గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జూన్ 2025, బుధవారం

శ్రీ వేణు గోప (కంద గీత గర్భ చంపకోత్పల) శతకము.

జైశ్రీరామ్.

 శ్రీ వేణు గోప ( కంద గీత గర్భ చంపకోత్పల ) శతకము.

రచన:- చింతా రామ కృష్ణా రావు.

కృష్ణం వందే జగద్గురుమ్.

పండితాభిప్రాయములు.

RS Rao Nemani <nrsrao@gmail.com>

Ayya ! Namaste! ubhayakushalopari. 

I have started reading your poems (garbha kavitvamu - Venugopaka satakamu).  Your poems are nice.  The pains you have taken are tremendous.  Attempting even one poem in garbha kavitvamu is not that easy.  You have made  the feat with more than 100 poems.  Your work is highly commendable. My congratulations and best wishes for further improvement in the field.

 I will send Adhyatma ramayanamu book to you in a few days.  May Gold bless you.

Yours sincerely - 

Nemani Ramajogi Sanyasi Rao.

2010/12/16 


శ్రీ వేణు గోప (కంద గీత గర్భ చంపకోత్పల) శతకము.

శ్రీ కృష్ణ పరమాత్మకు

అంకితము

చ :-  త్రిక పర తత్వమా ! విపుల ధీ వరదా! శుభ వేణు గోపబా

లక మణిరో !, ప్రభాంక! శుభ లక్ష్మి హృదీశ్వర ! కాంచుమయ్యరో !

త్రిక వర ! భవ్యుఁడా ! ఇదిగొ. ధీవర ! అంకిత మీకు నిద్ది. పా

వకుఁడ ! హరీ! మదిన్ వినుమ ! వర్ధిలఁ జేయుమ ! వేణు గోపకా !

క :- పర తత్వమా ! విపుల ధీ

వరదా! శుభ వేణు గోప బాలక మణిరో !

వర! భవ్యుఁడా ! ఇదిగొ. ధీ

వర! అంకిత మీకు నిద్ది. పావకుఁడ ! హరీ !

గీ :- విపుల ధీ వరదా ! శుభ వేణు గోప

క ! శుభ లక్ష్మి హృదీశ్వర ! కాంచుమయ్య !

ఇదిగొ. ధీవర ! అంకిత మీకు నిద్ది. 

వినుమ ! వర్ధిలఁ జేయుమ ! వేణు గోప !


శ్రీరస్తు                                    శుభమస్తు                            అవిఘ్నమస్తు.


శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము.

రచన :- చింతా రామ కృష్ణా రావు.


ఉ:- శ్రీ మధు సూదనా! నర హరీ! మధు కల్పక! నాద లోల! మా

     వామనుఁడా! రమా ధవుఁడ! పావన నామ! సుధా పయోధి! దే

     వా! మధురాక్షరా! సుహృది వాస! దయాపర! సూక్ష్మ రూప! స

     స్థేమ హరీ! మదిన్ వెలసి క్షేమముఁ గూర్చుమ! వేణు గోపకా!  1.

క:- మధు సూదనా! నర హరీ!  -  మధు కల్పక! నాద లోల! మా వామనుఁడా! 

    మధురాక్షరా! సుహృది వా  -  స! దయాపర! సూక్ష్మ రూప! సస్థేమ హరీ!  1.

గీ:- నర హరీ! మధు కల్పక! నాద లోల!  -  ధవుఁడ! పావన నామ! సుధా పయోధి! 

    సుహృది వాస! దయాపర! సూక్ష్మ రూప!  -  వెలసి క్షేమముఁ గూర్చుమ! వేణు గోప!  1.

చ:- భృత కల చిత్రముల్ పరగ పింగలి సూరన; భట్టు మూర్తి.  కా

     వ్యత కృతులన్; కడున్ రచన భవ్యముగా నొనరంగ చేసె. స

     మ్మతి వెలయించి రాగురుల మాన్య లసద్గతిఁ గొల్తు  భక్తి హా

     రతిని హరీ! సదా! విరియు రమ్యతఁ గొల్పగ; వేణు గోపకా!  2.

క:- కల చిత్రముల్ పరగ పిం  -  గలి సూరన; భట్టు మూర్తి.  కావ్యత కృతులన్; 

    వెలయించిరాగురుల మా - న్య లసద్గతిఁ గొల్తు  భక్తి హారతిని హరీ!  2.

గీ:- పరగ పింగలి సూరన; భట్టు మూర్తి.  -  రచన భవ్యముగా యొనరంగ చేసె. 

    గురుల మాన్య లసద్గతిఁ గొల్తు భక్తి -  విరియు రమ్యతఁ గొల్పగ; వేణు గోప!  2.

చ:- కను! సుమనోజ్ఞుడా! వెలసె కందము గీతము వృత్తమందు.నన్

    విన; గననౌన్ గదా! శతక వేలుపు వీవెర! సమ్మతించి ప్రీ

    తిని సుమనోజ్ఞమౌ రచన దీప్యముగా నిట వ్రాసితీవె ప్రా

    ర్థనలఁ హరీ! కనన్ విజయ ధామము నీ మది; వేణు గోపకా!  3.

క:- సుమనోజ్ఞుడా! వెలసె కం  -  దము గీతము వృత్తమందునన్ వినఁ; గన; నౌన్! 

    సుమనోజ్ఞమౌ రచన దీ  -  ప్యముగా నిట వ్రాసి తీవె ప్రార్థనలఁ హరీ! 3.

గీ:- వెలసె కందము గీతము వృత్తమందు.  -  శతక వేలుపు వీవెర! సమ్మతించి 

    రచన దీప్యముగా నిట వ్రాసి తీవె!  -  విజయ ధామము నీ మది వేణు గోప!  3.

చ:- బుధ వరులెన్ను నీ పరమ పూజ్య రమాశ్రిత ప్రాభవంబు. సా

    రథివగుచున్; నినున్ మదిని భ్రాంతిగ నిల్పిన మన్ననంబు; స

    ద్బుధ గురులన్ కృపన్ నడుపు బుద్ధి రహస్యము నాకొసంగితే!

    మధుర హరీ! సదా వెలయ మమ్ములఁ గాచెడి వేణు గోపకా!  4.

క:- వరులెన్ను నీ పరమ పూ  -  జ్య రమాశ్రిత ప్రాభవంబు. సారథివగుచున్. 

   గురులన్ కృపన్ నడుపు బు  -  ద్ధి రహస్యము నాకొసంగితే! మధుర హరీ! 4.

గీ:- పరమ పూజ్య రమాశ్రిత ప్రాభవంబు.  -  మదిని భ్రాంతిగ నిల్పిన మన్ననంబు.

     నడుపు బుద్ధి రహస్యము నాకొసంగి!  -  వెలయ మమ్ముల గాచెడి వేణు గోప! 4.

చ:- పలు కలుషంబులన్, పలుకు పల్కుల లోపల పాప మొల్కు, లో

    కులను గనన్ గనే, కలుష కోవిదు లెట్టుల కల్గు చుండ్రి. యం

    చిల పలు మారు నే  కొలిచి; యీ తొలి దోషము కూల్చమందుఁ దో

    యిలిడి హరీ! నినున్.  వినవ! హృద్ స్థిత! రక్షక! వేణు గోపకా! 5. 

క:- కలుషంబులన్, పలుకు ప  -  ల్కుల లోపల పాప మొల్కు, లోకులను గనన్; 

    పలు మారు నే  కొలిచి; యీ   -  తొలి దోషము కూల్చమందుఁ దోయిలిడి హరీ! 5.

గీ:- పలుకు పల్కులలోపల పాప మొల్కు,   -  కలుష కోవిదు లెట్టుల కల్గు చుండ్రి ?

    కొలిచి; యీ తొలి దోషము కూల్చమందు!   -  వినవ! హృద్ స్థిత! రక్షక! వేణు గోప! 5. 

ఉ:- నీ పద పద్మముల్, కనగ నేర దయామయ! కాంక్షతీర! ర

    క్షాపరుడా! కృపన్, సుగుణ గణ్యుడ! నిన్ మదిఁ జూడఁ జేసి, దే

   వా! పదిలమ్ముగా  నిలుపవా మది నెప్పుడు? నిత్య తేజ! మా

   ప్రాపు హరీ! సదా విజయ భావన కల్పక! వేణు గోపకా! 6.

క:- పద పద్మముల్, కనగ నే  -  ర! దయామయ! కాంక్షతీర! రక్షాపరుడా! 

    పదిలమ్ముగా  నిలుపవా   -  మది? నెప్పుడు నిత్య తేజ! మాప్రాపు హరీ! 6.

గీ:- కనగ నేర దయామయ! కాంక్షతీర!  -  సుగుణ గణ్యుడ! నిన్ మదిఁ జూడఁ జేసి,

   నిలుపవా మది? నెప్పుడు నిత్య తేజ!  -  విజయ భావన కల్పక! వేణు గోప! 6. 

ఉ:- శ్రీ గురు నామమే, వినుత  శ్రీధరు నామము విశ్వ రక్ష. ధా

    త్రీ గురుఁడే సదా కరుణఁ దీవన లిచ్చుచు కాచు చుండుఁ గా

    దే! గురుఁడే విధిన్ సుగుణ తేజ! రయంబున చొక్కి యుండు, స

    ద్యోగ! హరీ! మహా విపుల యోగ ప్రదీపక! వేణు గోపకా! 7. 

క:- గురు నామమే, వినుత  శ్రీ  -  ధరు నామము! విశ్వ రక్ష. ధాత్రీ గురుఁడే! 

    గురుఁడే విధిన్ సుగుణ తే  -  జ రయంబున చొక్కి యుండు, సద్యోగ! హరీ! 7.

గీ:- వినుత  శ్రీధరు నామము విశ్వ రక్ష. -  కరుణఁ దీవన లిచ్చుచు కాచు చుండుఁ 

   సుగుణ తేజ గణంబుల చొక్కి యుండు, -  విపుల యోగ ప్రదీపక! వేణు గోప! 7.

చ:- నను కనుమా! ప్రభూ! కృపను, నా కను పాపల తృష్ణ తీరగా

    నిను కనుచున్; సదా మదిని నీ గుణ చింతన మానకుండ కూ

    ర్మిని వినుచున్; మహా మహిత! మేదిని గావుమ! మా హరీశ ! తీ

    రున మనగన్. హరీ! విపుల రుగ్మ నివారక! వేణు గోపకా! 8 .( ఇందు నాలుగు కందములు కలవు )

క:- కనుమా! ప్రభూ! కృపను, నా  -  కను పాపల తృష్ణ తీరగా నిను కనుచున్; 

      వినుచున్; మహా మహిత! మే  -  దిని గావుమ! మా హరీశ ! తీరున మనగన్. 8.(1)

క:- వినుచున్; మహా మహిత! మే  -  దిని గావుమ! మా హరీశ! తీరున మనగన్

    కనుమా! ప్రభూ! కృపను, నా  -  కను పాపల తృష్ణ తీర గానిను కనుచున్ 8.(2)

క:- కనుచున్; సదా మదిని నీ  -  గుణ చింతన మానకుండ కూర్మిని వినుచున్; 

    మనగన్. హరీ! విపుల రు  -  గ్మ నివారక! వేణు గోపకా! నను కనుమా! 8.(3) 

క:- మనగన్. హరీ! విపుల రు  -  గ్మ నివారక! వేణు గోపకా!నను కనుమా!

      కనుచున్; సదా మదిని నీ  -  గుణ చింతన మానకుండ కూర్మిని వినుచున్. 8(4)

గీ:- కృపను, నా కను పాపల తృష్ణ తీర

    మదిని నీ గుణ చింతన మానకుండ

    మహిత! మేదిని గావుమ! మా హరీశ

    విపుల రుగ్మ నివారక! వేణు గోప!

చ:- కల కనినట్లుగా మదిని గాంచి, నిరామయ! మంద భాగ్య జీ

      వుల పగిదిన్ మదోన్ మతిని; వోఢ నినున్ గన మాలి తేను. రా 

      జిల గననైతి నిన్ ,  గనగఁ జేసి ననున్ గృపఁ గాంచుమయ్య! శ్రీ

      ఫలద! హరీ! ప్రభూ! విపుల పాప నివారక! వేణు గోపకా! 9.

క:- కనినట్లుగా మదిని గాం  -  చి, నిరామయ! మంద భాగ్య జీవుల పగిదిన్ 

    గననైతి. నిన్ గనగఁ జే  -  సి ననున్ గృపఁ గాంచుమయ్య! శ్రీఫలద! హరీ! 9.

గీ:- మదిని గాంచి, నిరామయ! మంద భాగ్య  -  మతిని; వోఢ నినున్ గన మాలి తేను.  

    గనగఁ జేసి ననున్ గృపఁ గాంచుమయ్య!  -  విపుల పాప నివారక! వేణు గోప! 9.

ఉ:- ఓ జన వంద్య! నా కవిత నొప్పు నమేయ ప్రగణ్య భావముల్

      రాజిలుగా వుతన్. సుగుణ రక్షక! సద్గణ శోభవీవ కా

      గా; జనమందునన్ సకల కారణ మీవుర! సన్నుతాత్మ! రా !

      రాజ హరీ! నినున్ పిలువ; రావది యేమిర! వేణు గోపకా! 10.

క:- జన వంద్య ! నా కవిత నొ  -  ప్పు నమేయ ప్ర గణ్య భావముల్ రాజిలుగా 

   జనమందునన్? సకల కా  -  రణ మీవుర! సన్నుతాత్మ! రా! రాజ హరీ! 10.

గీ:- కవిత నొప్పు నమేయ ప్రగణ్య భావ  -  సుగుణ రక్షక! సద్గణ శోభవీవ 

   సకల కారణ మీవుర! సన్నుతాత్మ!  -  పిలువ రావది యేమిర! వేణు గోప! 10.

చ:- ఘన రమణీ మణీ హృదయ కాంతి ముదాకృతి కృష్ణ వీవె. తృ

    ప్తి నరయగన్. సుధా మధుర ప్రేరణ నీ కృప;  మాకు దక్కెరా!

    జన సుమనోజ్వలా! పొగడఁ జాలముగా నిను. పోషకుండ! లా

    లనగ హరీ! నినున్ పిలువ లజ్జిలుటేమిర! వేణు గోపకా! 11.

క:- రమణీ మణీ హృదయ కాం  -  తి ముదాకృతి కృష్ణ వీవె. తృప్తి నరయగన్. 

    సుమనోజ్వలా! పొగడఁ జా  -  లముగా నిను పోషకుండ లాలనగ; హరీ! 11.

గీ:- హృదయ కాంతి ముదాకృతి కృష్ణ వీవె.  -  మధుర ప్రేరణ నీ కృప;  మాకు దక్కె!

      పొగడఁ జాలముగా నిను. పోషకుండ!  -  పిలువ లజ్జిలుటేమిర! వేణు గోప! 11.

చ:- భువి భవదీయులౌ పరమ పుణ్య వదాన్యుల పాద ధూళి నా

      కవిరళమై తగన్ కలుఁగ, యద్భుత మార్గ సుగమ్య సూచి యై

      యవి కవనాకృతిన్ కలిగి అయ్యవి నీ కథ గాంచఁజేయున

      య్య విన; హరీ! సదా విమల! హాయి నొసంగెడు వేణు గోపకా! 12.

క:- భవదీయులౌ పరమ పు  -  ణ్య వదాన్యుల పాద ధూళి నాకవిరళమై 

    కవనాకృతిన్ కలిగి అ  -  య్యవి నీ కథ గాంచఁజేయునయ్య; విన; హరీ! 12.

గీ:- పరమ పుణ్య వదాన్యుల పాద ధూళి   -  కలుఁగ, యద్భుత మార్గ సుగమ్య సూచి 

    కలిగి అయ్యవి నీ కథ గాంచఁజేయు!  -  విమల! హాయి నొసంగెడు వేణు గోప! 12.

చ:- సమరస భావమున్ నిగమసార! సమర్పణ; నిశ్చలాత్మ రా

    మ మననమున్; మహా మహితమౌ ఋషి తేజము; మౌన దీప్తియున్

    తమ యసమానమౌ పరమ తత్వ సురూప  విభావ నాత్మఁ పం

    చు; ముర హరీ! తగన్  విమల శోభలు నిల్పుమ! వేణు గోపకా! 13.

క:- రస భావమున్ నిగమసా  -  ర! సమర్పణ; నిశ్చలాత్మ రామ మననమున్; 

    యసమానమౌ పరమ త  -  త్వ సురూప  విభావ నాత్మఁ పంచుముర హరీ! 13.

గీ:- నిగమసార! సమర్పణ; నిశ్చలాత్మ  -  మహితమౌ ఋషి తేజము; మౌన దీప్తి

    పరమ తత్వ సురూప  విభావ నాత్మఁ  -  విమల శోభలు నిల్పుమ! వేణు గోప! 13.

చ:- సుమ సుకుమారుడా! కరుణఁ జూపి, కళాత్ముల కాంక్ష తీర్చి; పే

      రిమి  గనితే! సదా! నుత వరిష్ఠుల గొల్పు మనోజ్ఞ భావ! దై

      వమ! సకలాక్షరా!  గొలుపవా? సకలాత్ములఁ గొల్చు భక్తి; సా

      మమున హరీ! తగన్ విమల మార్గముఁ జూపెడి! వేణు గోపకా! 14.

క:- సుకుమారుడా! కరుణఁ జూ  -  పి, కళాత్ముల కాంక్ష తీర్చి; పేరిమి  గనితే! 

    సకలాక్షరా!  గొలుపవా?  -  సకలాత్ములఁ గొల్చు భక్తి; సామమున హరీ! 14.

గీ:- కరుణఁ జూపి, కళాత్ముల కాంక్ష తీర్చి;  -  నుత వరిష్ఠుల గొల్పు మనోజ్ఞ భావ!

    గొలుపవా? సకలాత్ములఁ గొల్చు భక్తి;  -  విమల మార్గముఁ జూపెడి! వేణు గోప! 14.

చ:- రమ రమణీయ సన్ మనమె రాజ్యముగా మహిమన్ వసింతు; సా

    ధ్యమయెనుగా! మహా మహుల ధన్యులఁ జేతువు. మమ్ము గావ నే

    రమ!  గమనింపగా భరమ? ప్రాణములుండగ! ప్రాణ నాథ! న్యా

    యమొకొ? హరీ! సదా  వినుతు లందు  గుణాత్మక! వేణు గోపకా! 15.

క:- రమణీయ సన్ మనమె రా  -  జ్యముగా మహిమన్ వసింతు సాధ్యమయెనుగా! 

   గమనింపగా భరమ?ప్రా  -  ణములుండగ! ప్రాణ నాథ! న్యాయమొకొ? హరీ! 15.

గీ:- మనమె రాజ్యముగా మహిమన్ వసింతు  -  మహుల ధన్యులఁ జేతువు. మమ్ము గావ 

     భరమ?ప్రాణములుండగ! ప్రాణ నాథ!  - వినుతు లందు  గుణాత్మక! వేణు గోప! 15.

ఉ:- శ్రీ మధు సూదనా! మిములఁ జేరి ధనాఢ్యులె మిన్న యౌను శ్రీ

    చే మనుటన్ సదా. మిములఁ జేరక పేదలె మిన్నకుండు. నీ

    వే మదినెంచి; నీ కరుణఁ బేద ధర న్నిను గాంచఁ జేయుతన్!

    రామహరీ! సదా వినుత రమ్య గుణాత్మక! వేణు గోపకా! 16.

క:- మధు సూదనా! మిములఁ జే  -  రి ధనాఢ్యులె మిన్న యౌను శ్రీచే మనుటన్ 

   మదినెంచి; నీ కరుణఁ బే  -  ద ధర న్నిను గాంచ జేయుతన్! రామహరీ! 16.

గీ:- మిములఁ జేరి ధనాఢ్యులె మిన్న యౌను  -  మిములఁ జేరక పేదలె మిన్నకుండు. 

   కరుణఁ బేద ధర న్నిను గాంచఁ జేయు! -  వినుత రమ్య గుణాత్మక! వేణు గోప! 16.

చ:- చదువరులెల్ల నిన్ వినుత సార రసాత్ముగ విశ్వసించురా!

     చిదనుపమాన్యుఁడా! సకల జీవుల నీయిల చక్క నేలుదే!

    బుధ ధర; నీవెగా! కృతుల పొందు రసాకృతిఁ? కీర్తనీయ తో

    చెదవు హరీ! మదిన్. వినుత చిన్మయ రూపక! వేణు గోపకా! 17.

క:- వరులెల్లరున్ వినుత సా  -  ర రసాత్ముగ విశ్వసించురా! చిదనుపమా! 

   ధర; నీవెగా! కృతుల పొం  -  దు రసాకృతిఁ? కీర్తనీయ! తోచెదవు హరీ! 17.

గీ:- వినుత సార రసాత్ముగ విశ్వసించు;  -  సకల జీవుల నీయిల చక్క నేలు

    కృతుల పొందు రసాకృతిఁ కీర్తనీయ -  వినుత చిన్మయ రూపక! వేణు గోప! 17.

చ:- వన భువనంబులన్ పరమ భాగవతోత్తమ వర్యులందగా

    నిను కొలుచున్; కృపన్ వరమునే దయనిత్తువు. భాగ్యమద్ది! దా.

    సుని; సవిధంబుగా కరుణఁ జూపవ నాపయి; కాంక్ష తీర్పవా!

    వినుత హరీ! మహా విపుల విశ్వ ప్రకల్పక! వేణు గోపకా! 18.

క:- భువనంబులన్ పరమ భా  -  గవతోత్తమ వర్యు లందగా నిను కొలుచున్;

    సవిధంబుగా కరుణఁ జూ  -  పవ నాపయి; కాంక్ష తీర్పవా! వినుత హరీ! 18.

గీ:- పరమ భాగవతోత్తమ వర్యులంద  -  వరమునే దయనిత్తువు. భాగ్యమద్ది! 

   కరుణఁ జూపవ నాపయి; కాంక్ష తీర్ప!  -  విపుల విశ్వ ప్రకల్పక! వేణు గోప! 18.

ఉ:- శ్రీ చరణంబులన్ మదిని శ్రీవరులెన్నుచు మాన్యులైరి. వా

    రే చరితుల్ గదా! పదిల రేణువదొక్కటి పావనంబుగా

    తా చరణంబులన్ తలను దాల్చి రహింతురు  ధన్యులౌచు. శ్రీ

    రాచ హరీ! దయా వినుత రమ్య గుణాత్మక! వేణు గోపకా! 19.

క:- చరణంబులన్ మదిని శ్రీ  -  వరులెన్నుచు మాన్యులైరి. వారే చరితుల్ 

   చరణంబులన్ తలను  దా  -  ల్చి రహింతురు ధన్యులౌచు. శ్రీరాచ హరీ! 19.

గీ:- మదిని శ్రీవరులెన్నుచు మాన్యులైరి.  -  పదిల రేణువదొక్కటి పావనంబు

   తలను  దాల్చి రహింతురు ధన్యులౌచు. -  వినుత రమ్య గుణాత్మక! వేణు గోప! 19.

చ:- హిమ మహిమంబునున్; కడలి హృన్మహిమంబును గాంచఁ జేసినా

     వ? మనమునన్ దయన్ శివుఁడివైన మహేశ్వర! శ్రీనివాస వై;

     రమ సహితుండవై ఉదయ రాగ హృదంతర ఓంకృతాన గా

     వు మము; హరీ! కృపన్ వెలసి; పొందగఁ జేసితె? వేణు గోపకా! 20.

క:- మహిమంబునున్; కడలి హృ  -  న్మహిమంబును గాంచఁ జేసినావ? మనమునన్ 

    సహితుండవై ఉదయ రా  -  గ హృదంతర ఓంకృతాన గావు మము; హరీ! 20.

గీ:- కడలి హృన్మహిమంబును గాంచఁ జేసి,  -  శివుఁడివైన మహేశ్వర! శ్రీనివాస

    ఉదయ రాగ హృదంతర ఓంకృతాన  -  వెలసి; పొందగఁ జేసితె? వేణు గోప! 20.

ఉ:- ఏ మది నుంటివో ! మురళినే మదిఁ జేర్చితి, ముద్దుఁ జేసి; మా    

    రేమియనన్. సదా కరుణ నేలుమ మమ్మును కాంక్షతీర గా

    నే మది నన్ గనన్; వినవు! యేమది కష్టమొ?  విశ్వ తేజ! మా

     రామ హరీ! కృపన్ వెలయ రాదొకొ? మామది. వేణు గోపకా! 21.

క:- మది నుంటివో ! మురళినే   -  మదిఁ జేర్చితి, ముద్దుఁ జేసి; మా రేమియనన్. 

    మది నన్ గనన్; వినవు! యే  -  మది కష్టమొ?  విశ్వ తేజ! మారామ హరీ! 21.

గీ:- మురళినే మదిఁ జేర్చితి, ముద్దుఁ జేసి; -  కరుణ నేలుమ మమ్మును కాంక్షతీర 

    వినవు! యేమది కష్టమొ?  విశ్వ తేజ! -  వెలయ రాదొకొ? మామది. వేణు గోప! 21.

చ:- విని, నెలవుల్ కనన్ వెడలి; వెన్నలు దొంగిలి; వేచినావు, న

     వ్వనిదెవరో? వినన్. కలికి వన్నెలు దొంగిల కాచినావు !దా

     చిన వలపుల్ గనన్. చిలిపి చిన్నెలు చూపగ చేరవేమి? నే

     వినెద! హరీ! ధరన్ వెలయు వెన్నెల రూపక! వేణు గోపకా! 22.

క:- నెలవుల్ కనన్ వెడలి; వె  -  న్నలు దొంగిలి; వేచినావు, నవ్వనిదెవరో? 

    వలపుల్ గనన్. చిలిపి చి  -  న్నెలు చూపగ చేరవేమి? నే వినెద! హరీ! 22.

గీ:- వెడలి; వెన్నలు దొంగిలి; వేచినావు, -  కలికి వన్నెలు దొంగిల కాచినావు !

    చిలిపి చిన్నెలు చూపగ చేరవేమి? -  వెలయు వెన్నెల రూపక! వేణు గోప! 22.

చ:- తల పొలమున్ సదా విరుల తావుల లోపలి వింతఁ వౌదువో!

     వలపులలోపలన్. సరస భావుల పల్లవ షట్కమౌదువో !

     పలు నెలవుల్ గనన్ శుభ విభావుల పాలిటి శోభవౌదువో!

     పలుకు హరీ! సదా విజయ భావన గొల్పెడి వేణు గోపకా! 23.

క:- పొలమున్ సదా విరుల తా  -  వుల లోపలి వింతఁ వౌదువో!వలపులలో 

    నెలవుల్ గనన్ శుభ విభా  -  వుల పాలిటి శోభవౌదువో! పలుకు హరీ! 23.

గీ:- విరుల తావుల లోపలి వింతఁ వౌదు.!  -  సరస భావుల పల్లవ షట్కమౌదు !

    శుభ విభావుల పాలిటి శోభవౌదు!  -  విజయ భావన గొల్పెడి వేణు గోప! 23.

ఉ:- శ్రీ వచనామృతా!  సకల జీవ, చ రాచర సంస్థితుండ వై

     తావకమైనదై ప్రకటితంబయి కన్బడు ప్రాణనాథ! దే

     వా! వచియింపనౌ నిఖిల భావ చయంబును నీవె యౌదువా?

     దేవ! హరీ! ననున్ వెలయు తీరున కావుమ!వేణు గోపకా! 24.

క:- వచనామృతా!  సకల జీ  -  వ చరాచర సంస్థితుండ వైతావకమై 

    వచియింపనౌ నిఖిల భా  -  వ చయంబును నీవె యౌదువా? దేవ! హరీ! 24.

గీ:- సకల జీవ, చ రాచర సంస్థితుండ  -  ప్రకటితంబయి కన్బడు ప్రాణ నాథ! 

    నిఖిల భావ చయంబును నీవెయౌదు? -  వెలయు తీరున కావుమ! వేణు గోప! 24.

చ:- శుక. పిక శారికా సకల శోభ కమేయ ప్రసాధనంబు వై

     తి; కరుణతో ధరన్ నిఖిల తేజము నీవయి నిల్చినావుగా!

     ఇక సకలేశ్వరా! అఖిల మీవ. కృపన్ నను నాదుకొమ్మ! పా

     తకుఁడ! హరీ! దయన్ వినుమ; తప్పక నామొర. వేణు గోపకా! 25.

క:- పిక శారికా సకల శో  -  భ కమేయ ప్రసాధనంబు వైతి; కరుణతో 

    సకలేశ్వరా! అఖిల మీ  -  వ. కృపన్ నను నాదుకొమ్మ! పాతకుఁడ! హరీ! 25.

గీ:- సకల శోభ కమేయ ప్రసాధనంబు  -  నిఖిల తేజము నీవయి నిల్చినావు!

    అఖిల మీవ. కృపన్ నను నాదుకొమ్మ!  -  వినుమ; తప్పక నామొర. వేణు గోప! 25.

ఉ:- పోతన భక్తి భావనము పొందినదై నిను వన్నె గాంచె దృ  

    గ్జాతమయెన్‍గ! యా తఱిని చక్కగ భాగవతమ్ముఁ జెప్పెఁ గా

    దే! తనలోనిదై వఱలు దివ్య నిరామయు భవ్యరూప ప్ర

    ఖ్యాతి; హరీ! కృపన్ విజయ కానుక నిచ్చిన వేణు గోపకా! 26.

క:- తన భక్తి భావనము పొం  -  దినదై నిను వన్నె గాంచె దృగ్జాతమయెన్ గ! 

    తన లోనిదై వఱలు ది  -  వ్య నిరామయ! భవ్యరూప ప్రఖ్యాతి హరీ! 26.

గీ:- వనము పొందినదై నిను వన్నె గాంచె  -  తఱిని చక్కగ భాగవతమ్ముఁ జెప్పెఁ 

    వఱలు దివ్య నిరామయ భవ్యరూప  -  విజయ కానుక నిచ్చిన వేణు గోప! 26.

ఉ:- నీ కను పాపలో వెలుగు నే కనఁ గల్గుట వింత కాదుగా?

     నీకనఁ గాదటుల్! జిలుగు నీదగు, నాదగు జిడ్డు బాప! ద

     క్షా! కనఁ గాదుగా కనుల గాంచను నాముఖ కాంతి రేఖ సం

     లోక హరీ! ప్రభూ! వెలుగు లోపలఁ గొల్పుమ! వేణు గోపకా! 27.

క:- కను పాపలో వెలుగు నే  -  కనఁ గల్గుట వింత కాదుగా? నీకనఁగా 

    కనఁ గాదుగా! కనుల గాం  -  చను నాముఖ కాంతి రేఖ సంలోక హరీ! ప్రభూ! 27.

గీ:- వెలుగు నే కనఁ గల్గుట వింత కాదు  -  జిలుగు నీదగు, నాదగు జిడ్డు బాప! 

    కనుల గాంచను నాముఖ కాంతి రేఖ  -  వెలుగు లోపలఁ గొల్పుమ! వేణు గోప! 27.

చ:- కనఁ రమణీయమౌ కవుల జ్ఞానము నీవయి  గాంచఁ జేసినా

     వ నుపమమౌన్. గనన్ రవియు నారయ లేనివి రాజిలంగ తో

     చిన; సుమనోజ్ఞమౌ రచన చేయు మహాద్భుత రాణ నిస్తి. యొ

     ప్పు నది; హరీ! భువిన్ వెలయు పుణ్యము నీవెగ! వేణు గోపకా! 28.

క:- రమణీయమౌ కవుల జ్ఞా  -  నము నీవయి  గాంచఁ జేసినావ నుపమమౌన్. 

    సుమనోజ్ఞమౌ రచన చే  -  యు మహాద్భుత రాణ నిస్తి. యొప్పు నది; హరీ! 28.

గీ:- కవుల జ్ఞానము నీవయి  గాంచఁ జేసి  -  రవియు నారయ లేనివి రాజిలంగ 

    రచన చేయు మహాద్భుత రాణ నిస్తి. -  వెలయు పుణ్యము నీవెగ! వేణు గోప! 28.

చ:- మది వసియించు దుర్ వ్యధలు ; మాన, సుధామతు లంతరింప; నా

     యెదఁ గనితిన్. మహిన్ బుధుల నెల్ల రసాకృతి మూలకేగుఁగా!

     మది వసుధేశుఁడా కరుణ మానస! గాంచుమ. కట్టడించు నా

     వ్యధను హరీ! సదా వినుచు  హాయి నొసంగుమ ! వేణు గోపకా! 29.

క:- వసియించు దుర్ వ్యధలు ; మా -  న, సుధామతు లంతరింప; నాయెదఁ గనితిన్. 

    వసుధేశుఁడా కరుణ మా  -  నస! గాంచుమ. కట్టడించు నావ్యధను హరీ! 29.

గీ:- వ్యధలు ; మాన, సుధామతు లంతరింప;  -  బుధుల నెల్ల రసాకృతి మూలకేగుఁ!

    కరుణ మానస! గాంచుమ. కట్టడించు  -  వినుచు  హాయినొసంగుమ ! వేణు గోప! 29.

చ:- పలు ఘనతల్ గనన్ మధుర భాషణ చాతురి మంబునీయ; సం

     తుల మతితో నిలన్ సుకవి తోషణఁ గూర్చెడి సూక్తి నీయ;కో!

     పిల ఎనలేనిదౌ కుకవి భీషణ వాగ్ ఝరి కూర్మినీయ; సం

     దడియె హరీ! ననున్ వెలయఁ దారిని గొల్పితె? వేణు గోపకా! 30.

క:- ఘనతల్ గనన్ మధుర భా  -  షణ చాతురి మంబునీయ; సంతుల మతితో 

    ఎనలేనిదౌ కుకవి భీ  -  షణ వాగ్ ఝరి కూర్మినీయ; సందడియె హరీ!  30.

గీ:- మధుర భాషణ చాతురి మంబునీయ;  -  సుకవి తోషణఁ గూర్చెడి సూక్తి నీయ;

    కుకవి భీషణ వాగ్ ఝరి కూర్మినీయ;  -  వెలయఁ దారిని గొల్పితె? వేణు గోప! 30.

చ:- పర నవ తేజమా! సుజన బాంధవ! నీదగు శోభఁ జూడనా?

     వర మదియే కదా! కుజన పాళి కసాద్యము గోపబాలకా!

     వర జవ మీవయై ప్రజల బాధ వరిష్ఠుఁడ! బాపవయ్య! దై

     త్య రిపు! హరీ! మతిన్ విజయతల్ సమ కూర్చుమ! వేణు గోపకా! 31.

క:- నవ తేజమా! సుజన బాం  -  ధవ! నీదగు శోభఁ జూడనా? వర మదియే! 

    జవ మీవయై ప్రజల బా  -  ధ వరిష్ఠుఁడ! బాపవయ్య! దైత్య రిపు! హరీ! 31.

గీ:- సుజన బాంధవ! నీదగు శోభఁ జూడ  -  కుజన పాళి కసాద్యము గోపబాల!

    ప్రజల బాధ వరిష్ఠుఁడ! బాపవయ్య!  -  విజయతల్ సమ కూర్చుమ! వేణు గోప! 31.

ఉ:- నీ పదపద్మముల్ కనిన నిత్య దరిద్రము కాలిపోవ దా?

     కోపహరీ! నినున్ వినిన కోప ప్రకంపన వీగి పోవ; ధా

    తా! పదిలంబుగా హరి పదం బది చేయదె; యాత్మ నుండి? పా

    పాపహరీ! సదా వినుత భాగ్య ప్రదీపక! వేణు గోపకా! 32.

క:- పదపద్మముల్ కనిన ని  -  త్య దరిద్రము కాలిపోవదా? కోపహరీ! 

    పదిలంబుగా హరి పదం  -  బది చేయదె; యాత్మ నుండి? పాపాపహరీ! 32.

గీ:- కనిన నిత్య దరిద్రము కాలిపోవ ? -  వినిన కోప ప్రకంపన వీగి పోవ; 

    హరి పదం బది చేయదె; యాత్మ నుండి? -  వినుత భాగ్య ప్రదీపక! వేణు గోప! 32.

చ:- మము కరుణించరా! అలుక మానర! మాపయి నంబుజాక్ష! న్యా

   యము కనరా! కృపన్ వర దయామయ! సత్కళ భాగ్యమిమ్మురా!

   సుమ పరిపూజ్యుఁడా! అమర సూక్తి రసస్ఫురణాదులిమ్ము! ది

   వ్య ముగ హరీ! సదా! విజయ వర్ధనఁ జేయర! వేణు గోపకా! 33.

క:- కరుణించరా! అలుక మా  -  నర! మాపయి నంబుజాక్ష! న్యాయము కనరా! 

    పరిపూజ్యుఁడా! అమర సూ  -  క్తి రసస్ఫురణాదులిమ్ము! దివ్య ముగ హరీ! 33.

గీ:- అలుక మానర! మాపయి నంబుజాక్ష! -  వర దయామయ! సత్కళ భాగ్యమిమ్ము!

    అమర సూక్తి రసస్ఫురణాదులిమ్ము! -  విజయ వర్ధనఁ జేయర! వేణు గోప! 33.

ఉ:- మా సిరి వల్లభా! పలుకుమా! దరి చేరితి పల్కరింప. ధా

     మా! సరిగా. రమా రమణ! మానస చోరుఁడ! రక్ష సేయవా !

     నీ సరి వానిగా భువిని నిన్నరయున్ గద; పూజ్యు లెల్ల హం

     సా! సుహరీక్షణా! విజయ సారధి వీవెగ! వేణు గోపకా! 34.

క:- సిరి వల్లభా! పలుకుమా! -  దరిచేరితి పల్కరింప. ధామా! సరిగా. 

    సరి వానిగా భువిని ని  -  న్నరయున్ గద; పూజ్యు లెల్ల హంసా! సుహరీ 34.

గీ:- పలుకుమా! దరి చేరితి పల్కరింప. -  రమణ! మానస చోరుఁడ! రక్ష సేయ !

    భువిని నిన్నరయున్ గద; పూజ్యు లెల్ల  -  విజయ సారధి వీవెగ! వేణు గోప! 34.

ఉ:- శ్రీ మహనీయుఁడా! సుజన చిత్త హరీ! నినుఁ జూడనిమ్ము; ధా

     త్రీ మనుజుల్ నినున్ కొలుచు రీతి సుధామతిఁ గొల్పుమయ్య! కో

      రే మహితాత్మకుల్ ఘనత శ్రీ మహనీయతఁ గల్గఁ జేయు మా

      రామ హరీ! సదా  వినుత ప్రస్ఫుట రూపక! వేణు గోపకా! 35.

క:- మహనీయుఁడా! సుజన చి  -  త్త హరీ! నినుఁ జూడనిమ్ము; ధాత్రీ మనుజుల్ 

    మహితాత్మకుల్ ఘనత శ్రీ  -  మహనీయతఁ గల్గఁ జేయుమా రామ హరీ! 35.

గీ:- సుజన చిత్త హరీ! నినుఁ జూడనిమ్ము;  -  కొలుచు రీతి సుధామతిఁ గొల్పుమయ్య!

    ఘనత శ్రీ మహనీయతఁ గల్గఁ జేయు  -  వినుత ప్రస్ఫుట రూపక! వేణు గోప! 35.

చ:- నిను కని భక్తితో మదుల నిల్పు నిరామయ! మాన్యపాళిఁ బొం

      దను శిలలే సదా ఎదురు తప్పక చూచెడు; నెన్ని  చూడ; బా

     ధను మనమందునన్ నిలిపి తాము నిరంతర నిశ్చలాత్మమున్

     గనవె?  హరీ! సదా వెలయఁ గల్గును; నీ కృప! వేణు గోపకా ! 36.

క:- కని భక్తితో మదుల ని  -  ల్పు నిరామయ మాన్యపాళిఁ బొందను శిలలే 

    మనమందు నిన్ నిలిపి తా  -  ము నిరంతర నిశ్చలాత్మము న్గనవె?  హరీ! 36.

గీ:- మదుల నిల్పు నిరామయ మాన్యపాళిఁ  -  ఎదురు తప్పక చూచెడు; నెన్ని  చూడ; 

    నిన్ నిలిపి తాము నిరంతర నిశ్చలాత్మ  -  వెలయఁ గల్గును; నీ కృప! వేణు గోప ! 36.

చ:- పలకల లోపలన్ కనగ బండల లోపల కల్గు దీవు. ట

     క్కులు సరిలే! భువిన్ కనుల కుం దగఁగా మముఁ గాన రావు. లో

     కుల పలు మాటలన్ మదులు కొందలమందెడు మమ్ము జూడు. ద

     ర్పిలఁగ హరీ! సదా వినుత ప్రేమ గుణావృత! వేణు గోపకా! 37.

క:- కల లోపలన్ కనగ బం  -   డల లోపల కల్గు దీవు. టక్కులు సరిలే! 

    పలు మాటలన్ మదులు కొం  -  దలమందెడు మమ్ము జూడు. దర్పిలఁగ హరీ! 37.

గీ:- కనగ బండల లోపల కల్గు దీవు. -  కనుల కుం దగఁగా మముఁ గాన రావు. 

    మదులు కొందలమందెడు మమ్ము జూడు. -  వినుత ప్రేమ గుణావృత! వేణు గోప! 37.

చ:- దశ దిశలందునన్ పరగు ధర్మ శతహ్రద భాష్యమీవ! మా

     వశమగుదే? మహా మహిత భావ పరంపర మాన్యుడీవ! మా

     దశ భృశమై కనన్ కనుల దాగి; శయించెడి కాంతి వీవ! కృ

     ష్ణ! శివ హరీ! మహా వినుత శౌర్య పరాత్పర! వేణు గోపకా! 38.

క:- దిశలందునన్ పరగు ధ  -  ర్మ శతహ్రద భాష్యమీవ! మావశమగుదే? 

    దశ భృశమై కనన్ కనుల దా  -  గి; శయించెడి కాంతి వీవ! కృష్ణ! శివ హరీ! 38.

గీ:- పరగు ధర్మ శతహ్రద భాష్యమీవ!  -  మహిత భావ పరంపర మాన్యుడీవ! 

    కనుల దాగి; శయించెడి కాంతి వీవ!  -  వినుత శౌర్య పరాత్పర! వేణు గోప! 38.

చ:- భవ జనులందునన్ పరమ పావన  భక్తుల పాద ధూళి ప్రా

     భవమలరన్ గ తా శిరము పైనను దాల్చిన; చిత్ర మొప్ప గా

      నివి  ఘనతన్ మహా వరము లిచ్చును  కొల్చిన భక్తి తోడ; చూ

     డవయ హరీ! మహా విదితుఁడా! యిది నీ కృప; వేణు గోపకా! 39.

క:- జనులందునన్ పరమ పా  -  వన  భక్తుల పాద ధూళి ప్రాభవమలరన్ 

    ఘనతన్ మహా వరము లి  -  చ్చును  కొల్చిన భక్తి తోడ; చూడవయ హరీ! 39.

గీ:- పరమ పావన  భక్తుల పాద ధూళి -  శిరము పైనను దాల్చిన; చిత్ర మొప్ప 

    వరము లిచ్చును  కొల్చిన భక్తి తోడ; -  విదితుఁడా యిది నీ కృప; వేణు గోప! 39.

చ:- హరి పరమాత్ముఁడా! సుమధురాక్షర రూపముఁ జూడ నీదెగా !

     మురహరుఁడా! కనన్; నికర మోక్ష రమాకృతి నీవె గాదె! శ్రీ

     హరి సుర సేవితా! సుమధురాక్షర హారతి చూడ నీకెగా!

     శరణు హరీ! మహావినుత! ఛంద సుగోచర! వేణు గోపకా! 40.

క:- పరమాత్ముఁడా! సుమధురా  -  క్షర రూపముఁ జూడ నీదెగా !మురహరుఁడా! 

    సుర సేవితా! సుమధురా  -  క్షర హారతి చూడ నీకెగా!శరణు హరీ! 40.

గీ:- సుమధురాక్షర రూపముఁ జూడ నీదె ! -  నికర మోక్ష రమాకృతి నీవె గాదె! 

    సుమధురాక్షర హారతి చూడ నీకె!  -  వినుత!  ఛంద సుగోచర! వేణు గోప! 40.

చ:- ముని జనముల్ గనే త్రి గుణముల్ విన నీవగు దివ్యతేజ! పే

     దను కనుమా! కృపన్ సుగుణ ధైర్యములొప్పుగ చూచి యిమ్మురా!

     విని కనుమా దయన్. నిగమ వేద్య నిధానమ! నిర్మలాత్మ హా

     యి నిడు హరీ! దయన్ పిలిచి యిమ్ముర నింపుగ! వేణు గోపకా! 41. 

క:- జనముల్ గనే త్రి గుణముల్  -  విన నీవగు దివ్యతేజ! పేదను కనుమా! 

    కనుమా దయన్. నిగమ వే  -  ద్య నిధానమ! నిర్మలాత్మ హాయి నిడు హరీ! 41. 

గీ:- త్రి గుణముల్ విన నీవగు దివ్యతేజ! -  సుగుణ ధైర్యము లొప్పుగ చూచి యిమ్ము!

    నిగమ వేద్య నిధానమ! నిర్మలాత్మ -  పిలిచి యిమ్ముర నింపుగ! వేణు గోప!  41. 

చ:- పరి తపమేలనో కనఁగ భక్త పటిష్ఠుఁడు కానిపించు తా

     శరణముగా! తగన్. మహిని శాశ్వతమిద్దని మాయఁ గొల్పు. తే

     లెర!  ఉపలబ్ధుడా!  విడువ లేనె! పరాత్పర! వెల్గు నిన్నునే

     ధరను హరీ! సదా వినుత ధర్మ పరాశ్రయ! వేణు గోపకా! 42. 

క:- తపమేలనో కనఁగ భ  -  క్త పటిష్ఠుఁడు కానిపించు తా శరణముగా! 

    ఉపలబ్ధుడా!  విడువ లే  -  నె! పరాత్పర! వెల్గు నిన్ను నే ధరను హరీ! 42. 

గీ:- కనఁగ భక్త పటిష్ఠుఁడు కానిపించు  -  మహిని శాశ్వతమిద్దని మాయఁ గొల్పు. 

    విడువ లేనె! పరాత్పర! వెల్గు నిన్ను  -  వినుత ధర్మ పరాశ్రయ! వేణు గోప! 42. 

చ:- అల ఘన పాద! నీ కరములంట నయాచిత జ్ఞాన మొందుట   

     ల్లల మృదు వై న నీ పదములంట నయాచిత భాగ్య మొందుటల్.                      

     అల గుణ గణ్యమౌ నయనమంట నయాచిత న్యాయ మొందుటల్.

     కలుఁగు హరీ! యిటుల్ వెలయఁ గల్గుట నీ కృప వేణు గోపకా!  43.

క:- ఘన పాద! నీ  కరములం  -  ట నయాచిత జ్ఞాన మొందుటల్లల మృదు వై 

     గుణ గణ్యమౌ నయనమం  -  ట నయాచిత న్యాయ మొందుటల్ కలుఁగు హరీ!  43.

గీ:- కరములంట నయాచిత జ్ఞాన మొందు -  పదములంట నయాచిత భాగ్య మొందు.                      

     నయనమంట నయాచిత న్యాయ మొందు. -  వెలయఁ గల్గుట నీ కృప వేణు గోప!  43.

చ:- శుభ వసుధాస్థలిన్ చినుకు చుక్క సముద్రము చేతువీవెగా!

     అభయ దుడా! వినన్ పలుకు లందున తేనెలు పాఱఁ జేతువే?

     అభి వసియింతుమా - జననమంద ససేమిర సల్పనీవు ధై

     వభవ హరీ! కృపన్ వెలయ భక్తుల కాచెడి వేణు గోపకా!  44.

క:- వసుధాస్థలిన్ చినుకు చు  -   క్క సముద్రము చేతువీవెగా! అభయదుడా! 

     వసియింతుమా  జననమం  -   ద ససేమిర సల్పనీవు ధైవ భవ హరీ!  44.

గీ:- చినుకు చుక్క సముద్రము చేతువీవె! -  పలుకులందున తేనెలు పాఱఁ జేతు?

     జననమంద ససేమిర సల్పనీవు  -  వెలయ భక్తుల కాచెడి వేణు గోప!  44.

చ:- ధర కరుణాలయా!  కనగ దాపరికం బెఱుగంగఁ జాల భా 

     స్కర సదృశా! నినున్ కనుల గాంచగ కోరిక; కాంచఁ జేసి; శ్రీ

      ధర తెరువున్ గనన్ కనుల దాల్చి రహింపుచు కాచుమయ్య!  శ్రీ

    వరద హరీ! మహా విజయ భాగ్య ప్రదాయక! వేణు గోపకా! 45.

క:- కరుణాలయా!  కనగ దా  -  పరికం బెఱుగంగ జాల భాస్కర సదృశా! 

    తెరువున్ గనన్ కనుల దా  -  ల్చి రహింపుచు కాచుమయ్య! శ్రీవరద హరీ! 45.

గీ:- కనగ దాపరికం బెఱుగంగఁ జాల  -  కనుల గాంచగ కోరిక; కాంచఁ జేసి; 

    కనుల దాల్చి రహింపుచు కాచుమయ్య!  -  విజయ భాగ్య ప్రదాయక! వేణు గోప! 45.

ఉ:- జీవన సారధీ!  మములఁ జే కొనవా కని మంచిఁ జూపి;  గో

     సేవకుఁడా! మహా ఘనుఁడ! శ్రీ పద ధూళిని కల్గఁ జేసి; శ్రీ

     శా! వనమాలివే! మములఁ జక్కన జేయవె మాన్యులట్లు క్ష్మా;

     దేవ హరీ! సదా వినుత తేజ ప్రకల్పక! వేణు గోపకా! 46.

క:- వన సారధీ!  మములఁ జే  -  కొనవా కని మంచిఁ జూపి;  గో సేవకుఁడా!

    వనమాలివే! మములఁ జ  -  క్కన జేయవె మాన్యులట్లు క్ష్మా దేవ హరీ! 46.

గీ:- మములఁ జే కొనవా కని మంచిఁ జూపి?  -  ఘనుఁడ! శ్రీ పద ధూళిని కల్గఁ జేసి; 

    మములఁ జక్కన జేయవె మాన్యులట్లు  -  వినుత తేజ ప్రకల్పక! వేణు గోప! 46.

ఉ:- నే వినుతింతు నా హృదయ నిత్య నివాసుఁడ! ఈప్సితార్థ దా!

     శ్రీ వరుఁడా! సదా మధువుఁ జిందెడి సత్కృతి మాకుఁ గొల్పు! రా 

     నా వనమాలివై విరుల నందన శోభలఁ వెల్గనిమ్ము తత్

     భావ హరీ! దయన్ వెలయు పద్యము లీవుగ! వేణు గోపకా! 47.

క:- వినుతింతు నా హృదయ ని  -  త్య నివాసుఁడ! ఈప్సితార్థ దా! శ్రీ వరుఁడా! 

    వనమాలివై విరుల నం  -  దన శోభలఁ వెల్గనిమ్ము తత్భావ హరీ! 47.

గీ:- హృదయ నిత్య నివాసుఁడ! ఈప్సితార్థ -  మధువుఁ జిందెడి సత్కృతి మాకుఁ గొల్పు! 

    విరుల నందన శోభలఁ వెల్గనిమ్ము! -  వెలయు పద్యము లీవుగ! వేణు గోప! 47.

చ:- మృదు మధురాక్షరా! కరుణ నీ వ్యధ లెన్నుచుఁ గాంచు చుందువా!

     బుధ వినుతా! మహా కృపను బుద్ధుల సద్గతి నిచ్చి చూచి మా 

     మది మృదు భావనల్; సుగుణ మాన ధనంబులఁ శోభఁ గూర్చు నా

     యెదను హరీ! సదా! విచలితేక్షణ! మ్రొక్కెద! వేణు గోపకా! 48.

క:- మధురాక్షరా! కరుణ నీ -  వ్యధ లెన్నుచుఁ గాంచు చుందువా! బుధ వినుతా! 

    మృదు భావనల్; సుగుణ మా  -  న ధనంబులఁ శోభఁ గూర్చు నాయెదను హరీ! 48.

గీ:- కరుణ నీ వ్యధ లెన్నుచుఁ గాంచు చుందు! -  కృపను బుద్ధుల సద్గతి నిచ్చి చూచి !

    సుగుణ మానధనంబులఁ శోభఁ గూర్చు -  విచలితేక్షణ! మ్రొక్కెద! వేణు గోప! 48.

చ:- తిరుపతి! నీ శుభా కృతులఁ దీప్తి తెఱంగుల నెన్నఁ జాలుదే?

     పరిపరి నే. నినున్ విమల భావన గొల్పగ వేడుకొందుగా!  

     ధర నుతిఁ గాంచగా సుఫల దైవత కార్యము చూడఁ జేయు భా

     సురుఁడ! హరీ! మహా వినుత  శోభల వెల్గెడి వేణు గోపకా! 49. 

క:- పతి! నీశుభా కృతులఁ దీ  -  ప్తి తెఱంగుల నెన్నఁ జాలుదే?పరిపరి నే. 

    నుతిఁ గాంచగా సుఫల దై  -  వత కార్యము చూడఁ జేయు భాసురుఁడ! హరీ! 49. 

గీ:- కృతులఁ దీప్తి తెఱంగుల నెన్నఁ జాలు -  విమల భావన గొల్పగ వేడుకొందు!  

    సుఫల దైవత కార్యము చూడఁ జేయు -  వినుత  శోభల వెల్గెడి వేణు గోప! 49. 

చ:- తడఁబడి లోనఁ గాంచితిని దౌరడ యుండుట చిత్రమౌనురా!

    శిలగ నిలన్ సదా యతుల సృష్టిగ నుండెద వన్నిచోట్లలో

    నిలు కడదాక! నిన్ గనగ నేర్చి; లసద్గుణ గణ్యులెంచు శ్రీ

    శుఁడిగ హరీ! కృపన్ వెలయు శోభయె నీవుగ; వేణు గోపకా! 50.

క:- బడిలోనఁ గాంచితిని దౌ  -  రడ యుండుట చిత్రమౌనురా! శిలగ నిలన్ 

    కడదాక నిన్ గనగ నే  -  ర్చి లసద్గుణ గణ్యులెంచు శ్రీశుఁడిగ హరీ! 50.

గీ:- చితిని దౌరడ యుండుట చిత్రమౌను!  -  యతుల సృష్టిగ నుండెద వన్నిచోట్ల

    గనగ నేర్చి లసద్గుణ గణ్యులెంచు  -  వెలయు శోభయె నీవుగ; వేణు గోప! 50.

ఉ:- ఆ వసు; దేవకీ సుతుడవై వసుధాస్థలి శోభ పెంచి భా

    గ్యావనిగా! మహా ఘనతఁ గాంచఁగఁ జేసితి కాంక్ష తీరగా!

    నీ వసమైతిగా! కనుమ నీవ! సమాశ్రయు గౌరవించి ప్రా

    గ్దేవ హరీ! భువిన్ వెలయు తీరుగఁ మమ్ముల వేణు గోపకా!  51.

క:- వసు; దేవకీ సుతుడవై -  వసుధాస్థలి శోభ పెంచి భాగ్యావనిగా! 

    వసమైతిగా! కనుమ నీ  -  వ! సమాశ్రయు గౌరవించి ప్రాగ్దేవ హరీ! 51.

గీ:- సుతుడవై వసుధాస్థలి శోభ పెంచి -  ఘనతఁ గాంచఁగఁ జేసితి కాంక్ష తీర!

    కనుమ నీవ! సమాశ్రయు గౌరవించి -  వెలయు తీరుగఁ మమ్ముల వేణు గోప!  51.

చ:- పుర ధర! నిన్నుగా! మునులు పొంది రహింతురు మున్ను జూచి; దే

     వర వనుచున్! మదిన్ కనుల పండువుగా నినుఁ గాంచఁ జేసెగా?

     ధర వర మీవయై మనుజ తన్వు రహించిన మమ్ము బ్రోచు! నో

     వరిని హరీ! సదా వినుత భాగ్య విధాతవు వేణు గోపకా! 52.

క:- ధర నిన్నుగా! మునులు పొం  -  ది రహింతురు మున్ను జూచి; దేవర వనుచున్! 

    వర మీవయై మనుజ త  -  న్వు రహించిన మమ్ము బ్రోచు! నోవరిని; హరీ!  52.

గీ:- మునులు పొంది రహింతురు మున్ను జూచి; -  కనుల పండువుగా నినుఁ గాంచఁ జేసె

      మనుజ తన్వు రహించిన మమ్ము బ్రోచు! -  వినుత భాగ్య విధాతవు వేణు గోప!  52.

ఉ:- మా గుణ దోషముల్; కలుగు మాదు నవాంచిత కాంక్షలెన్ని తో?

     శ్రీ గుణుఁడా! కృపన్ కలుగఁ జేయుము దేవర! కాంక్ష తీరగా!

     నీ గణనీయులన్ కనెడి నేర్పును జూపుమ! గాంచి మమ్ము; మున్

     వేగ హరీ! భువిన్ వెలయు విజ్ఞతఁ గొల్పుమ! వే్ణు గోపకా!  53.

క:- గుణ దోషముల్; కలుగు మా  -  దు నవాంచిత కాంక్షలెన్ని తో? శ్రీ గుణుఁడా! 

    గణనీయులన్ కనెడి నే  -  ర్పును జూపుమ! గాంచి మమ్ము; మున్ వేగ హరీ!  53.

గీ:- కలుగు మాదు నవాంచిత కాంక్షలెన్ని -  కలుగఁ జేయుము దేవర! కాంక్ష తీర!

    కనెడి నేర్పును జూపుమ! గాంచి మమ్ము; -  వెలయు విజ్ఞతఁ గొల్పుమ! వే్ణు గోప!  53.

ఉ:- ఆ నవనీతమే చెలఁగి యాదవు లింట వసించు నీకు తా

     ప్రాణమయెన్ గదా! కలుగ రాదన రాదుగ! గౌరవంబు తో

     డై నవ నీతులన్ గొలుపుటల్సవిధంబుగ కూర్మిఁ జేయు స  

     న్మాన హరీ! మహిన్ విమల మాన్యుల కెల్లను వేణు గోపకా! 54.

క:- నవనీతమే చెలగి యా  -  దవు లింట వసించు నీకు తాప్రాణమయెన్.

    నవ నీతులన్ గొలుపుట  -  ల్సవిధంబుగ కూర్మిఁ జేయు సన్మాన! హరీ!  54.

గీ:- చెలగి యాదవు లింట వసించు నీకు  -  కలుగరాదనరాదుగ! గౌరవంబు

    గొలుపుటల్సవిధంబుగ కూర్మిఁ జేయు -  విమల మాన్యుల కెల్లను వేణు గోప!  54.

చ:- గమికొనుచున్ భువిన్ ఘడియ కాయను గోవుల కష్టమయ్యు య

     జ్ఞ మనెదవే కదా! యిలను కాసెడి నీకది యిష్ట మాయెగా!

     సమ కొనగాఁ దగున్ పరమ సత్వ నయాన్విత భాగ్య! మమ్ము; భా

    రమొకొ? హరీ! కృపన్ వినుత! రాజిలఁ జేయుమ! వేణు గోపకా!  55.

క:- కొనుచున్ భువిన్ ఘడియ కా  -  యను గోవుల కష్టమయ్యు యజ్ఞ మనెదవే? 

    కొనగాఁ దగున్  పరమ స  -  త్వ నయాన్విత  భాగ్య!  మమ్ము భారమొకొ? హరీ!  55.  

గీ:- ఘడియ కాయను గోవుల కష్టమయ్యు  -  యిలను కాసెడి నీకది యిష్ట మాయె

    పరమ సత్వ నయాన్విత  భాగ్య!  మమ్ము -  వినుత!  రాజిలఁ జేయుమ! వేణు గోప!  55.

చ:- మొర వినవేమిరా! సరసముల్ గనఁ జాలను. శంకఁ గల్గెఁగా!

     ముర హరుఁడా! దయా వరుఁడ! మోక్షముఁ గోరుదు. ప్రాణ మీవె! శ్రీ

     కర! కన నీకు నే పరుఁడఁ గానె? నయంబుగ పట్టి వీఁడ నీ

     కరము; హరీ! సదా విజయ కారణ పాదుఁడ! వేణు గోపకా! 56.

క:- వినవేమిరా! సరసముల్ -  గనఁ జాలను. శంకఁ గల్గెఁగా! ముర హరుడా! 

    కన నీకు నే పరుఁడ  కా  -  నె నయంబుగ పట్టి వీడ నీకరము. హరీ! 56. 

గీ:- సరసముల్ గనఁ జాలను. శంకఁ గల్గె. -  వరుఁడ! మోక్షముఁ గోరుదు. ప్రాణ మీవె! 

    పరుఁడ  కానె? నయంబుగ పట్టి వీఁడ. -  విజయ కారణ పాదుఁడ! వేణు గోప! 56.

చ:- వర చరణాబ్జముల్ సకల భక్తి రహస్యము చాటి చెప్పు. ధీ

    వరులకిలన్. సదా! వసుధ వర్ధిల చేయును భక్తిఁ గల్గగా.

    వర కరుణాన్వితా! గొలుపవా! చరణంబులు కోరి పట్ట; స

    ద్గురుఁడ! హరీ! మహా వినుత ! కూర్మిని గాంచుమ వేణు గోపకా! 57

క:- చరణాబ్జముల్ సకల భ  -  క్తి రహస్యము చాటి చెప్పు. ధీవరులకిలన్. 

    కరుణాన్వితా! గొలుపవా! -  చరణంబులు కోరి పట్ట; సద్గురుఁడ! హరీ! 57.

గీ:- సకల భక్తి రహస్యము చాటి చెప్పు. -  వసుధ వర్ధిల చేసెడు భక్తిఁ గల్గ.

    గొలుపవా! చరణంబులు కోరి పట్ట;  -  వినుత! కూర్మిని గాంచుమ వేణు గోప! 57.

ఉ:- ఆ వన జాతమై మురళి; అద్రి నయావృత; ముందె తాను బృం

     దావనమున్ నినున్. అసమ ధైర్యద! నీ యధ రామృతంబు నే

     తా వన ధారగా తెలిసి త్రాగను చేరెను తృప్తినొందగా!

     మోవి హరీ! భువిన్ వెలసె ముచ్చట తీరగ వేణు గోపకా! 58.

క:- వన జాతమై మురళి; అ  -  ద్రి నయావృత; ముందె తాను బృందావనమున్ 

     వనధారగా తెలిసి త్రా  -  గను చేరెను తృప్తినొందగా! మోవి హరీ!  58. 

గీ:- మురళి; అద్రి నయావృత; ముందె తాను  -  అసమ ధైర్యద! నీయధరామృతంబు

    తెలిసి త్రాగను చేరెను తృప్తినొంద  -  వెలసె ముచ్చట తీరగ; వేణు గోప!  58.

చ:- చను వడిఁ గల్గుచున్; వని వసంతుఁ డదెట్టుల వచ్చి పోవునో?

    ఘృణి నిలయా! దయా నిలయమీవని నీవని నిశ్చయించెనో?

    కని కలగా వనిన్ కలుగు కాము డయాచిత కల్పనంబు పూ

     నెనుగ?హరీ! యటుల్ విరియ నెమ్మి యొనర్చెను వేణు గోపకా! 59.

క:- వడిఁ గల్గుచున్; వని వసం  -  తుఁ డదెట్టుల వచ్చి పోవునో? ఘృణి నిలయా! 

    కలగా వనిన్ కలుగు కా  -  ము డయాచిత కల్పనంబు పూనెనుగ?హరీ! 59.

గీ:- వని వసంతుఁ డదెట్టుల వచ్చి పోవు?  -  నిలయ మీవని నీవని నిశ్చయించె?

    కలుగు కాము డయాచిత కల్పనంబు -  విరియ నెమ్మి యొనర్చెను వేణు గోప!  59.

చ:- మొలకల కైవడిన్ పుడమి మూర్ఖు  లదెట్టులఁ బుట్టు నయ్యరో?

     యిడుమలిడన్. భువిన్ వెలయనీయక యడ్డుమ! విశ్వ రక్షకా!

     యిల పలుమార్లు నిన్ వినయ మేర్పడ మ్రొక్కెద  వింగడించి; పా

    ప లయ! హరీ! సదా విపుల వాఙ్మయ గోచర! వేణు గోపకా! 60.

క:- కల కైవడిన్ పుడమి మూ  -  ర్ఖులదెట్టులఁ బుట్టు నయ్యరో? యిడుమలిడన్. 

    పలుమార్లు నిన్ వినయ మే  -  ర్పడ మ్రొక్కెద  వింగడించి పాప లయ! హరీ! 60.

గీ:- పుడమి మూర్ఖు  లదెట్టులఁ బుట్టు నయ్య!  -  వెలయనీయక యడ్డుమ! విశ్వ రక్ష!

    వినయ మేర్పడ మ్రొక్కెద  వింగడించి; -  విపుల వాఙ్మయ గోచర! వేణు గోప! 60.

చ:- నట విట లంపటుల్; కలిగినారట దుష్టులు కల్మిఁ జేసి? రా

     వట భయముల్. కృపన్ దురిత భావనఁ బాపుమ దుష్టులందు; నే

    నిట నటనల్ గనన్; నిలుపుమీవటు గూర్పుమ నేర్పు మీర ప్రా

    కటము హరీ! సదా వెలయఁ గావుమ జ్ఞానుల వేణు గోపకా! 61  

క:- విట లంపటుల్; కలిగినా  -  రట దుష్టులు కల్మిఁ జేసి; రావట భయముల్

    నటనల్ గనన్; నిలుపుమీ  -  వటు గూర్పుమ నేర్పు మీర ప్రాకటము హరీ! 61.

గీ:- కలిగినారట దుష్టులు కల్మిఁ జేసి? -  దురిత భావనఁ బాపుమ దుష్టులందు; 

    నిలుపుమీవటు గూర్పుమ నేర్పు; మీర  -  వెలయఁ గావుమ; జ్ఞానుల వేణు గోప! 61  

చ:- అట ఒక పట్టున న్నిచట నౌ నొక పట్టున; నెన్ని చూతు నో

     నటన హరీ్ నినున్. చెపుమ నాకు వసింతువు చెన్ను నేడ? నే

     నిట నికటంబునం కనుల నెన్ని కనుంగొన కాచి యుంటి నే!

     పటలి హరీ! కృపన్ వినుమ పట్టుగ నామొర. వేణు గోపకా! 62.

క:- ఒక పట్టున న్నిచట నౌ -  నొక  పట్టున నెన్ని చూతు నో నటన హరీ! 

    నికటంబునం కనుల నె  -  న్ని కనుంగొన కాచి యుంటి నే! పటలి హరీ! 62.

గీ:- ఇచట నౌ నొక  పట్టున నెన్ని చూతు. -  చెపుమ నాకు. వసింతువు చెన్ను నేడ? 

    కనుల నెన్ని కనుంగొన కాచి యుంటి! -  వినుమ పట్టుగ నామొర. వేణు గోపకా!  62.

చ:- గుణ గణనంబుచే కలిమి కోరిన తీరున గాంచ లేను. ప్రే

     మను మెలగన్; సదా మదిని మన్నికఁ నిన్ గన మాన్యు నౌదుగా!

     గుణ వినయంబులన్; కలిమిఁ గూర్చిన నీ కృప గాంచ నౌనె? శ్రీ

     వినుత హరీ! సదా విజయ వృద్ధిని గొల్పుమ! వేణు గోపకా! 63.

క:- గణనంబుచే కలిమి కో  -  రిన తీరున గాంచ లేను. ప్రేమను మెలగన్; 

    వినయంబులన్; కలిమిఁ గూ  -  ర్చిన నీ కృప గాంచ నౌనె? శ్రీ వినుత హరీ! 63.

గీ:- కలిమి కోరిన తీరున గాంచ లేరు. -  మదిని మన్నికఁ నిన్ గన మాన్యు నౌదు!

    కలిమిఁ గూర్చిన నీ కృప గాంచ నౌనె? -  విజయ వృద్ధిని గొల్పుమ! వేణు గోప! 63.

చ:- మృదు మదిరేక్షణల్ మదుల మిమ్ము దలంచుట మాయ గాదె? మో

     క్ష దుఁడ! కనన్. వినన్ విపుల జ్ఞానమయం బని విజ్ఞులంద్రు గా!

     యెద సదసద్‍జ్ఞతల్‍ కనెడి యెల్ల దయామయ జ్ఞానులందు డా

     గెదవు హరీ! కృపన్ విజయ కృష్ణులఁ గాచిన వేణు గోపకా! 64.

క:- మదిరేక్షణల్ మదుల మి  -  మ్ము దలంచుట మాయ గాదె? మోక్షదుఁడ! కనన్. 

    సదసద్‍జ్ఞతల్‍ కనెడి యె  -  ల్ల దయామయ జ్ఞానులందు డాగెదవు హరీ! 64.

గీ:- మదుల మిమ్ము దలంచుట మాయ గాదె? -  విపుల జ్ఞానమయం బని విజ్ఞులంద్రు !

    కనెడి యెల్ల దయామయ జ్ఞానులందు -   విజయ కృష్ణులఁ గాచిన వేణు గోప! 64.

ఉ:- నీ యభిమానమున్ సుగుణ! నీ శుభ దర్శన శోభ నొంది; శో

     భా యశులై; మదిన్ వినుచు పాపముఁ బాసెడి వృద్ధు లెల్లరున్

     నీ యభయంబునే మనుట నీ ప్రభ! నిత్యుఁడ! మమ్ము చూడరా!

     జ్ఞేయ హరీ! కృపన్ వెలయఁ జేయను; నిల్చిన వేణు గోపకా! 65.

క:- యభిమానమున్ సుగుణ! నీ -  శుభ దర్శన శోభ నొంది; శోభా యశులై

    యభయంబునే మనుట నీ -  ప్రభ! నిత్యుఁడ! మమ్ముచూడరా! జ్ఞేయ హరీ! 65.

గీ:- సుగుణ! నీ శుభ దర్శన శోభ నొంది; -  వినుచు పాపముఁ బాసెడి వృద్ధులెల్ల

    మనుట నీ ప్రభ! నిత్యుఁడ! మమ్ము చూడ! -  వెలయఁ జేయను నిల్చిన వేణు గోపకా!  65.

ఉ:- నా కను పాపవై కనగ నా కను ముందర కాచి యుండగా!

     నాకము గాన నే! వినగ నా చెవి నీ కథ విన్చు నుండగా

    నే; కన గోరెదన్. హితులు నే కన నీవని యెంచి చూడగా!

    శ్లోకి హరీ! ననున్ విజయ లోకముఁ జేర్చర వేణు గోపకా! 66.

క:- కను పాపవై కనగ నా -  కను ముందర కాచియుండగా నాకముగా! 

    కన గోరెదన్ హితుల నే -  కన నీవని యెంచి చూడగా! శ్లోకి! హరీ! 66.

గీ:- కనగ నా కను ముందర కాచియుండ!  -  వినగ నా చెవి నీ కథ విన్చు నుండ;

    హితులు నే కన నీవని యెంచి చూడ!  -  విజయ లోకముఁ జేర్చర వేణు గోప! 66.

చ:- పరవశమైతి నిన్ కనుచు; భవ్య శరీరముఁ గల్గఁ జేసి భ

     క్తి రగులగా మతిన్ వెలయు తీరును  గొల్పెదు. విశ్వ తేజ!  ధీ 

    వర! యశమున్ గొనన్ మదిని భాగ్య శుభాన్వితమై వెలుంగగా

    భరమ? హరీ! దయన్ వెలసి భాసిలు నన్ గని వేణు గోపకా! 67.

క:- వశమైతి నిన్ కనుచు; భ  -  వ్య శరీరముఁ గల్గఁ జేసి భక్తి రగులగా 

    యశమున్ గొనన్ మదిని భా  -  గ్య శుభాన్వితమై వెలుంగగా భరమ? హరీ ! 67.

గీ:- కనుచు; భవ్య శరీరముఁ గల్గఁ జేసి -  వెలయు తీరును  గొల్పెదు విశ్వ తేజ!   

     మదిని భాగ్య శుభాన్విత మై వెలుంగ; -  వెలసి భాసిలు నన్ గని వేణు గోప! 67.

చ:- అల సదుపాయమున్ హృదయ మందు దయాస్థితి నిచ్ఛ నుండెదో?

     యడరుకొనన్ దగన్ పదిలమై సుధ లొల్కగ పల్కఁ జేసి! శో

     భల మధుసూదనా! మధుర భావ దయాదుల మంచినిచ్చి; బ్రాఁ

    తిలగ హరీ! దయన్ వెదకు తీవగ  చేరితె? వేణు గోపకా! 68.

క:- సదుపాయమున్ హృదయ మం  -  దు దయాస్థితి నిచ్ఛ నుండెదో? యడరుకొనన్! 

     మధుసూదనా! మధుర భా  -  వ దయాదుల మంచినిచ్చి; బ్రాఁతిలగ! హరీ! 68.

గీ:- హృదయ మందు దయాస్థితి నిచ్ఛ నుండె!  -  పదిలమై సుధ లొల్కగ పల్కఁ జేసి; 

    మధుర భావ దయాదుల మంచినిచ్చి;  -  వెదకు తీవగ  చేరితె? వేణు గోప! 68.

చ:- రహిఁ దయచూపరా!  సుగుణ రాశి! యొసంగర  సూక్ష్మ బుద్ధి  శ్రీ

    సహచరుడా! కృపన్ నిగమ సార! యొనర్చర! నిశ్చితమ్మురా!

    ఇహ భయమేదుచున్నఘము లెన్ని;  యడంచర; యాశ తీర్చి నీ                 

     వె; హరి హరీ! మహా వినుత వేద్యముఁ దెల్పర! వేణు గోపకా! 69.

క:- దయచూపరా! సుగుణ రా  -  శి! యొసంగర సూక్ష్మ బుద్ధి శ్రీసహచరుడా! 

    భయమేదుచున్నఘము లె  -  న్ని; యడంచర; యాశ తీర్చి; నీవె; హరి హరీ! 69. 

గీ:- సుగుణ రాశి! యొసంగర సూక్ష్మ బుద్ధి!  -  నిగమ సార! యొనర్చర నిశ్చితమ్ము! 

    అఘము లెన్ని; యడంచర; యాశ తీర్చి!  -  వినుత వేద్యముఁ దెల్పర! వేణు గోప! 69.

చ:- మది సుమనోహరా! నిను సమస్తము నామది నిల్పి యుంచ; సౌ

     ఖ్య దము గదా! మహా ఘనతఁ గాంచగఁ జేయగ; గౌరవించ; సౌ

     మ్యద! సమ వర్తి! నీ అభయ హస్తము నీయర ఆది దేవ! సా

     కెదవ హరీ కృపన్? విజయ కృత్యము నేర్పెడి వేణు గోపకా! 70.

క:- సుమనోహరా! నిను సమ  -  స్తము నామది నిల్పి యుంచ; సౌఖ్య దము గదా! 

    సమ వర్తి! నీ అభయ హ  -  స్తము నీయర ఆది దేవ! సాకెదవ హరీ? 70.

గీ:- నిను సమస్తము నామది నిల్పి యుంచ; -  ఘనతఁ గాంచగఁ జేయగ గౌరవించ; 

    అభయ హస్తము నీయర ఆది దేవ! -  విజయ కృత్యము నేర్పెడి వేణు గోప! 70.

ఉ:- శ్రీ వరలక్ష్మియున్ తమను చేరి రహించెను తత్వ వేత్త ప్రీ

     తా వహమై. సుధా మతుల ధైర్య రహస్యము మాన్య! నీవెరా!

     ధీ వరు నాత్మలో కలుగ తేజరిలున్ గద గారమొప్ప; స

     ద్భావ హరీ! సదా వినయ భావము నిచ్చెడి వేణు గోపకా! 71.

క:- వరలక్ష్మియున్ తమను చే  -  రి రహించెను తత్వ వేత్త ప్రీతా వహమై. 

    వరు నాత్మలో కలుగ తే  -  జరిలున్ గద గారమొప్ప సద్భావ హరీ! 71.

గీ:- తమను చేరి రహించెను తత్వ వేత్త! -  మతుల  ధైర్య రహస్యము మాన్య! నీవె

    కలుగ తేజరిలున్ గద గారమొప్ప . -  వినయ భావము నిచ్చెడి వేణు గోప! 71.

చ:- భవ! సు విధానమున్ విమల భక్తి విధేయత వెల్లి గొల్పితే?

     దివిజ నుతా! మతిన్ సుజన దీప్తి  విశిష్టత చూడఁ గొల్పితే?

     భవ రవి తేజమై అభయ భావ సుశక్తుల నందఁ గొల్పితే.

     యవని హరీ! మహా వినుత యద్భుత మైతివి! వేణు గోపకా! 72.

క:- సు విధానమున్ విమల భ  -  క్తి విధేయత వెల్లి గొల్పితే? దివిజ నుతా!  

    రవి తేజమై అభయ భా  -  వ సుశక్తుల  నందఁ గొల్పితే యవని హరీ! 72.

గీ:- విమల భక్తి విధేయత వెల్లి గొల్పి?  -  సుజన దీప్తి    విశిష్టత చూడఁ గొల్పి?

    అభయ భావ  సుశక్తులనందఁ గొల్పి.  -  వినుత యద్భుత మైతివి! వేణు గోప! 72.

చ:- తిరుపతి కొండపై అలసితేసతి సేవల నంది నీవు? స

    ద్వరుఁడవొకో? అటన్ కలియు భామల నేలనొ కాంక్ష తీర్చి? శ్రీ

    తిరు సతి నేలనో? కనగ ధీరత చాలకొ? గౌరవించి! రా

    వరద హరీ! కనన్. విన స్వభావ విరిద్ధమొ? వేణు గోపకా! 73.

క:- పతి! కొండపై అలసితే  -  సతి సేవల నంది నీవు? సద్వరుఁడవొకో? 

    సతి నేలనో? కనగ ధీ  -  రత చాలకొ? గౌరవించి! రా వరద హరీ! 73. 

గీ:- అలసి తేసతి సేవల నంది నీవు? -  కలియు భామల నేలనొ కాంక్ష తీర్చి?  

    కనగ ధీరత చాలకొ? గౌరవించి! -  విన స్వభావ విరిద్ధమొ? వేణు గోప! 73.

చ:- నవ భవనాలలో అలసినాడవు; పూజల నందుచుండుటన్.

    నవ జవనా లతో వెలసినాడవు; గుండెల వెల్గు లీన మా 

    నవ సవనాలలో సొలసినాడవు; భక్తుల శోభఁ గూర్చుటన్.

    ధవుఁడ! హరీ కృపన్ వినక తప్పదు నా మొర వేణు గోపకా! 74.

క:- భవనాలలో అలసినా  -  డవు;  పూజల నందుచుండు టన్ నవ జవనా! 

    సవనాలలో సొలసినా  -  డవు భక్తుల శోభఁ గూర్చుటన్  ధవుఁడ! హరీ! 74.

గీ:- అలసినాడవు; పూజల నందుచుండు.  -  వెలసినాడవు; గుండెల వెల్గు లీన.

    సొలసినాడవు; భక్తుల శోభ గూర్చు. -  వినక తప్పదు నామొర వేణు గోపకా! 74.

చ:- తొలి విశదంబుగా అల చతుర్దశ లోక విహారి వీవురా!

     యలఘు హరీ! భువిన్ గన మహర్దశ నీకృపగా తలంతు. జ్ఞా 

     తుల భృశ భావనల్ క్షణిక దుర్దశ;  బాపను చాలు దీవురా!

     ఫలద హరీ! కృపన్ వినుచు భవ్యుఁడ కావర! వేణు గోపకా! 75.                 

క:- విశదంబుగా అల చతు  -  ర్దశ లోక విహారి వీవురా! యలఘు హరీ! 

    భృశ భావనల్ క్షణిక దు  -  ర్దశ; బాపను చాలు దీవురా! ఫలద హరీ! 75.

గీ:- అల చతుర్దశ లోక విహారి వీవు!  -  గన మహర్దశ నీకృప గా తలంతు.  

    క్షణిక దుర్దశ  బాపను చాలు దీవు!  -  వినుచు భవ్యుఁడ కావర! వేణూ గోప! 75.       

చ:- చిఱు నగు మోముతో సుధలు చిందు గురూత్తము సూక్తు లెల్లనున్

     మఱి  వినినన్ మహా ఘనత; మాన్యత; తప్పక కల్గఁ జేయు నీ

     తఱి సుగుణాకరా! తమరి ధైర్య గుణాదులె తాను చెప్పునా

     ఉఱియ; హరీ! గురున్ వినగ నొప్పెద వీవట! వేణూ గోపకా! 76.

క:- నగు మోముతో సుధలు చిం  -  దు గురూత్తము సూక్తు లెల్లనున్ మఱి  వినినన్ 

    సుగుణాకరా! తమరి ధై  -  ర్య గుణాదులె తాను చెప్పునా ఉఱియ; హరీ! 76.

గీ:- సుధలు చిందు గురూత్తము సూక్తు లెల్ల  -  ఘనత; మాన్యత; తప్పక కల్గఁ జేయు 

    తమరి ధైర్య గుణాదులె తాను చెప్పు!  -  వినగ నొప్పెద వీవట! వేణూ గోప! 76.

ఉ:- హే కరుణాకరా! హితుఁడ! హే హరి! పావన! హే దయాబ్ధి! అ

     స్తోక శుభా వహా! సకల శోక వినాశక! సద్గుణాఢ్య! దే

     వా! కరుణించవా! సకల భాగ్య రమా ధవ! సన్నుతాంగ! జ్ఞా

     నైక హరీ! కృపన్ విజయ మేర్పడ గొల్పర! వేణుగోపకా! 77. 

క:- కరుణాకరా! హితుఁడ! హే  -  హరి! పావన! హే దయాబ్ధి! అస్తోక శుభా! 

     కరుణించవా! సకల భా -  గ్య రమా ధవ! సన్నుతాంగ! జ్ఞానైక హరీ!  77.

గీ:- హితుఁడ! హే హరి! పావన! హే దయాబ్ధి! -  సకల శోక వినాశక! సద్గుణాఢ్య! 

      సకల భాగ్య రమా ధవ! సన్నుతాంగ! -  విజయ మేర్పడ గొల్పర! వేణుగోప!  77.

ఉ:- భాసుర! లోకమున్ మదుల భాసురమౌ పరమాత్మవీవ. శో

      భాసరణిన్. వినన్ మృదుల భాషణలో నినుమించ లేనురా!

      నీ సరివారలే? ప్రజలు? నీసరి వారని పల్కుచుండ్రి స

      త్పోష హరీ! దయన్ వినర!  పూజ్యుడ వీవెర! వేణు గోపకా! 78.

క:- సుర లోకమున్ మదుల భా  -  సురమౌ పరమాత్మవీవ. శోభాసరణిన్. 

      సరివారలే ప్రజలు? నీ  -  సరి వారని పల్కుచుండ్రి  సత్పోష హరీ! 78.

గీ:- మదుల భాసురమౌ పరమాత్మవీవ. -  మృదుల భాషణలో నినుమించలేను!

     ప్రజలు? నీసరి వారని పల్కుచుండ్రి  -  వినర! పూజ్యుడ వీవెర! వేణు గోప! 78.

ఉ:- అందరివాడ! నే కనెద నందరిలో నిను! కాంక్ష తీరదా?

     సుందరుఁడా! దయా సుగుణ సుందర మీవెర! సూక్ష్మ రూప! న

     న్నుం దరి చేర్చరా! కనగ నూత్న రహస్యము కానిపించు. న

     న్నొందు హరీ! మదిన్ వెలసి యుండెడి దీవెర! వేణు గోపకా! 79.

క:- దరివాడ నే కనెద నం  -  దరిలో నిను! కాంక్ష తీరదా? సుందరుఁడా! 

     దరి చేర్చరా! కనగ నూ  -  త్న రహస్యము కానిపించు నన్నొందు హరీ!  79.

గీ:- కనెద నందరిలో నిను కాంక్ష తీర; -  సుగుణ సుందర మీవెర! సూక్ష్మ రూప! 

      కనగ నూత్న రహస్యము కానిపించు. -  వెలసి యుండెడి దీవెర వేణు గోప!  79.

ఉ:- సుందరహాసమే ఫలము చూడర; సాదర ! వాంఛ తీర. లౌ

     ల్యందనమున్ నినున్ కనుల హాయిగ చూడము గర్వమబ్బ. ని

     న్నుందరి జేర్చుచున్ మదిని నోచి రహించుట మన్ననంబ చే

     కొందు హరీ! నినున్. వినర కూర్మిని నామొర వేణు గోపకా! 80.

క:- దరహాసమే ఫలము చూ  -  డరసాదర వాంఛ తీర. లౌల్యందనమున్ 

     దరి జేర్చుచున్ మదిని నో  -  చి రహించుట మన్ననంబ చేకొందు హరీ! 80.

గీ:- ఫలము చూడరసాదర వాంఛ తీర. -  కనుల హాయిగ చూడము గర్వమబ్బ. 

      మదిని నోచి రహించుట మన్ననంబ -  వినర కూర్మిని నామొర వేణు గోప!  80.

ఉ:- ఈ యుగ ధర్మమీ కలుష సృష్టిగ దైవమ! గాంచ లేము శ్రీ

      శా! యశమా! యిటుల్ తమరు సల్పుట? ధర్మము తప్పుటే గదా?

      ఏ యుగ ధర్మమున్ తలప నీశుఁ గనంబడు తత్వమేది? స్తో

      త్రీయ హరీ!  మదిన్ విషయ తృప్తి యదేలర? వేణు గోపకా!  81.

క:- యుగ ధర్మమీ కలుష సృ  -  ష్టిగ దైవమ గాంచలేము శ్రీశా! యశమా! 

     యుగ ధర్మమున్ తలప నీ  -  శుఁ గనంబడు తత్వమేది? స్తోత్రీయ హరీ!  81.

గీ:- కలుష సృష్టిగ దైవమ! గాంచలేము -  తమరు సల్పుట? ధర్మము తప్పుటేగ?

     తలప నీశుఁ గనంబడు తత్వమేది? -  విషయ తృప్తి యదేలర? వేణు గోప!  81. 

చ:- నుత సుగుణాలయా! అట నినుం దగ పూజల హాయి గొల్పు దై

     వత క్రతువుల్ సుధా మధుర వాక్యసమృద్ధిని మాన్యు లెన్ని; య

     ద్భుత! ప్రగణింపగా యతనముం దగఁ జేతురు ధ్యాస నిల్పి; ద

     క్షతను హరీ! కృపన్ వెలయ గానవి చూడుమ! వేణు గోపకా!  82.

క:- సుగుణాలమా! అట నినుం -  దగ పూజల హాయి గొల్పు దైవత క్రతువుల్ 

      ప్రగణింపగా యతనముం -  దగఁ జేతురు  ధ్యాస నిల్పి; దక్షతను హరీ!  82.

గీ:- అట నినుం దగ పూజల హాయి గొల్పు -  మధుర వాక్యసమృద్ధిని మాన్యు లెల్ల 

      యతనముం దగఁ జేతురు  ధ్యాస నిల్పి; -  వెలయ గానవి చూడుమ! వేణు గోప!  82.

చ:- పలు జతనంబులన్  నిలిచె పండిత మండలి నిండుగాను టీ

      కలఁ దెలుపెన్ గదా కనుల కామిత మేర్పడ గాంచఁజేయ. లీ

      లలు సుతి మెత్తగా  కవిత లక్ష్యతఁ జెప్పెడు; గాంచి నిన్ను క

      న్నులను హరీ! మహా వినుత నూత్న పథంబిది! వేణు గోపకా! 83.

క:- జతనంబులన్  నిలిచె పం  -  డిత మండలి నిండుగాను టీకలఁ దెలుపెన్ 

     సుతి మెత్తగా  కవిత ల  -  క్ష్యతఁ జెప్పెడు; గాంచి నిన్ను కన్నులను హరీ! 83.

గీ:- నిలిచె పండిత మండలి నిండుగాను -  కనుల కామిత మేర్పడ గాంచఁజేయ. 

      కవిత లక్ష్యతఁ జెప్పెడు; గాంచి నిన్ను -  వినుత నూత్న పథంబిది! వేణు గోప! 83.

చ:- శుభ ఫల మందగా కొలుతు; శోభిలఁ జేయఁగ కోరుచుందు. ప్రీ

     తి భజనలన్ నినున్ పిలుతు దీనుల గావగ ప్రేమఁ జూపి. స

     త్శుభ తలపున్ గొనన్ వలతు చూడ; లసత్శుభ వర్ణనీయ! ల

     క్ష్య భవ హరీ! కృపన్ వెలసి కాంక్షను తీర్చర వేణు గోపకా!  84.

క:- ఫల మందగా కొలుతు; శో  -  భిలఁ జేయఁగ కోరుచుందు. ప్రీతి భజనలన్ 

     తలపున్ గొనన్ వలతు చూ  -  డ లసత్శుభ వర్ణనీయ! లక్ష్య భవ హరీ!  84.

గీ:- కొలుతు; శోభిలఁ జేయఁగ కోరుచుందు. -  పిలుతు దీనుల గావగ ప్రేమఁ జూపి.

    వలతు చూడ లసత్శుభ వర్ణనీయ! -  వెలసి కాంక్షను తీర్చర వేణు గోప! 84.

చ:- సమ తుల లేని; యీ  సతియు; సంతులు; బంధులు; చక్కఁ బల్క; నొ

     చ్చి; మనమునన్ గనన్  నిజము చెప్పగ నిద్దని నే తలంతు. భా

     గ్యమ? చలియించితిన్. నిజము. కాంతుల నిన్ గన నేర్పవయ్య! దు

     ర్గముఁడ! హరీ! మహా వినుత! గౌరవ రక్షక! వేణు గోపకా!  85.

క:- తుల లేని యీ  సతియు సం  -  తులు బంధులు చక్కఁ బల్క నొచ్చి; మనమునన్ 

     చలియించితిన్ నిజము. కాం  -  తుల నిన్ గన నేర్పవయ్య! దుర్గముఁడ! హరీ! 85.

గీ:- సతియు సంతులు బంధులు చక్కఁ బల్క -  నిజము చెప్పగ నిద్దని నే తలంతు.

     నిజము కాంతుల నిన్ గన నేర్పవయ్య! -  వినుత! గౌరవ రక్షక! వేణు గోప!  85.

చ:- అల చనువొప్పగా కరములందున యుండిన కారణంబు;నో

     ముల ఫలమే కదా! యటన్ పరగ మోవిని తాకెడు భాగ్య మెన్నవే

     ల్పుల ఘన భాగ్యమా మురళి పొందిన పుణ్యము; మోక్షమద్ది. ని

     క్కలయ హరీ! యెటన్ వినగ; కాంచగ; నీ దయ. వేణు గోపకా! 86.

క:- చనువొప్పగా కరములం  -  దున యుండిన కారణంబు; నోములఫలమే

     ఘన భాగ్యమా మురళి పొం  -  దిన పుణ్యము; మోక్ష మద్ది. నిక్కలయ హరీ! 86.

గీ:- కరములందున యుండిన కారణంబు;  -  పరగ మోవిని తాకెడు భాగ్య మెన్న

    మురళి పొందిన పుణ్యము; మోక్షమద్ది. -  వినగ; కాంచగ; నీ దయ వేణు గోప! 86.

చ:- ఘనతలఁ గాంచితిన్. నెమలి కన్నులు కానగ  నెత్తి కెక్కె; నో 

     చెనొ? సుకృతిన్ గనన్. మురళిఁ చెక్కిలి నద్దియు మోవిఁ జేరె .క్రే

     ణిని; వలపించుచున్ కమల నేత్రలు చేరిరి కౌగిలించ; ర

     మ్య! నరహరీ! నినున్ వెదకు మార్గముఁ జూపుమ! వేణు గోపకా! 87.

క:- తల గాంచితిన్. నెమలి క  -  న్నులు కానగ  నెత్తి కెక్కె ; నోచెనొ? సుకృతిన్

    వలపించుచున్ కమల నే  -  త్రలు చేరిరి కౌగిలించ  రమ్య నరహరీ! 87.

గీ:- నెమలి కన్నులు కానగ  నెత్తి కె -  క్కె. మురళిఁ చెక్కిలి నద్దియు మోవిఁ జేరె 

     కమల నేత్రలు చేసిరి కౌగిలించ!  - వెదకు మార్గముఁ జూపుమ! వేణు గోప! 87.

చ:- అల పరమాణువున్ మహదనంత రసాదిక మండలంబుతా

     తలపగ నేర్వనే! అటుల ధాత్రిని నిల్పిన యట్లెనిల్పితే!

      పలు వర భావనల్ సుధలు పంచ రసాదిగ చొక్కఁ జేతు; స

      త్ఫలద హరీ! ఎటుల్ వెలయ దక్షతఁ జేతువు? వేణు గోపకా! 88.

క:- పరమాణువున్ మహదనం  -  త రసాదిక మండలంబు తా తలపగ నేర్వనే! 

    వర భావనల్ సుధలు పం  -  చ రసాదిగ చొక్కుఁ జేతు; సత్ఫలద హరీ!  88.

గీ:- మహదనంత రసాదిక మండలంబు  -  అటుల ధాత్రిని నిల్పిన యట్లెనిల్పి!

     సుధలు పంచ రసాదిగ చొక్కఁ జేతు!  -  వెలయ దక్షతఁ జేతువు; వేణు గోప!  88.

ఉ:- శ్రీ మతిఁ గొల్పితే! పరవశించితిఁ నిన్ గని భక్తిఁ గొల్చి; చిత్

      శ్రీ మత మాత్రుకా విభవ రీతి తలంచితి; ప్రీతి తోడ నే.

      శ్రీ మతి మాలి నిన్ కొలువఁ జేరి తదేకతఁ గొల్వ నేర. శ్రీ

      ధామ! హరీ! కృపన్ విజయ ధామముఁ జేర్చర! వేణు గోపకా! 89.

క:- మతిఁ గొల్పితే! పరవశిం  -  చితిఁ నిన్ గని భక్తిఁ గొల్చి; చిత్ శ్రీమతమా!

     మతి మాలి నిన్ కొలువఁ జే  -  రి తదేకతఁ గొల్వ నేర. శ్రీ ధామ! హరీ!  89.

గీ:- పరవశించితిఁ నిన్ గని భక్తిఁ గొల్చి; -  విభవ రీతి తలంచితి ప్రీతి తోడ నే.

      కొలువఁ జేరి తదేకతఁ గొల్వ నేర. -  విజయ ధామముఁ జేర్చర! వేణు గోప్! 89.

చ:- నులి పలు మారులా పురిటి నొప్పులు దేవకి పొందఁ జేసి; భూ  

      స్థలిని కృపన్ సదా పుడమి చాలగ నిన్ గని పొంగఁ జేసి; ల

      గ్న డబడబల్ గనన్ సుఖము నందులు; భక్త యశోద యందఁ దో

      డ్పడిన హరీ! యిటుల్ వెలయ భావ్యమొ? చెప్పుమ! వేణు గోపకా! 90.

క:- పలు మారులా పురిటి నొ  -  ప్పులు దేవకి పొందఁ జేసి; భూస్థలిని కృపన్ 

      బడబల్ గనన్; సుఖము నం  -  దులు; భక్త యశోద యందఁ దోడ్పడిన హరీ! 90.

గీ:- పురిటి నొప్పులు దేవకి పొందఁ జేసి; -  పుడమి చాలగ నిన్ గని పొంగఁ జేసి; 

     సుఖము నందులు; భక్త యశోద యంద; -  వెలయ భావ్యమొ? చెప్పుమ! వేణు గోప! 90.

ఉ:- శ్రీ సుగుణాకరా! కరుణఁ జేరగ నీయవ? కాంచ వేమిరా?

      నీ సుతుఁడన్ గదా! కృపను నీ దరిఁ జేర్చుమ! క్షేమ మీయగా!

      మా సుగతిన్ నినున్ గొలువ మానగ నీయక కొల్పుమయ్య నా

      యాస హరీ! దయన్! విపుల హర్ష ప్రకల్పక! వేణు గోపకా!  91.

క:- సుగుణాకరా! కరుణఁ జే  -  రగ నీయవ? కాంచ వేమిరా?నీ సుతుఁడన్ !

      సుగతిన్ నినున్ గొలువ మా  -  నగ నీయక కొల్పుమయ్య నాయాస హరీ!  91.

గీ:- కరుణఁ జేరగ నీయవ? కాంచ వేమి?  -  కృపను నీ దరిఁ జేర్చుమ! క్షేమ మీయ!

     గొలువ మానగ నీయక కొల్పుమయ్య  -  విపుల హర్ష ప్రకల్పక! వేణు గోప!  91.

చ:- నిను మనసార నే తలతు నిన్ గనఁ గోరుచు, తాల్మి తోడ గా

     తును మహితాత్ముఁడా! మదికి తోచెద వీవు సమైక్య వర్తిగా.

     నను మనమందునన్. ప్రణవ నాద నయస్థితి ప్రాప్తిఁ; గొల్పు; ధ

     న్యునిగ హరీ! దయన్!  విపుల యోగ ప్రదీపక! వేణు గోపకా!  92.

క:- మనసార నే తలతు నిన్ -  గనఁ గోరుచు, తాల్మి తోడ గాతును మహితా .

      మనమందునన్. ప్రణవ నా  -  ద నయస్థితి ప్రాప్తిఁ; గొల్పు ధన్యునిగ హరీ!  92.

గీ:- తలతు నిన్ గనఁ గోరుచు, తాల్మి తోడ -  మదికి తోచెద వీవు సమైక్య వర్తి.

     ప్రణవ నాద నయస్థితి ప్రాప్తిఁ గొల్పు; -  విపుల యోగ ప్రదీపక! వేణు గోప!  92.

ఉ:- శ్రీ శివ మూర్తివో? పరగు శ్రీధవు డీవొకొ? బ్రహ్మ వీవొ? దై

     వేశుడవో? ననున్ కరుణఁ నెన్నుచు గాచెడి కన్న తండ్రివై

      తే! శివభావనన్ సకల తేజ విరాజిత సర్వ మీవొ? స

      ర్వేశ హరీ!  కృపన్ వెలయు మిప్పుడె నామది వేణు గోపకా!  93.

క:- శివ మూర్తివో? పరగు శ్రీ -  ధవు డీవొకొ? బ్రహ్మ వీవొ? దైవేశుడవో? 

      శివభావనన్ సకల తే  -  జ విరాజిత సర్వ మీవ! సర్వేశ హరీ!  93.

గీ:- పరగు శ్రీధవు డీవొకొ? బ్రహ్మ వీవొ?  -  కరుణఁ నెన్నుచు గాచెడి కన్న తండ్రి!

      సకల తేజ విరాజిత సర్వ మీవొ? -  వెలయు మిప్పుడె నామది వేణు గోప!  93.

చ:- శ్రిత భువనైకమై  చెలగి శ్రీ భువి జీవుల జీవమీవె.  బ్రో

      వ తగుదువే సదా! అరయ పావులు చేయుచు ఆడు దీవె. పొం

      దితి భవదీయమౌ సుగుణ తేజ వరిష్ఠముఁ జూడనిమ్ము. స

      మ్మతిని హరీ! కృపన్ విజయ మార్గముఁ జూపుచు వేణు గోపకా! 94.

క:- భువనైకమై  చెలగి శ్రీ  -  భువి జీవుల జీవమీవె. బ్రోవ తగుదువే! 

      భవదీయమౌ సుగుణతే  -  జ వరిష్ఠముఁ జూడనిమ్ము. సమ్మతిని హరీ! 94.

గీ:- చెలగి  శ్రీభువి జీవుల జీవమీవె. -  అరయ పావులు చేయుచు ఆడు దీవె.

      సుగుణతేజ వరిష్ఠముఁ జూడనిమ్ము. -  విజయ మార్గముఁ జూపుచు వేణు గోప!  94.

చ:- మనుప; రమాత్ముడా! కృపను మాధురి యొప్పగ గీత చెప్పి; త్రో

      వను తెలుపన్; ప్రభూ!  నుదుటి వ్రాతను మార్చితి నొప్పి బాపి. ద

      ర్శన వరమిచ్చి మా  అఘము సత్వర మొప్పుగ నార్పినావు ధా

      త్రి; నుత హరీ! కృపన్  విమల తేజము  నిల్పితి; వేణు గోపకా!  95.

క:- పరమాత్ముడా! కృపను మా  -  ధురి యొప్పగ గీత చెప్పి; త్రోవను తెలుపన్; 

     వరమిచ్చి మా  అఘము స  -  త్వర మొప్పుగ నార్పినావు ధాత్రి; నుత హరీ!  95.

గీ:- కృపను మాధురి యొప్పగ గీత చెప్పి; -  నుదుటి వ్రాతను మార్చితి నొప్పి బాపి. 

     అఘము సత్వర మొప్పుగ నార్పినావు. -  విమల తేజము  నిల్పితి; వేణు గోప!  95.

ఉ:- మా మదిఁ భద్రమా! అనుపమాన దయా! మది నాశఁ జేరినా

      వా మహిమన్? సదా సుఖద !  పావన దేవళ శోభఁ గూర్చి దే

      వా!  ముదమార నీ వెలుఁగ; భాగ్య దశ స్థితిఁ వెల్గి తేము. హా!

      రామ హరీ! మదిన్ వెలుగు ప్రాణమె నీవుగ! వేణు గోపకా! 96.

క:- మది భద్రమా! అనుపమా  -  న దయా! మది నాశఁ జేరినావా మహిమన్? 

      ముదమార నీ వెలుఁగ; భా  -  గ్య దశ స్థితిఁ వెల్గి తేము. హా! రామ హరీ! 96.

గీ:- అనుపమాన దయా! మది నాశఁ జేరి  -  సుఖద! పావన దేవళ శోభఁ గూర్చి 

      వెలుఁగ; భాగ్య దశ స్థితిఁ వెల్గి తేము. -  వెలుగు ప్రాణమె నీవుగ! వేణు గోప! 96.

చ:- బుడుతడవేలరా కొనగ? పూజలు; చేసెడు గొప్ప వారు! చ

      క్క; లలితమౌన్ గదా! తనివి గాంచగ నీమది తత్వమెన్ని; సా

      పడ కడు చక్కనౌ యడవి పండెడి పండుల నాశఁ బెట్టెడిన్

      గొలిచి హరీ! కృపన్ వినుమ! క్రోలిన బాగుర! వేణు గోపకా! 97.   

క:- తడవేలరా కొనగ? పూ  -  జలు; చేసెడు గొప్ప వారు! చక్క; లలితమౌన్. 

     కడు చక్కనౌ యడవి పం  -  డెడి పండుల నాశఁ బెట్టెడిన్  గొలిచి హరీ!  97. 

గీ:- కొనగ పూజలు; చేసెడు గొప్ప వారు! -  తనివి గాంచగ నీమది తత్వమెన్ని 

     యడవి పండెడి పండుల నాశఁ బెట్టె  -  వినుమ! క్రోలిన బాగుర! వేణు గోప! 97.   

చ:- గుడి గుడి లోన నీ  వెలుగు కోరెడి రీతిగ వెల్వరించి; కృ

      ష్ణుడి వయితే? సదా కరుణ శోభిలఁ గూర్చుమ కామితమ్ము; భృ

      త్యుఁడ! వడి నే నినున్ కనగ తోచెడు. కన్పడి కాంక్ష తీర్చు శ్రీ

      వలయు హరీ! కృపన్ వినుమ వారిజ నేత్రుఁడ! వేణు గోపకా!  98.

క:- గుడి లోననీ వెలుగు కో  -  రెడి రీతిగ వెల్వరించి; కృష్ణుడి వయితే? 

     వడి నే నినున్ కనగ తో  -  చెడు. కన్పడి కాంక్ష తీర్చు శ్రీవలయు హరీ! 98.

గీ:- వెలుగు కోరెడి రీతిగ ; వెల్వరించి; -  కరుణ శోభిలఁ గూర్చుమ కామితమ్ము; 

      గనగ తోచెడు.కన్పడి కాంక్ష తీర్చు -  వినుమ వారిజ నేత్రుఁడ! వేణు గోప!  98.

చ:- పలు పలు రీతులన్ ప్రబల భావలసద్గుణ భాగ్య మిచ్చి; భ

      క్తులఁ గనుదే! మమున్ తలచి; ఘోర కుయుక్తులఁ తప్పఁ ద్రోచి; నీ

      చుల పలు దౌష్ట్యముల్ కనుచు శోభిల దౌష్ట్యము కాల్తు వీవు. భృ

     త్యులను హరీ! కృపన్ వినగ యుక్తము నీ పని వేణు గోపకా! 99. 

క:- పలు రీతులన్ ప్రబల భా  -  వలసద్గుణ భాగ్య మిచ్చి; భక్తులఁ గనుదే! 

     పలు దౌష్ట్యముల్ కనుచు శో  -  భిల దౌష్ట్యము కాల్తు వీవు. భృత్యులకు హరీ! 99.

గీ:- ప్రబల భావలసద్గుణ భాగ్య మిచ్చి! -  తలచి; ఘోర కుయుక్తులఁ తప్పఁ ద్రోచి; 

     కనుచు శోభిల దౌష్ట్యము కాల్తు వీవు.  -  వినగ యుక్తము నీ పని వేణు గోప! 99. 

చ:- మది మది నీవెరా! విజయ మార్గ దివాకర! ప్రేమ రూపకా!

     సదయుఁడవే కదా! కవుల సాంద్ర ప్రభావన గాంచ నీవెరా!

      మది సుధలొల్క నా కవిత మార్గ దిశాదులఁ గాంచఁ జేతుగా

     సదయ హరీ! సదా విజయ సాధన నీ కృప వేణు గోపకా!  100.

క:- మది నీవెరా! విజయ మా  -   ర్గ దివాకర! ప్రేమ రూపకా! సదయుఁడవే! 

     సుధలొల్క నా కవిత మా  -  ర్గ దిశాదులఁ గాంచఁ జేతుగా! సదయ హరీ! 100.

గీ:- విజయ మార్గ దివాకర ప్రేమ రూప!  -  కవుల సాంద్ర ప్రభావన గాంచ నీవె!

      కవిత మార్గ దిశాదులఁ గాంచఁ జేతు!  -  విజయ సాధన నీ కృప వేణు గోప!  100.

చ:- తొలి చిగురాకులో మృదువు తూఁగగ సృష్టిని మేలొనర్చి; కా

      చెడి ప్రభువా! కృపన్ మధువు చిందెడి వృక్ష సుమాలఁ గొల్పి; నీ

      విల సుగుణాకృతిన్ సుజను నేలగ నిల్చితొ? శుభ్ర దేహ! ల

      బ్ధుఁడవె హరీ! దయన్ వెలసి; పూజ్యత నిల్చిన వేణు గోపకా! 101.

క:- చిగురాకులో మృదువు తూఁ  -  గగ సృష్టిని మేలొనర్చి; కాచెడి ప్రభువా! 

      సుగుణాకృతిన్ సుజను నే  -  లగ నిల్చితొ? శుభ్ర దేహ! లబ్ధుఁడవె హరీ! 101.

గీ:- మృదువు తూఁగగ సృష్టిని మేలొనర్చి; -  మధువు చిందెడి వృక్ష సుమాలఁ గొల్పి; 

     సుజను నేలగ నిల్చితొ? శుభ్ర దేహ!  -  వెలసి; పూజ్యత నిల్చిన వేణు గోప! 101.

చ:- నను మది నేలరా! పరమ నైష్ఠ్య! దిగంతుఁడ!; భవ్య తేజ!  ప్రా 

      ర్థన వినుమా మదిన్.  బహుళ ధన్యతఁ గొల్పెడి భవ్యమూర్తి! నన్

      కను ముదమారగా ధరణిఁ గాచు దయాంభుధి! తత్వ మెన్నుచున్

      గనర హరీ! దయన్! విపుల కామిత పూరక! వేణు గోపకా! 102.

క:- మది నేలరా! పరమ నై  -  ష్ఠ్య! దిగంతుఁడ!; భవ్య తేజ!  ప్రార్థన వినుమా! 

      ముదమారగా ధరణిఁ గా  -  చు దయాంభుధి! తత్వ మెన్నుచున్ గనర హరీ! 102.

గీ:- పరమ నైష్ఠ్య! దిగంతుఁడ!; భవ్య తేజ!  -  బహుళ ధన్యతఁ గొల్పెడి భవ్యమూర్తి! 

      ధరణిఁ గాచు దయాంభుధి! తత్వ మెన్ను -  విపుల కామిత పూరక! వేణు గోప!  102.

చ:- వినఁ పటు నైపుణుల్ ప్రణుత వేంకట సన్యసి రామ తండ్రి గా

      రును;  కనగా సుధీవర గురుండు; ప్రగణ్యులు! భవ్య మూర్తి తా.

      వినఁ పటు భక్తురాల్ జనని వేంకట రత్నము జన్మ నిచ్చి, గా

      చెనుర హరీ! ననున్ పెనిచె చిత్తముఁ జేరిచి వేణు గోపకా!  103.

క:- పటు నైపుణుల్ ప్రణుత వేం  -  కట సన్యసి రామ తండ్రి గారును;  కనగా 

      పటు భక్తురాల్ జనని వేం  -  కట రత్నము జన్మ నిచ్చి, గాచెనుర! హరీ! 103.

గీ:- ప్రణుత వేంకట సన్యసి రామ తండ్రి  -  వర గురుండు; ప్రగణ్యులు! భవ్య మూర్తి. 

     జనని వేంకట రత్నము జన్మ నిచ్చి,  -  పెనిచె చిత్తముఁ జేరిచి వేణు గోప! 103.

ఉ:- ఓ యరి నాశకా! రచన నోర్చి రచించితి రామ కృష్ణ చిం

      తా; యను నే; నిటన్ నెనరు; దర్పము; దెల్పగ నీ ప్రశస్తి;  ప్రా 

      పై యరమున్.  గనన్ కెలయు బంధుర కందము గీత మిందు తో

      డాయె హరీ! కృపన్ వినుమయా శతకంబును వేణు గోపకా!  104.

క:- యరి నాశకా! రచన నో  -  ర్చి రచించితి రామ కృష్ణ చింతా; యను నే

     యరమున్ గనన్  కెలయు బం  -  ధుర కందము గీత మిందు తోడాయె హరీ!  104.

గీ:- రచన నోర్చి రచించితి రామ కృష్ణ  -  నెనరు; దర్పము; దెల్పగ నీ ప్రశస్తి.  

     కెలయు బంధుర కందము గీత మిందు  -  వినుమయా శతకంబును వేణు గోపకా!  104.

ఉ:- శ్రీ గుణ ధాముఁడా! వినగ ప్రేరణ భద్రము వేణు గోపరా!

      భాగవతాఢ్యుఁడౌ బుధుఁడు వఝ్ల నృసింహుని బోధనంబు కాన్;

      తా గణనీయమై చెలఁగు ధారణ కల్గి రచించి తేను; రా

      వేగ; హరీ! కృపన్ వినర ప్రీతిగ నియ్యది; వేణు గోపకా!  105.

క:- గుణ ధాముఁడా! వినగ ప్రే  -  రణ భద్రము వేణు గోపరా! భాగవతా! 

      గణనీయమై చెలఁగు ధా  -  రణ కల్గి రచించి తేను; రావేగ; హరీ! 105.

గీ:- వినగ ప్రేరణ భద్రము వేణు గోప .-  బుధుఁడు వఝ్ల నృసింహుని బోధనంబు ;

      చెలఁగు ధారణ కల్గి రచించి తేను;  -  వినర ప్రీతిగ నియ్యది; వేణు గోప! 105.

చ:- దొర! నగ ధారి! మా అఖిల దోష గుణంబుల నాపుమయ్య!సా  

     దరముగ నన్ తగన్ కనుమ దారిని చూపుచు కాంక్ష తీర; స

     చ్చిర సుగుణాకృతిన్ వరలఁ జేయగ నీకది భావ్య మయ్య! ఆ

     సురుఁడ! హరీ! కృపన్ వినర! చూడర! నాకృతి! వేణు గోపకా! 106.

క:- నగ ధారి! మా అఖిల దో  -  ష గుణంబుల నాపుమయ్య సాదరముగ! నన్ 

     సుగుణాకృతిన్ వరల జే  -  యగ నీకది భావ్య మయ్య! ఆసురుఁడ! హరీ! 106.

గీ:- అఖిల దోష గుణంబుల నాపుమయ్య! -  కనుమ దారిని చూపుచు కాంక్ష తీర 

     వరల జేయగ నీకది భావ్య మయ్య!  -  వినర! చూడర! నాకృతి! వేణు గోప! 106.

చ:- సుమ మధురీతిగా వినినచో ప్రథమంబుగ వేణు గోప ప

     ద్యములు; కృపన్ సదా శతక మందు కనంబడి; క్షామ మంతటిన్;

     తమ వ్యధలన్నిటిన్ తరిమి;  తన్మధురంబగు తత్వ మిమ్ము! నా

     డె మను హరీ! భువిన్. విదితుడే నిను గాంచును వేణు గోపకా! 107.

క:- మధురీతిగా వినినచో  -  ప్రథమంబుగ వేణు గోప! పద్యములు; కృపన్ 

      వ్యధలన్నిటిన్ తరిమి;  త  -  న్మధురంబగు తత్వమిమ్ము. నాడె మను హరీ! 107.

గీ:- వినినచో ప్రథమంబుగ వేణు గోప  -  శతక మందు కనంబడి; క్షామ మంత;

      తరిమి;  తన్మధురంబగు తత్వమిమ్ము!  -  విదితుడే నిను గాంచును వేణు గోప!  107.

ఉ:- మంగళ మందుమా! మధుర మంగళ  గీతుల మంగళంబుగా!

      మంగళుఁడా! సుధా మధుర మంగళ కందపు మంగళంబురా! 

     మంగళ మందుమా! మధుర మంగళ వృత్తుల మంగళంబుగా;  

      మంగ హరీ! సదా వినుత మంగళ రూపుఁడ! వేణు గోపకా! 108.

క:- గళ మందు; మా మధుర మం  -  గళ  గీతుల మంగళంబు గా! మంగళుఁడా! 

    గళ మందుమా! మధుర మం  -  గళ వృత్తుల మంగళంబు గా!  మంగ హరీ! 108.

గీ:- మధుర మంగళ  గీతుల మంగళంబు!  -  మధుర మంగళ కందపు మంగళంబు! 

    మధుర మంగళ వృత్తుల మంగళంబు!  -  వినుత మంగళ రూపుఁడ! వేణు గోప! 108.

     

శ్రీమత్కాణ్వశాఖీయులైన చింతా వేంకట రత్నం, సన్యాసి రామా రావు  పుణ్య దంపతుల పుత్రుండును, శ్రీమాన్ కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల వారి ప్రియ శిష్యుఁడును, శ్రీ షిరిడీశ దేవ శతక, శ్రీ శివాష్టోత్తర శత పంచ చామరావళి నామంబునంబరగు శివ శతక, వృద్ధ బాల శిక్ష శతక, రామ కృష్ణ శతక కర్తయు,ఆంధ్రామృతం బ్లాగు నిర్వాహకుండునగు చింతా రామ కృష్ణా రావు విరచిత  శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పలశతకము  సంపూర్ణము.

మంగళం                                   మహత్                                     శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

కవి  చింతా రామకృష్ణారావు. జననము. తే. 06 - 10 - 1951.

వేట్లపాలెం. తూర్పుగోదావరి జిల్లా.

తల్లి. కీ.శే. చింతా వేంకటరత్నమ్.

తండ్రి. కీ.శే. చింతా సన్యాసి రామారావు.

గురుదేవులు. కీ.శే. కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యులు.

స్వస్థలము. సర్వసిద్ధి గ్రామము. విశాఖపట్టణం జిల్లా.

నివాసము. మియాపూర్, భాగ్యనగరము.

దూరవాణి సంఖ్య. 8247384165.

ఈ మెయిల్ ఐడీ. < chinta.vijaya123@gmail.com > 

నిర్వహిస్తున్న బ్లాగు.. ఆంధ్రామృతమ్.


కృతికర్త.  

భాషాప్రవీణ., చిత్రకవితాసమ్రాట్., కవికల్పభూజ., పద్యకవితాభిరామ,  చిత్రకవితా సహస్రఫణి,  

పుంభావ భారతీ , చింతా రామ కృష్ణా రావు. P.O.L., M.A., 

విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.

ఫ్లాట్ నెం. A 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.

తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165 

రచనలు.

 1) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.

 2) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో, ప్రతీపాదమునా మూడు     

    ప్రాసయతులతో ఒక్క రోజులో వ్రాసినది.)

 3) ఆంధ్రసౌందర్యలహరి.

 4) ఆంధ్రామృతమ్,  పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో అనేక స్వీయ రచనలు.

 5) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.

 6) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.

 7) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

 8) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)

 9) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.

10) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.

11) బాలభావన శతకము.

12) మూకపంచశతి పద్యానువాదము.

13) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.

14) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

15) రాఘవా! శతకము.

16) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

17) రుద్రమునకు తెలుగు భావము.

18) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

19) వసంతతిలక సూర్య శతకము.

20) విజయభావన శతకము.

21) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

22) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు. 

23) శ్రీ అవధానశతపత్రశతకము.

24) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.

25) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.

26) శ్రీచక్రబంధ మంగళాష్టకము.

27) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.

28) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.

29) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత నృసింహనామాంచిత 

      118 ఛందో గర్భ చిత్ర సీసపద్య శతకము.)

30) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)

31) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.

32) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

33) శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.

34) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.

35) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. (బంధచిత్రకృతి ఒకే శతకమున 

      మూడు మకుటములతో మూడు శతకములు.) 

36) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)

37) శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క రోజులో వ్రాసినది.)

38) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త శివశతకము.

39) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు, సీతాన్వయముగా తేటగీతి 

    పద్యములు, హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో సుందరోత్పల నక్షత్రమాల.)

40) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)

41) సువర్ణమాలా స్తుతి. శంకరులశ్లోకములకు పద్యానువాము.

42) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో అష్టోత్తర శత పాద    

    ఉత్పలమాలిక.

43) శ్రీరామ పట్టాభిషేకం. తేదీ. 10 - 3 -2025 మరియు 11 - 3 - 2025.తేదీల మధ్యవిరచితము.

44) శాంభవీ శతకము.(మధ్యాక్కర గర్భ చంపకోత్పలాలు.)( ఏకదిన విరచితము) 20 – 4 – 2025.

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.