మాట రాచ బాట. 33.

ఆ:- శిష్ట జనుల మనసు దుష్టులు బాధింప - సృష్టి కర్త కలఁడు, చూచు నతఁడు.

      దుష్ట శిక్షణంబు తొడరక యొనరించు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 34.

ఆ:- పాప వర్తనమున పరవశించుచునుండి, - పాప కూపమందు పడగ నేల?

      కోప తాప జనిత పాపంబు మనకేల?  -  రామ కృష్ణ మాట రాచ బాట. 35.

ఆ:- జీవ హింస చేసి జీవింపగా నేల? - జీవి యన్నఁ గాదె దేవుఁ డిలను?

      జీవులందు దైవ భావంబు కలుగుత, -  రామ కృష్ణ మాట రాచ బాట. 36.

ఆ:- వృక్ష జాతి మనకు భృతి కొల్పి కాపాడు, - వృక్ష మెన్న జీవ రక్ష భువిని,

      వృక్ష నాశనంబు శిక్షార్హ నేరంబు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 37.

ఆ:- నిత్య పూజ్యులైరి నిరుపమ సత్కవుల్, - సత్య బోధ సేయు సరస మతిని,

      సత్య శోధకులకు సత్కవిత్వ మమరు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 38.

ఆ:- పంట పొలము లెల్ల ప్రాణ రక్షణ చేయు - పంట లిచ్చుచుండు, బ్రతుకు నిచ్చు,

      అట్టి పొలము లిండ్ల కట్టడంబులవేల? -  రామ కృష్ణ మాట రాచ బాట. 39.

ఆ:- కూర్మి తోడ గురువు పేర్మిని విద్యను - నేర్పు మనకు తనదు నేర్పు చూపి,

      అట్టి గురువు ఋణము నరసి తీర్చగనౌనె? -  రామ కృష్ణ మాట రాచ బాట. 40.

ఆ:- భక్తి తోడ గురువు పాద సేవలు చేసి - శిష్య కోటి మురియు శ్రీకరమని,

      పాద సేవకు తగు ప్రతిభులే గురువులు,  -  రామ కృష్ణ మాట రాచ బాట. 41.

ఆ:- కూడు పెట్టు వారు, గూడు కొల్పెడి వారు - విద్య నేర్పువారు వేల్పులిలను,

      వీరి ఋణము తీర్చనేరికి సాధ్యమౌ? -  రామ కృష్ణ మాట రాచ బాట.  42.

ఆ:- కూడు గూడు లేక కుములు పేదల గాంచి - సాయ పడగ తగును సజ్జనులకు,

      తోటివారి యార్తి తొలగింప శుభమౌను, -  రామ కృష్ణ మాట రాచ బాట. 43.

ఆ:- తల్లి దండ్రి వీడి, తన సోదరుల వీడి, - భర్త సర్వ మనుచు భార్య వచ్చు.

      అట్టి భార్య మనసు నరసి కావగ తగు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 44.

ఆ:- క్రొత్త కాపురమున యత్త మామల మధ్య - భర్త తోడ, యాడ పడుచు మధ్య

      బావ, మరిది మధ్య, బ్రతుక నేర్చును సాధ్వి, -  రామ కృష్ణ మాట రాచ బాట. 45.

ఆ:- మాటలాడునపుడు మన్నించు మితరులన్, - జేటు రాదు మంచి మాటలాడ.

      మాటకారి యెపుడు మన్నన లందును, -  రామ కృష్ణ మాట రాచ బాట. 46.

ఆ:- మంచి చెడ్డలకును మాటయే మూలము, - మంచి మాటకారి మహితుఁడిలను,

      మంచి చెడ్డలరసి మంచినే పలుకుఁడు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 47.

ఆ:- పుట్టినపుడు మనకు పుణ్య పాపము లేమి - తెలియ కుండు, కొంత తెలివి కలుగ

      మంచి చెడ్డ తెలియు, మర్యాద తెలియును, -  రామ కృష్ణ మాట రాచ బాట. 48.

ఆ:- వంట యింటి లోన నొంటిగా పని చేసి, - భుక్తి నిడెడి స్త్రీలు శక్తి మనకు,

      అట్టి స్త్రీల మనసు కానందమందించు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 49.

ఆ:- అన్నదమ్ముల యెడ ననురాగ మొలికించు, - యాడపడచులున్న నఖిల మమరు,

      ఆడపడచు మనసు నరసి వర్తించుడు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 50.

ఆ:- బాల్యమందు బుద్ధి బలమును పెంచిన - పెద్దయైన పిదప పేరు పొందు,

      బుద్ధి బలము తోడ పూజ్యులై నిలుతురు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 51.

ఆ:- నీతి పాఠములను నేర్పిన పిననాడు - జాతి కీర్తి పెంచు నీతి నిలిపి,

      నీతిమంతు లిలను జాతికి మూలము, -  రామ కృష్ణ మాట రాచ బాట. 52.

ఆ:- స్వార్థ రహితమైన సత్సేవ శుభమగు, - స్వార్థ రహితుఁడెన్ను సర్వ జగతి,

      స్వార్థ రహిత జీవి సర్వాత్ముఁడగు హరి, -  రామ కృష్ణ మాట రాచ బాట. 53.

ఆ:- భూమిపైన పుట్టి బుద్ధి జీవులమయి - పుణ్య పాపములకు మూల మెఱిగి,

      మంచి చేయకుంట మర్యాద కాదుగా? -  రామ కృష్ణ మాట రాచ బాట. 54.

ఆ:- రావణాదులెల్ల రాక్షస వృత్తిచే - నేమి లాభ పడిరి భూమిపైన?

      రాక్షసత్వ మెపుడు రాణింపు నీయదు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 55.

ఆ:- పాఠశాలలోన ప్రఖ్యాతమైనట్టి - పలుకుబళ్ళు నేర్ప ప్రతిభులగుచు,

      భావి జీవితమున పరువుగా మనుదురు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 56.

ఆ:- జ్ఞాన సాధనమున ప్రాణంబులను కూడ - లెక్క చేయరాదు, స్రుక్క రాదు,

      జ్ఞానమబ్బినంత కన్పించు సత్యంబు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 57.

ఆ:- తప్పు చేయఁ బూన నొప్పును చెప్పెడు – నంతరాత్మ, దాని నరయ రేల?

      ఆత్మ చెప్పుదాని నాచరించుట మేలు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 58.

ఆ:- ప్రాప్తమైన దాని పరవశించుచుఁ బొందు – బద్ధకిష్టి, ఘనులు పట్టు పట్టి

      కోరుకొన్న ఫలము గొనకుండ వీడరు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 59.

ఆ:- సరస గుణము కలిగి, సభ్యత పాటించి, - సుజన పాళి మెచ్చ సుగుణులుంద్రు,

      స్వజన పాళి మెచ్చ సుజనులై మెలఁగుడు,  -  రామ కృష్ణ మాట రాచ బాట. 60.

ఆ:- ఆర్తి తోడ తీర్థ యాత్రలు చేయుచు - క్షేత్ర దర్శనంబు చేయుచుంద్రు.

      క్షేత్ర వర్తి దేహి గాత్రస్థుఁ డరయుఁడీ! -  రామ కృష్ణ మాట రాచ బాట. 61.

ఆ:- భక్తి తోడ కొలిచి, పరమాత్మునకు మ్రొక్కి, - చెత్త కోర్కెలడిగి చెడుటదేల?

      వరలఁ జేయునట్టి వర్తనం బడుగుఁడు. -  రామ కృష్ణ మాట రాచ బాట. 62.

ఆ:- జీవ కోటి లోని జీవంబు దైవంబు, - జీవులెల్ల కనగ దైవమయ్యె,

      జీవ కోటిని తిని జీవింప న్యాయమా? -  రామ కృష్ణ మాట రాచ బాట. 63.

ఆ:- కన్నులిచ్చె తనను కనుగొన దైవంబు, - కన్నులున్న మనము కనునదేమి?

      మాయ గొల్పునట్టి మట్టి బొమ్మలె కదా? -  రామ కృష్ణ మాట రాచ బాట. 64.

ఆ:- కంటి ముందు మనకు కనబడునది యెల్ల - కలుగ దెల్ల వేళ, కలుగు నొకటి

      జ్ఞాన నేత్రమునకుఁ గనఁబడు దైవంబు, -  రామ కృష్ణ మాట రాచ బాట.  65.

ఆ:- బాల్యమందు మనము పాట లాటల తోడ, - యౌవనమున భ్రాంతు లలమి బ్రతుక,

      వృద్ధత నల జ్ఞాన వృద్ధిఁ బొంద తగదె? -  రామ కృష్ణ మాట రాచ బాట. 66.

ఆ:- త్రికరణ పరిశుద్ధ దివ్య వర్తనులకు - నాత్మ తృప్తి కలిగి యలరుదు రిల,

      ఆత్మ తృప్తి పొంది, హాయిగా బ్రతుకుడీ! -  రామ కృష్ణ మాట రాచ బాట. 67.

ఆ:- తనివి కల్గి యున్న తృణమైన ఘనమౌను, - తనివి లేని వానిఁ దనుపు నెద్ది?

      తనివి పొంద సుఖము దక్కును నిజముగా, -  రామ కృష్ణ మాట రాచ బాట. 68.

ఆ:- నగర జీవనంబు నరక కూపంబని - పలుక నేల నీకు పాలు లేదె?

      శుచిగ శుభ్ర మొనరఁ జూడుము నీవును, -  రామ కృష్ణ మాట రాచ బాట. 69.

ఆ:- ఆత్మ శక్తి యున్న నపురూప తత్వంబు - మదికిఁ గాన వచ్చు మానవులకు,

      ఘన త్రికాలవేది కాగల మరయగా, -  రామ కృష్ణ మాట రాచ బాట. 70.

ఆ:- దేశ భక్తి యనెడి దివ్య భావులు భువి - త్యాగరాజులయిరి దానములిడి.

      దేశ భుక్తు లిపుడు తినుచుండ్రి సర్వమ్ము, -  రామ కృష్ణ మాట రాచ బాట. 71.

ఆ:- మాన ధనము కల్గ మానవు లనఁబడు, - మానహీన జనులు మానవులొకొ?

      మాన ధనము నకును ప్రాణంబు సరి కాదు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 72.

ఆ:- మాటలాడునపుడు మంచిగా చింతించి, - మంచి మాటలాడు మంచివారు,

      మంచి మాటలాడ మర్యాద పెరుగును, -  రామ కృష్ణ మాట రాచ బాట. 73.

ఆ:- దుష్ట భావనంబు, దుష్ట భాషణయును, - దుష్ట చేష్ట యెన్న దురిత మొసగు,

      శిష్ట వర్తనంబు చిత్స్వరూపంబెంచ, -  రామ కృష్ణ మాట రాచ బాట. 74.

ఆ:- దురిత గతులు వీడి పరువిడు మార్గాన - సత్య వర్తి నడచు సరస మతిని,

      పుణ్య మార్గమెంచి పోవుట ధర్మంబు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 75.

ఆ:- పూల యందు మధువు పొలుపొందు చందాన - పుణ్యులందు సుగతి పొర్లుచుండు,

      పుణ్యు ననుసరించి పోవుట ధర్మంబు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 76.

ఆ:- పాపి ననుసరించ పాప కూపమునందు - పాతుకొనుచు పోవు భవ్యుఁడయిన,

      పుణ్యు ననుసరించ పూజింపఁబడు కదా! -  రామ కృష్ణ మాట రాచ బాట. 77.

ఆ:- మార్గదర్శి యైన మాతృమూర్తి గుణము - ధనము పగిది వచ్చు తనయులకును,

      మాతృ మూర్తి సతము మంచిగా వరలుత! -  రామ కృష్ణ మాట రాచ బాట. 78.

ఆ:- భావమందు మంచి ప్రబలిన సతతము - భాష యందు కూడ ప్రబలు. సుకర

      భావ భాషణములు ప్రఖ్యాతి నొడఁగూర్చు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 79.

ఆ:- యుగము పేరు చెప్పి తెగిపోదు ధర్మంబు - యుగములెల్ల మనలఁ దగిలి యుండు,

      ధర్మ వర్తికి కృత ధర్మమే కలియును, -  రామ కృష్ణ మాట రాచ బాట. 80.

ఆ:- సూర్య కాంతి చూచి శోభిల్లు పద్మము, - చలువ రేని కాంతి కలువ వలచు,

      సత్య తేజసంబు సన్మార్గి వలచును, -  రామ కృష్ణ మాట రాచ బాట. 81.

ఆ:- వేద సారమెల్ల విశ్వంబునకు చాటి,- సృష్టి మూల మెల్ల చెప్పినట్టి

      భారతమ్మబిడ్డ లారయ ఘనులుగా? -  రామ కృష్ణ మాట రాచ బాట. 82.

ఆ:- సృష్టి కర్త నెఱిగి, సృష్టి మూల మెఱిగి - కష్ట కారణములు కనుచు, సతము

      నిష్ట తోడ బ్రతుక నేర్చుట ధర్మంబు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 83.

ఆ:- భారతాంబ తనయ భారతీ దేవియు, - పార్వతమ్మ మరియు. భాగ్య లక్ష్మి,

      ముగ్గురమ్మల సరి మురిపాల స్త్రీ మూర్తి, -  రామ కృష్ణ మాట రాచ బాట. 84.

ఆ:- అక్క యన్న మాట చక్కని కావ్యంబు, - తమ్ము కుఱ్ఱలకును ధర్మ దర్శి 

      నక్క యమ్మ కంటె చక్కని తల్లిరా, -  రామ కృష్ణ మాట రాచ బాట. 85.

ఆ:- శక్తి చూపి పంట చక్కగా పండించి, - ప్రజలఁ గాచు రైతు వామనుండు,

      రైతుబిడ్డ జన్మ రాణింపగా వలె,  -  రామ కృష్ణ మాట రాచ బాట. 86.

ఆ:- మాయ మాటలాడి మర్యాద మీరెడి - మాన హీనులున్న మహిని, మహిళ

      ప్రాణ సంకటంబు పడకుండ కాచుడు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 87.

ఆ:- కవుల కలము ఘనత కవితలఁ గననగు, - కవుల మనసు వెన్న, కరుణకు నిధి,

      సుకృత కవుల నరసి సుజనులు మన్నింత్రు,  -  రామ కృష్ణ మాట రాచ బాట. 88.

ఆ:- ప్రజల జీవ నాడి పట్టును సత్కవి, - ప్రజల కవిగ భువిని పరిఢవిల్లు,

      ప్రజల మేలు కోరి  పండించు కృతులను, -  రామ కృష్ణ మాట రాచ బాట. 89.

ఆ:- పాఠములను చెప్పు బాపడు గుణ హీన - పాంశుడైన చెరచు బాల లనట,

      బాల లందు గుణము వరలింప గురువౌను, -  రామ కృష్ణ మాట రాచ బాట. 90.

ఆ:- మానవులకు నెంత మహిమ లున్నను గాని - జీవ శక్తి పరిధి చేర్చు తుదికి,

      తుదికి చేరనట్టి ధుర్యుండు దేవుండు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 91.

ఆ:- శాశ్వతమ్ము కాని స్వశరీర వాంఛలు - తీర్చ కోరుటెల్ల తెలివి లేక,

      శాశ్వతాత్మ ముక్తి చక్కని కోరిక, -  రామ కృష్ణ మాట రాచ బాట. 92.

ఆ:- ఆకలున్న వారి కన్నంబు కడుపార - ప్రేమతోడ పెట్ట ప్రీతి నొందు,

      ప్రీతి నొంద వారు ఖ్యాతి మీ కమరును, -  రామ కృష్ణ మాట రాచ బాట. 93.

ఆ:- గుడుల కేగి మనము కొలిచి దేవుని కోరు - పెక్కు కోరికలకు భీతి నొంది

      కఠిన శిలగ మారె కాంచుడీ దేవుని, -  రామ కృష్ణ మాట రాచ బాట. 94.

ఆ:- పుస్తకమ్ము పట్టి, బుద్ధి నావలఁ బెట్టి - చదువ నేమి ఫలము? మదికి పోదు.

      శ్రద్ధ తోడ చదువ చక్కగా మదికెక్కు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 95.

ఆ:- కాల గతిని నిలిచి కాలుని చేరక  - యున్న వారు లేరు పన్నిదముగ,

      దైవ శక్తి కల్గు ధన్యాత్ము లుందురు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 96.

ఆ:- విద్య నేర్పు నపుడు విజ్ఞానమును గొల్పు - శాస్త్ర పద్ధతిఁ గని జరుప వలయు,

      నేర్చునట్లు చేయు నేర్పుతో సాధ్యము, -  రామ కృష్ణ మాట రాచ బాట. 97.

ఆ:- చదువుడనుచు చెప్ప, చదివింప చదువరు, - చదువుచున్న గాని మదికి పోదు,

      చదువ దగిన దాని చర్చింప చదువబ్బు -  రామ కృష్ణ మాట రాచ బాట. 98.

ఆ:- గ్రామ సభల లోన ప్రేమగా పలికెడి - గ్రామ పెద్ద మనము కలువ బోవ

      కానఁడు మనవైపు, కరుణఁ జూడడదేలొ? -  రామ కృష్ణ మాట రాచ బాట. 99.

ఆ:- చిత్ర దర్శకాళి పాత్రలే మారెను, - చూడ రానివన్ని చూపుచుండు,

      చూడ తగిన నీతి చూపిన మేలౌను, -  రామ కృష్ణ మాట రాచ బాట. 100.

ఆ:- పుట్టినట్టివారు పుణ్యాత్ములైనచో - పూజనీయు లవరె బుద్ధి కలిగి?

      పాప కర్ముఁడెపుడు కోపాగ్నితో నొప్పు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 101.

ఆ:- భాగ్యమున్న వారు భాగ్య హీనులఁ గని - సాయపడు టనునది సరస గుణము,

      పాడినెక్కునాడు భాగ్యంబు రాదుగా? -  రామ కృష్ణ మాట రాచ బాట. 102.

ఆ:- దీన బంధు వగుచు దీపించు నెవ్వారు - వారు బ్రతికి యున్న వారు భువిని,

      దీన జనులఁ గనని జ్ఞానియు నజ్ఞాని, -  రామ కృష్ణ మాట రాచ బాట. 103.

ఆ:- శత్రు షట్కమునకు మిత్రులై చెడుటయో? - శత్రువగుచు నాత్మ శక్తి గనుటొ?

      ఎంచి చూడ రెంట నేది మేలందురు? -  రామ కృష్ణ మాట రాచ బాట. 104.

ఆ:- మిత్రులార! సుగుణ పాత్రులారా! నను - శత్రు వనుచుఁ దలపఁ జక్క కాదు,

      ధర్మ వర్తనమును దర్శింపఁ జేసితి, -  రామ కృష్ణ మాట రాచ బాట. 105.

ఆ:- పద్యమందు కాని, భావమందున కాని - దోష లేశమున్న దూర వలదు,

      మంచి గాంచి మీరు మంచినే గొనఁ దగు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 106.

ఆ:- నీతి శతక రచన ఖ్యాతి చింతా రామ - కృష్ణ రావు చేసె తృష్ణ తోడ,

      వాణి కృపను జేసి పన్నుగ నొక నాడె, -  రామ కృష్ణ మాట రాచ బాట. 107.

ఆ:- మంగళంబు కలుగు మహనీయులగు మీకు, - మంగళంబు సుకవి మాన్యులకును,

      మంగళంబు హరికి, మహనీయ లక్ష్మికి, -  రామ కృష్ణ మాట రాచ బాట. 108.

శ్రీమత్కాణ్వశాఖీయులై కౌశికగోత్రులయిన చింతా వేంకట రత్నం, సన్యాసి రామా రావు  

పుణ్య దంపతుల పుత్రుండును, 

శ్రీమాన్ కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల వారి ప్రియ శిష్యుండును, 

శ్రీ షిరిడీశ దేవ శతక, శ్రీ వేణు గోప ( కంద - గీత - గర్భ చంపకోత్పల ) శతకశ్రీ శివాష్టోత్తర శత పంచ చామరావళి నామంబునంబరగు శివ శతక, వృద్ధ బాల శిక్ష శతక, సుందర ( రామాన్వయ కంద - సీతాన్వయ గీత గర్భ హనుమదన్వయ ఉత్పల) నక్షత్రమాలాద్యనేక గ్రంథ కర్తయు, ఆంధ్రామృతం http://andhraamrutham.blogspot.com బ్లాగు నిర్వాహకుండునగు చింతా రామ కృష్ణా రావు తేదీ. 01- 01- 2012. ని విరచించిన 

రామ కృష్ణ శతకము సంపూర్ణము. 

స్వస్తి.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.