జైశ్రీరామ్.
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
"యువత-భవిత"
౧.శా. శ్రీమన్మంగళ భారతావని సదా శ్రేయోభిరామమ్ముగా
భూమిన్ వెల్గఁగ హేతు వీ యువత, తా పూజ్యప్రవృత్తిన్ లసత్
ప్రేమోదారసుధాస్రవంతియన సద్విఖ్యాతితో సృష్టిలో
క్షేమంబున్ సహవాసులన్ గనెడి సచ్ఛ్రీమార్గమందొప్పుతన్.
౨.చ. యువత శుభాస్పదంబయిన నుజ్వల దివ్యమనోజ్ఞమైన సద్
భవితను గాంచనెంచవలె, వర్ధిలు మార్గము లెంచి, యుక్తమౌ
ప్రవర పథంబులో నడచి, భద్రతనొప్పెడి భావి నిప్పుడే
కువలయమందు నెంచుకొని కోరిన రీతి గ్రహింగాఁదగున్.
౩.ఉ. బాల్యమునుండి పిల్లలకు భక్తియు, యుక్తియు, శక్తిఁ గొల్పుచున్,
లౌల్యము చేరనీక మదులన్ స్థిరనిర్ణయమొప్ప నేర్పు చా
కుల్యత లేని గొప్ప కుదురైన మనంబును కల్గఁ జేసి, ప్రా
బల్యము పెంపు చేసుకొను పాఠములన్ వచియింప యుక్తమౌన్.
౪.శా. స్వాధీనుండయి, నిశ్చితాత్ముఁడగుచున్ సంపాదనా శక్తి తా
మేధా శక్తిని పొంది, సంఘమునకున్ మేల్జేయు సుజ్ఞానిగా
బోధన్ గొల్పు విధంబుగా నడచుచున్ పూజ్యుండటంచంతటన్
సాధింపన్ వలె, కీర్తి నట్టి ఘనుఁడే సాధించునౌన్నత్యమున్.
౫.మ. పిననాడే పర సంపదన్ బ్రతుకుటన్, వేధించి సాధించుటన్,
గొనుటన్ పేదల సొమ్మునూరకనె, సాకుల్ జెప్పుచున్ కాలయా
పనమున్ జేయుట, నేరనట్టి గతిలో పాఠంబులన్ జెప్పుచో
మన నేర్చున్ తన కాళ్ళపై యువత క్షేమంబొప్పగా భావిలోన్.
౬.చ. ఉచితము లొందుచుండుటను నోపరు కష్టము చేయనెవ్వరున్,
సుచరితులై స్వతంత్రముగ శోభిలఁ జాలరు బద్ధకస్తులై,
పచనము చేసిపెట్టునెడ వండుటకేల మనంబు వచ్చు? సా
గుచునిటులుండ, భావిని యగోచరమంచు గ్రహింపనెట్టులౌన్?
౭.చ. చదువులు నేర్పునప్పు డటు సంపద గూర్చు స్వశక్తి గొల్పగా
మదికినినెక్కు పాఠములు మన్ననతో వివరింపగావలెన్,
పదునగు మేధఁ గొల్పవలె భాగ్యము సృష్టిని చేయునట్లుగన్,
పదువురి కో యుపాధినిడు భావన పెంచిన వర్ధమానుఁడౌన్.
౮.మత్త. వృత్తివిద్యల శిక్షణంబిడ పృథ్విపైనెటనుండినన్
జిత్తశుద్ధిని సంపదల్ గని క్షేమమొప్పఁగ జీవనం
బెత్తరిన్ సుఖమొప్పగా నడిపింపగానగు శక్తితోన్,
మత్తువీడిన శక్తియే వరమౌ ధరన్ యువతాకృతిన్.
౯.చ. యువతకుఁ గొల్ప సద్భవిత నొప్పుగ ధర్మ విశుద్ధ చిత్తులై,
కువలయమందుఁ జూచి యనుకూల పరిశ్రమలన్ రచించుచున్,
ప్రవిమల శిక్షణంబులిడి, భావిని మేలుగ వాడు వస్తువుల్
ప్రవరముగా సృజించునటు భవ్యముగా నొనరింపగా వలెన్.
౧౦.ఉ. భిక్షకు చేయి చాపుటను, భీరువుగా తలయొంచి యుండుటన్,
రాక్షసబుద్ధి నుంటను, భరంబుగనన్యులపైన మన్కి, స
ల్లక్షణ దూర వర్తనము లక్ష్యముతో నెడబాపి, చక్కనౌ
శిక్షణ నీయగా వలెను చిన్నతనంబునే శుభార్థులై.
౧౧.శా. నిర్లిప్తంబగు జీవనంబు విడుచున్, నిస్తంద్రతన్ మెల్గుచున్,
స్వర్లోకాద్భుత హర్మ్య భర్మముల త్రోవన్ వీడి స్వప్నంబులన్
దోర్లీలన్ సృజియించు వాని గనుచున్, దుర్నీతులన్ వీడుచున్,
స్వర్లోకంబుగ భారతావనిని ధ్యాసన్ జేయుతన్ ధీనిధుల్.
౧౨.గుప్త పంచమ పాద గోమూత్రికాబంధ ఉత్పలమాల.
భావంబందలి వెల్గు నేర్పు నుత సేవాసక్తి, నుత్పాద్యతన్,
భావిన్ భారతి వెల్గు నీ యువత సేవన్ భాతి నత్యున్నతి(న్),
న్భావ స్వేచ్ఛ, గణింపుచున్ యువత లోనన్ యోగ్య సంపత్ప్రభన్
భావిన్ స్వచ్ఛత తోడ వెల్గు వసుధన్ భాసింప సంస్కారముల్.
౧౩.అనేక ద్వివిధ కంద గీత గర్భ చంపక మాల.
వర నుతమేదినిన్ నిధుల భారత దేశము నిండుకుండరా,
పర హితమౌశుభాకరము భక్తితరంగపు కల్పవల్లి, ధీ
వర ధృతిచేతనే యువత భాగ్య తలంబిది యుచ్ఛఁ గొల్పుగా,
పర గతియౌమహా సుగతి భారతి భావికి శోభఁ గూర్చురా!
౧౪. శివలింగ బంధ భావ గోపనచిత్ర ఉత్పలమాల.
శ్రీయుత భావ! భారత ప్రసిద్ధి నృపాలకులంతరాత్మలన్
జేయఁగ నౌను చింతనను, చేసి యపార మహార్తి బాధితుల్
మాయ,కొలాలు చూపుచును మాడు జనంబుల ప్రేమ వీడరా
దేయని దేహియంచననిదీనులె యుండని తీరు నేలుతన్.
౧౫.శుద్ధ నిరోష్ట్య తేటగీతి(ఉ ఊ ఒ ఓ ప ఫ బ భ మ వ/వర్ణ నిషేధము)
తైజ సాకృతి నెనలేని ధారణ, నిజ
శక్తి నెన్నగ తనరిట చాలినంత
కీర్తి గని, జననేతలీ క్షితిని సహజ
శ్రీశ! కాంతిని దనరిన శ్రీనిధిదియె.
౧౬.మణిప్రవాళ మాలిని.
యువత భవిత దేఖో, యుద్ధతే నాఽస్తి కించిత్,
ప్రవణ గరిమ గ్రేటే, వర్ధనంబెన్న డౌటే,
నవత గనఁగ ఫారన్ నప్పునంచున్ చలంతి,
ప్రవరవరులు, హేరామ్! వారలన్ గావు మాల్వేజ్!
౧౭.శ్రీచక్రబంధ తేటగీతి.
కనఁగ మీశక్తి శ్రీమాత కాంతి చేత,
లక్ష్యమీడేరు సుశ్రీ యువాళి బ్రతుక,
సిరుల భారతీ శ్రీమాత మిమ్ము బ్రోచు,
కమల వాసిని తప్పక కాంచునింక.
౧౮.చ`తురంగ స్వస్తిక్ బంధ లఘు కందము.
(గుఱ్ఱపుటెత్తులలో వచ్చు పదములు యువతకు - భవితను - ప్రజలిల - కొలుపుత,)
జననుత ప్రభువులు యువతకు
ఘనమగు ధృతియు నిలుపుత, సుకర వర! కొలువుల్
ఘన తకు సులలితముగ మన
ను నిజ బృతికి భవితకు ప్రభను గొనవలెనిలన్.
౧౯.చ. త్రికరణ శుద్ధితో యువత ప్రేమను కోరెడి పాలకోత్తముల్
ప్రకటనలిచ్చుచుండవలె భన్యపు జీవన వృత్తులిచ్చుటన్,
ముకుళిత హస్తులై విధులు పొంది మహత్తర సేవఁ జేయుచున్
సకలజగంబునన్ యువత చక్కగ కీర్తిని పొందగా వలెన్.
౨౦.ఉ. మంగళమౌత భారతికి, మంగళమౌ యువసజ్జనాళికిన్,
మంగళమౌత శాంభవికి, మంగళమౌగురుదేవపాళికిన్,
మంగళమౌత సత్కవుల మంగళ సత్కవితాసుధారకున్,
మంగళమౌత మీకు, పరమాత్మునకెల్లెడమంగళంబగున్.
స్వస్తి.
చిత్ర బంధ పద్యముల వివరణ.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.