గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జూన్ 2025, శనివారం

శ్రీమద్భగవద్గీత చింతా(తనా)మృతం. తెలుఁగు సేత…చింతా రామకృష్ణారావు.

 


శ్రీమద్భగవద్గీత చింతా(తనా)మృతం.

తెలుఁగు సేత…చింతా రామకృష్ణారావు.

శ్రీకృష్ణం వందే జగద్గురుమ్.

ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతస్సదా |

స ముక్త స్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే ||


శ్రీమద్భగవద్గీత చింతామృతం.

తెలుఁగు సేత.. చింతా రామకృష్ణారావు.

ప్రార్థన

శా.    శ్రీమాన్మంగళ భారతంబునఁ గృపన్ శ్రీదంబుగా గీతనే

శ్రీమంతుండగు నర్జునుండెరుఁగ నా శ్రీకృష్ణుఁడే చెప్పె, తా

బ్రేమన్ జెప్పిన గీతనాంధ్రముననే బ్రీతిన్ రచింతున్ గృపన్

బ్రేమన్ భారతి! వ్రాయఁజేయుమిది, నిన్ జిత్తంబునన్ గొల్చెదన్.      1.

రచనకు ప్రేరణ.

ఉ.  శ్రీమదనంతుఁడైన హరి చెప్పిన గీతను తెల్గుభాషలో

ధీమతులెన్నుచుం బొగడఁ దీయగ వ్రాయుడటంచుఁ బల్కె తాఁ

బ్రేమను నా కుమార్తె యగు రేవతి వేంకటరత్నమాఖ్య, సత్

ప్రేమగ వ్రాయఁ జేసినది విద్యలతల్లి మహత్వ గీతనే.            2.

గీతావగాహన

శా.   శ్రీమంతంబగు నంతరాత్మ, మరియున్ జీవాత్మయున్,  గృష్ణుడున్

ధీమంతుండగు నర్జునుండునగుచున్ దేదీప్యమానంబుగా

శ్రీమంతంబుగ జూప, గాంచితిది మచ్చిత్తంబునన్ సర్వమున్,

నీమంబొప్పగ తల్లిదండ్రులకు దీనిన్ వ్రాసి యర్పించితిన్.      3.

అంకితము.

పూజ్యులయిన మా నాన్నగారికి మా అమ్మగారికి.

 

కీ.శే. చింతా సన్యాసిరామారావు…కీ.శే. చింతా వేంకటరత్నం.

4.  సీ.  శ్రీప్రదంబైనట్టి చింతా వరాన్వయ సన్యాసిరామాఖ్య గణ్యమూర్తి

వేంకటరత్నము విజ్ఞాన తేజులు నాదు పితరులు విజ్ఞానఖనులు,

సంగీతజ్యోతిష్య సాహిత్య వేత్తలు పండితప్రవరులు భక్తిపరులు,

నా కంటి రెప్పలై నాదు రక్షణఁ జేసి జ్ఞాన వృద్ధిని గొల్పి గౌరవముగ

తే.గీ.  సంఘమందున బ్రతుకంగ సన్నుతమగు

బోధనావృత్తిఁ జూపిన పూజనీయు

లట్టి నా తల్లిదండ్రుల కంకితముగ

స్వీకరింపగ నొసగితిన్ జిత్తమలర …………..4.


ఈ తెలుఁగు గీతాపాఠకులకు నేనాశించు ఫలములు.

మ.  భగవద్గీత సుధాస్రవంతి, కొనినన్ భక్తుల్ చిదానందమున్,

సుగుణప్రాభవ వృద్ధియున్, శుభములన్, శుద్ధంపువాగ్వైఖరిన్,

నిగమాకారుని దివ్యదర్శనము, క్షోణిన్ సౌఖ్య సద్భాగ్యముల్,

భగవద్గీత కృపన్ లభించు, నటుపై బ్రహ్మత్వమే కల్గెడున్.                           5.


శ్రీమద్భగవద్గీత

అర్జున విషాద యోగము.

ధృతరాష్ట్ర ఉవాచ ।

శ్లో. ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః,

మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ||1-1||

శా.  ధర్మక్షేత్రముగా నెఱుంగనగు నిద్ధాత్రిన్ గురుక్షేత్రమున్

ధర్మాత్ముండగు పాండుపుత్రులును బోధన్ గల్గు నా పుత్రులున్

గర్మల్ వ్రేచఁగఁ జేరిరే సమర కాంక్షన్ వారలుత్సాహులై?

మర్మంబున్విడి యేమి చేయుదురొ, ప్రేమన్ దెల్పుమో సంజయా!

భావము.

ధృతరాష్ట్రుడు పలికెను;  

ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధ కాంక్షతో చేరియున్న నాయొక్క పుత్రులు, మరియు 

పాండురాజు కుమారులు ఏమిచేసిరి? తెలియఁజేయుము.

సంజయ ఉవాచ:

శ్లో. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా !

ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ! ||1-2||

తే.గీ.  అపుడు దుర్యోధనుండట ననుపమముగఁ

గలుఁగు పాండవ వ్యూహమున్ గాంచి వెడలి

గురువు ద్రోణునిఁ జేరెను వరలు భీతిఁ

బలికె తెలియఁగ నతనికి  నిలువ లేక. 

భావము.

ధృతరాష్ట్రుడితో సంజయుడిట్లు పల్కెను - ఆ సమయమున రాజైనదుర్యోధనుడు వ్యూహరచనతో రణమునకు 

మోహరించియున్న పాండవ సైన్యమును చూచి, ద్రోణాచార్యుని సమీపించి ఇట్లు పలికెను.

శ్లో.  పశ్యైతాం పాణ్డుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ |

వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా||1-3||

మ.  సదయం గాంచుఁడు మీదు శిష్యుఁడగు దృష్టద్యుమ్నుఁడన్ ధీవరుం

డదిగో వ్యూహము తా రచించె మహిలో నాశ్చర్యముం గొల్పు నా

మదికిం గంటకమైనదై, రిపులకుం భాగ్యంబుగా నిల్వగా,

నది మీ దృష్ఠికిఁ దెచ్చితిన్ గనఁగ మీ రాచార్యదేవా! సుధీ!

భావము.

ఓ గురువర్యా! బుద్ధిశాలియు, మీ శిష్యుడునగు ధృష్టద్యుమ్నునిచేత వ్యూహాకారముగ రచింపబడియున్నట్టి 

పాండవుల ఈ గొప్ప సైన్యమును జూడుడు!

శ్లో.  అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి |

యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః.||1-4||

కం.  సాత్యకి, విరటుఁడు, ద్రుపదుఁడు                                                               

స్తుత్యులును, మహారథులును జూడగ నచ టౌ                                                        

న్నత్యము సూపగ నుండిరి                                                                                            

స్తుత్యుఁడ! భీమా ర్జనులకుఁ దుల్యులు వారల్. 

భావము.   

ఆచార్యా!  పాండవ సేనలో భీమర్జునలకు సమానులుగా సాత్యకి, విరటుడు, ద్రుపదుడు, అందరును గొప్ప 

పరాక్రమవంతులు, మేటి వీరులు కొందరు వారి పక్షముననుండిరి. 

శ్లో.  ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ |

పురుజిత్కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ||1-5||

మత్తకోకిల.

శ్రీకరా! యల ధృష్టకేతువు, చేకితానుఁడు, వీరుఁడౌ

ప్రాకటంబుగ కాశికాపురిరాజు, శైభ్యుఁడు, ధీరుఁడౌ

రాకుమారుఁడు కుంతిభోజుఁడు క్రాలుచున్ నరపుంగవుం 

డాకడన్బురజిత్తు రాజు, మహాసుయోధులు నిల్చిరే.

భావము.

దృష్టకేతువు, చేకితానుడు, వీర్యవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్టుడైన శైబ్యుడు ఉండిరి.

శ్లో.  యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |

సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ||1-6||

ఆ.వె.  తా పరాక్రముఁడు యుధామన్యుఁ డట వీర్య

వంతుఁడుత్తమౌజు డంతె కాక

యట సుభద్ర తనయు డభిమన్యుడును, ద్రౌప

దీ కుమారు లుండి రాకరముగ.

భావము.

పరాక్రమశాలి యధామన్యుడు, వీర్యవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు, ద్రౌపదీ 

కుమారులు ఉన్నారు. వీరందరూ మహారథులే.

శ్లో.  అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |

నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్బ్రవీమి తే ||1-7||

తే.గీ. బ్రాహ్మణోత్తమా! తెలియుఁడు ప్రస్తుతమున

ఘనులు మన పక్షమందునఁ గలిగిరెవరొ,

నాదు సైన్యంబునందలి నాయకులను

దెలిపెదను మీకు నేనిటఁ దెలియుటకని.

భావము.

బ్రాహ్మణోత్తమా! మనలో విశిష్టులైన వారెవరో తెలుసుకొనుఁడు. నా సైన్యంలోని నాయకులను మీ గుర్తుకోసం 

తెలిపెదను.

శ్లో.  భవాన్భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిఞ్జయః |

అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ||1-8||

తే.గీ. భీష్ముఁడును, మీరు, కర్ణుండు, వీరవరుఁడు

కృపుఁడు, సోమదత్తజుఁడు, భూరిశ్రవుడును,

ఘనుఁడు ద్రోణ సుతుండు, వికర్ణుఁడు నిటఁ

గలరు మనసైన్యమందున ఘనసుచరిత!

భావము.

మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధములో జయము పొందే కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, అటులనే సోమదత్తుని 

కుమారుడు భూరిశ్రవుడు కలరు.

శ్లో.  అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః |

నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ||1-9||

తే.గీ.  కువలయమున శూరులు యుద్ధ కోవిదులును,                                                                 

త్యక్తజీవులై రెందరో ధరణిపైనఁ                                                                                            

బ్రేమతోడ నా కొఱకని వీరవరులు,                                                  

చూడుడందరిన్ మీరలు, శుభ సుచరిత!

భావము.

ఇంకనూ ఎందరో యుద్ధకోవిదులైన శూరులూ, నానా శస్త్రాలను ధరించి  నాకోసము జీవితాలని త్యాగము చేసిరి.

శ్లో. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ |                                                                  

పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితమ్ ||1-10||

తే.గీ. భీష్మ రక్షిత సైన్య మభేద్యమనఁగఁ

గలిగె మనకు ననల్పమై, కనుఁడు మీరు,

భీమ రక్షిత సైన్య మవిస్త్రుతి నటఁ

గలిగె వారికి నల్పమై, ఘన సుచరిత!

భావము.

భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపరిమితమైనది. భీముని చేత రక్షింపబడే వారి బలం పరిమితమైనది.

శ్లో. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః |

భీష్మమేవాభిరక్షన్తు భవన్తః సర్వ ఏవ హి ||1-11||                                                                       

కం. మీరలు వ్యూహములన్నిట                                                                                                        

మీరక మీ స్థానములను మెలగుచు భీష్మున్                                                                

నేరుపుతో రక్షింపుడు,                                                                                     

చేరగ సద్విజయ పథము శ్రీమంతముగా.                                                                    

భావము.                                                                                                                                    

అన్ని ఎత్తుగడలలోను మీరంతా ఎవరి స్థానములలో వారుండి, సదా భీష్ముని రక్షించవలెను

శ్లో. తస్య సఞ్జనయన్హర్షం కురువృద్ధః పితామహః |

సింహనాదం వినద్యోచ్చైః శఙ్ఖం దధ్మౌ ప్రతాపవాన్ ||1-12||                                                       

కం. అతనికి హర్షము  గూర్చుచు                                                                                

పితామహుఁడు సుప్రతాప వీరుఁడు భీష్ముం                                                                   

డతులిత  శంఖానాదము                                                                           

క్షితి, కురువృద్ధుండు చేసె కీర్తిప్రదుఁడై                                                                                             

భావము.                                                                                                                      

అతడికి హర్షము కలిగించుచు ప్రతాపవంతుడైన కురు వృద్ధుడు గట్టిగా సింహగర్జన చేసి శంఖం ఊదెను.

శ్లో.  తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః |

సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములోऽభవత్ ||1-13||                                                          

తే.గీ.  శంఖముల్ భేరులే గాక సమరమునకు

సిద్ధమని దెల్ప పణవముల్, చెలగి మ్రోగె

గోముఖంబులు, తప్పెటల్, కూడి మ్రోగ

వినగ గజిబిజిగాఁ దోచె, విశ్వమునను.

భావము.                                                                                                                                

ఆవెంటనే శంఖములూ, భేరులూ, పణవములూ(చర్మవాద్యాలు)అనకాలు(తప్పెటలూ,మద్దెలలు)గోముఖములు ఓకేసారిగా 

మ్రోగెను. ఆ ధ్వని గజిబిజి అయినది.

శ్లో.  తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యన్దనే స్థితౌ |

మాధవః పాణ్డవశ్చైవ దివ్యౌ శఙ్ఖౌ ప్రదధ్మతుః ||1-14||

కం.  శ్వేతాశ్వరథముపై వి

ఖ్యాతిగ హరియును కిరీటి యలరుచు శంఖం

బాతత గతిఁ బూరించిరి,

జ్ణాతంబవ సైనికులకు జయనాదముగా.

భావము.                                                                                                                                   

అప్పుడు తెల్లటి గుర్రాలు పూన్చిన గొప్ప రధంలోకూర్చున్న మాధవుడు, అర్జునుడుదివ్యశంఖములను ఊదిరి. 

శ్లో.  పాఞ్చజన్యం హృషీకేశో దేవదత్తం ధనఞ్జయః |

పౌణ్డ్రం దధ్మౌ మహాశఙ్ఖం భీమకర్మా వృకోదరః ||1-15||

తే.గీ.  పాంచజన్యంబు పూరించె భవ్యుఁడు హరి,

దేవదత్తమర్జునుఁడూదె దిశలు మ్రోగ,

పౌండ్రకమ్మూదె భీముఁడు,భయము కలుగ,

యుద్ధమునకని  సైన్యంబు సిద్ధపడగ.   

భావము.                                                                                           

పాంచజన్యమును హృషీకేశుడూ, దేవదత్తమును ధనంజయుడూ, పౌండ్రకమనే మహాశంఖమును భీమకర్ముడైన 

వృకోదరుడు ఊదిరి.

శ్లో.  అనన్తవిజయం రాజా కున్తీపుత్రో యుధిష్ఠిరః |

నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ||1-16||

తే.గీ.  కుంతి కొడుకు ధర్మజు డట నంత విజయ

మూదె, నకులుఁడూదె సుఘోష మోద మలర,

యూదె మణిపుష్పకంబును యోధుఁడయిన

మాద్రితనయుఁడు సహదేవమహితుఁడెలమి.

భావము.       

కుంతీపుత్రుడు ధర్మరాజు అనంతవిజయమును, సుఘోష, మణిపుష్పకాలనేవాటిని నకుల సహదేవులు ఊదిరి.

శ్లో. కాశ్యశ్చ పరమేష్వాసః శిఖణ్డీ చ మహారథః |

ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ||1-17||

ఆ.వె.  మహిత రథి శిఖండి, మరియు  ధృష్టద్యుమ్నుఁ

డు నపరాజితుఁడతఁడు కనఁగనట 

సాత్యకియు, విరాట్టు, సధనుకాశీరాజు

శంఖనాద మచట సలిపి రపుడు.    

భావము.  

ఓ రాజా గొప్ప ధనువు కలిగిన కాశీ రాజు, మహారథుఁడైన శిఖండీ, ధృష్టద్యుమ్నుఁడూ, విరాటుడూ, అపరాజితుడైన 

సాత్యకీ శంఖనాదము చేసిరి.

శ్లో.  ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |

సౌభద్రశ్చ మహాబాహుః శఙ్ఖాన్దధ్ముః పృథక్పృథక్ ||1-18||

ఆ.వె.  తవిలి దృపదరాజు, ద్రౌపదీ సుతులును,

వరసుభద్ర సుఁతుడు, వరలిరచట,

రాజులందరచట ప్రారంభ సూచిగా

శంఖ నాదములను సలిపినారు.

భావము. 

ద్రుపదుడూ, ద్రౌపది కుమారులు, మహాబాహుఁడైన సుభద్ర కుమారుఁడైన అభిమన్యుడూ వేరువేరుగా శంఖాలను 

ఊదిరి.

శ్లో.  స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |

నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ ||1-19||

తే.గీ.  భూమి నాకాశమున శంఖపూరణ రుతి

మించి భీతిలగ ప్రతిధ్వనించెనపుడు,

ధార్తరాష్ట్రుల హృదయముల్ దర్పముడుగ

చీల్చి నిస్తేజులుగఁ జేసె చెన్ను గాను.

భావము.   

ఆ ధ్వని భూమ్యాకాశాలలో భయంకరముగా మార్మోగుచు ధార్తరాష్ట్రుల హృదయాలను చీల్చింది.

శ్లో.  అథ వ్యవస్థితాన్దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః |

ప్రవృత్తే శస్త్రసమ్పాతే ధనురుద్యమ్య పాణ్డవః ||1-20||

తే.గీ.  అప్పు డచ్చట ప్రబలిన యాహవమున 

నగచరసుకేతనుండగునర్జునుండు

యుద్ధ సన్నద్ధచిత్తులై యొప్పియున్న

ధార్తరాష్ట్రులఁ గాంచి సత్ స్ఫూర్తిని గని,  

భావము. ఓ రాజా! అప్పుడు కపిధ్వజుఁడయిన అర్జునుఁడు యుద్ధ సన్నద్ధులై యున్న ధృతరాష్రునకు సంబంధించినవారిని చూచి స్ఫూర్తి పొంది,(తరువాత పద్యముతోనన్వయము.)

శ్లో.  హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే |

అర్జున ఉవాచ |

సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేऽచ్యుత ||1-21||

తే.గీ.  ఓ మహారాజ! యచటమహోజ్వలముగ

నొప్పియున్నట్టి కృష్ణని నొకపరి గని

అర్హునుండనె తన రథమాహవమున

నడుమ నిలుపు మనుచు భక్తి పొడమ మదిని.

భావము. 

ఓ మహారాజా! అప్పుడు శ్రీకృష్ణునితో అర్జునుఁడు తన రథమును ఉభయ సైన్యమునకు మధ్య నిలుపమనెను.

(లేదా)

శ్లో.  అథ వ్యవస్థితాన్దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః |

ప్రవృత్తే శస్త్రసమ్పాతే ధనురుద్యమ్య పాణ్డవః ||1-20||

శ్లో.  హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే |

అర్జున ఉవాచ |

సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేऽచ్యుత ||1-21||

తే.గీ.  యుద్ధసన్నద్ధులై యట నున్న ధార్త

రాష్ట్ర సుతులను గాంచిన ప్రవరుఁడయిన

యర్జునుఁడు తాను హరితోడననియె రథము

సేనలకు మధ్యనిలుపుమంచోనరేంద్ర! 

భావము.    

అప్పుడు నిలబడి ఉన్న దార్తరాష్ట్రులను చూసి కపిధ్వజుడైన అర్జునుడు విల్లు ఎక్కుపెట్టిన 

హృషీకేశుని(హరి)తో ఈ మాట అనెను, 

(అర్జున ఉవాచ)అచ్యుతా ఉభయ సేనలమద్య రథమును నిలుపుము. 

శ్లో.  యావదేతాన్నిరీక్షేऽహం యోద్ధుకామానవస్థితాన్ |

కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే ||1-22||

తే.గీ.  యుద్ధమును చేయఁ గోరుచు నున్నదెవరొ

యెవరితో యుద్ధమును జేయ నెదురు నిలువ

వలెనొ వారినే నే జూడ వలయునిపుడె

యనెను కృష్ణునిఁ జూచుచు నర్జునుండు. 

భావము.  

యుద్ధంచేయగోరి ఎదురు చూస్తూ నిలబది ఉన్న వారిలో నేను ఎవరితో యుద్ధం చేయాలో వారిని చూడాలి                                                                                                                               

శ్లో.  యోత్స్యమానానవేక్షేऽహం య ఏతేऽత్ర సమాగతాః |

ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః ||1-23||

తే.గీ.  దుష్టుఁడగు ధార్తరాష్ట్రుని తోడనుండి

తృప్తిఁ గలిగింప వానికి నాప్తులగుచు

నుండి రిచ్చట, యిచ్చట నున్న నేను

చూడగావలె వారిని చూపు మనెను.

భావము.    

దుర్బుద్ధి కలిగిన దుర్యోదనునికి ప్రియం చేయఁగోరి యుద్ధము చేయుటకు ఎవరెవరు ఇక్కడ  సమావేశమై ఉండిరో 

వాళ్ళను నేను చూస్తాను.                              

సఞ్జయ ఉవాచ |

శ్లో.  ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |

సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ||1-24||

తే.గీ.  భారతా! వినుమనుచును పలికె సంజ

యుండు, విని కృష్ణుఁడా యర్జునుం డనిన ప

లుకులను, రథంబు నిలిపెను ప్రకటితముగ

నుభయ సైన్యంబు మధ్యన నొప్పిదముగ. 

భావము. 

సంజయుడిట్లనెను; అర్జునుని కోరికమీద కృష్ణుడు ఉభయ సేనల మధ్య ఉత్తమమైన  రథమును నిలబెట్టి,

శ్లో.  భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |

ఉవాచ పార్థ పశ్యైతాన్సమవేతాన్కురూనితి ||1-25||

తే.గీ.  ద్రోణ భీష్మాది ముఖ్యుల తోడ నిచట

ఘనుల కనుమంచు సారథి కవ్వడికనె

కౌరవుల సైన్యబలమునుఁ గనులఁ గాంచ,

వ్యూహమునెఱింగి సాగుచు పోవ నెంచి.

భావము. 

భీష్మ, ద్రోణ, మిగిలిన రాజుల ఎదుట నిలబెట్టి, సమావేశమై ఉన్న ఈ కౌరవులను చూడు అన్నాడు. 

శ్లో.  తత్రాపశ్యత్స్థితాన్పార్థః పితౄనథ పితామహాన్

ఆచార్యాన్మాతులాన్భ్రాతౄన్పుత్రాన్పౌత్రాన్సఖీంస్తథా ||1-26||

తే.గీ.  అర్జునుం డటఁ గాంచె తా నపుడు తండ్రు

లను, గురువులను, తన తాతలను సుతులను

మనుమలను తన మేనమామల నెఱింగె,

వారలను మదిఁ గనె తనవారెయనుచు.

భావము. 

అప్పుడు అర్జునుడు తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను,  కుమారులను, మనుమలను 

చూచెను.

శ్లో.  శ్వశురాన్సుహృదశ్చైవ సేనయోరుభయోరపి |

తాన్సమీక్ష్య స కౌన్తేయః సర్వాన్బన్ధూనవస్థితాన్ ||1-27||

తే.గీ.  అర్జునుం డింకయున్ గాంచె నచట నుండి

నట్టి యుభయపక్షంబుల నలరుచున్న

సైనికులనప్పుడా బంధుజనులను మది,

యుద్ధసన్నద్ధులై యున్న యోద్ధతతిని.

భావము. ఇంకా అర్జునుడు, సజ్జనులను, రెండు సేనల మధ్య నిలబడి ఉన్న యావన్మంది  బంధువులను 

సమీక్షించి, 

శ్లో.  కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్

అర్జున ఉవాచ |

దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ||1-28||

తే.గీ.  చూచి ఘన తరంబగు కృపన్  క్షోభ చెంది,

ఘన విషాదంబులో మున్గి, క్షణము నిలిచి,

కృష్ణునిఁ గని పలికెనిటు, కృష్ణ! గాంచ

నుభయ పక్షాల, బంధువులుండిరకట.

భావము. 

అర్జునుడు ఇలాఅన్నాడు; ఉదృతమైన కరుణ ఆవహించగా విషాదంతో ఇలా అన్నాడు. యుద్ధం చేయగోరి 

సమావేశమై ఉన్న నా బంధువులను చూడగా

శ్లో.  సీదన్తి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి |

వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ||1-29||

తే.గీ. కనగ వీరిని, కంపంబు కలుగుచుండె,

శిథిలమగుచుండె దేహంబు, జిహ్వ యెండె,

గగురుపాటును బొందితిఁ గలతఁ జెంది

మనసు దుర్భలమగుచుండె, మాధవుండ!

భావము.

నా అవయవాలు శిధిలమై పోవుచున్నవి, నోరు పోవుచున్నది, నా శరీరం వణుకుచున్నది, రోమాలు నిక్క 

పొడుచుచున్నవి.

శ్లో.  గాణ్డీవం స్రంసతే హస్తాత్త్వక్చైవ పరిదహ్యతే |

న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ||1-30||

తే.గీ.  చేతి గాండీవ మది జారు, భీతి తోడ,

దేహమే మండుచుండెను దేవదేవ!

నిలుచుటకు శక్తి లేదిక, నిలకడ విడి

మతియు భ్రమియించుచుండెను మాధవుండ!

భావము. 

గాండీవం చేతిలోనుండి జారిపోవుచున్నది, వళ్ళు మండుచున్నది, నిలుచుటకునూ ఓపికలేకుండెను. 

మనస్సుభ్రమించుచున్నది.                                                                                                                                 

శ్లో.  నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ |

న చ శ్రేయోऽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ||1-31||

తే.గీ.  కేశవా! దుశ్శకునములు క్షితిని గంటి,

స్వజన హననంబుచేతను ఫలమదేమి

కలుగునో గాంచ లేకుంటి, కమలనయన!

ఇట్టిదుస్స్థితిన్ గడచుటదెట్టులగునొ?.

భావము. 

కేశవా! దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. స్వజనాన్ని చంపుట వలన యేమి మేలు కలిగుతుందో తెలుసుకోలేకుంటిని..

శ్లో.  న కాఙ్క్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ |

కిం నో రాజ్యేన గోవిన్ద కిం భోగైర్జీవితేన వా ||1-32||

కం.  కోరను విజయము, నే నిన్

గోరను రాజ్యంబు, సుఖము, కోరెదఁ జెపుమా

గోరిన రాజ్యము భోగము

నేరీతి ఫలము కలుగును కృష్ణా! కృపతో.

భావము. ఓ కృష్ణా! నేను జయం కోరను, రాజ్యం కాని సుఖాలు కాని కోరను. గోవిందా  రాజ్యం వలన కాని, భోగాల 

వలన కాని, జీవించడం వలన కాని  ప్రయోజనం ఏమిటి.

శ్లో.  యేషామర్థే కాఙ్క్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ |

త ఇమేऽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ||1-33||

తే.గీ.  రాజ్య, సుఖ, భోగములెవరి రంజనకని

కోరుచుంటిమో, వీడిరి వారు సర్వ

సంపదలను, ప్రాణములను,  శాశ్వతముగ,

నిలిచి యుండిరిచ్చోటనే, నీరజాక్ష!

భావము.

ఎవరికోసం మనం రాజ్యాన్ని, సుఖ భోగాన్ని కోరుకుంటామో వారు ప్రాణాలను, సంపదలనుత్యజించి ఇక్కడ 

నిలబడి ఉన్నారు.

శ్లో.  ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః |

మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సమ్బంధినస్తథా ||1-34||

తే.గీ.  తండ్రులున్, మేన మామలు, తాతలు మరి

మామలున్, సుతులును, బావ మరుదులు, వర

లుదురు వియ్యంకు లాచార్యులు మనుమలును,

నిలిచి రిద్ధాత్రి నిచ్చట న్నీవు కనుమ.

భావము. 

ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలూ, మేనమామలూ, మామలూ, మనుమలూ, బావమరుదులూ, 

వియ్యంకులూ మొదలైన వారు.

శ్లో.  ఏతాన్న హన్తుమిచ్ఛామి ఘ్నతోऽపి మధుసూదన |

అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ||1-35||

తే.గీ.  కనుమ మధుసూదనా! నీవు కరుణ వీడి

నన్నుఁ జంపినన్ గాని నే నెన్నటికిని

కల త్రిలోకాధిపత్యంబు కలుగునయినఁ

జంపగాబోను, భూమికై చంపఁగలన?

భావము.

మధుసూదనా; నేను చంపబడినప్పటికీ, త్రిలోక అధిపత్యానికైనా వీరిని  చంపడానికి ఇష్టపడను. ఇక భూలోక 

రాజ్యం కోసం చంపుదునా.

శ్లో.  నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన

పాపమేవాశ్రయేదస్మాన్హత్వైతానాతతాయినః ||1-36||

తే.గీ.  ధార్తరాష్ట్రులఁ జంపిన దాని వలన

సంతసం బేమి కలుగును? సన్నుతాత్మ!

ఆతతాయులం జంపిన నదియు మనకు

పాపఫలమునే యిచ్చును పరమపురుష!

భావము. 

జనార్ధనా! దృతరాష్ట్ర కుమారులను చంపుట వలన మనకి సంతోషమేమి కలుగును? ఆతతాయులను 

చంపినా మనకు పాపమే వచ్చును.                                                                                                                          

శ్లో.  తస్మాన్నార్హా వయం హన్తుం ధార్తరాష్ట్రాన్స్వబాన్ధవాన్ |

స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ||1-37||

తే.గీ. తలప ధార్తరాష్ట్రులఁ జంపఁ దగదు మనకు,

వారు బంధుసమేతులై వరలిరిచట

మన జనంబులన్ చంపిన మనమదెటుల

సుఖము పొందగలారము? సుజనపాల!

భావము.

అందువలన బంధు సమేతులైన దార్తరాష్ట్రులను చంపడం తగదు. మన వాళ్ళను చంపడం వలన మనం ఎలా 

సుఖపడ గలము.

శ్లో.  యద్యప్యేతే న పశ్యన్తి లోభోపహతచేతసః |

కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ||1-38||

తే.గీ. లోభమును జేసి కానరు లోతుగాను,

కులవినాశన కార్యము కొలుపు దోష

ము నిలఁ జేయు మిత్రద్రోహమునకు కలుగు

పాపఫలమది నరకపు కూపముకద.

భావము. 

లోభంచేత తెలివి తప్పిన వీళ్ళు, కులక్షయం వలన కలిగే దోషాన్ని, మిత్ర ద్రోహం వలన కలిగే పాపాన్ని 

చూడలేక పోయినప్పటికీ,

శ్లో.  కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ |

కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ||1-39||

తే.గీ.  ఓ జనార్దనా! కులనాశ మొదవునంచుఁ

దెలిసియున్నట్టి మనమిట్లు తెలివితప్పి

యిట్టిపాపంబు చేయగానేల? చెపుమ,

పాపదూరులమై యుంట పద్ధతి కద.

భావము. 

జనార్దనా! కులక్షయం వలన ఏర్పడే దోషాన్ని తెలిసిన మనం ఈ పాపం నుండి ఎందుకు తొలగ కూడదు?

శ్లో.  కులక్షయే ప్రణశ్యన్తి కులధర్మాః సనాతనాః |

ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోऽభిభవత్యుత ||1-40||

తే.గీ.  కుల వినాశనము వలనకూలిపోవు

మన సనాతన ధర్మము, మహినధర్మ

మున నడుతురుగ పాపులై మన కులజులు

చింతఁ జేయుము నీవును శ్రీకరుండ!

భావము.                                                                                                 

కులక్షయం వలన సనాతనమైన ధర్మం నశించును. 

ధర్మం నశించినపుడు యావత్కులము అధర్మము వైపు తిరుగును.

శ్లో.  అధర్మాభిభవాత్కృష్ణ ప్రదుష్యన్తి కులస్త్రియః |

స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసఙ్కరః ||1-41||

తే.గీ.  వ్యాప్తమగు నధర్మముననే యాడువారు

చెడుదు రద్దానిచేతను చెడును కులము.

వర్ణ సంకరమేర్పడు, వసుధపైన

నీవు చింతింపుమో కృష్ణ! ధీవరేణ్య!,

భావము. 

కృష్ణా! అధర్మం వ్యాపించడంతో కులస్త్రీలు చెడిపోవుదురు. 

కులస్త్రీలు చెడినచో వర్ణసంకరము ఏర్పడును.

శ్లో.  సఙ్కరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ |

పతన్తి పితరో హ్యేషాం లుప్తపిణ్డోదకక్రియాః ||1-42||

తే.గీ. వర్ణ సాంకర్యమగుటచే వర్ణమునకు,

కులవినాశన కారణ కలితులకును

నరకమే గతి, పితరులీ నరకమొందు

దురుదకముపిండ హీనులౌదురు కనంగ.

భావము.

సాంకర్యం వలన కులానికి, కులాన్ని నాశనం చేసినవారికి నరకమే గతి.

వీరి పితరులు పిండోదక క్రియలు లేక నరకములో పడుదురు.

శ్లో.  దోషైరేతైః కులఘ్నానాం వర్ణసఙ్కరకారకైః |

ఉత్సాద్యన్తే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ||1-43||

తే.గీ. వర్ణ సంకర హేతువౌవారిదోష

మునను శాశ్వత కుల ధర్మ ములు నశించు,

జాతి ధర్మంబులు నశించు, ఖ్యాతి చెడును,

దుస్స్థితుల నుండి కాపాడు తోయజాక్ష!

భావము.

వర్ణసంకరానికి కారకులైన కులనాశకుల ఈ దోషాల వలన 

శాశ్వతమైన  జాతి ధర్మాలు, కులధర్మాలు పెకలింపఁ బడును. 

శ్లో.  ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |

నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ||1-44||

కం.  కులధర్మము వీడిన లో

కులు నరకము పొంది మిగుల కుములుదురటగా

కలకాలము, వింటినటుల,

జలజాతేక్షణ! ముకుంద! సజ్జన పూజ్యా!

భావము.

జనార్ధనా కులధర్మాలు తొలగిపోయిన మనుష్యులు కలకాలం 

నరక వాసులగుదురని వింటిమి. 

శ్లో.  అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ |

యద్రాజ్యసుఖలోభేన హన్తుం స్వజనముద్యతాః ||1-45||

ఆ.వె.  అకట! రాజ్య సుఖమునాశించి యిప్పుడు

స్వజనులను వధింప నిజముగానె

సిద్ధపడితిమికద, ఛీ, యెంత పాపంబు

చేయఁ బూనితిమిట, శ్రీముకుంద!

భావము.

అక్కటా! రాజ్య సుఖం కోసము స్వజనమును వధించుటకు సిద్ధమైన 

మనం ఎంతటి మహాపాపానికి ఒడి గట్టుచుంటిమో కదా.

శ్లో.  యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః |

ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్ ||1-46||

తే.గీ.  కన  ప్రతీకార బాహ్యునై కౌరవులను

చంపనెంచక శస్త్రముల్ చయ్యనవిడి

యుండ నన్ గౌరవుల్ సంపిన నది

మేలె నాకెంచగా నిజము, నీల దేహ!

భావము.

ప్రతీకారము చేయక నిరాయుధుఁడనై ఉన్న నన్ను శస్త్రాలు చేపట్టి 

కౌరవులు యుద్ధములో చంపినా, దానివలన నాకు మేలే ఎక్కువ  

జరుగును.

సఞ్జయ ఉవాచ |

సంజయుఁడు ఇట్లు పలికెను.

శ్లో.  ఏవముక్త్వార్జునః సఙ్ఖ్యే రథోపస్థ ఉపావిశత్ |

విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ||1-47||

కందపద్య గర్భ తేటగీతి. 

అని పలికి యర్జునుండట మనమున విల

పించుచు ఖిల మానసుడయి, భీతిని హరి

నుడువులు రథమును విన కను దిగి యమ్ము

లు నిక విల్లు విడిచె, హా మదినికలగుచు

తేటగీతిలో ఉన్న కందపద్యము.. 

అని పలికి యర్జునుం డట 

మనమున విలపించుచు ఖిల మానసుడయి, భీ

తిని హరి నుడువులు రథమును 

వినకను దిగి, యమ్ములు నిక విల్లు విడిచె, హా!

భావము. 

సంజయుడు ఇట్కుపలికెను; అర్జునుడు ఇట్లు పలికి శోకముతో 

నిండి యున్న మనస్సుతో యుద్ధభూమిలో బాణాలతో సహా

ధనస్సుని వదిలి రథము వెనుక భాగములో కూర్చొనెను.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

అర్జునవిషాదయోగో నామ ప్రథమో உధ్యాయః ||1|









రెండవ అధ్యాయం 

సాంఖ్యయోగం

సంజయ ఉవాచ:

సంజయుడుఅనుచుండెను.

శ్లో. తం తథా కృపయావిష్ట మశ్రుపూ ర్ణాకులేక్షణమ్ |

విషీదం త మిదం వాక్య మువాచ మధుసూదనః || 2-1 ||

తే.గీ.  కలతఁ జెందుచు కన్నీరు కార్చుచున్న

యర్జునుని జూచి శ్రీకృష్ణుఁడనియెనిట్లు. 

మానవాళికి మార్గంబు మహిత గతిని

జీవనము సాగ గీతను చెప్పఁ బూని.

భావము.

దయామయుడైన అర్జునుడు కన్నీరు కార్చుచుండగా శ్రీ కృష్ణపరమాత్మ ఇట్లు అనెను.

శ్రీ భగవానువాచ:

శ్రీకృష్ణుఁడనుచుండెను.

శ్లో. కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితమ్ |

అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున || 2-2 ||


తే.గీ.  ఆర్యధర్మ విరుద్ధంబు, ననుచితమగు

ఘోరమైనట్టి యపకీర్తి కోరుకొనెడి

నరక దుష్ప్రాప్తిహేతువౌ దురిత బుద్ధి

పొడమె నీకెట్టు లర్జునా? మూర్ఖుఁడవొకొ? 

భావము.

అర్జునా! ఈ సంక్లిష్ట సమయంలో ఆర్యధర్మ విరుద్ధమూ, అపకీర్తి దాయకమూ, నరకప్రాప్తి హేతువూ అయిన ఈ పాడుబుద్ధి నీ కెందులకు పుట్టినది?

శ్లో.  క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |

క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప || 2-3 ||

తే.గీ.  పొందకను ధైర్య మిటను నపుంసకునటు,

తగదు నీకిది, వీడుట తగు నధౌర్య

మునిక, హృదయపు దౌర్భల్యమును త్యజించు,

యుద్ధమును జేయ నీవింక సిద్ధమగుము.

భావము.

నపుంసకుడిలాగ అధైర్యం పొందకు. ఇది నీకు పనికిరాదు, మనోదౌర్బల్యము నీచమయినది. దానిని విడిచిపెట్టు. నీవు శత్రుమర్దనుడవు కదా! యుద్ధము ప్రారంభించుము.

అర్జున ఉవాచ:

అర్జునుఁడు ఇట్లు పలికెను.

శ్లో.  కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన |

ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన || 2-4 ||

తే.గీ. మహిత మధుసూదనా! నేను మహితులయిన

ద్రోణ భీష్మాది యోధులతోఁ దెగించి

యుద్ధమెట్టులఁ జేయుదు నుజ్జగించి

పెద్దలయెడ గౌరవమును? వద్దువద్దు.

భావము.

అర్జునుడు : మధుసూదనా! పూజార్హులైన భీష్మ ద్రోణాదులను బాణాలతో నేనేవిధముగా కొట్టగలను? 

శ్లో.  గురూనహత్వాహి మహానుభావాన్

శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే |

హత్వార్థకామాంస్తు గురూనిహైవ

భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ || 2-5 ||

తే.గీ.  మహితులైనట్టి గురువులన్ మడియఁ జేసి,

రక్తసిక్తంపురాజ్య సంప్రాప్తమవగ

పాలనము సేసి బ్రతుకుట పాడియగునె,

దీనికన్నను భిక్షాన్నమే నయమిల. 

తే.గీ.  మహిత గురువులన్  వధియించి మనుట శ్రేయ

మవదుగ, కన రక్త కలిత మయిన రాజ్య

భోగముల కంటె బ్రతుకఁగ ముష్టి మేలు.

పాపమును తిని బ్రతుకుట పాడి యగునె?

భావము.

మహానుభావులైన గురువులను చంపడం శ్రేయస్కరము కాదు. వారిని సంహరించి రక్తసిక్తములైన రాజ్యభోగములు అనుభవించుట కంటే బిచ్చమెత్తుకొనుట మేలు.

శ్లో.  న చైతద్విద్మః కతరన్నో గరీయో

యద్వా జయేమ యది వా నో జయేయుః |

యానేవ హత్వా న జిజీవిషామః

తే௨వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః || 2-6 ||

తే.గీ.  యుద్ధమును చేయుటొప్పౌనొ? యొప్పు కాదొ?

యెఱుఁగ లేకుంటి, విజయంబదెవరికగునొ

తెలియ దెవరిని జంపిన దృప్తిఁ గనుదొ

వారె యెదురుగనుండిరి నీరజాక్ష! 

తే.గీ. రణ ఫలంబది గ్రహియింప రాదు నాకు,

జయమొ, యోటమియో చెప్పఁ జాలముకద

యెవరినివధించిన విరక్తి నెరయును మది

నదిగొ ధార్తరాష్ట్రులిచటనెదుట కలరు.

భావము.

యుద్ధం చేయడం మంచిదో కాదో తెలియుట లేదు. మనము జయింతుమో, వారు జయింతురోచెప్పలేము. ఎవరిని చంపితే మనకు జీవితం మీద విరక్తి కలుగునో ఆ ధార్తరాష్ట్రాదులే ఎదురుగా ఉండిరి. 

శ్లో.  కార్పణ్యదోషోపహతస్వభావః

పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః |

యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే

శిష్యస్తే௨హం శాధి మాం త్వాం ప్రపన్నమ్ || 2-7 ||

కం.  గురువులు బంధువులనుచును

దరగని మమకారమునను తరిగెను జ్ణానం

బరయుచు మార్గము చూపుము

గురువుగ నీ శిష్యునకును గోవింద! కృపన్.

భావము.

గురువులూ బంధువులూ అనే మమకార దోషంవల్ల నాబుద్ధి నశించినది. మంచి ఏదో చెడు ఏదో తెలియుట లేదు. 

శిష్యుడిగా నిన్ను ఆశ్రయించిన నాకు ఏది శ్రేయోమార్గమో దానిని ఆదేశించుము.

శ్లో.  న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్

యచ్ఛోక ముచ్ఛోషణమింద్రియాణామ్ |

అవాప్య భూమావసపత్నమృద్ధం

రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ || 2-8 ||

తే.గీ.  ఆధిపత్యంబు భువిని నాకమరవచ్చు

నట్లె స్వర్గాధిపత్యమే యమరవచ్చు

నైనగాని సచ్ఛాంతి నాకమరఁబోవ

దలముకొనియున్న దుఃఖంబు తొలఁగిపోదు.

భావము.

భూలోకాధిపత్యం లభించినా, స్వర్గాధిపత్యం సిద్ధించినా నా శోకం తగ్గుతుందనుకోను.

సంజయ ఉవాచ:

సంజయుఁడనుచుండెను.

శ్లో.  ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప |

న యోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవ హ || 2-9 ||

తే.గీ.  ఇట్లు శ్రీకృష్ణునుని తోడ నెఱుకపడగ

నర్జునుఁడు తన భావన ననుపమముగఁ

దెలిపి యుద్ధము చేయక నిలిచె నకట,

మొద్దుబారిన మదితోడ భూమిపైన.

భావము.

అర్జునుడు శ్రీకృష్ణుడితో ఆవిధముగ చెప్పి యుద్ధము చేయనని ఊరకుండెను.

శ్లో.  తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత |

సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః || 2-10 ||

తే.గీ.  రెండు సేనలమధ్యలో నుండి యున్న 

దుఃఖ తప్తుఁడౌ యర్జునున్ దురిత హరుఁడు

మురహరి కనుచు పరిహాసముగను బలికె

జ్ణాన సంపూర్ణ సద్భాసమాన ముఖుఁడు.

భావము.

రెండుసేనల మధ్య విషాదవశుడైయున్న అర్జునుని చూచి శ్రీ కృష్ణపరమాత్ముఁడు పరిహాసముగా ఈ విధముగా అనెను.

శ్రీభగవానువాచ

శ్రీకృష్ణభగవానుడిట్లనుచుండెను.

శ్లో.  అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |

గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః || 2-11 ||

తే.గీ.  నీవు దుఃఖించు చుంటివి నేడు పార్థ!

యవసరము లేని వారికై, యనవసరము,

జ్ణాని వలెఁ బల్కుచుంటివి చనిన, యున్న

వారికొఱకు దుఃఖింపరు ప్రతిభు లిలను.

భావము.

అర్జునా! దుఃఖించనవసరం లేనివాళ్ళకోసం దుఃఖించుచున్నావు. పైగా మహావివేకి వలె  మాట్లాడుతున్నావు. చచ్చిపోయినవారినిగురించికాని, బ్రతికున్నవారిని గురించి కాని వివేకులు శోకించరు.

శ్లో.  న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః |

న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ || 2-12 ||

కం.  భావింప వీరు నేనును

నీవుఁ గనఁగ నుందుముకద నేడును రేపున్

నీవేలఁ దెలియకుంటివి?

నీవిది గ్రహియింప వలయు నేర్పరివగుచున్.

భావము.

నీవూ నేనూ వీళ్ళంతా గతంలోనూ వున్నాము. భవిష్యత్తులో కూడా ఉంటాము.

శ్లో.  దేహినో௨స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా |

తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి || 2-13 ||

కం. జీవుని కిల కౌమారము

యౌవనవార్ధక్యములవి యరయుచు దేహం

బే వదలి మరల పుట్టును,

జీవము దుఃఖింపదు కద క్షితి నెన్నినచో.

భావము.

జీవుడికి ఈ శరీరంలో కౌమారం, యౌవనం, వార్థక్యం వచ్చినట్లే మరణానంతరం మరో శరీరం వస్తుంది. ఇందుకు ధీరుడు దుఃఖించడు.

శ్లో.  మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః |

ఆగమాపాయినో௨నిత్యాః తాం స్తితిక్షస్వ భారత || 2-14 ||

తే.గీ.  విషయవశమైన యింద్రియా లసదృశమగు

సుఖము దుఃఖములను తేలుచున్ జరింప

వే, యశాశ్వత మింద్రియ విషయముల క

లయిక, బాధలనుసహించు ప్రియ నరుండ!

భావము.

కుంతీ పుత్రా! విషయాలకు వశమైన ఇంద్రియాలవల్ల శీతోష్ణాది గుణాలూ,సుఖదుఃఖాలూ కలుగుతుంటాయి. కోరికలకూ, ఇంద్రియాలకూ కలయిక అశాశ్వతం. కనుక 

శ్లో.  యం హి న వ్యథయన్త్యేతే పురుషం పురుషర్షభ |

సమదుఃఖసుఖం ధీరం సో௨మృతత్వాయ కల్పతే || 2-15 ||

కం. పురుష శ్రేష్టుఁడ! యెవడిల

నిరుపమ సుఖ దుఃఖములు గణించు సమముగా

వెరపున ద్వంద్వములంటవు,

వరధీరుఁ డతం డమృతము వడయగ నొప్పున్.

భావము.

పురుషశ్రేష్టుడా! సుఖదుఃఖాలలో సమముగా ఉండే ఏ ధీరుణ్ణి ద్వంద్వాలు బాధించవో అతఁడు అమృతత్వానికి అర్హుఁడు అగును.

శ్లో.  నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః |

ఉభయోరపి దృష్టో௨న్తః త్వనయో స్తత్త్వదర్శిభిః || 2-16 ||

తే.గీ.లేనిదుండ దాయున్నది లేకపోదు

భువిని తత్వజ్ణులెఱుఁగుదురవి జగాన,

నీవు తత్వజ్ణుఁడవు పార్థ! భావనమునఁ

దెలిసికొమ్మిది, నిజమును దెలియవలయు.

భావము.

లేనిది ఎప్పటికీ వుండదు. ఉన్నది ఎప్పటికీ లేకపోదు. ఈ రెండింటి నిర్ణయం తత్వజ్ఞులకే తెలియును.

శ్లో.  అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ |

వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్‌కర్తుమర్హతి || 2-17 ||

తే.గీ.  ఆత్మ విశ్వంబునంతటన్ వ్యాప్తమయిన

వస్తు వని గ్రహియింపుము పార్థ! నీవు,

నాశనము లేని దయ్యది నరుఁడ! తెలియ,

చేయనేర రంతమవ దానిఁ, జెడని దదియె.

భావము.

ఈ విశ్వమంతటా వ్యాపించియున్న ఆత్మ అనే వస్తువు నాశనము లేనిది. దానినెవరూ అంతము చేయలేరు.

శ్లో.  అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః |

అనాశినో௨ప్రమేయస్య తస్మాద్యుద్ధ్యస్వ భారత || 2-18 ||

తే.గీ.  నాశనము లేని యాత్మకు నీ శరీర

మెన్నగా శాశ్వతము కాదు, కన్నుఁ దెరిచి

యాత్మయే నిత్యమని నమ్ముమయ్య పార్థ!

యుద్ధమును జేయ నీవింక సిద్ధమగుము.

భావము.

నాశనం లేని ఆత్మకు ఈ శరీరాలు శాశ్వతాలు కావు. ఆత్మ ఒక్కటే నిత్యం. కనుక ఓ భారత వీరా! యుద్ధం మొదలు పెట్టు.

శ్లో.  య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్ |

ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే || 2-19 ||

తే.గీ.  చంపునాత్మయనుచు, నాత్మ చంపఁబడున

నుచును మూర్ఖులనుచునుం ద్రనుపమముగను,

చంపఁబోవదాత్మయు తాను చంపఁబడదు

తెలియవలయునిదియె నీవు తెలివిఁ గలిగి.

భావము.

ఈ ఆత్మ చంపుతుందని కాని, చంపబడుతుందని కాని భావించే 

వాళ్ళిద్దరూ అజ్ఞానులే. ఆత్మ చంపునది కాని చచ్చునది కాని కాదు.

శ్లో.  న జాయతే మ్రియతే వా కదాచిత్

నాయం భూత్వా భవితా వా న భూయః |

అజో నిత్యః శాశ్వతో௨యం పురాణో

న హన్యతే హన్యమానే శరీరే || 2-20 ||

తే.గీ.  జనన మరణముల్లేనిది, సతము కలది,

జన్మరాహిత్య శాశ్వత సంస్థితమది

యాత్మ, నశియింపబోవదనంతమదియు

దేహమంతమైపోయినన్ దేహి నిలుచు.

భావము.

ఆత్మకు పుట్టుట చాచ్చుట అనునవి లేవు. అది ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు లేకపోవడం జరగదు. జన్మరహితమూ, శాశ్వతమూ, అనాది సిద్ధమూ అయిన ఆత్మ నిత్యము. అందువలన శరీరమును నాశనము చేసినను అందులోని ఆత్మ మాత్రము చావదు.

శ్లో.  వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |

కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ || 2 .  21|| 

తే.గీ.  చావుపుట్టుకల్ లేనిదై శాశ్వతమయి

యుండునాత్మ యంచెఱిగిన నోపునెవఁడు 

చంపగను దాని దానిచేఁ జంపఁజేయ?

పార్థుఁడా! నీ వెఱుఁగవొకొ? పద్ధతినిట. 

భావము.

పార్థా ! ఆత్మ నాశనరహితమనీ, చావు పుట్టుకలు లేనిదనీ, శాశ్వతమైనదనీ  తెలుసుకున్నవాఁడు  ఎవరినైనా ఎలా చంపుతాడు?ఎలా చంపిస్తాడు?

శ్లో.  వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో௨పరాణి |

తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ  || 2 .  22|| 

తే.గీ.  ప్రాత చిరిగిన వస్త్రమున్ వదిలిపెట్టి

నూతనంబైన వస్త్రమున్ దొడుగునటుల,

శిధిలదేహంబు వీడుచు జీవుఁ డటులె

క్రొత్త దేహంబులో చేరి కుదురుకొనును.

భావము.

మానవుడు చినిగిపోయిన పాతబట్టలను విడిచిపెట్టి క్రొత్తబట్టలు వేసుకున్నట్లే ఆత్మ కృశించిన  శరీరములను వదలి కొత్త దేహములు పొందును.

శ్లో.  నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |

న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః || 2 - 23 || 

తే.గీ.  అగ్ని కాల్చగ లే దాత్మ నరసి చూడ,

శస్త్రములు చీల్చలేవు, ప్రశస్తమయిన

నీరు తడుపంగలే, దిక ఘోరమైన

గాలి యారగాఁ జేయలేదే లయింప

భావము.

ఈ ఆత్మను ఆయుధములు నరకలేవు; అగ్ని కాల్చలేదు; నీరు తడుపలేదు; గాలి ఎండబెట్టలేదు.

శ్లో.  అచ్ఛేద్యో௨యమదాహ్యో௨యమక్లేద్యో௨శోష్య ఏవ చ |

నిత్యః సర్వగతః స్థాణురచలో௨యం సనాతనః || 2-24 || 

తే.గీ.  ఆత్మ ఖండింపఁబడని దీవరసి చూడ,

కాలదగ్నికి, తడవదు కనగ నీటి

కి నిల నెండదు, నిత్యము, వినగ శాశ్వ

తంబ దచలమునయి, సనాతనమెఱుంగ,.

భావము.

ఆత్మ ఖండించరానిది, కాలనిది, తడవనిది, ఎండనిది; అది నిత్యము, సర్వవ్యాప్తం, శాశ్వతము, చలనరహితము, సనాతనము అయినది.

శ్లో.  అవ్యక్తో௨యమచింత్యో௨యమవికార్యో௨యముచ్యతే |

తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి || 2-25 ||

తే.గీ.  ఇంద్రియముల కగోచర మెన్న నాత్మ,

మనసు కందద దవికారి, మదిని యాత్మ

తత్వ మెఱుఁగుము నీవిక తలచి గలుగు

చింత వీడుము, బాధ్య తావంత కనుము.

భావము.

ఆత్మ జ్ఞానేంద్రియాలకు గోచరించదు. మనస్సుకు అందదు. వికారాలకు గురికాదు. ఈ ఆత్మతత్వము తెలుసుకొని నీవు విచారించుట మానుకొనుము.

శ్లో.  అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ |

తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి || 2-26 || 

తే.గీ.  పార్థ! దేహంబుతోఁ బాటు వరలుచున్న

యాత్మకున్ జావు పుట్టుక లలరు ననుచు

నీవు భావించుచున్నను, ధీవరేణ్య!

మదిని శోకింపఁ బనిలేదు మృదుల హృదయ!.

భావము.

అర్జునా ! శరీరముతోపాటు ఆత్మకు కూడా సదా చావు పుట్టుకలుంటాయని భావిస్తున్నప్పటికీ నీవిలా శోకించవలసిన పనిలేదు.

శ్లో.  జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |

తస్మాదపరిహార్యే௨ర్థే న త్వం శోచితుమర్హసి || 2 . 27 || 

కం.  పుట్టిన మరణము తప్పదు

పుట్టుట తప్పదు మరణము పొందినచో,  నే

జట్టియు మార్చగ లేడిది,

యిట్టుల దుఃఖింపఁ దగ దిదేల నెఱుఁగవో?

భావము.

పుట్టిన వానికి చావు తప్పదు. చచ్చిన వానికి పుట్టుక తప్పదు. తప్పించరాని ఈ విషయంలో తపించనవసరం లేదు.

శ్లో.  అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత |

అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. || 2 . 28 || 

కం.  పుట్టక పూర్వము తెలియదు

గిట్టిన పిదపను తెలియదు కించిత్తయినన్.

బుట్టిన జీవిని గూర్చి మ

రిట్టుల యీ మధ్యము కని యేలను చింతల్? 

భావము.

జీవులు పుట్టుకకు పూర్వం కాని, మరణానంతరం కాని ఏ రూపంలో వుంటాయో తెలియదు. మధ్యకాలంలో మాత్రమే కనబడుతాయి. అర్జునా ! అందువలన విచారమెందుకు?

శ్లో.  ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం

ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః |

ఆశ్చర్య వచ్చైనమన్యః శృణోతి

శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ || 2-29 ||

తే.గీ.  అచ్చెరువుగాను కను నొకండాత్మనెంచి,

చిత్రముగ బల్కు నొక్కండు చింతఁ జేసి,

వింతగా నొక్కఁ డాత్మను వినుచు నుండు,

నొక్కడున్ దెలియఁగ నేర డక్కజమిది.

భావము.

ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూచుచుండును. ఇంకొకడు దీనిని గురించి విచిత్రముగా  మాటలాడుచుండును. మరొకడు వింతగా వినుచుండును. అయితే ఈ ఆత్మ స్వరూపస్వభావాలు తెలుసుకున్న వాడు ఒక్కడూ లేడు.

శ్లో.  దేహీ నిత్యమవధ్యో௨యం దేహే సర్వస్య భారత |

తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి || 2-30 ||

తే.గీ.  అన్ని దేహంబు లందుండు నాత్మ కరయ

మరణ ముండదు, దీనికై మదిని దలచి

వగచుటెందుల కో పార్థ! ప్రాణులకయి,

వీడుమజ్ఞానమును నీవు, వీడు చింత.

భావము.

అన్ని దేహాలలోనూ వుండే ఆత్మకు చావు అనెడిది లేదు. అందువలన ఈ ప్రాణులను గూర్చి నీవు దుఃఖించనక్కరలేదు.

శ్లో.  స్వధర్మమపి చావేక్ష్య న వికమ్పితుమర్హసి |

ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయో௨న్యత్ క్షత్రియస్య న విద్యతే || 2-31 ||

తే.గీ.  నీదు ధర్మంబుఁ గనియైన నీవు జంకు

వీడఁగాఁ దగు, యుద్ధంబు వీరవృత్తి

క్షత్రియోత్తమ! యిది నీవు కానలేవొ?

ధర్మబద్ధంపు వర్తన తగును నీకు. 

భావము.

నీ ధర్మాన్ని తెలుసుకుని అయినా నీవు జంకకు. ఎందుకనగా క్షత్రియునికి ధర్మయుద్ధమును మించిన మహాభాగ్యం మరొకటి లేదు.

శ్లో.  యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ |

సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశమ్ || 2-32 ||

తే.గీ.  తెరచి యున్న స్వర్గ ద్వార మరయ యుద్ధ

రంగము,  లభియించెను నీకు బెంగదేల?

పుణ్యఫలమిది కనగ నపుణ్యులకిల

దొరకబోదని గ్రహియించు మరసి నీవు.

భావము.

తెరచివుంచిన స్వర్గద్వారం లాంటి ఈ సంగ్రామం నీకు అప్రయత్నంగా లభించింది. ఇట్టి సదవకాశం పుణ్యం చేసుకున్న క్షత్రియులే పొందఁగలుగుదురు.

శ్లో.  అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి |

తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి || 2-33 ||

తే.గీ.  చేయుమీ ధర్మ యుద్ధము చేయకున్న

కులపు ధర్మము వీడినన్ గూళవగుదు

పేరు ప్రఖ్యాతులన్ బాపు భీరువగుదు,

పాపివగుదు వర్జున! నీవు పరువు పోవు.

భావము.

నీవు ఈ ధర్మయుద్ధము చేయకపోయినచో నీ కులధర్మమూ, పేరు ప్రఖ్యాతులూ పాడుచేసి పాపం  కట్టుకొందువు.

శ్లో.  అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే௨వ్యయామ్ |

సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే || 2-34 ||

తే.గీ.  అంత మాత్రమే కాదయ, వింతగాను,

నీకుఁ గలిగిన యపకీర్తి లోకమందుఁ

జెప్పుకొందురు లోకులు, చింత చేయ

మరణమే కద యపకీర్తి మాన్యులకును.

భావము.

అంతే కాకుండా నీ అపకీర్తిని ప్రజలు చిరకాలం చెప్పుకుంటారు. పరువు  ప్రతిష్ఠలున్నవానికి  అపనిందకంటే మరణమే మంచిది.

శ్లో.  భయాద్రణాదుపరతం మంస్యన్తే త్వాం మహారథాః |

యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ || 2-35 ||

కం.  వీరాగ్రేసరునిగ నిను

గౌరవముగఁ జూచువారు గాంచుదు రికపై

భీరువనుచు చులకనగా,

పోరాములవేల ధీరపుంగవ నీకున్?

భావము.

ఇన్నాళ్ళూ నిన్ను మహావీరుడిగా గౌరవిస్తున్న వాళ్ళంతా, భయపడి యుద్ధం మానేశావని భావించి చులకనగా చూస్తారు.

శ్లో.  అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవా௨హితాః |

నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ || 2-36 ||

తే.గీ.  నీ పరాక్రమమును గూర్చి నీదు రిపులు

చెడుగ పల్కుచు నిందింత్రు, చేవలేని

వాని వలె నుండ సాధ్యమా? దీనముగను

దుఃఖితులమయి పార్థుఁడా! తోచలేదొ?

భావము.

నీ శత్రువులు నీ పరాక్రమాన్ని నిందించుచు అనరాని మాటలెన్నో అందురు. అంతకుమించిన  దుఃఖమేమున్నది?

శ్లో.  హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ |

తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః || 2-37 ||

తే.గీ.  యుద్ధరంగంబులో మృతి యొసగు ముక్తి,

జయము పొందిన రాజ్యంపు సౌఖ్యమబ్బు,

నర్జునా యిది నీ మది నరయవేల?

యుద్ధసన్నద్ధుఁడుగ నగు మొప్పుగాను

భావము.

అర్జునా ! ధర్మయుద్ధములో మరణించిన స్వర్గము పొందుదువు. శత్రువులను జయించిన రాజ్యభోగములు  అనుభవింతువు. అందువల్ల కృతనిశ్చయంతో యుద్ధమునకు నడుంబిగించుము.

శ్లో.  సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జాయాజయౌ |

తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి || 2-38 ||

తే.గీ.  సుఖము దుఃఖము నొకటిగ చూడు పార్థ!

లాభనష్టంబులఁ గన వలయు నటులనె,

యపజయంబైన జయమైన నటులె గనుము,

యుద్ధమునకు సన్నద్ధమై యొప్పుమయ్య.

భావము.

సుఖదుఃఖములూ, లాభనష్టములూ, జయాపజయములూ సమానముగా భావించి సమరము సాగించుము. అప్పుడు నీకు పాపము కలగదు.

శ్లో.  ఏషా తే௨భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు |

బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి || 2-39 ||

తే.గీ.  ఆత్మతత్వమ్ము సాంఖ్య మతానుసార 

మీకు వివరించి చెప్పితి ప్రాకటముగ. 

కర్మయోగంబుఁ దెలిపెద కలిగియున్న

బంధనము లాత్మ వీడగా, పార్థ! వినుము.

భావము.

పార్థా ! ఇంతవరకూ నీకు సాంఖ్యమతానుసారము ఆత్మతత్వమును గూర్చి చెప్పితిని. ఇక సంసారబంధము వదులుకొనిటకు సాధనమైన నిష్కామ కర్మయోగమును గూర్చి చెప్పెదను వినుము.

శ్లో.  నేహాభిక్రమనాశో௨స్తి ప్రత్యవాయో న విద్యతే |

స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ || 2-40 ||

తే.గీ.  కర్మయోగమారంభించి కడవరకును 

చేయకున్నను, యేకొద్ది చేసిన నది

వ్యర్థమయిపోదు,చక్కగా సార్థకమగు,

కలుగు సంసారభయమును దొలఁగఁ జేయు.

భావము.

ఈ కర్మయోగము ప్రారంభించి, పూర్తి చేయలేకపోయినా వ్యర్ధముగా పోదు; దోషము లేదు. ఏ కొద్దిగా ఆచరించినా ఈ యోగం దారుణమైన సంసారభయము నుండి కాపాడును.

శ్లో.  వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన |

బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో௨వ్యవసాయినామ్ || 2-41 ||

తే.గీ.  నిశ్చయాత్మక బుద్ధి సన్నిశ్చితముగ

నుండునెల్లప్పుడున్, వేరె యుండఁబోవ

దస్థిరమగు సంకల్పుల నరసి చూడ

వార లస్థిరాలోచనల్ పరుగు పెట్టు.

భావము.

కురునందనా ! నిశ్చయాత్మకమైన బుద్ధి ఒకే విధంగా వుండును. స్థిరసంకల్పము లేనివారి  ఆలోచనలు పరిపరివిధములుగా పరుగులుపెట్టును.

శ్లో.  యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః |

వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః || 2-42 ||

తే.గీ. వైదికులమంచు నల్పజ్ణు లీ దివిసుఖ

లేశమును గని యన్యము లేదనుచును

పుష్పితంబగు వాక్కులు భువిని పలుకుఁ,

దత్ పరంబును గానరు, తలపఁ బార్థ!

భావము. :

ఓ పృథాకుమారా! వేదములను అనుసరించుచుంటిమని చెప్పువారు వేరొక్కటి లేదనివాదింతురు అల్పజ్ఞానముగల మానవులు ఈపుష్పితమగువాక్కును చెప్పుదురు.

శ్లో.  కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ |

క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి || 2-43 ||

ఆ.వె.  గొప్ప జన్మ నెంచి, కూర్మితో స్వర్లోక

మొంద నెంచి, పదవులంద నెంచి,

చేయఁ దగిన క్రియలు చెప్పెను వేదమే.

అట్టి మాట లల్పు డనుసరించు.

ఆ.వె.  వేదవాక్కులనుచు  వేరేమి లేదంచు

భోగ వాంఛితుండు పొందఁ జేయు.

పుణ్యఫలము తరుగ పుడమిపై జనియించు,

ముక్తిపొంద తా నయుక్తుఁడెంచ. 

భావము. :

స్వర్గలోకప్రాప్తి, ఉత్తమజన్మము, అధికారము వంటివానిని పొందుటకై వివిధములైన కర్మలను ఉపదేశించు వేదములందలి మధురమైనవాక్కుల యెడ అల్పజ్ఞులు అనురక్తులగుదురు. భోగానుభవమును మరియు సంపన్న జీవితమును కోరువారగుటచే అట్టివారు దానికి మించినది వేరొకటి లేదని పలుకుదురు.

శ్లో.  భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్ |

వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే || 2-44 ||

తే.గీ.  భోగములయెడను, విలాస ములయెడలను

నిరుపమాసక్తులకు బుద్ధి నిలువనేర

దరయ నిశ్చయమొనరదయ, నిజ మిదియె,

అర్జునా,! నాదు మాటల నాదరించు.

భావము. 

భోగములు, విలాసముల పట్ల,  మిక్కిలి మమకారాసక్తి ఉన్నవారికి దాని వలన  దిగ్భ్రమచెందిన బుద్దితో  నిశ్చయమైన బుద్ది సాఫల్యం  కాదు. అది స్థిరముగ  నిలువదు.

శ్లో.  త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున |

నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ || 2-45 ||

తే.గీ.  వేదములుగుణత్రయముల ప్రీతిఁ గొలుపు

కర్మకాండను వివరించుఁ, గాన పార్థ!

తలఁపఁ బోవకు వాటికై ద్వంద్వరహిత

శుద్ధ సత్వగుణుండవైశోభిలుమిల.

భావము.

అర్జునా ! వేదములు సత్వ రజ స్తమములను మూడుగుణములు కలిగిన కర్మకాండలను వివరించును.  నీవు త్రిగుణములనూ విడిచిపెట్టి, ద్వంద్వములు లేనివాడవై యోగక్షేమములు కోరకుండా శుద్ధ సత్వగుణము అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి.

శ్లో.  యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే |

తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః || 2-46 ||

తే.గీ.  ఎవరు వర నదీజలములకేగనెంత్రు

వారు బావి నీటి కొఱకు పోరు తెలియ,

బ్రహ్మసుజ్ణానమరసెడివారు ప్రతి ఫ

లముల నిచ్చు వేదములకిల నరుగరుగ.

భావము.

నదినుంచి నీరుతెచ్చుకొనెడివారు నూతికి యే విధముగా ప్రాముఖ్యమివ్వరో ఆ విధముగనే బ్రహ్మజ్ఞానులు ప్రతిఫలాపేక్షతో కూడిన వేదకర్మలకు ప్రాధాన్యత ఇవ్వరు.

శ్లో.  కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |

మా కర్మఫలహేతుర్భూః మా తే సంగో௨స్త్వకర్మణి || 2-47 ||

తే.గీ.  కర్మ చేయుటకర్హత కలదు నీకు,

కర్మఫలముపై నర్హత కలుగ దీకు,

కర్మఫలముల హేతువు కావు నీవు,

కర్మచేయుటమానకు ధర్మమిదియె.

భావము.

వేదాదులచే విదింపబడిన కర్మను చేయుటకే నీకు అర్హత కలదు. కాని కర్మఫలముల యందు  ఎట్టి అధికారమును లేదు. నీవే కర్మఫలములకు హేతువని  ఎప్పుడునూ భావింపకుము. ధర్మమును నిర్వహింపకుండనుండుట  యందు ఎప్పుడునూ ఆసక్తుడవు కాకుము

శ్లో.  యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ |

సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే || 2-48 ||

తే.గీ.  సఖుఁడ! విజయాపజయములన్  సమముగఁ గను,

మహిత సమభావమున ధర్మ మార్గముననె

నిర్వహింపు నీ ధర్మము,నిర్మలమతి

నిదియె యోగము, కనుమిది ముదముతోడ.

భావము.

ఓ అర్జునా! జయాపజయములందు ఆసక్తి విడిచి నీవు సమ భావముతో స్వధర్మమును నిర్వహింపుము. అట్టి సమభావమే యోగమనబడును.

శ్లో.  దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ |

బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః || 2-49 ||

తే.గీ.  భక్తినొనరించి సత్కర్మ, వదలు మహిత

హీన కర్మలన్, గోరుచున్ హృద్యముగను

శరణు వేడుము, హీనులాశలను మునిగి 

ఫలము లాశింత్రు, నీవటుల్ వలదు పార్థ! 

భావము.

ధనంజయా! భక్తియుక్తమైన సేవచే హీనములైన కర్మములన్నింటినీ దూరముగా వదులుము. తృష్ణచైతన్యముతో భగవంతుని శరణు పొందుము. కర్మఫలములను  అనుభవింపగోరువారు లోభులు.

శ్లో.  బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే |

తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ || 2-50 ||

కం.  సమ భావన కల మహితులు

ప్రముదంబున విడుతురిటనె పాపము పుణ్యం

బమలిన! నీవు నటులనే,

గమనింపుచుఁ జేయు, మిదియె కన యోగమగున్.

భావము.

సమభావన కలిగిన పురుషుడు పుణ్యపాపములు రెండింటినీ ఈ లోకముననే వదిలివేయుచున్నాడు. కనుక  సమత్వబుద్ధి అయిన నిష్కామకర్మనే నీవు ఆచరించుము. కౌశలముతో కర్మలు చేయడమే యోగమని తెలుసుకొనుము.

శ్లో.  కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః |

జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ || 2-51 ||

తే.గీ.  భువి మనీషులు కర్మ జ పుణ్యపాప 

ఫలములాశ చేయక కర్మ బంధనములు

విడిచి సన్ముక్తి నొంద భావింతు రటులె

చేయగాఁ దగుఁ బార్థుఁడా! సిద్ధమగుము.

భావము.

నిష్కామయోగులు కర్మఫలం ఆశించకుండా జన్మబంధాలనుంచి తప్పించుకుని, ఉపద్రవములేని మోక్షము పొందుచుండిరి

శ్లో.  యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి |

తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ || 2-52 ||

తే.గీ.  మోహ కలిలమున్ నీ బుద్ధి పూర్తిగాను

దాటిపోవునో యప్పుడు తప్ప కీవు

వినఁబడిన వినదగినట్టి విషయములయె

డను విరక్తిని పొందుదువు నుతముగను

భావము.

నీ బుద్ధి అజ్ఞానమనే కల్మషాన్ని అధిగమించినప్పుడు నీకు విన్న విషయములూ, వినబోయే అర్థములూ విరక్తి కలిగించును.

శ్లో.  శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా |

సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి || 2-53 ||

తే.గీ.  అర్థవాదముల్ పెక్కుగా నాలకించి                                        

సంచలించిన నీ మది సన్నుతముగ         

నిశ్చలస్థితిపొందిన నిశ్చయముగ                                                                            

నాత్మసుజ్ణానమునుపొంది యలరఁగలవు.                                             

భావము.                                                                                                  

అర్థవాదములు అనేకము వినుట వలన చలించిన నీ మనస్సు నిశ్చలముగా ఉన్నప్పుడు నీవు ఆత్మజ్ఞానము పొందుదువు.

అర్జున ఉవాచ:                                                                            

అర్జునుఁడు పలుకుచుండెను.                                                                             

శ్లో.  స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ |

స్థితధీః కిం ప్రభాషేత? కిమాసీత? వ్రజేత కిమ్? || 2-54 ||

తే.గీ.  హరి! సమాధిస్థితినియుండి యలరువాని    

లక్షణములెట్టులుండును? శ్లాఘనీయ!                                                        

అతని మాటలు చేష్టలు నలరునెటుల?                                                   

ననుచు పార్థుండు పలికెను, వినగ నెంచి.                                             

భావము.                                                                                                                     

కేశవా ! సమాధినిష్ఠ పొందిన స్థితప్రజ్ఞుడి లక్షణములేమిటి? అతని ప్రసంగమూ, ప్రవర్తనా ఏ విధముగా ఉండును?

శ్రీ భగవానువాచ:

శ్రీకృష్ణ భగవానుఁడనుచున్నాడు.

శ్లో.  ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ |

ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే || 2-55 ||

తే.గీ.  మనసు లోపలి కోరికల్ మనుజుఁడెవఁడు 

విడిచిపెట్టుచు భువిపైన వెలుగుచుండు

కన స్థితప్రజ్ఞుఁడతఁడెయౌ కనుము మదిని,

కని స్థితప్రజ్ణుడై వెల్గు ఘనతరముగ.

భావము.

మనసులోని కోరికలన్నిటినీ విడిచిపెట్టి, ఎప్పుడూ ఆత్మానందమే అనుభవించేవాడు  స్థితప్రజ్ఞుడు.

శ్లో.  దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః |

వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే || 2-56 ||

తే.గీ.  కష్ట సమయంబులందునఁ గలత పడక,

సుఖములందున పొంగక శోభనొప్పు

సతము విగతరాగద్వేషుఁ డతులిత మతి

స్థిర శుభమతిని మునియందు రరయుమయ్య.

భావము.

దుఃఖాలకు క్రుంగనివాడూ, సుఖాలకు పొంగనివాడూ, భయమూ, రాగద్వేషములూ వదిలిపెట్టినవాడూ అయిన మునీంద్రుడు స్థితప్రజ్ఞుడగును.

శ్లో.  యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ |

నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 2-57 ||

ఆ.వె.  మోహ దూరుఁ డగుచు స్నేహమున్ వ్యామోహ

మును విడుచునెవండు మనుచునుండి,

చను శుభాశుభముల సంతసంబును ద్వేష

ముందడతనిప్రజ్ఞ యలరు భువిని.

భావము.

స్నేహవ్యామోహాలు లేకుండా వ్యవహరిస్తూ శుభాశుభాలు కలిగినప్పుడు సంతోషము, ద్వేషము పొందకుండా ఉండేవాడు స్థితప్రజ్ఞుడు.

శ్లో.  యదా సంహరతే చాయం కూర్మో உ0గానీవ సర్వశః |

ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 2-58 ||

తే.గీ.  కూర్మ మవయవములు ముడ్చుకొనునటులుగ

విషయ సంసక్త మతిని తా వేరు చేసి,

మెలగువారిల గుర్తింపు మేలుగాను

పొంది మహిత సుఖము లొందు పార్థ!

భావము.

తాబేలు తన అవయవాలను లోపలికి ఎలా ముడుచుకొనునో అలాగే ఇంద్రియాలను సర్వవిధములా విషయసుఖాల నుంచి మళ్ళించిన వాడు స్థితప్రజ్ఞుఁడగును.

శ్లో.  విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః |

రసవర్జం రసో௨ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే || 2-59 ||

తే.గీ. పృథ్వి పయిని నిరాహారు విషయవాంఛ

లణగిపోవచ్చు నపుడైన నణగిపోవు

విషయ వాసనలతనికి, విదితమగుచు

నాత్మదర్శనమగునేని యణగునదియు. 

భావము.

ఆహారం తీసుకోనివాడికి ఇంద్రియవిషయములు అణగిపోవును. అయితే విషయ వాసన మాత్రం వదలదు. ఆత్మదర్శనంతో అది కూడా అడుగంటిపోవును.

శ్లో.  యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః |

ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః || 2-60 ||

తే.గీ. ఆత్మనిగ్రహాసక్తితో యమిత గతిని

యత్నమొనరించు మహితుని యాత్మనైన 

లొంగదీయు నింద్రియతతి లోలనమున

భ్రష్టుఁడైచెడవచ్చు పార్థ! వినుమ.,

భావము.

కుంతీనందనా ! ఆత్మనిగ్రహము కోసము అమితముగా ప్రయత్నించే విద్వాంసుడి  మనసును కూడా ఇంద్రియాలు బలవంతముగా లాగుతాయి.

శ్లో.  తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః |

వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 2-61 ||

తే.గీ. యోగ సాధకుఁడు జితేంద్రియుఁడగుచు, నను

మనసులో నిండుగా నింపి మసలవలయు,

నప్పు డాతనిప్రజ్ణ మహాద్భుతముగ

సుస్థిరంబగు,నో పార్థ! శుభకరమగు. 

భావము.                                                                                                                

యోగసాధకుఁడు ఇంద్రియములన్నింటినీ వశపరచుకొని నామీదే మనస్సు వుంచవలెను. అట్టివాడి ప్రజ్ఞ సుస్థిరమగును.

శ్లో.  ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే |

సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో௨భిజాయతే || 2-62 ||

తే.గీ. ఇంద్రియార్థంబులాశింప నెన్నఁజాల

నట్టి యాసక్తి పుట్టి మోహంబుకలిగి

కోరికలుపుట్టు నందుచేఁ గోపమొదవు

నర్జునా! గ్రహియింపుమా, యనుపమముగ. 

భావము. ఎప్పుడూ శబ్దాది విషయాల గురించే ఆలోచించు వానికి 

వాటిమీద ఆసక్తి ఎక్కువగా పెరుగును. ఆసక్తివల్ల కోరికలు పుట్టును. 

కోరికలు కోపమును కలగజేయును. 

శ్లో.  క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః |

స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి || 2-63 ||

తే.గీ. కోపమునఁగల్గు సమ్మోహమోపనంత,

మసలు దానిచే స్మృతివిభ్రమంబు కలుగు,

బుద్ధియు నశించు దానిచేపూర్తిగాను,

బుద్ధి నశియింప పతనమ్మె పొందు తుదకు. 

భావము.

కోపం మూలంగా అవివేకము కలుగును. అవివేకమువలన మరపు, మరపువలన  బుద్ధి నశించుట, బుద్ధి నాశనము వలన తానే నశించుట జరుగును.

శ్లో.  రాగద్వేషవిముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ |

ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి || 2-64 ||

తే.గీ. నిగ్రహ మతితో నింద్రియ నిగ్రహమున

నదుపుకల్గివర్తించువా డెదను సౌఖ్య

శాంతు లందుచు సుఖియించు సన్నుతముగ,

ఇంద్రియాతీతవశ్యాత్ముఁడెన్న ఘనుఁడు.

భావము.

మనసును నిగ్రహించుకొని రాగద్వేషములు లేకుండా తన అదుపాజ్ఞలలో వున్న 

ఇంద్రియముల వలన విషయసుఖములు అనుభవించెడివాడు మనశ్శాంతి పొందును.

శ్లో.  ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే |

ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే || 2-65 ||

తే.గీ. అతని దుఃఖము లన్నియు నావిరియగు 

దైవ కృపఁ గల్గియున్నచో ధరణిపైన,

భువి ప్రశాంత చిత్తునియొక్క బుద్ధి యుండు

స్థిరముగాను ప్రశాంతిగా త్వరగ నిజము.

భావము.

మనస్సు నిర్మలముగ నుండిన సమస్త దుఃఖములూ సమసిపోవును. మనసు నిర్మలముగా వున్నవాని ప్రజ్ఞకు చలనం లేదు.

శ్లో.  నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా |

న చాభావయతశ్శాంతిః అశాంతస్య కుతస్సుఖమ్ || 2-66 ||

తే.గీ. మనసు నిగ్రహంబది లేని మానవునకు

ఆత్మ చింతన, జ్ఞానము నలవడవిల,

వాని కుండదు శాంతి యవ్వాని కెఱుఁగ

సుఖము లభియింప నేరదు, శూన్యసుఖుఁడె.

భావము.

మనోనిగ్రహం లేనివానికి ఆత్మవివేకం కాని ఆత్మచింతన కాని అలవడవు. అట్టివానికి మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేనివాడికి సుఖము శూన్యము.

శ్లో.  ఇంద్రియాణాం హి చరతాం యన్మనో௨ను విధీయతే |

తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి || 2-67 ||

తే.గీ. నావ చుక్కాని లేనిచో నాశనమగు

ను సుడి గాలిచే, యటులె మనుజులును తమ

యింద్రియాసక్తులకులొంగెనేని యదియె

ప్రజ్ఞనే నాశనము చేయు పార్థ! వినుము.

భావము.

సుడిగాలి చుక్కాని లేని నావను దిక్కుతోచకుండా చేసినట్లు, ఇష్టానుసారము ప్రవర్తించే ఇంద్రియాలకు లొంగిపోయిన మనస్సు పురుషుని బుద్ధిని పాడు చేయును.

శ్లో.  తస్మాద్యస్య మహాబాహో ! నిగృహీతాని సర్వశః |

ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 2-68 ||

తే.గీ. కావునర్జునా! విషయ సుఖముల దెసకు

వెళ్ళఁ బోవకే, యింద్రియ విజయుఁడయిన 

బుద్ధి వికసించు దానిచే పూర్ణమయిన

ప్రజ్ఞతో వెల్గగల్గును పార్థ! కనుము.

భావము.

అర్జునా ! అందువల్ల విషయసుఖముల వైపునకు వెళ్ళకుండా ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడికి స్థిరమైన బుద్ధి కలుగును; అతఁడే స్థితప్రజ్ఞుడు.

శ్లో.  యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ |

యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః || 2-69 ||

తే.గీ. ఆత్మతోననుభూతిలేనట్టిప్రాణి

కోటికదిరాత్రి, యోగులకు పగలదియె,

విషయలంపటులకుపవల్  విజ్ఞులయిన

యోగుల కదియె రాత్రి సద్యోగ వేళ.

భావము.

ఆత్మానుభూతిలేని అన్ని ప్రాణులకూ రాత్రిగాతోచే సమయములో మనోనిగ్రహము కలిగిన ముని మేలుకొని యుండును. విషయాలపట్ల ఆసక్తితో సర్వప్రాణులూ మెలకువగా వున్నపుడు ఆత్మనిష్ఠకలిగిన యోగికి రాత్రి అగును.

శ్లో.  ఆపూర్యమాణమచలప్రతిష్ఠం

సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ |

తద్వత్‌కామా యం ప్రవిశంతి సర్వే

స శాంతిమాప్నోతి న కామకామీ || 2-70 ||

తే.గీ. నిండుచుండియు జలధి తా నిరత మటుల

చలనమొందక యుండుటన్ సకలజలము 

లందు చేరు నటులె కామ మణగి యున్న

మదిని శాంతియు చేరును మహిత! పార్థ!

భావము.

నిరంతరం నిండుతున్నప్పటికీ చలించకుండా నిలిచిన సముద్రంలో నదీజలాలు ఎలా ప్రవేశిస్తాయో అలాగే ఎవనిలో కామాలన్నీ లీనమై అణగిపోవునో అతఁడు శాంతి పొందును. భౌతిక సుఖాలకు బానిస అయినవాడికి మోక్షము లేదు.

శ్లో.  విహాయ కామాన్ యః సర్వాన్‌పుమాంశ్చరతి నిఃస్పృహః |

నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి || 2-71 ||

తే.గీ. కోరికలు వీడి యహమును చేరనీక

మమతలను వీడి యాశనన్ మదిని వీడి

మెలఁగు నెవ్వఁడు వాఁడె యీ మేదినిపయి

శాంతి సౌఖ్యంబులందును, సన్నుతముగ.

భావము.

కోరికలన్నిటినీ విడిచిపెట్టి ఆశ, అహంకారము, మమకారము లేకుండా మెలగేవాడు 

పరమశాంతి పొందును.

శ్లో.  ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి |

స్థిత్వా௨స్యామంతకాలే௨పి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి || 2-72 ||

తే.గీ. ఇట్టు లెవరు బ్రహ్మజ్ఞాన మిద్ది పడయు 

నతనిఁ జేర వైహికవాంఛ లంతిమమున

నైన యిట్టి సుజ్ఞానంబు నందినయెడ

మోక్షమది ప్రాప్తమగునయ్య! బుద్ధినిడుమ.

భావము.

అర్జునా ! ఇలా బ్రహ్మజ్ఞానము పొందినవాడి దృష్టి ప్రపంచవిషయాల మీదకు మళ్ళీ యింకెప్పుడూ మళ్ళదు. జీవితం చివరిఘట్టంలో అయినా అలాంటి జ్ఞానం కలిగితే మోక్షం లభిస్తుంది.

ఇది ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం,

శ్రీకృష్ణార్జున సంవాదము అయిన

శ్రీమద్భగవద్గీతలోని "సాంఖ్యయోగం" అనెడి రెండవ అధ్యాయము సమాప్తము






శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  

కర్మయోగము.

అర్జున ఉవాచ|

భావము.

అర్జునుడు ఈ విధముగ పలికెను.

శ్లో. జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన|

తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ! || 3-1 ||

తే.గీ. నీ మతంబున కర్మయే నిత్యమధిక

మయిన జ్ఞానమయినచో మహాత్మ! కృష్ణ!

ఘోర కర్మలందేల నన్  గోరి నిలుపు

చుంటివో తెల్పు మనుపమ! సుప్రకాశ!

భావము.

జనార్దనా! నీ అభిప్రాయములో కర్మ కంటే జ్ఞానమే ఎక్కువైతే కేశవా! ఘోరకర్మలో నన్ను  ఎందులకు నియోగించితివి?

శ్లో. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే|

తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోహమాప్నుయామ్ || 3-2 ||

తే.గీ. భ్రాంతిఁ గల్గించుచుంటివి పలికి నీ వ

యోమయంబైన మాటల నో మహాత్మ!

శ్రేయమెయ్యది నాకదే చెప్పుమయ్య!

నిశ్చితంబుగ, తెలియగ, నేర్పుమీర.

భావము.

అయోమయమైన మాటలతో నా బుద్ధికి భ్రాంతిని కలిగించుచుంటివి. ఏది నాకు శ్రేయమో దానిని నిశ్చయముగా చెప్పుము.

శ్రీభగవానువాచ.

శ్లో. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ|

జ్ఞానయోగేన సాఙ్ఖ్యానాం, కర్మయోగేన యోగినామ్. || 3-3 ||

తే.గీ. జ్ఞాన యోగంబు చేత నా సాంఖ్యులకును,

కర్మయోగంబు చేత నా కర్మయోగు

లకును, సృష్టికిన్ ముందుగా సకల మెఱుఁగ

చెప్పఁ బడెనయ్య నా చేత గొప్పగాను.

భావము.

భగవంతుడు యీ విధముగా పలుకుచుండెను. పాప రహితుడా!! ఈ లోకంలో సాంఖ్యులకు జ్ఞానయోగం చేతను యోగులకు కర్మయోగం చేతను సాధన, సృష్టికి ముందే 

నాచేత చెప్పబడినది.

శ్లో. న కర్మణా మనారమ్భా న్నైష్కర్మ్యం పురుషోఽశ్నుతే|

న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి. || 3-4 ||

తే.గీ. కర్మలను జేయనంత నిష్కర్మ సిద్ధి

కలుగఁ బోవదు తెలియుమా కవ్వడి! మరి

సన్యసించిన మాత్రాన సాధ్య మవదు

సిద్ధిఁ బొందుట, కనఁగ ప్రసిద్ధమిదియె.

భావము.

కర్మలను చేయనంత మాత్రాన నిష్కర్మ సిద్ధి కలుగదు. కేవలం సన్యసించుట వలన సరైన సిద్ధి కలగదు.

శ్లో. న హి కశ్చిత్క్షణమపి జాతు తిష్ఠ త్యకర్మ కృత్|

కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. || 3-5 ||

తే.గీ. కర్మఁ జేయక యుండుట క్షణము కూడ

సాధ్యపడఁ బోదు జనులకు, సహజమిదియె,

ప్రకృతి జన్య గుణంబుల ప్రాభవమున

జేయఁబడుచుండు కర్మముల్ సిద్ధమిదియు.

భావము.

ఎవరూ ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు. ప్రకృతి జన్యమైన గుణాల వలన అన్నికర్మలు అవశ్యంగానే చేయబడుతున్నాయి.

శ్లో. కర్మేన్ద్రియాణి సంయమ్య, య ఆస్తే మనసా స్మరన్|

ఇన్ద్రియార్థాన్విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. || 3-6 ||

తే.గీ. బయటి కింద్రియ నిగ్రహ వర్తనుఁడయి

యాత్మలో సంస్మరించెడి యధముఁ డిలను

మూర్ఖుఁ డరయఁగ కపటి తాన్, బుద్ధిహీను

డనగ నొప్పు నతని నిల గుణవిశాల!

భావము.

ఎవరైతే కర్మేంద్రియాలను నిగ్రహించి మనస్సులో ఇంద్రియ విషయాలను స్మరిస్తూ ఉంటాడో,అతడు పరమ మూర్ఖుడు, కపటాచారి అని పిలవ బడతాడు.

శ్లో. యస్త్విన్ద్రియాణి మనసా నియమ్యారభతేర్జున|

కర్మేన్ద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే. || 3-7 ||

తే.గీ. పార్థ! జ్ఞానేంద్రియములను వశమునందు

మనసుచే నుంచుకొనుచు తా మానకుండ

కర్మ యోగ మనాసక్తి ధర్మ మరసి

చేయు నాతఁడు శిష్ఠుఁడు, జీవితమున.

భావము.

అర్జునా! జ్ఞానేంద్రియాలను మనస్సు ద్వారా నిగ్రహించి, కర్మేంద్రియాల ద్వారా అసక్త భావంతో కర్మయోగాన్ని ఎవరు ప్రారంభించునో అతడు విశిష్టుడు అవుతాడు.

శ్లో. నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః|

శరీర యాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః. || 3-8 ||

తే.గీ. నీదు విధ్యుక్త ధర్మంబు నీవొనర్చు,

కర్మమానుట కంటె యా కర్మ చేయు

టనునదియె మేలు, కర్మ చే యక మనుటన

భువిని కష్టము తలఁపగా ప్రవర! పార్థ!

భావము.

నీ విధ్యుక్త కర్మని నీవు చేయుము. కర్మ మానుట కంటే కర్మ చేయుట మేలు. కర్మ చేయకపోయినచో శరీరయాత్ర జరగదు.

శ్లో. యజ్ఞార్థా త్కర్మణోన్యత్ర లోకోऽయం కర్మ బన్ధనః|

తదర్థం కర్మ కౌన్తేయ ముక్తసఙ్గః సమాచర. || 3-9 ||

తే.గీ. యజ్ఞములకని చేసెడి యట్టి కర్మ

ముల కితరమగు కర్మలన్ పూర్తిగాను

బంధనంబయ్యె లోకంబు, పార్థ! యజ్ఞ

కర్మ సంగమంబు వదలి కర్మొనర్చు.

భావము.

యజ్ఞం కోసం చేసే కర్మలకంటే ఇతర కర్మలతో ఈ లోకం బంధింప బడి ఉన్నది. కుంతీకుమారాయజ్ఞ కర్మలనే సంగమము వదిలి కర్మలను చక్కగా చేయుము.

శ్లో. సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః|

అనేన ప్రసవిష్యధ్వమేష వోస్త్విష్ట కామ ధుక్. || 3-10 ||

తే.గీ. యజ్ఞములతోడను ప్రజల నాప్రజాప

తియె యొనర్చి సృష్టి, పలికె తీయగ నిటు

యజ్ఞములు చేసి వెలుగుడీ యసదృశమగు

కామ ధేనువు యజ్ఞంబు, క్షేమ మొదవు.

భావము.

యజ్ఞములతో సహా ప్రజలను సృష్టించి ప్రజాపతి పూర్వం ఈ విధముగా చెప్పెను. యజ్ఞం వలనమీరు వృద్ధి పొందుడు. అది మీ ఇష్ట కామధేనువు.

శ్లో. దేవాన్భావయ తానేన తే దేవా భావయన్తు వః|

పరస్పరం భావయన్తః శ్రేయః పరమవాప్స్యథ. || 3-11 ||

తే.గీ. దేవతాతతిన్ గొల్వుఁడు దివ్యమయిన

యిట్టి యజ్ఞమ్ములను జేసి, యిత్తు రరసి

మీకు దేవతల్ శుభములు, మేలు గొలుప,

నిహపరమ్ముల సాధింపు డహము వీడి.

భావము.

దేవతలను ఈ యజ్ఞములో ఆరాధించుడు. ఆదేవతలు మిమ్మలను అనుగ్రహింతురు.

శ్లో. ఇష్టాన్భోగాన్హి వో దేవా దాస్యన్తే యజ్ఞభావితాః|

తైర్దత్తానప్రదాయైభ్యో యో భుఙ్క్తే స్తేన ఏవ సః|| 3-12 ||

తే.గీ. యజ్ఞ భావిత దేవత లఖిల భోగ

ముల నొసంగుదు రా భోగములను పొంది,

ప్రతిగ నేమియు నీయక  వారలనుభ

వించ నది చౌర్యమేయగున్ బ్రీతిఁగనుమ.

భావము.

యజ్ఞం చేత ఆరాధించబడిన దేవతలు మీకు ఇష్ట భోగాలను ఇస్తారు. వారికి ఏమీ సమర్పించకుండా

వాళ్ళు ఇచ్చిన వాటిని అనిభవించేవాడు చోరుడే యగును .

శ్లో. యజ్ఞశిష్టాశినః సన్తో ముచ్యన్తే సర్వకిల్బిషైః|

భుఞ్జతే తే త్వఘం పాపా యే పచన్త్యాత్మ కారణాత్ || 3-13 ||.

తే.గీ. దేవతల కిచ్చి, శేషమున్  దినిన, పాప

ములవి వాయు, ధన్యుఁడౌ పుడమిపైన,

తనకు వండుకొనుచు తిను ధర్మబాహ్యుఁ

డరయఁ బాపంబు తినుటగున్, వరలఁ బోడు.

భావము.

యజ్ఞంలో దేవతలకు ఇవ్వగా మిగిలినది తినెడిసజ్జనుడు అన్ని పాపములనుండి విముక్తుడు అగును. తమ కోసం మాత్రం వండుకొనెడి పాపాత్ములు పాపమునే తినువారగుదుఉ.

శ్లో. అన్నాద్భవన్తి భూతాని పర్జన్యాదన్నసమ్భవః|

యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః || 3-14 ||

తే.గీ. అన్నమునఁ బుట్టు జీవు లా యన్న మరయ,

మేఘమున సంభవంబగు మేఘ మరయ

యజ్ఞమున సంభవంబగు యజ్ఞ మరయ

కర్మ వలన సంభవమగు, కనుము పార్థ!

భావము.

అన్నము వలన జీవులు పుట్టును,అన్నము మేఘము వలన పుట్టును, మేఘము యజ్ఞము వలనపుట్టును, యజ్ఞము కర్మ వలననే సంభవము.

శ్లో. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్|

తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్. || 3-15 ||

తే.గీ. బ్రహ్మచే కర్మ కలిగెను, బ్రహ్మ చూడ

మహిత పరమేశుచేఁ గల్గె, మదిని గాంచ

సర్వమున వ్యాప్తుఁడై వెల్గు శక్తి యతఁడె

యజ్ఞమందు ప్రతిష్ఠితుం డరయ నతఁడె.

భావము.

కర్మ బ్రహ్మదేవుని వలన జనించినది. ఆ బ్రహ్మ అనంతమైన పరమాత్మ వలన ఉద్భవించెను. కాబట్టి సర్వ వ్యాపకమగు పర బ్రహ్మము నిత్యమూ యజ్ఞములో ప్రతిష్టితమై యుండునని తెలుసుకొనవలయును.

శ్లో. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః|

అఘాయురిన్ద్రియారామో మోఘం పార్థ స జీవతి. || 3-16 ||

తే.గీ. ఇట్టి భ్రమియించు చక్రము నెవఁడు భువిని

యనుసరించడో పాపి తా నర్జున! కన

నింద్రియములకు లోనగు నెన్న రాని

పాపి, నిజమిది కను మది భ్రాంతివీడి.

భావము.

ఇలా పరిభ్రమించే చక్రాన్ని అనుసరించని వాడు పాపి, ఇంద్రియలోలుడు,అర్జునా, అతడు జీవించుట వ్యర్థము.

శ్లో. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః|

ఆత్మన్యేవ చ సన్తుష్టస్తస్య కార్యం న విద్యతే. || 3-17 ||

తే.గీ. ఆత్మ లోన రమించుచు, నాత్మలోన

పూర్ణ తృప్తిని బొందెడు పూజ్యున కిక

చేయ వలసినదేదియు క్షితిని లేదు,

బ్రహ్మజీవైక్యసిద్ధియే పరమపథము.

భావము.

ఆత్మలోనే రమిస్తూ, ఆత్మలోనే పరిపూర్ణ తృప్తిని పొందే వాడికి చేయవలసిన కార్యమంటూ లేదు.

శ్లో. నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన|

న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. || 3-18 ||

తే.గీ. అతనికి పని చేయంగ మేలరయ లేదు,

చేయకున్నను నష్టంబు చేరఁ బోదు.

తన కొఱ కితరులపయిన తానెపుడును

కనగ నాధారపడఁ బోడు కనుము నిజము.

భావము.

అతడికి పని చేయడం వలన ప్రయోజనం కాని, మానడం వలన దోషం కాని ఏమీ ఉండదు. తనప్రయోజనం కోసం సమస్త ప్రాణులలోనూ దేనిపైనా ఆధారపడడు.

శ్లో. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర|

అసక్తో హ్యాచరన్కర్మ పరమాప్నోతి పూరుషః|| 3-19 ||

తే.గీ. కావునన్ కర్మలొనరింపగా తగు నది

మదిననా సక్తితోడ నేమరక చేయు

టొప్పునయ లోకకళ్యా ణమొనరఁ గోరి

చేసి నిష్కామకర్మలన్ భాసిలుమిల.

భావము.

కాబట్టి, మమకార బంధాలను విడిచిపెట్టి, ఆసక్తి రహితుడవై, నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించుము. కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పని చేయటం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు. శ్లో. కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః|

లోకసంగ్రహమేవాపి సమ్పశ్యన్కర్తుమర్హసి|| 3-20 ||

తే.గీ. అవని నిష్కామ కర్మల నంచితముగఁ

జేసి జనకాదులున్ ముక్తి చెందిరి కద,

లోక కల్యాణమునుగోరి శ్రీకరముగ

కర్మలన్ జేయఁ దగు నీకు మర్మమెఱిఁగి.

భావము.

జనకుడు మొదలైన వారు(నిష్కామ)కర్మల వలననే మోక్షము పొందిరి. లోకకల్యాణాన్ని దృష్టిలోఉంచుకుని 

అయినా కర్మ చేయడమే నీకు తగును.

శ్లో. యద్యదా చరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః|

స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. || 3-21 ||

తే.గీ. శ్రేష్ఠుఁ డెద్దానిఁ జేయునో జేయుదు రదె

జనులు, దేనిని శ్రేష్టుఁడు ఘనతరముగ

తగ ప్రమాణంబుగాఁ గొను దాని నరసి

స్వీకరింతురు జనులెల్ల లోకమునను.

భావము.

శ్రేష్టుడు దేనినైతే ఆచరిస్తాడో, దానినే ఇతర జనులు ఆచరిస్తారు. అతడు దేనిని ప్రమాణంగాస్వీకరిస్తాడో దానినే లోకం అనుసరిస్తుంది.

శ్లో. న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కిఞ్చన|

నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి|| 3-22 ||

తే.గీ. పార్థ! యీ మూడులోకాల వరల నాకుఁ

జేయ వలసిన పనిలేదు, చిత్తమలర

మునుపు పొందక యున్నది, పొందఁ దగిన

దేదియున్ లేదు, కర్మల నిటులె యుందు.

భావము.

అర్జునా నాకు ఈ మూడు లోకాలలో చేయవలసిన పని లేదు. ఇంతకు ముందు పొందకుండా ఉన్నదిముందు  పొందవలసినది ఏమీలేదు. అయిననూ  కర్మలలో వర్తిస్తాను.

శ్లో. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతన్ద్రితః|

మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః|| 3-23 ||

తే.గీ. పార్థ! విశ్రాంతిఁ గొనక నే పనులఁ జేయ

కున్న, నన్నుననుసరింత్రు మన్ననమున

జనులు కావున కర్మలన్ సలుపుచుందు

ఫలితమాశించనేరను, భవ్యమదియె. 

భావము.

అర్జునా; నేను విశ్రాంతి లేకుండా నిరంతరం పని చేయకపోతే, మనుష్యులు అన్ని విధాలనామార్గమే అనుసరిస్తారు.

శ్లో. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్|

సఙ్కరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః|| 3-24 ||

తే.గీ. కర్మ దూరుండ నయిన లోకములు నాశ

నమగు, వర్ణ సంకరమది నా వలననె

కలుగు, నేనె కారణముగా కాన యటుల

జరుగనీయక కర్మలు జరుపుచుందు.

భావము.

నేను కర్మలు చేయకపోతే ఈలోకాలన్నీ నశించి పోతాయి. వర్ణ సంకరానికి కారకుఁడనగుదును. ఈప్రజలను నాశనము చేసిన వాఁడనగుదును.

శ్లో. సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వన్తి భారత|

కుర్యాద్విద్వాంస్తథాసక్తశ్చికీర్షుర్లోకసంగ్రహమ్|| 3-25 ||

తే.గీ. పార్థ! యజ్ఞాన వశుఁడు తా పనుల నెట్లు

చేయుచుండునో యటులనే చేయుదు రిల,

పనులు జ్ఞానులు లోకమున్ వరలఁ జేయ

నిరత నిష్కామ కర్ములై వరలుదురయ.

భావము.

అర్జునా! అజ్ఞానులు కర్మలతో మునిగి తేలుతూ ఎలా పని చేయుదురో వివేకి లోక శ్రేయస్సు కోరుతూఅటులనే పని చేయవలెను.

శ్లో. న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసఙ్గినామ్|

జోషయేత్సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్|| 3-26 ||

తే.గీ. కర్మలన్ జిక్కు నజ్జాని కలుషబుద్ధి

నెపుడు చెదరగొట్టగరా దహీన మతులు,

తాను యోగంబులో నిల్చి తనపనులను

జేయుచున్, జేయఁ జేయనౌన్, ధీయుతులయి.

భావము.

కర్మలలో ఇరుక్కు పోయిన అజ్ఞానుల బుద్ధిని వివేకి చెదర కొట్టరాదు. తాను యోగంలో నిలిచి చక్కగాపని చేస్తూ వాళ్ళని ఆ మార్గంలో నడుస్తూ కర్మలాచరించునట్లు ప్రోత్సహించవలెను.

శ్లో. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః|

అహఙ్కారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే|| 3-27 ||

తే.గీ. ప్రకృతి గుణములన్ గర్మలు వరలఁ గలవు,

మూఢుఁ డనుకొను తానిటన్ మూలమనుచు

నన్నిటికిని కారణమని, యహము వలన

జ్ఞాని తలఁపడటుల కను జ్ఞానభాస!

భావము.

ప్రకృతి గుణాల వలన అన్ని కర్మలు నిర్వహింప బడును. అహంకారము వలన భ్రమించిన మూఢుఁడు తానే  కర్తనని తలపోయును.

శ్లో. తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః|

గుణా గుణేషు వర్తన్త ఇతి మత్వా న సజ్జతే|| 3-28 ||

తే.గీ. మహిత బల! గుణ కర్మల మహిత తత్వ

మెఱిగి యున్నట్టివాఁడు తా నెఱిఁగి గుణము

గుణమునందె వర్తించెడు ననుచు, తగులు

కొనడు కర్మలలోఁ దాను ఘనుఁ డతండె.

భావము.

మహాబలుడా! గుణకర్మ విభాగాల తత్వం తెలిసిన వాడు గుణాలు గూణాలలో వర్తిస్తాయని తెలిసి ఆకర్మలలో తగులుకొనడు.

శ్లో. ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జన్తే గుణకర్మసు|

తానకృత్స్నవిదో మన్దాన్కృత్స్నవిన్న విచాలయేత్. || 3-29 ||

తే.గీ. ప్రకృతి ధర్మంబుచే మోహ పరవశులయి

కర్మలన్ మున్గు మందులు, ఘనులు జ్ఞాన

రహిత మందుల నెన్నుచు మహిని తాము

చెదరఁ గొట్టగా రాదది మదిని దలచి.

భావము.

ప్రకృతి యొక్క గుణాల వలన మోహములో పడిన వారు గుణ కర్మలలో మునుగుచుందురు. సరిగాతెలియని మంద బుద్ధులను సర్వము తెలిసిన జ్ఞాని చెదర కొట్టరాదు.

శ్లో. మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మచేతసా|

నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః|| 3-30 ||

తే.గీ. సర్వకర్మలన్ నా యందు సరగుననిడి,

చిత్తమున్ నిల్పి యాత్మలోఁ, జెలఁగు మమత

నాశ మది వీడి యారాట మనునది విడి

యుద్ధమును జేయుమర్జునా! శ్రద్ధఁ గలిగి.

భావము.

సర్వ కర్మలను నా యందు సమర్పించి, చిత్తాన్ని ఆత్మలో నిలిపి, ఆశా మమకారములను వదిలి,

ఆరాటమును విసర్జించి యుద్ధము చేయుము.

శ్లో. యే మే మతమిదం నిత్య మనుతిష్ఠన్తి మానవాః|

శ్రద్ధావన్తోऽనసూయన్తో ముచ్యన్తే తేऽపి కర్మభిః|| 3-31 ||

తే.గీ. మత్సర రహితు లెవ్వారు మన్మతంబు

నాచరింతురో వారలే యనుపమగతి

కర్మ బంధముల్ విడుదురు ఘనతరముగ.

నీవు గ్రహియింపుమర్జునా! నేర్పు మీర.

భావము.

నాయొక్క యీ మతాన్ని ఏమానవులు మత్సరం లేకుండా ఆచరిస్తారో, వాళ్ళు కూడా కర్మల నుండివిడుదల పొందుతారు.

యే త్వేతదభ్యసూయన్తో నానుతిష్ఠన్తి మే మతమ్|

సర్వజ్ఞాన విమూఢాం స్తాన్విద్ధి నష్టా నచేతసః|| 3-32 ||

తే.గీ. ఏ యసూయాపరులు నా యభీష్ట మతము

ననుసరింపరో యా యజ్ఞు లనవరతము

జ్ఞానులందరిచేతను ఘనతరముగ

వంచితులగుచుందురిలను పార్థ! కనుమ.

భావము.

ఎవరైతే అసూయాపరులై నా ఈ మతాన్ని అనుష్టించరో ఆ తెలివి తక్కువ వారు సర్వజ్ఞానముల నుండి వంచితులై  నశించిపోవుదురని తెలుసుకొనుము.

శ్లో. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి|

ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. || 3-33 ||

తే.గీ. అనుసరించు సత్ జ్ఞానియు నాత్మ ప్రకృతి,

యాత్మ ప్రకృతినే జీవాళి యనుసరింపఁ

గలవు గ్రహియింప, నిగ్రహ బల మదేమి

చేయఁ గల్గును? పార్థ! సు జ్ఞేయ మిదియె.

భావము.

జ్ఞానవంతుఁడైనా తన ప్రకృతి ననుసరించే వ్యవహరిస్తాడు. ప్రాణులు తమ ప్రకృతిని

అనుసరిస్తాయి. నిగ్రహమేమి చేస్తుంది.

శ్లో. ఇన్ద్రియస్యేన్ద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ|

తయోర్న వశమాగచ్ఛేత్తౌ హ్యస్య పరిపన్థినౌ. || 3-34 ||

తే.గీ. ఇంద్రియము లన్నిటి విషయ మెంచి చూడ

రాగములు ద్వేషముల్గల్గు, ప్రథిత కర్మ

యోగి లోబడ రాదట్టి రాగములకు

ద్వేషముల కవే శత్రువుల్ తెలియుమిదియె.

భావము.

ప్రతి ఇంద్రియ విషయంలోను రాగద్వేషములు ఉండును. కర్మయోగి వాటికి లోబడ రాదు. అవేఅతనికి  శత్రువులు.

శ్లో. శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్|

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. || 3-35 ||

తే.గీ. గుణము లేనిదైనను గాని తనదె యయిన

ధర్మమే మేలు, కన పరధర్మమేల?

నది భయంకర మరయు మో యర్జునాఖ్య!

మన సుధర్మంబె చరియింప మనకు శుభము.

భావము.

బాగా ఆచరించిన పర ధర్మం కన్నా లోపభూయిష్టమైనది ఐనా స్వధర్మం మేలు. పర ధర్మం భయంకర మైనది.

అర్జున ఉవాచ|

భావము.

అర్జునుడు ఈ విధముగ అడిగెను.

శ్లో. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః|

అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః|| 3-36 ||

తే.గీ. కృష్ణ! పాపంబుల నెవరి ప్రేరణమున

మానవుఁడు చేయుచుండెనో మదిని చేయ

నిష్టమది లేకపోయినన్? సృష్టిలోన

ప్రేర ణెవరిది పాపంబు విరివి చేయ?

భావము.

కృష్ణా! ఇష్టం లేకపోయినా ఎవరో బలవంత పెడుతున్నట్లు మానవుడు పాపము ఎందుకుచేయుచుండును? ఆ ప్రేరణ శక్తిఎవరిది? ఎవరి కారణంగా పాపము చేయును?

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ భగవానుఁడు ఇట్లు పలుకుచుండెను.

శ్లో. కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః|

మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్. || 3-37 ||

తే.గీ. క్రోధ కామముల్ కన  రజో గుణము నుండి

యుద్భవించు నాకలి దానికుండు మెండు,

పాప మూల రజోగుణ వర్ధనంబె

శత్రు వందరికీధరన్, సరిగ కనుమ.

భావము.

ఇవి కామము, క్రోధము, రజోగుణము నుండి ఉద్భవించుచున్నవి. దానికి మహా ఆకలి. అది పాపిష్టిది.ఈలోకంలో అందరికి అదే శత్రువని తెలుసుకో.

శ్లో. ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ|

యథోల్బేనావృతో గర్భ స్తథా తేనేదమావృతమ్. || 3-38 ||

తే.గీ. అగ్నిని పొగయును, మలిన మద్దమును, మరి

మావి శిశువును క్రమ్మునట్లే విజయుఁడ!

క్రమ్మివేయును  జ్ఞానమున్ గామమరయ,

కామమును గెల్చువారలే ఘనులు భువిని.

భావము.

అగ్నిని పొగ ఆవరించినట్లు, అద్దాన్ని దుమ్ము కప్పినట్లు, గర్భస్త శిశువుని మావి కప్పినట్లు జ్ఞానమును కామము కప్పి వేయును.

శ్లో. ఆవృతం జ్ఞాన మేతేన జ్ఞానినో నిత్య వైరిణా|

కామ రూపేణ కౌన్తేయ! దుష్పూరే ణానలేనచ. || 3-39 ||

తే.గీ. కామమది తృప్తిఁ గలిగింపఁ గాని యగ్ని,

జ్ఞానమున కది వైరి, సు జ్ఞానమునది

కప్పివేయును, మనుజుని కనులు మాయ

క్రమ్మి కామాగ్ని దగ్ధుఁడై కనడు నిజము.

భావము.

తృప్తి పరచడానికి వీలులేని అగ్ని వంటిది కామము .ఇది జ్ఞానానికి నిత్య శత్రువు. దీనితో జ్ఞాని యొక్క జ్ఞానము కప్పబడి ఉండును.

శ్లో. ఇన్ద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే|

ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్. || 3-40 ||

తే.గీ. కామమునకు నాధారముల్ కనగ బుద్ధి

యింద్రియంబులు, మనసు, జ్ఞానేంద్రియమును

కామమది కప్పి వ్యామోహ కలితుఁ జేయు

మానవుని, కాన కామమున్ మాపవలయు.

భావము.

ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, కామానికి ఆధార స్థానములు అని చెప్పబడుతున్నవి.ఈ కామము

జ్ఞానమును కప్పి వేసి ఇంద్రియముల ద్వారా దేహధారిని వ్యామోహ పరుచును.

శ్లో. తస్మాత్త్వమిన్ద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ|

పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్. || 3-41 ||

తే.గీ. జ్ఞాన విజ్ఞాన నాశినిన్ గామము నిక,

వదిలి పెట్టుము పార్థుఁడా! పట్టుపట్టి

యింద్రియములను గెలువుమో యింద్ర తనయ!

మహిత కర్తవ్యదీక్షతో మహిని నీవు.

భావము.

అందువలన భరత కుల శ్రేష్టుడా! ముందుగా నీవు ఇంద్రియములను నిగ్రహించి, జ్ఞాన విజ్ఞానాలను

నాశనం చేసే పాపిష్టి కామమును నిర్మూలించు.

శ్లో. ఇన్ద్రియాణి పరాణ్యాహురిన్ద్రియేభ్యః పరం మనః|

మనసస్తు పరా బుద్ధి ర్యో బుద్ధేః పరతస్తు సః. || 3-42 ||

తే.గీ. ఇంద్రియంబులు ఘనమని యందురనఘ!

అంతకన్నను మనసెయౌ నధిక ఘనము,

మనసుకన్నను బుద్ధియఘ మరియు ఘనము,

బుద్ధికన్న నాత్మ ఘనము బుద్ధినరయ.

భావము.

ఇంద్రియాలు గొప్పవని చెబుతారు. ఇంద్రియాలకన్నా అధికమైనది మనస్సు. మనస్సు కన్నా

గొప్పది బుద్ధి, బుద్ధి కన్నను శ్రేష్ఠమైనది ఆత్మ.

శ్లో. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మాన మాత్మనా|

జహి శత్రుం మహాబాహో! కామరూపం దురాసదమ్|| 3-43 ||

తే.గీ. బుద్ధి కన్న నాత్మయె ఘనంబుగఁ గ్రహించి,

నిగ్రహించుచు నిను నీవు, నేర్పు మీర

కామమను శత్రువున్ గెల్చి, ఘనతరముగ

చేయఁ దగినట్టి ధర్మంబుఁ జేయుమరసి.

భావము.

మహాబాహుడా! ఇలా ఆత్మను బుద్ధికన్నా ఎక్కువైన దానిగా తెలుసుకొని, నిన్ను నీవు నిగ్రహించుకొని,

కామరూపి అయిన శత్రువునను జయించుము.

3వ అధ్యాయము. కర్మ యోగము సమాప్తము.

 














చతుర్థోధ్యాయః 

జ్ఞానకర్మసన్యాసయోగః

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ కృష్ణభగవానుడు పలికెను.

శ్లో. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్|

వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేబ్రవీత్ || 4-1 ||

తే.గీ. ఘనతరంబుగ కర్మ యోగంబు రవికి 

బోధఁ జేసితిన్, దానది బోధఁ జేసె

మనువున, కతఁ డిక్ష్వాకునకును దెలిపె, న

నన్య మిదియు నీ వెఱుఁగుమో యర్హునుండ!

భావము.

అవ్యయమైన ఈ కర్మయోగాన్ని నేను సూర్యుడికి భోదించితిని. సూర్యుడు 

మనువుకి చెప్పెను. మనువు ఇక్ష్వాకునికి చెప్పెను.

శ్లో. ఏవం పరమ్పరాప్రాప్తమిమం రాజర్షయో విదుః|

స కాలేనేహ మహతా యోగో నష్టః పరన్తప. || 4-2 ||

తే.గీ. రాజ ఋషు లెఱింగిన యట్టి రాజయోగ 

మిది, ప‌రంతపా! ప్రాప్తించె నిల పరంప

రగనె, పరికింప నీయోగ  మగణితమెగ

కాలగర్భంబులో నేడు కలిసిపోయె.

భావము.

ఇలా పరంపరగా ప్రాప్తమైన కర్మయోగమును రాజర్షులు ఎరుగుదురు. 

ఓ పరంతపా!  కాల గతిలో ఈ గొప్ప యోగం ఈ లోకంలో నశించి పోయినది.

శ్లో.  ఏవాయం మయా తేऽద్య యోగః ప్రోక్తః పురాతనః|

భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్. || 4-3 ||

తే.గీ. అట్టి ప్రాచీన యోగంబు నర్జున! సఖుఁ

డవని, భక్తుండ వని నీకు సవివరముగ

బోధఁ జేసితి నుత్తమ పూజ్యమౌ ర

హస్య యోగంబిదక కనుమయ్య నీవు.

భావము.

ఆ సనాతనమైన యోగమును నా భక్తుడవు, స్నేహితుడవు ఐన నీకు 

భోధించితిని. ఇది ఉత్తమమైనదీ రహస్యమైనదీ అని యెఱుగుము.

అర్జున ఉవాచ|

భావము.

అర్జునుడు ఈ విధముగ అడిగెను.

శ్లో. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః|

కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి || 4-4 ||

తే.గీ. ఇప్పటిదె నీదు జన్మం, బ దెప్పటిదగు 

సూర్యదేవుని జన్మము? సూర్యునకును

బోధఁ జేసితినంటివి బోధ పడద

దెట్టులన సాధ్యమౌనొ నే నెఱుగ లేను.

భావము.

నీ జన్మ ఇటీవలది. సూర్యుని జన్మ ఎంతో ముందున్నది. నీవు సూర్యునికి 

ఉపదేశించితివని అంటివి. దీనిని ఏ విధముగా అర్ధము చేసుకోవలెను?

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ కృష్ణభగవానుడు ఈ విధముగ పలికెను.

శ్లో. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున|

తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరన్తప || 4-5 ||

తే.గీ. గడచిపోయిన జన్మలు కలవు పెక్కు 

నీకు, నాకును, నెఱుఁగవు నీవు, నేనె

రుంగుదును వాటి నన్నిటిన్, భంగపడకు

మర్జునా నీవు సత్యంబు నరయ వలయు.

భావము.

అర్జునా! నాకును నీకును కూడా ఎన్నో జన్మలు గడిచిపోతునవి. నేను వాటన్నిటిని 

ఎఱుఁగుదును. నీవు ఎఱుఁగవు.

శ్లో. అజోऽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్|

ప్రకృతిం స్వామధిష్ఠాయ సమ్భవామ్యాత్మమాయయా. || 4-6 ||

తే.గీ. జన్మమే లేనివాడ నీ జగతిలోన

నవ్య యుండను, జీవుల కధిపతి నిక

నాదు ప్రకృతిని దాటుచు నాదు మాయ

వలన జన్మించుచుందును, వలసినపుడు.

భావము.

జన్మ లేని వాడినీ, అవ్యయుడినీ, జీవులందరికి అధిపతినైన, నా ప్రకృతిని 

అధిరోహించి నా మాయ వలన జన్మించుచుందును.

శ్లో. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత|

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ || 4-7 ||

తే.గీ. ధర్మ మది క్షీణమగుచు నధర్మ మెపుడు

వృద్ధి యగుచుండు నప్పు డేన్ పృథ్విపైన

పుట్టు చుందు నధర్మమున్ మట్టుపెట్టి

ధర్మ సంరక్షణను జేయ, ధర్మ మిదియె. 

భావము.

అర్జునా! ఎప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి చెందునో 

అప్పుడు నన్ను నేను సృజించుకొందును.

శ్లో. పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతామ్|

ధర్మసంస్థాపనార్థాయ సమ్భవామి యుగే యుగే. || 4-8 ||

తే.గీ. సాధు జనులను రక్షింప, సమయు నటులఁ

జేయ దుష్కర్ములను భువిన్, జేయగాను

ధర్మ సంస్థాపనంబును  ధరను నేను

సంభవింతు యుగయుగములంభరతజ!

భావము.

సాధువులను రక్షించడానికి, దుష్టులను నాశనం చేయడానికీ, ధర్మాన్ని 

నెలకొల్పడానికి యుగ యుగంలోను నేను జన్మిస్తాను.

శ్లో. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్త్వతః|

త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోऽర్జున || 4-9 ||

తే.గీ. అర్జునా! యెవ్వ రెఱుఁగుదు రతులితమును

దివ్యమునునైన నా జన్మ, దీపితమగు

దివ్య తత్వంబు వారికి దేహమువిడ

ముక్తియే గల్గు, నిజమిది యుక్తి గనుమ.

భావము.

అర్జునా! దివ్యమైన నా జన్మ కర్మల తత్వాన్ని ఎవరు యధార్ధంగా 

తెలుసుకొందురో, వారు ఈ శరీరాన్ని వదలిన తరవాత తిరిగి పుట్టరు.

శ్లో. వీత రాగ భయ క్రోధా మన్మయా మాముపాశ్రితాః|

బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. || 4-10 ||

తే.గీ. రాగమును భయక్రోధముల్ వేగమె విడి

నన్ను గూర్చిన తలపుల నున్న వారు

నన్నె తా మాశ్రయించిన సన్నుతులట

జ్ఞాన తపమున నన్ జేరఁ గలగుదు రిల.

భావము.

రాగ భయ క్రోధాలను విడిచి నన్ను గురించిన ఆలోచనలతో నిండి, నన్ను 

ఆశ్రయించిన వారు ఎందరో జ్ఞానతపస్సు వలన నన్ను అందుకొనిరి.

శ్లో. యే యథా మాం ప్రపద్యన్తే తాంస్తథైవ భజామ్యహమ్|

మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః. || 4-11 ||

తే.గీ. ఎవ్వ రెట్టుల నన్గొల్తు రీప్సితముగ

వారి నట్టులే నేనును పార్థ! కనుదు,

నాదు జాడలోనే జనుల్నడచుదు రిల, 

నీవు గ్రహియింప వలెనిది నేర్పుమీర.

భావము. 

అర్జునా! నన్ను ఎవరు ఎలా కొలిస్తే నేను వారిని అలాగే అనుగ్రహింతును. మనుష్యు

లెప్పుడూ నా జాడలోనే సంచరింతురు.

శ్లో. కాఙ్క్షన్తః కర్మణాం సిద్ధిం యజన్త ఇహ దేవతాః|

క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. || 4-12 ||

తే.గీ. కర్మ ఫలములు పొందంగ ఘనతరముగ

దేవతాళిని పూజింత్రు తృప్తిఁ గనగ

కర్మ ఫలములు లభియించు ఘనతరముగ

వేగముగ, పార్థ! గ్రహియించు ప్రీతితోడ.

భావము.

కర్మల ఫలితాన్ని కోరుకునే వారు దేవతలను ఆరాధింతురు, మానవ 

లోకంలో కర్మల వలన కలిగే ఫలము త్వరగా లభించును కదా!

శ్లో. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః|

తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్. || 4-13 ||

తే.గీ. గుణము కర్మంబులన్ నాలుగు విధములగు

వర్ణములు గొల్పినాడ నే వరలఁజేయ,

కాను సృష్టిఁ జేసిన నేను కర్త ననియు,

మార్పు లేనివాడననియు మదిని గనుమ.

భావము.

నాలుగు విదాలైన వర్ణాలు గుణ కర్మల విభజనలను అనుసరించి నా వలన 

సృష్టించ బడినవి. వాటిని సృష్టించిన వాడినైనా నేను కర్తను కాననీ, 

మార్పులేని వాడిననీ తెలుసుకో.

శ్లో. న మాం కర్మాణి లిమ్పన్తి న మే కర్మఫలే స్పృహా|

ఇతి మాం యోऽభిజానాతి కర్మభిర్న స బధ్యతే. || 4-14 ||

తే.గీ. నన్ను కర్మలంటవనియు, నాకు నెపుడు

కర్మ ఫల వాంఛ లేదని ఘనతరముగ

నెఱుఁగు వాడు కట్టుబడడీ యిలను మహిత

కర్మ ఫలములచే, పార్థ! కనుము నిజము.

భావము.

నన్ను కర్మలంటవనీ నాకు కర్మ ఫలముపై కోరిక లేదనీ ఎరిగినవాడు

కర్మలచేత కట్టుబడడు.

శ్లో. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః|

కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్. || 4-15 ||

తే.గీ. కర్మమొనరింప బడెను సకలమునెఱిఁగి,

పూర్వమున ముముక్షువులచే పూర్తిగా, మ

రటులె నిష్కామ కర్మంబు నరసి చేయు

మర్జునా! యంచు శ్రీకృష్ణుడనియెఁ దెలియ.

భావము.

ఇది తెలుసుకొనియే పూర్వము ముముక్షువుల చేత కర్మ చేయబడినది.అందు 

వలన పూర్వీకుల చేత పూర్వము చేయబడినట్లే నీవు కూడా నిష్కామ కర్మనే చేయుము.

శ్లో. కిం కర్మ కిమకర్మేతి కవయోऽప్యత్ర మోహితాః|

తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్జ్ఞాత్వా మోక్ష్యసేऽశుభాత్. || 4-16 ||

తే.గీ. ఏది కర్మయగు నకర్మ యేది యగు న

నుచు ఋషులును భ్రాంతులగుటను దెలియవలె,

నీ వశుభము నుండి విముక్తి నియతి నెఱుగఁ

దెల్పెదను నీకు దాని ననల్ప సుగుణ!

భావము.

కర్మ ఏది అకర్మ ఏది అనెడి విషయములో ఋషులు సహితము భ్రాంతిలో 

పడుదురు. దేనిని  తెలుసుకొనిన నీవు అశుభము నుండి విముక్తి పొందుదువో 

ఆ కర్మ విషయము నీకు చెప్పెదను.

శ్లో. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః|

అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః || 4-17 ||

తే.గీ. 

కర్మలను గూర్చెరుగవలె, కర్మలను వి

కర్మలను నకర్మలను ప్రగణితముగను

దెలుసుకొన వలె నర్జునా!తెలియ నవదు

కర్మల స్వభావ నిగూఢ ఘనత భువిని.

భావము.

కర్మల గురించి తెలుసుకొనవలెను. వికర్మల అకర్మల గురించి కూడా తెలుసు

కొనవలెను. కర్మల యొక్క స్వభావము చాలా నిగూఢమైనది.

శ్లో. కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః|

స బుద్ధిమాన్మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్. || 4-18 ||

తే.గీ. కర్మలనకర్మను నకర్మ గర్మమునను

గాంచువాడె బుధుండిలన్, గాంచ యోగి

యతఁడు, కర్మఁ జేసిన ఘనుం డరయ భువిని,

యనుచునర్జునుతోకృష్ణు డనియె తెలియ.

భావము.

కర్మలో అకర్మనీ అకర్మలో కర్మనీ ఎవఁడు దర్శించునో అతఁడు మనుష్యులలో 

అందరికంటే బుద్ధిమంతులు. అతడే యోగి యావత్తు కర్మని పూర్తిగా చేసిన

వాడగును.

శ్లో. యస్య సర్వే సమారమ్భాః కామ సఙ్కల్ప వర్జితాః|

జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పణ్డితం బుధాః. || 4-19 ||

తే.గీ. కామ సంకల్ప రహితుడై కర్మల నిలఁ

జేయు ప్రారంభమెవ్వరు ధ్యేయమలర

జ్ఞాన దగ్ధ కర్ముని వాని గాంచిన ఘనులు

సద్వివేకిగా ఘనులెంత్రు సఖుఁడ! పార్థ! 

భావము.

ఎవరు కామ సంకల్పం లేకుండా అన్ని కర్మలను చక్కగా ప్రారంభింతురో, జ్ఞానాగ్నిలో 

కర్మలన్నిటినీ కాల్చివేయుదురో అతనిని వివేకి అని విద్వాంసులందురు.

శ్లో. త్యక్త్వా కర్మఫలాసఙ్గం నిత్యతృప్తో నిరాశ్రయః|

కర్మణ్యభిప్రవృత్తోऽపి నైవ కిఞ్చిత్కరోతి సః. || 4-20 ||

తే.గీ. కర్మ ఫలబంధమును వీడి, కలిగి తృప్తి,

దేనిపైన ననాధారి యైనవాడు,

కర్మ మగ్నుఁ డైనను గాని కర్మఁ జేయ

నట్టివాడే సుమా మది పెట్టి చూడ.

భావము.

కర్మ ఫలంతో సంగాన్ని వదిలి నిత్యతృప్తుడై దేనిమీద ఆధారపడని వాడై, 

కర్మలలో నిమగ్నుడై ఉండేవాడు ఏకర్మనీ చేయని వాడే అగును.

శ్లో. నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః|

శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్. || 4-21 ||

తే.గీ.  ఆశయే లేక దేహమ్ము ననుపమగతి

నిగ్రహించి, పరిగ్రాహి నేనటంచు

తలప కెవ్వండు చేయునో తనువున పని,

పొంద డెట్టి పాపంబులు, భువిని పార్థ!

భావము.

ఆశలేక, మన శరీరాలను నిగ్రహించి, అన్నిటి యందు పరిగ్రహ భావాన్ని 

వదిలి, కేవలం శరీరంతో కర్మ చేసేవాడు ఏ పాపాన్నీ పొందడు.

శ్లో. యదృచ్ఛాలాభ సన్తుష్టో ద్వన్ద్వాతీతో విమత్సరః| 

సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. || 4-22 ||

తే.గీ. ప్రాప్త మగునదే ఘనమని పరవశించి,

ద్వంద్వమునకు నతీతుఁడై వరలుచుండి,

మత్సరములేక, ఫలితంబు మంచిది కని

పొంగకనె గర్మ సలుప నసంగుఁ డతఁడు.

భావము.

యాదృచ్చికముగా లభించిన దానితో సంతృప్తుడై, ద్వంద్వాలకు అతీతుడై, 

మాత్సర్యం లేకుండా, ఫలం లభించినపుడు కూడా సమంగా ఉండేవాడు 

కర్మ చేసినా బద్ధుడు కాడు.

శ్లో. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతన్ద్రితః|

మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః. || 4-23 ||

తే.గీ. నేను విశ్రాంతియే లేక నిరతము పనిఁ

జేయకున్నచో మనుజులే చేయుదు రయ

నాదు మార్గంబునే గొని మోదమలర,

నీవు గ్రహియింపు మర్జునా నిజమునెపుడు.

భావము.

అర్జునా! నేను విశ్రాంతి లేకుండా నిరంతరం పని చేయకపోతే, మనుష్యులు 

అన్ని విధాల నా మార్గమే అనుసరిస్తారు.

శ్లో. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్|

సఙ్కరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః. || 4-24 ||

తే.గీ. కర్మలన్ నేను విడువ లోకములు నశ్య

మగును, గన వర్ణసంకరం బగును, కార

ణ మిట నేనే యగుదును, మనమున గనిన

ప్రజవినాశన కారినై పాపినగుదు.

భావము.

నేను కర్మలు చేయనిచో ఈలోకములన్నియు నశించి పోవును. వర్ణ సంకరమునకు 

కారకుడనగుదును. ఈ ప్రజలను నాశనము చేసిన వాడనగుదును.

శ్లో. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే|

బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. || 4-25 ||

తే.గీ. దైవ యజ్ఞమున్ కొందరు ధర చరింత్రు,,

బ్రహ్మ మన నగ్ని కర్పిత బ్రహ్మలగుదు

రిలను కొందరీ యజ్ఞమున్ సలలితముగ,

నాత్మ సుజ్ఞాని కర్థమౌ నరయు మీవు.

భావము.

కొందరు యోగులు దైవ యజ్ఞమునే చక్కగా చేయుదురు. కొందరు బ్రహ్మమనే 

అగ్నిలో యజ్ఞము ద్వారా యజ్ఞమును (తనలోని జీవభావాన్ని) అర్పింతురు.

శ్లో. శ్రోత్రాదీనీన్ద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి|

శబ్దాదీన్విషయానన్య ఇన్ద్రియాగ్నిషు జుహ్వతి. || 4-26 ||

తే.గీ. నిగ్ర హాగ్నిలో వేల్త్రు సమగ్రముగను 

కొందరింద్రియంబులు, మరి కొంద రింద్రి

యాగ్నిలోవేల్తురు శ్రవణమాదిగ గల

తృష్ణలన్, దీర్చుకొనుటకు, తెలివి మాలి.

భావము.

శ్రవణం మొదలైన ఇంద్రియాలను కొందరు నిగ్రహమనే అగ్నిలో వేల్చుతారు. 

మరి కొందరు ఇంద్రియము అనే అగ్నిలో శబ్ధాది విషయాలను వేల్చుతారు.

శ్లో. సర్వాణీన్ద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే|

ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. || 4-27 ||

తే.గీ. జ్ఞాన, కర్మేంద్రియంబుల కర్మములను

సంయమాగ్నిలో వేల్తురు సంయమివరు

లిట్లు కొందరరయు మిదియె ఘనము గన,

నాత్మసంయమనంబది యనుపమమిట.

భావము.

మరి కొందరు జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ కర్మ లన్నింటిని జ్ఞానంతో 

వెలిగింప బడిన మన స్సంయమన మనే అగ్నిలో వేల్తురు.

శ్లో. ద్రవ్య యజ్ఞా స్తపో యజ్ఞా యోగయ జ్ఞాస్తథాపరే|

స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః. || 4-28 ||

తే.గీ. కఠిన యత్నంబుతో ఘనుల్ జ్ఞాన, ద్రవ్య,

యోగ, స్వాధ్యాయ, సత్తపో యుక్త యజ్ఞ

ములను కల్గి యుందురిలను పూజ్యముగను,

నీవు గ్రహియింపుమర్జునా! నియతితోడ.

భావము.

మరికొందరు కఠినమైన నియమాలతో ప్రయత్నము చేయుచు ద్రవ్య, తపో, 

యోగ, స్వాధాయ, జ్ఞాన యజ్ఞములు కలిగి ఉందురు..

శ్లో. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథాపరే|

ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. || 4-29 ||

తే.గీ. శ్వాస నల నిరోధించి, యపానమునకు

బ్రాణమున్, బ్రాణమునకు నపాన మెన్ని

యాహుతుల్ చేయుదురు కొంద రనుపము లిల,

నీవు గ్రహియింపుమిద్దియు నిర్మలాత్మ!

భావము.

అటులనే ప్రాణాయామ పరాయణులైన మరి కొందరు ఉచ్వాస 

నిచ్వాసములను నిరోధించి, అపానానికి ప్రాణాన్ని, ప్రాణాన్ని అపానానికి, 

ఆహుతులుగా అర్పింతురు.

శ్లో. అపరే నియతాహారాః ప్రాణాన్ప్రాణేషు జుహ్వతి|

సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. || 4-30 ||

తే.గీ. పరిమితాహారులే ఘనుల్ ప్రాణమునకు

బ్రాణ మాహుతి యొనరింత్రు, వారు యజ్ఞ 

విదులె, కల్మషంబులనిట వీడుచుంద్రు

యజ్ఞములచేత, నిజమిది యరయుమీవు.

భావము.

మరికొందరు నియమితమైన ఆహారాన్ని స్వీకరిస్తూ, ప్రాణాన్ని ప్రాణానికి 

ఆహుతులుగా అర్పింతురు. వీరందరూ యజ్ఞానాలను ఎఱిగినవారే. యజ్ఞం 

వలన కల్మషములను హరింప చేసుకొందురు.

శ్లో. యజ్ఞశిష్టామృత భుజో యాన్తి బ్రహ్మ సనాతనమ్|

నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోऽన్యః కురుసత్తమ. . || 4-31 ||

తే.గీ. యజ్ఞ శేషాన్నమమృతమో యర్జునుండ! 

యజ్ఞ దూరుల కిహమె లే దరసి చూడ

పర మదెట్టులబ్బును కనన్ పార్థ! నిజము.

యజ్ఞములు చేయవలయునేమైనకాని.

భావము.

అర్జునా! యజ్ఞమున సమర్పించగా మిగిలిన ఆహారం అమృతము. యజ్ఞము 

చేయని వారికి ఈ లోకమేలేదు, పరలోకమెక్కడ?

శ్లో. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే|

కర్మజాన్విద్ధి తాన్సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే. . || 4-32 ||

తే.గీ. ఈ విధంబుగ యజ్ఞము లెన్నియో వి

ధములు వేదముల్  వివరించె, ధరను కర్మ

జనితముల్ కను, వరముక్తి కనుమదెఱిఁగి,

నిజమెఱుంగుమోయర్జునా విజయము గన.

భావము.

ఈ విధముగా అనేక విధముల యజ్ఞములు వేదాలలో విస్తరించబడి ఉన్నాయి. అవి 

అన్నియు కర్మల వలన జనించునని తెలుసుకొనుము. ఈ విధముగా తెలుసుకొనినచో విముక్తుఁడవగుదువు.

శ్లో. శ్రేయా న్ద్రవ్య మయా ద్యజ్ఞా జ్జ్ఞాన యజ్ఞః పరన్తప|

సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. . || 4-33 ||

తే.గీ. ద్రవ్యమున జేయు యజ్ఞంబు భవ్య మవదు 

జ్ఞాన యజ్ఞంబు కన్నను గనగ పార్థ!

జ్ఞాన యజ్ఞంబు గొప్పది కలియునన్ని 

రకముల ఫలితముల్ కడు రమ్య గతిని.

భావము.

అర్జునా! పరంతపా! ద్రవ్యంతో చేసే యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞం శ్రేష్ఠమైనది. 

అన్ని రకాల కర్మలూ జ్ఞానంలో లీనమౌతాయి.

శ్లో. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా|

ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వ దర్శినః. . || 4-34 ||

తే.గీ. జ్ఞాన మాత్మార్పణము, సేవ, ధీనిధివయి

ప్రశ్నవేయుట వలనను, పార్థ! యెఱుఁగు

మాత్మ తత్వజ్ఞు లది కడు నాదరముగ

బోధఁ జేయుదురయ నీకు బోధపడగ.

భావము.

జ్ఞానాన్ని ఆత్మార్పణ భావం, సేవ, ప్రశ్నించడం ద్వారా తెలుసుకో, జ్ఞానులు, 

తత్వవేత్తలూ ఐనవారు నీకు ఉపదేశిస్తారు.

శ్లో. యజ్జ్ఞాత్వా న పునర్మోహ మేవం యాస్యసి పాణ్డవ|

యేన భూతా న్యశేషాణి ద్రక్ష్య స్యాత్మ న్యథో మయి. . || 4-35 ||

తే.గీ. ఏది పొందిన మోహాననెపుడు పడవొ,

యేది పొందిన నీలోన నెన్ని చూడ

గలవొ జీవులన్ నాలోన ఘనతరముగ

పొందుమా దానినే నీవు, కుందనేల?

భావము.

అర్జునా! దేనిని పొందిన తిరిగి ఇలా మోహములో పడవో, దేని చేత 

అశేషమైన జీవరాశుల్ని నీలోను, నాలోను చూడగలుగుదువో 

ఆ జ్ఞానాన్ని పొందు.

శ్లో. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాప కృత్తమః|

సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సన్తరిష్యసి. . || 4-36 ||

తే.గీ. పాపు లందరిలో మహా పాపివయిన

జ్ఞాన మనియెడి పడవలో ఘనతరముగ

పాపమును దాటగల వీవు పట్టుపట్టి,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.

భావము.

పాపులందరిలోకి ఎక్కువ పాపం చేసిన వాడివైనా పాపాన్నంతటినీ 

జ్ఞానమనే పడవతో దాటఁగలవు.

శ్లో. యథైధాంసి సమిద్ధోగ్నిర్భస్మసాత్కురుతేऽర్జున|

జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా. . || 4-37 ||

తే.గీ. కట్టెలను కాల్చు జ్వలితాగ్ని, యట్టులేను

జ్ఞాన రూపాగ్ని కర్మలన్ గాల్చివేయు,

ఘనతరంబగు జ్ఞాన సంస్కారి వగుమ,

కర్మలన్ బాసి శుభములే కనుము పార్థ!

భావము.

అర్జునా జ్వలించే అగ్ని కట్టెలను కాల్చినట్లుగా, జ్ఞానమనే అగ్ని 

కర్మలను కాల్చివేస్తుంది.

శ్లో. న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే|

తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విన్దతి. . || 4-38 ||

తే.గీ. జ్ఞాన మట్లు పవిత్రమై కలుగదన్య

మరయ, నిజమిది, సుజ్ఞాని నిరుపమముగఁ

బొందు తనలోనె జ్ఞాన మున్, సుందరముగ,

నీవునట్టులే పొందనౌ నేర్పుమీర.

భావము.

జ్ఞానం లాగ పవిత్రమైనది ఇంకొకటి లేదు. యోగ సంసిద్దిని పొందినవాడు 

దానిని కాలక్రమేణా తనలోనే పొందఁగలఁడు.

శ్లో.  శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేన్ద్రియః|

జ్ఞానం లబ్ధ్వా పరాం శాన్తి మచిరే ణాధిగచ్ఛతి. . || 4-39 ||

తే.గీ.. శ్రద్ధ నింద్రియ నిగ్రహ జాణ యగుచు,

తనదు జ్ఞానానుభూతినే తనదు లక్ష్య

ముగను గలిగినవాడిల పొందు జ్ఞాన

దీపితంబగుననుభూతి దేలు శాంతి.

భావము.

శ్రద్ధతో ఇంద్రియ నిగ్రహాన్ని కలిగివుండి, జ్ఞానానుభవాన్ని లక్ష్యంగా 

పెట్టుకున్న సాధకుడు ఈ జ్ఞానము చేతలభించు పరమ శాంతిని పొందును

శ్లో. అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి|

నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. . || 4-40 ||

తే.గీ. జ్ఞానమున్ శ్రద్ధ కొరవడ్డ సంశయాత్ము

డునశియిం చిహము పరము గనగలేడు,

సుఖము పొందగ లేడిల చూడగాను,

నీవు గ్రహియింపుమర్జునా! నేర్పు మీర.

భావము.

జ్ఞానం, శ్రద్ధ కొరవడిన సంశయాత్ముడు నశించును. సంశయంలో 

పడ్డవాడికి ఈ లోకంలేదు. పరలోకమూ లేదు. సుఖం కూడా లేదు.

శ్లో. యోగసంన్యస్త కర్మాణం జ్ఞానసఞ్ఛి న్నసంశయమ్|

ఆత్మవన్తం న కర్మాణి నిబధ్నన్తి ధనఞ్జయ. . || 4-41 ||

తే.గీ. యోగమునకర్మలన్ వీడు యుక్తిపరుని,

జ్ఞానమున సంశయచ్ఛేద ఘనుని యాత్మ

ని‌ష్ఠు నే కర్మలున్ గట్ట నేర విలను,

పార్థ! గ్రహియింపుమిదినీవు పట్టుపట్టి.

భావము.

అర్జునా! యోగం వలన కర్మలను వదిలించుకొని, జ్ఞానం వలన 

సంశయాలను నివృత్తి చేసుకున్న ఆత్మ నిస్టుడిని కర్మలు బంధించలేవు.

శ్లో. తస్మాదజ్ఞాన సమ్భూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః|

ఛిత్త్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత. . || 4-42 ||

తే.గీ. ఆత్మ సుజ్ఞాన ఖడ్గాన నసదృశముగ

నీదు సంశయముల్ నీవు నేర్పు మీర 

ఛేదనము చేసి యోగంబు చేయబూను

మర్జునా! లేచి నిలబడుమభయమిత్తు.

భావము.

అందుచేత అజ్ఞానం వలన జనించి నీ హృదయంలో ఉన్న సంశయమును 

ఆత్మజ్ఞానమనే ఖడ్గంతో ఛేదించి, యోగమును అవలంబించు. అర్జునా

లేచి నిలబడుము.

ఓం తత్సత్.

శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిధ్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున

సంణ్వాదే జ్ఞానకర్మ సన్న్యాసయోగో నామ చతురెథోధ్యాయః.

  

5వ అధ్యాయము.

కర్మసన్యాస యోగము.






















































పఞ్చమోధ్యాయః 

కర్మసన్న్యాసయోగః


అర్జున ఉవాచ|

భావము.

అర్జునుఁడు ఇట్లనెను.

శ్లో. సంన్యాసం కర్మణాం కృష్ణ! పునర్యోగం చ శంససి|

యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్. || 5-1 ||

తే. కర్మసన్యాస మొకపరి, కర్మయోగ

మొకపరి ప్రశంసితములయ్యె, నొక్కదాని

నిందు ఘనమైనదేదియో ముందు తెలుపు

మయ్య! శ్రీకృష్ణుఁడా!యనె నర్జునుండు.

భావము.

ఓ కృష్ణా ఒకసారి కర్మ సన్యాసాన్ని, మరొకసారి కర్మ యోగాన్ని పొగుడుతున్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో దానిని నాకు తెలుపుము.

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ కృష్ణుడన్నాడు.

శ్లో. సన్న్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయస కరావుభౌ|

తయోస్తు కర్మసంన్యాసాత్కర్మయోగో విశిష్యతే. || 5-2 ||

తే.గీ. కర్మసన్యాసము మరియు కర్మ యోగ

ము ఘనమైన వానందదము లరయగ ను,

కర్మసన్యాసమే మేలు కర్మయోగ

ము సరి కాదు దానికి చూడ ముక్తిదమది.

భావము.

కర్మసన్యాసమూ, కర్మయోగమూ రెండూ కూడా ఉత్తమమైన ఆనందానికి తీసుక వెళ్ళునవే. ఐతే ఈ రెండింటిలో కర్మ యోగము కర్మసన్యాసము కంటే మెరుగైనది.

శ్లో. జ్ఞేయః స నిత్యసంన్యాసీ యో న ద్వేష్టి న కాఙ్క్షతి|

నిర్ద్వన్ద్వో హి మహాబాహో సుఖం బన్ధాత్ప్రముచ్యతే. . || 5-3 ||

తే.గీ. కనగ నద్వేషియు విముక్త కాంక్షు డిలను

నిత్యసన్యాసి, కనుమిది నీవు పార్థ!

ద్వంద్వ భావరహితుడిట బంధముక్తు

డగును, నిజమిది భువిపైన సుగుణధామ!

భావము.

ఎవరైతే ద్వేషించకుండా, కాంక్షించకుండా ఉంటాడో, అతఁడే నిత్యసన్యాసి అని తెలుసుకో. ఓ మహాబాహూ! ద్వంద్వాలు లేనివాడే బంధాల నుండి తేలికగా విడుదల పొందఁగలడు.

శ్లో. సాఙ్ఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదన్తి న పణ్డితాః|

ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విన్దతే ఫలమ్. . || 5-4 ||

తే.గీ. సాంఖ్య మని యోగ మని యంద్రు చంటివారు,

పెద్దలట్టుల పల్కరు విజ్ఞులగుట

నెవ్వరారెంట నొకదాని నెన్ని నిలుతు

రట్టి వారికీ రెండును నమరు పార్థ!

భావము.

పసివారు (అజ్ఞానులు) మాత్రమే సాంఖ్యమూ, యోగమూ వేరు వేరు అని అంటారు. విద్వాంసులు అనరు. ఎవరైతే ఒకదానిలో సరిగా నిలబడుదురో వారికి రెండింటి ఫలమూ లభించును.

శ్లో. యత్సాఙ్ఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే|

ఏకం సాఙ్ఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. . || 5-5 ||

తే.గీ. సాంఖ్యు లేస్థానమును పొంది, సమ్మతిఁ గను

చుందు రట్టిదే యోగులున్ పొందుదు రిల

సాంఖ్యయోగంబులొకటంచు సరసులు గను

చుందు రవ్వారి దృష్టియే శుద్ధమరయ.

భావము.

సాంఖ్యులచేత ఏస్థానం పొందబడుతుందో, ఆస్థానమే యోగులుచేత పొందబడుతుంది. సంఖ్య యోగాన్ని ఒకటిగా ఎవరు చూస్తున్నారో వారే నిజమైన దృష్టి కలిగిన వారు.

శ్లో. సన్న్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః|

యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్ఛతి. . || 5-6 ||

తే.గీ. కర్మయోగ దూరులకిల కష్టమగును

కర్మసన్న్యా ససాధన, కర్మయోగు

లనతికాలమునను బ్రహ్మమంద గలరు,

తేలికగనే మహాబాహు! తెలియుమిదియు.

భావము.

ఓ మహాబాహో! కర్మయోగం చెయ్యని వాళ్ళకు కర్మసన్యాసాన్ని సాధించడం కష్టం. కర్మ యోగంతో కూడిన మానవుడు త్వరలోనే తేలికగా బ్రహ్మమును చేరుకుంటాడు.

శ్లో‌. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేన్ద్రియః|

సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. . || 5-7 ||

తే.గీ. కర్మ యోగమ్మునన్ గూడి, నిర్మలమగు

చిత్తముండి జితేంద్రియ సిద్ధులిలను,

తెలియుదురిల నాత్మ వలెను దీపితమగు

పరుల యాత్మలన్, జిక్కరు బంధములకు.

భావము.

కర్మ యోగంతో కూడుకొని, విశుద్ధం ఐన బుద్ధితో మనస్సు, ఇంద్రియాలను జయించి, అన్ని ప్రాణులలోని ఆత్మను తన ఆత్మగా తెలుసుకున్న వాడు కర్మలను చేసినా బంధంలో చిక్కుకోడు.

శ్లో. నైవ కిఞ్చిత్కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్|

పశ్యఞ్శృణ్వన్స్పృశఞ్జిఘ్రన్నశ్నన్గచ్ఛన్స్వపఞ్శ్వసన్. . || 5-8 ||

తే.గీ. సత్య మెఱిగిన యోగి తా సతము గనుచు

చూచుట, వినుటయును, స్పృశించుటయు, గాలి

పీల్చుట, తినుట, వాసన పీల్చుటయును

నిద్రయును, తాను చేయమిన్ నిరత మెఱుఁగు.

భావము.

పరమసత్యాన్ని ఎఱిఁగిన యోగయుక్తుడు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, స్పృశించుచున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పడుకుంటున్నఫ్ఫుడు, ఊపిరి పీలుస్తున్నప్పుడు

శ్లో. ప్రలపన్విసృజన్గృహ్ణన్నున్మిషన్నిమిషన్నపి|

ఇన్ద్రియాణీన్ద్రియార్థేషు వర్తన్త ఇతి ధారయన్. . || 5-9 ||

తే.గీ. మాట లాడునప్పుడు, వీడి మనునపుడును,

పట్టుకున్నప్డును, కనురెప్ప పడి తెరచు

నపుడు నింద్రియముల్ విషయముల సంచ

రించుట నెఱుఁగు, నిజమునే, యెఱుఁగు తాను.

భావము.

మాట్లాడుతున్నప్పుడు, వదిలేస్తున్నప్పుడు, పట్టుకుంటున్నప్పుడు. కనురెప్ప…

శ్లో. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సఙ్గం త్యక్త్వా కరోతి యః|

లిప్యతే న స పాపేన పద్మపత్రమివామ్భసా. . || 5-10 ||

తే.గీ. బ్రహ్మ కర్పించి కర్మలన్, భక్తి గలిగి,

సంగ భావంబు వీడిన సన్నుతు లిల

నీట తామర తడవని వాటమునను

పాప మంటక శుద్ధులై వరలుదురిల.

భావము.

ఎవరైతే కర్మలను బ్రహ్మమునకు అర్పించి, సంగభావాన్ని వదిలి పనిచేయుదురో, అట్టివాడు నీటిలో ఉన్న తామరాకు ఎటుల నీటివలన తాకబడదో అటులనే పాపము చేత తాకబడడు.

శ్లో.  కాయేన మనసా బుద్ధ్యా కేవలైరిన్ద్రియైరపి|

యోగినః కర్మ కుర్వన్తి సఙ్గం త్యక్త్వాత్మశుద్ధయే. || 5-11 ||

తే.గీ.  త్రికరణములను శుద్ధులై ప్రకటితమగు

సంగ రహితులై యోగులు సకలకార్య

ములను కేవలేంద్రియములన్ బూర్తి చేసి

కర్మఫలదూరులైయుందురర్మిలి సఖ!

భావము.

యోగులు తమ అంతఃకరణ శుద్ధి కోసం సంగభావాన్ని వదిలి కేవలం శరీర, మనో, బుద్ధి. ఇంద్రియాలతో మాత్రమే కర్మలు చేస్తారు.

శ్లో. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాన్తిమాప్నోతి నైష్ఠికీమ్|

అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. || 5-12 ||

తే.గీ.  అరయ కర్మఫలత్యాగి యగుచు యోగి

శాశ్వతంబైన శాంతినే సతము గనును.

కోరికలు వీడనేరక కూరుకొనుచు

పోవుచుండును బంధనములను యోగి.

భావము.

యోగయుక్తుడైన వాడు కర్మఫలాన్ని వదిలి పెట్టి శాశ్వత మైన శాంతిని పొందుతాడు. యోగికానివాడు కోరికల కారణంగా కర్మఫలానికి అతుక్కు పోయి బంధింప బడతాడు.

శ్లో.  సర్వకర్మాణి మనసా సంన్యస్యాస్తే సుఖం వశీ|

నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్. || 5-13 ||

తే.గీ.  కర్మసన్యాసి విజితాత్ముఁ డర్మిలి తన

దేహదేవాలయంబున తేలుచుండు

సంతసమ్మున నేమియున్ సుంతయేని

చేయడిక చేయఁజేయడు జితవిధాత. 

భావము.

మానసికంగా అన్ని కర్మల్ను సన్యసించి, పూర్తిగా తనను తాను స్వాధీనంలో ఉంచుకున్న దేహధారి, తొమ్మిది ద్వారాల పురంలో తాను ఏమీ చేయకుండా, ఎవరిచేత చేయించ కుండా సుఖంగా ఉంటాడు.

శ్లో.  న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః|

న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే. || 5-14 ||

తే.గీ. క్షితిని కర్తృత్వమున్ కర్మ సృజన చేయ

డరయ దైవమ్ము, కర్మ మహాఫలంబు

లందబోవడు, ప్రకృతియె యట్టు లమరి

నడచుచుండును సృష్టి నీవరయు మిదియు.

భావము.

భగవంతుడు కర్తృత్వాన్ని గానీ, కర్మలని గానీ సృజించడం లేదు. కర్మ ఫలంతో సంయోగాన్ని ఆయన చేయడు. ప్రకృతే ఆ ప్రకారముగా వ్యవహరించుచున్నది.

శ్లో.  నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః|

అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యన్తి జన్తవః. || 5-15 ||

తే.గీ. పుణ్య పాపంబులు గొనని పూజ్యుఁడు హరి,

జ్ఞాన మదికప్పబడెడు నజ్ఞానమునను,

భ్రాంతిలో మున్గి ప్రాణులు వర్తిలుటను

తెలియవచ్చును చూచినన్ దెలివిఁ గలిగి.

భావము.

భగవంతుడు పాపాలను కాని, పుణ్యాలని కాని స్వీకరించడు. జ్ఞానం అజ్ఞానంచేత కప్పబడును. అందుచేత ప్రాణులు భ్రాంతులగుదురు.

శ్లో. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః|

తేషామాదిత్యవజ్జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్. || 5-16 ||

తే.గీ.  పూర్ణ సుజ్ఞాన బలముచే పూర్తిగాను

వసుధ నజ్ఞాన మెవనిలో పాతఁబడునొ

వానిలో దైవతేజంబు  భానునివలె

చూడ గనిపించు నిజమిది సుగుణతేజ!

భావము.

ఎవరిలో నయితే సమగ్రమైన జ్ఞానం ద్వారా అజ్ఞానం నాశనం చేయబడినదో వారిలో ఆ పరమాత్మ జ్ఞానము సూర్యునివలె ప్రకాశింప బడును.

శ్లో. తద్బుద్ధయ స్తదాత్మాన స్తన్నిష్ఠా స్తత్పరాయణాః|

గచ్ఛన్త్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. || 5-17 ||

తే.గీ.  ఆత్మలో బుద్ధి నిలుపుచు నాత్మభావ

మునె మదినినింపి యాత్మయే ముఖ్యమనెడి

జ్ఞాన నిర్దూత కల్మషుల్ ఘనులు కనగ

జన్మరాహిత్యమొందు ప్రశస్తముగను.

భావము.

ఆత్మలోనే బుద్ధిని నిలిపి, ఆత్మభావంతో మనసు నింపి, ఆత్మనే అంతిమ లక్ష్యముగా పెట్టుకొని ఆత్మాభాసము చేసేవారు పాపములు నశింప బడిన వారై తిరిగిరాని స్థితిని పొందుదురు.

శ్లో.  విద్యావినయ సమ్పన్నే బ్రాహ్మణే గవి హస్తిని|

శుని చైవ శ్వపాకే చ పణ్డితాః సమదర్శినః. || 5-18 ||

తే.గీ. వసుధ విద్యా వినయులగు బ్రాహ్మణులను, 

కుక్క నేనుగున్ గోవును కుక్క మాంస

భక్షకుల సమదృష్టితోఁ బరిగణించు

పండితుడు సమదర్శియై, వంద్యుడతఁడు.

భావము.

మహాత్ములు విద్యా వినయాలతో కూడిన బ్రాహ్మణుడిలో, గోవులో, ఏనుగులో, కుక్కలో, కుక్కమాంసాన్ని వండుకుని తినే చంఢాలునిలో కూడా పండితులు సమాన తత్వాన్నే చూస్తారు.

శ్లో.  ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః|

నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః. || 5-19 ||

తే.గీ.  ఎవరి మనసు సామ్యస్థితి నెల్లవేళ

లందు నిలుచునో వారలే యనుపమమగు

విజిత సంసార బంధ స న్నిజశరీరు

లరయ వారలా బ్రహ్మమే ధరణిఁ దలప.

భావము.

ఎవరి మనస్సు సామ్యస్థితిలో నిలిచి ఉండునో, వారు ఈ శరీరములో ఉండగనే సంసారమును జయింతురు. నిర్దోషమైన బ్రహ్మము అన్నింటా సమముగా ఉన్నందున వారు కూడా బ్రహ్మములోననే నిలిచి ఉందురు.

శ్లో.  న ప్రహృష్యే త్ప్రియం ప్రాప్య నోద్విజే త్ప్రాప్య చాప్రియమ్|

స్థిరబుద్ధి రసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. || 5-20 ||

తే.గీ. సుస్థిరంబగు బుద్ధితో శోభిలుచును

భ్రాంతి రహిత బ్రహ్మజ్ఞాని పరవశింప

డతని కానందదంబైనదందినపుడు,

క్రుంగ డప్రియప్రాప్తికిన్, గుణనిధాన!

భావము.

స్థిరమైన బుద్ధితో, బ్రాంతి రహితుఁడై బ్రహ్మతత్వములోనిలిచి ఉన్న బ్రహ్మజ్ఞాని, ప్రియమైనది లభించినపుడు సంతోషించడు అప్రియమైనది లభించినప్పుడు ఉద్వేగమును పొందడు.

శ్లో.  బాహ్యస్పర్శే ష్వసక్తాత్మా విన్దత్యాత్మని యత్సుఖమ్|

స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. . || 5-21 ||

తే.గీ. బాహ్యమౌ స్పర్శ లేనట్టి బ్రహ్మవేత్త

సుఖము నాత్మానుభూతితో శోభిల గను,

నిరుపమానంద సామ్రాజ్య నేత యతఁడు,

ధరణిపై వెల్గు నిరుపమ ధన్యు డతఁడు.

భావము.

బాహ్య స్పర్శలో తగుల్కోనివాడు, ఆత్మలో ఉండే సుఖాన్ని పొందును. బ్రహ్మతత్వానుసంధానములో నిలిచిన ఆ యోగి అనంతమైన ఆనందాన్ని పొందును.

శ్లో.  యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే|

ఆద్యన్తవన్తః కౌన్తేయ! న తేషు రమతే బుధః. . || 5-22 ||

తే.గీ.  బాహ్య సంస్పర్శ భోగమ్ములేహ్యమయిన

దుఃఖ మూలమ్ము లెఱుఁగుమా, తోచలేదొ?

యవధులున్నట్టివాటికై యరుగరెపుడు

సద్వివేకులు, ముక్తిసత్సారవిదులు.

భావము.

కుంతీకుమారా! బాహ్య విషయ స్పర్శలవలన జనించు భోగములన్నియు దుఃఖములకు మూలమే. ఆది అంతములతో కూడుకొనిన ఆ క్షణిక సుఖములలో వివేకవంతుఁడు రమించడు.

శ్లో.  శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్|

కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః. . || 5-23 ||

తే.గీ.  దేహ జనిత కామాదులఁ దేల కెవ్వ

డవని నెదిరించి నిలుచునో యతఁడె యోగి,

యతఁడె సుఖమును పొందునో యగణిత గుణ!

ముక్తిఁ గైకొంట కద్దియే ముఖ్యపథము.

భావము.

ఏవరైతే ఈ శరీరం ఉండగానే కామక్రోధముల నుండి పుట్టిన ప్రేరణలని తట్టుకొనుటకు సమర్ధుఁడగునో, అతడే యోగి, అతడే సుఖవంతుఁడగును.

శ్లో. యోऽన్తఃసుఖోऽన్తరారామస్తథాన్తర్జ్యోతిరేవ యః|

స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్ఛతి. . || 5-24 ||

తే.గీ.  ఎవ్వఁ డాత్మలో నానంద మెన్నుచు గను

నాత్మలో జ్ఞాన సజ్జ్యోతి ననవరతము

నిలుపుకొనునాతఁడే యోగి, తలచిచూడ

నతఁడె బ్రహ్మమై మోక్షంబు ననుభవించు.


భావము.

ఎవరైతే తనలోనే సుఖమును పొందుతూ, తనలో తాను ఆనందించుచు తనలోనే జ్ఞాన జ్యోతిని నిలుపుకున్న యోగి బ్రహ్మ స్వరూపుడై మోక్షమును పొందును.

శ్లో.   లభన్తే బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః|

ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. . || 5-25 ||

తే.గీ. కల్మష విదూరమై భేదముల్మనమును

వీడిపోయి నిగ్రహశక్తి పెరిఁగి మదిని

ప్రాణికోటి హితమునెన్ను వారె ఋషులు,

వారె బ్రహ్మనిర్వాణంబుఁ బడయు ఘనులు.

భావము.

కల్మషాలు నశించి, భేదభావం తొలగిపోయి, మనస్సుని నిగ్రహించి, అన్ని ప్రాణుల హితాన్ని కోరే ఋషులు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుదురు.

శ్లో.   కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసామ్|

అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్. . || 5-26 ||

తే.గీ. విజిత కామాదుడై గొప్ప పేరుగాంచి,

విజిత మానసుడై, యాత్మ విశ్వరూప

మెఱుఁగు నెవ్వ డా యోగికి నెఱుఁగఁ దగిన

బ్రహ్మనిర్వాణ సుస్థితి పట్టుబడును. 

భావము.

కామక్రోధాల నుండి విడిపడి, మనస్సును జయించి, ఆత్మ స్వరూపాన్ని ఎఱిఁగిన యతులకు బ్రహ్మ నిర్వాణస్థితి అంతటా ఉండును.

శ్లో.  స్పర్శాన్కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాన్తరే భ్రువోః|

ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యన్తరచారిణౌ. . || 5-27 ||

తే.గీ.  ఇలను బాహ్యేంద్రియానుభూతులను గొనక

నెట్టివేయుచు భృకుటిపై పెట్టి ధ్యాస

తలచ వలయు ప్రాణాపానములను సమము

గా మదిని జూడ వలయును, కనుమటులనె.

భావము.

శబ్దస్పర్శాది బాహ్య ఇంద్రియ విషయాలను బయట నుంచి బయటకే నెట్టివేసి, ధ్యాసను భ్రూమధ్యంలో నిలిపి, నాసికారంధ్రాల ద్వారా చలిస్తున్న ప్రాణ, అపాన వాయువులను సమానంగా చూడాలి.

శ్లో.  యతేన్ద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః|

విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః. . || 5-28 ||

తే.గీ.  ఇంద్రియంబుల్మనోబుద్ధులిలగ్రహించి

మోక్షమే లక్ష్యముగ గల్గి, పూర్తిగాను

కోపమున్ భయమును వీడి కోరికలిక

లేని ఋషియే గనున్ ముక్తి లీలగాను!

భావము.

ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి, మోక్షమే తన అంతిమ లక్ష్యముగా పెట్టుకుని కోరికలను, భయమును, కోపమును వదిలిన ఋషి ఎప్పుడూ ముక్తుడే.

శ్లో.  భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్|

సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాన్తిమృచ్ఛతి. . || 5-29 ||

తే.గీ.  యజ్ఞ తపముల భోక్తగా, నన్ని ప్రాణు

లకును హితునిగా, ప్రభువుగా సకల మరయ

నేనెగా గాంచు ఘనుడిల నిత్య సుఖియు,

ముక్తుడున్ గాంచ నిజమిది, పుడమిపైన.

భావము.

యజ్ఞాలకు తపస్సులకి భోక్తగా, అన్ని లోకాలకు ప్రభువుగా, అన్ని ప్రాణుల హితము కోరువాడిగా నన్ను తెలుసుకున్న వాడు శాశ్వత శాంతి పొందును.


ఓం తత్సదితి

శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సుబ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే కర్మసన్న్యాస యోగో నామ పంచమోధ్యాయః.












షష్ఠోధ్యాయః 

ఆత్మసంయమయోగః


శ్రీభగవానువాచ|

భావము.

భగవానుడనుచున్నాడు.

శ్లో.  అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః|

స సంన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. || 6-1 ||

తే.గీ. కర్మ ఫలలాభమునకయి కాంచకుండ

కర్మములు చేయు నెవ్వడు ఘనుఁ డతండు,

కర్మసన్యాసి తలపగ కవ్వడి! విను

మగ్నికార్యకర్మంబుల నతఁడు చేయు.

భావము:

కర్మఫలము పైన ఆధారపడకుండా, చేయ వలసిన కర్మని ఎవరు చేయునో 

అతడే కర్మ సన్యాసీ, కర్మ యోగి కూడా అగ్ని కార్యాన్నీ, కర్మనీ వదిలివేసినవాడు కాదు.

శ్లో.  యం సన్న్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాణ్డవ|

న హ్యసన్న్యస్తసఙ్కల్పో యోగీ భవతి కశ్చన. . || 6-2 ||

తే.గీ. కనగ సన్న్యాసమే యోగ మనగ నెఱుఁగు

మెవరు సంకల్పమును వీడ రవని వారు

యోగి కానేరరర్జునా! భోగులరయ,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.

భావము:

అర్జునా దేనిని సన్యాసమని అంటారో అదేయోగమని తెలుసుకో. 

సంకల్పాలను సన్యసించనివాడు ఎవడూ యోగికాలేడు.

శ్లో.  ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే|

యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. . || 6-3 ||

తే.గీ.  ధ్యాన యోగ సాధకునకుఁ దలచి చూడ

నిత్య నిష్కామకర్మమే నిరుపమ గతి,

యోగ సిద్ధునకెటులైన నొప్పిదముగ

మహిని గాంచ కర్మత్యాగ మార్గమొప్పు.

భావము:

ధ్యానయోగాన్ని సాధించదలచిన మునికి నిష్కామకర్మయోగమే మార్గము. 

యోగసిద్ధి పొందినవాడికి కర్మత్యాగమే సాధనము.

శ్లో. యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే |

సర్వసంకల్పసన్న్యాసీ యోగారూఢస్తదోచ్యతే. . || 6-4 ||

తే.గీ.  విషయ కర్మములపయినఁ బ్రీతి లేక

సకల సంకల్పముల్ వీడు సన్నుతు నిల

ననితరమగు యోగారూఢు డందురరయ,

తెలియుమర్జునా నిజమిది, తెలియవలయు.

భావము.

ఇంద్రియ విషయములపై కాని, కర్మలపై కాని ఆసక్తి లేకుండా 

సంకల్పములన్నీ విడిచిపెట్టినవాడిని యోగారూఢుడందురు.

శ్లో.  ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ |

ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః ||. || 6-5 || 

తే.గీ.  శత్రువును బంధువాత్మయే సరిగ నరయ

మానవులకిలన్, కాన యా మానవుండె

తనను తానుద్ధరించుకోతగును, నిజము,

పతనమును పొందతగదు శుభంబుఁ గనగ.

భావము.

తన మనస్సే తనకు బంధువూ, శత్రువూ కూడా. కనుక మానవుడు 

తనను తానే ఉద్ధరించుకొనవలెను. తన ఆత్మను అధోగతి పాలు

చేసుకోకూడదు.

శ్లో.  బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః |

అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. . || 6-6 ||

తే.గీ.  ఆత్మజితునకు బంధువా యాత్మ నిజము,

కానివానికి శత్రువే కనగ నాత్మ,

కాన యాత్మ నిల జయించు ఘనులు ఘనులు,

చేతకాకున్న నది వారి చేటు నిజము.

భావము.

మనస్సును స్వాధీనపరచుకున్నవాడికి తన మనస్సే బంధువు. 

మనసును జయించనివాడికి తన మనస్సే ప్రబల శత్రువుగా ప్రవర్తించును.

శ్లో.  జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః |

శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానావమానయోః || . || 6-7 ||

తే.గీ.  ఆత్మ జితుఁడే ప్రశాంతుఁడౌ నరసి చూడ

నాతనికి దైవదర్శన మనవరతము

కలిగి, శీతోష్ణ సుఖదుఃఖములును మాన

ము నవమానమునొకటిగా కనగలుగును.

భావము.

ఆత్మను జయించిన ప్రశాంతచిత్తుడు పరమాత్మ సాక్షాత్కారము 

నిరంతరము పొందుతూ శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానావమానములపట్ల 

సమభావము అతనికి కలుగుచుండును.

శ్లో.  జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః |

యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః  || 6-8 ||

తే‌.గీ. జ్ఞాన విజ్ఞాన తృప్తుఁడౌ ఘనుఁడు, నిర్వి

కారుడును జితేంద్రియుఁడు, బంగారము,శిల,

మట్టినొకటిగా కనువాఁడు మహిని యోగి,

గాను జెప్పఁబడును పార్థ! ఘనుఁడ! కనుమ.

భావము.

శాస్త్రజ్ఞానమువలనను, అనుభవజ్ఞానమువలనను సంతృప్తి చెందినవాడు, 

నిర్వికారుడు, ఇంద్రియాలను జయించినవాడు, మట్టినీ రాతినీ 

బంగారమున్నీ సమదృష్టితో చూసేవాడు యోగి అని చెప్పబడును.

శ్లో. సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు |

సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే || . || 6-9 ||

తే.గీ. సాధువుల, సుహృ న్మిత్రులన్ శత్రువులను,

బంధువులను విరోధులన్, వసుధపైన

ఘన దురాచారులన్ మదిన్ గాంచునెవఁడు

నొక్కటిగ ఘనుఁడతఁడె సర్వోత్తముండు.

భావము.

శ్రేయోభిలాషి, స్నేహితుడు, శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, 

విరోధి, బంధువు, సాధువు, దురాచారి—వీళ్ళందరిపట్ల సమబుద్ధి 

కలిగినవాడే సర్వోత్తముడు.

శ్లో.  యోగీ యుఞ్జీత సతతమాత్మానం రహసి స్థితః |

ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః  . || 6-10 ||

తే.గీ. యోగి యేకాంత వాసియై యింద్రియముల

ను, మదిని వశపరచుకొని, కుమతి వీడి

యేమియు గొనక,చిత్తంబు నెటులనైన

నాత్మపై నిల్పవలెను నిరంతరంబు.

భావము.

యోగి ఏకాంత స్థలంలో ఒంటరిగా ఉండి, ఆశలను వదలి, 

ఇంద్రియాలనూ మనస్సునూ వశపరచుకుని, ఏమీ పరిగ్రహించకుండా 

చిత్తాన్ని ఆత్మమీదే నిరంతరము నిలుపవలెను.

శ్లో.  శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః |

నాత్యుచ్ఛ్రిత్రం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ || 6-11 || 

తే.గీ. ధరణి సమతలమందున దర్భగడ్డి

పరచి దానిపై చర్మమున్ బరచి దాని

పైన వస్త్రమ్ము పరచియ ద్దాని పైన

స్థిరముగాకూర్చొని తపము సేయ వలయు.

భావము.

ఎక్కువ ఎత్తూ పల్లమూ కాని పరిశుద్ధమైన ప్రదేశములో దర్భలు పరచి, 

దానిమీద చర్మమూ, ఆపైన వస్త్రమూ వేసి తన స్థిరమైన ఆసనమును 

ఏర్పరచుకొనవలెను.

శ్లో.  తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః |

ఉపవిశ్యాసనే యుంజ్యాత్, యోగమాత్మవిశుద్ధయే.  || 6-12|| 

తే.గీ.  ఆసనముపైన గూర్చుండి, ధ్యాసనిలిపి,

యింద్రియములను, మనసునో యింద్రసముడ!

వశ పరచుకొని, మదినిల్పి, నిశలు నహము

లాత్మ శుద్ధికై యోగిగానగుట తగును.

భావము.

ఆ ఆసనంమీద కూర్చుని, ఇంద్రియాలనూ మనస్సునూ స్వాధీన 

పరచుకుని, ఏకాగ్రచిత్తంతో ఆత్మశుద్ధికోసము యోగాభ్యాసము చేయవలెను.

శ్లో.  సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః|

సమ్ప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్.  || 6-13|| 

తే.గీ.  దేహమును, మెడన్, దలను, మదిని దలంచి

తిన్నగా దృష్టి నాసాగ్ర మున్నిలుపుచు,

సాధనము చేయవలెనయ్య! సరస సుగుణ!

యోగమున్ జేయఁ దగునిట్లు యోగివగుచు.

భావము. 

శరీరమును, మెడను, తలను నిటారుగా కదలకుండా ఉంచి, దిక్కులు చూడకుండా తన ముక్కు కొసని చూస్తూ....

శ్లో.  ప్రశాన్తాత్మా విగతభీర్బ్రహ్మచారివ్రతే స్థితః|

మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. .  || 6-14|| 

తే.గీ.  భయము వీడి, ప్రశాంతుడై, బ్రహ్మచర్య

దీక్ష నూని, జితమనస్కుఁడై క్షమమున

నన్నె చిత్తంబునన్ నిల్పి, నన్నుఁ జేర

ధ్యానమును లక్ష్య యుక్తుఁడై తనియవలయు.

భావము.

ప్రశాంతమైన మస్సుతో భయాన్ని విడిచి, బ్రహ్మచర్య వ్రతములో నిలిచి, మస్సును బాగుగా నిరోధించి, నాపై చిత్తమును న్ని నిలిపి, నన్ను చేరు లక్ష్యముతో ధ్యాన యుక్తుడై ఉండవలెను.

శ్లో.  యుఞ్జన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః|

శాన్తిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్ఛతి. .  || 6-15|| 

తే.గీ.  ఆత్మ నిగ్రహమున యోగి యహరహంబు

ధ్యాన మగ్నుఁడై నాలోన ననుపమముగ

కలిగినట్టిది, మోక్షమై ఘనతరమగు

శాంతి పొందును, కనుమిది సన్నుతాత్మ!

భావము.

మనస్సును నిగ్రహించి యోగి ఈ విధముగా ఎప్పుడూ ఆత్మను ధ్యానములో నిలిపి, నాలో ఉన్నదీ, మోక్షరూపమైనదీ అయిన శాంతిని పొందఁగలఁడు.

శ్లో.  నాత్యశ్నతస్తు యోగోऽస్తి న చైకాన్తమనశ్నతః|

న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. .  || 6-16 || 

తే.గీ.  అతిగ తినువా డసలు తిననట్టి వాడు,

నతిగ నిద్రించువాడును, క్షితిని యసలు

నిద్రపోనట్టివాడును నిలువ లేడు,

సాత్వికాహారి యోగిగా సాగగలడు.

భావము.

అర్జునా! ఎక్కువ తినేవాడికి, బొత్తిగా తినని వాడికి, ఎక్కువ నిద్ర పోయేవాడికి, అసలు నిద్రపోనివాడికి ధ్యానయోగం సాధ్యపడదు. ఎల్లప్పుడు సాత్వికాహారమునే భుజించవలెను.

శ్లో.  యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు|

యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా. .  || 6-17 || 

తే.గీ.  అవని పయి యుక్త భుక్తి, విహారునకును

కర్మలన్యుక్తచేష్టప్రకాశునకును

యుక్త స్వప్నావబోధక రక్తునకిల

దుఃఖ హరణమౌ యోగమస్తోక సుగతి.

భావము.

ఆహార విహారాలను యుక్తంగా ఉంచుకునే వానికీ, కర్మలో తగు మాత్రముగా వినియోగించే వానికీ, నిద్రనూ మెలకువనూ తగుమాత్రముగా వినియోగించే వానికీ, నిద్రనూ మెలకువనూ సమంగా పాటించే వానికీ యోగము (జనన మరణ) దుఃఖాన్ని హరించును.

శ్లో.  యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే|

నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. .  || 6-18 || 

తే.గీ.  కామ్యవస్తువుపై కోర్కె, కలుగక మది

వశము నందున్న, నాతనిన్ వసుధపైన

యోగ సిద్ధు డనందు రో యురుగుణాఢ్య!

యోగసిద్ధుడే ధన్యుడయుక్త రహిత.

భావము.

ఏ కామ్య వస్తువు పైనా కోరిక లేక, నిగ్రహింప బడిన మనస్సు ఆత్మలోనే ఉన్నప్పుడు అతడిని యోగ సిద్ధుడని అందురు.

శ్లో.  యథా దీపో నివాతస్థో నేఙ్గతే సోపమా స్మృతా|

యోగినో యతచిత్తస్య యుఞ్జతో యోగమాత్మనః. .  || 6-19 || 

తే.గీ. యోగి మనసు గణింపగ నొప్పియుండు

వాత రహితంపు దీపమవారితగతి

కావునన్బోల్తురట్టులే ఘనులు నిజము

నీవు గ్రహియింపుమర్జునా నిరుపమముగ.

భావము.

ఆత్మ సమ్యమ యోగాన్ని అభ్యసించే యోగి మనస్సును, గాలి లేని చోట ఉంచిన దీపం స్థిరంగా ఉండే స్థితితో పోల్చుతారు.

శ్లో.  యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా|

యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. .  || 6-20 || 

తే.గీ.  యోగి నిగ్రహాత్మెచ్చట నొందు శాంతి, 

నాత్మ దర్శనమును యోగి హాయి నెచట

పొందుచుండునో తెలియుము బంధురముగ,

ననుపమాన శుభాస్పదా! ఘనసుచరిత!

భావము.

యోగాభ్యాసం ద్వారా నిగ్రహింప బడిన మనస్సు ఎక్కడ ఉపశమనము పొందుతుందో, ఎక్కడ తనలోతాను ఆత్మస్వరూపాన్ని చూస్తూ(యోగి) ఆనందిస్తాడో,

శ్లో.  సుఖమాత్యన్తికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీన్ద్రియమ్|

వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః. .  || 6-21 || 

తే.గీ.  ఏది బుద్ధితో దెలియనౌ నేది యింద్రి

యములకు నతీతమైనట్టి, దంతు లేని

దేది యాసుఖమును యోగి యెచ్చటుండి

యనుభవించుచును చలింప డరయు మయ్య.

భావము.

ఏది బుద్ధితో మాత్రమే తెలుసుకోతగినదో, ఇంద్రియాలకు అతీతమో, అంతములేనిదో, ఆ సుఖమును యోగి ఎక్కడ ఉండి అనుభవించుచు, ఆ అనుభవాలనుండి చలించక ఉండునో,

శ్లో.  యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః|

యస్మిన్స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. .  || 6-22 || 

తే.గీ.  ఏది పొందిన యోగి తా నితరమయిన

దేది పొందినన్ ఘనముగా నెంచకుండు,

ననుభవించుచునుగణింప డనుపమముగ

దేనియందుండుటన్, యోగి తానె పార్థ!

భావము.

దేనిని పొందిన తరవాత ఇతరమైన ఏ లాభాన్ని కూడా దానికంటే ఎక్కువ అనుకోడో, దేనిలో నిలిచి విపరీతమైన దుఃఖముచేతకూడా చలించడో, అతడే నిజమైన యోగి.

శ్లో.  తం విద్యాద్ దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్|

స నిశ్చయేన యోక్తవ్యో యోగోऽనిర్విణ్ణచేతసా.  || 6-23 || .

తే.గీ.  యోగమన దుఃఖ దూరులై యుండుటె కద,

నిర్విచారులై దీక్షతో నిండు మదిని

యత్నమును చేసి సాధించు టరయుమయ్య,

యోగమన నిది తెలియుమో రాగదూర!

భావము.

దుఃఖముతో సంబంధము లేని స్థితిని యోగము అని తెలుసుకోవాలి, ఆ యోగమును నిర్విచారమైన మనస్సుతో, పట్టుదలగా సాధించ వలెను.

శ్లో.  సఙ్కల్పప్రభవాన్కామాంస్త్యక్త్వా సర్వానశేషతః|

మనసైవేన్ద్రియగ్రామం వినియమ్య సమన్తతః. .  || 6-24 || 

తే.గీ. సకల సంకల్ప జనిత వాంఛలను విడిచి,

మనసు నిగ్రహించగవలె ఘనతరమగు

నింద్రియములను పట్టుతోనెలమిఁ బార్థ!

నీవు సాధింపవలెనిది నేర్పుమీర.

భావము.

సంకల్పమువల్ల పుట్టిన అన్ని కోరికలను పూర్తిగా విడిచి పెట్టవలెను. 

మనస్సు ద్వారానే ఇంద్రియములన్నింటిని అన్ని వైపులనుండి నిగ్రహించవలెను.

శ్లో.  శనైః శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయా|

ఆత్మసంస్థం మనః కృత్వా న కిఞ్చిదపి చిన్తయేత్.  || 6-25 || .

తే.గీ.  ధైర్యమును కల్గు బుద్ధితో తప్పకుండ 

నెమ్మదిగ మనసును శాంతిని నిలుప వలె,

మనసునాత్మలో నిలిపుచు ననితరముగ,

తలపరాదితరంబింక ధర్మవర్తి!

భావము.

ధైర్యముతో కూడిన బుద్ధితో నెమ్మది నెమ్మదిగా మనస్సును

(బాహ్య ప్రపంచమునుండి మళ్ళించి)శాంతింప చేయవలెను. 

మనస్సును ఆత్మలో నిలిపి తదితరమైనది ఏదీ తలచుకో కూడదు.

శ్లో. యతో యతో నిశ్చరతి మనశ్చఞ్చలమస్థిరమ్|

తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్.  || 6-26 || 

తే.గీ. చంచలంబగు చిత్తంబు నెంచి యెచటి

కేగినన్ గాని మరలించి వేగిరముగ

నాత్మలో నిల్పవలెను సమంచితముగ

పార్థ గ్రహియింపుమియ్యది స్వార్థమువిడి.

భావము.

నిలకడ లేని చంచలమైన మనస్సు ఎక్కడెక్కడికి పోతుందో, 

అక్కడక్కడనుండి దానిని తీసుకు వచ్చి ఆత్మలో నిలబెట్టాలి.

శ్లో.  ప్రశాన్తమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్|

ఉపైతి శాన్తరజసం బ్రహ్మభూతమకల్మషమ్. .  || 6-27 || 

తే.గీ.  శమితమగురజో గుణుఁడు ప్రశాంత చిత్తుఁ

డనుపమబ్రహ్మరూపుడై యలరు నట్టి

యోగి కాత్మసంబంధమౌ యుత్తమ సుఖ

మందునో పార్థ! కనుచు నీవందవలయు.

భావము.

ఈ విధంగా రజోగుణం శమించి, దోషరహితమైన, ప్రశాంతమైన మనస్సుతో కూడి బ్రహ్మ స్వరూపుడైన యోగికి ఆత్మ సంబంధమైన ఉత్తమ సుఖం లభిస్తుంది.

శ్లో.  యుఞ్జన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః|

సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యన్తం సుఖమశ్నుతే. .  || 6-28 || 

తే.గీ.  ఆత్మ నభ్యసించుచు యోగి యనవరతము

కల్మషములకు దూరుడౌ, ఘనతరమగు

బ్రహ్మ సత్స్పర్శ సౌఖ్యము పడయునతడు,

పారమేలేని సౌఖ్యమున్ బడయునతడు.

భావము.

ఈ విద్గముగా నిరంతరము ఆత్మాభ్యాసము చేయు యోగి యొక్క కల్మషములు పూర్తిగా నశించును. బ్రహ్మ స్పర్శ ఉన్న అత్యంత సుఖమును తేలికగా పొందగలఁడు.

శ్లో.  సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని|

ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. .  || 6-29 || 

తే.గీ. యోగసంయుక్త సమదర్శి యోగి,  కాంచు

నన్నిటన్ దనన్, దనలోన నన్నిటిఁ గను

నన్నియున్ దానె గన దానె యన్నిటనని

భావయుక్తుడై ప్రబలెడి భవ్యుడతడు.

భావము.

యోగంతో కూడిన సర్వత్రా సమత్వాన్ని చూసే యోగి అన్ని ప్రాణులలో తననీ, తనలో అన్ని ప్రాణులనూ చూచును.

శ్లో.  యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి|

తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. || 6-30 ||

తే.గీ. అన్నిటన్ నన్ను, నా లోన నన్నిటి నిలఁ

గనెడి వానికి మరుఁగవన్, వినుము పార్థ!

మరుఁగు కాడతఁడును నాకు, ధరణిపైన

నతఁడు నేనేను, నేనన్ననతఁడె తెలియ.

భావము.

నన్ను అన్నిటిలోనూ, నాలో అన్నిటినీ ఎవరు చూచుదురో అట్టి వారికి నేను మరుఁగు కాను. అతఁడు నాకూ మరుఁగు కాడు.

శ్లో.  సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః|

సర్వథా వర్తమానోऽపి స యోగీ మయి వర్తతే. . || 6-31 ||

తే.గీ. అన్ని ప్రాణులలోనున్న నన్ను,

దైవ మొక్కడే యనుచు తా తలచుచుండి

నన్ను సేవించు నాయోగి మన్ననమున

నుండు నాలోన నెటులున్న  నిండుమదిని.

భావము.

అన్ని ప్రాణులలో ఉన్న నన్ను అన్నింటా పరమాత్మ ఒక్కఁడే అన్న భావము పొంది సేవించునో, ఆ యోగి ఏ విధముగా సంచరించినను నాలోనే వర్తించుచుండును.

శ్లో.  ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున|

సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః. . || 6-32 ||

తే.గీ. దుఃఖ సుఖములందున తనతో నితరులఁ

బోల్చుకొనుచు సమముగా ప్రపూజ్య యోగి

శ్రేష్టు డందరి కన్నను చింత చేయ,

నెఱుఁగు మర్జునా! నీవిది యెఱుక గలిగి.

భావము.

అర్జునా! దుఃఖము గానీ, సుఖముగానీ తనతో పోల్చుకొని తనతో సమానముగా అందరిలోనూ చూచునో, ఆ యోగి శ్రేష్టుడని నా అభిప్రాయము.

అర్జున ఉవాచ

భావము.

అర్జునుడడిగెను.

శ్లో.  యోऽయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన|

ఏతస్యాహం న పశ్యామి చఞ్చలత్వాత్స్థితిం స్థిరామ్. . || 6-33 ||

తే.గీ.  నీవు చెప్పిన యీ యోగ మే విధమున

నిలుచు చంచలంబగు చిత్త ఫలకమునను

ననుచు తోచునో కృష్ణుడా! యరయు మిదియు,

నాదు తప్పున్న మన్నించు నలిన నేత్ర!

భావము.

కృష్ణా నువ్వు చెప్పిన ఈ ఆత్మ సంయమ యోగము మనస్సు యొక్క చంచల స్వభావము వలన నిలుచునని నాకు అనిపించుట లేదు.

శ్లో.  చఞ్చలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్ దృఢమ్|

తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్.  || 6-34 ||

తే.గీ.  మనసు చంచలమైన, ప్రమాథి, దృఢము, 

బలముతో నొప్పుచుండును, పవను నెటుల

యణచ సాధ్యంబు కాదట్లె యణప జాల

మరయ దీనిని, శ్రీకృష్ణ! తెరవు నీవె.

భావము.

కృష్ణా! మనస్సు చంచలమైనది, భాధా కరమైనది, బలమైనదీ, గట్టిదీ, గాలిని అణచుట వలె దీనిని నిగ్రహించుట కూడా కష్టమని నేను భావింతును.

 శ్రీభగవానువాచ

భావము.

శ్రీకృష్ణుడిట్లు పలికెను.

శ్లో.  అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్|

అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే. || 6-35 ||

తే.గీ.  అవును, చంచల చిత్తమ్ము నణచ లేము,

నిగ్రహించుట కష్టము, నిరుపమాన!

పార్థ! సాధన చేతను భవ్యమయిన

దివ్య వైరాగ్య భావనన్ దీని నణచు.

భావము.

సందేహము లేదు. మనస్సును నిగ్రహించుట చాలా కష్టము. అది చలించుచుండును. అయితే కుంతీ కుమారా! అభ్యాసం చేతా వైరాగ్యము ద్వారానూ మనోనిగ్రహము సాధ్యమగును.

శ్లో.  అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః|

వశ్యాత్మనా తు యతతా శక్యోऽవాప్తుముపాయతః. || 6-36 ||

తే.గీ. మనసు స్వాధీనమున లేని మనుజున కిల

పొంద యోగ మసాధ్యంబు, పొంద గలఁడు

మనసు స్వాధీనమున గల మహితుఁ డిద్ది

యత్నమును చేసి యోచించి హాయిగాను. 

భావము.

మనస్సు స్వాధీనములో లేని వాడికి యోగము పొందుట కష్టమని 

నా అభిప్రాయము. చిత్తము స్వాధీనములో ఉన్నవాఁడు ప్రయత్నించినచో 

ఉపాయముతో సాధించ వచ్చును.

అర్జున ఉవాచ

భావము.

అర్జునుడిట్లు పలికెను.

శ్లో.  అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః|

అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి. || 6-37 ||

తే.గీ. శ్రద్ధ గలిగియు మనసును చక్కగాను

వశమునం దుంచుకొనలేక పతితుఁడయిన

యోగ చలితుండయినయట్టి యోగి  యేమి

యగును? తెలపుమా నాకు నే నరయునటుల.

భావము.

శ్రద్ధ ఉన్నా మనస్సుని పూర్తిగా స్వాధీనంలోనికి తెచ్చుకొనలేక పోయెడివాఁడు, 

యోగం నుండి మనస్సు జారిపోయి యోగసిద్ధిని పొందనపుడు ఏమగును?

శ్లో.  కచ్చిన్నోభయవిభ్రష్టశ్ఛిన్నాభ్రమివ నశ్యతి

అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. || 6-38 ||

తే.గీ.  నియతి బ్రహ్మ పథమునందు నిలువలేని

మందబుద్ధి రెంటనుభ్రష్టుడందురు కద, 

చెదరినట్టిమేఘునివోలె చెడునొ తాను?

చెప్పుమా కృష్ణ! సన్నుతి చేసెద నిను.

భావము.

ఓ మహానుభావా! బ్రహ్మ పధములో నిలవలేని మంద బుద్ధి ఇహపరాలు 

రెంటికీ భ్రష్టుడై చెదిరిన మేఘమువలె నశించి పోవడా?

శ్లో.  ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః|

త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే. || 6-39 ||

తే.గీ. పూర్తిగా నాదు సందేహమును దొలంగఁ

జేయఁ దగువాఁడ వీవేను, చేయ లేరు

తొలగగా నాదు సందేహ మిలను పరులు,

నీకు మ్రొక్కెదన్ దెలుపుమో నీరజాక్ష!

భావము.

కృష్ణా! నా ఈ సందేహాన్ని సమూలంగా ఛేదించ తగిన వాడివి నీవే. 

నా అనుమానమును తీర్చగలిగిన వారు లోకములో నీకంటే ఎవరూ లేరు.

శ్రీభగవానువాచ

భావము.

శ్రీకృష్ణభగవానుడిట్లు పలికెను.

శ్లో.  పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే|

న హి కల్యాణకృత్కశ్చిద్ దుర్గతిం తాత గచ్ఛతి. || 6-40 ||

తే.గీ.  అర్జునా! యోగమునభ్రష్టుడయినవాని 

కిహపరంబుల నాశన మెన్న లేదు.

మంచి వానికి దుర్గతి మహిని రాదు,

భయము పొందగ పనిలేదు నయనిధాన!

భావము.

అర్జునా యోగబ్రష్టుడికి ఈ లోకములో కానీ పరలోకములో కానీ నాశనము 

లేదు. నాయనా! మంచి పని చేసేవాడెవడూ దుర్గతిని పొందడు కదా.

శ్లో.  ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః|

శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోऽభిజాయతే. || 6-41 ||

తే.గీ.   అరయుమోయి, యోగభ్రష్టు డందు పుణ్య

లోకములనందు వసియించి, శ్రీకరముగ

పుణ్యకర్ములయింట తా పుట్టి, యచట

భోగభాగ్యంబులన్ దేలు పుడమిపైన.  

భావము.

యోగభ్రష్టుడు పుణ్యలోకాలని పొంది అనేక సంవత్సరాలు అక్కడ 

నివసించి. తరవాత శుచివంతులు, శ్రీమంతులు ఐన వారి ఇంట జన్మిస్తాడు.

శ్లో.  అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్|

ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్. || 6-42 ||

తే.గీ.  అటుల కాని యోగభ్రష్టు డనితరమగు 

జ్ఞాన నంపన్నులిండ్లలో కలిగి జన్మ

నిహపరంబులనందెడు మహిని పార్థ!

కనగ నరుదైన జన్మంబు ఘనుడ! వింటె?

భావము.

లేదా యోగ బ్రష్టుడు జ్ఞానులైన ఇండ్లలో పుడతాడు. లోకములో 

ఇట్టి జన్మ చాలా అరుదైనది.

శ్లో.  తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్|

యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునన్దన. || 6-43 ||

తే.గీ.  పూర్వదేహపుయోగంపుబుద్ధినచట 

తిరిగి పొంద సాధనచేయు నిరుపమగతి,

యోగమది పండి మరల తా యోగియగును,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

కురునందనా! అక్కడ పూర్వ దేహ సంబంధమైన యోగ బుద్ధిని 

పొంది, ఆస్థాయి నుండే తిరిగి సంపూర్ణ యోగ సిద్ధిని పొందడానికి ప్రయత్నిస్తాడు.

శ్లో.  పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోऽపి సః|

జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే. . || 6-44 ||

తే.గీ.  అవనిపైన యోగభ్రష్టు డనుపమగతి

సాధనము చేయు వివశుడై జయ సుయోగ

మార్గమును గాంచ లాగును మనసతనికి,

ప్రణవమంత్రమున్ బలికినన్ వరలగలడు.

భావము.

పూర్వ జన్మలో చేసిన అభ్యాసం వలన యోగ భ్రష్టుడు వివశుడై 

యోగము వైపు లాగబడతాడు. యోగమును గురించి కేవలము కుతూహలము 

చూపినా, ఓంకారమును జపించుట వలన లభించే వైదిక కర్మ ఫలాన్ని 

దాటి పోతాడు.

శ్లో.  ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః|

అనేకజన్మసంసిద్ధస్తతో యాతి పరాం గతిమ్. . || 6-45 ||

తే.గీ.  యోగి సద్దీక్షతో డ చేయు జతనమున,

పాపముల నుండి విడివడి, పరమగతిని

శుద్ధుడై సదభ్యాసపు శుద్ధ ఫలము

చేత పొందు నో యర్జునా! ఖ్యాతిగాను.

భావము.

యోగి దీక్షతో చేసే ప్రయత్నము వలన పాపములన్నింటి నుండి విడివడి శుద్ధుడై, అనేక జన్మల అభ్యాసము చేత యోగసిద్ధిని పొంది పరమగతిని(మోక్షం)చేరుకొనును.

శ్లో.  తపస్విభ్యోऽధికో యోగీ జ్ఞానిభ్యోऽపి మతోऽధికః|

కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున. . || 6-46 ||

తే.గీ.  అర్జునా! తాపసుల కంటె నధికుడరయ,

జ్ఞానులకు మించు నధికుడు, కర్ములకును

మించు నధికుండు యోగియే, మించుచీవు

యోగి కావలె పడయ సద్యోగమిలను.

భావము.

అర్జనా! తపస్సు చేసేవారికంటే, జ్ఞానులకంటే, జ్ఞానులకంటే, కర్మచేసే వారికంటే కూడా యోగి అధికుడు. అందుచేత నువ్వూ (ఆత్మ సంయమ)యోగివి అగుము.

శ్లో.  యోగినామపి సర్వేషాం మద్గతేనాన్తరాత్మనా|

శ్రద్ధావాన్భజతే యో మాం స మే యుక్తతమో మతః. . || 6-47 ||

తే.గీ.  మనసు నాపైన నిలిపెడి మహిత యోగి

నన్ను సేవించునుత్తముం డెన్న యోగి

పుంగవుండిలఘనులలో పుంగవుండు,

నీవు కావలెనట్టుల నిరుపమముగ.

భావము.

యోగులందరిలో తన మనస్సుని నాలో నిలిపి శ్రద్ధగా ఎవరు సేవిస్తారో. అతడు ఉత్తముడని నాఅభిప్రాయము.


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

ఆత్మసంయమయోగో నామ షష్ఠోऽధ్యాయః.






శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః 

జ్ఞానవిజ్ఞానయోగః

శ్రీభగవానువాచ|

భావము. 

శ్రీకృష్ణభగవానుడనుచున్నాడు.

శ్లో.  మయ్యాసక్తమనాః పార్థ యోగం యుఞ్జన్మదాశ్రయః|

అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. || 7-1 ||

తే.గీ.  మనసు నాపైన నిలుపుచు మహిత యోగ

మభ్యసించుచు మదిని న న్నాశ్రయించి,

శంకయే లేని విధముగా చక్కగ నను

పూర్తిగా నెట్లెఱుగుదువో యార్తి వినుము.

భావము.

నాపై మనస్సును లగ్నము చేసి,యోగాన్ని అభ్యసించుచు నన్ను ఆశ్రయించి, 

నిస్సంశయముగా, క్షుణ్ణముగా ఏ విధముగా తెలుసుకో గలవో దానిని గురించి ఆర్తితో వినుము.

శ్లో.  జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః|

యజ్జ్ఞాత్వా నేహ భూయోన్యజ్జ్ఞాతవ్యమవశిష్యతే. || 7-2 ||

తే.గీ.  అనుభవ జ్ఞానమున గల ఘనతరమగు

శాస్త్ర విజ్ఞానమును నీకు చక్కగాను

తెల్పుదున్ సర్వమున్ నీకుఁ దెలిసిపోవు

తెలియవలసినదుండదు తెలియనిద్ది.

భావము.

అనుభవముతోఁ గూడిన శాస్త్ర పరిజ్ఞానమును నీకు పూర్తిగా చెప్పుదును. దీనిని 

తెలుసుకున్న పిదప నీకు వేరుగా తెలుసుకొనవలసినది ఏదియూ ఉండదు.

శ్లో.   మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే|

యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః. || 7-3 ||

తే.గీ. మోక్ష సిద్ధికై యత్నించు భూమిపైన

వేలలో నొక్కడే, యందు వేలలోన

నొక్కడే నన్నెఱుంగును నిక్కమిదియె,

పుణ్యసత్ఫలయుతునకే పొసగునిద్ది.

భావము.

వేలాది మనుష్యులలో ఏ ఒక్కరో మోక్షసిద్ధి కోసం ప్రయత్నింతురు. 

అలా ప్రయత్నించే సిద్ధులలో కూడా ఏ ఒక్కరో నన్ను యథార్థముగా 

తెలుసుకో గలుగుదురు.

శ్లో. భూమిరాపోనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ|

అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. || 7-4 ||

తే.గీ.  అగ్ని, భూమియు, వాయువు నాకసమును,

నీరు, మనసును, బుద్ధ్యహంకారము లవి,

యష్టప్రకృతులు నావిగా నరయుమీవు,

తెలియఁ జెప్పెద నేనవి తెలియు మీవు.

భావము.

భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము మరియు మనస్సు బుద్ధి, 

అహంకారము అనునవి నా ప్రకృతి ఎనిమిది విధాలుగా ఉన్నది.

శ్లో.  అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్|

జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. || 7-5 ||

తే.గీ.  ఓమహాబాహుడా! యల్ప యొప్పిదమిది,

యిదియె కాక వేరగు జీవి యయిన ప్రకృతి

నాది, కనుమిది,  దాననే నడచుచుండు

జగము, లేదన్యమెంచినన్, ప్రగణితముగ.

భావము.

ఓ మహానుభాహుఁడా! ఇది అల్పమైనది. ఇంతకన్నా వేరై జీవుడిగా మారినదీ 

నా పరమైన ప్రకృతి అని తెలుసుకో. దాని వలననే ఈ జగత్తు భరించబడును.

శ్లో.  ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ|

అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా. || 7-6 ||

తే.గీ. అన్ని ప్రాణులకునుమూల మరసిచూడ

యిట్టి యీ నా ప్రకృతిమూల మిదియె నిజము,

సృష్టి యుత్పత్తి నాశముల్ చేయుదేను

నేనె మూలమంచెఱుఁగుము నిఖిలమునకు.

భావము.

ఈ నా ప్రకృతి అన్ని ప్రాణులకీ మూలమని తెలుసుకో. యావత్తు 

జగత్తు యొక్క ఉత్పత్తి, నాశనములకు మూలము నేనే అని తెలుసుకొనుము.

శ్లో.  మత్తః పరతరం నాన్యత్కిఞ్చిదస్తి ధనఞ్జయ|

మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. || 7-7 ||

తే.గీ.  ఓ ధనుంజయా!నన్నుమించొక్కటైన

లేదు, లోకాన, సర్వమున్ నాదు కృషిని

నడుచు, సర్వమున్, నా యందె నడపబడును

దారమున మణులట్టులే ధీరవర్య!

భావము.

ధనుంజయా! నాకన్నా ఏక్కువైనది ఏదీలేదు. జగత్తు యావత్తు దారంలో 

మణులవలె నాలో గుచ్చబడి ఉన్నది.

శ్లో.  రసోహమప్సు కౌన్తేయ ప్రభాస్మి శశిసూర్యయోః|

ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. || 7-8 ||

తే.గీ. నీరు రుచి నేనె, వేద యోంకార మేనె,

తలప నెలవంక , సూర్యుల వెలుగు నేనె,

నేనె మనుజులన్ దీక్షయు, నింగిలోన

శబ్దమున్ నేనె, గ్రహియించు జయనిధాన!

భావము.

కౌంతేయా! నీటిలోని రుచిని, సూర్యచంద్రులలోని వెలుగును, 

వేదాలలోని ఓంకారమును, ఆకాశములో ఉన్న శబ్ద గుణమును. 

మానవులలోని పట్టుదలను నేనే.

శ్లో.  పుణ్యో గన్ధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ|

జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. || 7-9 ||

తే.గీ.  నేనె పృథ్విలో వాసనన్, నేనె యగ్ని

లోని వేడిని, జీవులలోని ప్రాణ

మేనె, తపము తాపసులలో నేనె యెఱుఁగ

నన్నియున్నేనె, యెఱుఁగుమో యర్జునుండ!

భావము.

నేను పృథ్విలోని వాసనని. అగ్నిలోని వేడిని. జీవుల లోని ప్రాణాన్ని. 

తపస్సు చేసేవారిలో తపస్సుని నేనే సుమా.

శ్లో.  బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్|

బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్. || 7-10 ||

తే.గీ.  జీవులన్నింటిలోనున్న‌ జీవమగు స

నాతనమగు బీజము నేనె, జ్ఞానులందుఁ

దెలివి నేనేను, ప్రతిభులన్ దెల్లమయెడి

ప్రతిభ నేనౌదునర్జునా పరులు కారు.

భావము.

అర్జునా! అన్ని జీవులలో సనాతన బీజాన్ని నేను అని తెలుసుకో. 

బుద్ధిమంతులలోని తెలివిని. ప్రతిభా వంతుల లోని ప్రతిభను నేనే సుమా.

శ్లో.  బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్|

ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. || 7-11 ||

తే.గీ.  కామరాగాదులే లేక కలిగి యున్న

బలము నేనును బలునందు భరతకులజ!

ధర్మబద్ధమౌ కామము తలప నేనె

జీవులందున, గనుమిది, భావమరసి.

భావము.

ఓ భరతశ్రేష్టుడా! బలవంతులలోని కామరాగాలు లేని బలాన్ని నేను. జీవులలో 

ధర్మ విరుద్ధము కాని కామము కూడా నేనే సుమా.

శ్లో.  యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే|

మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి. || 7-12 ||

తే.గీ.  నా వలన వచ్చుచుండెడి భావములవి,

తామసిక, రాజసికములుఁ దలప సాత్వి

కములు, నా లోన నుండెడున్ ఘనతరముగ,

నేను వాటిలో లేనని నీవెఱుఁగుము.

భావము.

ఇంకా ఏవి తామసిక, రాజసిక, సాత్విక భావాలో అవన్నీ నా వలననే వచ్చునని 

గ్రహించు. అయితే నేను వాటిలో లేను. అవినాలోననే ఉన్నవి.

శ్లో‌.   త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్|

మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్. || 7-13 ||

తే.గీ.  త్రిగుణపూర్ణ భావాళిచే బ్రగణితముగ

భ్రాంతిలో బడి లోకము ప్రస్ఫుటముగ

వీటికన్ననతీతమై వెలుగుచున్న

నవ్యయుండగు నన్నువా రరయఁబోరు.

భావము.

మూడుగుణాలతో నిండి ఉన్న ఈభావాల చేత ప్రపంచము యావత్తూ 

భ్రాంతిలో పడి, వీటికన్నా అతీతమూ, అవ్యయమూ అయిన 

నన్ను గుర్తించలేదు .

శ్లో.  దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా|

మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే. || 7-14 ||

తే.గీ.  భువిని త్రిగుణాన్వితపు మాయ నెవడుదాటు?

నేను సృష్టించితిని దీని నెనరున నను

నెవరు సేవింతురో వార లెఱుకఁ గలిగి

దాట గలుగుదు రీ మాయ, తత్వమరసి. 

భావము.

దివ్యమైన, త్రిగుణాలతో కూడిన నా ఈ మాయ దాట రానిది. ఎవరు నన్నే  

సేవిస్తారో వారు ఈ మాయని దాట గలరు.

శ్లో.  న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యన్తే నరాధమాః|

మాయయాపహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. || 7-15 ||

తే.గీ. మూఢులున్, దుష్కృతులు, నధములును, మాయ

చేత జ్ఞానము లేనట్టి ఛిద్రమతులు, 

నసుర భావ భరితులౌ నరాధములును,

నన్ను సేవింపఁ జాలరు మన్ననమున.

భావము.

దుర్మార్గులు మూఢులు, మాయ చేత జ్ఞానం నశించిన వారు, అసురభావాన్ని 

ఆశ్రయించిన వారు ఐన నరాధములు నన్ను సేవించరు.

శ్లో.  చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినోర్జున|

ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. || 7-16 ||

తే.గీ.  ఆర్తు, డర్థార్థి, జిజ్ఞాసు, వవని జ్ఞాని,

యనెడి నలువురు సేవింతు రనితరమగు

భక్తితో నర్జునా! నన్ను, శక్తికొలది,

నీవు గ్రహియింపుమిద్దియు నిండుమదిని.

భావము.

భరత కుల శ్రేష్టుడవైన ఓ అర్జునా! ఆర్తుఁడూ, జిజ్ఞాసువూ, అర్ధార్ధీ, జ్ఞాని 

అనే నాలుగు రకాల పుణ్యాత్ములు నన్ను సేవింతురు.

శ్లో.  తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే|

ప్రియో హి జ్ఞానినోऽత్యర్థమహం స చ మమ ప్రియః. || 7-17 ||

తే.గీ.  అట్టి నలువురిలో నన్ను ననితరమగు 

భక్తిఁ గలుగుచు సేవించు వాఁడు శ్రేష్ఠుఁ

డతనికిష్టంబు నేనౌదు నతఁడె నాకు

నిష్టుడంచు గ్రహింపుమో యింద్ర తనయ!

భావము.

ఈ నలుగురిలో నిత్యము నాతో కూడి పరమాత్మనైన నాయందు మాత్రమే  

భక్తి కలిగి ఉండెడి జ్ఞాని శ్రేష్ఠుఁడు. అటువంటి వానికి నేను ఎక్కువ ప్రియుఁడను. 

అతఁడే నాకు కూడా ఇష్టుడు.

శ్లో.  ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్|

ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్. || 7-18 ||

తే.గీ. వీరలంద రుదారులే, వీరిలోన

జ్ఞాని నాదౌ స్వరూపమౌన్, కారణమిదె

నన్నె సర్వోత్తమగతిగ నెన్ను జ్ఞాని,

యాశ్రయించును నన్నే నవిశ్రమముగ.

భావము.

వీరందరూ ఉదారులే. జ్ఞాని మాత్రం నాస్వరూపమని నా అభిప్రాయము. 

ఎందుకనగా అతఁడే సర్వోత్తమైన గతి అని నన్నే ఆశ్రయించి ఉండును.

శ్లో.  బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్మాం ప్రపద్యతే|

వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. || 7-19 ||

తే.గీ. నరుఁడనేకజన్మల తుదిన్ జ్ఞాని యగుచు

సర్వమున్ వాసుదేవుఁడే శాశ్వతుఁడని,

నన్నె కొలుచును, భువిపైననెన్న నిట్టి

వారలరుదుగా నుందురు ప్రస్ఫుటముగ. 

భావము.

అనేక జన్మల తరువాత నరుఁడు జ్ఞాన వంతుడై సర్వమూ 

వాసుదేవుడని నన్ను కొలుచును.అట్టి మహాత్ముడు చాలా అరుదుగా ఉంటాడు.

శ్లో. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యన్తేన్యదేవతాః|

తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా.  || 7-20 ||

తే.గీ. సహజమైన స్వభావాన సకలవాంఛ

ల నిల దీర్చుకొనగ,  జ్ఞాన ఖని నశింప,

నితర దేవతలను గొల్చు క్షితిని జ్ఞాని,

నియమనిష్ఠలతోడను నిరుపమముగ.

భావము.

తన సహజ స్వభావానికి లోనై ఆయా కోరికల వలన జ్ఞానం హరించుకు పోగా 

ఆయా నియమాలని పాటించుచు వారు ఇతర దేవతలను ఆరాధింతురు.

శ్లో.  యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి|

తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్.  || 7-21 ||

తే.గీ.  భక్తు లెవరెవ రేస్వరూపములలోన

శ్రద్ధతోడుత దైవంబు నుద్ధతిగను

కోరుకొందురో వారిలో కొలుపు దేను

భక్తి నా దేవతలపైన ప్రబలనిత్తు.

భావము.

ఏయే భక్తులు ఏయే రూపములో భగవంతుడిని శ్రద్ధతో ఆరాధించవలెనని 

కోరుకొందురో ఆయా భక్తులకు ఆయాదేవతయందే అచంచలమైన శ్రద్ధని నేను కలిగింతును.

శ్లో.  స తయా శ్రద్ధయా యుక్త స్తస్యారాధన మీహతే|

లభతే చ తతః కామాన్మయైవ విహితాన్హి తాన్.  || 7-22 ||

తే.గీ.  భక్తు లెవ్వార రెట్టిదైవముల గొలువ

నెంతు రవ్వారికినిభక్తి నెనరగొల్పి 

వారికాదైవ శక్తిగా ప్రబలి నేనె

కోర్కెలను తీర్తు, గ్రహియించుకొనుము పార్థ!

భావము.

అతడు శ్రద్ధతో కూడుకొని ఆరూపాన్ని ఆరాధించ సాగుతాడు. నాచే 

ప్రసాదింప బడిన ఆ కోరికలను,తాను ఆరాధించిన దేవతారూపముద్వారా పొందుదురు.

శ్లో.  అన్తవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్|

దేవాన్దేవయజో యాన్తి మద్భక్తా యాన్తి మామపి.  || 7-23 ||

తే.గీ.  అల్ప బుద్ధులయినవారి కందు ఫలము

లరయ నశియించు, నాదేవతాళిఁ గొలువఁ

జేరుదురు దేవతలను, నన్ జేరుదు రిల

నన్ను సేవించువారలు మన్ననముగ.

భావము.

అల్ప బుద్ధులైన వారికి లభించే ఫలం నశించి పోయేదిగా 

ఉండును. దేవతలను ఆరాధించేవారు దేవతలను చేరుదురు, 

నన్ను ఆరాధించేవారు నన్ను చేరుదురు.

శ్లో.  అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యన్తే మామబుద్ధయః|

పరం భావమజానన్తో మమావ్యయమనుత్తమమ్.  || 7-24 ||

తే.గీ.  పరమమున్ శ్రేష్ఠతమమునై పరగు నాదు

గుణము నెఱుఁగని వారలు కనుదురు నను

పరిమితాకారుఁడ ననుచుఁ, దరచి చూడ

జ్ఞాన చక్షువునకు నేను కనబడుదును.

భావము.

పరమము, సర్వశ్రేష్టమునైన నా  స్వభావం ఎఱుఁగని, 

తెలివి తక్కువ వాళ్ళు ఇంద్రియాలకు గోచరము కాని పరిమితమైన 

రూపముగా భావింతురు.

శ్లో.  నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః|

మూఢోऽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్.  || 7-25 ||

తే.గీ.  యోగ మాయావృతుడనయి యున్న నేను

కనఁబడనుగ యందరికిని, కనగ లేదు

మూఢ లోకము నాశనము భువి లేని

వానిగా నన్ను, నర్జునా!  జ్ఞాన భాస!

భావము.

యోగమాయ చేత ఆవరింపబడి ఉన్న నేను అందరికి కనపడను. నన్ను 

ఈ మూఢ లోకం పుట్టుకా నాశనం లేనివానిగా తెలుసుకొన లేదు.

శ్లో.  వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున|

భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన.  || 7-26 ||

తే.గీ. నే నెఱుంగుదును, గతించి, లేని వారి,

నున్నవారిని, జనియింప నున్నవారి

నిట్టి నన్నెఱింగినవారి నరయ లేరు.

కనఁగ లేరిల నరుడ! నన్ ఘనతరముగ.

భావము.

నేను గతించిన జీవులను, ఇప్పుడు ఉన్నవాళ్ళనూ, ముందు పుట్టబోయే 

వారినీ ఎఱుఁగుదును. నన్ను మాత్రం ఎవరూ ఎరుగరు.

శ్లో.  ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వన్ద్వమోహేన భారత|

సర్వభూతాని సమ్మోహం సర్గే యాన్తి పరన్తప.  || 7-27 ||

తే.గీ. ఓ పరంతపా! రాగంబు నొనరు ద్వేష

ములను పుట్టుమోహంబున పుట్టినపుడె

జీవు లొందెడు భ్రాంతిని, ధీవరేణ్య!

అర్జునా గ్రహియింపుమీ వహము విడిచి.

భావము.

పరంతపా! అర్జునా! రాగద్వేషాల నుండి జనించే ద్వంద్వాల మోహం 

వలన పుట్టుకతోనే అన్ని జీవులూ భ్రాంతిని పొందుతున్నవి.

 || 7-28 ||

శ్లో.  యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్|

తే ద్వన్ద్వమోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతాః.  || 7-28 ||

తే.గీ.  పుణ్య కర్మల వలననే గణ్య జనుల

పాపమంతంబగునొ వారు ద్వంద్వ మోహ

ములకు దూరులై చెదరక నిలచు దీక్ష

తోడ నన్ గొల్తురరయుమా, దుర్విదార!

భావము.

పుణ్య కర్మల వలన ఏ జనుల యొక్క పాపం అంత మైనదో, వాళ్ళు, ద్వంద్వ 

మోహాల నుండి పూర్తిగా విముక్తులై చెదరని దీక్షతో నన్ను కొలుస్తారు.

శ్లో.  జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతన్తి యే|

తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్.  || 7-29 ||

తే.గీ.  సాధకులు జరా మరణముల్, సత్వరంబె

విడువనెంచి నన్ గొలుతురో, విశ్వమందు

నాత్మ తత్వ జ్ఞులగుదు రాయాత్మనెఱిగి, 

కర్మమునుగూర్చెఱుఁగుదురు, ధర్మరూప!

భావము.

జరా మరణాల నుండి విడుదల కావాలని ఎవరు నన్ను ఆశ్రయించి సాధన చేస్తారో వారు సంపూర్ణముగా ఆబ్రహ్మమూ ఆత్మ తత్వాన్ని యావత్తు కర్మనీ తెలుసుకొందురు.

శ్లో.  సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః|

ప్రయాణకాలేऽపి చ మాం తే విదుర్యుక్తచేతసః.  || 7-30 ||

తే.గీ. ఆదిభూతంబుతోడనా యాది దైవ

తంబుతోడను నాది యజ్ఞంబుతోడ

కూడియున్న నన్నెవరిల గొప్పగాను

తెలుసుకొందురో తుదిని నన్ తీరుగఁ గను.

భావము.

సమస్త అధిభూత (పదార్థ క్షేత్రము), అధిదైవ (దేవతలు), మరియు అధియజ్ఞము (యజ్ఞములకు ఈశ్వరుడు) లకు అధిపతిని నేనే అని తెలుసుకున్న జ్ఞానోదయమయిన జీవాత్మలు, మరణ సమయంలో కూడా పూర్తిగా నా యందే స్థితమై ఉండును.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

జ్ఞానవిజ్ఞానయోగో నామ సప్తమోऽధ్యాయః


అథ అష్టమోధ్యాయః 

అక్షరబ్రహ్మయోగః.

అర్జున ఉవాచ.

భావము.

అర్జునుడనుచున్నాడు.

శ్లో.  కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ|

అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే. || 8-1 ||

తే.గీ.  ఏది బ్రహ్మమౌ? నధ్యాత్మ యేది? కృష్ణ!

ఏది కర్మమౌ నధిభూత మేదియగును?

దేనినధిదైవత మనంద్రు? తెలుపుమయ్య!

వ్యక్తమగునట్లు చెప్పుమా యసమతేజ!

భావము.

పురుషోత్తమా! ఆ బ్రహ్మ ఏది? ఆధ్యాత్మము ఏది? కర్మ అంటే ఏమిటి? 

అధి భూతమని దేనిని అందురు? అధి దైవతమని దేనిని అందురు.

శ్లో.  అధియజ్ఞః కథం కోऽత్ర దేహేస్మిన్మధుసూదన|

ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. || 8-2 ||

తే.గీ. ఎట్టు లుంటివి దేహాన? నెట్టులీవు

నిగ్రహాత్ముల కెట్టుల నేర్పు మీర

ప్రాణములు వీడు సమయాన ప్రణవరూప!

తెలియగాబడుచుంటివి తెలుపుమయ్య!

భావము.

మధుసూధనా! ఈ శరీరంలో ఎలా ఉన్నావు? నిగ్రహ వంతులచేత 

మరణ సమయంలో నీవు ఎలా తెలియఁ బడుదువు.

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీకృష్ణభగవానుడనుచున్నాడు.

శ్లో.  అక్షరం బ్రహ్మ పరమం, స్వభావోధ్యాత్మముచ్యతే|

భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః. || 8-3 ||

తే.గీ.  బ్రహ్మమది నాశరహితమౌ పరమ మరయ,

నది స్వభావంబుచేత నాధ్యాత్మ మనగ

పిలువబడు, జీవసృష్టిని  వెలయ జేయు

కార్యమే కర్మ మెఱుఁగుమా ఘనుడ పార్థ!

భావము.

నాశరహితమైన యీ బ్రహ్మము గొప్పదయినది. ఆయన యొక్క 

స్వభావము ఆధ్యాత్మ మనబడుతుంది. జీవరాశిని పుట్టించే సృష్టి 

కార్యమునే కర్మ అంటారు.

శ్లో.  అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్|

అధియ జ్ఞో హమేవాత్ర దేహే దేహభృతాం వర. || 8-4 ||

తే.గీ. అరయ నధిభూతము నశించునదియె పార్థ,

పురుషు డధిదైవతంబె యా పురుషులందు

నచట నధియజ్ఞుఁడను నేనె, యనుపమాన!

జ్ఞాన సంభాసుడా! పార్థ! కాంచుమిటుల.

భావము.

నర శ్రేష్టుడా! నశించి పోయే తత్వము అది భూతము. జీవుడు అధి దైవతము. 

జీవులలో అధి యజ్ఞుఁడు నేనే.

శ్లో.  అన్తకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేబరమ్|

యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. || 8-5 ||

తే.గీ. అంతకాలంబునన్ నన్ను నరసి కనుచు

దేహమును వీడువారు స్వాధీనమతులు

నాదు తత్వమొందుదురయ, నయవిభాస!

తెలియుమియ్యది నీవు సందేహమేల?

భావము.

అంతకాలంలో కూడా నన్నే స్మరించుకుంటూ ఎవరు శరీరాన్ని వదిలి 

వెళుతున్నారో, వారు నా తత్వాన్నే పొందుదురు. ఇందులో సందేహములేదు.

శ్లో.  యం యం వాపి స్మరన్భావం త్యజత్యన్తే కలేబరమ్|

తం తమేవైతి కౌన్తేయ సదా తద్భావభావితః  || 8-6 ||

తే.గీ.  దేహమును వీడు సమయాన దేనిపయిని

చిత్తముండునో దానినే జీవుడొందు,

నన్ను దలచుచున్ గతియించ నన్ను జేరు,

ముక్తి నొసగెడి నన్ గన ముక్తి కలుగు.

భావము.

కుంతీ కుమారా! మరణ సమయంలో ఏ విషయాన్ని స్మరిస్తూ కళేబరాన్ని 

వదులుదురో, నిత్యమూ ఆ విషయాన్నే తలచుకోవడం చేత మరణానంతరము దానినే పొందుదురు.

శ్లో.  తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ|

మయ్యర్పితమనోబుద్ధిర్మామేవైష్యస్యసంశయః. || 8-7 ||

తే.గీ. కాన, నీ వన్ని కాలాలఁ గనుము నన్ను,

యుద్ధమును జేయుమట మనో బుద్ధులరసి

నాకునర్పింప నీవంక నన్నుఁ జేరు

దువయ, సందేహమే లేదు, ప్రవర పార్థ!

భావము.

అందుచేత నువ్వు అన్ని కాలాలలోనూ నన్నే స్మరించు, యుద్ధము 

చేయుము. మనో బుద్ధులను నాకు సమర్పించిన నీవు నన్నే పొందుదువు. 

ఈ విషయములో సందేహము లేదు.

శ్లో.  అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామినా|

పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచిన్తయన్. || 8-8 ||

తే.గీ.  అంచితాభ్యాస యోగ యుక్తాత్ములరయ

ఘనతరంబగు చింతనన్ ఘనుడగు పర

మపురుషుని చేరుకొందురు, మరువ కిద్ది,

పార్థ! చింతలన్ విడిచినన్ బరగు సుఖము.

భావము.

అర్జునా అభ్యాస యోగంతో కూడుకొని మనస్సు ఇతర విషయాలకు 

పోనప్పుడు, నిరంతర చింతన వలన దివ్యమైన పరమ పురుషుని 

చేరుకొందువు.

శ్లో.  కవిం పురాణ మనుశాసితార - మణోరణీయంసమనుస్మరేద్యః|

సర్వస్య ధాతారమచిన్త్యరూప- మాదిత్యవర్ణం తమసః పరస్తాత్. || 8-9 ||

తే.గీ.  శాసకుఁడు, సనాతనుడును, సర్వవిదుడు,

తలప సూక్ష్మాతిసూక్ష్ముడు, తలప నలవి

కాని రూపుడు, భర్త, ప్రకాశ రవియు,

తపసునకతీతుడతనినితలతురెవరొ,

భావము.

సర్వజ్ఞుడు, సనాతనుడు, శాసకుడు, సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, 

అందరిని భరించే వాడు, చింతించడానికి అలవికాని రూపం కలవాడూ, 

సూర్యుని వలె తేజో వంతుడూ, తపస్సుకి అతీతమైన వాడూ, అయిన 

పురుషుణ్ణి ఎవరు నిత్యమూ ధ్యానిస్తారో,

 శ్లో.  ప్రయాణకాలే మనసాచలేన

భక్త్యా యుక్తో యోగబలేన చైవ|

భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్

స తం పరం పురుషముపైతి దివ్యమ్. || 8-10 ||

తే.గీ. వారు  ప్రాణము విడువేళ ధీర మతిని

భక్తితో యోగ బలముచే ముక్తి  గనుదు

రరయుచున్ హరిన్ భౄమధ్యమందు నపుడె,

యైహికము వీడి పరకాంక్షులతులితముగ.

భావము. 

అతడు ప్రాణం వదిలి పోయే సమయంలో చలించని మనసుతో, 

భక్తిని కలిగి ఉండి, యోగ బలంతో, ప్రాణాన్ని కనుబొమల మధ్య చక్కగా 

నిలిపి దివ్య మైన ఆపరమ పురుషుణ్ణి చేరుకుంటారు.

శ్లో.  యదక్షరం వేదవిదో వదన్తి

విశన్తి యద్యతయో వీతరాగాః|

యదిచ్ఛన్తో బ్రహ్మచర్యం చరన్తి

తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. || 8-11 ||

తే.గీ.  వేదవేత్త లశ్వరమందు రేదొ మరియు

రాగ దూరులై రచయితల్ సాగు దేని

నొంద బ్రహ్మచర్యమునను నొప్పిదముగఁ 

దెలిపెదను దాని నెఱుగంగఁ, దెలియుమీవు.

భావము.

వేదవేత్తలు దేనిని నాశనం లేనిదిగా చెబుతారో, రాగ రహితులైన 

రచయితలు దేనిని చేరుకుంటారో, దేనిని కోరి బ్రహ్మచర్యంలో 

చరిస్తారో ఆ పదాన్ని నీకు సంగ్రహంగా చెప్పెదను.

శ్లో.  సర్వద్వారాణి సంయమ్య, మనో హృది నిరుధ్య చ|

మూర్ధ్న్యార్ధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్. || 8-12 ||

తే.గీ. ఇంద్రియద్వారముల్ మూసి హృదయమాత్మ

లోన నిలుపుచు, బ్రాణమున్ లో సహస్ర

దళపు పద్మంబునను నిల్పి తాను యోగ

నిష్ఠతోడ సాధనచేయ నేర్వవలయు.

భావము.

ఇంద్రియ ద్వారాలన్ని నిరోధించి, మనసును ఆత్మలో నిలిపి, శిరస్సులో 

తన ప్రాణశక్తిని నిలబెట్టి యోగ నిష్ఠను అవలంబించవలెను.

శ్లో.  ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్|

యః ప్రయాతి త్యజన్దేహం స యాతి పరమాం గతిమ్. || 8-13 ||

తే.గీ.  బ్రహ్మవాచక మోమ్మను పలుకు నెవరు

సంస్మరించుచు ప్రాణముల్ చక్క విడుచు

నతడు పరమగతిని పొందు, నవనిపైన, 

నిజము గ్రహియింపుమర్జునా నీవు సతము.

భావము.

బ్రహ్మ వాచకమైన ఓం అనే ఏకాక్షరాన్ని ఉచ్చరిస్తూ, ఎప్పుడూ 

నన్ను స్మరిస్తూ, ఎవరు శరీరం విడిచి పెడతారో వారు పరమ గతిని 

చేరుకొందురు.

శ్లో.  అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః|

తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. || 8-14 ||

తే.గీ.  అన్య చింతన లేక న న్ననవరతము

చింతనము చేయు వారల చిత్తమందె

యుండి, సులభుడనై యొప్పి యుందు పార్థ!

నీవు గ్రహియింపు నా మాట నేర్పుమీర.

భావము.

అర్జునా! మనస్సు ఇతర విషయాలవైపు వెళ్ళ నీయకుండా, నిరంతరమూ నన్ను ఎవరు స్మరింతురో నిత్య యుక్తుడైన ఆ యోగికి నేను సులభుఁడను.

శ్లో.  మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్|

నాప్నువన్తి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. || 8-15 ||

తే.గీ.  పరమపదమైన నామోక్షపదము గన్న

మహితు లరయ నశాశ్వత, మహితమునగు

దుఃఖ మూల పునర్జన్మ తొలగి ముక్తి

పొంది సుఖియింతురవ్వారు పూర్ణ గతిని.

భావము.

పరమ పదమైన నామోక్ష పదాన్ని పొందిన మహాత్ములు, దుఃఖానికి 

ఉనికి పట్టూ, అశాశ్వతమూ అయిన పునర్జన్మని పొందరు.

శ్లో.  ఆబ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోऽర్జున|

మాముపేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే. || 8-16 ||

తే.గీ.  బ్రహ్మలోకము వరకును వచ్చునవియె

తిరిగి లోకములన్నియున్, తిరిగి జన్మ

మెత్తఁ జేయునవియె, నన్ను నెట్టులయిన 

చేరిన విముక్తి కల్గును ధీర పార్థ!

భావము.

అర్జునా! బ్రహ్మ లోకం వరకూ అన్ని లోకాలూ తిరిగి వచ్చేవే, (పునర్జన్మను 

ఇచ్చేవే). నన్ను చేరితే మాత్రం పునర్జన్మ ఉండదు.

శ్లో.  సహస్రయుగపర్యన్తమహర్యద్ బ్రహ్మణో విదుః|

రాత్రిం యుగసహస్రాన్తాం తేऽహోరాత్రవిదో జనాః. || 8-17 ||

తే.గీ.  కనఁగ విధికి వేయి మహాయు గములు పగలు,

కాంచ నటులె వేయి మహాయు గములు రాత్రి,

తెలియువారలహోరాత్రములనెఱుంగు

వారని తెలియుమిపుడీవు పార్థ! కనుచు.

భావము.

వేయి మహా యుగాలు బ్రహ్మకు ఒక పగటి కాలం. వేయి మహా యుగాలు 

బ్రహ్మకుఒక రాత్రి కాలం. ఇది తెలిసిన వారు అహో రాత్రుల గురించి 

తెలిసిన వారు.

శ్లో.  అవ్యక్తాద్ వ్యక్తయః సర్వాః ప్రభవన్త్యహరాగమే|

రాత్ర్యాగమే ప్రలీయన్తే తత్రైవావ్యక్తసంజ్ఞకే. || 8-18 ||

తే.గీ.  విధికి పగటివేళ జనించు విపుల వస్తు

జాల మవ్యక్తమందుడి, వేళ మళ్ళి

రాత్రి కన్నియు నవ్యక్త బ్రహ్మ మందు

లీనమైపోవు, తెలియుము జ్ఞాన విభవ!

భావము.

బ్రహ్మ దేవునుని పగటి కాలంలో అవ్యక్తములో నుండి చరాచర వస్తు 

జాలమంతా జనించును. రాత్రి కాగానే అవ్యక్తమైన బ్రహ్మము లోనే అంతా 

లీనమై పోవును.

శ్లో.  భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే|

రాత్ర్యాగమేऽవశః పార్థ ప్రభవత్యహరాగమే. || 8-19 ||

తే.గీ.  పార్థ! జీవతతియు కర్మ వశము చేత

జన్మలెత్తుచున్ బోవుచు జరుపుచుండు,

బ్రహ్మకున్ రాత్రి యయినంత ప్రాణికోటి 

నాశనంబగు నిజమిది, జ్ఞాన రూప!

భావము.

అర్జునా ఈ జీవ సముదాయమే కర్మ వశముగా అనేక జన్మలు 

ఎత్తుతూ (బ్రహ్మకు)రాత్రికాగానే నశించును.

శ్లో.  పరస్తస్మాత్తు భావోన్యోవ్యక్తోవ్యక్తాత్సనాతనః|

యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. || 8-20 ||

తే.గీ. అట్టి యవ్యక్త ప్రకృతికి, నననురూప

మును వినాశ రహితసనాతనమునయిన

భావమగుబ్రహ్మమునశించఁబోవదెపుడు

జీవులన్నియు పోయినన్, ధీవిశాల!

భావము.

ఆ అవ్యక్త ప్రకృతికంటే, భిన్నమూ, ఉత్తమమూ, ఇంద్రియాలకు 

గోచరము కానిదీ, సనాతనమూ అయిన భావము(పరమాత్మ)ప్రాణులన్నీ 

నశించినా నశించకుండా ఉండును.

శ్లో.  అవ్యక్తోऽక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిమ్|

యం ప్రాప్య న నివర్తన్తే తద్ధామ పరమం మమ.  || 8-21 ||

తే.గీ. ఇంద్రియాగోచరంబునై యెసగుచుండు

నరయ నవినాశమగు పరమాత్మ పథము 

జేరుటుత్తమ మది ముక్తి జీవులకిడు,

నేనె యామార్గమర్జునా! ధీనిధాన!

భావము.

ఇంద్రియాలకు గోచరము కానిదీ, నాశనము లేనిదీ, అని చెప్ప బడిన 

ఆ పరమాత్మ భావమే చేరవలసిన ఉత్తమ మార్గమని ఋషులు 

చెప్పుదురు. దేనిని పొందిన ప్రాణులు జన్మించరో అదే ఆ సర్వోత్తమ

 స్థానము, ఆ సర్వోత్తమ స్థానమే నేను.

శ్లో.  పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా|

యస్యాన్తఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్.  || 8-22 ||

తే.గీ.  అన్ని ప్రాణులునెవ్వనియందు కలవొ,

యంతటన్ గలడెవ్వఁడో యట్టి దైవ

మనుపములగుభక్తులకరయగను లభ్య

మగును, గ్రహియింపుమర్జునా! యమరవినుత!

భావము.

అర్జునా ఎవనిలో అన్ని ప్రాణులు ఉన్నవో, ఎవరు అంతటా 

వ్యాపించి ఉన్నారో ఆ పరమ పురుషుడు అనన్య భక్తి వలననే 

లభించును.

శ్లో.  యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః|

ప్రయాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ. || 8-23 ||

తే.గీ. ఎట్టి సమయాన మరణింప నిముడు ముక్తి,

యెట్టి సమయాన మరణింప పుట్టుకొదవు

యోగులకునట్టి కాలమ్ము నూహచేయ

దెల్పెదను నీకు నర్జనా! తెలియునటుల.

భావము.

భరతకుల శ్రేష్టుడా! ఏకాలంలో శరీరం వదిలి వెళ్ళిన యోగులు 

తిరిగి జన్మించరో. ఏ కాలంలో శరీరం విడిచి వెళ్ళిన యోగులు తిరిగి 

జన్మిస్తారో, ఆ కాలం గురించి చెబుతాను విను.

శ్లో.  అగ్నిర్జోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్|

తత్ర ప్రయాతా గచ్ఛన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. || 8-24 ||

తే.గీ. అగ్ని, పగలుత్తరాయణ మారునెలలు

శుక్లపక్షంబులనుమార్గ సుగతి నెంచి

బ్రహ్మమును జేరుచుందురు బ్రహ్మవిదులు.

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

అగ్ని, పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం ఆరు నెలలు అనే మార్గంలో 

బ్రహ్మ విధులు బ్రహ్మను చేరుకొందురు.

శ్లో.  ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్|

తత్ర చాన్ద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే. || 8-25 ||

తే.గీ.  కృష్ణపక్షంబు, పొగ, రాత్రి, తృష్ణ, దక్షి

ణాయనమున యోగికి చూడ నారునెలలు,

పయనమును జేసి చంద్రుని వరలు జ్యోతి

పొంది వచ్చును తిరిగి తాన్, పుణ్యగేహ!

భావము.

పొగ, రాత్రి, కృష్ణపక్షం ఆరు నెలలు దక్షిణాయనం అనే మార్గంలో 

ప్రయాణించిన యోగి చంద్రుని జ్యోతిని పొంది తిరిగి వస్తాడు.

శ్లో.  శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే|

ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః.  || 8-26 ||

తే.గీ.  శుక్ల, కృష్ణ, మార్గము లవి చూడ రెండు

శాశ్వతంబని తలపనౌన్, చక్కనైన

శుక్లమున జన్మ కలుగదు, చూడ మనకు,

కృష్ణ యందు పునర్జన్మ క్షితిని కలుగు.

భావము.

జగత్తులో శుక్ల, కృష్ణ అనే ఈరెండు మార్గాలు శాశ్వతం అని 

భావించబడుచున్నవి. మొదటి దానివలన పునర్జన్మ కలగదు.

రెండవ దాని వలన కలుగుతుంది.

శ్లో.  నైతే సృతీ పార్థ జానన్యోగీ ముహ్యతి కశ్చన|

తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున.  || 8-27 ||

తే.గీ.  పార్థ! యీ రెండు మార్గముల్ పరమయోగి

యెఱిఁగి భ్రమియింప డీవింక యెఱిఁగి యన్ని

కాలములలోన యోగివై ఘనత నిలువు

మహిత మార్గమ్ము దీనిని మరువబోకు.

భావము‌.

పార్ధా! ఈ రెండు మార్గాలను ఎఱిఁగిన ఏ యోగీ భ్రమించడు. అందుచేత 

అన్ని కాలాలలోను నీవు యోగయుక్తుడివి అగుము.

శ్లో.  వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ

దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్|

అత్యేతి తత్సర్వమిదం విదిత్వా

యోగీ పరం స్థానముపైతి చాద్యమ్. || 8-28 ||

తే.గీ.  వేద యజ్ఞ తపో దాన విధుల చేత

పుణ్యఫలమేది కల్గు తత్ పుణ్య ఫలము

నధిగమించు నిది కనంగ నరసి యోగు

లందుదురు దీనినే ముక్తి నందగోరి. 

భావము.

వేదాలు, యజ్ఞాలు, తపస్సులు, దానాలలో ఏ పుణ్య ఫలం చెప్ప 

బడినదో దానినంతటిని ఇది అధిగమిస్తుంది. దీనిని ఎఱిఁగిన యోగి 

ప్రధానమైన పరమమైన స్థానమును అందుకొనును.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

అక్షరబ్రహ్మయోగో నామాష్టమోऽధ్యాయః.


అథ నవమోధ్యాయః 

రాజవిద్యారాజగుహ్యయోగః

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీకృష్ఢుడిట్లనుచుండెను.

శ్లో. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే|

జ్ఞానం విజ్ఞానసహితం యజ్జ్ఞాత్వా మోక్ష్యసేశుభాత్. || 9-1 ||

తే.గీ.  నీ వశుభవిముక్తిన్బొంది నిరుపమాన 

ముక్తి బొందుదువో యట్టి పూజ్యమయిన

బ్రహ్మ విజ్ఞానమున్ నీకు వరలఁ జెపుదు

నీర్ష్య లేనట్టి యర్జునా యెఱుఁగుమిదియు.

భావము.

దేనిని తెలుసుకోవడం వలన నీవు అశుభం(సంసారం)నుండి విముక్తుడవు 

అవుతావో అటువంటి అతి రహస్యమైన ఈ(బ్రహ్మ)జ్ఞానాన్ని అసూయా 

రహితుడవైన నీకు విజ్ఞానంతో సహా చెబుతాను.

శ్లో.  రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్|

ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్.  || 9-2 ||

తే.గీ. సహ్య రాజవిద్యా రాజగుహ్యమిద్ది,

యుత్తమము పవిత్రంబిద్ది, చిత్తమునను

నిలుచుఁ దేలికగానిద్ది, నిలుపు ధర్మ

మిద్ది, యరయట తేలిక బుద్ధిమంత!

భావము.

ఇది రాజవిద్యా, రాజగుహ్యము, పవిత్రమయినది, ఉత్తమమయినది.  

దీనిని సులభముగా అర్ధము చేసుకొనవచ్చును. ధర్మ పరమైనది, అభ్యసించడం 

తేలిక, నిలకడగా ఉంటుండినది.

శ్లో.  అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరన్తప|

అప్రాప్య మాం నివర్తన్తే మృత్యుసంసారవర్త్మని. || 9-3 ||

తే.గీ.  ధర్మమునునమ్మ రో పరంతప! ధరిత్రిఁ

గొందరట్టివారలు ననున్ మందమతులు

చేరబోవక  మృత్యుసంసారబాధ

లందుచున్ సంచరింతురు, బంధనముల.

భావము.

అర్జునా ఈ ధర్మంలో విశ్వాసం లేని పురుషులు నన్ను పొంద లేక 

మృత్యు సంసార మార్గం లోనే తిరుగుతున్నారు.

శ్లో.  మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా|

మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః. || 9-4 ||

తే.గీ. వ్యక్తమవనట్టి నాచేత వ్యాప్తమయ్యె

సృష్టి యంతయున్,  జీవులు చేరి యుంద్రు

కనగ నా లోన, వారిలో కలుగబోను

నేను, నిజమిదే యర్జునా! జ్ఞాన భాస!

భావము.

ఈ జగత్తు యావత్తు అవ్యక్తంగా ఉండే నాచేత వ్యాపించబడి ఉన్నది. 

జీవులందరూ నాలో నిలిచి ఉన్నారు. అయితే నేను వాళ్ళలో లేను.

శ్లో.  న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్|

భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. || 9-5 ||

తే.గీ.  లేవు ప్రాణులు నాలోన, నీవు నాదు

యోగ మహిమను కనుగొను మో నరుండ!

భూతసృష్టిని చేసి తత్ పోషకుఁడ న

యియును లేనయ్య వాటిలో, యిదినిజంబు.

భావము.

ప్రాణులు కూడా నాలో లేరు. నా యోగమహిమని చూడు. భూత రాశిని 

పుట్టింతును, భరింతును. కాని ఆభూతాలలో ఉండను.

శ్లో.  యథా కాశ స్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్|

తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. || 9-6 ||

తే.గీ.  ఉండునాకసముననె ప్రచండవాయు

వెట్టులోయట్లె నాలోననే చరించు

ప్రాణులన్నియు సతతంబు పార్థ! కనుము.

నిజము గ్రహియించుమిప్పుడే నిర్భయముగ.

భావము.

సర్వత్రా సంచరించే ప్రచండ వాయువు ఎలాగైతే ఆకాశంలోనే ఉండునో, 

అటులనే అన్ని ప్రాణులు నా లోనే ఉనవని తెలుసుకో.

శ్లో.  సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్|

కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్.  || 9-7 ||

తే.గీ.  పార్థ! కల్పాంతమందున ప్రాణికోటి

నాదు ప్రకృతిని పొందెడున్, నేనె మరల,

కల్పమారంభమైనప్డు కలుగు జీవ

కోటిని బయట వేయుదున్, గుంభనముగ.

భావము.

కుంతీ కుమారా! కల్పము పూర్తి అయినప్పుడు జీవులందరూ నా 

ప్రకృతిని పొందుదురు. కల్ప ప్రారంభంలో జీవులందరిని నేనే

 తిరిగి బయటికి వేయుచున్నాను.

శ్లో.  ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః|

భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్. || 9-8 ||

తే.గీ.  ప్రకృతి వశమైనదైన యీ ప్రాణికోటి

ని మరలను నాదు మాయచే న్దిరిగి తిరిగి

సృష్టిఁ జేయుచునుందును దృష్టిపెట్టి,

నీవు గ్రహియింపుమిద్దియు నిరుపమాన!

భావము.

ప్రకృతి వశమైన ఈ యావత్తును నేను నా మాయను ధరించి 

తిరిగి తిరిగి సృజించుచుందును.

శ్లో.  న చ మాం తాని కర్మాణి నిబధ్నన్తి ధనఞ్జయ|

ఉదాసీనవదాసీన మసక్తం తేషు కర్మసు.  || 9-9 ||

తే.గీ.  పార్థ! కర్మలుంచవునన్ను బంధనమున,

కర్మలందు నిరాసక్తి కారణమున

నుందు నే నుదాసీనతనంది, నిజము,

కర్మబంధుడకానట్టి కారణమున.

భావము.

ఓ ధనంజయా! ఆ కర్మలు నన్ను బంధించవు. ఆ కర్మలలో ఆసక్తి లేక 

నేను ఉదాసీనంగా ఉంటాను.

శ్లో.  మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్|

హేతునానేన కౌన్తేయ జగద్విపరివర్తతే.  || 9-10 ||

తే.గీ. ప్రకృతి సృష్టించును చరాచరములు, నాదు

ఘనత రాధ్యక్షతన్ దీని కారణమున,

మరలమరలప్రవర్తించు మహిత సృష్టి,

నిజము గ్రహియింపు మో పార్థ! నిరుపమగుణ!

భావము.

నా అధ్యక్షతన ప్రకృతి చరాచర ప్రపంచాన్ని సృజిస్తుంది. ఆ కారణం 

చేతనే జగత్తు తిరిగి తిరిగి ప్రవర్తిస్తుంది.

శ్లో.  అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్|

పరం భావమజానన్తో మమ భూతమహేశ్వరమ్. || 9-11 ||

తే.గీ.  భూత జాలాధిపతినైన పురుషుడ నగు

దేహములనాశ్రయించిన  మోహదూరు

నన్ను లక్ష్యంబు చేయరు నన్నెఱుఁగని

మూర్ఖ మానవు లర్జునా! పుడమిపైన.

భావము.

జీవరాశికి అధిపతినై ఉండీ మానవ శరీరాన్ని ఆశ్రయించిన (నా 

పరమ తత్వాన్ని గుర్తెరుగలేని మూఢులు) నన్ను నిర్లక్ష్యము చేయుదురు.

శ్లో.  మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః|

రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. || 9-12 ||

తే.గీ.  వారు వ్యర్థాశలను మరి వ్యర్థ  కర్మ

ములను వ్యర్థమౌ యజ్ఞానమున్ జెలంగి

మతులు చెడిపోయి రాక్షస మతుల బృథ్వి 

నాశ్రయించుచునుండుదురహరహంబు.

భావము.

వారు వృధా ఆశలతో దండగమారి కర్మలతో, అనవసరమైన జ్ఞానంతో, 

మతులు చెడి, భ్రాంతి గొలిపే ఆసురిక, రాక్షస ప్రకృతిని 

ఆశ్రయించిన వారగుదురు.

శ్లో.  మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః|

భజన్త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్.  || 9-13 ||

తే.గీ.  పార్థ! దైవీప్రకృతిని, ప్రపంచమందు

భూతరాశికాదియగు నన్ బూర్తిగ కను

దురు, మహాత్ములు, సేవించుదురు సతంబు,

పూర్ణమనములతోనొప్పి, మోదమునను.

భావము.

అర్జునా! మహాత్ములైతే దైవీ ప్రకృతిని, భూత రాశికి ఆది అయి 

నాశంలేని వాడిగా నన్ను తెలుసుకొని అనన్యమైన మనసుతో సేవింతురు.

శ్లో.  సతతం కీర్తయన్తో మాం యతన్తశ్చ దృఢవ్రతాః|

నమస్యన్తశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే.  || 9-14 ||

తే.గీ.  వారు నన్ను కీర్తించుచున్ పరమ నిష్టఁ

గలిగి సాధన చేయుచున్ గౌరవముగ

వందనంబులు చేయుచు భక్తితోడ

నాకు, నుపవసింతురునన్ను శ్రీకరముగ.

భావము.

వారు ఎప్పుడూ నన్ను కీర్తిస్తూ, దృఢమైన నిష్ఠతో సాధన చేయుచు, భక్తితో 

నాకు నమస్కరించుచు నిత్య యుక్తులై ఉపాసింతురు.

శ్లో.  జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజన్తో మాముపాసతే|

ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్. || 9-15 ||

తే.గీ.  పరులు కనగ ద్వైతాద్వైత భావములను

విశ్వమంతటన్ గల నన్ను ప్రీతితోడ

నుపవసింతురు దీక్షతో నుత్తమమగు

జ్ఞాన యజ్ఞంపు మార్గాన ఘనతరముగ.

భావము.

మరి ఇతరులు జ్ఞానయజ్ఞము ద్వారా ఆరాధిస్తూ ఏకత్వ 

(అద్వైత)భావంతో , వేరు అనే(ద్వైత)భావంతోనూ, విశ్వమంతటా 

ఉన్న నన్ను ఉపాసింతురు.

శ్లో.  అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్|

మన్త్రోऽహమహమేవాజ్యమహమగ్నిరహం హుతమ్.  || 9-16 ||

తే.గీ.  నేనె క్రతువును, యజ్ఞంబు నేనె కనగ,

నాహుతులు నేనె హోమంబు నేనె పార్థ!

నేనె మూలికల్, మంత్రంబు నేనె, యగ్ని

నేనె, యాహుతు లరయఁగ నేనె పార్థ!

భావము.

నేనే క్రతువుని, నేనే యజ్ఞాన్ని, పితరుల కర్పించఁ బడే ఆహుతునినేను. 

హోమము చేసే మూలికలు నేను. మంత్రమూ నేను. అగ్నిని ఆహుతిని

కూడా నేనే.

శ్లో.  పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః|

వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవచ.  || 9-17 ||

తే.గీ. జగతికినితల్లి తండ్రియు, ప్రగణితముగ 

కర్మ ఫలదాత, వేద్యము, కనగ నేనె,

నేనె ఋగ్యజుస్సామముల్ నేనె ప్రణవ

మోంకృతి, నరయుమా పార్థ! యుత్తమముగ. 

భావము.

ఈ జగత్తుకి తండ్రి,  తల్లి, కర్మఫల ప్రదాత, తెలియబడవలసినదీ, 

పవిత్రమైన ఓంకారమూ, ఋక్, సామ, యజుర్వేదాలు నేనే.

శ్లో. గతిర్భర్తా ప్రభుః సాక్షీ  నివాసః శరణం సుహృత్|

ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్. || 9-18 ||

తే.గీ.  నేనె గతి, భర్త, ప్రభువును, నేనె సాక్షి,

నేనె స్దానంబు వసియింప, నేనె శరణు,

నేనె యాప్తుడన్, నిధి నేనె, నేనె నవ్య

యమగు మూల హేతువునని యరయుమీవు.

భావము.

నేను లక్ష్యమునూ, భరించేవాడిని, పాలించేవాడిని, అన్నిటికి సాక్షినీ, 

సర్వానికి నివాస స్తానాన్ని, అందరికి శరణ్యమును, ఆప్తుడిని, 

నేనే నిధినీ అవ్యయమైన మూలకారణమూ.

శ్లో.  తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ|

అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. || 9-19 ||

తే.గీ.  నేనె తపమును, వర్షంబు నేనె కనగ, 

నేనె గ్రహియింతు, సృజియింతు నేనె, వినుమ

నేనె మృతి కన, నమృతంబు నేనె, వింటె?

నేనె మంచిని, చెడ్డయున్ నేనె పార్థ!

భావము.

ఓ అర్జునా! తపస్సు, వర్షము, గ్రహియించువాడిని, సృజించువాడిని, 

మృతి, అమృతము, మంచియు చెడ్డయు అన్నీ నేనే.

శ్లో.  త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా

యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయన్తే.  || 9-20 ||

తే పుణ్యమాసాద్య సురేన్ద్రలోక-

మశ్నన్తి దివ్యాన్దివి దేవభోగాన్.

తే.గీ. వేదములు మూడు చదివిన విజ్ఞులఖిల

పాపదూరులికను సోమపానులు, మరి

యజ్ఞ కర్తలున్ నన్గొల్చి యరిగి స్వర్గ

సుఖములొందుదు రర్జునా! సుగుణ గణుఁడ!

భావము.

మూడు వేదాలనూ అధ్యనం చేసినవారు, సోమరసం త్రాగిన వారు. 

పాపాలను నిర్మూలించుకున్న పుణ్యాత్ములు నన్ను యజ్ఞముల ద్వారా 

పూజించి స్వర్గ వాసమును కోరుకొందురు. పుణ్య ఫలమైన ఇంద్ర లోకమును 

పొంది, ఆ స్వర్గములో దివ్య భోగములను అనుభవింతురు.

శ్లో.  తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం

క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి|

ఏవం త్రయీధర్మమనుప్రపన్నా

గతాగతం కామకామా లభన్తే. || 9-21 ||

తే.గీ. స్వర్గ భోగులు తమపుణ్య చయము తరుగ

మనుజ లోకంబునే చేరు మరల, పార్థ! 

కర్మబద్ధులకీగతి కలుగుచుండు

నన్నె నమ్మిన ముక్తి సంపన్నులయెడు.

భావము.

(స్వర్గాన్ని కోరే)వారు విశాలమైన స్వర్గాన్ని అనుభవించి తమ పుణ్యం 

వ్యయము అయిపోగానే మరల మానవ లోకములోకి ప్రవేశింతురు. ఈ విధముగా 

వేదములలోని ఉత్తమ లోకములనిచ్చు కర్మ కాండను పట్టుకున్న 

కామదాసులు (జనన మరణాలను) పొందుతుంటారు.

శ్లో.  అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే|

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్.  || 9-22 ||

తే.గీ.  అన్య చింతన లేక నన్ననితరగతి

నుపవసించుదురోవారల యోగము, మరి

క్షేమమును నేను వహియింతు ప్రేమతోడ,

నీవు గ్రహియింపవలె నిది నేర్పుతోడ.

భావము.

అనన్య భావంతో నన్ను చింతిస్తూ నాయందే నిష్ఠ కలిగి, ఏజనులు నన్ను 

పరిపూర్ణముగా ఉపాసింతురో, వారి యోగక్షేమములను నేనే వహింతును.

శ్లో.  యేప్యన్యదేవతా భక్తా యజన్తే శ్రద్ధయాన్వితాః|

తేऽపి మామేవ కౌన్తేయ యజన్త్యవిధిపూర్వకమ్.  || 9-23 ||

తే.గీ. భక్తు లన్యదేవతలను భక్తి గొలువ

యట్టిదేవతల్ నన్నె పూజాదికముల

సేవఁ జేయు టీవరయుమా చిత్తమందు

నేనె మూలమో యర్జునా నీవెఱుఁగుము.

భావము.

అర్జునా ఇతర దేవతల భక్తులు కూడా తమ దేవతలను శ్రద్ధతో 

ఆరాధిస్తుంటే, వాళ్ళు కూడా విధానం లేకుండా నన్నే ఆరాధింతురు.

శ్లో.  అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ|

న తు మామభిజానన్తి తత్త్వేనాతశ్చ్యవన్తి తే. || 9-24 ||

తే.గీ. అన్ని యజ్ఞంబులన్ భోక్తనరయ నేనె,

యధిపతియు నేనె, పూజింతు రన్యులయిన

దేవతాళిని వారు నన్ దెలియలేక

జన్మములు పొందుచుందురు సహజముగనె.

భావము.

నేనే అన్ని యజ్ఞాలకి భోక్తని అధిపతిని. ఇతర దేవతలను ఆరాధించే

వారు యదార్ధంగా నన్ను తెలుసుకోలేరు. అందువలన వారు

 (మరలా జన్మలలో) దిగజారి పోవుచుండిరి.

శ్లో.  యాన్తి దేవవ్రతా దేవాన్పితౄన్యాన్తి పితృవ్రతాః|

భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి మద్యాజినోऽపి మామ్.  || 9-25 ||

తే.గీ.  దేవతల గొల్వ చేరనౌ దేవతలను,

పితరులన్ గొల్వ చేరనౌ పితరుల నిక

భూతముల్ గొల్వ జేరనౌ భూతములను,

నన్నుఁ  గొల్చిన చేరనౌ నన్నె పార్థ!

భావము.

దేవతలను ఆరాధించే వాళ్ళు దేతలను, పితరులను ఆరాధించే 

వాళ్ళు పితరులను, భూతాలను ఆరాధించేవాళ్ళు భూతాలనూ, 

నన్ను ఆరాధించే వాళ్ళు నన్నే చేరుకుంటారు.

శ్లో.  పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి|

తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః. || 9-26 ||

తే.గీ. భక్తి నొసగిన పుష్పంబొ ఫలమొ జలమొ,

ఆకొ గైకొందునర్జునా! శ్రీకరముగ,

నేను, భక్తిభావంబెంచి నియతితోడ,

భక్తి లేనట్టివారిచ్చు ఫలమదేల?

భావము.

ఏవ్వరు భక్తితో ఆకునో, పువ్వునో, ఫలాన్నో, నీటినో నాకు సమర్పిస్తారో 

ఆ శ్రద్ధ మనస్కులు భక్తితో ఇచ్చిన దానిని నేను స్వీకరిస్తాను.

శ్లో.  యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్|

యత్తపస్యసి కౌన్తేయ తత్కురుష్వ మదర్పణమ్. || 9-27 ||

తే.గీ.  అర్జునా! నీవు తినుదాని, నహరహంబు

చేయు దానిని, హోమంబు చేయ నదియు,

చేయుదానమున్ తపమును చేయఁగఁదగు

నర్పణంబును నాకు హృదర్పితముగ.

భావము.

అర్జునా నీవు ఏది తినుదువో, ఏది చేయుదువో, ఏది హోమంచేయుదువో, ఏది 

దానము చేయుదువో, ఏది తపస్సు చేయుదువో, అది నాకు అర్పణము చెయుము.

శ్లో.  శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబన్ధనైః|

సంన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. || 9-28 ||

తే.గీ.  

ఈ విధముగ సన్యాసయౌగీంద్రుఁడవయి

కర్మఫలబంధములు వీడి కలియు దీవు

నన్ను నర్జునా! యోగివై మిన్నగాను

ధర  శుభాశుభ ఫలములన్ దాటుమింక.

భావము.

ఈ ప్రకారంగా సన్యాసయోగంతో కూడుకున్న వాడవై శుభాశుభ ఫలాలు 

కలిసిన కర్మ భంధాల నుండి విడుదల పొంది, నీవు నన్ను చేరుకొందువు.

శ్లో.  స మోహం సర్వభూతేషు న మే ద్వేష్యోऽస్తి న ప్రియః|

యే భజన్తి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్.  || 9-29 ||

తే.గీ. జీవులన్నిట నే నుంటి జీవ మగుచు,

ద్వేష రాగ విదూరుండ, భాసిల నను

భక్తి సేవించువారిలో వరలుచుందు

వారు నాలోన నుందురు వరలుచుండి.

భావము.

నేను ప్రాణులందరిలోను సమంగా ఉన్నాను. నాకు ద్వేషింప 

తగినవారు అంటూ లేరు, ప్రేమించవలసిన వారూ లేరు. అయితే 

నన్ను భక్తితో ఎవరు సేవింతురో వారు నాలో ఉందురు. నేను 

వారిలో ఉందును.

శ్లో.  అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్|

సాధురేవ స మన్తవ్యః సమ్యగ్వ్యవసితో హి సః. || 9-30 ||

తే.గీ. కన దురాచారుఁడైనను ఘనతరమగు

దీక్షతో నన్ను సేవింప తెలియ నతఁడు

సజ్జనుండుగా నెన్నుటే సరి, నిజంబు,

భక్తి సంయుక్తు లొందెడున్ ముక్తి, నిజము.

భావము.

ఎంత దుర్మార్గుడైనా అతడు అనన్య భావంతో సేవిస్తే అతడు సరైన 

నిర్ణయం తీసుకున్న వాడే, కాబట్టి సత్పురుషుడుగానే ఎంచతగిన వాడు.

శ్లో.  క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి|

కౌన్తేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి.  || 9-31 ||

తే.గీ.  అతడు ధర్మాత్ముఁడై శాశ్వతాత్మనెఱిఁగి

శాశ్వతమ్ముగ పొందును శాంతి కనఁగ,

నాదు భక్తుండు నశియింపరాదు, నీవె

యీ ప్రతిజ్ఞను చేయుమో సుప్రకాశ!

భావము.

అర్జునా అతడు త్వరలోనే ధర్మాత్ముడై, శాశ్వతమైన శాంతిని పొందుతాడు. 

నాభక్తుడు నశించడని ప్రతిజ్ఞ చెయ్యి.

శ్లో.  మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేऽపి స్యుః పాపయోనయః|

స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేపి యాన్తి పరాం గతిమ్. || 9-32 ||

తే.గీ. పాప యోనులున్, శూద్రులున్ వైశ్యులైన

స్త్రీలె యైనను భక్తితో సేవ నాకు

చేసి, యాశ్రయించిన, వారు భాసిలుదురు

భవ్యమైనట్టి గతిపొంది, పార్థ! నిజము.

భావము.

అర్జునా! నన్ను ఆశ్రయించిన వాళ్ళు పాప యోనులు కానీ, స్త్రీలు, 

వైస్యులు, శూద్రులు కానీ వాళ్ళుకూడా ఉత్తమగతిని తప్పక పొందుదురు.

శ్లో.  కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా|

అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్. || 9-33 ||

తే.గీ.  పుణ్యులైనట్టి బ్రాహ్మణుల్, పూజ్యులయిన

దివ్యరాజర్షులగువారి దెలుపనేల

నింక, క్షణిక మశాశ్వత మిద్ధరిత్రి

యిందు పుట్టిన నీవు నన్ పొందుమరసి.

భావము.

ఇక పుణ్యులైన బ్రాహ్మణులు, భక్తులైన రాజర్షుల సంగతి చెప్పాడం 

దేనికి? క్షణికము, దుఃఖమయమూ అయిన ఈ లోకంలో పుట్టిన నీవు 

నన్ను సేవించుము.

శ్లో.  మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు|

మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః.  || 9-34 ||

తే.గీ.  నీదు మదినాకునర్పించు, నేర్పుతోడ

నాదు భక్తుండవై వెల్గు నన్నె కొలిచి

వందనంబులు చేయుచు వదలక నను

నమ్మినన్ జేరగలవు నన్, సమ్మతి గను.

భావము.

నీ మనస్సును నాకు అర్పించు. నా భక్తుడివి అగుము. నన్ను ఆరాధించుము. 

నాకే నమస్కరించుము. ఈ విధముగా నాలో మనసు నిలిపి, నన్ను లక్ష్యముగా 

పెట్టుకొని నన్నే చేరగలవు.


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

రాజవిద్యారాజగుహ్యయోగో నామ నవమోऽధ్యాయః.


అథ దశమోధ్యాయః 

విభూతియోగః‌

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ భగవానుడు ఇలా చెప్పుచుండెను..

|| 10-1 ||

శ్లో.  భూయ ఏవ మహాబాహో! శృణు మే పరమం వచః|

యత్తేऽహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా.

తే.గీ.  మహిత!పార్థుఁడా! నీవు నా మాటలకును

సంతసించుచుండుటఁజేసి సదయ నేను

పలుకు నా మాటలన్ విను వరలు నీకు

మేలు, పొందు సత్యంబుగాఁ గల్గు మేలు నీవు.

భావము.

ఓమహానుభావా! అర్జునా! నా మాటలకు సంతోషిస్తున్న నీకు 

మేలు కలగాలని, నేను చెప్తున్న శ్రేష్ఠమైన ఈ మాటలు మళ్ళీ విను.

 || 10-2 ||

శ్లో.  న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః|

అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః.

తే.గీ.  దేవతలు ఋషులెఱుఁగరు దివ్యమైన

నాదు జన్మంబు సంగతి,  నయనిధాన!

వారి కన్నను ముందె నే వరలి యుంటి,

జ్ఞాన పూర్ణులు గ్రహియింత్రు కలుగు నిజము. 

భావము.

నా పుట్టుకను గురించి దేవతలుకాని మహర్షులుకాని ఎఱుఁగరు. 

దేవతలు మహర్షులు అందరికన్నా పూర్వపు వాడిని నేను.

.|| 10-3 ||

శ్లో.  యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్|

అసమ్మూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే.

తే.గీ.  పుట్టుకయు మొదల్ లేనట్టి పూర్ణుడనని

ప్రభువుగా నేను జగతికి వరలుదునని

యెఱుఁగు నాతండు సుజ్ఞాని, పరగునతఁడు

పాపదూరుఁడై ముక్తిని పడయఁగలడు,

నీవు గ్రహియింపుమియ్యది నేర్పు మీర.

భావము.

పుట్టుకా మొదలులేని వాడుగానూ, లోకాలకు ప్రభువుగాను నన్ను 

తెలుసుకున్న వాడు మనుష్యులలో జ్ఞాని అయి అన్ని పాపాలనుండి

 విముక్తి చెందగలఁడు.

 || 10-4 ||

శ్లో.  బుద్ధిర్జ్ఞాన మసమ్మోహః క్షమా సత్యం దమః శమః|

సుఖం దుఃఖం భవోऽభావో భయం చాభయమేవచ.

తే.గీ. తెలివి, జ్ఞానమ్ము, సత్యమ్ము, దివ్యమైన

మోహరాహిత్య మోర్పును, పొగడదగిన

మదిని నిగ్రహించెడి శక్తి,మరి భయాభ

యములు, సుఖదుఃఖములు నేనె యమర గనుదు.

భావము.

తెలివి, జ్ఞానం, మోహరాహిత్యము, ఓర్పు, సత్యము, మనో నిగ్రహము, 

సుఖ దుఃఖాలు, ఉండడమూ, లేకపోవడమూ, భయాభయాలు

 (నా వలననే కలుగును.)

|| 10-5 ||

శ్లో.  అహింసా సమతా తుష్టిస్తపో దానం యశోయశః|

భవన్తి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః.

తే.గీ.  అల యహింస, సమత్వము నపయశస్సు, 

యశము, దాన  తపస్సులు నలరునట్టి

వివిధ భావముల్, తృప్తి, నే వెలయఁ జేయు

చుందునర్జునా! గ్రహియింపమందు నిన్ను.

భావము.

అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, యశస్సు, అపయశస్సు 

మొదలైన వేరు వేరు భావాలు జీవులలో నా వలననే కలుగును.

|| 10-6 ||

శ్లో.  మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా|

మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః.

తే.గీ.  నాదు సంకల్ప బలముచే మోదమలర

ఋషులు, మనువులుండిరి మున్నె సృష్టిలోన,

వారి వలననె కలిగిరి ప్రజలు భువిని, 

తెలియ నెంచిన నీకిది తెలియు పార్థ!

భావము.

సృష్టి ఆరంభంలో ఉన్న సప్త ఋషులు, నలుగురు మనువులు నా 

సంకల్పము వలన పుట్టిన వారే. వారి నుండి ఈ ప్రజలు వచ్చిరి.

 || 10-7 ||

శ్లో.  ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః|

సోవికమ్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః.

తే.గీ. నా విభూతి యోగమ్మును నయనిధాన!

యసలు తత్వంబు నర్మిలి నరయువారు

నిశ్చలంబగు యోగాన నిలిచిపోదు

రిందు సందేహమే లేదదెప్పటికిని.

భావము.

ఈ నా విభూతి యోగాన్ని అసలు తత్వములో తెలుసుకున్నవాడు, 

చలించని యోగములో నిలిచి పోవును. ఇందులో సందేహము లేదు.

 || 10-8 ||

శ్లో.  అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే|

ఇతి మత్వా భజన్తే మాం బుధా భావసమన్వితాః.

తే.గీ.  సృష్టి మూలము నేనని దృష్టిపెట్టి 

నన్ను కొలుతురు భక్తులు మిన్నగాను,

నేనె జగతిని నడుపుటన్ జ్ఞానులరసి

ప్రియముతోడ నన్ గొలుతురు నయము దలర.

భావము.

నేను అన్నిటి పుట్టుకకి హేతువుని. నా వలననే సమస్తమూ 

నడుస్తుందని తెలుసుకున్న వివేకులు భక్తి పూరితులై నన్ను సేవింతురు.

 || 10-9 ||

శ్లో.  మచ్చిత్తా మద్గతప్రాణా బోధయన్తః పరస్పరమ్|

కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్తి చ రమన్తి చ.

తే.గీ.  తమ మనసులను నాలోన తన్మయతను

లీనమున్ జేసి నాదగు లీలలెన్ని

చెప్పుకొందురు తృప్తిగా గొప్పగాను

ముక్తి సాధనకిదియెగా మూలమరయ. 

భావము.

తమ మనసులను నాలో లీనము చేసి జీవితాలను నాకే అర్పించి, 

నన్ను గురించే పరస్పరమూ బోధించుకొనుచు, చెప్పుకొనుచు 

నిత్యమూ తృప్తి పడుదురు, ఆనందింతురు.

|| 10-10 ||

శ్లో.  తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్|

దదామి బుద్ధియోగం తం యేన మాముపయాన్తి తే.

తే.గీ.  సతము నాపైన మనసును సరిగనుంచి

ప్రీతితో సేవ చేసెడి విజ్ఞులకును

నన్ను చేరంగ మార్గమున్  గ్రన్నన నిడ

జ్ఞాన యోగంబు గొల్పెదన్, కాంక్షతీర్చ.

భావము.

అలా సతతమూ మనసు నాయం దుంచి, ప్రీతితో సేవించే వారికి 

నన్ను చేరుకొనుటకు కావలసిన జ్ఞానయోగమును నేను కలుగఁ జేయుదును.

|| 10-11 ||

శ్లో.  తేషామే వానుకమ్పార్థమహమజ్ఞానజం తమః|

నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా.

తే.గీ.  వారిని కనికరింప నవారిత గతి

మనసులందున నే నుందు, మానితముగ

జ్ఞాన దీప్తిని గొల్పి యజ్ఞాన మనెడి

తిమిర సంహారమును జేయ, ధీవరేణ్య!

భావము.

వారిని కనికరించుట కొఱకు నేను వారి మనస్సులలో నిలిచి, వారి 

అజ్ఞాన తమస్సుని ప్రకాశించే జ్ఞానదీపముతో నశింపజేయుదును.


అర్జున ఉవాచ.

భావము.

అర్జునుడు పలుకుచుండెను.

|| 10-12 |||

శ్లో.  పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్|

పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్.

తే.గీ. నీవె కన పరబ్రహ్మవు, నీవె పరమ

ధాముఁడవు, శాశ్వతుండవు, తలప జన్మ

లేనివాఁడవు, శుచివి సుజ్ఞాన ఖనివి

యాది దేవుడవరయఁగా,  ధీనిధాన!

భావము.

నీవు పరబ్రహ్మవు, పరంధాముడివి, పరమ పవిత్రుడవు, శాశ్వతుడవు, 

దివ్యుడవు, పరమ పురుషుడవు ఆది దేవుడవు. పుట్టుక లేనివాడవు.

|| 10-13 ||

శ్లో.  ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా|

అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే.

తే.గీ.  అని ఋషులు, నారదుఁ డశితు, డందు రటులె

దేవలుఁడు వ్యాసుడందురు, తెలియునటుల

నీవు కూడ పల్కితివట్లె నేర్పుమీర,

తెలియ బల్కినన్ వినినను దెలియనగును.

భావము.

అని అందరూ ఋషులు, దేవర్షి నారదుడూ, అలాగే అశితుడూ, దేవలుడూ, 

వ్యాసుడూ అంటారు. స్వయముగా నీవుకూడా అటులనే చెప్పుచుంటివి.

 || 10-14 ||

శ్లో.  సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ|

న హి తే భగవన్వ్యక్తిం విదుర్దేవా న దానవాః.

తే.గీ. విశ్వశింతును నీ మాట విశ్వనాథ!

నీదు వ్యక్తమౌ దేహంబు నిరుపమాన

మెఱుఁగ నేరరు దేవతల్ పరమపురుష!

యెఱుఁగనేరరు రాక్షసు లెన్నటికిని!

భావము.

కేశవా! నీవు నాతో చెప్పినదంతా నిజమేనని విశ్వశిస్తున్నాను. 

నీ వ్యక్త శరీరాన్ని దేవతలుకాని దానవులు కాని ఎరుగరు.

 || 10-15 ||

శ్లో.  స్వయమే వాత్మ నాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ|

భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే.

తే.గీ.  భూతభావనుఁడా! దేవ! భూతనాథ!

హే జగన్నాథ! నిన్ను నీవే యెఱుంగు

దువు పురుష పుంగవా! హరీ! తోయజాక్ష!

కనగ నిజమిదే పరమేశ! గుణనిధాన!

భావము.

భూత భావనుడా! భూతేశా! జగత్పతీ! పురుషోత్తమా! నిన్ను నీవే నీచేతనే 

స్వయంగా ఎఱుఁగుదువు.

 || 10-16 ||

శ్లో.  వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః|

యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి.

తే.గీ. వ్యాపితంబయి జగతిలో వరలియుంటి 

వీవె యేయేవిభూతులన్ బ్రీతితోడ

చెప్పగా నీకె సాధ్యమౌన్ గొప్పగాను

తనరు నాయా విభూతులన్ దరళనేత్ర.

భావము.

ఏయేవిభూతులలో నీవు ఈలోకమంతటా వ్యాపించి ఉన్నావో 

ఆదివ్యమైన విభూతులను అశేషంగా చెప్పడానికి నీవే తగినవాడివి.

|| 10-17 ||

కథం విద్యామహం యోగింస్త్వాం సదా పరిచిన్తయన్|

కేషు కేషు చ భావేషు చిన్త్యోసి భగవన్మయా.

తే.గీ.  యోగివైనట్టి నిన్ను నే నొప్పిదముగ

నెఱుఁగుటెట్టుల ధ్యానినై? యీశ్వరుండ!

నిన్నునేరూపములను ధ్యానింపవచ్చు?

తెలియ జెప్పుము కృపతోడ తెలుసుకొందు.

భావము.

ఓయోగీ! సదా ధ్యానిస్తూ నేను నిన్ను ఎలా తెలుసుకోగలను?

భగవంతుడా! ఏయేరూపాలతో నిన్ను ధ్యానించవచ్చు?

|| 10-18 ||

శ్లో.  విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన|

భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేమృతమ్.

తే.గీ.  ఓ జనార్దనా! తెల్పు నీ యోగ మరయ,

సద్విభూతిని కృపతోడ సరసిజాక్ష!

నీదు వాగమృతమదెంత నేను గ్రోలు

చున్నఁ దృప్తియే కలుగదే సుజనపాల!  

భావము.

ఓజనార్ధనా! నీ యోగాన్ని విభూతిని విస్తారంగా చెప్పు. అమృతతుల్యమైన 

నీమాటలు ఎంత విన్నా నాకు తృప్తి కలుగదు.

శ్రీభగవానువాచ|

భావము.

భగవానుడనుచుండెను.

|| 10-19 ||

శ్లో.  హన్త తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః|

ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యన్తో విస్తరస్య మే.

తే.గీ. నాదు గొప్ప విభూతులన్ నీదు మదికి

వ్యక్త మగునట్లు తెల్పుదున్ బార్థ! వినుము,

నాదు విస్త్రుతి కంతమే లేదు కనగ

నీవు గ్రహియింపుమా, లసద్భావపూర్ణ!

భావము.

అర్జునా! నా దివ్య విభూతులలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు నీకు 

చెప్పుదును. నా విస్తారమునకు అంతు అనునది లేదు.

 || 10-20 ||

శ్లో.  అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః|

అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవ చ.

తే.గీ. అన్నిప్రాణుల హృదయాల నమరి యుందు 

నే ననుపమాన! పార్థుడా! నిత్యమెలమి,

నాదిమధ్యాంతముల్ నేనె, యందరికిని,

సృష్టి నాదిమధ్యాంతముల్ చెలగ నుంటి.

భావము.

గుడాకేశా! నేను అన్ని ప్రాణుల హృదయాలలో ఉంటాను.

 ప్రాణుల అది మధ్యంతాలు(సృష్టి స్థితి లయలు)నేనే.

 || 10-21 ||

శ్లో.  ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్|

మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ.

తే.గీ.  విష్ణునాదిత్యులందున, వెలుగునిచ్చు

వారిలో సూర్యుడను నేను, పార్థ! తెలియ,

యా మరుత్తులందుమరీచి,నరయ నేనె,

తారలందున చంద్రుడన్ దలప నేనె.

భావము.

నేను ఆదిత్యులలో విష్ణువుని, వెలుగునిచ్చు వారిలో కిరణములు 

కలిగిన సూర్యుడను. మరుత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడను.

 || 10-22 ||

శ్లో.  వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః|

ఇన్ద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా.

తే.గీ.  వేదములలోన గన సామ వేదమేను,

దేవతలనింద్రుడను నేనె, తెలియగాను,

యింద్రియంబులన్మనసునేనింద్ర తనయ!

ప్రాణులందున చైతన్య భావమేనె.

భావము.

నేను వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుడిని, ఇంద్రియాలలో 

మనస్సుని, ప్రాణులలో చేతనత్వాన్ని నేనే.

|| 10-23 ||

శ్లో. రుద్రాణాం శఙ్కరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్|

వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్.

తే.గీ. రుద్రులందునఁ గన శంకరుండ నేనె,

యక్షరాక్షసులందున నక్షయమగు

ధనపతి యగు కుబేరుడన్, తలచి చూడ,

వసువులన్ బావకుడ నేనె, యసమ చరిత!

పర్వతంబుల మేరువై పరగు దేనె.

భావము.

నేను రుద్రులలో శంకరుణ్ణి, యక్ష రాక్షసులలో కుబేరుడిని, వసువులలో 

పావకుడిని, పర్వతాలలో మేరువుని.

 || 10-24 |

శ్లో.  పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్|

సేనానీనామహం స్కన్దః సరసామస్మి సాగరః|

తే.గీ.  అల పురోహితులందు బృహస్పతినయ!

స్కందుఁడను సేనకధిపతులందు నేనె,

సరసులన్ సాగరము నేనె, సరసభావ!

పార్థ! నన్ను నీ వెఱుఁగుము భవచయముగ.

భావము.

అర్జునా! నేను పురోహితులలో శ్రేష్టుడైన బృహస్పతిని. 

సేనానాయకులలో కుమారస్వామిని, సరసులలో సాగరాన్ని అని తెలుసుకో.

 || 10-25 |

శ్లో.  మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్|

యజ్ఞానాం జపయజ్ఞోऽస్మి స్థావరాణాం హిమాలయః|

తే.గీ.  ఋషులలో నేనె భృగువును, యసమచరిత!

శబ్దములలోన నోంకార శబ్దమేనె,

యజ్ఞ ములలోన గన జప యజ్ఞ మేనె,

స్థావరంబులన్ హిమపర్వతంబు నేనె.

భావము.

మహర్షులలో భృగువుని, శబ్దాలలో ఏకాక్షరమైన ఓంకారాన్ని. 

యజ్ఞాలలో జపయజ్ఞాన్ని, స్థావరాలలో హిమాలయాన్ని.

 || 10-26 ||

శ్లో.  అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః|

గన్ధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః.

తే.గీ.  వృక్షములయందు రావి నేన్, వేల్పు ఋషుల

నారదుఁడు నేనె, గంధర్వ ధీరులందు

చిత్రరథుఁడను నేనే, ప్రసిద్ధులయిన

మహిత మునులందు కపిలుఁడన్, మాననీయ!

భావము.

నేను వృక్షాలలో రావి చెట్టుని. దేవర్షులలో నారదుణ్ణి. గంధర్వులలో 

చిత్రరథుణ్ణి, సిద్ధులలో కపిల మునిని.

 || 10-27 |

శ్లో.  ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్|

ఐరావతం గజేన్ద్రాణాం నరాణాం చ నరాధిపమ్|

తే.గీ. అరయ  నుచ్చైశ్రవమును నే నశ్వములను,

కరులనైరావతమునునే నరసి చూడ,

మనుజులందున రాజును, వినుము పార్థ!

నన్ను నరయగ యత్నించు మన్ననమున.

భావము.

నేను గుర్రములలో అమృతంతో పుట్టిన ఉచ్చైశ్రవాన్ని, ఏనుగులలో 

ఐరావతాన్ని, మనుష్యులలో రాజుని.

|| 10-28 ||

శ్లో.  ఆయుధానామహం వజ్రం, ధేనూనామస్మి కామధుక్|

ప్రజనశ్చాస్మి కన్దర్పః, సర్పాణామస్మి వాసుకిః.

తే.గీ. ధాత్రి నరసిన వజ్రాయుధంబు నేనె,

కామధేనువునావులన్, గాముఁడనయ

జన్మనిచ్చెడివారిలో, సర్పములను

వాసుకిని నేనె తెలియుము పార్థ!  నీవు.

భావము.

నేను ఆయుధాలలో వజ్రాన్ని. గోవులలో కామధేనువుని. పుట్టించేవాళ్ళల్లో 

మన్మధుడిని, సర్పాలలో వాసుకిని.

|| 10-29 ||

శ్లో.  అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్|

పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్.

తే.గీ.  నాగు లందు ననంతుండ, నయనిధాన!

జలచరాధిప వరుణుఁడన్, సన్నుతాత్మ!

పితరులందర్యముడను నేన్ వినుతకీర్తి!

యమము నే సంయములలోన, నమర చరిత!

భావము.

నేను నాగులలో అనంతుడిని, జలచరములకు అధిపతి అయిన వరుణుడిని, 

పితరులలో ఆర్యముడిని, సమ్యమవంతులలో నిగ్రహాన్ని.

|| 10-30 ||

శ్లో.  ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం, కాలః కలయతామహమ్|

మృగాణాం చ మృగేన్ద్రోऽహం, వైనతేయశ్చ పక్షిణామ్.

తే.గీ.  దైత్యులందు ప్రహ్లాదుడన్, ధాత్రిపైన

కలయితులలోన కాల మేన్, గరుడపక్షి

నేను పక్షులన్, మృగములన్ నేనె  సింహ

మనుచు నెఱుఁగుము, పార్థుడా! వినుత కీర్తి!

భావము.

నేను దైత్యులలో ప్రహ్లాదుడీని, లెక్కలు కట్టేవాళ్ళల్లొ కాలాన్ని, 

మృగాలలో మృగేంద్రుడిని, పక్షులలో గరుత్మంతుడిని.

|| 10-31 ||

శ్లో.  పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్|

ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ.

తే.గీ.  పావనులలోన వాయువున్, పార్థ! నేను,

శస్త్ర ధారులన్ రాముఁడన్, జలచరముల

మొసలి నేనేను తెలియుమా, పుణ్య చరిత!

నదులలో గంగ నేనేను నన్ను గనుమ.

భావము.

నేను పావనం చేసేవాళ్ళల్లో వాయువుని శస్త్రధారులలో రాముడిని, 

జలచరాలలో ముసలిని, నదులలో గంగని.

|| 10-32 ||

శ్లో.  సర్గాణామాదిరన్తశ్చ మధ్యం చైవాహమర్జున|

అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్.

తే.గీ. ఆది మధ్యాంతముల్ నేనె యరయ సృష్టి

ననితరాధ్యాత్మ విద్య నేననుపమాన!

వాదనములలో వాదమై ప్రబలుదేనె,

పార్థ! గ్రహియించువారలు పరవశింత్రు.

భావము.

అర్జునా! సృష్టులన్నిట్లో ఆదిమధ్యాంతాలు నేనే. విద్యలలో 

అధ్యాత్మ విద్యని, వాదించేవారిలో వాదన నేనే.

|| 10-33 |

శ్లో.  అక్షరాణామకారోऽస్మి ద్వన్ద్వః సామాసికస్య చ|

అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః|

తే.గీ.  అక్షరంబులనక్షర మరయ నేనె,

ద్వంద్వమనుసమాసమునేనె ధర సమాస

ములను, నాశ రహితకాలము కన నేనె,

సర్వతోముఖేశ్వరుఁడేనె గర్వరహిత!

భావము.

నేను అక్షరాలలో అకారాన్ని, సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని, 

నాశనంలేని కాలాన్ని. సర్వతోముఖంగా ఉండే ఈశ్వరుడిని. || 10-34 |

శ్లో.  మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతామ్|

కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా|

తే.గీ. మృత్యువున్ బుట్టుకయు నేనె మేదినిపయి,

స్త్రీలలో కీర్తి, స్మృతి, వాక్కు, శ్రీయు నేనె,

క్షమయు, ధృతియును, మేధయున్, కనగ నేనె,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.

భావము.

నేను సర్వాన్ని హరించే మృత్యువుని, భవిష్యత్తులో ఉదయించబోయే 

వారి పుట్టుకని, స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా, ధృతి, 

క్షమా గుణాలు కూడానేనే. 

|| 10-35 ||

శ్లో.  బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛన్దసామహమ్|

మాసానాం మార్గశీర్షోహమృతూనాం కుసుమాకరః.

తే.గీ. సామములలోన నే బృహత్సామమరయ,

ఛందములలోన గాయత్రి,  జయుఁడ! నేనె

మార్గశీర్షంబు నేనేను మాసములను,

ఋతువులందు వసంతంబు పృథ్వి నేనె.

భావము.

అలాగే నేను సామాలలో బృహత్సామాన్ని, ఛందస్సులలో గాయత్రిని, 

మాసాలలో మార్గశీర్షాన్ని, ఋతువులలో వసంత ఋతువుని.

 || 10-36 ||

శ్లో.  ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్|

జయోస్మి వ్యవసాయోస్మి సత్త్వం సత్త్వవతామహమ్.

తే.గీ.  మోసములలోన కన ద్యూతమునగుదునయ,

తేజమునవెల్గువారిలో తేజమేనె

నేనె జయమున్, బ్రయత్నంబు నేనె యరయ,

సాత్వికులలోన గలయట్టి సత్వమేనె.

భావము.

నేను మోసములలో జూదాన్ని, తేజోవంతులలో తేజాన్ని, 

జయాన్ని ప్రయత్నాన్ని, సాత్వికులలో సత్వాన్ని.

|| 10-37 ||

శ్లో.  వృష్ణీనాం వాసుదేవోऽస్మి పాణ్డవానాం ధనఞ్జయః|

మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః.

తే.గీ.  వాసుదేవుండ శ్రీవృష్ణివంశమునను,

పాండవులలోన పార్థుఁడై పరగుదేనె,

మునులలో నేను వ్యాసుండ పుణ్య చరిత!

కవులలోన శుక్రాచార్య కనగ నేనె.

భావము.

నేను వృష్ణి వంశస్తులలో వాసుదేవుడిని, పాండవులలో, 

అర్జునుడిని, మునులలో వ్యాసుడిని, కవులలో శుక్రాచార్యుడిని.

 || 10-38 ||

శ్లో.  దణ్డో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్|

మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్.

తే.గీ.  శాసకులలోని దండన, జయము కోరు

వారిలో నీతియు, రహస్య భావ మౌన

మరయ నేనేను, జ్ఞానులన్ వరలు జ్ఞాన

మదియు నేనేను,పార్థుడా!  మదిని గనుమ.

భావము.

శాసకులలో దండమూ, జయంకోరేవారిలోని నీతీ, రహస్యాలలో 

మౌనమూ, జ్ఞానులలో జ్ఞానమూ నేనే.

 || 10-39 ||

శ్లో.  యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున|

న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్.

తే.గీ. ప్రాణులకు మూలమేనేను, పార్థ! వినుమ,

ధర చరాచరములలోన తలచి చూడ

నేను లేనన్నదే లేదు, నిజము కనగ,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.

భావము.

అర్జునా! అన్ని ప్రాణుల యొక్క మూలకారణం నేను. చరాచర 

ప్రపంచంలో నేను లేనిదంటూ ఏదీ లేదు.

 || 10-40 ||

శ్లో.  నాన్తోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరన్తప|

ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా.

తే.గీ.  నా విభూతికి తుది లేదు, నీవెఱుంగ

క్లుప్తముగ జెప్పినాడను గొప్పదయిన

దాని విస్తారమును నీకు పూనికగొని

నీవు గ్రహియింపుమర్జునా! నేర్పుమీర.

భావము.

అర్జునా! నా దివ్యమైన విభూతులకు అంతులేదు. నా విభూతుల 

విస్తారాన్ని క్లుప్తముగానే చెప్పితిని.

 || 10-41 ||

శ్లో.  యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా|

తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంऽశసమ్భవమ్.

తే.గీ.  ఏది కలదోవిశిష్టమై మేదినిపయి,

శోభయున్ శక్తిగలదేదొ, శుభగుణాఢ్య!

యరయనదియంతయున్ నాదు పరమ శక్తి

నుండియే కల్గుటెంచుమా ఖండితముగ.

భావము.

విశిష్టమైన గుణమూ, శోభా, శక్తీ కలిగినది ఏది ఉన్నదో ఆప్రతీదీ 

నా తేజము నుండి పుట్టినదని తెలుసుకో.

|| 10-42 ||

శ్లో.  అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున|

విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్.


తే.గీ. ఇన్ని మాటలవేల? నీవన్నిటిఁ గన

నేనె భరియించుచుండిటు నిలిచినాడ

నొక్క యంశతోమాత్రమే నిక్కమిదియె,

నీవు గ్రహియింపుమర్జునా! నేర్పు మీర.

భావము.

అర్జునా! ఇన్ని మాటలు దేనికి ఈ యావత్ప్రపంచాన్ని నేను 

ఒక్క అంశతో భరించి నిలిచి ఉంటిని.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

విభూతియోగో నామ దశమోऽధ్యాయః



 అథైకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

అర్జున ఉవాచ|

భావము

అర్జునుడిట్లనియె.

|| 11-1 ||

శ్లో. మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్|

యత్త్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ.

తే.గీ. నన్ననుగ్రహించుటకయి మన్ననమున

ఘన రహస్యమౌ యధ్యాత్మ వినుత మయిన

జ్ఞాన బోధనన్ బొడమె సుజ్ఞానమనఘ!

మోహమంతమైపోయెను మోహనాంగ!

భావము.

నన్ను అనుగ్రహించుటకై కరుణతో నీచేత చెప్పబడిన పరమ 

రహస్యమైన అధ్యాత్మఙ్ఞానముచే నా అఙ్ఞాన మోహమంతయు 

మాయమైపోయినది.

 || 11-2 ||

శ్లో.  భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా|

త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్.

తే.గీ.  భూత సృష్టిస్థితిలయలు మూలమయిన

ఘన రహస్యమున్, నీ యందు కలుగు మహతి

నీవు చెప్ప నెఱింగితి నీరజాక్ష!

విస్తృతంబుగ నేనిట విశదమాయె.

భావము.

హే కృష్ణా! సర్వభూతముల సృష్టి, స్థితి, లయ రహస్యమును

 గూర్చి నీ శాశ్వతమయిన అవ్యయమైన మహా మహిమను గూర్చి 

నీవు చెప్పగా నేను సవిస్తారముగా వింటిని.

 || 11-3 ||

శ్లో.  ఏవమేతద్యథాత్థ త్వమాత్మానం పరమేశ్వర|

ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ.

తే.గీ.  ప్రీతిఁ దెల్పిన నీదగు విశ్వరూప 

మహిమ సత్యంబు, పొగడగన్ మనసు కలిగె

నీ యపారమౌ జ్ఞానము, నీయనంత

తేజ మమరు శక్త్యైశ్వర్య పూజనీయ

రూపమునుగాంచగాను గోరుదును తెలియ.

భావము.

ఓ పరమేశ్వరా! నీ మహాద్భుత విశ్వరూప మహిమను గూర్చి 

నీవు చెప్పినదంతయు పరమ సత్యమే. ఓ పురుషోత్తమా! అపార

ఙ్ఞాన శక్తి తేజములతో కూడిన మహా ఘనమైన నీ అనంత 

ఐశ్వర్య రూపమును ప్రత్యక్షముగ దర్శింప గోరుచున్నాను.

| 11-4 ||

శ్లో.  మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో|

యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్.

తే.గీ.  నీదు ఘనవిశ్వరూపమున్ నేను జూడ

తగినదని నీవు తలచిన తప్పకుండ

గొప్పదైన యా రూపంబు గొప్పగాను

చూపుమిప్పుడే నాకిటన్ శుభద కృష్ణ! 

భావము.

హే యోగేశ్వర ప్రభో! నీ ఘన విశ్వరూపం నాచేత చూడశక్య

మైనదని నీవు తలంచుచో అట్టి నాశరహితమైన నీ దివ్య రూపమును నాకు చూపుము.

|| 11-5 ||

శ్రీభగవానువాచ|

భావము.

భగవానుడు అనుచున్నాడు.

శ్లో.   పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః|

నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ.

తే.గీ.  కను మసంఖ్యాకముగ ననేకవిధములుగ

కల యనేక వర్ణంబులు, కలయనేక

మయినయాకృతులనునొప్పు, మద్విశిష్ఠ

రూపమునుగాంచు మర్జునా! లోపరహిత!

భావము.

ఓ పార్థా! అసంఖ్యాకములైన, అనేక విధములుగనున్న, 

అనేక వర్ణములు కలిగిన, అనేకాకృతులలో నున్న నా దివ్య 

రూపమును చూడుము.

|| 11-6 ||

శ్లో.  పశ్యాదిత్యాన్వసూన్రుద్రానశ్వినౌ మరుతస్తథా|

బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత.

తే.గీ. వసువులన్ రుద్రులన్, మరుద్భాస్కరులను,

గనుము సూర్యాశ్వినీ తతిన్ మునుపెవరును

గనని యద్భుత విశ్వరూపునిపుడిచట

నర్జునా! నీకు చూపెద ననుపమముగ.

భావము.

ఓ అర్జునా! ద్వాదశాదిత్యులను, అష్ట వసువులను, ఏకాదశ 

రుద్రులను, అశ్వనీ దేవతలను, సప్త మరుత్తులను నాలో 

చూడుము. మరియు మహాశ్చర్యమును కలిగించే పూర్వమెప్పుడూ 

ఎవ్వని చేత చూడబడని అనేక అద్భుతములను నాలో 

నిపుడుగాంచుము.

 || 11-7 ||

శ్లో.  ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్|

మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ ద్రష్టుమిచ్ఛసి.

తే.గీ. కను  చరాచరములనునీ కాంక్ష తీర

లోకములఁగల సర్వమున్ శ్రీకరముగ

చూడు నాలోననిప్పుడే శుభసుచరిత!

యెవ్వరును గాంచరీ రూపు, కవ్వడి! కను.

భావము.

ఓ అర్జునా! నాదేహమందే చరాచర ప్రపంచమునెల్లను ఒకే చోట

నున్నట్లు ఇక్కడే ఇప్పుడే చూడుము. మరియు నీవు చూడగోరినదెల్ల

 నాలోనే చూడుము.

 || 11-8 ||

శ్లో.  న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా|

దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్.

తే.గీ. స్థూలదృష్టితో కనలేవు సూక్ష్మమయిన

దివ్యచక్షువులిచ్చెద తృప్తి గాను

చూడు నావిశ్వ రూపమున్, శోభనీయ

మనుపమంబగువైభవమును గనుమిట.

భావము.

నీ స్థూల దృష్టితో నా అనంత స్వరూప మహిమను చూడలేవు.

 కనుక దివ్యదృష్టి నీకిచ్చుచున్నాను. ఈ ఙ్ఞాన దృష్టితో అపారమైన 

నా విశ్వరూప వైభవమును గాంచుము.

సఞ్జయ ఉవాచ.

భావము.

సంజయుడిట్లు పలికెను.

|| 11-9 ||

శ్లో.  ఏవముక్త్వా తతో రాజన్మహాయోగేశ్వరో హరిః|

దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్.

తే.గీ. వినుము ధృతరాష్ట్ర! కృష్ణుడీవిధము పలికి

చూపె తన విశ్వరూపమున్, శుభనిధాన

దివ్య మహిమాన్వితంబైన భవ్యమయిన

విశ్వరూపంబు పార్థుఁడు ప్రీతిని గనె.

భావము.

ఓ ధృతరాష్ట్ర మహారాజా! మహా యోగీశ్వరుడైన భగవానుడిట్లు 

చెప్పిన పిమ్మట సర్వోత్తమమైన ఐశ్వర్యరూపమైన తన మహిమాన్విత 

విశ్వరూపమును పార్థునకు చూపెను.

 || 11-10 ||

శ్లో.  అనేకవక్త్ర నయన మనేకాద్భుత దర్శనమ్|

అనేక దివ్యాభరణం దివ్యానేకోద్య తాయుధమ్.

తే.గీ. వక్త్రములు కండ్లనేకముల్, ప్రభలనీను

దివ్యమౌయలంకారముల్, భవ్యపు మహి

తాయుధంబులనొప్పి, మహాద్బుతముగ

నొప్పు విశ్వరూపము చూపె నప్పుడటను.

భావము.

అనేక వక్త్రములతో, అనేక నేత్రములతో, అనేక అద్భుత 

దర్శనములతో, అనేక దివ్యాభరణములతో, దివ్యాయుధములతో

 భగవానుని ఘన దివ్యరూపము శోభిల్లుచుండెను.

|| 11-11 ||

శ్లో.  దివ్యమాల్యామ్బరధరం దివ్యగన్ధానులేపనమ్|

సర్వాశ్చర్యమయం దేవమనన్తం విశ్వతోముఖమ్.

తే.గీ.  దివ్యమాల్యాంబరములతో దివ్య గంధ

లేపనముతోడవిశ్వవక్త్రోపభాస

మై యలరె విశ్వరూపంబు మహితముగను.

కాంచెనర్జునుడత్తరి ఘనతరముగ.

భావము.

దివ్యములైన పుష్పమాలికలను, దివ్యములైన వస్త్రములను 

ధరించి, దివ్య సుగంధ చందనాదుల పూతలతో నిండి, 

పరమాశ్చర్యకరమై, మహాకాంతివంతమై, అనంతమై,

 విశ్వతోముఖమై భగవానుని అద్భుత విశ్వరూపము విలసిల్లుచుండెను.

|| 11-12 ||

శ్లో.  దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా|

యది భాః సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః.

తే.గీ.  వేయిసూర్యులాకాశాన వెలుగులీన

నెంత తేజంబు కలుగునో యంత తేజ

మిచట గనుపించె, శ్రీహరినెంచి చూడ

సాటి లేనిది, గణుతింప జగతిలోన.

భావము.

ఆకాశమున ఒక్కసారిగా హఠాత్తుగా సహస్ర సూర్యులు 

ప్రకాశించినచో ఎంతటి చూడశక్యముకాని కాంతి కలుగునో 

అంతటి అపారకాంతికి ఈ భగవానుని కాంతి సమానమగును.

|| 11-13 ||

శ్లో.  తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా|

అపశ్యద్దేవదేవస్య శరీరే పాణ్డవస్తదా.

తే.గీ. విశ్వరూపంబునన్ గాంచె వివిధములుగ

కలుగునన్నిటినొకచోటె కలవిగాను,

సృష్టిమొత్తంబునచటనే దృష్టిపెట్టి

కాంచె పార్ధుండు కృష్ణుని కరుణ వలన.

భావము.

అపుడు అర్జునుడు దేవదేవుడగు భగవానుని శరీరములోనే 

అనేక విధములుగా విభజింపబడిన సర్వ ప్రపంచమును 

ఒకేచోటనున్న దానినిగా చూచెను.

|| 11-14 ||

శ్లో.  తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనఞ్జయః|

ప్రణమ్య శిరసా దేవం కృతాఞ్జలిరభాషత.

తే.గీ.  విస్మయము పొంది పార్థుడు విశ్వరూప

మును గని పులకితాంగుడై ప్రణతి చేసె

తాను సాష్టాంగముగ భక్తి తత్పరుఁడయి,

కృష్ణున కపుడు, ధన్యత, కీర్తి బడసి.

భావము.

పిమ్మట ధనంజయుడు విస్మయముతో పులకాంకితదేహుడై 

భగవానునికి సాష్టాంగ ప్రణామము చేసి అంజలి బద్ధుడై ఇట్లనెను.

అర్జున ఉవాచ.

భావము.

అర్జునుడు పలికెను.

|| 11-15 |||

శ్లో.  పశ్యామి దేవాంస్తవ దేవ దేహే

సర్వాంస్తథా భూతవిశేషసఙ్ఘాన్|

బ్రహ్మాణమీశం కమలాసనస్థ-

మృషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్.

తే.గీ. నీ విరాట్రూపమందున నేను కంటి

ప్రాణి కోటిని, బ్రహ్మను, భస్మధరుని,

దేవతాళిని, ఋషులను, దివ్యమైన 

పాములన్, గృష్ణ! మదిలోన భ్రాంతి తొలగె.

భావము.

ఓ దేవాదిదేవా! నీ విరాట్-రూపమునందు సకల దేవతలను, 

నానావిధప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన 

శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచున్నాను.

|| 11-16 ||

శ్లో.  అనేకబాహూదర వక్త్రనేత్రం,

పశ్యామి త్వాం సర్వతోऽనన్తరూపమ్|

నాన్తం న మధ్యం న పునస్తవాదిం

పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప.

తే.గీ.  నీదు బాహువు లుదరముల్, నీదు ముఖము

లును, నయనము లనంతముల్, ఘనతరమగు

నీదు విశ్వతోముఖరూప మేఁ దగఁ గన 

నాదిమధ్యాంత రహిత! నన్నాదుకొనుము.

భావము.

ఓ విశ్వేశ్వరా! విశ్వరూపా! నీ బాహువులు, ఉదరములు, ముఖములు, 

నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంతరూపము సర్వతోముఖముగ 

విలసిల్లుచున్నది. నీవు ఆదిమధ్యాంతరహితుడవు. మహత్వ పూర్ణమైన

 నీ దివ్యరూపమునకు ఆది మధ్యాంతములను తెలిసికొనలేకున్నాను.

|| 11-17 ||

శ్లో.  కిరీటినం గదినం చక్రిణం చ

తేజోరాశిం సర్వతో దీప్తిమన్తమ్|

పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమన్తాద్

దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్.

తే.గీ.  గదను, చక్రమును, కిరీటము ధరియించి

యంతటను తేజ వారాశి నమర నిల్పి

యున్న నిను గాంచుచుంటిని, కన్నుల నిను

గాంచఁజాలని తేజంబు కలిగితివిగ.

భావము.

హే విష్ణో! కిరీటమును, గదను, చక్రమును ధరించి, అంతటను 

తేజఃపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. 

ప్రజ్వలితాగ్నివలెను, జ్యోతిర్మయుడైన సూర్యునివలెను 

వెలుగొందుచున్న నీ అప్రమేయరూపము దుర్నిరీక్ష్యమై యున్నది.

|| 11-18 ||

శ్లో.  త్వమక్షరం పరమం వేదితవ్యం

త్వమస్య విశ్వస్య పరం నిధానమ్|

త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా

సనాతనస్త్వం పురుషో మతో మే.

తే.గీ. అక్షరుం డవవేద్యుఁడ వాదరువువు

లోకముల కవ్యయుండవు, లోక ధర్మ 

రక్షకుండవును, సనాతనాక్షయుడవు

గ తలతును నేను నిన్ను భోగ శయనుండ!

భావము.

పరమ - అక్షరస్వరూపుడవైన పరబ్రహ్మపరమాత్మవు నీవే, కనుక అందరికిని తెలుసుకొనదగినవాడవు. ఈజగత్తునకు నీవే పరమాశ్రయుడవు. సనాతన ధర్మరక్షకుడవు. నీవు అవ్యయుడవు. అని నా విశ్వాసము.

|| 11-19 ||

శ్లో.  అనాదిమధ్యాన్తమనన్తవీర్య-

మనన్తబాహుం శశిసూర్యనేత్రమ్|

పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం

స్వతేజసా విశ్వమిదం తపన్తమ్.

తే.గీ‌. ఆది మధ్యాంత రహితుఁడ వపరిమిత మ

యిన మహాశక్తిశాలివి, యినుఁడు శశియు

నేత్రములునీకు, భుజములనేక బాహు

వులను ప్రజ్వలితపువక్త్రవుగ కనితిని.

భావము.

నీవు ఆదిమధ్యాంత రహితుడవు. అపరిమితశక్తిశాలివి. అసంఖ్యాకములైన

భుజములు గలవాడవు. సూర్యచంద్రులు నీ నేత్రములు. అగ్నివలె 

నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సులో ఈ జగత్తును 

సంతప్తమొనర్చుచున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను.

|| 11-20 ||

శ్లో.  ద్యావాపృథివ్యోరిదమన్తరం హి

వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః|

దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం

లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్.

తే.గీ. దివిమొదలుగ నంతటనిటు భువివరకును

కలుగునాకాశమున నిండి కలిగితీవె,

యద్భుతంబు, భీకరమయి యలరు నిన్నుఁ

జూచి ముల్లోకముల్ భీతి జొక్కె గృష్ణ.

భావము.

ఓ మహాత్మా! దివి నుండి భువి వఱకు గల అంతరిక్షమునం దంతటను 

అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవై యున్నావు. అధ్బుతమైన నీ 

భయంకరరూపమును చూచి ముల్లోకములును గడగడలాడుచున్నవి.

|| 11-21 ||

శ్లో.  అమీ హి త్వాం సురసఙ్ఘా విశన్తి

కేచిద్భీతాః ప్రాఞ్జలయో గృణన్తి|

స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసఙ్ఘాః

స్తువన్తి త్వాం స్తుతిభిః పుష్కలాభిః.

తే.గీ.  నిన్ను జేరుచుండిరిదివ్యు, లెన్నుచు నిను 

గొల్చుచుండిరికేల్మోడ్చి, కొందరదిగొ,

సిద్ధులున్ ఋషుల్ నీదుప్రసిద్ధి పాడు

చుండిరంచితముగ స్వస్తి సూక్తములను.

భావము.

ఇదిగో, ఆదేవతలెల్లరును నీలో ప్రవేశించుచున్నారు. కొందఱు 

భయపడినవారై అంజలి ఘటించి, నీ నామగుణములను 

కీర్తించుచున్నారు. మహర్షులును, సిధ్దులును స్వస్తివచనములతోడను, 

ఉత్తమోత్తమ స్తోత్రములతోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు.

|| 11-22 ||

శ్లో.  రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా

విశ్వేऽశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ|

గన్ధర్వయక్షాసురసిద్ధసఙ్ఘా

వీక్షన్తే త్వాం విస్మితాశ్చైవ సర్వే.

తే.గీ.  భవ్యులైన రుద్రాదిత్యవసువులు నిక ,

సాధ్యులస్వినుల్, పితరులు, సన్నుతులగు

ఘనతనొప్పువిశ్వేదేవులును, మరుద్గ

ణ, సుర యక్ష, సిద్ధుల్ నినున్ గనఁగఁ గంటి.

భావము.

ఏకాదశరుద్రులును, ద్వాదశాదిత్యులును, అష్టవసువులును, 

సాధ్యులును, విశ్వేదేవతలును, అశ్వినీకుమారులును, 

మరుద్గణములును, పితరులును అట్లే గంధర్వయక్షాసు

రసిద్దసముదాయములును నిన్నే దర్శించుచున్నారు.

|| 11-23 ||

శ్లో.  రూపం మహత్తే బహువక్త్రనేత్రం

మహాబాహో బహుబాహూరుపాదమ్|

బహూదరం బహు దంష్ట్రాకరాలం

దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్.

తే.గీ. 

నీయనేకబాహుల్వక్త్ర నేత్రములును

పాదములునూరువులుదరభాగములును,

కోరలును కడు భీతిని గొలుపుచుండె,

నేనునున్ భీతినొందితి నీరజాక్ష!

భావము.

ఓ మహాబాహో! అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, చేతులను, ఊరువులను, పాదములను, ఉదరములను, కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమునుచూచి, అందఱును భయకంపితులగుచున్నారు. నేనుకూడ భయముతో వణికిపోవుచున్నాను.

|| 11-24 ||

శ్లో.  నభఃస్పృశం దీప్తమనేకవర్ణం

వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్|

దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాన్తరాత్మా

ధృతిం న విన్దామి శమం చ విష్ణో.

తే.గీ. నభము దాకె నీ రూపమనంత దీప్తి

వర్ణముల్ పెక్కు కలుగుచు, పరగు కనులు

కాంతులన్జిందనొప్పునీ ఘన ముఖంబు,

భీతిలెన్ గని యందరున్, భీతియయ్యె.

భావము.

ఏలనన హే విష్ణో! నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అదే అనేకవర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ముచున్న విశాలనేత్రములతో, విస్తరించినముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువలన నా దైర్యము సడలినది. శాంతి దూరమైనది.

|| 11-25 ||

శ్లో.  దంష్ట్రాకరాలాని చ తే ముఖాని

దృష్ట్వైవ కాలానలసన్నిభాని|

దిశో న జానే న లభే చ శర్మ

ప్రసీద దేవేశ జగన్నివాస.

తే.గీ. నీ కరాళ దంష్ట్రల్ మోము నాకు భయము

గొల్పు, తోచవు దిక్కులు, కొరత కలిగె

శాంతి కో దేవదేవుఁడా! శాంతి దాల్చి

నీవు సుప్రసన్నుడవయి కావుము నను.

భావము.

ఓ జగన్నివాసా! కరాళదంష్ట్రలతో 

(భయంకరమైన కోరలతో) ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్ని

జ్వాలలవలె భీతిగొల్పుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కు

తోచకున్నది. నెమ్మది (శాంతి) శూన్యమైనది. ఓ దేవేశా! ప్రసన్నుడవు కమ్ము.

|| 11-26 ||

శ్లో.  అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః

సర్వే సహైవావనిపాలసఙ్ఘైః|

భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ

సహాస్మదీయైరపి యోధముఖ్యైః.

తే.గీ.  ధార్తరాష్ట్రులున్, భీష్ముడున్, ధరనృపాలు

రట్లె కర్ణుడున్, ద్రోణుడు, నట్లె మన ప

రిజనులున్ నిన్ బ్రవేశించిరి, కనితిపుడె,

నాకు మతిపోవుచుండెను నయనిధాన.

భావము.

ఇదిగో! (ఇచ్చట చేరియున్న) ఈ ధృతరాష్ట్రపుత్రులు 

(దుర్యోధనాదులు) ఇతర రాజన్యులతోసహా నీలో ప్రవేశించుచున్నారు. 

భీష్మపితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి 

ప్రధానయోధులు అందఱును.

|| 11-27 ||

శ్లో.  వక్త్రాణి తే త్వరమాణా విశన్తి

దంష్ట్రాకరాలాని భయానకాని|

కేచిద్విలగ్నా దశనాన్తరేషు

సన్దృశ్యన్తే చూర్ణితైరుత్తమాఙ్గైః.

తే.గీ. అతి భయంకరదంష్ట్రలనమరిన ముఖ

ములను జేరి, చిక్కుచును కోరలకు మరియు 

నక్కడటునుగ్గుగానయిరనుపమాన!

భయము కలుగుచునుండె నో భక్త సులభ!

భావము.

భయంకరములైన కోరలతోగూడిన నీ ముఖములయందు అతివేగముగా పరుగులుదీయుచు ప్రవేశించుచున్నారు. కొందఱి తలలు కోరల మద్యబడి నుగ్గునుగ్గైపోవుచుండగా వారు దంతములలో చిక్కుకొని వ్రేలాడుచున్నారు.

|| 11-28 ||

శ్లో.  యథా నదీనాం బహవోమ్బువేగాః

సముద్రమేవాభిముఖా ద్రవన్తి|

తథా తవామీ నరలోకవీరా

విశన్తి వక్త్రాణ్యభివిజ్వలన్తి.

తే.గీ. నదులు సంద్రంబులోపలికొదుగునట్లు 

సమరయోధులు నీముఖసరసిజమున

కభిముఖంబుగ సాగిరోయగ్ని ముఖుడ!

చూడఁ జాలను శాంతించు సుగుణభాస!

భావము.

అనేకములైన నదీనదములప్రవాహములన్నియును సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు, ఈ శ్రేష్ఠులైన సమరయోధులు (నరలోకవీరులు) కూడ జ్వలించుచున్న నీ ముఖములయందు ప్రవేశించుచున్నారు.

|| 11-29 ||

శ్లో.  యథా ప్రదీప్తం జ్వలనం పతఙ్గా

విశన్తి నాశాయ సమృద్ధవేగాః|

తథైవ నాశాయ విశన్తి లోకాస్-

తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః.

తే.గీ.  మృత్యువును చేర నగ్నిలో మిడుతలట్లు

పడుచునుండిరి నీ నోట పరుగుపెట్టి

వచ్చి, వింతగానుండెను, భక్త సులభ!

మేము కనలేము నీమాయ నేమొకాని.

భావము.

మిడుతలన్నియు మోహవశమున బాగుగా మండుచున్న అగ్నివైపు 

అతివేగముగా పరుగెత్తి, తమ నాశనముకొఱకు అందు ప్రవేశించి, 

నశించునట్లు ఈ వీరులందఱును తమనాశమునకై అతివేగముగా 

పరుగెత్తి, నీ వక్త్రములయందు ప్రవేశించుచున్నారు.

|| 11-30 ||

శ్లో.  లేలిహ్యసే గ్రసమానః సమన్తాల్-

లోకాన్సమగ్రాన్వదనైర్జ్వలద్భిః|

తేజోభిరాపూర్య జగత్సమగ్రం

భాసస్తవోగ్రాః ప్రతపన్తి విష్ణో.

తే.గీ. ప్రజ్వలించు నీ ముఖముతో పట్టుచుండి

యెల్లలోకంబులన్ మ్రింగుటేనుగంటి,

నీదుతేజస్సుచే భీతినే జగంబు 

మున్గుటన్ గంటి గోవింద పుణ్యపురుష.

భావము.

హే విష్ణో! ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను 

అన్నివైపులనుంచి కబళించుచు మాటిమాటికిని చప్పరించుచున్నావు. 

నీ ఉగ్రతేజస్సులు అంతటను నిండి జగత్తును తపింపజేయుచున్నవి.

|| 11-31 ||

శ్లో.  ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో

నమోస్తు తే దేవవర ప్రసీద|

విజ్ఞాతుమిచ్ఛామి భవన్తమాద్యం

న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్.

తే.గీ. వందనంబులు పరమేశ!  వందుచుంటి

యెవరివో నీవు తెల్పు మేనెఱుఁగ నిన్ను,

నాది పురుషుఁడవైన నిన్నరయ నుంటి,

నీ ప్రవృత్తిని సృష్టిలో నే నెఱుంగ.

భావము.

ఓ పరమాత్మా! నీకు నా నమస్కారములు - ప్రసన్నుడవు కమ్ము. 

ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆదిపురుషుడవైన 

నిన్ను విశదముగా తెలిసికొనగోరుచున్నాను. ఏలనన నీ ప్రవృత్తిని 

ఎఱుంగలేకున్నాను.

శ్రీభగవానువాచ|.

భావము.

భగవానుడు పలుకుచుండెను,

|| 11-32 ||

శ్లో.  

కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో

లోకాన్సమాహర్తుమిహ ప్రవృత్తః|

ఋతేऽపి త్వాం న భవిష్యన్తి సర్వే

యేవస్థితాః ప్రత్యనీకేషు యోధాః.

తే.గీ. అంతమున్ జేయ సృష్టినే యమరితిచట

కాలునిగ నింక పోరీవు కా దనినను,

రిపులు మిగులరొక్కరును  హరింతు నేను,

కాలధర్మంబు తప్పింప గాంచుమీవె.

భావము.

నేను లోకములన్నింటిని తుదముట్టించుటకై విజృంభించిన 

మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొని

యున్నాను. కనుక నీవు యుద్దముచేయకున్ననూ ప్రతిపక్షముననున్న 

ఈ వీరులెవ్వరును మిగులరు.

|| 11-33 ||

తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ

జిత్వా శత్రూన్ భుఙ్క్ష్వ రాజ్యం సమృద్ధమ్|

మయైవైతే నిహతాః పూర్వమేవ

నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్.

తే.గీ.  కాన పార్థ! యీ యుద్ధంబు కాదనకుము,

నేనె చంపితిన్ వీరలన్ గాన నీవు

కారణ మగుమ యుద్ధమ్ము కోరి చేసి,

స్ఫూర్తి గాంచుము దీనిచే కీర్తి గనుము.

భావము.

కనుక ఓ సవ్యసాచీ! లెమ్ము, కీర్తిగాంచుము. శత్రువులను జయించి 

సర్వసంపదలతో తులతూగు రాజ్యమును అనుభవింపుము. 

వీరందఱును నాచేత మునుపే హతులైనవారు. నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము.

|| 11-34 ||

శ్లో.  ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ

కర్ణం తథాన్యానపి యోధవీరాన్|

మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా

యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్.

తే.గీ.  చంపితిని నేను పూర్వమే చంపు మిపుడు

భీష్మ, ద్రేణ, కర్ణాదులన్, వీరతతిని,

యుద్ధమును జేసి గెలుపొందు మొప్పుగాను, 

భీతి విడువుము, యత్నించు ప్రీతితోడ.

భావము.

ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ (సైంధవ) 

కర్ణాది యుద్దవీరులందఱిని నీవు సంహరింపుము. భయపడకుము. 

రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు. కనుక 

యుద్దము చేయుము.

సఞ్జయ ఉవాచ|

అచ్యుతునిమాట విన్నట్టి యర్జునుండు

భీతిన

భావము.

సంజయుడు పలికెను:

|| 11-35 ||

శ్లో.  ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య

కృతాఞ్జలిర్వేపమానః కిరీటీ|

నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం

సగద్గదం భీతభీతః ప్రణమ్య.

తే.గీ.  అచ్యుతునిమాట విన్నట్టి యర్జునుండు

భీతి వణుకుచు జోడించి చేతుల నట

వర్ణనము చేయసాగె నాపన్నరక్షు.

మరల ప్రణతులు చేసెనా నరుడు హరికి.

భావము.

ఓ రాజా! శ్రీ కృష్ణపరమాత్మ యొక్క ఈ మాటలను విని, అర్జునుడు వణకుచు,

చేతులు జోడించి నమస్కరించెను. మఱల మిక్కిలి భయముతో ప్రణమిల్లి, గద్గదస్వరముతో తడబడుచు శ్రీకృష్ణుని స్తుతింపసాగెను.

అర్జున ఉవాచ.

భావము.

అర్జునుడు పలికెను

|| 11-36 ||

శ్లో.  స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా

జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ|

రక్షాంసి భీతాని దిశో ద్రవన్తి

సర్వే నమస్యన్తి చ సిద్ధసఙ్ఘాః.

తేగీ. నిను గని జగము ముదమున ఘనతఁ బొగడ

రాక్షసుల్ భయముననుపారదొడగెనయ

సిద్ధగణములు ప్రణమిల్లచిత్తమలర,

చూచిధర్మమంచెంచితి శుభద కృష్ణ.

భావము.

ఓ అంతర్యామి! కేశవా! నీ నామగుణ ప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో, అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకును పారిపోవుచున్నారు. సిద్దగణములవారెల్లరును ప్రణమిల్లుచున్నారు.

|| 11-37 ||

శ్లో.  కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్

గరీయసే బ్రహ్మణోऽప్యాదికర్త్రే|

అనన్త దేవేశ జగన్నివాస

త్వమక్షరం సదసత్తత్పరం యత్.

తే.గీ. శ్రేష్టుఁడవు, బ్రహ్మతాతవు, జీవకోటి

మోకరిల్లకెట్లుండును? మూలమయిన

యక్షరుండవు శ్రీకృష్ణ?యమరవినుత! 

నిన్ను మించిన సృష్టి యేమున్నదయ్య.

భావము.

ఓమహాత్మా! నీవు సర్వశ్రేష్ఠుడవు. సృష్టికర్తయైన బ్రహ్మకే 

మూలకారకుడవు - కనుక వారు (సిద్దాదులందఱును) నీకు 

నమస్కరింపక ఎట్లుండగలరు? ఓ అనంతా! ఓ దేవేశా! 

ఓ జగన్నివాసా! సత్-అసత్లు నీవే. వాటికంటెను పరమైన 

అక్షరస్వరూపుడవు అనగా సచ్చిదానందఘనపరబ్రహ్మవు నీవే.

|| 11-38 ||

శ్లో.  త్వమాదిదేవః పురుషః పురాణస్-

త్వమస్య విశ్వస్య పరం నిధానమ్|

వేత్తాసి వేద్యం చ పరం చ ధామ

త్వయా తతం విశ్వమనన్తరూప

తే.గీ.  ఆదిదేవుండవేనీవనంతరూప!

హరి! సనాతనుఁడవు పరమాశ్రయుడవు,

సర్వమెఱిగిన వాడవు, సకలపతివి,

జగతికాశ్రయుండవు నీవు నిగమవేద్య!

భావము.

ఓ అనంతరూపా! నీవు ఆదిదేవుడవు, సనాతనపురుషుడవు, 

ఈజగత్తునకు పరమాశ్రయుడవు. సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు. 

ఈ జగత్తు అంతయును నీచే పరిపూర్ణమైయున్నది.

|| 11-39 ||

శ్లో.  వాయుర్యమోగ్నిర్వరుణః శశాఙ్కః

ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ|

నమో నమస్తేऽస్తు సహస్రకృత్వః

పునశ్చ భూయోऽపి నమో నమస్తే.

తే.గీ.  వరుణ చంద్రాగ్ని యములీవె వాయువీవె,

బ్రహ్మవీవే, ప్రజాపతి, బ్రహ్మ జనకు

లీవె, వందనములనందుమీవె మరల

మరల వందనంబులు నీకు నిరుపమాన.

భావము.

నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, 

ప్రజాపతియైన బ్రహ్మవు. బ్రహ్మకును జనకుడవు. నీకు వేలకొలది 

నమస్కారములు. మఱల మఱల నమస్కారములు. ఇంకను నమస్కారములు.

|| 11-40 ||

శ్లో.  నమః పురస్తాదథ పృష్ఠతస్తే

నమోऽస్తు తే సర్వత ఏవ సర్వ|

అనన్తవీర్యామితవిక్రమస్త్వం

సర్వం సమాప్నోషి తతోऽసి సర్వః.

తే.గీ. అన్నిటన్ గల నీకు నే నన్నిదిశల

నుండి వందనములొనర్తు వందితపద!

నీవు లేనట్టి చోటునే నేనును చూడ

లేదు కృష్ణయ్య, నీకిది లీలయగును.

భావము.

అనంతసామర్థ్యముగలవాడా! నీకు ఎదురుగా ఉండియు, వెనుకనుండియు నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మా! నీకు అన్నివైపులనుండియు నమస్కారములు. ఏలనన అనంతపరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించియున్నవాడవు. అన్ని రూపములును నీవియే.

|| 11-41 ||

శ్లో.  సఖేతి మత్వా ప్రసభం యదుక్తం

హే కృష్ణ హే యాదవ హే సఖేతి|

అజానతా మహిమానం తవేదం

మయా ప్రమాదాత్ప్రణయేన వాపి.

తే.గీ.  నీదు మహిమనెరుంగని నేను నిన్ను

యాదవా! కృష్ఢ! మిత్రమా! యనుచు నిన్ను

చనువునన్ బిల్చి యుంటిని చవుకగాను

నన్ను మన్నించు మాధవా! నిన్ను గొలుతు.

భావము.

నీ మహిమను ఎఱుగక నిన్ను నా సఖునిగా భావించి, చనువుచేగాని, పొరబాటువలనగాని, ఓ కృష్ణా! ఓ యాదవా! ఓ మిత్రా! అనుచు తొందరపాటుతో ఆలోచింపక, నేను నిన్ను సంబోధించి ఉంటిని.

|| 11-42 ||

శ్లో.  యచ్చావహాసార్థమసత్కృతోసి

విహారశయ్యాసనభోజనేషు|

ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం

తత్క్షామయే త్వామహమప్రమేయమ్.

తే.గీ.  కలసి నీతోడ నేనున్న కాలమందు

సకల మిత్రులకడను నేకాంతమందు

చనువుతో పల్కియుందును చవకగనిను,

నాదు దోషంబు మన్నించు జ్ఞాన తేజ.

భావము.

ఓ అచ్యుతా! విహారశయ్యాసనభోజనాది సమయములయందు ఏకాంతమునగాని, అన్యసఖుల సమక్షమునగాని సరసమునకై పరిహాసములాడి, నేను నిన్ను కించపఱచి యుండవచ్చును. ఓ అప్రమేయస్వరూపా! నా అపరాధములనన్నింటిని క్షమింపుమని వేడుకొనుచున్నాను.

|| 11-43 ||

శ్లో.  పితాసి లోకస్య చరాచరస్య

త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్|

న త్వత్సమోऽస్త్యభ్యధికః కుతోన్యో

లోకత్రయేऽప్యప్రతిమప్రభావ.

తే.గీ.  అనుపమప్రభావాలోక జనకుడీవె,

పూజ్యుడవు నీవు నిన్ మించు పూజ్యులెన్న

లేరు సృష్టిలో, నీకన్న లేరు ఘనులు,

దీనరక్షాజగన్నాథ! దేవదేవ!

భావము.

ఓ అనుపమప్రభావా! ఈ సమస్త చరాచరజగత్తునకు నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు. గురుడవు. సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకములయందును నీతో సమానుడెవ్వడును లేడు. ఇంక నీకంటె అధికుడెట్లుండును?

|| 11-44 ||

శ్లో.  తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం

ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్|

పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః

ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్.

తే.గీ.  నీదు పాదములకుచెంత నాదు దేహ

ముంచి ప్రణమిల్లుదున్ కృష్ణ, యెంచబోకు

నాదు దోషముల్ మన్నించు నన్ను కృపను,

కాంచు మోదేవ! పరునిగా నెంచబోకు.

భావము.

కనుక ఓ ప్రభూ! నాశరీరమును నీపాదములకడనిడి, సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. స్తవనీయుడవు, సర్వేశ్వరుడవు ఐన నీవు నాయందు ప్రసన్నుడవగుటకై నిన్ను ప్రార్ధించుచున్నాను. దేవా! కుమారుని తండ్రి క్షమించినట్లును, మిత్రుని మిత్రుడు క్షమించినట్లును, భార్యను భర్త క్షమించినట్లును, నా అపరాధములను నీవు క్షమింపుము.

|| 11-45 ||

శ్లో.  అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా

భయేన చ ప్రవ్యథితం మనో మే|

తదేవ మే దర్శయ దేవ రూపం

ప్రసీద దేవేశ జగన్నివాస.


తే.గీ. మునుకననిదివ్య మైనరూపు, ముదముగను

చూచి భీతిలితిని నెను చూపుమీవు

సహజమైనట్టి శ్రీకృష్ణ మహితునిగనె, 

సుప్రసన్నుడవగుమయ్య, శుభనిధాన!

భావము.

మునుపు ఎన్నడును చూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమును గాంచి, మిక్కిలి సంతసించితిని. కాని భయముచే నామనస్సు కలవరపాటు పొందినది. కనుక చతుర్భుజయుక్తుడవై విష్ణురూపముతోడనే నాకు దర్శనమిమ్ము. ఓ దేవేశా! జగన్నివాసా! ప్రసన్నుడవు కమ్ము.

|| 11-46 ||

శ్లో.  కిరీటినం గదినం చక్రహస్తం

ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ|

తేనైవ రూపేణ చతుర్భుజేన

సహస్రబాహో భవ విశ్వమూర్తే.

తే.గీ.  గద, కిరీటము శంఖచక్రములతోడ

నాల్గుభుజములనొప్పుచు నాకగపడు

నుతసహస్రబాహూ!నీకు నుతులు కృష్ణ!

వందనంబులు చేసెద నందుకొనుము.

భావము.

కిరీటమును, గదను, శంఖచక్రములను ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహూ! విరాడ్రూపా! నీ చతుర్భుజరూపమును నాకు చూపుము.

|| 11-47 ||

శ్లో.  

మయా ప్రసన్నేన తవార్జునేదం

రూపం పరం దర్శితమాత్మయోగాత్|

తేజోమయం విశ్వమనన్తమాద్యం

యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్.

తే.గీ.  మక్కువను యోగశక్తిచే మహితమయిన 

నా విరాట్రూపు చూపితిన్ ధీవరేణ్య!

పూర్వమెవ్వరున్ గనలేదు, భూమిపైన, 

కార్యదీక్షను పూనుమీ క్షణమునందు.

భావము.

ఓ అర్జునా! నీపైగల అనుగ్రహమున నా యోగశక్తి ప్రభావముతో నీకు 

నా విరాట్-రూపమును ప్రదర్శించితిని. అది మిక్కిలి తేజోమయమైనది. 

అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకుముందు 

మఱి యెవ్వరును చూచియుండలేదు.

|| 11-48 ||

శ్లో. న వేదయజ్ఞాధ్యయనైర్న దానైర్-

న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః

ఏవంరూపః శక్య అహం నృలోకే

ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర.

తే.గీ.  దాన యజ్ఞ, తపములు, వేదాధ్యయనము

లాచరించినన్ గనజాలరయ్య విశ్వ

రూపమును నీవె చూచితి వీపగిదిని,

యన్యులెవ్వరున్ గనలేరు మాన్య చరిత!

భావము.

ఓ అర్జునా! వేదాధ్యయనములచేగాని, యజ్ఞాచరణములచేగాని, 

దానములచేగాని, తీవ్రతపశ్చర్యలచేగాని, తదితరపుణ్యకర్మలచేగాని 

ఈ మానవలోకమున నా ఈ విశ్వరూపమును నీకుదప్ప 

మఱియెవ్వరికిని చూడశక్యముగాదు.

|| 11- 49 ||

శ్లో. మా తే వ్యథా మా చ విమూఢభావో

దృష్ట్వా రూపం ఘోరమీదృఙ్మమేదమ్|

వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం

తదేవ మే రూపమిదం ప్రపశ్య.

తే.గీ. విశ్వరూపంబు కనుటకు భీకరంబు,

మోహ వ్యధలకు గురికాకు, పూజ్యమయిన

యీ స్వరూపంబు చూడు మహిన్ బ్రియమున,

పార్థ! శోభనాళిని నీవు పడయవచ్చు.

భావము.

ఈ విధమైన ఈ భయంకరరూపమును చూచి, నీవు ఎట్టి వ్యథకును,

మోహమునకును గురికావలదు. భయమును వీడి ప్రసన్నచిత్తుడవై 

శంఖచక్ర గదాపద్మములతో విలసిల్లుచున్న నా 

తుర్భుజరూపమును మరల చూడుము.

సఞ్జయ ఉవాచ|

భావము.

సంజయుడు పలికెను:

|| 11-50 ||

శ్లో. ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా

స్వకం రూపం దర్శయామాస భూయః|

ఆశ్వాసయామాస చ భీతమేనం

భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా.

తే.గీ.  ఇట్లు హరి పల్కి, పార్థుని కెన్నలేని

విశ్వ రూపంబు చూపుచు భీతి బాప

సహజరూపమున్ దాల్చెను శాంత వదన

భాసురుండాయె తృప్తిగా పార్థఁడు కన.

భావము.

వాసుదేవుడు ఈ విధముగా పలికి, అర్జునునకు తన 

చతుర్భుజరూపమున దర్శనమిచ్చెను. అనంతరము శ్రీకృష్ణపరమాత్మ

 సౌమ్యమూర్తియైన తన కృష్ణరూపమును స్వీకరించి భయపడుచున్న 

అర్జునునకు ధైర్యము చెప్పెను.

 అర్జున ఉవాచ|

భావము.

అర్జునుడు పలికెను.

|| 11-51 ||

శ్లో.  దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన|

ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః.

తే.గీ.  నీదు సౌమ్యాకృతిని జూచి నాదు మనసు

కుదుటపడెనయా శ్రీకృష్ణ! ముదము గనితి,

నిపుడు స్వాభావికస్థితి నిచటనుంటి.

వందనంబులు చేసెదనందుకొనుము.

భావము.

ఓ జనార్దనా! మీ అతిసౌమ్యమైన మానవాకృతిని (శ్యామసుందరరూపమును) 

చూచి, ఇప్పుడు నా మనస్సు కుదుటపడినది. నేను నా స్వాభావిక 

(సహజ)స్థితిని పొందితిని.

 శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ భగవానుడు పలికెను: 

|| 11-52 ||

శ్లో.  సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ|

దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాఙ్క్షిణః.

తే.గీ.  నా చతుర్భుజ రూపంబు చూచుటకును

వలదు పడదన్యులకు, నీకు కలిగెనిటుల,

దేవతలు చూడనెంతురు, దివ్యమయిన

యీ స్వరూపంబు నర్జునా శాశ్వతమిది.

భావము.

నీవు చూచిన నా ఈ చతుర్భుజరూపముయొక్క దర్శనభాగ్యము 

అన్యులకు అత్యంతదుర్లభము. దేవతలుసైతము ఈ రూపమును 

దర్శించుటకు సదా ఉవ్విళ్ళూరుచుందురు.

 || 11-53 ||

శ్లో. నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా|

శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా.

తే.గీ. నా చతుర్బుజ రూపము నాల్గువేద

పఠనమున గాని, దాన తపముల గాని

యజ్ఞ ములు చేసిననుగాని  యసలు కనగ

జాలరో యర్జునా! నీవే చాలినావు.

భావము.

నీవు గాంచిన నా చతుర్భుజరూపమును దర్శించుటకు వేదపఠనములచే

గాని, తపశ్చర్యలచేగాని, దానములచేగాని, యజ్ఞకర్మలచేగాని 

శక్యము కాదు. చతుర్భుజరూపమును దర్శించుటకు వేదపఠనములచేగాని, 

తపశ్చర్యలచేగాని, దానములచేగాని, యజ్ఞకర్మలచేగాని శక్యము కాదు.

 || 11-54 ||

శ్లో. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవంవిధోర్జున|

జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరన్తప.

తే.గీ. ఈ చతుర్బాహు రూపంబు నెన్ని కనగ

తత్వ సుజ్ఞానమున్ బొందతదేకమవగ

కేవలము భక్తియే మూల మీవు గనితి

వీచతుర్బాహు రూపమున్ హృద్యముగను. 

భావము.

ఓ పరంతపా! అర్జునా! ఇట్టి నా చతుర్భుజరూపమును ప్రత్యక్షముగా 

చూచుటకును, తత్వజ్ఞానమును పొందుటకును, అందు 

ఏకీభావస్థితినందుటకును కేవలము అనన్య భక్తిద్వారా మాత్రమే 

సాధ్యమగును.

|| 11-55 ||

శ్లో. మత్కర్మకృన్మత్పరమో మద్భక్తః సఙ్గవర్జితః|

నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాణ్డవ.

తే.గీ.  కర్మఫలములు నాకిచ్చు జ్ఞాని, మత్ప

రాయణుండు, నా యెడభ క్త్యమాయకతయు,

విషయ దూరుడు, నవిరోధి, ప్రేమమూర్తి,

భక్తుడే నన్ను పొందును భవ్యముగను.

భావము.

అర్జునా! కర్తవ్యకర్మలను అన్నింటిని నాకే అర్పించువాడును, 

మత్పరాయణుడును, నాయందు భక్తిశ్రద్ధలుగలవాడును, 

ప్రాపంచిక విషయములయందు ఆసక్తిలేనివాడును, ఏప్రాణియందును 

ఏమాత్రము వైరభావము లేనివాడును ఐన అనన్య (పరమ) 

భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు.


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః



శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సుబ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే 

భక్తియోగో నామ ద్వాదశోధ్యాయః.


అర్జున ఉవాచ|

భావము.

అర్జునుడు పలికెను - 

|| 12-1 ||

శ్లో. 

ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే|

యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః.

తే.గీ.  సగుణ నిర్గుణ రీతులన్ సతతము నిను

భక్తియుక్తులై కొలుతురు భక్తులిలను,

రెంట నేయోగముత్తమరీతియనగ

తగుచునున్నదో తెలుపుమా దయను నీవు.

భావము.

ఓ కృష్ణా! అనన్యభక్తితో పూర్వోక్తరీతిగా నిరంతరము నిన్నే భజించుచు, 

ధ్యానించుచు, పరమేశ్వరుడవైన నీ సగుణ రూపమును ఆరాధించువారును, 

కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘననిరాకార పరబ్రహ్మవైన నిన్ను 

అత్యంతభక్తిభావంతో సేవించువారును కలరు. ఈ రెండు విధములైన 

ఉపాసకులలో అత్యుత్తమ యోగవిదులెవరు?

శ్రీభగవానువాచ

భావము.

శ్రీ భగవానుడు ఇట్లనెను.

|| 12-2 |||

శ్లో. మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే|

శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః.

తే.గీ.  నిరత మేకాగ్రతను భక్తిని ననుఁ గొలుచు

వారు యోగులు, శ్రేష్టులున్, వారె ఘనులు,

సగుణ నిర్గుణోపాసనా సరళి కొలుచు

ధన్యులర్జునా! గ్రహియించు మాన్యసుగతి.

భావము.

పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై, నిరంతరము 

నా భజనధ్యానాదులయందే నిమగ్నులై, అత్యంతశ్రద్దాభక్తులతో 

నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు - 

అని నా అభిప్రాయము.(వారు సగుణోపాసన లేదా 

నిర్గుణోపాసన లలొ ఏది ఐనను అనుసరించవచ్చు)

 || 12-3 ||

శ్లో. యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే|

సర్వత్రగమచిన్త్యఞ్చ కూటస్థమచలన్ధ్రువమ్.

తే.గీ.  వర జితేంద్రియుల్, సకలమౌ ప్రాణులకును

హితమునే కోరువారును, క్షితిని ప్రాణు

లను సమముగ జూచుసదయుల్ ఘనతనొప్పు

యోగులని చెప్పుకొనుటయే యుక్త మగును.

భావము.

కాని ఇంద్రియసముదాయమును చక్కగా వశపరచుకొనినవారును, 

సకల భూతములకును హితమునే కోరుచుండువారును, 

సర్వప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడుదురు.

|| 12-4 ||

శ్లో.  సన్నియమ్యేన్ద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః|

తే ప్రాప్నువన్తి మామేవ  సర్వభూతహితే రతాః.

తే.గీ.  మంచిపైనింద్రియమ్ములన్ మలచు వారు,

నంతటన్ సమ దృష్టితో నలరువారు,

సర్వ భూతహితులు, నుర్వి గర్వహీను

లగుటచే నన్నుఁ జేరెద రనుపమముగ.

భావము.

అట్టివారు మనోబుద్దులకు అతీతుడును, సర్వవ్యాపియు, 

అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును, కూటస్థుడును, 

నిత్యుడును, నిశ్చలుడును, నిరాకారుడును, నాశరహితుడును 

ఐన సచ్చిదానంద ఘనపరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావస్థితులై, 

ధ్యానము చేయుచు, భక్తితో భజించుచు, ఆ పరబ్రహ్మమునే పొందుదురు.

|| 12-5 ||

శ్లో.  క్లేశోధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసామ్||

అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే.

తే.గీ.  కన నిరాకార బ్రహ్మమున్ గాంచు టరయ

కష్టమౌ దేహధారికి సృష్టిలోన,

నిర్గుణబ్రహ్మ లక్ష్యంబు నియతి నొప్పి

సాధనముచేయుటే కష్ట సాధ్యమరయ.

భావము.

నిరాకార బ్రహ్మలో మనస్సు నిలిపిన వాళ్ళకు ప్రయాస ఎక్కువ. 

దేహధారులకు నిర్గుణ తత్వ లక్ష్యాన్ని అందుకోవడము చాలా కష్టం.

|| 12-6 ||

శ్లో.  యే తు సర్వాణి కర్మాణి మయి సంన్యస్య మత్పరః|

అనన్యేనైవ యోగేన మాం ధ్యాయన్త ఉపాసతే.

తే.గీ.  కర్మ ఫలములు నా కిడి, ఘనముగ నను

లక్ష్యముగ కల్గి స్థిరపు సల్లక్షణముల

నొప్పుచు ననన్యచిత్తుఁడైయుండి మదిని

భాసితుండయి ననుఁగొల్చు భవ్యముగను, .

భావము.

సర్వకర్మలను నాలో వదిలి, నన్నే లక్ష్యముగా పెట్టుకొని మనస్సుని 

అన్య విషయముల వైపు మరలనీయకుండా ధ్యానిస్తూ ఎవరు ఉపాసిస్తారో,

|| 12-7 ||

శ్లో.  తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్|

భవామి నచిరాత్పార్థ మయ్యావేశితచేతసామ్.

తే.గీ. ఎవరు నాలోన మనసుంచి యెల్లవేళ

లందు నుందురో వారిని  బంధనములు

నేనె బాపుచు సన్ముక్తి నేనె గొలిపి

యుద్ధరించెదనర్జునా! యొప్పిదముగ.

భావము.

అర్జునా నాలో మనసు నిలిపిన వాళ్ళను త్వరలోనే మృత్యుసంసార 

సాగరం నుండి నేనే ఉద్ధరిస్తాను.

|| 12-8 ||

శ్లో.  మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ|

నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః.

తే.గీ. నీవు నాలోనె బుద్ధిని నిలుపు పార్థ!

పిదప నాలోననుందువు ప్రీతితోడ, 

నిందు సందేహమే యుండ దీవు గనుము

శుభములనుపొందఁగల్గుదు వభయమొదవి.

భావము.

నాలోనే మనసు నిలుపు బుద్ధిని నాలోనే ఉంచు. ఆ తరవాత నాలోనే 

నివిసిస్తావు. ఇందులో సందేహం లేదు.

|| 12-9 ||

శ్లో.  అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్|

అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనఞ్జయ.

తే.గీ. చిత్తమును నిల్పలేకున్న స్థిరముగాను

పార్థ! నాపైన, యోగంబు వరల జేసి

నన్ను బొందగన్ యత్నించు, మన్ననముగ,

శుభము కలుగును నీకిల నభయమిదియె.  

భావము.

ధనంజయా స్థిరంగా నాలో చిత్తాన్ని నిలపలేక పోయినట్లైతే, అప్పుడు 

అభ్యాస యోగం చేత నన్ను పొందడానికి ప్రయత్నించు.

 || 12-10 ||

శ్లో.  అభ్యాసేప్యసమర్థోऽసి మత్కర్మపరమో భవ|

మదర్థమపి కర్మాణి కుర్వన్సిద్ధిమవాప్స్యసి.

తే.గీ. చేయ లేకున్న యోగమున్, చేవ జూపి

నా పరంబగు కర్మలన్ నయము దలర

నాచరింపుము శుభములనందుమింక

నీకు జయమగు నర్జునా నీవె కనగ.

భావము.

అభ్యాసం కూడా నీవు చేయలేక పోతే, నా పరమైన కర్మలలో 

నిమగ్నమగుము. నా కోసం కర్మలు చేసినప్పటికీ సిద్ధిని పొందుతావు.

 || 12-11 ||

శ్లో.  అథైతదప్యశక్తోऽసి కర్తుం మద్యోగమాశ్రితః|

సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్.

తే.గీ.  కర్మ నా కొఱకిల జేయగా తగవొకొ?

యపుడు కర్మఫలములునా కర్పణమును

చేసి, యన్నిటినిన్ విడు, వాసిగాను,

మంచి ఫలితమున్ గనుటకు మాననీయ.

భావము.

నా కొరకై కర్మలు ఆచరించడానికి కూడా నీవు అసమర్ధడివైతే నన్ను 

శరణు పొంది నీ కోసం చేసే కర్మలన్నింటినీ నాకు సమర్పించి, 

ఆ సమస్త కర్మల ఫలాన్ని త్యజించు.

 || 12-12 ||

శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్జ్ఞానాద్ధ్యానం విశిష్యతే|

ధ్యానాత్కర్మఫలత్యాగస్త్యాగాచ్ఛాన్తిరనన్తరమ్.

తే.గీ.  కనగ నభ్యాసమును మించు జ్ఞాన మరయ,

జ్ఞాన మునుమించు విడిచిన కర్మ ఫలము,

శాంతి లభియించు, కనుమిది చక్కగాను,

మోక్షమబ్బును. నిజమిది రక్షణదియె.

భావము.

అభ్యాసంకంటే జ్ఞానం మేలు. జ్ఞానానికన్నా కర్మఫల త్యాగం ఎక్కువైనది. 

ఈ త్యాగం వలన తరవాత శాంతి(మోక్షం) కలుగుతుంది.

 || 12-13 ||

శ్లో.  అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ|

నిర్మమో నిరహఙ్కారః సమదుఃఖసుఖః క్షమీ

తే.గీ.  ద్వేష మెవరిపైనను లేని దీప్త మతియు,

నహమును,మమతను విడిన సహనశీలి 

సమముగా సుఖదుఃఖము ల్సతతముగను,

క్షమను గలిగిన ఘనులెపో ఘనులు భువిని.

భావము.

ఏ ప్రాణినీ ద్వేషించని వాడు, అహంకార మమకారాలు లేని వాడు, 

సుఖదుఃఖాలలో సమంగా వ్యవహరించేవాడు, క్షమా గుణం కలవాడు,

 || 12-14 ||

శ్లో.  సన్తుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః|

మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః.

తే.గీ.  నిత్య సంతుష్టుడౌ యోగి, నిగ్రహమతి,

దృఢపు నిశ్చయుండయి నాకు దీపితముగ

మనసు బుద్ధులనర్పించు మహితుఁడవని

నాకు బ్రియుఁడర్జునా! కను శ్రీకరముగ.

భావము.

నిత్యము సంతుష్టుడై , యోగియై, మనో నిగ్రహం కలవాడై, దృఢమైన 

నిశ్చయముతో, మనో బుద్ధులను నాకు అర్పించిన నా భక్తుడు 

నాకు ప్రియుడు.

 || 12-15 ||

శ్లో.  యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః|

హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యః స చ మే ప్రియః.

తే.గీ.  వ్యధను చెందదెవ్వనిచేత, వ్యధను చెంద

డెవ్వడీ లోకమువలన, నెవ్వడిలను

ముక్తుడో విషాదోద్వేగములవలనను,

నాకు ప్రియుఁడాతఁడే సుమా నయనిధాన!

భావము.

ఎవరివల్ల లోకం వ్యధ చెందదో, లోకం వలన ఎవడు వ్యధ చెందడో,

సంతోషం, కోపం, భయం, ఉద్వేగాల నుండి ఎవడు ముక్తుడో 

అతడు నాకు ప్రియుడు.

 || 12-16 ||

శ్లో.  అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః|

సర్వారమ్భపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః.

తే.గీ.  శుచియు, దక్షుండు, నిరపేక్షుడుచితమరసి

మెలఁగువాఁడహమేలేక చెలఁగువాఁడు

భక్తుడైనన్ను గొలిచెడి వాఁడు నాకు

బ్రీతుడిద్ధాత్రినర్జునా! వినుము నిజము.

భావము.

అపేక్ష లేని వాడు, శుచియైన వాడు, దక్షత కలవాడు, ఉదాసీనుడు, 

వ్యధలు నశించిన వాడు, అన్ని విధాలైన, కార్యాలలో నేను 

చేస్తున్నాననే భావం లేనివాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు.

 || 12-17 ||

శ్లో.  యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాఙ్క్షతి|

శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్యః స మే ప్రియః.

తే.గీ.  దుఃఖ సంతోషహీనుడు, దురితదూరు

డసమ శోకదూరుడు కాంక్ష లరయ లేని

యశుభ శుభములు లేని యా యతులితుడన

నాకుప్రీతుడీవెఱుఁగుము నయనిధాన.

భావము.

ఎవడు సంతోషించడో, ద్వేషించడో, శోకించడో, కాంక్షించడో

శుభాశుభాలను వదిలేస్తాడో అలాంటి భక్తుడు నాకు ప్రియుడు.

 || 12-18 ||

శ్లో.  సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః|

శీతోష్ణసుఖదుఃఖేషు సమః సఙ్గవివర్జితః.

తే.గీ. అరయ శీతోష్ణ సుఖ దుఃఖ విరహితుం డె

వ డిల మానావమాన దూరుడును సంగ

రహితుడయియుండునో యట్టి రమ్య గుణుఁడు

నాకునిష్టుండు కనుమిది శ్రీకరముఖ.

భావము.

శత్రువులు, మిత్రులు, మానావమానాలు, శీతోష్ణాలు, సుఖదుఃఖాలు 

వీటియందు సమంగా ఉండే వాడు సంగాన్ని విడిచే వాడు(నాకు ఇష్టుడు).

 || 12-19 ||

శ్లో.  తుల్యనిన్దాస్తుతిర్మౌనీ సన్తుష్టో యేన కేనచిత్|

అనికేతః స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నరః.

తే.గీ.  మౌని, స్తుతినిందలొకటిగా మదిగను ఘనుఁ

డసమ సంతుష్టు, డనికేతన సరసమతి,

నాకు ప్రీతిపాత్రుఁడు చూడ, శ్రీకరముగ

వానిలో నేనె మసలుదవారితముగ.

భావము.

నిందాస్తుతులను తుల్యంగా ఎంచేవాడు, మౌనంగా ఉండే వాడు, 

ఉన్నదానితో సంతృప్తి పడేవాడు, నికేతనం అక్కర లేని వాడు, 

స్థిరమైన బుద్ధి కల భక్తుడు నాకు ప్రియుడు.

|| 12-20 ||

శ్లో.  యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే|

శ్రద్దధానా మత్పరమా భక్తాస్తేऽతీవ మే ప్రియాః.

తే.గీ.  ధర్మయుక్త శాశ్వతపు పద్ధతియె యిద్ది,

శ్రద్ధతో జేసి నన్మదిన్ జక్కఁగఁ గను

నాదు భక్తులన్ బ్రేపింతు మోదమలర,

నీవు గ్రహియింపుమర్జునా! నేర్పు మీర. 

భావము.

ధర్మయుక్తమూ, శాశ్వతమూ అయిన దీనిని చెప్పిన ప్రకారంగా శ్రద్ధతో, 

నన్ను లక్ష్యంగా పెట్టుకొని ఎవరు ఉపాసిస్తారో ఆభక్తులే నాకు పరమ ప్రియులు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

భక్తియోగో నామ ద్వాదశోऽధ్యాయః


అథ త్రయోదశోధ్యాయః - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః


అర్జున ఉవాచ|

భావము.

అర్జునుడు అనుచున్నాడు.

|| 13-1 ||

శ్లో.  ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ|

ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ.

తే.గీ. ప్రకృతి, పురుషుడు క్షేత్రంబు పరగుచున్న

మహిత క్షేత్రజ్ఞులను గూర్చి మహిమ తలర

కేశవా! తెల్పు తెలియఁగ క్షేమమలరఁ

దెలియఁ గోరుచునుంటిని దీపితముగ.

భావము.

ఓ కేశవా! ప్రకృతియననేమి? పురుషుడెవ్వడు? క్షేత్రమనగానేమి? 

క్షేత్రజ్ఞుడెవ్వడు? జ్ఞానమనగానేమి? జ్ఞేయస్వరూపమెట్టిది? వీటిని గూర్చి 

తెలియగోరుచున్నాను.


శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ భగవాను డిట్లనియెను.

|| 13-2 ||

శ్లో.  ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రమిత్యభిధీయతే|

ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః.

తే.గీ. క్షేత్రమున్ దేహమనుచును, క్షేత్రధర్మ

మెఱుఁగునాతఁడె క్షేత్రజ్ఞుఁ డరయననుచుఁ

దెలిసినట్టి సద్విజ్ఞులు తెలుపుదురయ,

తెలియుమర్జునా యిది నీవు తెలివి కలిగి.

భావము.

ఓ అర్జునా! ఈ దేహము క్షేత్రమని చెప్పబడుచున్నది. ఈ క్షేత్ర ధర్మము 

నెవడెఱుంగునో వానిని క్షేత్రజ్ఞుడని ఈ విషయమును తెలిసినవారు చెప్పుదురు.

 || 13-3 ||

శ్లో.  క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత|

క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్జ్ఞానం మతం మమ.

తే.గీ. దేహములనొప్పుచున్నట్టి దేహిననుచు

నన్నెఱుంగుమో యర్జునా! మన్ననమున,

మహిని క్షేత్రజ్ఞు క్షేత్రమున్ మన్ననమున 

దెలియుటే జ్ఞానమరయగ, తెలియుమయ్య.

భావము.

మరియు ఓ అర్జునా! సర్వదేహములందుండెడి క్షేత్రజ్ఞుడైన జీవుని నన్నుగా 

ఎఱుఁగుము. ఇట్లు క్షేత్రక్షేత్రజ్ఞులగూర్చి తెలిసికొనెడి జ్ఞానమే నిజమైన 

జ్ఞానమని నా మతము.

|| 13-4 ||

శ్లో.  తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్|

స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు.

తే.గీ.  అట్టి క్షేత్రమేదో? గననెట్టిదగునొ?

యెట్టి వగువికారములతో నెట్టుబుట్టె

నొ? యట క్షేత్రజ్ఞుఁడెవడగునో? ప్రభావ

మెట్టిదికలవాడొ? విను మిప్పట్టు తెలియ.

భావము.

ఆ క్షేత్రమేదియో, ఎటువంటిదో, ఎట్టి వికారము కలదియో, దేనివలన బుట్టినదో, 

ఆ క్షేత్రజ్ఞుడెవ్వడో, ఎట్టి ప్రభావము గలవాడో ఆ సంగతిని సంగ్రహముగా 

నాద్వారా వినుము.

|| 13-5 ||

శ్లో.  ఋషిభిర్బహుధా గీతం ఛన్దోభిర్వివిధైః పృథక్|

బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః.

తే.గీ. క్షేత్ర క్షేత్రజ్ఞులను గూర్చి ఋషులు, వేద

ములుననేకవిధంబులఁతెలిపియుండె,

బ్రహ్మ సూత్రము వివరించె ప్రస్ఫుటముగ

సాక్ష్యములతోడనర్జునా! సరిగ వినుము.

భావము.

ఈ క్షేత్రక్షేత్రజ్ఞ విషయము మహర్షుల చేత అనేక విధములుగా వివరింపబడినది. 

పెక్కు శాఖలు కలిగిన వేదములలో ఇది పలు విధములుగా విభజించి 

నిరూపించబడినది. బ్రహ్మసూత్ర పదాలు దీనిని గురించి హేతు బద్ధముగా 

నిశ్చయించి చెప్పినవి.

|| 13-6 ||

శ్లో.  మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ|

ఇన్ద్రియాణి దశైకం చ పఞ్చ చేన్ద్రియగోచరాః.

తే.గీ.  గోచరములైదు, మరియు నగోచర మతి,

యష్టప్రకృతులు, తగ పది యనుపమేంద్రి

యములు, నిట్లిరువదినాలు గనుపమమగు 

క్షేత్రములు కలవర్జునా! కీర్తిసాంద్ర!

భావము.

మహాభూతాలు (ఐదు) అహంకారము, బుద్ధి, అవ్యక్తము(అష్టవిధ ప్రకృతి), 

ఇంద్రియాలు పది, మనస్సు, ఇంద్రియ గోచరవిషయాలు ఐదూ (మొత్తం 24క్షేత్రాలు).

|| 13-7 ||

శ్లో.  ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః|

ఏతత్క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్.

తే.గీ.  ద్వేష,  దుఃఖ సుఖేచ్ఛలున్, వినగ దేహ

మును, సుచేతనత్వము, మరి ఘనతరమగు  

పట్టుదలయును క్షేత్రమై పరగు పార్థ!

నీవు గ్రహియింపఁగలవిది నేర్పు మీర.

భావము.

ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, శరీరము, చేతనత్వము, పట్టుదల 

ఇవి వికారాలతో కూడిన క్షేత్రము అని సంగ్రహముగా చెప్పడమైంది.

|| 13-8 ||

శ్లో. అమానిత్వమదమ్భిత్వమహింసా క్షాన్తిరార్జవమ్|

ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః.

తే.గీ.  స్థైర్య, శౌచ, మమానిత్వ, ధర్మనిరతు,

లాత్మనిగ్రహమునదంబ మనుపమ గురు

సేవ, యోర్మియు, నొప్పుచు జీవనమును

సాగఁజేయుట మహితము సత్ ప్రభాస.

భావము.

తనని తాను పొగడక పోవడం, డంబము లేకుండా ఉండడమూ, అహింసా, 

ఓర్పూ, నిజాయితీ, గురు శుశ్రూష, శుచిత్వమూ, స్తిరత్వమూ, ఆత్మనిగ్రహమూ.

 || 13-9 ||

శ్లో. ఇన్ద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ|

జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్.

తే.గీ.  ఇంద్రియార్థమ్ములందున నెప్పటికిని

యహము, వైరాగ్యమున్ లేక, యలరుచుండి

చావుపుట్టుకలప్పుడుభావమునను

దోషముల్ గాంచుటయు కలదు తెలియుమయ.

భావము.

ఇంద్రియ విషయాలలో వైరాగ్యమూ అహంకారము లేకపోవడము , పుట్టుకలో, 

చావులో, ముసలితనములో, రోగములో, దుఃఖాన్ని, దోషాన్ని నిత్యమూ చూడటములోను,

|| 13-10 ||

శ్లో. అసక్తిరనభిష్వఙ్గః పుత్రదారగృహాదిషు|

నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు.

తే.గీ.  మహిననాసక్తి, నిర్లిప్తతిహముపైన,

మంచి చెడులందుసమదృష్టి, మదిని గలిగి

యుండునాతండు ఘనుడిలన్ నిండు మదిని

ప్రేమ వారిపై జూపుదు క్షేమమిడుదు.

భావము.

ఆసక్త భావము లేకపోవడము, పుత్రులు-భార్య గృహము మొదలైన వాటితో

తాదాత్మ్యము చెందక పోవడము, ఇష్టములు ప్రాప్తించినా, ఇష్టము కానిది 

ప్రాప్తించినా మనస్సుని సమస్థితిలో ఉంచుకోవడమూ,

 || 13-11 ||

శ్లో. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ|

వివిక్తదేశసేవిత్వమరతిర్జనసంసది.

తే.గీ.  వ్యభిచరించనహీనపుభక్తి, మరియు,

లస దనన్యయోగమున నన్నసమరీతిఁ

గొలుచుచేకాంతముగ నుండు సలలితుడిల

నాదు ప్రీతికి పాత్రుండు, నయనిధాన!

భావము.

ఇంకా, నాలోఅనన్య యోగంతో ఉండే వ్యభిచరించని భక్తీ, ఏకాంతంలో గడపడమూ, 

జనసమర్ధంలో అభిరుచి లేకపోవడమూ,

 || 13-12 ||

శ్లో. అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్|

ఏతజ్జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోన్యథా.

తే.గీ.  నిత్యమాధ్యాత్మికజ్ఞాన నిరతి, తత్వ

కలిత సుజ్ఞాన లక్ష్యమున్ గాంచుటయును

జ్ఞాన మనబడున్, గాని వజ్ఞానమనఁబ

డును గ్రహింపుమో పార్థ! నేడనుపమముగ.

భావము.

నిత్యమూ ఆధ్యాత్మ జ్ఞానము ఉండడమూ, తత్వ జ్ఞానము యొక్క లక్ష్యాన్ని 

దర్శించడము జ్ఞానమని చెప్పబడినది. దానికి భిన్నమైనది అంతా అజ్ఞానము.

|| 13-13 ||

శ్లో. జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి యజ్జ్ఞాత్వామృతమశ్నుతే|

అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే.

తే.గీ. దేని నరయ నమృతుడౌ సుధీర జీవు

డట్టి జ్ఞేయమున్ దెలిపెద, నదికలుగని

ది పరమగు బ్రహ్మమగు, సత్తది యరయగను 

కా దసత్తునున్ గాదయ్య, కౌరవారి!

భావము.

దేనిని తెలుసుకోవడము వలన జీవుడు అమృతత్వాన్ని పొందునో ఆ 

జ్ఞేయ వస్తువుని గురించి చెబుతాను. అది లేనిది పరబ్రహ్మము. అది సత్తు 

కాదని, అసత్తు కాదని చెప్పబడుతున్నది.

|| 13-14 ||

శ్లో‌.  సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షిశిరోముఖమ్|

సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి.

తే‌.గీ.  కాళ్ళు, చేతులు, తలలును, కళ్ళు, నోళ్ళు, 

చెవులునంతటనుండును, చెలగి యావ

రించి యుండునంతటనిది, కాంచమనము,

నీవు గ్రహియించుమర్జునా నేర్పు మీర.

భావము.

దానికి అంతటా చేతులు, కాళ్ళూ, కళ్ళు, తలలూ, నోళ్ళు, చెవులు ఉండి, 

అది లోకంలో సర్వాన్ని ఆవరించి ఉంటుంది.

|| 13-15 ||

శ్లో. సర్వేన్ద్రియగుణాభాసం సర్వేన్ద్రియవివర్జితమ్|

అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ.

తే.గీ.  ఇంద్రియములెన్న లేనిది యింద్రియముల

లక్షణములున్న బ్రహ్మము, లక్ష్యమొప్ప

నంటుకొనకనె భరియించు నన్నిటిని, క

నగను గుణహీన, గుణముల సొగసునొందు.

భావము,

అపర బ్రహ్మము ఇంద్రియాల లక్షణాల ద్వారా ప్రకాశించేది, ఏ ఇంద్రియాలు 

తనలో లేనిది, దేనిని అంటకుండానే అన్నింటినీ భరించేది, గుణ హీనమైనా 

కూడా గుణాలను భోగించేది.

|| 13-16 ||

శ్లో.  బహిరన్తశ్చ భూతానామచరం చరమేవ చ|

సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాన్తికే చ తత్.

తే.గీ.  కదులు కదలదు, ప్రాణులన్ గలుగు బయట

లోపలన్, గాని కనరాదు, శ్లోకులకది

చేరువనె యుండు,దురితుల చెంత నుండ

దట్టిదగు బ్రహ్మమర్జునా!తలచిచూడ.

భావము.

అది (జ్ఞేయము) జీవులకు బయటా, లోపలా ఉండెడిది, కదిలెడిది కదలనిది కూడా 

ఐనప్పటికి, సూక్ష్మము ఐనందువలన తెలియబడదు. (అవిద్వాంసులకు)దూరంగానూ, 

విద్వాంసులకు దగ్గరగాను ఉన్నది.

|| 13-17 ||

శ్లో. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్|

భూతభర్తృ చ తజ్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ.

తే.గీ.  బ్రహ్మమొక్కటే, జీవులన్ బరిగణింప

వేరువేరుగాతోచును, విశ్వ భార

మంతమ్రోయుచు సృష్టిని సాంతమదియె

పుట్టఁజేయును జంపును పట్టిపట్టి.

భావము.

ఆ పరబ్రహ్మము విభాగములు లేనిదైనా, జీవులలో విభజింపబడి నట్లుగానూ, 

జీవులను భరించేది, సృష్టి సంహారాలను చేసేదిగా తెలియవలెను.

|| 13-18 ||

శ్లో. జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే|

జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్.

తె.గీ.  వెలుగులకు వెలుగది చూడ, విశ్వమునను,

చీకటికినావలుండును లోకమునను,

జ్ఞాన మును  జ్ఞేయమదియెన్న, కడకు చూడ

జ్ఞాన గమ్యంబు సిద్ధియు గాంచ నదియె.

భావము.

వెలుగులకు వెలుగది. (అజ్ఞానమనే) చీకటికి ఆవల ఉన్నదని చెప్పబడుతున్నది. అదే జ్ఞానమూ, జ్ఞేయమూ, జ్ఞాన గమ్యమూ అందరి హృదయాలలో సిద్ధించి ఉన్నది.

|| 13-19 ||

శ్లో. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః|

మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే.

తే.గీ.  క్షేత్ర, సుజ్ఞాన, సుజ్ఞేయ పాత్రలెఱుఁగ

తెలిపితిని, నాదు భక్తులు తెలిసికొనుచు

నన్ను పొందుదు రర్జునా! సన్నుతముగ.

నీవు గ్రహియింపుమియ్యది నేర్పు మీర.

భావము.

క్షేత్రము, జ్ఞానము, జ్ఞేయము సంగ్రహముగా చెప్పబడినవి. నా భక్తుడు 

దీనిని తెలుసుకొని నాభావాన్ని(మోక్షాన్ని) పొందును.

|| 13-20 ||

శ్లో. ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి|

వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసమ్భవాన్.

తే.గీ.  ప్రకృతిపురుషులనాథులు, ప్రకృతి నుండి 

గుణ వికారాదులొదవెను ఘనతరముగ

వాటివలననె యీసృష్టి మేటిగాను

సాగుచుండెనో యర్జునా! సతతమిటుల.

భావము.

ప్రకృతి పురుషుడు ఇద్దరూ అనాది అని తెలుసుకో. వికారాలూ, గుణాలూ 

ప్రకృతి నుండి పుట్టునవని తెలుసుకో.

|| 13-21 ||

శ్లో. కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే|

పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే.

తే.గీ.  కార్యములకకార్యములకుఁ గారణంబుఁ

గనఁగ ప్రకృతి, నిజమదియె, కర్త పురుషు

డె, సుఖ దుఃఖానుభవముల కెన్న మదిని,

పార్థ! గ్రహియింపుమియ్యది, వరలనెంచి.

భావము.

కార్యాకార్యాలకు ప్రకృతి కారణము అని చెప్పబడుచున్నది. సుఖదుఃఖాల 

అనుభవాలకు కర్త పురుషుడని చెప్పబడును.

|| 13-22 ||

శ్లో. పురుషః ప్రకృతిస్థో హి భుఙ్క్తే ప్రకృతిజాన్గుణాన్|

కారణం గుణసఙ్గోऽస్య సదసద్యోనిజన్మసు.

తే.గీ.  ప్రకృతిలోగలపురుషుడు ప్రకృతి గుణము

లనుభవించు,తత్ గుణములయనుభవమున

మంచిచెడులుండి జన్మకు సంచితఫల

ములవి కారణమగునయ్య! ఫలితమదియె.

భావము.

ప్రకృతిలో నిలిచిన పురుషుడు ఆ ప్రకృతి నుండి పుట్టిన గుణాలను 

అనుభవించును. గుణములతో అతడి సంయోగమే అతడు మంచీ, 

చెడు జన్మలెత్తుటకు కారణము.

|| 13-23 ||

శ్లో. ఉపద్రష్టానుమన్తా చ భర్తా భోక్తా మహేశ్వరః|

పరమాత్మేతి చాప్యుక్తో దేహేऽస్మిన్పురుషః పరః.

తే.గీ.  సాక్షి దేహాన పురుషుడు, సన్నుతుడగు

భారవహుడును, భోక్తయున్, వర మహేశు

డు, పరమాత్మయు, భోగియు, స్వపర భేద

రహితుడనుమంతయును తానె మహిత! కనగ.

భావము.

ఈ శరీరంలో పరమ పురుషుడు సాక్షి అనీ, అనుమతించేవాడనీ, 

భరించేవాడనీ, భోగించేవాడనీ, మహేశ్వరుడనీ పరమాత్మ అనీ 

చెప్పబడుచుండెను.

|| 13-24 ||

శ్లో. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ|

సర్వథా వర్తమానోऽపి న స భూయోऽభిజాయతే.

తే.గీ.  సగుణ ప్రకృతిని, పురుషుని, చక్కగనెవ

రెఱుఁగుదురొ వారు ముక్తిననితరముగను

కనుదురర్జునా!  యెట్లున్న గాని, నిజము.

ముక్తిపథమది భువిపైన పూజ్యులకును.

భావము.

పూర్వము చెప్పిన విధముగా పురుషుని, గుణాలతో సహా ప్రకృతినీ ఎవడు 

తెలుసుకొనునో, అతడు ఏ విధముగ ప్రవర్తించినా తిరిగి పుట్టడు.

|| 13-25 |

శ్లో. ధ్యానేనాత్మని పశ్యన్తి కేచిదాత్మానమాత్మనా|

అన్యే సాఙ్ఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే|

తే.గీ.  ధ్యానమునఁ గాంతు రాత్మను ధన్యులరసి

యాత్మలో నాత్మనే గాంతు రమలినులిల,

సాంఖ్య యోగంబులన్ గాంత్రు సాధు మహితు

లాత్మ దర్శనమున్ ముక్తి యమరు మనకు.

భావము.

కొందరు ధ్యానము ద్వారా తమలోనే తమ ఆత్మని ఆత్మ ద్వారా చూతురు. 

కొందరు జ్ఞాన యోగము ద్వారాను, మరి కొందరు కర్మ యోగము ద్వారాను 

ఆత్మను చూతురు.

|| 13-26 ||

శ్లో. అన్యే త్వేవమజానన్తః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే|

తేపి చాతితరన్త్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః.

తే.గీ.  ఇట్టు లెఱుఁగలేకున్నచో పట్టుపట్టి

తెలిసినట్టివారికడను తెలుసుకొనియు

ముక్తి పొందగవచ్చు నాసక్తియున్న,

నీవు గ్రహియింపుమర్జనా నేర్పు మీర.

భావము.

ఈ ప్రకారముగా తెలుసుకోలేని వారు కూడా అన్యుల ద్వారా విని, ఆ విధముగ విన్న 

దానిపై గురి ఉంచిన వారు కూడా సంసారమును తప్పక తరింతురు.

|| 13-27 ||

శ్లో. యావత్సఞ్జాయతే కిఞ్చిత్సత్త్వం స్థావరజఙ్గమమ్|

క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్తద్విద్ధి భరతర్షభ.

తే.గీ.  జంగమము స్థావరములుగా జగమునందు

కలదొ క్షేత్రముక్షేత్రజ్ఞులలిని కలిసి

యున్నదేనని యెఱుఁగుము మన్ననమున

పార్థ! నీవింక వినుతమౌ పథమునందు.

భావము.

భరతశ్రేష్ఠుఁడా ! స్థావర జంగమ రూపమగు ప్రాణికోటి ఏదైతే ఉందో అది 

క్షేత్ర క్షేత్రజ్ఞుల కలయిక వలననే పుడుతుందని తెలుసుకో.

|| 13-28 ||

శ్లో.  సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరమ్|

వినశ్యత్స్వవినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి.

తే.గీ.  చెడెడివాటిలోనున్నట్టి చెడని తత్వ

మన్ని భూతంబులన్ గల యసమ హరిని, 

చూడఁ గలుగును యోగియే వాఁడె ఘనుఁడు,

పార్థ! గ్రహియింపు మియ్యది భవ్యముగను. 

భావము.

నశించిపోయెడి వాటిలో నశించని తత్వముగా, అన్ని భూతాలలో సమంగా 

ఉన్నపరమేశ్వరుని సమముగా చూసిన వాడే, నిజమైన దృష్టి కలవాడు.

|| 13-29 ||

శ్లో.  సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్|

న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్.

తే.గీ.  సమముగా తాను సర్వత్ర నమరు హరిని

సమముగా గను పూజ్యుండు సన్నుతుఁడిల

తనను హింసించుకొననివాఁ డనగవచ్చు,

పరమగతిఁ బొందు నాతండు, పార్థ! వినితె?

భావము.

సర్వత్ర సమంగా ఉన్న ఈశ్వరుణ్ణి సమంగా చూసిన వాడే, తనని 

తాను హింసించుకోనివాడు. అతడు దానివలన పరమ గతిని చేరుకొనును.

|| 13-30 ||

శ్లో.  ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః|

యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి.

తే.గీ.  కలుగువాటికి ప్రకృతియె కారణమని

యాత్మ యేమియున్ జేయఁబో దనుచు తలచు

నాతఁడే జ్ఞాని నిజము నీవరయుమిచట

పార్థ సత్యంబు నెఱుఁగుము భవ్యమతిని.

భావము.

అన్ని విధములైన కర్మలు ప్రకృతి వలననే జరుగుచున్నవని, ఆత్మ 

ఏమీ చెయ్యదనీ తెలిసినవాడే నిజమైన చూపు కలవాడు

 || 13-31 ||

శ్లో.  యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి|

తత ఏవ చ విస్తారం బ్రహ్మ సమ్పద్యతే తదా.

తే.గీ.  మానవుండెప్పుడందరిన్ మనెడు వాడు

దైవమొక్కడంచెఱుఁగునో  తత్వమరసి,

యతడెపో జ్ఞాని, బ్రహ్మం బునతఁడె చేరు.

పార్థ! నీవిది గ్రహియించి పరవసించు.

భావము.

ఎప్పుడైతే(మానవుడు)వేరు వేరుగా కనిపించే ప్రాణికోటి ఏకత్వము మీద

ఆధారపడి ఉన్నదని, అక్కడినుండే విస్తరించిందని నిరంతరము 

చూడగలుగునో అప్పుడు బ్రహ్మమును పొందగలడు.

 || 13-32 ||

శ్లో.  అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః|

శరీరస్థోపి కౌన్తేయ న కరోతి న లిప్యతే.

తే.గీ.  ఆది లేనట్టి యా బ్రహ్మ మవ్యయంబు,

దేహమందుండియున్ కర్మ మోహ రహితు

డతఁడు, కర్మలంటవతనికనుపమాను

డతఁడె బ్రహ్మంబు గ్రహియించు మర్జునాఖ్య!

భావము.

ఆది లేని వాడు నిర్గుణుడు కనుక, ఈ పరమాత్మ అవ్యయుడు. కౌంతేయా! 

శరీరంలో ఉన్నా అతడు కర్మ చెయ్యడు. ఆ కర్మ ఫలంతో మలినపడడు.

 || 13-33 ||

శ్లో.  యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే|

సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే.

తే.గీ.  వ్యాప్తమయియున్న నభమెట్టు లంటఁబడదొ

దేని చేతను నట్టులే దేహికూడ

యంటబడదెందునున్నను నఖిలమతఁడె

యయియు, నర్జునా!గ్రహియించు మనుపమముగ

భావము.

ఎటుల అంతటా వ్యాపించి ఉన్న ఆకాశము సూక్ష్మ తత్వము వలన దేనిచేతా 

అంటబడదో, అటులనే దేహమంతటా వ్యాపించి ఉన్న ఆత్మ అంటబడదు.

 || 13-34 ||

యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః|

క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత.

తే.గీ.  సూర్యుఁడొక్కఁడే జగతికి శోభగూర్చు

కాంతినిచ్చుచు న్నట్టులే ఘనతరముగ

క్షేత్ర మంతనునొక్క యా క్షేత్రధారి

సత్ప్రకాశంబుతో నొప్పఁ  జక్కగ గను.

భావము.

ఓ భారతా! ఎట్టుల సూర్యుడు ఒక్కఁడే ఈ యావత్తు లోకమును ప్రకాశింప చేయునో, 

అటులనే ఈ యావత్తు క్షేత్రమును క్షేత్రధారి ఒక్కడే ప్రకాశింప చేయును.

|| 13-35 ||

శ్లో.  క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమన్తరం జ్ఞానచక్షుషా|

భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాన్తి తే పరమ్.

తే.గీ.  క్షేత్రమున మరి క్షేత్రజ్ఞుఁ జెలఁగు భేద

మరసి భూతప్రకృతినుండి నిరుపమమగు

మోక్షమును పొందు దృష్టితో పూజ్యులెవరు

తెలుసుకొందురో వారికి కలుగు ముక్తి.

భావము.

ఈ ప్రకారముగా క్షేత్రక్షేత్రజ్ఞుల భేదాన్ని, భూత ప్రకృతి నుండి మోక్షము పొందెడి 

పద్ధతిని జ్ఞాన దృష్టితో ఎవరు తెలుసుకొందురో వారు పరమ పదమును 

చేరుకొందురు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః


చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీభగవానుడిట్లనియెను

|| 14-1 ||

శ్లో.  పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్|

యజ్జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః.

తే.గీ.  వర చిదానంద సుజ్ఞానమరయుమీవు

మునులు దీనిన్ చిదానందపూర్ణులగుచు

సిద్ధిపొందుదు రర్జునా!  సిద్ధమిదియె,

నీకుఁ దెలిపద వినుమీవు నేర్పుతోడ.

భావము.

సర్వ మునీశ్వరులును ఏ ఙ్ఞానమునెఱుంగుట చేత సర్వోత్కృష్ఠమైన 

చిదానంద స్వరూప సిద్ధిని పొందిరో అట్టి అనంతమైన ఙ్ఞానములన్నిటిలో 

నుత్తమమైన చిదాకాశఙ్ఞానమును మరల చెప్పుచున్నాను.

 || 14-2 ||

శ్లో.  ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః|

సర్గేపి నోపజాయన్తే ప్రలయే న వ్యథన్తి చ.

తే.గీ.  పొంది యీ జ్ఞాన మెవరు నన్ పొందకలుగు

దురొమరలపుట్టబోరింక నిరుపమమగు

ముక్తిసామ్రాజ్యమున్ బొంది పొంగఁగలరు.

ప్రళయమందునన్ గలఁగరు పార్థ! నిజము..

భావము.

ఈ ఙ్ఞానమును పొంది నాలో నేకమై శోభిల్లువారు సృష్టికాలమున జన్మించరు. 

ప్రళయ కాలమున దు:ఖ పడరు. అనగా మృతినొందరు.

|| 14-3 ||

మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్గర్భం దధామ్యహమ్|

సమ్భవః సర్వభూతానాం తతో భవతి భారత.

తే.గీ.  నే మహద్బ్రహ్మ, నా చేతనిరుపమాన

ప్రకృతి యోనిని చైతన్యభాసమాన

బీజ రూపమౌ జీవుని వేయుదునయ.

సృష్టి వర్ధిల్లు దీనిచే శ్రీకరముగ.

భావము.

ఓ అర్జునా! మహద్బ్రహ్మయని చెప్పబడు నామూల ప్రకృతి యోనియందు 

నేను చైతన్య బీజ రూపమున జీవుని ఉంచుచున్నాను. అందువలన 

సర్వ భూతముల ఉత్పత్తి కలుగుచున్నది.

|| 14-4 ||

శ్లో.  సర్వయోనిషు కౌన్తేయ మూర్తయః సమ్భవన్తి యాః|

తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా.

తే.గీ. పుట్టు జీవకోటికి తల్లి మూల ప్రకృతి,

బీజమునునాటు నేఁ దండ్రి సాజముగనె

యనుచు గ్రహియింపుమర్జునా! యనితరమగు

పురుష ప్రకృతులమీ సృష్టి మూలమయ్య.

భావము.

ఓ కౌంతేయా! దేవమానవ పశు పక్ష్యాది సకల యోనులందు పుట్టు 

దేహములన్నింటికిని, మహద్బ్రహ్మయగు మూల ప్రకృతి తల్లి యనియు, 

పరమేశ్వరుడనైన నేను అందు బీజమునుంచు తండ్రిననియు తెలియుము.

|| 14-5 ||

శ్లో.  సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసమ్భవాః|

నిబధ్నన్తి మహాబాహో దేహే దేహినమవ్యయమ్.

తే.గీ.  ప్రకృతి సిద్ధత్రిగుణములు, వరలుచుండి

దేహిని వినాశరహితుని దేహదృష్టి 

నాశమగుదాని బంధించు, నయనిధాన!

నీవు గ్రహియింపుమియ్యది నేర్పు మీర.

భావము.

ఓ అర్జునా! ప్రకృతివలన బుట్టిన సత్త్వము, రజస్సు, తమస్సు అను 

మూడు గుణములును నాశరహితుడైన గగనాత్మను అనగా దేహిని నశించు 

దేహదృష్టిలోనే బంధించుచున్నది.

|| 14-6 ||

శ్లో.  తత్ర సత్త్వం నిర్మలత్వాత్ప్రకాశక మనామయమ్|

సుఖసఙ్గేన బధ్నాతి జ్ఞానసఙ్గేన చానఘ.

తే.గీ.  సత్త్వమమలంబగుటచేత సత్ప్రకాశ

కం బనామయమును, తాను కట్టివేయు 

సుఖము, సంగతిన్ సుజ్ఞాన శోభఁ గూర్చు 

నశ్వరపుదేహమునఁ గూర్చి యర్జునుండ!

భావము.

పాపరహితుడవగు ఓ అర్జునా! సత్త్వరజస్తమోగుణములలో మొదటిదగు 

సత్త్వగుణము నిర్మలమైనదగుటచేతను ప్రకాశింపజేయునదై, ఆరోగ్యకరమైనదై,

ప్రపంచసుఖములలో సంగమము కలిగించుటచేతను, శాస్త్రఙ్ఞానములో 

ఆసక్తిని, తృప్తిని కలిగించుటచేతను అంతవరకే ఉంచి బంధించుచున్నది.

 || 14-7 ||

శ్లో.  రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసఙ్గసముద్భవమ్|

తన్నిబధ్నాతి కౌన్తేయ కర్మసఙ్గేన దేహినమ్.

తే.గీ.  కన రజోగుణమాశలన్ గలుగఁజేయు

ధనముమున్నగువానిపై, దానివలన

బంధనము కల్గునాత్మకు, బౌతికేచ్ఛ

పెరిగి కర్మబంధంబులే పెరుగు, పార్థ! 

భావము.

ఓ అర్జునా! రజోగుణము ఆశాపాశముచే కలిగి ధనాది లోకవిషయములయెడ 

రాగము కలుగజేయునని ఎఱుంగుము. అందుచే రజోగుణము దేహమందున్న 

ఆత్మను ఐహిక సుఖములందాసక్తిని కలిగించి వాటికై అనేక కర్మలను చేయించి బంధించుచున్నది.

 || 14-8 ||

శ్లో.  తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్|

ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత.

తే.గీ.  తమమె యజ్ఞాన జనితము, దానివలన

నాత్మ నిద్రాదులన్ మున్గు ననవరతము

బద్ధకము హెచ్చి నిత్యమున్ పడుకొనుటను

జీవుఁడజ్ఞాన తమమునఁ జెలగి మాయు.

భావము.

హే భారతా! తమోగుణమన్నచో అఙ్ఞానముచే జనించిన దానినిగ నెఱుంగుము. 

అది సర్వజీవులకు మోహమును, భ్రమను కలిగించి, అజాగ్రత్త, సోమరితనము, 

అతినిద్ర అనువానిచే ఆత్మను బంధించుచున్నది.

 || 14-9 ||

శ్లో.  సత్త్వం సుఖే సఞ్జయతి రజః కర్మణి భారత|

జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సఞ్జయత్యుత.

తే.గీ.  సత్వగుణమది కలిగించు శాంతి, సుఖము,

కొల్పు డాంబికంబులు రజోగుణము తెలియ,

చెడ్డనెన్నుచు గూర్చుచున్ జెరచు తమము,

అర్జునా గ్రహియింపుమీవనవనుపమముగ.

భావము.

ఓ అర్జునా! సత్త్వగుణము శాంతిసుఖములను కలిగించుచున్నది. రజోగుణము 

భోగములకై బాహ్య కర్మాడంబరములను కలిగించుచున్నది. తమోగుణమన్నచో 

మంచిపనిని చేయించక చెడును చేయించి ప్రమాదమును కలిగించుచున్నది.

 || 14-10 ||

శ్లో.  రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత|

రజః సత్త్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా.

తే.గీ.  సత్వ మధికంబుగానున్న జరుపు మంచి,

అధికమై యొప్పు రజముతా నైహికమిడు,

తమమెబలమైన చెరచును తలచిచూడ

దైవబలముచే సత్వమున్ నీవు కనుము.   

భావము.

హే భారతా! సత్త్వగుణము రజస్తమోగుణముల కంటే శక్తితోనున్నపుడు వాటిని 

అణచి ఙ్ఞానసుఖాదులను కలిగించును. అట్లే రజోగుణము సత్త్వతమస్సులకంటే

బలముగనున్నపుడు వాటిని అణచి అనేక కర్మలయందు ఆసక్తిని కలిగించును. 

అట్లే తమోగుణము సత్త్వరజోగుణములకంటే అధికముగ నున్నపుడు ఙ్ఞాన 

శూన్యతతో ప్రమాదములను కలిగించును.

|| 14-11 ||

శ్లో.  సర్వద్వారేషు దేహేస్మిన్ప్రకాశ ఉపజాయతే|

జ్ఞానం యదా తదా విద్యాద్వివృద్ధం సత్త్వమిత్యుత.

తే.గీ.  ఈ శరీరమందున్న సర్వేంద్రియముల

ను నయ విజ్ఞానమే ప్రసరణము జరుగు

చున్న సత్వసంవర్ధన మున్నదనుచు

మదిని భావింపుమర్జునా! మాన్యవర్య!

భావము.

ఈ దేహమందున్న సర్వేంద్రియముల ద్వారా విఙ్ఞాన ప్రకాశమే 

ప్రసరించుచున్నప్పుడు సత్త్వగుణము బాగా వృద్ధి చెంది శోభిల్లిచున్నదని 

తెలియవలెను.

|| 14-12 ||

శ్లో.  లోభః ప్రవృత్తిరారమ్భః కర్మణామశమః స్పృహా|

రజస్యేతాని జాయన్తే వివృద్ధే భరతర్షభ.

తే.గీ.  మది రజోగుణవృద్ధిచే మహితమయిన

లోభమును, కామ్యకర్మలలోన మునిగి

శాంతి నశియించుచుండి యాశ పెరుగుచును

పతనమార్గంబుఁ బట్టుట క్షితిని జరుగు.

భావము.

ఓ అర్జునా! రజోగుణము వృద్ధిలోనున్నపుదు లోభత్వము, కామ్యకర్మల నారంభించి 

వాటిలో మునిగి వర్తించుట, ఇంద్రియనిగ్రహము, మనశ్శాంతిలేకుండుట, 

మిక్కుటమైన ఆశ మొదలైనవి కలుగుచున్నవి.

|| 14-13 ||

శ్లో.  అప్రకాశోప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ|

తమస్యేతాని జాయన్తే వివృద్ధే కురునన్దన.

తే.గీ.  మది తమోగుణవృద్ధిచే మందమతియు,

భ్రమయు, దానిచే నష్టము, వరలుచుండు

పతనమార్గాన పడిపోయి యతులితమగు

జీవితమువ్యర్థమయిపోవు జీవులకును.

భావము.

హే కురునందనా! తమోగుణము వృద్ధిలో నున్నపుడు బుద్ధిమాంద్యము, 

అఙ్ఞాన భ్రమతో కూడిన ప్రమాదములు కలుగుచున్నవి.

|| 14-14 ||

శ్లో.  యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్|

తదోత్తమవిదాం లోకానమలాన్ప్రతిపద్యతే.

తే.గీ.  సత్వగుణవృద్ధిలోనుండి మహత్వమయిన

మృత్యు వొందినన్ ఘనులట్లు మేల్తరమగు 

ముక్తినొందుదురర్జునా యుక్తమదియె

జీవమొందినవానికి జీవితమున.

భావము.

దేహధారియగు జీవుడెప్పుడు సత్త్వగుణము అభివృద్ధిలో నుండగా మరణించునో, 

అప్పుడు ఉత్తమ ఙ్ఞానులు పొందెడు నిర్మలమైన లోకములను పొందుచున్నాడు.

|| 14-15 ||

శ్లో.  రజసి ప్రలయం గత్వా కర్మసఙ్గిషు జాయతే|

తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే.

తే.గీ.  కర్మ సంగిగా జన్మంబు కలుగఁజేయు

మృతి రజోవృద్ధిలోగాంచ క్షితిని పార్థ!

తమవివృద్ధిలో మృత్యువు ధర్మహీన

మూఢునింటనో పశువుకో పుట్టఁజేయు.

భావము.

రజోగుణము అభివృద్ధిలో నున్నపుడు మరణించినచో కామ్య కర్మాసక్తులగు 

మనుష్యుల కుటుంబములందు తిరిగి జన్మించుచున్నాడు. తమోగుణము 

అభివృద్ధిలోనున్నపుడు మృతినొందినచో ఙ్ఞానహీనులైన మూఢుల 

వంశమునందుగానీ, పశుపక్ష్యాదులలోగానీ పుట్టుచున్నాడు.

|| 14-16 ||

శ్లో.  కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్|

రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమసః ఫలమ్.

తే.గీ. సాత్వికంబది కలిగించు సత్ఫలంబు,

రాజసంబున దుఃఖంబు ప్రాప్తమగును,

తామసంబున నజ్ఞాన తమము కలుగు,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.

భావము.

సాత్త్వికములైన మంచి కర్మలను చేయుటచే నిర్మల శాంతిసుఖములే 

ఫలమనియు, రజోకర్మలను చేయుటచే సాంసారిక సుఖదు:ఖములే 

ఫలమనియు, తామసి కర్మలచే అఙ్ఞానమే ఫలమనియు తత్వవేత్తలు చెప్పిరి.

|| 14-17 ||

శ్లో.  సత్త్వాత్సఞ్జాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ|

ప్రమాదమోహౌ తమసో భవతోజ్ఞానమేవ చ.

తే.గీ.  సద్వివేక సుజ్ఞానము సత్వమిచ్చు

ఘన దురాశ, లోభము, రజోగుణమొసంగు,

తమమె యజ్ఞానమున్ బ్రమాదములనిడును,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.

భావము.

సత్త్వగుణమువలన వివేకముతో కూడిన ఙ్ఞానము కలుగుచున్నది. 

రజోగుణమువలన తరగని ఆశయను లోభము జనించుచున్నది.

తమోగుణముచే అఙ్ఞాన ప్రమాదములు కలుగుచున్నవి.

 || 14-18 ||

శ్లో.  ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా మధ్యే తిష్ఠన్తి రాజసాః|

జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛన్తి తామసాః.

తే.గీ.  సత్వమూర్థ్వలోకములిచ్చు సన్నుతముగ,

రాజసంబున భూమిపై ప్రజననమగు,

నీచజననంబు తమముననేలభించు

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.

భావము.

సత్వగుణమందున్నవారు స్వర్గాది ఊర్ధ్వలోకములను పొందుచున్నారు. 

రజోగుణము కలవారు మధ్యమమగు మనుష్యలోకమును పొందుచున్నారు. 

నీచగుణవృత్తులు గల తమోగుణము కలవారు అధోలోకమును అనగా 

మనుష్యులలో హీనులుగాగానీ పశుపక్ష్యాదులుగగానీ జన్మించుచున్నారు.

|| 14-19 ||

శ్లో.  నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి|

గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్ఛతి.

తే.గీ.  కర్మలన్ ద్రిగుణప్రకృతి కాంక్షఁ గొలిపి

చేయఁజేయును, నేన్ గాదు చేయువాడ

నాత్మ నాకాశమేనంచు నాత్మనెన్ను

వాడు సన్ముక్తుడై తాను వరలగలడు.

భావము.

ఎవడు సర్వకర్మలను ప్రేరేపించి చేయునది త్రిగుణాత్మిక ప్రకృతితప్ప 

అన్యమెవరూ కాదనియు, తానీప్రకృతికంటె వేరైన గగనాత్మ స్వరూపునిగ 

నెపుడు తెలియునో అపుడు వాడు నా అనంత చిదాకాశ విశ్వగర్భస్వరూపమునే 

పొందుచున్నాదు.

|| 14-20 ||

శ్లో.  గుణానేతానతీత్య త్రీన్దేహీ దేహసముద్భవాన్|

జన్మమృత్యుజరాదుఃఖైర్విముక్తోమృతమశ్నుతే.

తే.గీ.  త్రిగుణ దూరుఁడౌ జీవుడు  ప్రగణితముగ

నైహికంబగు బాధలనధిగమించి

జననమరణముల్ లేనట్టి చక్కనైన

ముక్తిసన్మార్గమందున పొలుపుగాంచు.

భావము.

దేహోత్పత్తికి కారణభూతములైన ఈ త్రిగుణముల నతిక్రమించి జీవుడు 

జనన మరణ వార్ధక్య దు:ఖములనుండి విముక్తుడై జననమరణములులేని 

అమృత చిదాకాశ దైవస్వరూపమును పొంది శాశ్వతముగ శోభిల్లుచున్నాడు.

అర్జున ఉవాచ

భావము.

అర్జునుడిట్లనియెను:

|| 14-21 ||

శ్లో.  |

కైర్లిఙ్గైస్త్రీన్గుణానేతానతీతో భవతి ప్రభో|

కిమాచారః కథం చైతాంస్త్రీన్గుణానతివర్తతే.

తే.గీ.  త్రిగుణ దూరుడెట్లుండును? దీనబంధు!

యెట్లు వర్తించునోయాతఁ?డెట్లతండు

త్రిగుణములనుజయించును? దేవదేవ

తెలియ జెప్పుమా నాకిల తెల్లమవగ.

భావము.

హే ప్రభో! సత్త్వరజస్తమోగుణములను మూడింటిని అతిక్రమించినవాడు 

ఏ లక్షణములతో నుండును? వాని వర్తన ఎట్లుండును? ఈ త్రిగుణములను 

వాడెట్లు అతిక్రమించుచున్నాడు?

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ భగవానుడిట్లనియెను

|| 14-22 ||

శ్లో.  ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాణ్డవ|

న ద్వేష్టి సమ్ప్రవృత్తాని న నివృత్తాని కాఙ్క్షతి.

తే.గీ. త్రిగుణ సంభవ ఫలములన్ దిట్టడెవడొ,

విడిచిపెట్టిన వాటిపై ప్రీతి వీడి

మరలనాశింపడో, వాడె మహితుడిలను,

త్రిగుణ దూరుడై వర్ధిల్లు ప్రగణితముగ.

భావము.

హే పాండవా! సంప్రాప్తములైన సత్త్వగుణ సంబంధమగు ప్రకాశమును, 

రజోగుణ సంబంధమగు కర్మప్రవృత్తిని, తమోగుణ సంబంధమగు 

మోహమును ఎవడు ద్వేషింపడో, ఇవి విడిచిపోయినచో వీటిని తిరిగి కోరడో అట్టివాడు త్రిగుణాతీతుడగును.

|| 14-23 ||

శ్లో.  ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే|

గుణా వర్తన్త ఇత్యేవం యోవతిష్ఠతి నేఙ్గతే.

తే.గీ. తెలియు నెవ్వడు చర్యలు త్రిగుణములవ

నుచును, తానుదాసీనుడై యచలితమతి

నుండునో చిదాకాశ మందుండు వాడు, 

త్రిగుణములనుజయించిన ధీరుఁడతఁడు.

భావము.

ఎవడు ప్రకృతిగుణములే ప్రవర్తించుచున్నవని తెలిసి, ఉదాసీనుడై ఉండి, 

త్రిగుణములచే చలింపక చిదాకాశ స్వరూపస్థితిలో సదా విలసిల్లుచుండునో 

వాడే త్రిగుణాతీతుడు.

|| 14-24 ||

శ్లో.  సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాఞ్చనః|

తుల్యప్రియాప్రియో ధీరస్తుల్యనిన్దాత్మసంస్తుతిః.

తే.గీ.  దుఃఖ సుఖములన్ సమముగా, తోచు నెవని

కిలను మట్టియు పుత్తడి నెంచ నొకటి

గా కనునెవండు, తిట్లుపొగడ్తలొక్క

టిగనె నెన్ను గుణాతీతునిగ గణించు.

భావము.

సమ దు:ఖ అనంత చిదాకాశ స్వరూపమందు స్థిరుడై, సుఖదు:ఖములందు 

సమముగనుండి, మట్టిని, రాతిని, బంగారమును సమముగ జూచుచు, ఇష్టానిష్ట 

వస్తుప్రాప్తితో సమచిత్తమునే కలిగి దూషణభూషణములందు చలింపక, ధీరుడై 

ఎవడు విలసిల్లునో వాడే త్రిగుణాతీతుడు.

|| 14-25 ||

శ్లో.  మానావమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః|

సర్వారమ్భపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే.

తే.గీ.  ఎవడు మానావమానము లెంచు సమము

శత్రుమిత్రులన్ సమముగ ధాత్రి గనుచు

సర్వకర్మలారంభముల్ చక్కగ విడి

చిమెలగు నతడు జితగుణుడు మహి పార్థ!

భావము.

మానావమానములందు సమచిత్తముతోనుండి, శత్రుమిత్రులందు సముడై 

సర్వ కర్మలను పరిత్యజించి ఎవడు సర్వదా చిదాకాశ దైవప్రఙ్ఞతో 

ప్రకాశించుచుండునో వాడే త్రిగుణాతీతుడని చెప్పబడుచున్నాడు.

|| 14-26 ||

శ్లో.  మాంచయోవ్యభిచారేణ భక్తియోగేన సేవతే|

స గుణాన్సమతీత్యైతాన్బ్రహ్మభూయాయ కల్పతే.

తే.గీ. భక్తితోనన్నెవడిలను పరవశించి

కొలుచు త్రిగుణంబులన్  దాను గెలుచి, బ్రహ్మ

తత్వ మెఱుఁగుచున్ బొందును ధరను నిజము,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.  

భావము.

ఎవడు అచంచలమైన భక్తియోగముతో నన్నే సేవించుచున్నాడో వాడే 

ఈ త్రిగుణములను సులభముగ నతిక్రమించి బ్రహ్మాకాశ విశ్వగర్భస్వరూపమును 

పొందుట కర్హుడగుచున్నాడు.

|| 14-27 ||

శ్లో.  బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమమృతస్యావ్యయస్య చ|

శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాన్తికస్య చ.

తే.గీ.  అవ్యయామృత, శాశ్వత, భవ్య ధర్మ

రూపము, నఖండ, సద్బ్రహ్మ రూపమునకు

నునికిపట్టు నేనర్జునా! కనుము మదిని,

నీవు గ్రహియింపుమియ్యది నేర్పు మీర.

భావము.

అవ్యయమైన, అమృతమైన, శాశ్వతమైన, ధర్మ స్వరూపమైన, అఖండానంద 

స్వరూపమైన బ్రహ్మస్వరూపమునకు ఉనికిపట్టుగ మూలాధారముగ నున్నది 

నేనే కదా.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

గుణత్రయవిభాగయోగో నామ చతుర్దశోऽధ్యాయః


అథ పఞ్చదశోధ్యాయః - పురుషోత్తమయోగః

శ్రీభగవానువాచ|.

భావము.

శ్రీ భగవానుడన్నాడు:

|| 15-1 ||

శ్లో.  ఊర్ధ్వమూల మధఃశాఖ మశ్వత్థం ప్రాహురవ్యయమ్|

ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్.

తే.గీ.  మొదలు పైకి, శాఖలుక్రిందికిఁ దనరునని

యందురశ్వత్థమును ఘనులరసిచూడ

నాకులే ఛందములు, దీని నరయువారు

వేదవిదులర్జునా, కాంచు ప్రీతితోడ.

భావము.

మొదలు పైకి, శాఖలు క్రిందకి ఉన్న అశ్వత్థమును అవ్యయమైనదని పె

ద్దలు చెప్పుదురు. దాని ఆకులు ఛందస్సులు. దీనిని ఎఱిఁగినవాడు వేదాలను 

ఎఱిఁగినట్లే.

|| 15-2 ||

శ్లో.  అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా

గుణప్రవృద్ధా విషయప్రవాలాః|

అధశ్చ మూలాన్యనుసన్తతాని

కర్మానుబన్ధీని మనుష్యలోకే.

తే.గీ.  క్రిందికిన్ బైకిఁ బెరుగుచు బంధనములు

భూమిపై పెంచు, నీశాఖ లేమనందు,

మాయలోముంచి మనలను మదనపరచు,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.  

భావము.

దానికొమ్మలు క్రిందికి పైకి విస్తరించుకొని ఉన్నవి. గుణాలచే పెరుగునవి. 

విషయ వస్తువులనే చిగుళ్ళు కలవి. కర్మలలో బంధించును. దాని వేళ్ళు క్రింద 

బాగా పాతుకొని మనుష్య లోకము అంతా వ్యాపించి కర్మలతో బంధించును.

|| 15-3 ||

శ్లో.  న రూపమస్యేహ తథోపలభ్యతే

నాన్తో న చాదిర్న చ సమ్ప్రతిష్ఠా|

అశ్వత్థమేనం సువిరూఢమూలం

అసఙ్గశస్త్రేణ దృఢేన ఛిత్త్వా.

తే.గీ.  దాని రూపముండదటుల తలచిచూడ,

దాని తుదిమొదల్ కనరావు, దాని నిల న

సంగభావంబుతో చెండి,  పొంగదగును.

నీవు గ్రహియింపుమర్జనా! నేర్పుమీర.

భావము.

దాని రూపము ఆ ప్రకారము(తల క్రింద ఉండే చెట్టులా)ఇక్కడ కనిపించదు. 

దాని మొదలూ, తుదీ, ఆధారము ఏవీ కనిపించదు. గట్టిగా పాతుకు పోయిన 

ఈ అశ్వత్థానిని దృఢమైన అసంగ భావమనే ఆయుధంతో ఛేధించి,

|| 15-4 ||

శ్లో.  తతః పదం తత్పరిమార్గితవ్యం

యస్మిన్గతా న నివర్తన్తి భూయః|

తమేవ చాద్యం పురుషం ప్రపద్యే|

యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ.

తే.గీ.  ఎక్కడికి పోవ నిక రారొ యెఱిగి వెతుక

వలయు, సృష్టి యెవరినుండి వరలు నతని

నాదిపురుషుని శరణంబు ననుపమగతి

వేడుదును నేను ముక్తికై వేల్పతండె.

భావము.

ఆ తరవాత ఎక్కడికి పోతే మరలా తిరిగి రారో ఆ స్థానమును వెదకవలెను. ఎవరినుండి 

ఈ పురాతన సృష్టి కార్యము ప్రారంభము ఐనదో , ఆ ఆది పురుషునే 

నేను శరణు వేడుదును

|| 15-5 ||

శ్లో.  నిర్మానమోహా జితసఙ్గదోషా

అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః|

ద్వన్ద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైర్-

గచ్ఛన్త్యమూఢాః పదమవ్యయం తత్.

తే.గీ.  దూర మానమోహు లసంగులారయాత్మ

విజ్ఞులు నవాంఛులున్ ప్రీతిఁ గనుదు

రవ్యయానందమున్ మూఢరహితులగుచు

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.

భావము.

మానవ మోహాన్ని త్యజించిన వారు, సంగదోషాన్ని జయించిన వారు, 

సదా ఆత్మ జ్ఞానంలో నిమగ్నమైన వారు, విషయ వాంఛలన్నీ వెనుకకు 

మరలించిన వారు, సుఖ దుఃఖాలనే ద్వంద్వాలనుండి విముక్తులైన వారు, 

మూఢత్వము పోయి అవ్యయ పదాన్ని చేరు కొందురు.

|| 15-6 ||

శ్లో.  న తద్భాసయతే సూర్యో న శశాఙ్కో న పావకః|

యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ.

తే.గీ.  ఆ పరమగు పథము నాది, యది గనినను

ముక్తులగుదురు, వెలిగింపఁ బోల రెఱుఁగ

రవి,శశియు,నగ్నియున్, మార్గమవగతమగు

నీవు గ్రహియింపఁగల్గినన్ నేర్పుమీర.

భావము.

ఆ పదాన్ని సూర్యుడు, చంద్రుడు, అగ్ని వెలిగించరు. ఎక్కడకు వెళ్ళినచో 

తిరిగి రారో అది నా పరమ ధామము

|| 15-7 ||

శ్లో.  మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః|

మనఃషష్ఠానీన్ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి.

తే.గీ.  నా సనాతనాంశయె జీవి, యాశ గొలిపి

ప్రకృతి నుండి యాకర్షించు, భ్రమను చెంది

యింద్రియంబుల వశమయి యిలను చెలఁగు

జీవి ననుచూడఁ జాలమిన్ జేరలేడు.

భావము.

సనాతనమైన నా అంశయే జీవలోకములో జీవుడిగా మారి, ప్రకృతి నుండి 

మనస్సుతో కూడిన ఆరు ఇంద్రియాలను ఆకర్షించును.

|| 15-8 ||

శ్లో.  శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః|

గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్ధానివాశయాత్.

తే.గీ. దేహమీశుండు పొందినన్, దేహమువిడి

పోయినప్పుడా యింద్రియ మాయఫలము

లంది గొనిపోవుచుండు ననవరతమ్ము,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.

భావము.

ఈశ్వరుడు శరీరాన్ని పొందినప్పుడూ, విడిచినప్పుడూ వాయువు పూలలోంచి 

వాసనను తీసుకుపోయే విధముగా ఈ ఆరింటిని తీసుకొని ప్రయాణిస్తాడు.

 || 15-9 ||

శ్లో.  శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ|

అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే.

తే.గీ. ఇంద్రియమ్ములషట్కమ్మునెక్కి జీవి

విషయలోలుడై జీవించు విలువ మరచి,

ప్రకృతి ధర్మమునకు జీవి పట్టుబడును

తెలియుమిది, సత్యమును గను తెలివిగాను.

భావము.

చెవీ, ముక్కూ, కన్నూ, నాలుకా, చర్మమూ, మనస్సు వీటిని అధిష్టించి 

జీవుడు విషయాలను అనుభవిస్తాడు.

|| 15-10 ||

శ్లో.  ఉత్క్రామన్తం స్థితం వాపి భుఞ్జానం వా గుణాన్వితమ్|

విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః.

తే.గీ.  దేహముననున్న, పోయినన్ మోహమగ్న

మూఢులెన్నరు దైవమున్ పూజ్యులయిన

జ్ఞానులెన్నుదురునిజంబు, కాన, కనుము‌

సత్యపథమున నడువుము చక్కగాను.

భావము.

శరీరము నుండి నిష్క్రమించేటప్పుడు కానీ, శరీరంలో ఉన్నప్పుడు కానీ 

విమూఢులు ఈయనను చూడరు. జ్ఞానులు మాత్రమే చూస్తారు.

|| 15-11 ||

శ్లో.  యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్|

యతన్తోऽప్యకృతాత్మానో నైనం పశ్యన్త్యచేతసః.

తే.గీ.  సాధనముచేత యోగికి సాధ్యపడెడు

నాత్మలోనున్నదైవంబునరయువిధము,

జ్ఞాన హీనులకునసాధ్యమౌను కనుట

సాధనముచేయుచున్నను, సద్గుణాడ్య!

భావము.

సాధన చేసే యోగులు తమ ఆత్మలో ఉన్న భగవదంశను చూడకలరు. 

మనస్సు పరిపక్వము కాని వారు వివేకహీనులు సరైన జ్ఞానము లేనందువలన 

సాధన చేసినా చూడలేరు.

|| 15-12 ||

శ్లో.  యదాదిత్యగతం తేజో జగద్భాసయతేऽఖిలమ్|

యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్.

తే.గీ.  చంద్రసూర్యాగ్నులరయుచు జగతికిడెడి

తేజమంతయు నాదని ధీవరేణ్య!

తెలుసుకొనుమయ్య, నా శక్తి, దీప్తి, యుక్తి

తెలివిగా నీవు శ్రద్ధతో తెలుసుకొనుము.

భావము.

జగత్తు నంతటినీ వెలిగించే సూర్యునిలో, చంద్రునిలో, అగ్నిలో ఉన్న తేజస్సు 

ఏదో అది నాదని తెలుసుకో.

|| 15-13 ||

శ్లో.  గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా|

పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః.

తే.గీ.  పృథ్విలోనికి నే జొచ్చి వివిధ జీవ

కోటినే మోయుచుంటిని  మేటిగాను,

శశిగ నోషధులిచ్చుచుచక్కగాను

వృక్షవృద్ధిని చేసెడి వెన్నుఁడనయ.

భావము.

భూమిలోనికి ప్రవేశించి ప్రాణులందరిని నేను నా శక్తితో భరింతును. ఇంకను 

రసాత్మకుడైన చంద్రుడిని అయి ఓషధులన్నింటికీ పుష్టి ని ఇత్తును.

|| 15-14 ||

శ్లో.  అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః|

ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్.

తే.గీ.  నేను వైశ్వానరుండను, ప్రాణికోటి

నాశ్రయించి యా ప్రాణాదులాశ్రయించి 

నలువిధమ్ముల సేవింతు కలుగు భుక్తి,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

నేను వైశ్వానరుణ్ణి అయి ప్రాణుల శరీరాన్ని ఆశ్రయించి, ప్రాణ 

ఆపానములతో కలిసి నాలుగు రకముల అన్నమును ఆరగింతును.

|| 15-15 ||

శ్లో.  సర్వస్య చాహం హృది సన్నివిష్టో

మత్తః స్మృతిర్జ్ఞానమపోహనఞ్చ|

వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో

వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్.

తే.గీ.  జనుల మదులలోనుందును, జ్ఞానము, మరు

పు, తలపులు, జ్ఞాపకములును పొలయఁజేయు

దు, విదుడన్ వేదముల నేనె,  ప్రవిమలమతి

నరయుమర్జునానీవిది యహము విడిచి.

భావము.

ఇక నేను అందరి హృదయాలలో ప్రవేశించి ఉన్నాను. నానుండి జ్ఞానము, 

జ్ఞాపకము, మరుపూ కలుగును. అన్ని వేదముల ద్వారా తెలియఁబడవలసిన 

వాడిని నేనే, వేదాంతమును చేసిన వాడిని, వేదమును తెలుసుకునే 

వాడిని కూడా నేనే.

|| 15-16 ||

శ్లో.  ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ|

క్షరః సర్వాణి భూతాని కూటస్థోऽక్షర ఉచ్యతే.

తే.గీ.  పార్థ! క్షరుడునక్షరుడిల వరలుచుంద్రు,

కూటవర్తియక్షరుఁడెన్న, కూర్మిని గను

క్షరుడు నశియించిపోవును, ధరను నిజము.

నిరుపముండక్షరుండెన్న నిత్యముగను.

భావము.

లోకములో క్షరుడు, అక్షరుడు అనే ఇద్దరు పురుషులు ఉండిరి. అన్ని 

ప్రాణులు క్షరమైనవి. కూటస్థుడిని అక్షరుఁడంటారు.

|| 15-17 ||

శ్లో.  ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుధాహృతః|

యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః.

తే.గీ.  ఉత్తమంబైనపూరుషుండుండె నతఁడె

చూడ పరమాత్మ, యుండి తా నీడవోలె

నంతటన్ మ్రోయు జగతిని సాంతమతఁడె

కలడు, లేడన్యుఁడెఱుఁగుమా యిలను పార్థ!

భావము.

ఉత్తమ పురుషుడు వేరే ఉన్నాడు. అతనిని పరమాత్మ అందురు. నాశనము 

లేని ఆ ఈశ్వరుడు మూడు లోకాలలో ప్రవేశించి వాటిని భరించువాడు.

|| 15-18 ||

శ్లో.  యస్మాత్క్షరమతీతోహమక్షరాదపి చోత్తమః|

అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః.

తే.గీ. క్షరముకన్ననతీతుఁడక్షరముకన్న

మిన్న నేనేను కనుకనే మన్ననమున

వెలుగుదును వేదములను నేన్ సులలితముగ

నీవు గ్రహియించు నా కీర్తి నేర్పు మీర.

భావము.

నేను క్షరమునకు అతీతుడను మరియు, అక్షరుడికన్నా కూడా ఉత్తముడను కనుక 

ఈ లోకములోనూ వేదములోనూ పురుషోత్తముడిగా కీర్తింపబడితిని.

|| 15-19 ||

శ్లో.  యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్|

స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత.

తే.గీ. అట్టి పురుషోత్తమునినన్నునరయువారు

కనఁగ సర్వజ్ఞులిద్ధరన్, గనుచు నన్ను 

పొంది సేవింపుదురు నన్ను పూజ్యముగను.

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

అర్జునా! పురుషోత్తముడిని అయిన నన్ను ఈ విధముగా ఏ జ్ఞాని 

తెలుసుకొనునో, అతడు సర్వమూ తెలిసిన వాడై అన్ని విధములుగా నన్ను 

సేవించును(పొందును).

|| 15-20 ||

శ్లో.  ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ|

ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్స్యాత్కృతకృత్యశ్చ భారత.

తే.గీ. గుహ్యతమమైన శాస్త్రంబుఁ గోరి తెలిపి

యుంటి, గ్రహియించు ధన్యులే యుత్తమోత్త

ములును కృతకృత్యులిద్ధరఁ దెలియుమీవు,

చక్కనైనట్టి ముల్లోక జయముగనుము.

భావము.

భారతా! అలా గోప్యమైన ఈ శాస్తం నాచే చెప్ప బడినది. దీనిని అర్ధము 

చేసుకుంటే బుద్ధిమంతుడు కృతకృత్యుడు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే

పురుషోత్తమప్రాప్తియోగో నామ పఞ్చదశోऽధ్యాయః



షోడశోధ్యాయః 

దైవాసురసమ్పద్విభాగయోగః.

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ భగవానుడనుచున్నాడు.

శ్లో.  అభయం సత్త్వసంశుద్ధిర్జ్ఞానయోగవ్యవస్థితిః|

దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్. || 16-1 ||

తే.గీ.  సత్వసిధ్యభయంబులు జ్ఞాన యోగ

మందునిలకడ, విజితేంద్రియమును, తపసు,

యజ్ఞమును,మరి యిలను స్వాధ్యాయమొకటి

వరనిజాయితీ, దేవునిభాగ్యతతియె.

భావము.

అభయము, సత్వసుద్ధి, జ్ఞానయోగములో నిలుచుట, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, నిజాయితీ (దైవీ పురుషుడికి కలుగుతాయి)

శ్లో.  అహింసా సత్యమక్రోధస్త్యాగః శాన్తిరపైశునమ్|

దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్.  || 16-2 ||

తే.గీ.  శాంతమున్, సత్యమునహింస, చపల దూర

తయును, సిగ్గు, మృదుత్వమున్, ధరను కలుగు

టను సులక్షణములు దైవమునకుఁగలుగు

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.

భావము.

అహింస, సత్యము, కోపము లేకపోవుట, మృదుస్వభావము, సిగ్గు, చాపల్యము లేకపోవుట.

శ్లో.తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా|

భవన్తి సమ్పదం దైవీమభిజాతస్య భారత. || 16-3 ||

తే.గీ.  తేజమోర్మియు దీక్షయు, దివ్య శుచియు,

ద్రోహచింతవిదూరత, మోహదూర

తయును, ద్వేషరాగవిదూరతయును, దైవ

లక్షణములు పార్థ! గ్రహించు, లక్ష్యమరసి.

భావము.

తేజస్సు, ఓర్మి, పట్టుదల, శుచిత్వము, ద్రోహచింతన లేకపోవుట, అభిమాన రాహిత్యము. . . అర్జునా! ఇవి దైవీ సంపదతో పుట్టిన వానికి కలుగునవి.

శ్లో.  దమ్భో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ|

అజ్ఞానం చాభిజాతస్య పార్థ సమ్పదమాసురీమ్. || 16-4 ||

తే.గీ.  దంభమభిమాన క్రోధముల్, దర్పము పరు

షతయు, నజ్ఞానమాసురీ సహజలక్ష

ణములు, గ్రహియింపు మర్జునా! నయనిధాన!

దైవభావంబునన్ మెల్గ దగును మనము.

భావము.

అర్జునా! దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పరుషత్వము, అజ్ఞానము. . . ఈ లక్షణాలు అసుర సంపదతో పుట్టిన వానికి కలుగును.

శ్లో.  దైవీ సమ్పద్విమోక్షాయ నిబన్ధాయాసురీ మతా|

మా శుచః సమ్పదం దైవీమభిజాతోऽసి పాణ్డవ. || 16-5 ||

తే.గీ.  మోక్షమిచ్చు దైవీయము పూర్తిగాను,

మహిత సంసార బంధంబు మహిని యసుర

మునను గల్గును మనలకు, వినుము పార్థ!

నీవు దైవాంశజుండవే, నిజము కనుమ.

భావము.

దైవీ సంపద మోక్షానికి, అసుర సంపద సంసార బంధానికి కారణము. అర్జునా! విచారించకు, నీవు దైవీ సంపదతోనే పుట్టితివి

శ్లో.  ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్దైవ ఆసుర ఏవ చ|

దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. || 16-6 ||

తే.గీ.  దైవమాసురమన్రెండు  జీవకోటి

వరలు, దైవమున్ దెల్పితి, పరగు నసుర

విషయమరయుము తెలిపెద విపులగతిని.

యరసి వర్తింపుమా తగన్ నిరుపమాన!

భావము.

ఈ లోకంలో దైవము, అసురము అని ప్రాణుల సృష్టి రెండు రకములు. దైవసృష్టిని గురించి విస్తారముగా చెప్పబడినది. అర్జునా! అసుర సృష్టిని గూర్చివినుము.

శ్లో.  ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః|

న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. || 16-7 ||

తే.గీ.  నిజమిది ప్రవృత్తిని నివృత్తిని నసురగుణు

లెఱుఁగ, రిల శౌచమాచార మెఱుఁగబోరు,

సత్యదూరులై యుందురు సతతమిలను,

నీవు గ్రహియింపుమర్జునా!  నేర్పు మీర.

భావము.

అసుర స్వభావం కలవారు ప్రవృత్తిని కాని నివృత్తిని గాని ఎఱుఁగరు. వాళ్ళలో శౌచమూ, ఆచారమూ, సత్యమూ ఉండవు.

శ్లో.  అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్|

అపరస్పరసమ్భూతం కిమన్యత్కామహైతుకమ్. || 16-8 ||

తే.గీ.  జగతి మిథ్యని యిది సహజంబటంచు,

కామమే సృష్టిమూలమై కలిగెననుచు,

పాపపుణ్యధర్మంబులే వరలవనుచు

నసురభావులు తలచెదరనుపమముగ.

భావము.

జగత్తు మిథ్య అనీ, దానికి ధర్మా ధర్మములు ఆధారము ఉండవని, ఈశ్వరుడే లేడనీ ఈ ప్రపంచములోని ప్రాణులు స్త్రీ పురుషుల కలయిక వలననే పుట్టినదనీ వారు అందురు. అందుచేత ఈ జగత్తుకి కారణం కామమే అందురు అసుర జనులు.

శ్లో.  ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః|

ప్రభవన్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతోऽహితాః. || 16-9 ||

తే.గీ.  ఇట్టి దుర్భావపూర్ణులై కౄరగతిని

ధర్మదూరులై పాపులై ధరణిపైన

మంచినణచుచు వంచనన్ మసలుచుందు

రాసురంబున చెడుచుంద్రు ధీసమేత!

భావము.

ఈ దృష్టినే పట్టుకుని వేలాడుతూ వీళ్ళు ధర్మ భ్రష్టులై సంకుచిత బుద్ధులై, ప్రపంచానికి శత్రువులై, కౄరకర్ములై లోక నాశనము కోసము పుట్టుదురు.

శ్లో.  కామమాశ్రిత్య దుష్పూరం దమ్భమానమదాన్వితాః|

మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ప్రవర్తన్తేశుచివ్రతాః. || 16-10 ||

తే.గీ.  తృప్తిచెందనం తాశలో తేలుచుంద్రు

దంభ, మాన, మదంబులన్, దారి తప్పి 

సత్యదూరమౌ మిథ్యపై సతము మసలి

పాపవర్తులై చెడుదురు లోపమదియె.

భావము.

వాళ్ళుతృప్తి పరచడానికి వీలులేనంత కోరికలను పెట్టుకొని దంభ, మాన, 

మదాలతో నిండి, భ్రాంతి వలన అసత్యమైన వాటి వెంట అనాచారంగా ప్రవర్తింతురు.

శ్లో.  చిన్తామపరిమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితాః|

కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః. || 16-11 ||

తే.గీ.  కామభోగంబులవధిగా కలుగువారు,

జన్మకడదాక పాపులై జగతిమెలగి

నరకమును చేరుచుందురాసురగుణులిల

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

వాళ్ళు మరణించే వరకు అపరిమితములైన యోచనలలో మునిగి తేలుతూ, కామ భోగాలు తప్ప జీవితానికి వేరే లక్ష్యం లేదని నిశ్ఛయించుకున్న వారు.

శ్లో.  ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః|

ఈహన్తే కామభోగార్థమన్యాయేనార్థసఞ్చయాన్. || 16-12 ||

తే.గీ. అంతులేనట్టి యాశలనలమటింత్రు,

కామమునకును వశులయి భూమిపైన

ధనము కామాదులకునయి తగలబెట్టు

చుందుర్జునా! లేకయే ముందుచూపు.

భావము.

వాళ్ళు వందలాది ఆశా పాశాలతో కట్టుబడి, కామక్రోధాలకు వశులై తమ కామభోగానికిగాను, అన్యాయముగానైనను  సంపదలను సమకూర్చుకొనవలెనని అనుకొందురు.

శ్లో.  ఇదమద్య మయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథమ్|

ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్. .|| 16-13 ||

తే.గీ. పెరుగుచున్నట్టి కోర్కెలన్ పెచ్చురేగి

పాపముల్జేయుచుందురు భ్రష్టులగుచు,

దుష్టసంపాదనాసక్తితోడ చెడుచు

రాక్షసంబునన్ నశియింత్రు రక్ష లేక.

భావము.

ఈ రోజు ఇంత సంపద నాకు లభించినది. ఈ కోరికలని తీర్చుకొందును. ఇంత ధనము నాకు కలదు. ఇకపై ఇంకా ఇంత ధనము వచ్చును.

శ్లో.  అసౌ మయా హతః శత్రుర్హనిష్యే చాపరానపి|

ఈశ్వరోహమహం భోగీ సిద్ధోహం బలవాన్సుఖీ. || 16-14 ||

తే.గీ. శత్రువులజంపినాడను,చంపుదన్యు

లనిలనింక దైవంబేనె, యని రహింతు

రన్నియున్ నేనె యని ఖలులెన్ని గనుచు

పాపవర్తులై చెడుదురు పాండు తనయ!

భావము.

ఈ శత్రువు నాచే చంపబడెను, ఇతరులను కూడా చంపివేయుదును. నేను ఈశ్వరుఁడను, భోగిని, సిద్ధుడిని, బలవంతుడను, సుఖిని.

శ్లో.  ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా|

యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః. || 16-15 ||

తే.గీ.  నేను ధనికుడను కులీనుఁ డేనె ఘనుడ,

యజ్ఞ ముల్జేయుదున్, దానమాచరింతు

ననుచు మూర్ఖుడై పతనంబు గనునతండు

రాక్షసములక్షణంబిది, శిక్షితుఁడగు.

భావము.

నేను ధనవంతుణ్ణి, కులమున్న వాడిని, నాకు సమానులు ఎవరున్నారు?యజ్ఞము చేయుదును. దానములిత్తును, సంతోషింతును ఈ విధముగా అజ్ఞానముతో భ్రాంతిని చెందుదురు.

శ్లో.  అనేకచిత్తవిభ్రాన్తా మోహజాలసమావృతాః|

ప్రసక్తాః కామభోగేషు పతన్తి నరకేऽశుచౌ. || 16-16 ||

తే.గీ. అంతు లేని తలపులతో, భ్రాంత చిత్తు

లగుచు నజ్ఞానమున జిక్కి, యంతులేని

కామభోగాలచే నరకమునబడుచు

హేయముగ నాసురులు భువిన్ మాయఁదగులు.

భావము.

అనేక రకముల ఆలోచనలతో భ్రాంత చిత్తులై అజ్ఞానపు వలలో చిక్కుకొని, కామభోగాలలో మరులుగొని అపవిత్రమైన నరకములో పడుదురు.

శ్లో.  ఆత్మసమ్భావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః|

యజన్తే నామయజ్ఞైస్తే దమ్భేనావిధిపూర్వకమ్.  || 16-17 ||

తే.గీ.  యసురులాత్మస్తుతులు మూర్ఖు లసమదృష్టు

లరయదంబ,ధనమదాంధులనవరతము

నామమాత్రపు యజ్ఞ ముల్ భూమిజేయు

చుందు రనుపమ మూర్ఖులై మందభతులు.

భావము.

తమని తాము మెచ్చుకునే వాళ్ళు, మొండి వారు ధన మాన మదాలతో కూడుకుని, గ్రుడ్డి వారై దంభము కోసము శాస్త్ర పద్ధతిని వర్జించి నామమాత్రముగా యజ్ఞాలు చేయుదురు.

శ్లో.  అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః|

మామాత్మపరదేహేషు ప్రద్విషన్తోऽభ్యసూయకాః. || 16-18 ||

తే.గీ.  దర్ప బలముల నహమును, ధాత్రి క్రోధ

కామముల నాశ్రయించుచు, గర్వమొంది,

యంతటన్గల నన్ దిట్టు నట్టివాని

నాసురంబగు యోనుల నమర విడుతు.

భావము.

అహంకారాన్ని, బలాన్ని, దర్పాన్ని, కామ క్రోధాలను ఆశ్రయించుకొని, తమలోను, ఇతరులలోను ఉన్న నన్ను ద్వేషించే కౄరులు, దుష్టులు నరాధములను నేను నిత్యము అసురీ యోనుల్లోకి విసిరేస్తాను.

శ్లో.  తానహం ద్విషతః క్రురాన్సంసారేషు నరాధమాన్|

క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు. || 16-19 ||

తే.గీ.  నన్ను దూషించు కౄరులన్, నాదుభక్తు

ల నిల ద్వేషించునామూర్ఖులన్ గణించి

యాసురీయోనులన్ బుట్ట  నమరజేసి

శిక్షగొలుపుదు శిష్టుల రక్షణకని.

భావము.

ఇట్లు నన్ను ద్వేషించే కౄరులు, దుష్టులు, నరాధములను నిత్యమూ నేనుఅసురీ యోనుల్లోకి విసిరేస్తాను.

శ్లో.  ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని|

మామప్రాప్యైవ కౌన్తేయ తతో యాన్త్యధమాం గతిమ్. || 16-20 ||

తే.గీ. ఆసురీయోనిజుల్ నన్ను నరయ లేక

జన్మజన్మలకును నీచ జన్మలెత్తు,

పాపపంకిల జన్ములై పాపకూప

ముననె కృంగుచునుందురు వినుము పార్థ!

భావము.

అర్జునా! ఆసురీ జన్మను పొందిన మూర్ఖులు ప్రతి జన్మలోను నన్ను చేరకుండానే ఇంకా అధోగతికి పోతారు.

శ్లో.  త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః|

కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్.  || 16-21 ||

తే.గీ. ఆత్మనాశనహేతువు లరయ మూడు

కామమున్క్రోధలోభముల్, కాన నరుడు

విడువగావలె మూడిటిన్, విజ్ఞత గలి

గి, కను మర్జునా సత్యంబు ప్రకటితమవ.

భావము.

ఆత్మ నాశనానికి దారి తీసే నరక ద్వారాలు మూడు-కామం, క్రోధం, లోభం. అందుచేత ఈ మూడింటిని త్యజించవలెను.

శ్లో.  ఏతైర్విముక్తః కౌన్తేయ తమోద్వారైస్త్రిభిర్నరః|

ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాం గతిమ్. || 16-22 ||

తే.గీ.  నరకమార్గ మీ మూటిని నరుడు విడువ

శ్రేయమునుగొల్పు కర్మలే చేయుచుండు,

పరమగతిపొందునాతడు నరకము విడి

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

కౌంతేయా! నరక ద్వారాలైన ఈ కామ క్రోధ లోభాలు మూడింటి నుండి విడుదల పొందిన నరుడు, తనకు శ్రేయస్సును కలిగించే కర్మలు చేయును.దాని వలన పరమగతిని పొందును.

శ్లో.  యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః|

న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్. || 16-23 ||

తే.గీ.  కోరికలు పెచ్చి శాస్త్రమున్ దూరి దురిత

వర్తులిల కార్య విఫలులై బాధితులగు,

సుఖము, పరగతి దూరమౌచు వెతలందు

చుందురో యర్జునా! మది యందు కనుము.

భావము.

తన కోరికల కారణముగా శాస్త్రమును ఉల్లంఘించి ప్రవర్తించిన వాడు కార్యసిద్ధిని పొందడు. సుఖమును పరమగతిని కూడా పొందడు.

శ్లో.  తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ|

జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. || 16-24 ||

తే.గీ.  శాస్త్రమాధారమిచ్చట చక్కగగొని

మంచి త్రోవలో నడచిన మంచి జరుగు,

శాస్త్రమును గాంచి వర్తించ చక్కగాను

ముక్తిమార్గంబు నందుట పొసగు పార్థ!

భావము.

అందుచేత కర్తవ్యాన్ని, అకర్తవ్యాన్నినిర్ధారించుకొనుటకు శాస్త్రము ప్రమాణము. 

శాస్త్రము చెప్పిన విధిని తెలుసుకుని ఇక్కడ నీవు కర్మ చేయుట మంచిది.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

దైవాసురసమ్పద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః.


అథ సప్తదశోధ్యాయః 

శ్రద్ధాత్రయవిభాగయోగః

అర్జున ఉవాచ|

భావము.

అర్జునుడనుచున్నాడు.

శ్లో.  యే శాస్త్రవిధిముత్సృజ్య యజన్తే శ్రద్ధయాన్వితాః|

తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః. || 17-1 ||

తే.గీ. శాస్త్రమును వీడి, నిన్నె తా శ్రద్ధతోడ

కొలువ నాసేవ యేమగు కూర్మి జెపుమ

సాత్వి కమొ తామసమొ రాజసంబొ కృష్ణ! 

తెలియఁ జెప్పుమునాకీవు దివ్య తేజ!

భావము.

కృష్ణా! ఎవరైనా శాస్త్ర విధిని వదిలిపెట్టి శ్రద్ధతో ఆరాధిస్తే వాళ్ళ నిష్ట ఎటువంటిది? సాత్వికమా, రాజసికమా, తామసికమా?

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ భగవానుడనుచున్నాడు.

శ్లో.  త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా|

సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. || 17-2 ||

తే.గీ. శ్రద్ధ సత్వ రజస్తమ రమ్య తేజ

ములను మనుజుల నుండును, పుట్టినపుడె

యుండునవి నీవెఱింగిన,నొప్పిదముగ

నీవు గ్రహియింపుమర్జునా! నేర్పు మీర.

భావము.

మనుష్యుల శ్రద్ధ సాత్వికము, రాజసికము, తామసికము అని మూడు విధాలుగా ఉండును. అది స్వభావము నుండి జనించునట్టిది. వాటిని గురించి విను.

శ్లో.  సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత|

శ్రద్ధామయోయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః. || 17-3 ||

తే.గీ.  వ్యక్తియొక్క స్వభావంబుననుసరించి

శ్రద్ధయుండును మనుజులన్, శ్రద్ధ నొప్పు

నతఁడు నిరతంబు, శ్రద్ధయునతులితముగ

నొప్పునెట్టిదోవ్యక్తిత్వమొప్పునటులె.

భావము.

అర్జునా! ప్రతివారిలోను వ్యక్తి యొక్క స్వభావమును అనుసరించి అతని శ్రద్ధ ఉండును. ఈ మానవుడు శ్రద్ధా మయుడు. ఎవరి శ్రద్ధ ఎటువంటిదో వాళ్ళ వ్యక్తిత్వము అటువంటిది అగును.

శ్లో.  యజన్తే సాత్త్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసాః|

ప్రేతాన్భూతగణాంశ్చాన్యే యజన్తే తామసా జనాః. || 17-4 ||

తే.గీ.  దేవతలఁ గొల్చు సాత్వికుల్ దివ్యముగను,

రాజసికులింక యక్షులన్ రాక్షసులను,

తామసికులు భూతప్రేత తతిని గొలుచు,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

సాత్వికులు దేవతలను, రాజసికులు యక్షరాక్షసులను, తామసికులు భూత ప్రేత గణాలను ఆరాధింతురు.

శ్లో.  అశాస్త్రవిహితం ఘోరం తప్యన్తే యే తపో జనాః|

దమ్భాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః. || 17-5 ||

తే.గీ.  ప్రబల కామరాగములతో వరలుచుండి

యహముదంబంబులనుగల్గియహరహంబు,

శాస్త్రమొప్పని, చెడుగొల్పు సద్విరుద్ధ

తపము చేసెడివారుంద్రు ధరణిపైన.

భావము.

దంభాహంకారాలతో, ప్రబలమైన కామరాగాలతో కూడి శాస్త్ర విరుద్ధమైన, పీడా కరమైన తపస్సు చేసే వారూ,

శ్లో.  కర్షయన్తః శరీరస్థం భూతగ్రామమచేతసః|

మాం చైవాన్తఃశరీరస్థం తాన్విద్ధ్యాసురనిశ్చయాన్. || 17-6 ||

తే.గీ. తెలివిమాలి జీవకణాళి, తేజమయిన

నన్ను హింసింతురాసుర మున్న జనము

లసురనిశ్చయులనియెంచునట్టి వారి

కిహము పరమును చెడిపోవు, మహిత! కనుమ.

భావము.

తెలివి తక్కువగా శరీరంలోని జీవకణాలనూ, శరీరంలో ఉండేనన్ను కూడా హింసించే వాళ్ళు అసురిక నిశ్చయం కలవారని తెలుసుకో.

శ్లో.  ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః|

యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. || 17-7 ||

తే.గీ.  జనులకిష్టంబు త్రివిధభోజనములవని

తపము, యజ్ఞము,ధనమట్లె, తలచి చూడ,

భేదమరయుము వానిలో మోదమలర,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

మానవులకు మూడు విధాలైన ఆహారము ప్రియము. యజ్ఞమూ, తపస్సూ, దానమూ కూడా అటులనే ఉండును. వాటిలోని భేదమును వినుము.

శ్లో.  ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః|

రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః. || 17-8 ||

తే.గీ. ఆయువును, సత్వబలముల, ననితరముగ

సుఖము, నారోగ్యమున్, బ్రీతి, శోభఁ గలుగఁ

జేయు, రసయుక్తమౌ, స్నిగ్ధ, శ్రేయమునిడు

భోజనము కోరు సాత్వికుల్ పూర్తిగాను.

భావము.

ఆయువు సత్వగుణము, బలము, ఆరోగ్యము, సుఖము ప్రీతి వీటిని పెంచేవీ, రసముతో నిండినవీ, జిడ్డుతో నిగనిగలాడునవీ, కడుపులో చాలా కాలము ఉండునవీ, మనస్సునాకర్షించునవీ అయిన ఆహారములు సాత్వికులకు ప్రియముగా ఉండును.

శ్లో.  కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః|

ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః. || 17-9 ||

తే.గీ.  కటువు నామ్లము, లవణము, కలిగి యతిగ

పొడిగ, వేడి కారాలతో, కడకురోగ

దుఃఖమును గొల్పువాటినే ధూర్తగుణులు

రాజసికులిష్టపడుదురు రాజ! పార్థ!

భావము.

చేదూ, పులుపూ, ఉప్పూ, వేడీ, కారమూ, అన్నీ అతిగా కలిగి, పొడిపొడిగా ఉండి, దాహం పుట్టిస్తూ, దుఃఖాన్నీ, శోకాన్నీ, రోగాన్నీ కలిగించేవి రాజసికులకు ఇష్టము.

శ్లో.  యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్|

ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్. || 17-10 ||

తే.గీ.  పాసిపోయిన, రుచిచెడ్డ వాసనగల

యెంగిలైనవి తిననెంత్రు యింగితమును

పూర్తిగా వీడి తామసుల్ మూర్ఖులగుచు

నీవు గ్రహియింపుమర్జనా నేర్పు మీర. 

భావము.

వండిన తరువాత ఝాము దాటి పోయినదీ, రుచి పూర్తిగా పోయినదీ, పాసిపోయినదీ, వాసన గొట్టునదీ, ఎంగిలిదీ, అశుభ్రమైనదీ అయిన భోజనము తామసికులకు ఇష్టము.

శ్లో.  అఫలాఙ్క్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే|

యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్త్వికః. || 17-11 ||

తే.గీ.  ఫలితమాశించకయె ధర్మ మెలయ కర్మ

శాస్త్ర విహితమున్ జేయుట సాత్వికమగు

యజ్ఞ మగునర్జున! కనుమహర్నిశములు

ధర్మబద్ధతన్ వర్తింప ధరణిపైన.

భావము.

ఫలాపేక్ష లేకుండా, శాస్త్రాలలో విధింపబడిన ప్రకారంగానూ, తను ఆ కర్మ చేయడం కర్తవ్యమనే స్థిర చిత్తంతో చేయబడే యజ్ఞం సాత్విక యజ్ఞం.

శ్లో.  అభిసన్ధాయ తు ఫలం దమ్భార్థమపి చైవ యత్|

ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్. || 17-12 ||

తే.గీ.  ఫలమునాశించి చేయుట, మలిన మతిని

దంబమునకయి చేయుట తగదు యజ్ఞ

కర్మ, రాజసయజ్ఞమౌ కనగనదియు,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.

భావము.

అర్జునా! ఫలాన్ని ఆశించుచునో, డంభము కోసమో చేయబడు యజ్ఞము 

రాజసిక యజ్ఞము అని తెలుసుకో.

శ్లో.  విధిహీనమసృష్టాన్నం మన్త్రహీనమదక్షిణమ్|

శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. || 17-13 ||

తే.గీ.  శాస్త్రవిధిలేక, మంత్రముల్ శ్రద్ధ లేక,

యన్నదానంబు చేయక, మన్ననమున

దక్షిణేమాత్రమీయక,  ధాత్రిఁ జేయు

యజ్ఞ మదితామసికమను యజ్ఞమరయ.

భావము.

శాస్త్ర విధి లేకుండా అన్నదానము చేయకుండా, మంత్రములు లేకుండా, దక్షిణ ఇవ్వకుండా, శ్రద్ధ లేకుండా చేయబడే యజ్ఞము తామసిక యజ్ఞము అని చెప్పబడుతుంది.

శ్లో.  దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్|

బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. || 17-14 ||

తే.గీ.  గురుల, దేవతలన్, బ్రహ్మకులజుల నిల

పండితులఁ బూజ చేయుట, బ్రహ్మచర్య

ము, శుచి, రుజువర్తనంబును, ముక్తిదమగు

నట్టి శారీరకతపస్సు, నరయుమయ్య.

భావము.

దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, విద్వాంసులను పూజించుట, శుచిత్వము, సూటియైన ప్రవర్తన, బ్రహ్మచర్యము అహింస ఇవి శారీరక తపస్సులు.

శ్లో.  అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్|

స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే. || 17-15 ||

తే.గీ.  వాక్కులుద్వేగరహితమై, వరలుచు, ప్రియ,

సత్య, హిత యుక్తమైనట్టి చక్కనొప్పు

నట్లుపలుకుట, స్వాధ్యాయ మరసి నేర్వ,

వాచికంబగు తపమది, పార్థ! వినుమ.

భావము.

ఇతరులను బాధింపనిదీ, సత్యమూ, ప్రియమూ, హితమూ అయిన వాక్కు, స్వాధ్యాయాన్ని అభ్యసించడమూ ఇది వాచికమైన తపస్సు.

శ్లో.  మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః|

భావసంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే.  || 17-16 ||

తే.గీ.  సుప్రసన్నచిత్తముతోడ సుగుణచయము,

మౌనమును, నిగ్రహంబును, మహితభావ

శుద్ధి, మానసికతపస్సు, చూడ ఘనము.

నీవు గ్రహియింపుమర్జునా! నేర్పు మీర.

భావము.

ప్రసన్నమైన మనస్సూ, మంచితనమూ, మౌనమూ, మనోనిగ్రహమూ, శుద్ధమైన భావాలూ-ఇవి మానసిక తపస్సు.

శ్లో.  శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః|

అఫలాకాఙ్క్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే. || 17-17 ||

తే.గీ.  మూడు తపములున్ శ్రద్ధతో కూడి, లాభ

కాంక్షలేకుండి, నిగ్రహ గతిని చేయఁ

బడిన సాత్వికతపముగ వరలు పార్థ!

నీవు గ్రహియించు శ్రద్ధతో నేర్పు మీర.

భావము.

పై మూడు రకాల తపస్సు పూర్తి శ్రద్ధతో, ఏ లాభమూ కోరకుండా, నిగ్రహము చేత చేయబడినప్పుడు, సాత్వికమైన తపస్సుగా చెప్పబడును.

శ్లో.  సత్కారమానపూజార్థం తపో దమ్భేన చైవ యత్|

క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్. || 17-18 ||

తే.గీ.  సత్కృతికొ, మానమర్యాద సంస్తుతులకొ,

దంబమున తాము చేసెడి తపములరయ

రాజసికతపములిల పార్థ! తెలియుమిది.

నీకు తెలియవలయునిది నిజము తెలియ.

భావము.

సత్కారముకోసమూ, మాన మర్యాదల కోసమూ డంభముతోనూ ఏ తపస్సు చేయబడునో దానిని స్తిరత్వము లేని రాజసిక తపస్సుఅందురు.

శ్లో.  మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః|

పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్. || 17-19 ||

తే.గీ.  తనను హింసించుకొనుచు తాననవరతము

నితరులకు పీడ గొలుపుచు వెతలుగొలుపు

తపము తామసతపమగు ధరణిపైన

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

సరిగా అర్ధము చేసుకొనక, తన్ను తాను హింసించుకొనుచు, లేదా ఇతరుకలకు పీడా కరముగా చేయబడునది తామసికము అనబడును.

శ్లో.  దాతవ్యమితి యద్దానం దీయతేऽనుపకారిణే|

దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్. || 17-20 ||

తే.గీ. దేశ కాలపాత్రములుమదిని తలచుచు

ననుపకారికి దానంబు నందజేయ,

నదియె సాత్విక దానంబు ముదముగొలుపు,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

దానము చేయుట కర్తవ్యము అనెడి భావముతో, తిరిగి ఉపకారము చేయని వారికి దేశకాల పాత్రలను చూచి, చేసిన దానము సాత్వికమని చెప్పబడును.

శ్లో.  యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః|

దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్. || 17-21 ||

తే.గీ.  ప్రతిఫలార్థమో, ఫలముకో, బాధపడుచు

తాను బలవంతముగ చేయు దానమరయ

రాజసికమగు, రమణీయ రాజవదన!

నీవుగ్రహియింపుమియ్యది నేర్పు మీర.

భావము.

ప్రత్యుపకారం ఊద్దేశించిగాని, ఫలాన్ని ఆశించిగాని, బలవంతంగానూ, 

బాధపడుతూ ఇచ్చే దానిని రాజసిక దాన మందురు

శ్లో.  అదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే|

అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్. || 17-22 ||

తే.గీ.  ధర నపాత్రున, కహితమౌ సరణి, కాని

వేళ, నవమానపరచుచు, వినగరాని

విధముగాదానమును చేయ ప్రీతి గనుమ

తామసికదానమదియౌను, తలచి చూడ.

భావము.

అపాత్రునికి, తగని సమయంలో, ఇవ్వకూడని చోట, అగౌరవంతో, అవమానిస్తూ ఇచ్చేది తామసిక దానమని చెప్పబడును.

శ్లో.  ఓంతత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః|

బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. || 17-23 ||

తే.గీ. బ్రహ్మమును జూపు గుర్తులు వరలు మూడు,

కనగ నోం, తత్తు, సత్తును, కలిగె వీటి

నుండిబ్రాహ్మణుల్, వేదముల్, దండి యజ్ఞ

ములురచింపగఁబడెనయ్య పుణ్యపురుష!

భావము.

ఓం తత్ సత్ అనేవి బ్రహ్మపదార్ధాన్ని నిర్ధేశించే మూడు సంకేతాలని చెప్పబడుచున్నది, వీటితోనే పూర్వము బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు ఏర్పరుప బడినవి.

శ్లో.  తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః|

ప్రవర్తన్తే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్. || 17-24 ||

తే.గీ.  బ్రహ్మవాదులీహేతువున్ వరలు మంత్ర

ములకు ముందు నోంకారంబు పలుకుచుంద్రు, 

యజ్ఞ, దానతపములందు, విజ్ఞులగుచు,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

అందుచేత "ఓం"అంటూ బ్రహ్మవాదుల చేత శాస్త్ర విధానము ప్రకారము నిత్యమూ యజ్ఞ దాన తపః కర్మలు చేయబడుచున్నవి.

శ్లో.  తదిత్యనభిసన్ధాయ ఫలం యజ్ఞతపఃక్రియాః|

దానక్రియాశ్చ వివిధాః క్రియన్తే మోక్షకాఙ్క్షిభిః. || 17-25 ||

తే.గీ. తత్తటంచు మోక్షార్థులు చిత్తమలర

కాంక్షలను వీడి, యజ్ఞ సత్కార్యములను

తపములను చేయుచుందురు, ధర్మమరసి,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

"తత్"అంటూ మోక్షాన్ని కాక్షించే వారు ఫలం ఆశించకుండా, వివిధములైన యజ్ఞములూ, తపస్సులూ చేయుచుందురు.

శ్లో.  సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే|

ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే. || 17-26 ||

తే.గీ.  సత్యమునకు మంచికి వాడు సత్పదంబు,

మంచి కర్మలకునువాడు మంచి దెలుపు

సత్ పదంబునో యర్జునా! సత్యమిదియె

నీవుగ్రహియింమియ్యది నేర్పు మీర.

భావము.

పరమసత్యమునకు, మంచితనమునకు సూచనగా "సత్"అనే పదమును ప్రయోగింతురు. 

అర్జునా! మంచి కర్మలకు కూడా"సత్"అనే పదము ప్రయోగింప బడును.

శ్లో.  యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే|

కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. || 17-27 ||

తే.గీ.  దానముల, యజ్ఞ తపములలోననిలిచి

యుండుటయె సత్తనందురు మెండుగాను,

దీని కొరకు చేసెడికర్మ దియును సత్తు,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

యజ్ఞ దాన తపస్సులలో నిలిచి ఉండడం"సత్"అని చెప్పబడుతున్నది. దాని కోసము చేసెడి కర్మని కూడా "సత్"అనే అందురు.

శ్లో.  అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్|

అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ.  || 17-28 ||

తే.గీ.  అట్టి మహనీయ శ్రద్ధ లేనట్టి తపము,

హోమ దానముల్, క్రియలు నహో యసత్త

టంచు గ్రహియింపుమర్జునా! యెంచి చూడ

యిహపరంబులనీయవీ మహిని, నిజము.

భావము.

అర్జునా! అట్టి  శ్రద్ధలేని హోమము, దానము, తపస్సు, మరి యే క్రియ అయినా సరే అది"అసత్"అని చెప్పబడును. అట్టి కర్మ ఇహములో కానీ, పరములో కానీ ఫలము ఇవ్వదు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

శ్రద్ధాత్రయవిభాగయోగో నామ సప్తదశోऽధ్యాయః.


అథాష్టాదశోధ్యాయః - మోక్షసన్న్యాసయోగః

అర్జున ఉవాచ|

భావము.

అర్జునుడనుచున్నాడు.

శ్లో.  సంన్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్|

త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశినిషూదన. || 18-1 ||

తే.గీ. వినుహృషీకేశ! సన్యాస విషయ మెఱుఁగ

వేరువేరుగా, తెలుపుము, విదితమవగ,

నీవు తెలిపిన గ్రహియింతు నీకు మ్రొక్కి,

తెలుపుమోకృష్ణ వివరించి, తెలియ నాకు.

భావము.

ఓ హృషీకేశా! కేశి సంహారా! సన్యాసం యొక్క తత్వాన్ని వేరువేరుగాతెలుసుకోవాలని కోరుతున్నాను.

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ భగవానుడన్నాడు :

శ్లో.  కామ్యానాం కర్మణాం న్యాసం సంన్యాసం కవయో విదుః|

సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. || 18-2 ||

తే.గీ. కామ్య కర్మల త్యాగమున్ ఘనతరమగు

దివ్యసన్యాసమందురు దేవఋషులు,

కర్మఫలముల త్యాగమే ఘనతరమగు

త్యాగమండ్రు వివేకులు తలచి చూడు.

భావము.

కామ్య కర్మలని వదిలి పెట్టడం సన్యాసమని ఋషులంటారు. అన్ని కర్మల ఫలాన్ని త్యజించడం త్యాగమని వివేకులు అంటారు.

శ్లో.  త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః|

యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి చాపరే. || 18-3 ||

తే.గీ.  దోషకరమగు కర్మలన్ దొలఁగ విడువ

వలెననందురుకొందరు, పండితులిల,

యజ్ఞ దాన తపః కర్మ లజ్ఞులగుచు

విడువరాదంద్రు కొందరు విజయ! వినుమ.

భావము.

దోషం కల కర్మలని వదలాలని కొందరు పండితులంటారు. యజ్ఞ దాన తపః కర్మలని వదలరాదని కొందరు అంటారు.

శ్లో.  నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ|

త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సమ్ప్రకీర్తితః. || 18-4 ||

తే.గీ. భరతవంశజశ్రేష్ఠుఁడా! పార్థ! వినుమ

య, పురుషవ్యాఘ్రమా! వినుమయ్య! యిందు 

నాదు నిర్ణయమున్ త్యాగ మీధరిత్రి

మూడు విధములుగాఁ జెప్పఁ బొసగునయ్య.

భావము.

భరత శ్రేష్టుడా! ఈ విషయంలో నా నిర్ణయాన్ని విను. పురుష వ్యాఘ్రమా! త్యాగం మూడు విధాలని చెప్ప బడుతుంది.

శ్లో.  యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్|

యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్. || 18-5 ||

తే.గీ. యజ్ఞ దాన తపఃకర్మ లజ్ఞులగుచు

మాన కాచరింప వలయు, దాన యజ్ఞ

తపము లిల వివేకులకును, ధరను శుద్ధి

చేయుటను నీవెఱుంగుము, చిత్తమలర,

భావము.

యజ్ఞ దాన తపః కర్మలను మానరాదు. చేయవలసినదే. వివేకులను శుద్ధం చేసేది యజ్ఞ దాన తపస్సులే.

శ్లో.  ఏతాన్యపి తు కర్మాణి సఙ్గం త్యక్త్వా ఫలాని చ|

కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్. || 18-6 ||

తే.గీ.  చేయు నీకర్మలన్నిటిన్ చేయ వలయు

సంగ, ఫలితంబులను వీడి, సన్నుతమతి,

నాదు మతమిది, యుత్తమమైధరణిని

యొప్పు గ్రహియింపుమియ్యది యొప్పిదముగ.

భావము.

అర్జునా! ఈ కర్మలను కూడా సంగమును, ఫలితమును వదిలి చేయవలెనని నా నిశ్చితమైన ఉత్తమమైన అభిప్రాయము.

శ్లో.  నియతస్య తు సంన్యాసః కర్మణో నోపపద్యతే|

మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః. || 18-7 ||

తే.గీ.  నియతకర్మలు విడరాదు, నిష్టఁగలిగి

యాచరింపవలయు పార్థ! యనితరముగ

భ్రాంతితో సన్యసించిన వానినెల్ల

త్యాగ మదితామసికమౌను, తలఁచుమిదియు.

భావము.

నియత కర్మలను సన్యసించకూడదు. భ్రాంతితో వానిని సన్యసించడం తామసిక త్యాగం అనిపించుకుంటుంది.

శ్లో.  దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్త్యజేత్|

స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. || 18-8 ||

తే.గీ. దేహమునకది శ్రమయంచు, మోహమునను,

భయముతోఁ గర్మ మానినన్ ఫలము లేదు,

త్యాగమిది రాజసికమౌను, తలచి చూడ,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

శరీరానికి కష్టం కలుగుతుందనే భయముతోనూ, బాధాకరమని కర్మని వదిలినచో అది రాజసిక త్యాగము అగును. దానివలన త్యాగఫలము లభించదు.

శ్లో.  కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేऽర్జున|

సఙ్గం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్త్వికో మతః. || 18-9 ||

తే.గీ.  సంగ భావంబు ఫలకాంక్ష సరగున విడి,

కర్మ కర్తవ్యమని చేయ, ఘనతరముగ

సాత్వికత్యాగమనఁదగు, సద్విభాస! 

నీవు గ్రహియింపుమా యిది నేర్పు మీర.

భావము.

కర్తవ్య బుద్ధితో సంగభావం, ఫలాపేక్ష వదిలి నియత కర్మని చేసినపుడు అది సాత్విక త్యాగం అవుతుందని నా అభిప్రాయం.

శ్లో.  న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే|

త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః. || 18-10 ||

తే.గీ.  సత్వగుణపూర్ణ మేధావి శంకవీడి

కలుగు ప్రతికూలఫలమున కలతపడడు

నిందచేయడు దానిని నిశ్చితముగ.

నీవు గ్రహియింపుమర్జునా! నేర్పు మీర.

భావము.

సత్వగుణంతో నిండిన మేధావి సంశయ రహితుడై ప్రతికూల కర్మని ద్వేషించడు.

శ్లో.  న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః|

యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే. || 18-11 ||

తే.గీ. కర్మలను వీడుటన్నది కాయమున్న

వానికెన్న నసాధ్యమ్ము, వాఁడు కర్మ

ఫలములను వీడ త్యాగిగా వరలునవని,

నీవు గ్రహియింపుమర్జునా! నేర్పు మీర.

భావము.

దేహధారికి కర్మలన్నింటిని త్యజించడం సాధ్యం కాదు. కర్మ ఫలాన్ని త్యజించిన వాడే త్యాగి అనిపించుకొనును.

శ్లో.  అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్|

భవత్యత్యాగినాం ప్రేత్య న తు సంన్యాసినాం క్వచిత్. || 18-12 ||

తే.గీ. మంచి, చెడు,మిశ్ర ఫలములు మహిని కర్మ

లకులభించునత్యాగికిప్రకటితముగ

నంతమందున, త్యాగుల కంటవయ్య,

నీవు గ్రహియింపుమియ్యది నేర్పు మీర.

భావము.

కర్మ ఫలం దుష్టమైనవి, మంచివి, మిశ్రమమైనవి అని మూడు విధములు త్యాగులు కాని వారికి మరనణానంతరం లనభించును. అవి సన్యాసులకు ఏమాత్రమూ కూడా రాదు.

శ్లో.  పఞ్చైతాని మహాబాహో కారణాని నిబోధ మే|

సాఙ్ఖ్యే కృతాన్తే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్. || 18-13 ||

తే.గీ.  కర్మలేవైన సిద్ధింప కావలె భువి

నైదు కారణముల్, విను మర్జునుండ!

సాంఖ్యసిద్ధాంతమునుబట్టి సన్నుతముగ,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

ఓ మహానుభావా సాంఖ్య సిద్ధాంతంలో ఏ కర్మలైనా సరే సిద్ధించడానికి ఈ అయిదు కారణాలు కావాలని చెప్ప బడినవి. వాటిని గురించి వినుము.

శ్లో.  అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్|

వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పఞ్చమమ్. || 18-14 ||

తే.గీ. కన నధిష్టాన దేహంబు కర్మకర్త,

జ్ఞాన కర్మేంద్రియమ్ములు, ఘనతరమగు 

లబ్ధ ప్ర్రారబ్ధ మీ యైదు లక్ష్యగతిని

సర్వ కర్మసిద్ధికి వలెన్ సరసహృదయ!

భావము.

అధిష్టానమైన శరీరం, కర్మ చేసే వాడు, వేర్వేరు ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రారబ్ధం ఈ అయిదూ(సర్వ కర్మ సిద్ధికి కారణాలు)

శ్లో.  శరీరవాఙ్మనోభిర్యత్కర్మ ప్రారభతే నరః|

న్యాయ్యం వా విపరీతం వా పఞ్చైతే తస్య హేతవః. || 18-15 ||

తే.గీ.  త్రికరణములతోఁ చేయు మంచికి, చెడునకు,

కారణంబగు నీయైదు కనుము మదిని,

తెలియ వలయును సుజ్ఞాన తేజమొదవ

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

మంచిది కాని, చెడ్డది కాని మానవుడు మనో వాక్కాయములతో ఏ కర్మ చేసినా దానికి ఈ అయిదు కారణమగును

శ్లో.  తత్రైవం సతి కర్తారమాత్మానం కేవలం తు యః|

పశ్యత్యకృతబుద్ధిత్వాన్న స పశ్యతి దుర్మతిః. || 18-16 ||

తే.గీ.  విషయ మిటులుండ నజ్ఞాను లసలు కనరు,

తామె కర్తగా భావింత్రు ధరణిపైన,

విషయమును గనఁ జాలరు విశ్వమునను.

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

విషయం ఇలా ఉండగా, అపరిపక్వమైన బుద్ధితో కేవలం తానే కర్తననుకునే మూర్ఖుడు తెలివి తక్కువ తనం వలన సరిగా గ్రహించడు.

శ్లో.  యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే|

హత్వాऽపి స ఇమాఁల్లోకాన్న హన్తి న నిబధ్యతే. || 18-17 ||

తే.గీ. ఎవ డహంబును వీడునో, యెవని బుద్ధి

కర్మలం దగల్కుండునో, గణ్యుడయిన

యట్టివాడు లోకుల జంప, నంటనేర

దట్టి కర్మఫలంబెన్న నతనికిలను.

భావము.

ఎవరిలో అహంకారం లేదో, ఎవరి బుద్ధి కర్మలో తగుకుకొనదో, అతడు ఈ లోకులను చంపినా, చంపినవాడు కాదు. బంధనంలో చిక్కుకొనడు.

శ్లో.  జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా|

కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః. || 18-18 ||

తే.గీ. జ్ఞాత, జ్ఞానమున్ జ్ఞేయము, కర్మకెపుడు

ప్రేరణము గొల్పుచుండును,వినుము పార్థ!

యింద్రియము, కర్త, కర్మయు, నిట్టి కర్మ

నిర్వహించుచునుండును, నిజము కనుము‌.

భావము.

జ్ఞానమూ, తెలుసుకోవలసిన విషయమూ, తెలుసుకునే వాడూ, ఈ మూడూ కర్మని ప్రేరేపించేవి. ఇంద్రియం, కర్మ, కర్మ చేసినవాడు, ఈ మూడూ కర్మను నిర్వహించునవి.

శ్లో.  జ్ఞానం కర్మ చ కర్తాచ త్రిధైవ గుణభేదతః|

ప్రోచ్యతే గుణసఙ్ఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి. || 18-19 ||

తే.గీ. జ్ఞానమును, కర్మ, కర్తయు, కనగ గుణవి

భేదమునుబట్టి మూడేసి విధములనుచు,

గుణపు సంఖ్యాన వివరించె కూర్మితోడ

వినుము శ్రద్ధగా నీవిది ఘనతరముగ.

భావము.

జ్ఞానము, కర్మ, కర్త-ఈ మూడూ గుణ భేదములని బట్టి మూడేసి విధములని, గుణాలకు సంబంధించిన సౌఖ్యంలో చెప్పబడినది. అందులో ఉన్నదానిని వినుము.

శ్లో.  సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే|

అవిభక్తం విభక్తేషు తజ్జ్ఞానం విద్ధి సాత్త్వికమ్. || 18-20 ||

తే.గీ. నాశరహితమౌ సత్తు కనంగ నొకటె,

యన్ని ప్రాణుల నవిభక్తమై రహించు

ననుచు గ్రహియించుసాత్వికమనుపమముగ,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

అన్ని ప్రాణులలోనూ నాశనం లేని ఒకే సత్తు ఉన్నదనీ, భిన్నమైన వాటిలో అది అవిభక్తంగా ఉన్నదనీ గ్రహించేది సాత్విక జ్ఞానమని తెలుసుకో.

శ్లో.  పృథక్త్వేన తు యజ్జ్ఞానం నానాభావాన్పృథగ్విధాన్|

వేత్తి సర్వేషు భూతేషు తజ్జ్ఞానం విద్ధి రాజసమ్. || 18-21 ||

తే.గీ.  వేరువేరుగ కనిపించు వివిధ రూప

ములను జీవులు వేరని తలచుటదియె

రాజసికమగు జ్ఞానంబు,  రాజ తనయ!

పార్థుడా! నీవు గ్రహియించు ప్రస్ఫుటముగ.

భావము.

వేరు వేరుగ కనబడే రూపాలలో వేరువేరు జీవులు ఉన్నారని గ్రహించునది రాజసిక జ్ఞానమని తెలుసుకొనుము.

శ్లో.  యత్తు కృత్స్నవదేకస్మిన్కార్యే సక్తమహైతుకమ్|

అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్. || 18-22 ||

తే.గీ. ఒక్క వస్తువే సర్వమం చొప్పనట్టి

యుక్తికి విరుద్ధముగనెంచి, యొప్పనట్టి

విధముగా పట్టుకొనుటది విశ్వమందు

తామసికమగు జ్ఞానమ్ము, తలచు మిదియు.

భావము.

ఒక వస్తువే సర్వమూ అని, యుక్తికి విరుద్ధంగా, అసంబద్ధంగా, అల్పత్వంతో పట్టుకు కూర్చునేది తామసిక జ్ఞానమని అనబడును.

శ్లో.  నియతం సఙ్గరహితమరాగద్వేషతః కృతమ్|

అఫలప్రేప్సునా కర్మ యత్తత్సాత్త్వికముచ్యతే. || 18-23 ||

తే.గీ.  విగతసంగము, మరి ఫలాపేక్ష రహిత

ము ననురాగమునుద్వేషములకు దూర

ముగ మసలి చేయు నిత్యకర్మ గతిసాత్వి

కముగ నెఱుఁగుమీవర్జునా! కనుము నిజము.

భావము.

సంగభావం లేక, ఫలం మీద ఆశ లేక, రాగ ద్వేషాలు లేక చేసిన నిత్య కర్మ సాత్విక కర్మ.

శ్లో.  యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః|

క్రియతే బహులాయాసం తద్రాజసముదాహృతమ్. || 18-24 ||

తే.గీ.  కోరికలతోడను  దురహంకారమునను,

మిక్కుటమ్మగు శ్రమతోడ మేదినిపయి

చేయుకర్మ రాజసికంబు,  చిత్తమలర

వినుచు గ్రహియింపుమర్జునా! విశదముగను.

భావము.

కోరికతో అహంకారంతో బహు శ్రమతో చేసే కర్మ రాజసిక కర్మ.

శ్లో.  అనుబన్ధం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషమ్|

మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. || 18-25 ||

తే.గీ.  క్షయము ననుబంధమున్ హింస, శక్తిఁ గనక

మించి చేయుట మోహమున్ మించి మొదలు

పెట్టుటివి తామసికమగు, విజయ! నిజము

నీవు గ్రహియింపుమీ భువిన్ నేర్పు మీర.

భావము.  

బంధనంలో ఇరికించేది, నాశనాన్ని హింసను కలుగచేసేది శక్తి సామర్ధ్యాలు లెక్కించకుండా చేసేది, మోహంతో ఆరంభించబడినదీ అయిన కర్మ తామసిక కర్మ అని చెప్ప బడుతుంది.

శ్లో.  ముక్తసఙ్గోనహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః|

సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే. || 18-26 ||

తే.గీ.  సంగముక్తు డహము లేక సదయనొప్పి,

పట్టుదల దీక్ష నొప్పుచు బరగువాడు,

నిరతముత్సహియై, జయ! ధరనపజయ

ముల కచలచిత్తుఁడేసాత్వికుడరయంగ.

(ల-డ.లకుప్రాసయతి)

భావము.

సంగభావం నుండి ముక్తుడైన వాడు, అహంకారం లేని వాడు, పట్టుదల ఉత్సాహం ఉన్నవాడు, జయాపజయాల వలన చలించని వాడు అయిన కర్త సాత్వికుడని చెప్పబడును.

శ్లో.  రాగీ కర్మఫలప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకోऽశుచిః|

హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః. || 18-27 ||

తే.గీ.  రాగి, లోభి, ఫలాపేక్షఁ గ్రాలువాఁడు,

హింస చేసెడివాడు, మహి నశుచియును,

దుఃఖసుఖములకుఁ గలగు దుస్స్వభావి,

రాజసికుడని యెఱుఁగుము, రాజపుత్ర.

భావము.

రాగంతో కూడి ఫలం కోరుతూ, పిసినిగొట్టు తనమూ, హింసా స్వభావం కలిగి, అశుచి అయి, సుఖదుఃఖాలకు లోనయ్యే కర్త --రాజసికుడని చెప్ప బడును.

శ్లో.  అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోऽలసః|

విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. || 18-28 ||

తే.గీ.  నిగ్రహము లేని, పామరుని, మొరటును, వి

షాదపూర్ణు, సంకుచితమౌ ఖేదగుణుని,

బద్ధకస్తుని, మొండిని,  ప్రబల మోస

గానినిల కాల యాపకున్,  గాంచ తామ

సికులుగాఁ జెప్ఫనొప్పును స్థిరగుణాఢ్య!

భావము.

ఎట్టి నిగ్రహము లేని వాడు, పామరుడు, సంకుచిత స్వభావము కలవాడు, మొండివాడు, మోసగాడు బద్ధకస్తుడు, విషాదంలో ఉండి ప్రతి దానికి కాలయాపన చేసే కర్త, తామసికుడని చెప్ప బడును.

శ్లో.  బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు|

ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనఞ్జయ. || 18-29 ||

తే.గీ.  గుణములనుబట్టి మూడేసి కూడియున్న

బుద్ధి, ధృతిని,నేఁ దెలిపెదన్ బూర్తిగాను

వినుము విజయుండ! తెలివితో వీనులార,

నీవు గ్రహియింపుమియ్యది నేర్పు మీర.

భావము.

ధనంజయా! గుణాలనిబట్టి మూడేసి విధాలుగా ఉండే బుద్ధినీ, ధృతినీ గురించి వేరువేరుగా, పూర్తిగా చెబుతాను విను.

శ్లో.  ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే|

బన్ధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ. ||18-30 ||

తే.గీ.  విను ప్రవృత్తినివృత్తులు,వివరముగను,

బంధ మోక్షముల్, భువి భయాభయములనిక

కన నకార్య కార్యములను, గనుము తెలియ

తెలిపెదను పార్థ! ధీయుతా! తెలుసుకొనుము.

భావము.

అర్జునా! ప్రవృత్తి-నివృత్తులు, కార్యాకార్యాలు, భయాభయాలు, బంధ మోక్షాలు---వీటిని వివరంగా చెబుతాను విను.

శ్లో.  యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ|

అయథావత్ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ. || 18-31 ||

తే.గీ.  ధర్మమును, దురితంపు నధర్మము నిఁక

కార్యమును మరియు కడు నకార్యమునిల

సరిగ కానఁగ లేకుంట జగతిలోన

రాజసికమని దలచుము ప్రస్ఫుటముగ.

భావము.

పార్ధా! ధర్మాధర్మాలను, కార్యాకార్యాలను సరిగా నిర్ణయించ లేని బుద్ధి రాజసికమైనది.

శ్లో.  అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా|

సర్వార్థాన్విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ. || 18-32 ||

తే.గీ. కప్పబడియుండి మాయచేఁ గనగ లేక

ధర్మమని గాంచుచుండి యధర్మము నిల,

వక్రగతి చింతనముచేయు సక్రమమును 

కనగ తామసికమదియె, కనుము పార్థ!

భావము.

అజ్ఞానంతో కప్పబడి అధర్మాన్ని ధర్మంగా, అన్ని విషయాలను విపరీతంగా ఎంచే బుద్ధి తామసిక మైనది.

శ్లో.  ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేన్ద్రియక్రియాః|

యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ. || 18-33 ||

తే.గీ.  నిశ్చలంబగు యోగాన నిరుపమముగ 

మదిని, ప్రాణేంద్రియములను మలగు చేష్ట

లను జయించి నిగ్రహమున మనుట కనగ

సాత్వికంబని యననగు సన్నుతాత్మ!

భావము.

చలించని యోగములో మనస్సు, ప్రాణ, ఇంద్రియాల చేష్టలను నిగ్రహించి ఉంచే ధృతి సాత్విక మైనది.

శ్లో.  యయా తు ధర్మకామార్థాన్ధృత్యా ధారయతేऽర్జున|

ప్రసఙ్గేన ఫలాకాఙ్క్షీ ధృతిః సా పార్థ రాజసీ. || 18-34 ||

తే.గీ.  ధర్మ కామార్థముల బార్థ! ధరణిపైన

లౌకికంబగు పురుషార్థ లక్ష్యమనుచు

పట్టుదల యేది మమకార ముట్టిపడగ 

నిలుపు నది రాజసికధృతి నిజము కనుమ.

భావము.

అర్జునా! ఏ పట్టుదల ధర్మ కామార్ధాలనే లౌకిక పురుషార్ధాలని మమకారంతో, ఫలాశతో నిలబెట్టి ఉంచునో అది రాజసిక ధృతి.

శ్లో.  యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ|

న విముఞ్చతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ. || 18-35 ||

తే.గీ.  శోక, భయ, స్వప్న, ఖేదముల్, లోకమునను

మదము లను పట్టి విడువక మసలుటదియె

తామసమ్మగున్, మనకిలఁ దగనిదిదియె.

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

పార్ధా! మూర్ఖుడు ఏ ధృతితో స్వప్నములను, భయమును, శోకమును, విషాదమును, మదమును విడువక పట్టుకొనునో అది తామసికము అయిన పట్టుదల.

శ్లో.  సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ|

అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాన్తం చ నిగచ్ఛతి. || 18-36 ||

తే.గీ. దేని నభ్యాస ముననొంది దివ్యమయిన 

సుఖము నరుడొందు దుఃఖంబు సోకనీయ

కట్టి మూడు సుఖమ్ముల నర్జునుండ!

నీకుఁ దెలిపెద గ్రహియించు, నేర్పుమీర.

భావము.

భరతశ్రేష్ఠుఁడా! అభ్యాసము వలన దేనిలో మానవుడు దుఃఖమును 

అంతమొనరించి సుఖపడ కలుగునో ఆ మూడు విధములైన సుఖములను 

గురించి వినుము.

శ్లో.  యత్తదగ్రే విషమివ పరిణామేऽమృతోపమమ్|

తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమాత్మబుద్ధిప్రసాదజమ్. || 18-37 ||

తే.గీ. తొలుత దుఃఖమయమ్ముగాఁ దోచి సుఖము

కడకుఁ గొల్పునో, శాంతిచే కలుగు మనకు

నట్టి సుఖము సాత్వికమగు నరయపార్థ!

నీవు గ్రహియింపుమియ్యది నేర్పు మీర.

భావము.

ఏ సుఖమైతే మొదట విషంగా తోచి, చివరకు ఏది అమృతమగునో, ఏది శాంతించిన బుద్ధి వలన లభించునో అది సాత్విక సుఖము.

శ్లో.  విషయేన్ద్రియ సంయోగాద్యత్తదగ్రేऽమృతోపమమ్|

పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్. || 18-38 ||

తే.గీ.  కనగ విషయేంద్రియంబుల కలయికవల

న మొదటమృతమ్ము, తుదికి విషముగ నగునొ

రాజసికసుఖమది పార్థ!  భూజనులకు

నీవు గ్రహియింపుమా యిది నేర్పు మీర.

భావము.  

విషయాలు ఇంద్రియాలు సంయోగం వలన మొదట అమృతప్రాయంగా ఉండి, చివరికి విషము వలె అగునది రాజసిక సుఖము.

శ్లో.  యదగ్రే చానుబన్ధే చ సుఖం మోహనమాత్మనః|

నిద్రాలస్యప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్. || 18-39 ||

తే.గీ.  నిద్దుర, మరుపు,నుండియు బద్ధకంబు 

నుండియునుబుట్టి, మరిముందు నుండివెనుక

వరకు భ్రాంతిలో పడవేయు పరమసుఖము

తామసికమని యెఱుఁగుము ధరణిపైన.

భావము.

నిద్ర, బద్ధకము, ఏమరుపాటుల నుండి జనించి ముందు నుండి చివరకు భ్రాంతిలో పడఁజేసి ఉంచెడి సుఖము తామసికము

శ్లో.  న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః|

సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్త్రిభిర్గుణైః. || 18-40 ||

తే.గీ.  ప్రాకృతంబైన గుణములై వరలుచున్న

యీ త్రిగుణములన్ విడివడి యింత వరకు

కలుగు వారలు స్వర్గాన, క్ష్మాప్రదేశ

మందునన్ లేరు, గ్రహియింపమందు నిన్ను,

భావము.

భూమిపైనగాని, స్వర్గములోని దేవతలలో కాని ప్రకృతి వలన పుట్టిన ఈ మూడు గుణముల నుండి విడిపడి ఉన్నప్రాణి ఏదీయు లేదు.

శ్లో.  బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ పరన్తప|

కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః. || 18-41 ||

తే.గీ. బ్రాహ్మణ, క్షత్రియుల, వైశ్య వర్ణ, శూద్ర, 

జాతి కర్మలు నిజ భావ జనితమయిన

లక్షణములనుబట్టియే లక్ష్యముగను

భువిని విభజింపబడె పార్థ! పూర్తిగాను.

భావము.

పరంతపా! బ్రాహ్మణ , క్షత్రియ, వైశ్య, శూద్రుల కర్మలు వాళ్ళ స్వభావం నుండి జనించిన లక్షణలను బట్టి విభజింప పడినాయి.

శ్లో.  శమో దమస్తపః శౌచం క్షాన్తిరార్జవమేవ చ|

జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్. || 18-42 ||

తే.గీ. శమము, దమ, తప స్సౌచముల్, క్షాంతి, యార్జ

వమును, జ్ఞాన, విజ్ఞానముల్, వరలుచుండి,

ధరణినాస్తిక్య మనునవి  తప్పక భువిఁ

గలుగు సహజంబుగా బ్రాహ్మణులకు పార్థ!

భావము.

శమము, దమము, తపస్సు, శౌచము, ఓర్మి, ఋజుత్వము, జ్ఞాన విజ్ఞానాలు, ఆస్థిక భావము---ఇవి బ్రాహ్మణులకు స్వభావ సిద్ధమైన కర్మలు.

శ్లో.  శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్|

దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్. || 18-43 ||

తే.గీ.  శౌర్యమును, తేజమున్,  ధృతి, జయపిపాస,

యుద్ధమున వెన్ను చూపని  యోధ గుణము,

దానగుణము, సమర్ధత, జ్ఞాన దీప్తి,

దైవలక్షణముల్ క్షాత్ర ధర్మములగు.

భావము.

శౌర్యం, తేజం, పట్టుదల, సమర్ధత, యుద్ధంలో వెన్ను చూపక పోవడం, దానగుణం, ఈశ్వర లక్షణం---ఇవి స్వభావ సిద్ధమైన క్షత్రియ కర్మలు.

శ్లో.  కృషిగౌరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్|

పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్. || 18-44 ||

తే.గీ.  కృషియు, గోరక్ష, వాణిజ్య, ధిషణతలిల

వైశ్య కర్మలు సహజమై వరలుచుండు,

భువికి పరిచర్య చేయుట, ముఖ్యవిధిగ

శూద్రులకుఁబుట్టుకనె గల్గు, శూరవరుడ!

భావము.

వ్యవసాయం, గోసంరక్షణ, వాణిజ్యం స్వభావ సిద్ధమైన వైశ్య కర్మలు. పరిచర్య భావంతో కూడినవి శూద్రులకు స్వభావ సిద్ధమైన కర్మలు.

శ్లో.  స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః|

స్వకర్మనిరతః సిద్ధిం యథా విన్దతి తచ్ఛృణు. || 18-45 ||

తే.గీ. మానవుడు తన కర్మ నిమగ్నుఁడగుచు,

తనదు కర్మలన్ నిరతుఁడై తనరువాఁడు

సిద్ధి పొందెడి విధమును చెప్పెద విని,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

తన తన కర్మలలోనిమగ్నుడైన మానవుడు , తన కర్మలో నిరతుడైన వాడు సిద్ధిని ఎలా పొందుతాడో చెబుతాను విను.

శ్లో.  యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్|

స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవః. || 18-46 ||

తే.గీ. జీవ సృష్టి యెవ్వనినుండి చేయబడునొ,

యెవని సృష్టిచే వ్యాపించు నవని నతని

దనదు కర్మలన్, కొలుచుచు తనరువాడు

సిద్ధి పొందునో యర్జునా! సిద్ధమిదియె.

భావము.

ఎవరి నుండి జీవులు పుట్టుకొస్తారో, ఎవరి వలన ఇది యావత్తు వ్యాపించబడి ఉన్నదో అట్టివానిని తన కర్మ చేత ఆరాధించే మానవుడు సిద్ధిని పొందును.

శ్లో.  శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్|

స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్. || 18-47 ||

తే.గీ. బాగుగాయనుష్టించెడి పరులదైన 

ధర్మ మనుసరించుట కన్న తనదు ధర్మ

మదియు హీనమైనదియగు సాదరమున

చేయుటొప్పును దోషంబు చేరబోదు.

భావము.

బాగా అనుష్టించిన పరధర్మంకన్నను, హీనమైన స్వధర్మము మేలు. స్వభావము చేత ప్రేరేపించబడిన కర్మను చేయుట వలన పాపమును పొందడు.

శ్లో.  సహజం కర్మ కౌన్తేయ సదోషమపి న త్యజేత్|

సర్వారమ్భా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. || 18-48 ||

తే.గీ.  సహజ కర్మ దోషయుతమౌన్, జక్కగాను

విడవ కాచరింప వలయు విశ్వసించి,

యగ్ని పొగతోడ మొదలగు నటులె యన్ని

కర్మలున్, మొదలగు కలిగి ఖిలము.

భావము.

కౌంతేయా! సహజమైన కర్మ దోషంతో కూడినను వదలరాదు. పొగ చేత కప్పబడిన అగ్ని లాగా అన్ని కర్మలూ దోషంతోనే మొదలౌతాయి.

శ్లో.  అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః|

నైష్కర్మ్యసిద్ధిం పరమాం సంన్యాసేనాధిగచ్ఛతి. || 18-49 ||

తే.గీ. తగులమే లేని బుద్ధితోఁ దనదు మదిని

జయ! జయించి, కోర్కెలు వీడి, సన్యసింప

కర్మ నిర్ముక్తిని గను, ప్రకాశమైన 

యుత్తమోత్తమ స్థితిపొందు నుర్విపైన.

భావము.

సర్వత్రా దేనికీ తగుల్కొనని బుద్ధితో, మనస్సును జయించి, కోరికలు వదిలి సన్యసించడం ద్వారా కర్మల నుండి విడుదల పొందే ఉత్తమోత్తమమైన స్థితిని పొందుతాడు.

శ్లో.  సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే|

సమాసేనైవ కౌన్తేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. || 18-50 ||

తే.గీ.  పుడమి నైష్కర్మ్య సిద్ధిని పొందువాడు

బ్రహ్మమును చేరు విధమును పలికెద విను,

క్లుప్తముగ, నర్జునా యిది కువలయమున,

పరమమైన జ్ఞానాభ్యాస, మరయ పార్థ!

భావము.

నైష్కర్మ్య సిద్ధిని పొందిన వాడు బ్రహ్మ పదార్ధమును ఏ విధముగా చేరుకొనునో క్లుపముగా చెప్పెదను విను. అర్జునా ఇది పరమమైన జ్ఞానాభ్యాసం.

శ్లో.  బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ|

శబ్దాదీన్విషయాంస్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. || 18-51 ||

తే.గీ.  ఒప్పుచు విశుద్ధ బుద్ధితో, నొప్పిదమగు

పట్టుదలతోడ మనసుపై పట్టు కలిగి,

వినెడి శబ్దాదులన్ విడి, విడిచి రాగ

మును, మహద్ద్వేషమును  భువి ఘనతరముగ

నుండుటొప్పునో పార్థ! నీ వుండుమటుల.!

భావము.

విశుద్ధమైన బుద్ధితో కూడుకొని, పట్టుదలతో మనస్సుని నియమించి, శబ్ధాది విషయాలని త్యజించి, రాగద్వేషాలను వదిలి,

శ్లో.  వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః|

ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. || 18-52 ||

తే.గీ.  ధరణి నేకాంతముగనుంట, తగు సుభుక్తి,

తనదు వాక్కాయకర్మలన్ దా నియంత్ర

ణమును జేయుచు, ధ్యానియై, ప్రముదభరిత

మహిత వైరాగ్యమునుపొంది మసలవలయు.

భావము.

ఏకాంత ప్రదేశంలో వసిస్తూ, ఆహారాన్ని స్వల్పంగా మాత్రమే స్వీకరిస్తూ, మనోవాక్కాయాలను నియంత్రిస్తూ, నిత్యమూ ధ్యాన యోగంలో నిమగ్నుడై వైరాగ్యంలో నిలిచి,

శ్లో.  అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్|

విముచ్య నిర్మమః శాన్తో బ్రహ్మభూయాయ కల్పతే. || 18-53 ||

తే.గీ.  అహము, బలదర్పమున్ వీడి, మహిని కామ

క్రోధమున్ బరిగ్రహబుద్ధి, కోర్కెలు విడి, 

మమత త్యజియించి, శాంతితో మసల బ్రహ్మ

రూపుఁ డగుటకర్హుఁడగును, లోప రహిత!

భావము.

అహంకారాన్ని, బల దర్పాన్ని, కామ క్రోధాలను, పరిగ్రహ బుద్ధిని వదిలి, మమకారాన్ని త్యజించి, శాంతుడై బ్రహ్మ స్వరూపుడు అగుటకు అర్హుఁడగును.

శ్లో.  బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాఙ్క్షతి|

సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్. || 18-54 ||

తే.గీ.  బ్రహ్మభూత ప్రసన్న చిద్భాసురుండు,

దేనికిన్ శోకమొందడు, దేనినిలను

కోర కందరిన్ సమముగాఁ గూర్మిఁ జూచు, 

తాను నాయందు భక్తితోఁ దనరు నెపుడు.

భావము.

బ్రహ్మ భూతుడై ప్రసన్న చిత్తుడైన వాడు దేనికీ శోకించడు. దేనినీ కోరడు. ప్రాణులందరి యందు సమభావం కలిగి నాయందు పరమ భక్తిని పొందుతాడు.

శ్లో.  భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః|

తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనన్తరమ్. || 18-55 ||

తే.గీ.  నేనెవండనో, నేనెట్టి జ్ఞాన ఖనినొ,

పూర్తి తత్వంబు నెరుగును, పూజ్యమతిని

భక్తి మార్గాన నన్ గని వరలి తాను

కడకు నన్ జేరగలుగును కనుము పార్థ!

భావము.

భక్తి ద్వారా నేనెవరినో, ఎట్టి వాడినో నా పూర్తి తత్వమును గుర్తెరుగును. నా తత్వమును గ్రహించినందు వలన తరవాత నాలోనే ప్రవేశించును.

శ్లో.  సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః|

మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్. || 18-56 ||

తే.గీ. అన్ని కర్మలన్ జేయుచు నన్ను శరణుఁ

బొంద నా యనుగ్రహమొంది పొందు తుదకు

శాశ్వతావ్యయపథమును సన్నుతముగ,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

అన్ని కర్మలను సదా చేస్తూనే, నన్ను శరణు పొందిన వాడు నా అనుగ్రహం వలన శాశ్వతమైన అవ్యయమైన పదాన్ని పొందుతాడు.

శ్లో.  చేతసా సర్వకర్మాణి మయి సంన్యస్య మత్పరః|

బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ.  || 18-57 ||

తే.గీ. కర్మలన్నాకునర్పించి ఘనతరముగ

మానసికముగ నను గమ్య మార్గమనుచు,

జ్ఞాన యోగంబునేపట్టి, మానధనుఁడ

నన్ను మదిలోన నిల్పుకో మన్ననమున.

భావము.

(అర్జునా)మానసికంగా కర్మలన్నింటినీ నాకు సమర్పించి నన్నే గమ్యముగా పెట్టుకొని జ్ఞాన యోగాన్ని ఆశ్రయించి నన్ను నీ చిత్తములో నిలుపుకో.

శ్లో.  మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి|

అథ చేత్త్వమహంకారాన్న శ్రోష్యసి వినఙ్క్ష్యసి. || 18-58 ||

తే.గీ.  మనసు నాపైన నిలిపిన మహిత! నీవు

కలుగు నాటంకముల్ వీడ గలుగుదువయ

నాదు కృప చేత నర్జునా! నన్ను వీడి

యహము పొందితో చెడుదువు మహిని నీవు.

భావము.

మనస్సు నాలో ఉంచితే నా అనుగ్రహము వలన అన్ని అడ్డంకులనూ దాటగలవు. అహంకారం వలన వినక పోయినచో నశింతువు.

శ్లో.  యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే|

మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. || 18-59 ||

తే.గీ. అహముతో యుద్ధమును జేయ ననితివేని

నీదు యత్నంబు వ్యర్థమౌ నీ స్వభావ

మదియె యుద్ధంబు చేయించు నరసి చూడ

నీవు గ్రహియింపుమియ్యది నేర్పు మీర.

భావము.

అహంకారంతో యుద్ధం చేయనని నిర్ణయించుకున్నా, నీ యీ ప్రయత్నం దండుగ అవుతుంది. నీ స్వభావమే నిన్ను యుద్ధంలో నియోగిస్తుంది.

శ్లో.  స్వభావజేన కౌన్తేయ నిబద్ధః స్వేన కర్మణా|

కర్తుం నేచ్ఛసి యన్మోహాత్కరిష్యస్యవశోపి తత్. || 18-60 ||

తే.గీ. నీవు కర్మబద్ధుడవిల నీదు భ్రాంతి

వలన చేయనన్ననుగాని, వదలకుండ

చేయుదువునీవు బవరము చేవ చూపి,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

అర్జునా! నీ స్వభావ సిద్ధమైన కర్మలకు నీవు బద్ధుడివి. భ్రాంతి వలన కర్మ చేయడానికి ఇష్ట పడకపోయినా తప్పని సరిగా చేసి తీరుతావు.

శ్లో.  ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేऽర్జున తిష్ఠతి|

భ్రామయన్సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా. || 18-61 ||

తే.గీ.  జీవకోటి మనంబులన్ దేవుడుండి,

తనదు మాయచే ద్రిప్పుచు, ఘనతరమగు

యంత్రములవోలె, నో పార్థ! యరయుమిదియు,

యరయకున్నచో నీకింక తెరవు లేదు

భావము.

అర్జునా! ఈశ్వరుడు ప్రాణులందరి హృదయాలలోను కూర్చుని, యంత్రం ఉన్న(బొమ్మల వలె)జీవులను మాయచేత త్రిప్పుతూ ఉన్నాడు.

శ్లో.  తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత|

తత్ప్రసాదాత్పరాం శాన్తిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్. || 18-62 ||

తే.గీ.  అన్ని విధములన్ బొందు మీ వతని శరణ

మతని దివ్యమైన దయచే ననితరమగు

శాంతియున్ శాశ్వతంబైన స్థానమీవు

పొంద గలుగుదు వర్జునా, పొందుమటుల.

భావము.

అన్ని విధాల ఆయన్నేశరణు పొందు. ఆయన అనుగ్రహం వలన పరమ శాంతిని శాశ్వతమైన స్థానాన్ని పొందుతావు.

శ్లో.  ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా|

విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. || 18-63 ||

తే.గీ.  అతి రహస్యమౌ జ్ఞానమునరయనీవు

చెప్పితిని నీకు గ్రహియింప గొప్పగాను,

నీవు చింతించి బాగుగా  నీకు తోచి

నట్టులన్ జేయు మర్జునా! యనుపమముగ.

భావము.

ఈ విధముగా నీకు అతి రహస్యమైన జ్ఞానం చెప్పాను. దానిని క్షున్నంగా విమర్శించి తెలుసుకొని, నీకు ఏ విధముగ ఇష్టమగునో ఆ విధముగా చేయుము.

శ్లో.  సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః|

ఇష్టోऽసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్. || 18-64 ||

తే.గీ.  సర్వ గుహ్యతమపు రహస్యంబు నీకు 

మరల చెప్పెద ప్రేమతోఁ బరమవాక్కు

వినుము మిత్రమా! శ్రద్ధగా వీనులార,

మేలు గను మీవు, నా వాక్కు మేలు గొలుపు.

భావము.

అన్నిటికన్నా ఎక్కువైన రహస్యాన్ని మళ్ళీ నాపరమ వాక్కు ద్వారా విను. నాకు చాలా ఇష్టమైన వాడివని నీ హితము కోరి చెప్పుచుంటిని.

శ్లో.  మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు|

మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. || 18-65 ||

తే.గీ.  ప్రతిన చేసి చెప్పుదు నీవు భక్తి గలిగి 

నన్ను గలుగుము నీ మదిన్ మన్ననమున,

నన్ను భక్తితోఁ గొలువుము మన్ననమున,

వందనముచేయుమా నాకు, భక్తితోడ.

భావము.

మనస్సు నాలో ఉంచు, నా భక్తుడివిఅగుము. నన్ను ఆరాధించు. నాకు నమస్కరించు. నన్నే పొందుదువు. ఇది సత్యం. నీవు నాకు ప్రియుడివి. నీకు ప్రతిజ్ఞ చేసి చెప్పుచుంటిని.

శ్లో.  సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ|

అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. || 18-66 ||

తే.గీ. సర్వధర్మముల్ విడిచి నన్ సన్నుతముగ

శరణు వేడి పొందుము పార్థ! సకలమైన 

పాపముల నుండి ముక్తిని వరలఁ జేతు,

నీకిక విచారమేలను, నిజము కనుమ.

భావము.

అన్ని ధర్మాలను పరిత్యజించి నన్ను మాత్రమే శరణు పొందుము. అన్ని పాపాలనుండి నీకు నేను మోక్షమిచ్చెదను. విచారించకు.

శ్లో.  ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన|

న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోభ్యసూయతి. || 18-67 ||

తే.గీ. తపము చేయనివానికి, ధరను భక్తి

హీనునకు, నన్ను ద్వేషించు హీనునకును

చెప్పకూడదీ జ్ఞానమున్, జేటు కలుగు,

నీవు గ్రహియింపుమా యిది నేర్పు మీర.

భావము.

ఈ జ్ఞానాన్ని తపస్సు చేయని వానికి, భక్తుడు కాని వానికి, నన్ను ద్వేషించే వానికీ , ఏ సందర్భంలోనూ చెప్ప కూడదు.

శ్లో.  య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి|

భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః. || 18-68 ||

తే.గీ.  పరమ గుహ్య మీ 

జ్ఞానమ్ము, భక్తితోడ

నాదు భక్తులకును జెప్ప మేదురముగ

నాదు భక్తిని పొంది తా నన్ను జేరు,

నిందు సందేహమేలే దనింద్య చరిత! 

భావము.

పరమ రహస్యమైన ఈ జ్ఞానాన్ని నా భక్తులకు చెప్పిన వాడు , నాలో పరమమైన భక్తిని పొంది నన్నే చేరతాడు. ఇందులో అనుమానము లేదు.

శ్లో.  న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః|

భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో భువి. || 18-69 ||

తే.గీ.  మనుజులం దట్టివాఁడేను మహితుఁడెన్న,

నాకుఁ బ్రియమట్టి పనిచేయు శ్రీకరుండె.

యింతకన్నను ఘనమని యెన్నదగిన

పనియె లేదర్జునా యిది కనుము నీవు.

భావము.

మనుష్యులందరిలో అతడికన్నను నాకు ప్రియమైన పని చేసేవారు లేరు, అతడికన్నను నాకు బాగుగా ఇష్టులూ ఉండరు.

శ్లో.  అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః|

జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టః స్యామితి మే మతిః. || 18-70 ||

తే.గీ. మనదు ధార్మిక సంవాద మహితవిషయ

మునిల జ్ఞానయజ్ఞమునను పూర్తిగాను

గొప్పగానధ్యయనమును కోరిచేయు

వారికిష్టుడ నగుదును, పార్థ! నిజము.

భావము.

ధార్మికమైన మన ఈ సంవాదాన్ని జ్ఞాన యజ్ఞంద్వారా ఎవరు అధ్యయనం చేస్తారో వారికి దాని వలన నేను ఇష్టమైనవాడిని అగుదును.

శ్లో.  శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః|

సోపి ముక్తః శుభాఁల్లోకాన్ప్రాప్నుయాత్పుణ్యకర్మణామ్. || 18-71 ||

తే.గీ.  శ్రద్ధగలవాఁ డసూయకు చాల దూర

మైనవాడీ మహద్గీత నరయ వినిన

పుణ్యులొందెడి ముక్తిని పొందు పార్థ!

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

అసూయ లేకుండా శ్రద్ధతో (ఈ గీతను)వినినప్పటికీ ఆ మానవుడు ముక్తుడై పుణ్యాత్ములకు లభించే శుభలోకాలని పొందును.

శ్లో.  కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా|

కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రణష్టస్తే ధనఞ్జయ. || 18-72 ||

తే.గీ.  నేను చెప్పిన గీతను నిశ్చయముగ

పార్థ! యేకాగ్ర చిత్తమున్ వరల వినితె,

నీకు దొలగెనే యజ్ఞాన శోక జలధి?

తెలియ జేయుమో యర్జునా! తీరుగాను.

భావము.

అర్జునా! నా ఈ మాటలను(గీత)ఏకాగ్ర చిత్తంతో విన్నావా?ధనంజయా! నీ అజ్ఞానం నశించిందా.

అర్జున ఉవాచ|

భావము.

అర్జునుడనుచుండెను.

శ్లో.  నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత|

స్థితోऽస్మి గతసన్దేహః కరిష్యే వచనం తవ. || 18-73 ||

తే.గీ.  మోహమది వీడిపోయెనో మోహనుండ!

స్మృతిలభించెను, శంకలు మతిని వీడె,

నీవు చెప్పిన విధముగా నేను బ్రీతిఁ

చేయుదును కృష్ణ! నీ కృపన్ శీఘ్రగతిని.

భావము.

అచ్యుతా! నీ అనుగ్రహం వలన నాకు మోహం నశించింది. స్మృతి లభించింది. సందేహాలు తీరాయి. నీవు చెప్పినట్లు చేస్తాను.

సఞ్జయ ఉవాచ|

భావము.

సంజయుడు ఇట్లు పలికెను

శ్లో.  ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః|

సంవాదమిమమశ్రౌషమద్భుతం రోమహర్షణమ్. || 18-74 ||

తే.గీ. ఇట్టు లర్జున కృష్ణుల హితము గూర్చు

నచ్చెరువుగొల్పు భాషణ కచ్చితముగ

వింటినిట నేను, మదిలోనఁ బ్రీతి కలిగె,

పూర్వజన్మలో కలిగిన పుణ్యఫలము.

భావము.

ఇలా వాసుదేవునికీ, మహాత్ముడైన అర్జునుడికీ మధ్య, పులకరింతలు పుట్టించే విధంగా జరిగిన అద్భుతమైన సంవాదాన్ని నేను విన్నాను.

శ్లో.  వ్యాసప్రసాదాచ్ఛ్రుతవానేతద్గుహ్యమహం పరమ్|

యోగం యోగేశ్వరాత్కృష్ణాత్సాక్షాత్కథయతః స్వయమ్. || 18-75 ||

తే.గీ.  పరమ గుహ్యమౌ యోగమున్ భక్తవత్స

లుండు కృష్ణుండు చెప్పగా మెండుకృపను

వ్యాసుని యనుగ్రహంబున భక్తితోడ

వింటి, నాదైవసత్కృపన్  వినగనయ్యె.

భావము.

పరమ రహస్యమైన ఈ యోగాన్ని, సాక్షాత్తు యోగేశ్వరుడైన కృష్ణుడే స్వయంగా చెప్పుచూ ఉండగా వ్యాస మహర్షి అనుగ్రహం వలన నేను వినగలిగితిని.

శ్లో.  రాజన్సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతమ్|

కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. || 18-76 ||

తే.గీ.  కృష్ణునకు నర్జునునకును  క్షితిని జరిగె

నద్భుత, పవిత్ర సంవాద  మనవరతము

తలచి తలచి మనంబున ధన్యునయితి,

పట్టరానంత సంతోష మిట్టె కలిగె.

భావము.

రాజా! కృష్ణార్జునుల ఈ అద్భుతమైన పవిత్రమైన సంవాదాన్ని తలచుకొని తలచుకొని 

క్షణ క్షణం ఆనందంతో పొంగిపోవుచుంటిని. 

శ్లో.  తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః|

విస్మయో మే మహాన్ రాజన్హృష్యామి చ పునః పునః. || 18-77 ||

తే.గీ. హరి మహాద్భుత రూపమహర్నిశంబు

తలచి తలచి నా మది పొంగు ధాత్రిపైన,

నమిత విస్మయమొందితి ననితరమగు

తృప్తి కలిగెను మదికిని. తెలుపజాల

భావము.

రాజా హరియొక్క ఆ అద్భుతమైన రూపాన్ని తలచుకొని తలచుకొని నాకు అమితమైన విస్మయం కలుగుతోంది. మళ్ళీమళ్ళీ ఆనందం కలుగుతుంది.

శ్లో.  యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః|

తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. || 18-78 ||

తే.గీ.  యోగి యైనట్టి కృష్ణుడున్ రాగదూర

ఘన ధనుర్ధారి పార్థుఁడు  కలిగి యుండు

నెచట, నట శ్రీలు, విజయమ్ము లెలమినొప్పి

నీతితోనొప్పుచుండును ఖ్యాతిగాను.

భావము.

యోగేశ్వరుడైన కృష్ణుడూ ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ, సంపద, గొప్పతనం, విజయం, స్థిరమైన నీతి ఉంటాయని నానిశ్చయం.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

మోక్షసంన్యాసయోగో నామ అష్టాదశోధ్యాయః


గీతా మాహాత్మ్యము

ధరోవాచ.

శ్లో. భగవాన్! పరమేశాన! భక్తిరవ్యభిచారిణీ!|

ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హేప్రభో || 1 ||

క. ప్రారబ్ధ కర్మ బద్ధుల

కే రకముగ భక్తి యబ్బు నీశ్వర! యనుచున్

చేరి ధర హరిని యడుగగ

నారాయణుఁ డిట్లు చెప్పె నమ్మిక మీరన్.

భావము.

భూదేవి విష్ణుభగవానుని గూర్చి ఇట్లు ప్రశ్నించెను. ఓ భగవానుడా! పరమేశ్వరా! ప్రభూ! ప్రారబ్ధము అనుభవించే వానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు?

శ్రీవిష్ణురువాచ:

విష్ణువు చెప్పుచున్నాఁడు.

శ్లో. ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతస్సదా |

స ముక్త స్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే || 2 ||

క. ప్రారబ్ధ కర్మ బద్ధులు

తీరికగా గీత చదివి తృప్తిగ నాపై

భారము వేసిన, కర్మలు

వారల కంటవు. విముక్తి వారికిఁ గలుగున్.

భావము.

ఓ భూదేవీ! ప్రారబ్ధము అనుభవిస్తున్ననూ ఎవరు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడై ఉండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే అంటబడక ఈ ప్రపంచమునందు సుఖముగా ఉండును.

శ్లో. మహాపాపాదిపాపాని గీతాధ్యానం కరోతి చేత్ |

క్వచిత్ స్పర్శం న కుర్వంతి నలినీదళమంభసా || 3 ||

క. గీతా ధ్యానము చేయు పు

నీతుల కఘమంట బోదు. నీరము గన తా

నేతఱిఁ దామర కంటునె?

యాతీరుగ  నిదియు. నిజము నరయుము దేవీ!

భావము.

తామరాకును నీరంటనట్లు గీతాధ్యానము చేయు వానిని మహాపాపములు కూడా కొంచమైనను అంటవు.

శ్లో. గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే

తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై || 4 ||

క. గీతా గ్రంథ మదెచ్చట,

గీతా పారాయణమెట కీర్తి ప్రదమై

భూతలమందున నుండును

నా తలమున పుణ్య తీర్థ మమరిక నుండున్.

భావము.

ఎచ్చట గీతా గ్రంధము ఉండునో మరియు ఎచ్చట గీతా పారాయణము జరుగుచుండునో అచ్చట ప్రయాగ మొదలగు సమస్త తీర్ధములు ఉండును. 

శ్లో. సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చ యే |

గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః

సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే || 5 ||

గీ. ఎచట గీతపారాయణంబెలమిఁ జరుగు

నచట దేవతల్, ఋషి వరు లఖిల యోగు

లఖిల నాగులు గోపిక లఖిల గోప

కులును నారదోద్ధవులును గొలుపు మేలు. 

భావము.

ఎచ్చట గీతాపారాయణము జరుగుచుండునో అచటికి దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపికలు, గోపాలురు నారద, ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగా సహాయమొనర్తురు. 

శ్లో. యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం |

తత్రాహం నిశ్చితం పృథ్వి నివసామి సదైవ హి || 6 ||

గీ. గీత పఠన పాఠన ములు, గీత చర్చ

యెచట శ్రవణమున్ జరుగునో యచట నేను

నిష్టతో నుండి కాతును నేర్పు మీర.

గమ్య మార్గము  చూపుదు. కనుమ! పృథ్వి!

భావము.

ఓ భూదేవీ! ఎచట గీతను గూర్చి విచారణ, పఠనము, భోధన, శ్రవణము జరుగుచుండునో అచట నేను ఎల్లప్పుడు తప్పక నివసింతును. 

శ్లో. గీతాశ్రయేహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహమ్ |

గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహమ్ || 7 ||

ఆ. గీత నాశ్రయించి క్రీడింతు సృష్టిలో.

గీతయే గృహముగ  ప్రీతి నుందు.

గీత నాశ్రయించి ఖ్యాతి ముజ్జగముల

నేలు చుంటి నేను మేలుగాను.

భావము.

నేను గీతనాశ్రయించి ఉన్నాను, గీతయే నాకు ఉత్తమగు నివాస మందిరము మరియు గీతాజ్ఞానమును ఆశ్రయించియే మూడు లోకాలను నేను పాలించుచున్నాను. 

శ్లో. గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః |

అర్ధమాత్రాక్షరా నిత్యా స్వనిర్వాచ్య పదాత్మికా || 8 ||

గీ. గీతయే నా పరమ విద్య. ఖ్యాతిఁ గనిన.

గీత బ్రహ్మస్వరూపము. కీర్తి పథము.

ప్రణవమందున నాల్గవ పాదమైన

అర్థ మాత్ర. నిత్య సుశాశ్వతానుపమము.

భావము.

గీత నాయొక్క పరమవిద్య అది బ్రహ్మస్వరూపము దీనిలో సందేహము లేదు, మరియు అది ప్రణవములో నాలగవ పాదమగు అర్ధమాత్రా స్వరూపము, నిత్యమైనది, నాశరహితమైనది, అనిర్వచనీయమైనది.

శ్లో. చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునమ్ |

వేదత్రయీ పరానందతత్త్వార్ధజ్ఞానమంజసా || 9 ||

గీ. కృష్ణుఁ డర్జునునకుఁ జెప్పె గీత  కృపను 

మూడు వేదాల సారము. మూడు లోక

ములకు నానందసుధయిది. కలుగఁజేయు

తత్వ విజ్ఞానమును తనన్ దలచినంత.

భావము.

సచ్చిదానంద స్వరూపుడగు శ్రీ కృష్ణ పరమాత్మచే స్వయముగా అర్జుననుకు ఉపదేశింప బడినది. ఇది మూడు వేదముల సారము, పరమానందమయినది, తన్నాశ్రయించిన వారికి శీఘ్రముగా తత్వజ్ఞానాన్ని కలుగచేయును. 

శ్లో. యోష్టాదశ జపేన్నిత్యం నరో నిశ్చలమానసః |

జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదమ్ || 10 ||

గీ. ప్రీతి నష్టా దశాధ్యాయి ఖ్యాతి నెఱిగి,

పఠన చేయు నా నరుఁడు తా బ్రహ్మ పథము

నొందు. సందేహమే లేదు. మంద మతియు

దీని పఠియించి మోక్షంబు తాను పొందు. 

భావము.

ఏ నరుడు నిత్యమూ గీతయందలి పద్దెనిమిది అధ్యాయములను పఠించునో అతడు జ్ఞానసిద్ధిని పొంది తద్వారా పరమ పదమును (మోక్షమును) పొందును.

శ్లో. పాఠే సమర్థస్సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ |

తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః || 11 ||

గీ. శక్తి హీనులు గీతను భక్తి తోడ

సగము చదివిన చాలును సత్ ఫలమిడు.

గంగి గోదాన ఫలమిచ్చు. గాన  చదివి

సత్ ఫలంబును గాంతురు సహృదయులిల.

భావము.

గీతని మొత్తము పఠించలేని వారు అందులో సగమైనను పఠించవలెను దీనివలన అతడికి గోదాన ఫలము వలన కలుగు పుణ్యము లభించుననుటలో సందేహము లేదు. 

శ్లో. త్రిభాగం పఠమానస్తు గంగాస్నానఫలం లభేత్ |

షడంశం జపమానస్తు సోమయాగఫలం లభేత్ || 12 ||

గీ. గీత మూడవ వంతైన ప్రీతి తోడ

చదువ స్వర్గంగ స్నాన ఫలదము. నిజము.

గీతనారవ భాగము ప్రీతిఁ జదువ

సోమ యాగ ఫలంబిచ్చు. శుభము లొసగు.

భావము.

గీతయొక్క మూడవభాగము(ఆరు అధ్యాయములు) పఠించినవానికి గంగా స్నాన ఫలము లభించును, ఆరవ భాగము(మూడు అధ్యాయములు)పఠించువారికి సోమయాగ ఫలము లభించును.  

శ్లో. ఏకాధ్యాయం తు యో నిత్యం పఠతే భక్తిసంయుతః |

రుద్రలోకమవాప్నోతి గణోభూత్వా వసేచ్చిరమ్ || 13 ||

గీ. ఒక్క అధ్యాయమైనను నిక్కముగను

గీత ప్రతిదినంబు చదువఁ బ్రీతి తోడ

రుద్ర లోకము పొంది తా రుద్ర గణము

నందు నొకఁడగు. నివసించునం దనిశము.

భావము.

ఎవడు గీతయొక్క ఒక అధ్యాయము భక్తితో పఠించునో అతడు రుద్రలోకమును పొంది రుద్ర గణములలో ఒకడుగా శాశ్వతముగా నివసించును. 

శ్లో. అధ్యాయశ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః |

స యాతి నరతాం యావన్మనుకాలం వసుంధరే! || 14 ||

గీ. నిత్య మధ్యాయ పాదము నేర్పు మీర

చదువ నుత్కృష్ట నర జన్మ చక్క నొదవు

నొక్క మన్వంతరము. కాన నొప్ప చదువు

భక్తి తోడను గీత సద్భక్తు లెల్ల.

భావము.

ఓ భూదేవీ ఎవరు గీతనందలి ఒక అధ్యాయమునందలి నాల్గవ భాగమును నిత్యమూ పఠించునో అతడు ఉత్కృష్టమైన మానవ జన్మ ఒక మన్వంతర కాలము పొందును. 

శ్లో. గీతాయాః శ్లోకదశకం సప్త పంచ చతుష్టయమ్ |

ద్వౌత్రీనేకం తదర్ధం వా శ్లోకానాం యః పఠేన్నరః || 15 ||

ఆ. గీత పదియొ, యేడొ, భ్రాతి నైదో నాల్గొ,

మూడొ, రెండొ, యొకటొ, ముచ్చట పడి

యర్థ శ్లోకమయిన నర్ధితో చదివిన

యమర సుఖములబ్బు నరసి చూడ.

భావము.

ఎవరు గీతనందలి పది శ్లోకములను కానీ, ఏడుశ్లోకములను కానీ, ఐదు శ్లోకములను కానీ, నాలుగు శ్లోకములను కానీ, మూడు శ్లోకములను కానీ, రెండు శ్లోకములను కానీ, ఒక శ్లోకమును కానీ, అర్ధ శ్లోకమును కానీ నిత్యము ఎవరు పఠింతురో, 

శ్లో. చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధ్రువమ్ |

గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్ || 16 ||

గీ. వారు చంద్రలోకమునందు వరలు నిజము

వేయి పదులవత్సరములు ప్రీతితోడ.

గీత చదువుచు మృతిఁ జెంద ఖ్యాతి నాతఁ

డుత్తమంబగు నరజన్మ నొనర పొందు.

భావము.

వారు చంద్రలోకములో పదివేల సంవత్సరములు సుఖముగా జీవించుననుటలో సందేహము లేదు మరియు గీతను పఠిస్తూ ఎవరు మరణిస్తారో అతడు ఉత్తమ మగు మానవ జన్మను పొందుట నిశ్చయము.

శ్లో. గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం |

గీతేత్యుచ్చారసంయుక్తో మ్రియమాణో గతిం లభేత్ || 17 ||

గీ. అట్టి నర జన్మ పొందిన దిట్ట మరల

గీత పఠియించి పఠియించి ఖ్యాతిగాను

మోక్షమును పొందు, గీత పూజ్యాక్షరములు

పలుకుచుండి గతించిన వచ్చు ముక్తి.

భావము.

అట్లాతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించి ఉత్తమమగు మోక్షమును పొందుననుటలో సంశయము లేదు. గీతా గీతా అనుచు ప్రాణమును వదలువాడు సద్గతిని పొందుననుటలో సందేహము లేదు.  

శ్లో. గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతోపి వా |

వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే || 18 ||

క. పాపాత్ముఁడయిన గీతను

దీపించెడి యర్థమెఱిఁగి తీరగ వలవన్

బ్రాపించు విష్ణులోకము

ప్రాపించును సుఖములచట భక్తియునొడమున్.

భావము.

మహా పాపాత్ముడైనను అతడు గీతార్ధమును తెలుసుకొనుటలో ఆసక్తుడైనచో అతడు విష్ణు లోకమును పొంది శ్రీమహా విష్ణు సన్నిధిలో ఆనందమును అనుభవించుచూ ఉండును. 

శ్లో. గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః |

జీవన్ముక్త స్స విజ్ఞేయో దేహాంతే పరమం పదమ్ || 19 |

క. గీతార్థ నిరత చింతన

ఖ్యాతిగ కల నరుఁడు కర్మ గతినున్నను వి

ఖ్యాతిగ కను పరమ పదము

నే తరి గన దేహ పతన మిది సత్యమిలన్.

భావము.

ఎవడు గీతార్ధమును నిత్యము చింతన చేయుచుండునో అతడు అనేక కర్మల నాచరించిననూ జీవన్ముక్తుడేనని చెప్పబడెను, మరియు దేహ పతనానంతరము పరమ పదమును(కైవల్యమును) పొందును. 

శ్లో. గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః |

నిర్ధూతకల్మషా లోకే గీతా యాతాః పరమం పదమ్ || 20 ||

క. జనకాదులుముక్తిని గని

రనితరమగు గీతనరసి రమలిన మతులన్

జనియించిన నరులు పునర్

జననము గన రరయ గీత. సత్యంబిదియే.

భావము.

ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాది రాజులు అనేకులు పాపరహితులై ముక్తిని పొందియున్నారు.

శ్లో. గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ |

వృథాపాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః || 21 ||

క. గీతా పఠన మహత్వము

నేతరి చదువకను గీత నెంత చదివినన్

ఖ్యాతిని గొలుపదు. సరికద

యాతని శ్రమ వ్యర్ధమిలను. హరినుత భక్తా!

భావము.

గీతని పఠించి పిదప మహత్యమును ఎవరు పఠించకుందురో అట్టి వారి గీతా పఠనము వ్యర్ధమే(నిష్ఫలమే). అట్టివారి గీతాపఠనము శ్రమ మాత్రమేనని చెప్ప బడినది.

శ్లో. ఏతన్మాహాత్మ్యసంయుక్తం గీతాభ్యాసం కరోతి యః |

స తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్ || 22 ||

క. గీతా మాహాత్మ్యముతో 

గీతను పఠియించువాఁడు కీర్తిదమగు వి

ఖ్యాతమగు ఫలములు గని పు

నీతంబగు పరమునొందు నిరుపమగతితోన్.

భావము.

గీతా మహత్యముతో గీతా పారాయణము చేయువారు పైన చెప్పబడిన ఫలములను పొంది, దుర్లభమగు సద్గతిని పొందుతురు.

సూత ఉవాచ:

భావము.

సూతుడు చెప్పెను.

శ్లో. మాహాత్మ్యమేతద్గీతాయా మయా ప్రోక్తం సనాతనమ్ |

గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్ || 23 ||

క. ఋషులారా! గీతను గొని

యసమానపు గీత మహిమ నరసి చదివినన్

ప్రసరిత సత్ ఫలమహిమ

న్నసదృశ శుభతతియుఁ గలుగునని సూతుఁడనెన్.

భావము.

శౌనకాది ఋషులారా! ఈ ప్రకారముగా సనాతనమైన గీతా మహత్యమును మీకు తెలుపుచున్నాను. దీనిని గీతా పారాయణానంతరము ఎవరు పఠింతురో అతడు పైన చెప్పిన ఫలమును పొందును.

ఓం ఇతి శ్రీవరాహపురాణే గీతామాహాత్మ్యం సంపూర్ణమ్.

ఇట్లు వరాహ పురాణమునందలి గీతామాహాత్మ్యము సమాప్తము. 



గద్య.

శ్రీమదాంధ్రప్రదేశమున విశాఖపట్టణము జిల్లా సర్వసిద్ధి గ్రామస్తులయిన పూజ్య కాణ్వ శాఖోద్భవ శ్రీ చింతా వంశ సంభవ జానకీ రామ మూర్తి దంపతుల పౌత్రుఁడను, వేంకట రత్నం సన్యాసిరామారావు పుణ్య దంపతుల పుత్రుఁడను శ్రీమాన్ కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యమహోదయుల శిష్యుండను చిత్రకవితా సమ్రాట్ బిరుదాంకితుఁడను రామ కృష్ణా రావు నామధేయుండను అగు నాచేత శ్రీ చాంద్రమాన శుభకృన్నామ సంవత్సరములో ఆ పరమేశ్వరానుగ్రహముచే 

విరచింపఁబడి 

నా పూజ్య జననీజనకులకు హృదయపూర్వకముగా అంకితము గావింపఁబడిన 

 శ్రీమద్భగవద్గీత భావసహిత పద్యానువాదము

సంపూర్ణము.

స్వస్తి. 

కృతికర్త  

చిత్రకవితాసమ్రాట్....కవికల్పభూజ....పద్యకవితాభిరామ....

చిత్రకవితా సహస్రఫణీ....పుంభావ భారతి.

చింతా రామ కృష్ణా రావు. భాషాప్రవీణ .,P.O.L.,  M.A., విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.

ఫ్లాట్ నెం. ఆ 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.

తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165

రచనలు.

  1) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.

 2) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో, 

     ప్రతీపాదమునా మూడు ప్రాసయతులతో ఒక్క రోజులో  

     వ్రాసినది.)

 3) ఆంధ్రసౌందర్యలహరి.

 4) ఆంధ్రామృతమ్,  పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో   

     అనేక స్వీయ రచనలు.

 5) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.

 6) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.

 7) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

 8) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)

 9) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.

10) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.

11) బాలభావన శతకము.

12) మూకపంచశతి పద్యానువాదము.

13) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత  

     సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.

14) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

15) రాఘవా! శతకము.

16) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

17) రుద్రమునకు తెలుగు భావము.

18) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో 

     వ్రాసినది.)

19) వసంతతిలక సూర్య శతకము.

20) విజయభావన శతకము.

21) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

22) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు. 

23) శ్రీ అవధానశతపత్రశతకము.

24) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.

25) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.

26) శ్రీచక్రబంధ మంగళాష్టకము.

27) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.

28) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.

29) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత 

      నృసింహనామాంచిత118 ఛందో గర్భ చిత్ర సీసపద్య 

      శతకము.)

30) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)

31) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.

32) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

33) శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.

34) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.

35) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. 

      (బంధచిత్రకృతి ఒకే శతకమున మూడు మకుటములతో 

       మూడు శతకములు.) 

36) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)

37) శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క 

      రోజులో వ్రాసినది.)

38) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త 

      శివశతకము.

39) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు, 

      సీతాన్వయముగా తేటగీతి పద్యముల 

      హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో సుందరోత్పల 

      నక్షత్రమాల.)

40) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)

41) సువర్ణమాలా స్తుతి. శంకరుల శ్లోకములకు పద్యానువాదము

42) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో 

       అష్టోత్తర శత పాద ఉత్పలమాలిక. 

43) శ్రీరామ పట్టాభిషేకం  

44) శాంభవీ శతకము 

//స్వస్తి//

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.