గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, జూన్ 2025, శనివారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి సతీ శతకము రచన. చింతా రామకృష్ణారావు

 అష్టోత్తరశత సతీ అశ్వధాటి

సతీ శతకము

రచన. చింతా రామకృష్ణారావు


పండితాభిప్రాయములు.
శ్రీ సూరం శ్రీనివాసులు గారి అభిప్రాయం.

అశ్వధాటి.
     సంస్కృత రూపకాలలో ప్రస్తావనలో ప్రరోచనాత్మక వచనాలుంటాయి ఒక వాస్తవికతను ప్రతిపాదిస్తూ.  అలాగే చింతా రామకృష్ణారావు గారి సతీశతకాన్ని గురించి ప్రస్తావించినప్పుడు నాలుగు మాటలు రాద్దా మనిపించింది.
     కవి చింతా రామకృష్ణారావుగారు భక్తి లోకానికి బంధ కవిత్వాన్ని నడిపించ గలవారు. నామాలకు రూపాన్ని కలిగించగలవారు.  రూపాలలో చైతన్యాన్ని నింపగలవారు.  ఎదుగుదలకూ ఒదుగుదలకూ రెండింటికీ తనలో తావు నివ్వగలవారు.  కవులకు తలలోని నాలుకవంటివారు.  నిరంతరాధ్యయన శీలి.  వాఙ్మయ తపస్సునకు అధిష్ఠానం.
 “అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియ, హితంచ యత్, 
స్వాధ్యాయాభ్యసనంచైవ వాఙ్మయం తప ఉచ్యతే” ..అన్న గీతా వాక్యమే 
ఆదర్శమైనవారు.
     ఇక శతక విషయం సతీదేవి పార్వతి పూర్వరూపం. 
“అథావమానేన పితుః ప్రయుక్తా  
దక్షస్య కన్యా భవ పూర్వపత్నీ
సతీ సతీ యోగ విసృష్టదేహా
తా జన్మనే శైలవధూం ప్రపేదే”   అని కళిదాస వచనం.
కన్న తండ్రియే అవమానిస్తే భరించలేక దేహ త్యాగం చేసిన అభిమానవతి సతి.  ధనపతి సఖుఁడైనా తనకున్నదే తనదని తిరిపమెత్తే భర్త చూపిన బాటలోనే,  తన భర్త ఎంతటివాడైనా తన విలువయే తనదని నమ్మిన దేవి సతి.  ఆ సతీదేవి విషయమైనప్పుడు ఇక కవిత కదం త్రొక్కటానికి అభ్యంతరమేముంది.
     ఇక ఛందస్సు అశ్వధాటి. సంస్కృతంలో శిఖరిణి అశ్వధాటి విశిష్ట గతితో ఆకర్షించేవి. చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవనవాటీషు నాకిపటలీ మొదలైన అశ్వధాటి అందరినీ కదుపుతుంది.  వాదిరాజ తీర్థరు రచించిన దశావతార స్తుతి అశ్వధాటికే అందాలు అద్దుతుంది. ఆటువంటి ఛందస్సులో శతకం వ్రాయటం గతి తప్పని గతిలో తీర్చిదిద్దటం అంత తేలిక యేమీ కాదు.  అయినా చింతావారి ప్రయోగశీలత భాషా ఛందస్సులపై పట్టు అశ్వధాటివైపే వారిని నడిపాయి.  భక్తి భావానికి సామాజికతను కూడా జోడించి సతీదేవి శతకాన్ని ఆవిష్కరించారు రామకృష్ణారావుగారు.
12. లోకంబులో కృతులనేకంబులున్న విక నీకేల చింత యన కో
లోకేశ్వరీ కృతులు నీకై రచింపగను నాకిమ్ము శక్తి కృపతో,
నీకై రచింపగను లేకున్నచో బ్రతుకు నాకేలనమ్మ భువిపై,
చీకాకులన్ బడక నీకై రచించుటది నాకిచ్చు ముక్తిని సతీ!
ఇది చింతా వారి ముక్తి వాంఛ కృతి నిర్మాణంలో. ఇది వ్యక్తిగతం. 
ఇక సామాజికంగా కూడా వారి చింత, చింతన ప్రత్యక్షర సత్యాలుగా కనిపిస్తాయి. 
80. ధర్మానువర్తులిల మర్మంబెఱుంగరుగ ధర్మార్థమే బ్రతుకుచున్.
దుర్మార్గులట్టియెడ దుర్మార్గమున్ నెరపి ధర్మంబునే గెలుతురే 
ధర్మంబె యోడిన యధర్మంబురాజగును ధర్మంబునే నిలుపుమా.
మర్మజ్ఞులన్ దునుమ ధర్మంబునిల్చును సుకర్మల్ వెలుంగును సతీ!
     అశ్వధాటి అదే వేగంతో ప్రగతి పథంలో పయనించాలని ఆశిస్తూ  అభినందిస్తూ......
సూరం శ్రీనివాసులు. 
26 . 11 . 2022.
అంకితము.
శ్రీ మన్మంగళ కల్వపూడి వేంకట వీర రాఘవాచార్య సుభద్రా గురు దంపతులకు. 
శ్రీకల్వపూడి కుల రాకాసుధాకరులు నాకూర్మి రాఘవ గురుల్
నాకైతకున్ బలము నాకున్ బ్రభాకరులు. నాకున్న శక్తి కనగా.
నేకోరినట్టిఫల మీకావ్య సద్రచన నాకున్ బ్రసాద మరయన్.
నాకున్న సద్గురునికీ కైతనంకితము నే కొల్పెదన్ గొన సతీ!


అక్షరక్రమములో పద్యసంఖ్య.
101. అంగీకరించెద ననంగున్ జయింపమిని 
105. అంబా విషాద వలయం బేల చుట్టె నను 
59  అగ్రాహ్యముల్ విడిచి సుగ్రాహ్యముల్ గొను 
 8. అజ్ఞాన దుశ్చరిత, లజ్ఞాన భావనల, 
16. అబ్జాత పత్ర ముఖి కుబ్జత్వమున్ 
96. అమ్మా నినున్ దలవనిమ్మా నిరంతర 
17. అమ్మా భవత్ పదము లిమ్మానసంబునను 
5. అశ్రాంతమున్ జనుల సుశ్రేయమున్ 
95. ఆచారబోధిత సమాచారముల్ తెలిసి 
64 ఆశావహంబయిన ధీశక్తి నే నడుగ, 
14. ఆశావహుల్ జగతి నాశంబు చేయుదురు 
24. ఆహారమీవె కన నాహార్యమీవె, కల 
48. ఇల్లాలివై హరుని చల్లంగఁ గాచు 
45. ఉత్సాహ మీవె కద ప్రోత్సాహ మిచ్చుచు 
50. ఏనాటి పుణ్య ఫల మీనాడు కల్గుటిది 
33. ఏలో సృజించితివి నీలాంబరంబచట 
20.  ఓంకార రూపిణివి యోంకార భాసినివి 
75. ఓ పార్వతీ. ప్రతిభనే పంచి పద్యములు 
38. ఓ పార్వతీ! సుగుణమే పంచుచున్ జనుల 
70. కన్నన్ నినున్ గలుగు మిన్నైన సత్ఫలము 
43. కన్నార నిన్నుఁ గన నెన్నన్,  గనన్ జనమి 
15. కల్లల్ కనన్ జగతి, నెల్లప్పుడున్ నిజము 
68. కల్లోలముల్ ప్రబలె ముల్లోకముల్ కలఁగ 
51. కర్ణామృతంబయిన స్వర్ణాక్షరాళినిడి 
84. కష్టంబులేలనిల నష్టంబులేల పరి 
103. కష్టాష్టకంబునిల సృష్టించి మమ్ములను 
47. కాత్యాయనీ జనని సత్యస్వరూపిణివి 
69. కాదంబ సద్వన ప్రమోద ప్రవాసినివి 
87. కామాంధులీజగతి నేమాత్రమున్ వరుసలేమీ 
107.కామేశ్వరీ! కృపను బ్రేమామృతంబు నిక 
  4. కాయంబశాశ్వతము. కాయంబు లేని తరి 
23. కాలంబు నీవనుచు నీలీలలం గనుచు 
104. కాలప్రవాహమునకే లేదుగా తుదియె 
39. క్షేత్రంబు నీవె కన క్షేత్రజ్ఞవీవె కన, 
99. చింతా వరాన్వయుఁడ నంతా ననున్ గృపను 
28. చిత్తంబులో గల మహత్తైన శక్తివి, 
52. జాలిన్ సుధీవరు కపాలిన్ వరించితివి 
40. జ్ఞానామృతంబు గొన మానావమానముల 
71. తల్లీ జగజ్జనని! సల్లీలతో కృపను 
56. దారుల్ గనంబరిచి నేరంబులన్ గొలిపి 
91. దీనావనాభిరత మౌనంబదేల మము 
97. దీనావనా! జనని. ప్రాణంబె నీవు కద 
106. దీనాళి నేలెడి సుధీ నామొరన్ వినుమ 
74. దేదీప్యమానమగు నీ దివ్య రూపము 
21. దైవాంశ లేక నిను భావింపనెట్టులగు? 
13. దోసంబులెన్నకుమ, భాసించు మంచిఁ 
80. ధర్మానువర్తులిల మర్మంబెఱుంగరుగ 
46. ధీశక్తి వీవగుచుఁ బ్రాశస్త్యమున్ గొలుపుమా 
31. నిత్యారుణద్యుతిని సత్యప్రబోధవయి 
27. నీ దివ్య తత్వమును సాధుస్వభావమును 
7. నీ దివ్య నామమును నీ దివ్య రూపమును 
49. నీ పాద సేవనము పాపాంధ వారణము 
3. నీ రూపమే కనిన నేరూపమున్ గనఁగఁ
54. నీలాలకా! సుగుణ పాలా! త్రిలోక 
18. నీలాల నింగినిటులేలీలఁ జేసితివి? 
32. పంకేరుహానన! కుశంకల్ మదిన్ విడిచి 
63 పంకేరుహాక్షివి! యుటంకింతు నీ మహిమ 
9. పల్కంగ నేరవొకొ? యల్కన్ మదిన్ నిలిపి 
94. పాపంబులన్ విడువ కోపంబులన్ 
53. పాలింపుమా సుకృతినాలింపుమా కృపను 
26. పూర్ణంబు నీవె, యిల వర్ణంబులీవె 
25. పూలన్ గనన్ గలవు, నేలన్ గనన్ గలవు 
90. ప్రారబ్ధ కర్మ ఫలమేరీతిఁ బాయనగు 
22. బాలార్క తేజమునఁ బాలింప భక్తులను 
36. భద్రేభ గామిని! సుభద్రాక్షయాక్షర 
29. భారంబు నీది శుభ తీరంబుఁ జేర్చగను
37.  భూజంబులే సుఫల రాజంబులున్ సుగుణ 
76. భూమిన్ జనించు మము నీ మానసంబునను 
100. భ్రాంతిన్ శివా శతకమంతా పఠించు గుణ 
42.  మంత్రంబు లీవె కద, యంత్రంబు లీవెగ 
66.  ముంజేతి కంకణమ! సంజీవి వీవె కద, 
89. ముల్లోకముల్ కొలిపి యుల్లాసమొప్పగను 
6.   రక్షించు మా జనని! రక్షించుమా, జన 
86. రాజాధిరాజయిన పూజింపకున్న నిను 
60. రాజాధిరాజులకు నేఁ జాలనీయఁగను 
83. రాజిల్లఁ జేయ నను నీ జాతకం బెవరు 
67. రాజేశ్వరీ! వినుత రాజీవ నేత్రి! నిను 
55. రాత్రించరుల్ దురిత పాత్రుల్ దురాత్ములయి 
92. రామాభిరామవుగ శ్రీమాతరో సుగుణ 
82. లీలావినోదముగనేలో సృజించుటిది 
12. లోకంబులో కృతులనేకంబులున్న 
2.   వందారు భక్తజన మందారమా! నిలుమ
77. విజ్ఞానమీవె కద. విజ్ఞాన తేజము 
65. విద్వన్నుతుండనని సద్వర్తనుండనని 
10. విశ్రాంతి బోధకుఁడ, విశ్రాంతి కోరని 
11. వేదాంత సారమ, ప్రమోదంబుతో కనుమ 
58. వేదార్థ భాసివి, ప్రమోదంబు గొల్పుమిక 
102. శక్తి ప్రదా గనుచు రక్తిన్ సదా జనుల 
4.    శక్తి ప్రదాతవని ముక్తిప్రదాతవని భక్తిన్
41   శక్తిప్రదా! మహిత ముక్తిప్రదా! విమల 
98.  శ్రీకల్వపూడి కుల రాకాసుధాకరులు 
19.  శ్రీ కాళిదాసుమది నీ కాంతులుల్లసిల 
85.  శ్రీచక్ర వాసినివి  శౌచంబుతోడ నినుఁ 
72.  శ్రీభారతీ జనని! నా భావమున్ గనుచు 
108.శ్రీమంగళాంగివి. సదామంగళంబులను 
35. శ్రీమన్మహాభవుని ప్రేమార్ణవంబుఁ గొని 
79. శ్రీమార్గమున్ గొలుప క్షేమంబుఁ గొల్పగను 
1 .శ్రీ శాంభవీ! సుగుణులాశింత్రు నీ కృపకు
62 సంగీత సాహితులు ముంగొంగు పుత్తడిగ 
30. సంతానమున్ గొలిపి సంతాపమున్ గొలుప
61  సంపూర్ణ భక్తినిడి, సంపూర్ణ శక్తినిడి 
78. సారస్వతంబు కన నోరాజ్ఞి నీవె కద. 
44. సాహిత్యమున్ మిగుల సౌహార్ద్రమున్ గలుగు
93. సృష్టించి లోకములు సృష్టించి బంధనలు 
57.  హృద్యాద్భుతంబయిన  పద్యంబులన్ సుజన వేద్యా
73. హే దేవదేవి! పరమోదార సద్గుణమె
88. హేమాద్రి పుత్రివగు శ్రీమాత నీ చరణ 
81. హేమాద్రి పుత్రివయి మామీద సత్కృపను


అష్టోత్తరశత సతీ అశ్వధాటి
)సతీ శతకము(
రచన. చింతా రామకృష్ణారావు.
1 .శ్రీ శాంభవీ! సుగుణులాశింత్రు నీ కృపకు నీ శక్తినెన్నుచు సదా. 
ధీశాలియౌ శివునికాశావహంబువయి నీ శక్తినే గొలిపితే.
నీ శక్తినే బొగఁడ నాశక్తి చాలదుగ ధీశక్తినిమ్ము జననీ! 
ఆశాంతముల్ వెలుగు ధీశాని నీ ప్రతిభ లేశమ్ము గాంచుదు సతీ!
భావము.
ఓ సతీమాతా! సద్గుణు లయిన మహాత్ములు ఎల్లప్పుడూ నీ శక్తిని గుర్తించుచు 
నీ కృపకై ఆశించుచూ ఉందురమ్మా. జ్ఞానపూర్ణుడయిన శివునికి ఆశ 
గొలుపు చున్నదాని వయి నీ యొక్క శక్తినే ఆ పరమేశ్వరునిలో 
కలుగుచేసితివికదా తల్లీ! నీలో గల శక్తిని ప్రశంసించుటకు నాకు ఉన్న శక్తి 
చాలదు కదా మాతా. కావున నాకు ధీశక్తిని ప్రసాదించుమమ్మా. 
దిగంతముల వరకు ప్రకాశించు నీ ధీశక్తిని కొంచెమయినను చూచుదును .

2. వందారు భక్తజన మందారమా! నిలుమ డెందంబునన్ గరుణతో, 
సౌందర్య రాశివయి డెందంబునన్ నిలువ నెందైన నిన్నె కననా. 
కందున్ నినున్ సతము, కందున్ ద్వదీయ కృపఁ, గందున్ శుభంబుల నిలన్. 
వందే జగజ్జనని ముందుండి నా  కనుల విందై కనంబడు సతీ!
భావము.
నమస్కరించుచున్న భక్తజన మందారమయిన ఓ సతీ మాతా! కరుణతో నా 
హృదయములో నిలిచియుండుము. గొప్ప సౌందర్యపు రాశిగా నా 
హృదయమునందే నీవు నిలిచి యున్నచో అంతటనూ నిన్నే చూడకుండా 
ఉందునా తల్లీ! నిన్ను ఎల్లప్పుడూ చూచుచుందును, నీ కృపను 
చూచుచుందును. శుభములనే ఈ భూమిపై చూచుచుందును. నా 
కనులముందే ఎల్లప్పుడూ ఉండి కనిపించు నా తల్లీ! నీకు వందనమమ్మా.

3. నీ రూపమే కనిన నేరూపమున్ గనఁగఁ గోరంగ లేము ధరణిన్, 
ధారాళ సత్ కవిత పారున్ నినుం గనిన శ్రీరమ్య తేజ నిలయా.
పారాడు దుర్గతుల నేరీతిఁ బాపుదువొ చేరంగ నిన్ శుభ మతిన్, 
వారాహి నిన్ దలచు వారే మహాత్ములిల వారిన్ నుతింతును సతీ! 
భావము.
ఓ సతీమాతా! నీ దివ్యమయిన రూపమును చూచినచో భూమిపై మరే 
రూపమును చూడవలెనని కోరలేమమ్మా. లక్ష్మీప్రదమయిన కాంతికి 
నిలయమయిన తల్లీ!నిన్ను చూచినచో ధారాళమయిన మంచి కవిత్వము 
ఉరకలు వేయుచు వచ్చును.ంఅంచి మనసుతో నిన్ను నేను చేరుట కొఱకు 
ఈ నడచుచున్న దుర్గతిని నీవు ఏ విధముగాపోగొట్టుదువో కదా.ఓ తల్లీ!నిన్ను 
భూమిపై నిన్ను తలచునటువంటివారే మహాత్ములమ్మా.

4. శక్తి ప్రదాతవని ముక్తిప్రదాతవని భక్తిన్ నినున్ గొలిచెదన్ 
భక్తాగ్రగణ్యులు విముక్తిన్ గనన్ మిగుల రక్తిన్ నినున్ గొలుతురే. 
రక్తాక్షివై దురిత శక్తిప్రపూర్ణులను రక్తంబు చిందఁ గనుమా. 
యుక్తంబు లిచ్చుచు నయుక్తంబులన్ దరుము యుక్తిప్రదా వర సతీ!
భావము.
ఓ శ్రేష్టురాలివైన సతీమాతా! నీవు శక్తిని, ముక్తిని కలుగఁజేయు తల్లివని భక్తితో 
నిన్ను కొలిచెదను. గొప్ప భక్తులు ఈ సంసార బంధములనుండి విముక్తి 
పొందుట కొఱకు మెక్కిలి అనురక్తితో నిన్ను సేవించుదురు కదా. దుర్మార్గుల 
విషయమున నీవు కన్నులు కోపములురక రక్తము చిందువిధముగా 
శిక్షింపుము. ఓ యుక్తిని ప్రసాదించు తల్లీ! మాకు అనుభవింపఁదగినవే 
ప్రసాదింపుము. అయుక్తములయినవాటిని పోఁగొట్టుము.

5. అశ్రాంతమున్ జనుల సుశ్రేయమున్ గని గుణశ్రీదవై నిలుతువే. 
సుశ్రీ పదోజ్వలిత సుశ్రావ్యకావ్యపు శుభశ్రీగ నీవు నిలుమా. 
యశ్రద్ధనే విడిచి విశ్రాంతినే మరచి సుశ్రీద నిన్ గొలువనా. 
సుశ్రోతలన్, కవుల సుశ్రేయమున్ గను దవిశ్రాంత మీవిల సతీ!
భావము.
ఓ సతీమాతా! ఎల్లప్పుడూ జనుల యొక్క గొప్ప క్షేమమునే 
చూచి సద్గుణలక్ష్మిని ప్రసాదించు దానివై నీవు వెలుఁగుచుందువమ్మా! మంచి 
మంగళప్రదమయిన పదములతో ప్రకాశించుచున్న మంచి వినసొంపయిన 
కావ్యమున శుభశ్రీనొసంగుదానివై నిలుము తల్లీ! అశ్రద్ధను పూర్తిగా 
విడిచిపెట్టి, విశ్రాంతి యనునదే మరచిపోయి, మంచి మంగళములు 
కలుగఁజేయుదానివైన నిన్ను నేను సేవించనా తల్లీ? ఈ భువిపై మంచి 
శ్రోతలను, కవులయొక్క మంచి శ్రేయమును అవిశ్రాంతముగా నీవు 
చూచుచుందువమ్మా.
 
6. రక్షించు మా జనని! రక్షించుమా, జన నిరీక్షన్ మదిన్ దలచుమా.
రక్షింతువీవని నిరీక్షించు సజ్జనులు మోక్షప్రదా! కనుమికన్. 
సాక్షాత్కరింప కిటు శిక్షింపగా తగున? దాక్షాయినీ! కను మమున్, 
లాక్షారుణప్రభల శిక్షించు దుష్టులను రక్షించు మమ్మిక సతీ!
భావము.
ఓ సాతీ మాతా! రక్షించుము తల్లీ! నీ రక్షణ కొఱకై జనుల ఎదురు చూపులను 
మనసులో తలచుకొని, గుర్తించి, రక్షించుము. ఓ మోక్షప్రదా!  నీవు 
రక్షించుదువని మంచివారైన నీ భక్తులు ఎదురు చూచుచుండిరి. అది నీవు 
గమనించి రక్షించుము. వారికి నీ సాక్షాత్కారమును కలుగుఁజేయక ఈ 
విధముగా శిక్షించుట నీకు తగదు. ఓ దాక్షాయనీ! మమ్ము చూడుము. నీ 
ఎఱ్ఱని ప్రభలతో దుష్టులను శిక్షించుము. మమ్ములను రక్షించుము.

7. నీ దివ్య నామమును నీ దివ్య రూపమును నీ దివ్య శక్తిని మదిన్ 
శోధించి నే కనుదు వేదింపకింక నను బోధన్ మదిన్ గొలుపుమా. 
మేధన్ ప్రపూర్ణవయి మోదంబుతో నిలిచి యీ దాసునిన్ గరుణతో 
బాధా విదూరునిగ బోధా ప్రపూర్ణునిగ సాధించి చూపుము సతీ!
భావము.
ఓ సతీమాతా! నీమహత్తరమయిన నామమును, మహత్తరమయిన 
రూపమును, గొప్ప శక్తిని, నా మనసున శోధించి, నేను చూచెదను. నన్ను 
బాధింపక నాకు బోధను కలుగఁజేయుము. నా మేధయందు నీవు పూర్తిగా 
నిండి, ఇష్టముతో అచ్చటనే ఉండి, నీ దాసుడ నయిన నన్ను కరుణతో 
బాధలకు దూరముగా పరిపూర్ణమయిన బోధపొందినవానిగా నీవు చేసి 
చూపుము.

8. అజ్ఞాన దుశ్చరిత, లజ్ఞాన భావనల, నజ్ఞాన చైదము లికన్ 
విజ్ఞాన తేజమున విజ్ఞేయ! నిన్ గనుచు సుజ్ఞానినై విడుచుదున్.
సుజ్ఞేయునై వెలుఁగ విజ్ఞుల్ ననున్ దలప ప్రాజ్ఞుండనై నిలువనీ
సుజ్ఞాన తేజము మహాజ్ఞాన మీయు మిక విజ్ఞుండుగాఁ గను సతీ! 
భావము.
ఓ సతీమాతా! నిన్ను చూచుచు మంచి జ్ఞానముపొంది, అజ్ఞానపు 
దుష్ప్రవృత్తిని, అజ్ఞాన భావనలను, అజ్ఞానపు నడవడికను 
విడిచిపెట్టుదును. నేను తెలియఁదగిన వాడినయి,వెలుగునట్టులుగా, 
విఞానవంతులు నన్ను తలచు విధముగా ప్రజ్ఞావంతుడనయి 
నిలుచునట్లు చేయుము. మంచి జ్ఞాన తేజమును, గొప్పజ్ఞానమును, 
విజ్ఞుం_డుగా ఉండి నిన్ను కనుటకు ఇంక నాకు ప్రసాదించుము. 

9. పల్కంగ నేరవొకొ? యల్కన్ మదిన్ నిలిపి, కల్కీ! హృదబ్జ నిలయా! 
పల్కంగనే వరము లొల్కంగఁ దప్పదని మేల్కొంచు పల్క వెరపా? 
కల్కి ప్రభావమిల మేల్కాంచె చూడు మిక మేల్కొల్పు శిష్ట జనులన్,  
పల్కించు పద్యములు చిల్కించు సన్నుతులు పల్కించు మెల్లెడ సతీ! 
భావము.
నా హృదయ పద్మాసీనవైయున్న ఓ సతీమాతా! నాపై అలకఁ బూని నాతో 
మాటాడ లేకున్నావా? ఒకవేళ పలుకరించినట్లయిన వరములు నా కొసగ 
తప్పదని భయముతో పలుకరించుట లేదా? కలి యొక్క మాయా ప్రభావము 
మేలుకొన్నది చూడుము. మంచివారిని నీవిక మేలుకొలుపుము తల్లీ! ఆ 
కలిప్రభావమును మాపు విధముగా పద్యములు పలుకజేయుము, మంచి 
మాటలను చిలుకు నట్లు చేయుము. అవి అంతటా వ్యాపించునట్లు ఆమంచిని 
చేయుము.

10. విశ్రాంతి బోధకుఁడ, విశ్రాంతి కోరని యవిశ్రాంత సేవకుఁడ నీ 
సుశ్రావ్య సత్ కృతులు  సుశ్రేయమున్ గొలుపఁగా శ్రద్ధతో నొనరుతున్. 
ధీశ్రీ భవత్ కరుణ సుశ్రోతలందునను సుశ్రావ్య గాన గరిమన్ 
సుశ్రీలిడన్ నిలిపి విశ్రాంతిగాఁ గొలిపి శుశ్రూష నందుము సతీ!
భావము.
ఓ సతీమాతా! నేను విశ్రాంత కళాశాల ఉపన్యాసకుడను. వీశ్రాంతి కోరని 
అవిశ్రాంత సేవకుడను. నీకు సంబంధించునట్టి చక్కగా విన దగిన మంచి 
రచనలు మంచి లోకక్షేమమును కలుగజేయు విధముగా శ్రద్ధతో 
చేయుదునమ్మా. నాకు సంప్రాప్తించిన జ్ఞానలక్ష్మి యనునది 
నీకృపాలబ్ధము. మంచిశ్రోతలలో నన్ను మంచి పాడేగొప్పదనముతో 
మంచి కలుగ జేయునట్లు నిలిపి, విశ్రాంతిగా ప్రశాంతిని కలుగజేసి,నా 
సేవలనందుమమ్మా.

11. వేదాంత సారమ, ప్రమోదంబుతో కనుమ. పేద ప్రజన్ నిరతమున్.
కాదన్నచో ప్రజల కేదున్నదింక తరి సాదంబుకే కరువగున్. 
నీ దివ్య సత్ కరుణనే దారిగాఁ దలచి మోదంబుతోఁ గొలుతురే 
బాధావహంబు కద మోదంబుతోఁ గనమి నేదారి కానరు సతీ! 
భావము.
ఓ వేదాంత సారమా! సతీ మాతా! మొక్కిలి ఇష్టముతో పేదప్రజలను 
యెల్లప్పుడూ చూడుమమ్మా! నీవు కాదు అని అన్నచో ఇంక ప్రజలకు ఉన్న 
మార్గమేమిటమ్మా? తిండికే కరువు అగునుకదా తల్లీ! నీ యొక్క గొప్పదయిన 
మంచి కరుణయే మార్గముగా భావించి, చాలా యిష్టముతో నిన్ను 
సేవించుదురు కదా, నీవు మోదముచో కనకున్నచో బాధకు స్థానమయి ఏ 
మార్గము లేనివారగుదురుకద్సా అమ్మా!.

12. లోకంబులో కృతులనేకంబులున్న విక నీకేల చింత యన కో
లోకేశ్వరీ కృతులు నీకై రచింపగను నాకిమ్ము శక్తి కృపతో,
నీకై రచింపగను లేకున్నచో బ్రతుకు నాకేలనమ్మ భువిపై,
చీకాకులన్ బడక నీకై రచించుటది నాకిచ్చు ముక్తిని సతీ!
భావము.
ఓ  సతీమాతా! ఈ లోకములోనాపై రచింపబడిన రచనలు అనేకము ఉన్నవి 
కదా, నీకింక చింత ఎందుకు అనకుండా ఓ లోకమాతా నీపై క్ఉతులు 
వ్రాయుట కొఱకు కృపతో నకు శక్తినొసగుముంఈపై కృతి రచింపలేనినాడు 
భూమిపై నాకీ బ్రతుకు వ్యర్థమే కదా. చికాకు పడకుండా నీ కొఱకు 
రచనలు చేయుట అనునది నాకు ముక్తినొసగును సుమా.  

13. దోసంబులెన్నకుమ, భాసించు మంచిఁ గని, ధ్యాసన్ ననున్ నిలుపుమా. 
నా సేవలం గొనుమ నా సత్కృతిన్ గనుమ భాసింపఁ జేయుమ కృతిన్. 
మోసంబులన్ బడక నీ సేవలన్ మనఁగ నాసింతు నేను జననీ, 
ధీసద్గుణంబులిడి నీ సన్నిధిన్ మదిని నిత్యంబు నిల్పుము సతీ!
భావము.
ఓ సతీమాతా! దోషములను పరిగణింపవలదు. మలో ప్రకాశించెడి మంచిని 
గుర్తించుము. నన్ను ధ్యాసతో నిలఁబెట్టుము. నా సేవలను స్వీకరించుము. నా 
యొక్క సత్ కృతిని చూడుము. నా యొక్క ఈ రచనను వెలుగులీనునట్లు 
చేయుము. ఓ జననీ! ఏవిధమయిన మోసములకు తావు కాకుండా, నీ సేవలతో 
బ్రతుకు సాగదీయుచు జీవించవలెనని నేను కోరుకొంద్సును. బుద్ధి మంచి 
గుణములు ఒసగి, నీ సన్నిధిలోనే నిత్యమూమనసు నిత్యమూ 
ఉండునట్లు చేయుమమ్మా.

14. ఆశావహుల్ జగతి నాశంబు చేయుదురు, నీ శక్తితో నిలుపుమా. 
దేశాధినాథులు దురాశాపరుల్ కలరు, దేశంబె నాశనమగున్. 
కాశీపురంధ్రివి, ప్రకాశంబు నిల్పు మిక దేశ ప్రభన్ నిలుపుమా, 
హేశాంభవీ! జనని! హే శక్తి రూపిణి! మహేశాని! ధీవర సతీ!
భావము.
ఓభవానీ! ఓ అమ్మా! ఓ శక్తిరూపిణీ! ఓ మహేశ్వరీ!శ్రేష్టమయిన 
జ్ఞానపూర్ణవయిన సతీ మాతా! లోకమున ఆశాపరులు ఉండిరి వారి లోకమునే 
నాశనము చేయుదురమ్మా. నీ శక్తి చూపి వారిని నిలువరింపుము 
తల్లీ!దేశాధ్నాథులలో కూడా ఆశాపరులు ఉండిరమ్మా. వారి వలన దేశమే 
నాశనమగును తల్లీ! ఓ కాశీపురాధీశ్వరీ! దేశప్రకాశమును నిలుపుమమ్మా. 
దేశమునకున్న వైభవమును తగ్గనీయకుము.

15. కల్లల్ కనన్ జగతి, నెల్లప్పుడున్ నిజమునుల్లంబు పొంగ కనఁగన్ 
తల్లీ వరంబిడుమ, సల్లాపమందయిన కల్లల్ ప్రవర్తిలకనే 
యుల్లాసమున్ గొలిపి సల్లోచనంబులిడి యుల్లంబునన్ మెలఁగుచున్
ఫుల్లాబ్జ నేత్రవుగ ముల్లోకముల్ నడుపు తల్లీ కృపం గను సతీ!  
భావము.
ఓ సతీమాతా! వికసించిమపద్మనేత్రవుకదా ముల్లోకములనూ నడిపెడి 
తల్లివే కదా,  నేను అబద్ధమును చూడఁ జాలను, లోకమున ఎల్లప్పుడూ 
మనసుపొంగే విధముగా నిజమునే గ్రహించు విధముగా నాకు 
వరమొసగుమమ్మా.  సల్లాపములాడు సమయమునందైననూ సరే 
అబద్ధములు ప్రవర్తిల్లకుండునటుల చేసి ఉల్లాసమును నాకుఁ గొలిపి, 
మంచినే చూచునట్టి కనులను ప్రసాదించి, నా మనసులోనే నీవు ఉంటూ
నన్ను కృపతో చూడుము.

16. అబ్జాత పత్ర ముఖి కుబ్జత్వమున్ మదికి నబ్జోద్భవుండొసఁగెనే. 
కుబ్జత్వమేలనిది? యబ్జోద్భవున్ గెలుతు నబ్జాక్షి నీవు కనిన్,
యబ్జాసనా! కృపఁ గరాబ్జంబులన్ గొనుమికబ్జోద్భవాంశజుని నన్ 
కుబ్జత్వమున్ దరిమి యబ్జాత్మ! లో నిలువు మజ్జేశుఁడెన్నగ సతీ! 
భావము.
పద్మముఖివయిన ఓ సతీమాతా! ఆ బ్రహ్మ నాకు 
హృదయవైశాల్యమును ఈయకుండా పొట్టితనమును ఒసగినాడమ్మా. నా 
మనసునకు ఈ కుబ్జత్వము ఎందులకమ్మా. ఓ పద్మాక్షీ నీవు నన్ను దయతో 
చూచినచో నేను ఆ బ్రహ్మను గెలిచెదను. ఓ పద్మాసనా! బ్రహ్మవంశ 
సంజాతుఁడనయిన నన్ను నీవు నీ చేతులతో చేపట్టి రక్షింపుము. 
పుష్పసుకుమార మానసవయిన ఓ తల్లీ! నాలోని ఈ 
కుబ్జభావములను తుడిచివేసి విశాలభావములొసగి ఆ లోకబాంధవుఁడయిన 
సూర్యభగవానుఁడే మెచ్చు విధముగా నా లోపల నిలిచియుండుమమ్మా. 

17.  అమ్మా భవత్ పదము లిమ్మానసంబునను ముమ్మాటికిన్ నిలువనీ. 
పొమ్మన్న నేమిగతి? చిమ్మున్ కనుల్ జలము, లమ్మా కృపన్ గనుమికన్. 
సమ్మోదమున్ దెలిపి రమ్మంచు నీ సుతుని నెమ్మిన్ గృపన్ నిలుపుమా. 
యిమ్మేను భారమది ముమ్మాటికిన్ తమది సొమ్మీవెగా కన సతీ! 
భావము.
అమ్మా! ఓ సతీమతా! ముమ్మాటికీ నీ పాదములను నా మనసున 
నిలువనిమ్ము తల్లీ.  నీవు కాదని పొమ్మన్నచో నాకు వేరే గతి లేదమ్మా. నా 
కన్నులలో నీరు క్రమ్ముకొనును. ఇంక నీవు నన్ను కృపతో చూడుమమ్మా. నీ 
యొక్క సమ్మతిని తెలియఁజేసి, రమ్మని నీ కుమారుఁడనయిన నన్ను 
ప్రేమతో దయతో నిలుపుము తల్లీ! ఈ నా శరీర భారమింక మీదేనమ్మా, నాకు 
అన్ని విధములా ధనమనచో అది వే సుమా.

18. నీలాల నింగినిటులేలీలఁ జేసితివి? చాలన్ మదిన్ దలఁపగా, 
నీ లాలితంబు గని శూలిన్ మదిన్ గనిన పోలంగలాడె? యనరా? 
యేలీల పత్నివయి నీలో సగంబొసఁగి పాలింపఁగా నిడితివో? 
నీలాల నింగినట నీ లీల కానఁబడు మాలోనఁ గల్గిన సతీ! 
భావము.
ఓ సతీమాతా! ఈ అనంత నీలకాశమును నీవు ఏ విధముగా చేసితివమ్మా? నేను 
ఈ విషయమును మనసులో ఆలోచించుటకైనను సరిపోను. నీ లాలిత్యమును 
చూచి ఆ శివునిమనసులో ఊహించుకొన్నచో నీతో సరిపోలేడు అని 
అనుకొనకుందురా. నీవు ఏ విధముగా ఆతనికి భార్యవయి నీ శరీరమున 
సగభాగ మతని కొసగి అతనికి లోక పాలనాధికార మిచ్చావో కదా. మాలోపలనే 
కలిగిన ఓ తల్లీ! వినీలాకాశమున అక్కడ నీ లీల నాకు కనిపించునమ్మా.

19. శ్రీ కాళిదాసుమది నీ కాంతులుల్లసిల నేకాంతమందునఁ గనెన్ 
శ్రీకారమే కృతుల కాకారమున్ గొలుప శ్రీ కావ్యముల్ వెలిసెగా. 
శ్రీకారమీవెయని యా కాళిదాసెఱిఁగి చేకొంచు నిన్ నిలిపెనే  
ఓ కాళికా! హృదయమేకాగ్రతన్ నిలుప నాకిమ్ము బాసను సతీ! 
భావము.
ఓ సతీ మాతా! మంగళస్వరూపుఁడయిన కాళిదాసు మహాకవి నీ 
మహత్తరమయిన కాంతులు మనసు ఉల్లసిల్లగా ఏకాంతములో మదిలో తాను 
చూచెను. శ్రీ కారమే తన రచనలకు ఆకారమును గొలుపగా 
మంగళప్రదమయిన కావ్యములు అతనిద్వారా వెలసినవి కదా. నీవే ఆ 
శ్రీకారమని, ఆ కాళిదాసు  గ్రహించి హృదయపూర్వకముగా స్వీకరించి నిన్ను 
నిలిపెను.  ఓ కాళికా మాతృ స్వరూపిణీ! హృదయము ఏకాగ్రమగు విధముగా 
చేసి, నాకు చక్కని భాషను ప్రసాదించుము తల్లీ!.

20.  ఓంకార రూపిణివి యోంకార భాసినివి యోంకార భూషిణివిగా.
ఓంకారమున్ గనుదు నోంకారమైన నిను, నోంకార వర్తివగుటన్ 
ఓంకారమే తమకు సంకేతమమ్మ గన నోంకార పూర్ణవు కదా. 
ఓంకార తేజము నహంకారమే తొలఁగు నింకేల నా కిడు సతీ.. 
భావము
ఓ సతీమాతా! ఓంకారము యొక్క తేజస్సు కారణంగా మా లోని 
అహంకారమన్నది తొలఁగిపోవునమ్మా.  ఇక ఆలస్యమెందులకు? ఆ ఓంకార 
తేజస్సును నాకు ప్రసాదించుమమ్మా,  నీవు ఓంకార స్వరూపిణివి. 
ఓంకారమునందు భాసిల్లు తల్లివి, ఓంకారముచే అలంకరింపబడిన అమ్మవు 
కదా. నీవు ఓంకారమునందు సంచరించుచ్గుందువుగాన  ఓంకార 
స్వరూపిణివైన నిన్ను ఓంకారమునందు చూచుదునమ్మా.
తమకు ఓంకారమే సంకేతముకదా తల్లీ. చూడగా ఓంకారపూర్ణస్వరూపిణివి 
నీవే నమ్మా.

21. దైవాంశ లేక నిను భావింపనెట్టులగు? దేవీ మదాత్మ నిలయా! 
జీవాత్మవీవగుచు జీవించువారిఁ గని భావింతు నిన్ సుజనులన్ 
సేవాపరత్వమున నీవే ప్రభాసిలఁగ నీవౌచు నా ఘనులుగా 
శ్రీవాణి సత్ కృపను భావించి పద్యములు నీవే రచింతువు సతీ!. 
భావము.
నా ఆత్మయే  నిలయముగా కలిగియున్న ఓ సతీమాతా! ఓ దేవీ! మాలో 
దైవాంశ లేనిచో నిన్ను చూచ్ట ఎట్లు సాధ్యపడునమ్మా. నీవే జీవాత్మగా 
ఉండిన కారణముగా సుజనులై జీవించేవారిని చూచి వారిలో నేను నిన్నే 
భావింతునమ్మా.  సేవయే పరమార్థముగా కలిగిన కారణము చేత నీవే 
ప్రకాశించుచుండుట కొఱకు ఆఘనులుగా నీవే యగుచు, వారిని నేను 
చూచినతోడనే శ్రీశారదామాతకు నాపై ఉన్న మంచి కృపను భావించి నీవే 
నాలోనుండి పద్యములు  రచించుచుందువుకదా తల్లీ! 

22. బాలార్క తేజమునఁ బాలింప భక్తులను స్త్రీలన్ వెలుంగుదె యిలన్?
నీలీలలన్ గనఁగ చాలంగలారెవరు? నీలాలకా భగవతీ! 
నాలోని మాయ నిఁక నీ లీలచేఁ దునిమి పాలించు నన్నిలఁ గృపన్.
భూలోక వాసుల కహో, లోన మాయనిడి నీ లీలఁ జూపితె? సతీ!
భావము.
ఓ సతీమాతా! భూమిపై బాల సూర్య ప్రకాశముతో నీ భక్తులను పాలించుట 
కొఱకు నీవు ఆడువారియందు ప్రకాశించుచుందువా తల్లీ? నల్లని 
ముంగురులతో నొప్పుచున్న ఓ లోక మాతా! నీ లీలలను చూడఁగలిగినవారీ 
భూమిపై ఎవ్వరునూ లేరు కదా. నా లోన ఉండెడి మాయను నీ లీలచే పోఁ గొట్టి 
కృపతో నన్ను పాలించుమమ్మా. భూజనులలో మాయను ప్రవేశపెట్టి నీ 
లీలను కనఁబరచితివా జగజ్జననీ?
 
23. కాలంబు నీవనుచు నీలీలలం గనుచు లోలోన పొంగుదునుగా. 
నీలాల మేఘముల నీ లీలలే కనుదు నాలోన గాంచెద నినున్. 
నీలాల మేఘమది నాలోని మాయ కన పాలింతు వీవటులనే 
శ్రీలాలితీ సుగుణ జాలంబు నీవె కద,  యీ లీలఁ  గాంచెద సతీ! 
భావము.
ఓ సతీమాతా! నీవే కాలముగా ఉన్న దానివని భావించుచు, నీ లీలలను 
మనసులోఁ జూచుచు, నాలో నేను పొంగిపోవుచుందును. నీల మేఘములలో నీ 
లీలలనే చూచుదును. నేను చెప్పిన ఈ నీల మేఘము నాలో ఉన్న 
మాయయే. నీవు ఈ విధముగనే నన్ను పాలించుచుంటివి కదా మంగళప్రద 
మయిన, లలితమయిన సుగుణజాలము నీవే కదా తల్లీ! ఈ లీలను నేను 
నిరంతరమూ చూచుదును.

24. ఆహారమీవె కన నాహార్యమీవె, కల మోహంబు నీవె జననీ!
మోహంబు నీవయిన మోహార్తినే తరిమి స్నేహంబుతో మెలఁగనీ. 
దేహంబు నీవగుచు స్నేహంబు నీవగుచు మోహంబుపై నుతమతీ!
రాహిత్యముం గొలిపి దేహంబులోనిలిచి సాహాయివై నిలు సతీ! 
భావము.
ఓ సతీమాతా! ప్రాణశక్తినొసగు ఆహారము నీవేనమ్మా. ఆహ్లాదజనకమయిన 
అలంకారములూ నీవే తల్లీ.  ఓ అమ్మా! ఆత్మలో పుట్టేటువంటి మోహము కూడ 
నీవేనమ్మా.. నీవే మోహమయియున్ననాడు మాలోని మోహార్తిని 
తరిమివేసి,స్నేహ భావముతో మమ్ములను మసలనిమ్ము. నుత మయివయిన 
ఓ జగన్మాతా! మా దేహమూ నీవే అయియుండి, మాలోని స్నేహమూ నీవే 
యగుచు మోహమును పూర్తిగా వీడునట్టుల జేసి, మా దేహములో నీవే నిలిచి 
యుండి మాకు సహాయపడుము తల్లీ!

25. పూలన్ గనన్ గలవు, నేలన్ గనన్ గలవు మ్రోలన్ గనన్ గలవుగా. 
చాలింపుమింక, మొరలాలింపుమింక, పరిపాలింపుమా కరుణతో. 
గాలింప లేను నిను, జాలిన్ ననున్ గనుచు, మేలున్ దయన్ గొలుపుమా. 
బాలా! సదా వినుత హేలా! మహత్ సుజన పాలాపరాజిత సతీ!  
భావము. 
గొప్ప మంచివారిని పరిపాలించెడి ఓ అపరాజితా! ఓ సతీ మాతా! ఓ బాలా! 
ఎల్లప్పుడూ పొగడఁబడెడి విలాసము కలిగిన తల్లీ! పూలను చూచినా నీవే 
ఉంటివి. నేలను చూచినా నీవే ఉంటివి, ఎదురుగా చూచినా నీవే ఉంటివి కదా. 
నీ పంతమింక సరిపెట్టుము. ఇంక నా మొరలను వినుము. కరుణతో నన్ను 
పాలింపుమమ్మా. నిన్ను నేనింక వెదకలేను. జాలితో నన్ను చూచుచు దయతో 
నాకు మేలు కలుగఁ జేయుము తల్లీ.

26. పూర్ణంబు నీవె, యిల వర్ణంబులీవె, శశి పూర్ణాకృతిన్ గలవుగా. 
కర్ణామృతంబయిన పర్ణంబులీవెకద పూర్ణేందుబింబ వదనా.
స్వర్ణంబు నీవె కద స్వర్ణంబు లీవెకద ఘూర్ణించు మేఘుఁడవుగా.
చూర్ణంబు చేయుమిక దుర్నీతులన్ కని యపర్ణా! కృపం గను సతీ! 
భావము.
కృపతో చూచెడి ఓ సతీమాతా! భూమిపైనీవు పూర్ణ స్వరూపవు. సప్త 
వర్ణములు నీవే. చంద్రుని పూర్ణ స్వరూపమున కూడా నీవే 
ఉంటివి కదా. ఓ పౌర్ణమి చంద్రునిపోలు ముఖము కల తల్లీ! 
వినసొంపుగానుండు వేదమంత్రములు నీవే కదా. బంగారము నీవే 
కదా,  మంచిని వెలువరించు అక్షరములు నీవే కదా, ఘూర్ణించునటువంటి 
మేఘము నీవే కదా. ఓ యపర్ణా! దుర్నీతులయిన పాపులను సంహరింపుము.

27. నీ దివ్య తత్వమును సాధుస్వభావమును బోధన్ గనన్ గొలుపుమా, 
శోధించి చూచినను నీ దీప్తి యన్యులను లేదన్నదే నిజముగా. 
మాధుర్య భావము ప్రమోదంపు జీవనము నీ దీవనన్ గలుఁగుగా, 
హే దీన బాంధవి! ప్రమాదంబులన్ దుడిచి యీదీను గావుము  సతీ. 
భావము.
ఓ సతీమాతా! నీ యొక్క గొప్ప తత్వమును, నీ సాధుస్వభావమును, జ్ఞానము 
పొంది చూచునట్లుగా చేయుమమ్మా. ఎంతగా పరిశోధించి చూచినప్పటికీ 
నీలోని తేజస్సు అన్యులకెవరికీ లేదను మాట సత్యము.ంఅధుర 
భావనలుసంతోషకరమయిన జీవితము నీ యొక్క దీవన వలననే 
సాధ్యమగునమ్మా. ఓ దీనబంధూ! నాకు వెఆసియున్న ప్రమాదములను 
తుడిచివేసి దీనుడనైన ఈ నన్ను కాపాడుము తల్లీ!

28. చిత్తంబులో గల మహత్తైన శక్తివి, ప్రవృత్తిన్ సదా మెలుఁగుమా. 
మత్తున్ మదిన్ విడిచి చిత్తంబు నీ పయి మహోత్తుంగ భక్తి నిలుపన్ 
సత్తెంబుగాఁ గొలిపి యెత్తీరునైనను లసత్తేజమున్ గొలుపుమా. 
హత్తన్ మదిన్ నిజము లెత్తీరుఁ గొల్పెదవొ, చిత్తేజమై కల సతీ!  
భావము.
నా మనసులో చిత్తేజమై నిలిచి యున్న ఓ సతీమాతా! నా మనసులో ఉన్న 
గొప్ప మాహాత్మ్యముగల శక్తిస్వరూపిణివి. నా ప్రవృత్తిలో నీ వెల్ల వేళలా 
నిలిచియుండుమమ్మా. నాలోని మత్తును విడిచిపెట్టి, నీ మీద మనస్సును 
గొప్ప ఉన్నతమగు  భక్తితో నిలుపునట్లుగా నిజముగా నీవు చేసి,ఏ 
విధానముచేతనైనను గొప్పదైన నీ తేజమును నాలో కొలుము తల్లీ నా 
మనసున సత్యము నాటుకొని పోవునట్లుగా ఏ విధముగా చేసెదవో కదా.

29. భారంబు నీది శుభ తీరంబుఁ జేర్చగను లేరన్యులీ వసుమతిన్. 
గోరంగనేల నినుఁ జేరంగనున్నపుడు తీరంబుఁ జేర్చు జననీ. 
శ్రీరమ్య తేజసవు శ్రీరామ రక్షవయి వారింపుమా దురితముల్. 
కోరన్ నినున్ ధనము కారుణ్యమున్ గనెడి ధీరాత్మవీవెగ సతీ! 
భావము.
ఓ సతీ మాతా!శుభముల తీరమునకు చేర్చెడి భారము నీదేనమ్మా. ఈ భూమిపై 
నీకన్న అన్యులు లేరు.ఒడ్డునకు నన్ను చేర్చెడి ఓ తల్లీ! నెన్ను చేరవలెనని 
మనసున్నప్పుడు ఇన్ను కోరవలసిన పని యేమున్నదమ్మా. నీవే చేర్చుదువు. 
మంగలప్రదమయిన తేజస్సు ఉన్న తల్లివి నాకు శ్రీరామ రక్షవయి నా 
దురితములను నివారింపుమమ్మా. నిన్ను ధనములు కోరనమ్మా. కరుణతో 
చూచెడి ధీరాత్మవు నీవేకదా.

30. సంతానమున్ గొలిపి సంతాపమున్ గొలుప చింతేకదా ఫలితమౌన్. 
సంతాపమున్ విడిచి సంతానమిచ్చిన సుఖాంతంబెగా జననమే. 
సంతాన హీనులకు సంతానమున్ గొలిపి శాంతంబుగా బ్రతుకనీ. 
సంతాప హీన మదినంతేసువాసివయి సాంతంబు కాంచుము సతీ! 
భావము.
ఓ సతీ మాతా! నీవు మాకు సంతానమునిచ్క్ష్చి వారిని గూర్చి సతాపమును కూడా 
యిచ్చుట వలన చింతయే కదా మాకు దక్కెడి ఫలితము. 
సంతాపమునిచ్చుట మాని సంతానమునే నీవొసగియున్నచో పుట్టక మాకు 
సుఖాంతమగును కదా. సంతానము లేనివారికి సంతానభాగ్యమును 
ప్రసాదించి శాంతిని ప్రసాదించి శాంతముగా వారిని బ్రతుకనిమ్ము. 
సంతానము లేనివారి మనసులలో నీఉండివారి పరిస్థితిని గమనింపుమమ్మా.

31. నిత్యారుణద్యుతిని సత్యప్రబోధవయి స్తుత్యంబుగా వెలుఁగుదే 
నిత్యంబు నిన్ గొలిచి యత్యున్నత స్థితిని స్తుత్యుల్  కనన్ గొలుపుమా. 
భృత్యాళి సమ్మదుల నిత్యంబు వెల్గెడి మహౌన్నత్య వీవె జననీ. 
కాత్యాయనీ కనుమ భృత్యున్ ననున్ సతము స్తుత్యంబుగా నిల సతీ! 
భావము.
ఓ సతీ మాతా! నీవు నిత్యమూ అరుణకాంతితో సత్యప్రబోధన 
చేయుచున్నదానివయి,  ప్రకాశించుచుందువు కదా. పొగడఁబడఁదగువారు 
నిత్యమూ నిన్ను సేవించుచు అత్యున్నతమయిన స్థితి పొందునట్లుగా 
చేయుము తల్లీ! నీ సేవకులయందును, మంచి హృదయులయందును 
నిత్యమూ ప్రకాశించెడి గొప్ప ఔన్నత్యమేది కలదో అది నీవేకదా తల్లీ! ఓ 
కాత్యాయనీమాతా! నీసేవకుఁడనయిన నన్ను నిత్యమూ భూమిపై 
ప్రశంసనీయముగా చూడుము.

32. పంకేరుహానన! కుశంకల్ మదిన్ విడిచి కైంకర్యమున్ సలుపనా. 
ఓంకార రూపము నుటంకించి తెల్పెదను శ్రీంకార తేజమగు నిన్. 
సంకాశమే కనని ఐంకార భాసినివి. యింకేలనీ వ్యవధు లో 
హ్రీంకార తేజస యహంకారమున్ తుడిచి కైంకర్యమున్ గొను సతీ! 
భావము.
ఓ సతీ మాతా! ఓ పద్మముఖీ! మనసున్బుండి చెడు అనుమానములు 
విడిచిపెట్టి నీ సేవచేయనా తల్లీ!ఓంకార రూపమును ఉటంకించిమరీ 
శ్రీంకారమున ప్రకాశించెడి నిన్ను తెలిపెఅదనమ్మా. పోలికయే లేనట్టి 
ఐంకారమున ప్రకాశించుదానవు. ఇంక ఎందులకీ విడంబనము? ఓ హ్రీంకార 
తేజమా! నాలోని అహంకారమును తుడిచివైచి,నా సేవలను స్వీకరింపుము.

33. ఏలో సృజించితివి నీలాంబరంబచట నేలో మమున్ భగవతీ? 
ఏలన్ మమున్ మరచి తేలో గృపన్ గనక మేలమ్మొ నీ కనుపమా! 
ఏలేటి తల్లివని నేలన్ జనుల్ గనుదు రేలా మదిన్ కనవో? హే 
బాలేందువక్త్ర పరిపాలింపుమమ్మ మము నీలాలకాక్షర! సతీ!  
భావము.
సాటి లేని ఓ సతీ మాతా! నల్లని ముంగురులుగలదానా?  ఓ భగవతీ! 
అచ్చట నీలాకాశమును, ఇచ్చట భూమిపై మమ్ములను ఎందులకు 
సృష్టించితివో? ఓ సాటిలేని తల్లీ! ఎందుచేత కృపతో కనుట యెందులకో 
మాని, మమ్ములను పలించుటను మరచితివి? నీకిది పరిహాసమా తల్లీ? 
పాలించే తల్లివనుచు భూజనులు భావించుచుందురు. నీవేల వారిని చూడవు? 
చంద్రరేఖను ధరించిన ముఖము కల తల్లీ! మమ్ములను పరిపాలించుమమ్మా.

34. కాయంబశాశ్వతము. కాయంబు లేని తరి మాయన్ విడన్ సులభమౌన్. 
నీయందె నమ్మకము కాయంగనుంటివని కాయంగ రమ్ము పతితోన్. 
నీ యానతే సతము నాయందు శక్తినిడు న్యాయంబునే నడుపగా. 
మాయా జగంబున నమేయప్రభన్ నిలుతు నీ యానతిన్ గని సతీ! 
భావము.
ఓ సతీ మాతా! ఈ శరీరము శాశ్వతమయినది కాదు. అటువంటి యీ 
శరీరము లేకపోయినచో మాయను విడనాడుట సులభమగును. మమ్ములను 
కాపాడుటకు నీ వుంటివని నీపైననే నాకు విశ్వాసము. నీవు పతితో కూడి 
మమ్ములను కాపాడుటకు రమ్ము. న్యాయమును పాటించుటకు నీ యొక్క 
అనుజ్ఞయే నాలో శక్తిని సమకూర్చును తల్లీ! నీ ఆనతితో ఈ మాయా 
ప్రపంచములో అంతులేని ప్రకాశముతో నిలిచెదనమ్మా.

35. శ్రీమన్మహాభవుని ప్రేమార్ణవంబుఁ గొని శ్రీమాతవై వెలుఁగు నీ 
ధీమంతుఁడౌ సఖుని నే మానసంబునను ప్రేమన్ సదా కొలిచెదన్. 
నీమంబుతో శతక ధామంబునే కొలిపి ప్రేమన్ నినున్ నిలిపెదన్. 
నీ మానసంబుఁ గని ప్రేమన్ రచించెదను శ్రీమాత నీ కృప, సతీ! 
భావము.
ఓ సతీ మాతా! మంగళ కరుఁడగు మహేశ్వరుని ప్రేమ సముద్రమును పొంది 
శ్రీమాతగా వెలుఁగుచుంటివా తల్లీ? జ్ఞానమూర్తి యయిన నీ సఖుఁడయిన ఆ 
పరమేశ్వరుని నేను నా మనసులో ప్రేమతో సేవింతునమ్మా! నియమముతో 
శతకమనెడి గృహమును నిర్మించి, ప్రేమతో ఆ గృహమున నిన్ను నివసింపఁ 
జేయుదును. నీ హృదయమును గ్రహించి, నీ యొక్క కృపను గూర్చి ప్రేమతో 
రచించుదును తల్లీ!

36. భద్రేభ గామిని! సుభద్రాక్షయాక్షర సముద్రమ్మునన్ మధువువై 
నిద్రించు నా మదిని భద్రంబుగా వెలిగి ముద్రింతు వీవు సుకృతిన్. 
క్షుద్రాళినే యణచి సద్రక్షణన్ గొలుప నుద్రేక మొప్పు కవితన్ 
మద్రమ్య సద్రచన సద్రక్షణీ! కొలుపు భద్రమ్ము కాగను, సతీ!
భావము.
మత్తేభము నడకవంటి నడక కలిగిన ఓ సతీ మాతా! మిక్కిలి భద్రత నిడెడి 
అంతులేని అక్షర సముద్రమున అమృత స్వరూపమై నిద్రావస్థలో 
నున్న నా మనస్సులో క్షేమప్రదవై  ప్రకాశించుచు హృదయమున 
మంగళమును ముద్రించుదువు కదా. లోకమున క్షుద్రులను అణచి వేసి, 
లోకక్షేమము కొలుపుట కొఱకు మంచికి రక్షణ కలుఁగఁ జేయుట కొఱకు ఉద్రేక 
పూరిత యిన కవితను నాయొక్క రమ్యమయిన మంచి రచనలో 
కొలుపుమమ్మా.!

37. భూజంబులే సుఫల రాజంబులున్ సుగుణ బీజంబులున్ మన కగున్,
రాజిల్లు చున్న వర భూజంబులన్ నఱకు నీ జాతినే యణచుమా. 
యే జాతికైన భువి భూజంబులే బ్రతుకు రాజిల్లఁ జేయు సిరులై.
సాజంబుగాపెఱుఁగు భూజంబులన్ నిలుపు. రాజీవ నేత్రవు  సతీ!
భావము.
ఓ సతీ మాతా! మనకు మంచి శ్రేష్టమయిన ఫలములు, సద్గుణ 
బీజములూ వృక్షములేనమ్మా. సహజముగా రాజిల్లుచున్న చెట్లను 
స్వార్థపరులు సమూలముగా నాశనము చేయుచుండిరి. అట్టివారిని 
అణచివేయుము తల్లీ! ఈ భూమిపై యే జాతికయినను వృక్షములతోనే 
జీవనము. వృక్షములే సిరిసంపదలయి బ్రతుకులను పండించును. 
సహజముగా పెఱుగునటువంటి వృక్షసంపదను నిలిపెడి 
ప్రకాశవంతమయిన కన్నులకలదానివమ్మా నీవు. 

38. ఓ పార్వతీ! సుగుణమే పంచుచున్ జనుల తాపంబు మాన్పునటులన్
దీపించు సత్ కృతికి సోపానమై నిలుము పాపంబులార్పు జననీ! 
నీ పాపలౌ జనుల పాపంబులన్ గనక కాపాడుమమ్మ జననీ! 
శ్రీపాదముల్ కొలిచి నే పావనుండగుదు నో పాప హారిణి సతీ! 
భావము.
పాపములను హరించెడి ఓ సతీ మాతా! ఓ పార్వతీ మాతా! మంచి గుణములనే 
నా కవిత్వముద్వారా పంచుచు జనుల మానసికమయిన తాపమును 
పరిహరించు విధముగా ప్రకాశించు నా కృతికి సోపానముగా నీవు నిలిచి 
పాపపరిహారము చేయు మమ్మా.  నీ సంతానమయిన ప్రజల పాపములను 
గణింపక కాపాడుము తల్లీ! నీ మంగళప్రదమయిన పాదములను సేవించి 
నేను పావనుడనగుదునమ్మా.

39. క్షేత్రంబు నీవె కన క్షేత్రజ్ఞవీవె కన, క్షేత్రార్థ మీవె కనఁగా.
గోత్రంబులేల నిల పాత్రంబు లేల శుభ ధాత్రిన్ నినున్ గలిగినన్. 
సూత్రంబు నీవె కన గోత్రంబు నీవె గుణ పాత్రంబు నీవె కనఁగా. 
గోత్రార్థమీవెగ. పవిత్రార్థమీవెగ. మహత్త్రాత వీవెగ సతీ!
భావము.

ఓ సతీ మాతా! ఈ శరీరము నీవే.  ఈ శరీరమున తెలియఁబడు దానవూ 
నీవేనమ్మా. క్షేత్రార్థమందువా…. అదియూ నీవే. ఈ శుభప్రదమయిన 
భారత  ధరిత్రిపై నీవే మకు కలిగి యున్నచో మా యొక్క 
గోత్రములతో పనియేమున్నదమ్మా? మా పాత్రలతో పని యేమి కలదు? 
మేము చెప్పుకొనెడి గోత్రములు నీవే, సూత్రములు కూడా నీవే నమ్మా. 
గోత్రార్థము కూడా నీవే కదా. మమ్ములను గొప్పగా రక్షించు తల్లివీ నీవేకదా 
మాతా.

40. జ్ఞానామృతంబు గొన మానావమానములవీనాకెటుల్ తెలియునే? 
దీనావనా! కనుచునీనా మనస్థితిని జ్ఞానాగ్ని దగ్ధ ఫలుగా 
నీ నామ కీర్తనను నేనెప్పుడున్ తనియ జ్ఞానంబు నాకునిడుమా.  
ప్రాణంబుగా నిలిచి మానంబునే కొలుపు నే నిన్ దలంచుదు సతీ! 
భావము.
ఓ సతీ మాతా! నిన్ను గూర్చిన జ్ఞానమనే అమృతమును స్వీకరించియున్న   
ఈ నాకు మానావమానము ఏ విధముగా తెలియును తల్లీ?  ఓ దీనులను 
రక్షించు తల్లీ! ఈ నాయొక్క మనస్సు ఉన్న స్థితిని చూచుచు జ్ఞానమనే 
అగ్నిదేనిని దగ్ధము చేయుటవలన మంచి ఫలితము లభించున్ అట్టి 
మంచి ఫలితము నేను పొందువానిగా చేయుము. నీ యొక్క నామ 
సంకీర్తనచేయుచు నేనెల్లప్పుడూ తృప్తిపొందువానిగా ఉండుట్కుతగిన 
జ్ఞానమును ప్రసాదింపుమమ్మా. నాలో ప్రాణముగా ఉండి నాకు గౌరవమును 
కలుగఁజేయుచున్న నిన్ను నేను తలంచెదనమ్మా.

41 శక్తిప్రదా! మహిత ముక్తిప్రదా! విమల భక్తిప్రదాయివి కదా. 
భుక్తి ప్రదాయివయి రక్తిప్రదాయివయి యుక్తంబునేలనిడవో? 
రక్తాక్షివై మహి విరక్తాళినే కనవు. రక్తిన్ విడన్ సుగుణభా 
రక్తిన్ ధరన్ తుడిచి భక్తిన్ సదా యిడుమ ముక్తిం గనం గను సతీ! 
భావము.
ముక్తి కలుగు విధముగా చూచు ఓ సతీ మాతా! శక్తినొసగు తల్లీ! గొప్ప ముక్తి 
నిచ్చెడి అమ్మా! నిర్మలమయిన భక్తినొసగు తల్లివి కదా నీవు. నీవు భక్తి 
నొసగుదానివయి యుండియు, ముక్తినొసగుదానివయి యుండియు, మాకు 
యుక్తమయినది ఎందుల కీయకుందువో కదా. మంచి గుణములతో ప్రకాశించు 
ఓతల్లీ! నీవు రక్తాక్షివయియుండియు, విరక్తులయిన వారి మదిలో అనురక్తిని 
బాపుటద్వారా విరక్తులనేలచూడవు? వ్యర్థమయిన్ అనురాగములను 
పోగొట్టి భక్తిని ప్రసాదింపుమమ్మా.

42. మంత్రంబు లీవె కద, యంత్రంబు లీవెగ కుతంత్రంబు లీవగుదువా? 
మంత్రార్థమున్ దెలిసి మంత్రోదకంబిడుచు మంత్ర స్వరూపులిలపై 
మంత్రంబు వేసెడి కుతంత్రజ్ఞులన్ కనవొ మంత్రార్థమీవె యగుచున్,
తంత్రంబులేలనిల మంత్రంబు లేల నిను మంత్రంబులన్ గన సతీ! 
భావము.
ఓ సతీ మాతా! మేము భక్తితో ఉచ్చరించుమత్రములు నీవే కద్ద. 
యంత్రములు కూడా నీవే కదా. మరి దుష్టులు పన్నెడి  కుతంత్రములు 
నీవగుచున్నావా? మంత్ర ద్రష్టలు మంత్రముల అర్థమునెఱిగినవారై 
ప్రజాక్షేమముకోరుచు మంత్రజలమును సేవింపనొసగుదురమ్మా. 
కుతంత్రములెఱిగినవారు మంత్రములు వేయుచు కుతంత్రములు 
చేయుచుండిరి అట్టివారిని మంత్రార్థమీవే అయియుండి కూడా 
నీవెందులకు చూచి శిక్షింపవో కదా. మంత్రములలో నిన్ను చూడగలిగినచో 
ఇక మంత్రతత్రములెందుకమ్మా. వాటిటొ పనియేమున్నది? అంతా నీవే 
తల్లీ.

43. కన్నార నిన్నుఁ గన నెన్నన్,  గనన్ జనమి నెన్నన్ గ నా కనులిలన్ 
మున్నుంచుమా జనని మన్నున్, నినున్ గనుదు, నిన్నున్ గనం గొలుపుమా.
పున్నెంబుచే కనెడు కన్నున్ గనం గనుదు మున్నున్న నిన్ను జననీ.
నన్నేలుమా జనని కన్నార జూతు నిను నన్నేలు దీప్తివి సతీ! 
భావము.
ఓ సతీ మాతా! ఆలోచించినచో ఈ భూమిపై నా కన్నులు కనులారా నిన్ను 
చూడఁ దలచి చూడలేకపోయినచో నీవున్న మట్టి రూపమునయినను 
నాకనులముందుంచుమమ్మా. నిన్ను ఆ విధముగనయినను 
చూచుదును నిన్ను చూచునట్లు చేయుమమ్మా. ఓ తల్లీ! నా కనులముందే 
ఉన్న నిన్ను పుణ్య ఫలముచే చూచెడి జ్ఞాన నేత్రముతో నిన్ను 
చూచుదునమ్మా. నీవు నన్నేలెడి కాంతివే. నన్నేలే నా తల్లివగు నిన్ను 
కనులారా చూచుదునమ్మా.

44. సాహిత్యమున్ మిగుల సౌహార్ద్రమున్ గలుగు దేహంబునన్ నిను గనన్ 
స్నేహోన్నతిన్ గలుగు సౌహార్ద్ర చిత్తుల కిదే హారతిన్ గొలిచెదన్.
నీ హస్తమే యిచట నా హస్తమున్ గొనుచు స్నేహోన్నతిన్ కవితతో 
నాహా యనన్ దెలియ మోహార్తి బాపుఁ గద సౌహార్ద్రతన్ గను సతీ! 
భావము.
సహృదయంతో చూచెడి ఓ సతీ మాతా! నిన్ను దేహమున చూచుచున్నచో
సాహిత్యమును, అధికమయిన సౌహార్దమును తప్పక కలుగును తల్లీ. 
ఉన్నతమయిన స్నేహ భావము ఉన్న సౌహార్దమనసులకిదే హారతి పట్టి 
సేవించుదునమ్మా,. నీ యొక్క  యీ చేయియే స్వయముగా నా చేతికి 
ఆలంబన మగుచు స్వీకరించి స్నేహాధిక్యముతో ఆహా యని ఆశ్చర్య 
పోవుచు గ్రహించునట్లుగా కవిత వెలయించి దానితో మా మోహార్తిని పోగొట్టును 
కదా.

45. ఉత్సాహ మీవె కద ప్రోత్సాహ మిచ్చుచు శుభోత్సేక మిచ్చెదవు నీ
వాత్సల్య మెన్నఁగ మహోత్సాహమే కలుగు సత్ సిద్ధి ప్రాప్తమగుగా.
మత్సేవ్య తేజమ! సరిత్సాగరంబువయి ద్యుత్సన్నిధిన్ నిలుపుమా.
కుత్సిత్వమున్ గనని ప్రోత్సాహులన్ గనఁగ నుత్సాహమిమ్మిక సతీ!   
భావము.
ఓ సతీ మాతా! మాలోని ఉత్సాహము నీవేనమ్మా. ప్రోత్సాహమును 
కలిగించుచు శుభప్రదమయిన పొంకను కలిగించుదవమ్మా. నీకు మాపై ఉన్న 
వాత్సల్యము పరిగణించుచున్నచో గొప్ప ఉత్సాహము కలుగుచు మంచి 
సిద్ధించును కదా తల్లీ. నాచే సేవింపబడెడి ఓ తేజస్స్వరూపమా! 
దుర్గాసముద్రముగా అయి, నన్ను కాంతి చెంత నిలుపుమమ్మా. ఇక కుత్సిత 
స్వభావ దూరులయి ప్రోత్సాహము కలిగించువారినిచూచుటకు ఉత్సాహము 
కలిగించుము.

46. ధీశక్తి వీవగుచుఁ బ్రాశస్త్యమున్ గొలుపుమా, శాంతి గొల్ప, నిఁక నీ
వే శాశ్వతంబగుచు, నా శాంతి వీ వవగ నాశించి నిన్ గొలువనీ.
యాశా పరాఙ్ముఖుఁగ నీ శక్తితోఁ గని దురాశల్ విడన్ గొలుపుమా. 
యో శాస్త్ర భాసిని! మహేశాని! నిన్ గొలుతు భాసించ నో వర సతీ!
భావము. 
ఓ మహేశ్వరీ! శాస్త్రములయందు ప్రకాశించు ఓ శ్రేష్ఠురాలివయిన సతీ 
మాతా! నాకు శాంతి ప్రసాదించుట కొఱకు నాలో బుద్ధియొక్క శక్తివి నీవే 
అగుచు, ప్రశస్తిని కలిగించుము తల్లీ! ఇకపై నీవే నాకు శాశ్వతమగుచు, నా 
శాంతివి నీవే అగునట్లుగా ఆశించుచు నిన్ను సేవించనీయుమమ్మా. 
ఐహికమయిన ఆశలకు విముఖునిగా నన్ను నీ శక్తితో చూచి, దురాశలను 
విడిపోవునట్లు చేయుమమ్మా. నాలో నీవు ప్రకాశించుట కొఱకు నిన్ను నేను 
సేవింతునమ్మా.

47. కాత్యాయనీ జనని సత్యస్వరూపిణివి, నిత్యంబు నిన్నుఁ గొలుతున్.
సత్య స్వరూపముగ నిత్యంబు నేఁ గను మహౌన్నత్య భావ కలితా! 
ముత్యాల జల్లులటు స్తుత్యంబులౌ పదము లత్యంత ప్రేమనిడుమా. 
గత్యంతరంబగుచు స్వాస్త్యంబునీయ  నిలు, సత్యా! హృదిన్ శుభ సతీ! 
భావము.
శుభ కరమయిన సత్యా!  ఓ సతీ మాతా! ఓ కాత్యాయనీ మాతా! నీవు సత్యమే 
స్వరూపముగా కలదానవు. నిన్నెల్లప్పుడూ నేను సేవింతునమ్మా. సత్యము 
యొక్క స్వరూపముగా నిత్యమూ నేను చూచెడి గొప్ప భావముతో కూడుకొనిన 
దాని వమ్మా. సత్యముయొక్క స్వరూపమును కనఁబరచు పదములను 
ముత్యాల జల్లులనునట్లుగా నాకు ప్రేమతోనొసగుమమ్మా. నీవే నాకు 
గత్యంతర మగుచు నాకు స్వాస్త్యమును ఇచ్చుటకై నా హృదయములో 
స్థిరముగా ఉండుమమ్మా.

48. ఇల్లాలివై హరుని చల్లంగఁ గాచు పరమోల్లాసినీ భగవతీ! 
ముల్లోకముల్ గనుము చల్లంగ, సజ్జనుల యుల్లంబులన్ వెలుఁగుమా. 
కల్లల్ మదిం గనని యుల్లాసులన్ కనుమ యల్లారు ముద్దుగ భువిన్.
తల్లీ నినున్ దలతు నుల్లంబులో నిలుమ చల్లంగ నీవిక సతీ!
భావము.
ఓ సతీ మాతా! శివునకు పత్నివై చల్లగా కాపాడుచు మహదానందముగా 
ఉండెడి ఓ భగవతీమాతా! చల్లగా ముల్లోకములను చూచుహు మంచివారి 
హృదయములందు ప్రకాశించుచుడుమమ్మా. ఏమాత్రమూ మాయ 
లేనటువంటి ఉత్సాహవంతులను ప్రేమతో అల్లరుముద్దుగా 
కనుచుండుము. ఓ తల్లీ! నిన్ను తలంచెదను. ఇక నీవు నా హృదయములో 
చలాగా నివసించియుండుము.

49. నీ పాద సేవనము పాపాంధ వారణము శ్రీపాద నే కొలువనా.                                             
దీపాలనే నిలిపి నీపాద సన్నిధిని. తాపంబునే విడువనా.
యో పాప హారిణి! మహీపాలురందుగల పాప ప్రవృత్తిన్ గనవొకో.
పాపాత్ములన్ దునిమి కాపాడు సజ్జనుల నోపాపవారక సతీ!
భావము.
పాపములను నివారించే ఓ సతీ మాతా! నీ పాదపద్మములను సేవించుట 
పాపమనెడి చీకటి నివారణయే. మంగళమయిన పాదములుకల తల్లీ! నేను 
నిన్ను సేవించనా? నీ పాదముల సమీపమున దీపారాధన చేసి, నా తాపమును 
విడిచిపెట్టనా జననీ!ఓ పాపనివారిణీ! భూపాలకులలో ఉన్న పాప 
ప్రవృత్తిని నీవు చూడకుంటివా యేమి? పాపాత్ములను సంహరించి 
సజ్జనులను కాపాడుమమ్మా.

50. ఏనాటి పుణ్య ఫల మీనాడు కల్గుటిది శ్రీనిర్మలాత్మవు నినున్ 
జ్ఞానాక్షితోఁ గను టదే నాకు భోగమగు, నా నీడవై నిలుచుచున్
ప్రాణంబు నీవయి ప్రమాణంబుగా నిలిపి రాణింపఁ జేయు మిలలో
హే నా జగజ్జనని నేనున్ నినుం దలతుఁ గానం గనం దగు సతీ! 
భావము.
ఓ సతీ మాతా! నీవు నాకు సమీపములో నిలిచితివా? ఆహా! ఇది నాకు ఏ నాటి 
పుణ్యఫలమో కదా, ఈసమయమున నాకులభించినది.  మంగళప్రదమయిన  
నిర్మల మనస్సు గలతల్లివి.  అటువంటి నిన్ను నా జ్ఞాన నేత్రముతో చూడఁ 
గలుగుటనాకు లభించిన భోగమేయగునమ్మా. నానీడవై నీవు నిలుచుచు నా  
ప్రాణమే నీవగుచు నన్ను ప్రమాణముగా నిలుపుమమ్మా. ఓ నా లోకమాతా! 
నేను నిన్ను మనసులో నిత్యమూ తలంతునుంఇన్ను చూచు విధముగా 
నన్ను అనుగ్రహముతో చూచుట నీకు తగునమ్మా.

51. కర్ణామృతంబయిన స్వర్ణాక్షరాళినిడి వర్ణింతు నీదు ఘనతన్,
పూర్ణ స్వరూపిణివి పూర్ణేందు భాసవి యపర్ణా! కృపం గనుమికన్.. 
దుర్నీతులన్ దునుము పర్ణంబులట్లురల, స్వర్ణాక్షరీ కొలుతు నిన్, 
కర్ణంబులుల్లసిల వర్ణింపనిమ్ము నిను స్వర్ణప్రదా! వర సతీ! 
భావము.
సువర్ణప్రదవయి శ్రేష్టురాలివయిన ఓ సతీ మాతా! వినసొంపుగా ఉండు 
సువర్ణమయమగు అక్షరములతో నీ యొక్క ఘనతను వర్ణించెదను తల్లీ! 
ఓ అపర్ణా! నీవు పరిపూర్ణ స్వరూపము కలదానివి. పూర్ణిమ చంద్రునివలె 
ప్రకాశించు తల్లివి. ఓ స్వర్ణాక్షరీ నిన్ను కొలిచెదను. నన్ను కృపతో 
చూడుమమ్మా. అవినీతిగా ప్రవర్తించువారిని ఆకులవలె రాలిపోవునట్లు 
సంహరింపుము. కర్ణాంఋతముగా నిన్ను వర్ణింపనిమ్ము తల్లీ.

52. జాలిన్ సుధీవరు కపాలిన్ వరించితివి, నీ లీలలెన్నఁ దరమా. 
యే లీల నీవతని పాలిం మెలంగెదవొ లోలాక్షిరో తెలుపుమా.
చేలాంచలంబతని నీలీల నిల్పినద? నీలాలకల్ మహిమమా? 
పాలింతువెల్లరిని జాలిం కనంబరిచి హేలన్. సుశోభిల, సతీ! 
భావము.
ఓ సతీ మాతా! శ్రేష్టమయిన బుద్ధితో నొప్పెడి కపాలిని నీవు జాలిపడి 
వరించితివి. నీ లీలలనెన్నుట సాధ్యమగునా తల్లీ!  చంచల నేత్రములతో 
సుందరమైన ఓ తల్లీ! నీ పతి విషయమున నీవు ఏ విధముగా ప్రవర్తింతువో 
మాకు తెలియఁజేయుమమ్మా. నీ కడకొంగు ఆ శివుని ఈ విధముగా నీ 
విషయమున నిలిపివేసినదా? నీ నల్లని ముంగురుల మాహాత్మ్యమా? నీవు 
జాలి చూపించుచు అందరినీ గొప్పగా శోభిల్లు విధముగా పరిపాలింతువు కదా 
తల్లీ!

53. పాలింపుమా సుకృతినాలింపుమా కృపను నీలీలలన్ని తెలియన్,
గాలించి చూడ నిను పోలంగనెవ్వరిల లోలాక్షిరో మహిమలో.
నీ లీలలన్ బొగడి మాలోన నిన్ నిలిపి లోలోన పొంగుట తగున్. 
హేలన్ ననున్ గనుచు నేలన్ మనన్ గనుమ శ్రీలంద జేయుచు సతీ!. 
భావము.
ఓ సతీ మాతా! అమ్మా! నీవు నన్ను పరిపాలింపుముంఏను రచించిన ఈ మంచి 
అశ్వధాటి కృతిని నీలీలలన్నియు తెలియుట కొఱకు కృపతో వినుము. 
చంచలమైన అందమయిన కన్నులుగల ఓ తల్లీ! ఎంతగా వెదకి 
చూచినప్పటికీ గొప్పతనములో నీతోసరిపోలువారెవ్వరుండిరమ్మా? 
ఎవ్వరునూ లేరు. నీ లీలలను ప్రశంసించుచు మాలోనే నిన్ను నిలిపి ఉంచి, 
మాలోలోపల పొంగిపోవుటయే మాకు తగునుగదా అమ్మా. 
విలాసవంతముగానన్ను చూచుచు, సంపదలందఁజేయుచు, ఈ భూమిపై 
బ్రతుకువిధముగా చూడుమమ్మా.

54. నీలాలకా! సుగుణ పాలా! త్రిలోక పరిపాలా త్రిశూలధర నీ  
వేలీల రక్షింతువేలీల సిద్ధింతు వేలీల నన్ నిలుపుదో.
కాలాత్మవీవెకద కేళిన్ రచింతువిల నీలీలలివ్వె కనగా
జాలిన్ ననున్ మహిమనేలన్ గదమ్మ, కను హేలన్, శుభాకర సతీ!
భావము.
శుభములకు స్థానమయిన ఓ సతీ మాతా! నల్లని ముంగురులు కల ఓ 
జననీ!మంచివారిని పరిపాలించు తల్లీ! ముల్లోకములనూ పాలించు 
త్రిశూలధారివయిన అమ్మా!నీవు నన్ను ఏ విధముగా రక్షించుదువో, నాకు ఏ 
విధముగా సిద్ధింతువో, నన్ను ఏ విధముగా నిలుపుదువో? కాలమునందలి 
ఆత్మవు నీవేకదా తల్లీ. ఈ భూమిని ఆటగా రచించుదువుకదా అమ్మా. చూడగా 
ఇవన్నియు నీ లీలలు.నాపై జాలితో నీ మాహాత్మ్యము చూపి 
పాలింపదగునుకదా తల్లీ! నన్ను హేలగా కనుచూ రక్షించుచుండుమమ్మా.

55. రాత్రించరుల్ దురిత పాత్రుల్ దురాత్ములయి, ధాత్రిన్ వినాశనము కాన్ 
చిత్రంబుగా కనిన మాత్రంబునన్ గొలుపు మైత్రిన్ ప్రవర్తనము చేన్. 
మిత్రుండవీవయను చాత్రంబునన్ గనరె శత్రుత్వమున్ నెరపుచున్.
మా త్రాత వీవగుచు ధాత్రిన్ మమున్ గనుమ. శత్రుఘ్న పావన సతీ!
భావము.
శతృవిధ్వంసము చేసెడి పావనవయిన ఓ సతీ మాతా! మాయ అనే చీకటిలో 
సంచరించేవారు చెడుకు పాత్రులు గా దురాత్ములుగాను  అయి ఈ భూమినే 
నాశనమగునట్లువిధముగా, తమ ప్రవర్తనచేత మిక్కుటమగు 
ఆశ్చర్యకరముగా ఇతరులతో స్నేహము ప్రకటించుచు నీవు 
నామిత్రుఁడవు అని పలుకుచు మోసము చేయుచు శత్రువులు 
ప్రవర్తించుదురు. మారక్షకురాలివగుచు అట్టి దుర్మార్గులనుండి మమ్ము 
కాపాడుమమ్మా.

56. దారుల్ గనంబరిచి నేరంబులన్ గొలిపి నేరంబులన్ బొనరచన్
కారుణ్యమున్ విడిచి, పారింతు వేలమము నీరీతి చేయఁ దగునా?
శ్రీరామ రక్షణగ నేరీతి మమ్ములను నీ రాక నిల్పునొ కదా.
యో రాక్షసాంతకి! సదా రక్షగా నిలుము కోరన్ వరంబులు సతీ!
భావము.
ఓ సతీ మాతా! తప్పుడు ప్రవర్తనలకు దారులు మాకు చూపుచు నేరములు 
చేసి, మేము నేరములు చేసినచోదయను విడిచి, మమ్ములను భయముతో 
పరుగులు తీయింతువుకదా, ఈ విధముగా నీవు మమ్ములను చేయుట తగునా 
తల్లీ? నీవు వచ్చుట శ్రీరామ రక్షణముగా మమ్ములను ఏ విధముగా 
నిలుపునోకదా తల్లీ. రాక్షస సంహారిణివయిన ఓ తల్లీ! ఇక నీవు 
మాకెల్లప్పుడూ రక్షగా ఉండుమమ్మా.  ఏ వరములూ నిన్ను 
కోరను.

57.  హృద్యాద్భుతంబయిన  పద్యంబులన్ సుజన వేద్యా!  రచించి యిడనా?
సాధ్యంబు నీ కృపను, వేద్యంబు నీకిదియు, విద్యావతీ కనుదువా?
ఆద్యంతమున్ దనుపు పద్యప్రవాహమిడు విద్యన్ వరంబడిగెదన్.
సద్యఃఫలప్రదవు, సద్యోగమిమ్మికను, విద్యాధరీ భువి సతీ!
భావము.
ఓ సతీ మాతా! మంచివారిచే తెలియఁడుదానా? మనోహరమయిన 
అద్భుతమయిన పద్యములను నేను విరచించి నీకు సమర్పించనా తల్లీ! 
ఇది నాకు సనీ కృపచేత సాధ్యమయిన పనియేనమ్మా. ఈ విషయము నీకు 
కూడా తెలియును. ఓ విద్యావతీ చూచెదవా? పఠించువారిని, ఆలకించువారిని 
ఆద్యంతము తృప్తిపరచు పద్య ప్రవాహమును ప్రసాదించు విద్యను 
వరముగా నిన్ను నేను అడిగెదను. ఓ విద్యాధరీ! భూమిపై మాకు 
మంచియోగమును ప్రసాదించు తల్లివి నీవు. అమ్మా! నీ లో ఐక్యమగుటయే 
సద్యోగము కదా. అట్టి మంచి యోగమును నాకు ప్రసాదింపుము.

58. వేదార్థ భాసివి, ప్రమోదంబు గొల్పుమిక, వాదేలనమ్మ జననీ 
బోధావహంబయిన  సాధారణార్థ గతి నేదారి నేర్పుదువొగా.
నాద ప్రియా! సుగుణ బోధప్రభాస రస వాదప్రియా కనుమికన్.
నీదారిలో నడిపి శ్రీదంబువై నిలుపుమా ధైర్య మబ్బగ సతీ!
భావము.
ఓ సతీ మాతా! వేదార్థములలో ప్రకాశించు తల్లివి. వాదులాడక్ ఇకపై మాకు 
నీ తలపులతో కలిగెడి ప్రమోదమును లభింపఁజేయుమమ్మా! బోధకు 
స్థానమయిన సాధారణమయిన అర్థగతిని ఏ మార్గమున నేర్పుదువో 
తల్లీ! నాద ప్రియవైన ఓ జగన్మాతా! సుగుణ బోధలో ప్రకాశించు 
రసవాదప్రియా! ఇంక నన్ను చూడుము. నీ మార్గములో నన్ను 
నడిపి లక్ష్మీప్రదవై ధైర్యము అబ్బు విధముగా నిలుపుము.

59  అగ్రాహ్యముల్ విడిచి సుగ్రాహ్యముల్ గొను, సమగ్రంపుమార్గ సుగతిన్
శ్రీ గ్రామ దేవతగ నుగ్రాకృతిన్ విడిచి యీ గ్రంథమున్ గొనుమిఁకన్.
సుగ్రాహ్యమౌ కవితనగ్రేసరుండనుచు నగ్ర స్థితుల్ పొగడ నన్,
స్వగ్రాహ్యముల్ పొదిగి యీ గ్రంథమందుమిట సద్గ్రాహ్యవై నిలు, సతీ!
భావము.
ఓ సతీ మాతా! గ్రహింప రానివి విడిచిపెట్టి, గ్రహింప 
తగినవి పూర్తి సన్మార్గ సుగతితో నీవు గ్రహింపుము తల్లీ! మంగళప్రదవైన 
గ్రామ దేవతగా నీవు నీ భయంకరాకారమును విడిచిపెట్టి, ఈ నా 
గ్రంథమును ఇంక స్వీకరింపుము. మంచిగా గ్రహింపదగిన కవితలలో 
ఘనుఁడనని గొప్పవారు నన్ను పొగడునట్లుగా నీ నుండి గ్రహింపదగిన 
విషయములను ఈ నా రచనలో చొప్పించి, ఈ గ్రంథమును మంచిని 
గ్రహించు తల్లివై స్వీకరింపుము.

60. రాజాధిరాజులకు నేఁ జాలనీయఁగను రాజీవ కల్ప కృతినే.
రాజిల్లు నీకొసఁగ రాజిల్ల వచ్చు నిట రాజీవలోచన భువిన్
పూజాఫలమ్మదియె రాజేశ్వరీ కొనుమ రాజిల్లఁ జేయుమ ననున్,
నే జేయుదున్ నతులు నా జీవమా! కొనుమ, రాజీవలోచన సతీ!
భావము.
లేడి కన్నులవంటి కన్నులు గల ఓ సతీ మాతా! సహస్రదళపద్మ 
సన్నిభమయిన  యీ నా గ్రంథమును నేను రాజాధిరాజులయినవారికినీ 
యీయ నేరనమ్మా.  తేజస్వినివయిన నీకొసఁగినచో ఇక్కడ భూమిపై 
వెలుగొంద వచ్చునుకదా తల్లీ!  అదే కదా పూజాఫలము. ఓ రాజేశ్వరీ మాతా! 
స్వీకరింపుమమ్మా. నన్ను రాజిల్లునట్లు చేయుము. నీకు నమస్కరింతును నా 
ప్రాణమా! ఓ జగన్మాతా! స్వీకరింపుము.

61  సంపూర్ణ భక్తినిడి, సంపూర్ణ శక్తినిడి సంపూర్ణ ముక్తినిడుమా.
సంపూర్ణ ధ్యాసనిడి,సంపూర్ణ భాషనిడి సంపూర్ణ వాసినిడుమా.
సంపూర్ణవౌ జనని! సంపూర్ణతన్ వెలుఁగు సంపూర్ణ మూర్తివగుమా,
సంపూర్ణచంద్రముఖి సంపూర్ణ వీవగుమ, సంపూర్ణ తేజస సతీ!
భావము.
ఓ సతీ మాతా! నాకు పరిపూర్ణమయిన భక్తి నొసగి, గొప్ప శక్తిని ప్రసాదించి, 
పునర్జన్మ లేనట్టి ముక్తిని ప్రసాదింపుము. సంపూర్ణమయిన ధ్యాసను 
నీపై కలుగఁజేసి, పరిపూర్ణ భాషాజ్ఞానమునిచ్చి, పరిపూర్ణ నైపుణ్యమును 
దయచేయుమమ్మా. పరిపూర్ణమయిన ఓ తల్లీ! పూర్ణత్వముతో 
ప్రకాశించుచు సంపూర్ణమూర్తిగా అగుము. ఓ పూర్ణచంద్రముఖీ! ఓ 
సంపూర్ణ తేజస్వరూపిణీ! పూర్ణముగా నీవే నాకొఱకు అయి 
దయఁజూడుము.

62 సంగీత సాహితులు ముంగొంగు పుత్తడిగ లొంగున్ త్వదీయ కృపచే
నింగిం గనంబడు విహంగంబులం గలవు సంగీత రూప జననీ!
సంగీత సాధకుల సాంగత్యమున్ గొలుపు, సంగీతమబ్బుటకునై,
సంగీత మబ్బిన యనంగారినే గొలుతు, సంగీత భాసిత సతీ!
భావము.
సంగీతమునందు ప్రకాశించు ఓ సతీ మాతా! నీ కృప యున్నచో మాకు సంగీత 
సాహిత్యములు కొంగుబంగారమై నిలుచునుకదా. సంగీత రూపమున ఉన్న ఓ 
మాతా! నీవు ఆకాశమున ఎగురు విహంగములలోనూ నీవు ఉంటివమ్మా. నాకు 
సంగీతము అబ్బుట కొఱకు సంగీత సాధకులయొక్క సాంగత్యమును 
కల్పింపుమమ్మా. నాకు సంగీతమబ్బినచో ఆ పరమేశ్వరుని కొలిచెదను.

63 పంకేరుహాక్షివి! యుటంకింతు నీ మహిమ సంకాశమే కననిదం
చింకేమి చెప్పుదును, జంకేల పొందుదును, శంకన్ బ్రవర్తిలుదునా.
ఓంకార రూపిణి! యహంకారమున్ దుడిచి శ్రీంకారమున్ నిలుపుమా.
హ్రీంకార బంధుర యహంకారమున్ గొలుపు మైంకార భాసిత సతీ!
భావము.
ఐంకారమున ప్రకాశించు ఓ సతీమాతా! పద్మములవంటి కన్నులు కల 
తల్లివి నీవు. నీ మహిమ సాటియే లేనిదని పలుకుదును. ఇంతకన్నా మరేమి 
పలుకుదును తల్లీ! నే ఆ విధముగ పలుకుటకు ఎదులకు జంకుదునమ్మా? 
అనుమానములతో ప్రవర్తించను తల్లీ! ఓంకార స్వరూపివయిన తల్లీ! నాలోని 
అహంకారమును పూర్తిగా నశింపఁ జేసి, శ్రీంకారమును నిలుపుమమ్మా.ంఈవు 
కలిగి యుండెడి హ్రీంకారముతో కూడుకొనిన వాటి విషయములలో 
అహంకారమును నాయందు కలిగించుము.

64 ఆశావహంబయిన ధీశక్తి నే నడుగ, నాశింతు సత్య గతి, నే
నాశింప దుష్కలిమి, నాశింప దుశ్చరిత, నాశింతు శోభనము లే
నాశింప నన్యగతు లాశింప భావుకత, నాశింతు నీ కృప సదా.
యాశావహుండనయి యాశింతు మంగళము ధీశాలి! మా కిల, సతీ!
భావము.
ఓ సతీ మాతా! ఆశలను రేకెత్తించు బుద్ధిబలము ఇమ్మని నిన్ను నేను 
కోరనమ్మా. సత్యమయిన మర్గమునిమ్మని ఆశింతును. నేను 
చెడ్డదయిన ధనమును ఆశించను. దుష్ప్రవర్తనను నేను ఆశింపను, 
శోభనములను ఆశింతును.  నేను నీకంటే అన్యమయిన గతులను 
ఆశింపను. భావుకతఁ గొలుపమని ఆశింపను. ఎల్లప్పుడూ నీ కృపకై 
ఆశింతునమ్మా. ఆశావహుఁడనయి మాకు ఎల్లప్పుడూ ఈ భువిపై 
మంగళములనే ఆశింతును.

65. విద్వన్నుతుండనని సద్వర్తనుండనని, విద్వత్ప్రదా! సతము నన్ 
విద్వత్ ప్రభా కలిత విద్వాంసు లెన్నుటది విద్వన్మణీ! తమ కృపన్.
విద్వత్ప్రకాశమది సద్విద్యచేఁ గలుగు. విద్వాంసులందు తమరే
విద్వత్ కనంబరచి విద్వాంసుగా పొగడరే, ధ్వాంత నిర్జిత సతీ!
భావము.
పూర్తిగా జయించఁ బడిన అంధకారము గలిగిన ఓ సతీ మాతా! జ్ఞానమును 
ప్రసాదించు జననీ! ఓ విద్వన్మణీ! నీ యఈ కృప కారణముగానే 
జ్ఞానప్రభాకలితులు నన్ను పండితులచే నుతింపఁబడు 
వాడనని, సత్ప్రవర్తన కలవాడినని ఎన్నుదురు. విద్వత్తు యొక్క శోభ 
మంచి సత్ స్వరూపివయిన నీకు సంబంధించిన విద్య నభ్యసించుట 
చేత మాత్రమే సంభవించును. నాలో విద్వత్తును కనఁబడునట్లు 
అనుగ్రహించి, విద్వాంసునిగా నన్ను, మీరే  విద్వాంసులలో నిలిచి పొగడిరి 
కదా తల్లీ!

66. ముంజేతి కంకణమ! సంజీవి వీవె కద, సంజాత భక్తతతికిన్. 
భంజించుమా కుగతి, భంజించు దుష్టులను, రంజింపఁ జేయుము మమున్, 
కంజాత నేత్ర! మది రంజిల్ల పద్యములు, సంజీవనీ కొలుపుమా. 
భంజింప దౌష్ట్యములు మంజీరనాదమటు రంజింపఁ జేయుము సతీ!
భావము.
ఓ సతీ మాతా! ప్రత్యక్షముగా మేము చూచుటకు వీలుగా నున్న మా ముంజేతి 
కంకణమా! భూమిపై పుట్టిన నీ భక్తుల సమూహమునకు కోరికలు తీర్చుటలో 
నీవు సంజీవివేకదా తల్లీ! మా చెడ్డ గతిని నశింపఁజేయుము. దుర్మార్గులను 
నాశనము చేయుము. మమ్ములను రంజింపఁజేయుము. పద్మములవంతి 
కన్నులు కల తల్లీ! కోరికలను తీర్చు సంజీవినీ మనసు ఆనందముతో 
పొంగునట్లుగా, దౌష్ట్యములను నశింపఁ జేయు విధముగా పద్యములు 
నాచే రచింపఁ జేయుము. ఓమంజీర నాదము వలె మమ్ములను రంజిల్ల 
జేయుమమ్మా.! 

67. రాజేశ్వరీ! వినుత రాజీవ నేత్రి! నిను పూజించనిమ్ము కృపతోఁ
బూజింతు నీ పద సరోజంబులన్ సతము రాజిల్లు నాదు మదిలో.
రాజిల్లఁ జేయుము సరోజాక్షులన్ భువిని స్త్రీజాతినెన్ని కృపతో
మా జీవమీవనుచు స్త్రీజాతి నమ్మి నిను పూజింత్రు, నమ్ముము, సతీ!
భావము.
ఓ సతీ మాతా! ప్రశంసింపఁబడు పద్మములవంటి కన్నులు కల తల్లీ! ఓ 
రాజేశ్వరీ మాతా! నీ పాదపద్మములను నేను పూజింతునమ్మా! కృపతోనిన్ను 
పూజించనిమ్ము. నా మదిలో నీవు యెల్లప్పుడూ ప్రకాశించుమమ్మా. 
పద్మముఖులయిన స్త్రీ జాతిని నీవు పరిగణించుచు, వారిని వెలుగొందునట్లు 
చేయుమమ్మా. మా జీవము నీవే అని భావించుచు స్త్రీజాతి నిన్ను నమ్మి 
పూజింతుతురమ్మా. నా మాటలు విశ్వసింపుము.

68. కల్లోలముల్ ప్రబలె ముల్లోకముల్ కలగ, తల్లీ కనంగ తగవో.
ముల్లోకవాసివిగ కల్లోలముల్  చెరిపి చల్లంగ కావుమిఁకపై
నుల్లంబులన్ నిలిచి యెల్లప్పుడున్ శుభసముల్లాసమే కొలుపుమా.
కల్లల్ మదిం గనక యుల్లంబులోన నిను సల్లీలఁగాంచెద సతీ!
భావము.
ఓ సతీ మాతా! మూడు లోకములూ కలత పడునట్లుగా కల్లోలములు 
అధికమగుచున్నవి. ఓ తల్లీ! నీవు చూచుటకు సరిపోవా? నీవు 
ముల్లోకములందూ ఉండు తల్లివే కదా. ప్రబలుచున్న కల్లోలములను 
తుడిచివేసి, ఇకపై చల్లగా ఉండునట్లు కాపాడుమమ్మా. మా మనసులలో నీవు 
కలిగించుచుండుమమ్మా. ఈ మాయలను మనసులో గణింపక, నా మనసులో 
నిన్ను మంచివిధముగా చూచెదనమ్మా.

69. కాదంబ సద్వన ప్రమోద ప్రవాసినివి మా దారి నీవె శుభదా!
రాదేల నీకు కృప మోదంబుతో నిలిపి బాధల్ విడన్ గొలుపఁగా.
సాధింతుమమ్మ  వరబోధన్ వరంబునిడ నీ దివ్య తేజసముచే
బాధా నివారిణివి సాధింపఁ జేయుమిది మోదంబుతోడను సతీ!
భావము.
ఓ సతీ మాతా! కదంబ వనమున ప్రమోదముతో నివసించు జగన్మాతవు. ఓ 
శుభప్రదవైన తల్లీ! మా మార్గము నీవే నమ్మా. ప్రమోదముతో మమ్ములను 
నిలిపి, బాధలను వీడిపోవునట్లు చేయుటకు నీకు మాపై కృప ఎందులకు 
రాకున్నదమ్మా? శ్రేష్ఠమయిన బోధను నీవు మాకు వరముగా 
ప్రసాదించినచో నీ యొక్క దివ్యమయిన తేజమనెడి ఫలితమును 
సాధించుదుముకదా తల్లీ!బాధనను పోగొట్టుదానవు. ఈ విధమయిన 
ఫలితమును సాధించునట్లు నీవే ఇష్టముతో చేయుమమ్మా.

70. కన్నన్ నినున్ గలుగు మిన్నైన సత్ఫలము కన్నార గాంతుము నినున్.
నిన్నెంచు కన్నులకు మన్నించి కన్బడుమ పున్నెంబునే కొలుపుమా.
మన్నించి నిన్గనెడి కన్నుల్ కదా కనులి కన్నెంబు లెన్నఁ గనులా? 
జన్నంబు లెందులకు కన్నార నిన్ గనిన, పున్నెంబురాశివి సతీ!
భావము.
ఓ సతీ మాతా! నిన్ను చూచినచో గొప్పదయిన మంచి ఫలితము మాకు 
తప్పక సంభవించునమ్మా. కావున కనులనిండుగా నిన్ను చూచెదము తల్లీ! 
నిన్ను భావించే కన్నులకు మన్నించుచు తప్పక కనఁబడుము. మాకు 
పుణ్యఫలమును ప్రసాదింపుమౌ. నిన్ను గౌరవించుచు చూచెడి కన్నులే 
కదా కన్నులు. అట్టివి కాని కన్నులు కన్నులెట్లగునమ్మా? నీవు పుణ్యముల 
రాశివి. నిన్ను కనులారా చూచినచో ఇక యజ్ఞములతో 
పనియేమున్నదమ్మా?

71.  తల్లీ జగజ్జనని! సల్లీలతో కృపను ముల్లోకముల్ నడుపు నీ
యుల్లంబునన్ గనుచు కల్లోలముల్ తరిమి చల్లంగ నిల్పుము ననున్,
కల్లల్ మదిన్ గనక, సల్లాలితీ గరిమ మళ్ళింతు నా మనసునే
యుల్లాసముం గొలుపు తల్లీ నినున్ దలచి, ముల్లోక పావని! సతీ! 
భావము.
అమ్మా! ఓ లోక మాతా! ఓ ముల్లోక పావనీ! మంచి విలాసవంతముగా కృపతో 
మూడు లోకములను నడిపించెడి నీ మనస్సులో నన్నునూ చూచుచు, 
నాకెదురగుచున్న కల్లోలములను తరిమివేసి, నన్ను చల్లగా నిలుపుమమ్మా. 
మాయలను మనస్సున చూడక, మంచి లాలిత్యము యొక్క 
ఆధిక్యముచేత నా మనసును ఉల్లాసమును కలుగఁజేసే నీపయికి 
మళ్ళింతునమ్మా!

72. శ్రీభారతీ జనని! నా భావమున్ గనుచు, శోభిల్లఁ జేయుము ననున్,
శోభిల్లఁ జేసిన మహాభాగ్య మైన తమ వైభోగమే కనెద, నీ
వైభోగమున్ గనిన వైభోగ మబ్బుఁ గద స్వాభావికంబు విడువన్.
నా భాగ్య మీవె కద, నా భార మీదె కద సౌభాగ్య దా! వర సతీ!
భావము.
సౌభాగ్యప్రదవయిన తల్లీ! శ్రేష్ఠురాలివయిన ఓ సతీ మాతా! ఓ 
భారతీమాతా! నా మనసులోని భావమును గమనించుచు నన్ను శోభిల్లునట్లు 
చేయుమమ్మా. నన్ను నీవు శోభిల్లఁ జేసినచో గొప్ప భాగ్యమయిన 
తమయొక్క వైభోగమును చూచెదనమ్మా. నీ వఒభవమును చూచినచో 
నాకునూ స్వభావసిద్ధమయిన ఐహికములు దూరమయి ఊహాతీత  
వైభోగము అబ్బునుకదా తల్లీ! నా భాబ్యము నీవే కదా తల్లీ! నా భారము 
కూడా నీదే కదా. 

73. ఓ దేవదేవి! పరమోదార సద్గుణమె నాదారి చేయు జననీ.
నీ దివ్య తేజసము నీ ధర్మ పోషణము మేధావులెన్నుదురిలన్.
బాధల్ విడన్ గొలిపి బోధల్ మదింగొలుపు శ్రీధర్మ తేజసవుగా.
బోధావహంబయిన వేందాంతదీప్తివిగ హేదీనబాంధవి సతీ!
భావము.
దీనబంధువయిన ఓ సతీ మాతా! ఓ దేబదేవీ! గొప్ప ఉదారమయిన 
మంచిగుణమే న మార్గముగా చేయు జననీ!ీ ధార్తిపై జ్ఞానవంతులు 
ఎల్లప్పుడూనీ గొప్పదయిన కాంతి, నీవు చేసెడి ధర్మపరిపోషణమును 
ఎన్నుచుందురమ్మా మా బాధలను విడిపోవునట్లుగా చేసి, మా మనస్సులలో 
జ్ఞానమును కలుగఁ జేయునటువంటి లక్ష్మీప్రదమయిన తేజస్వరూపిణి 
వమ్మా నీవు. నీవు బోధకు మూలమయి వేదాంత తేజమేనమ్మా.

74. దేదీప్యమానమగు నీ దివ్య రూపము ప్రమోదంబుతో కనుటకై
యేదారియున్ గనక నీ దివ్య పాదముల నే దారిగా కలిగితిన్.
మోదంబుతో కనుమ వాదేలనమ్మ,  కనరాదా ననున్ధరణిపై
ఓ దేవి నీవె నను కాదన్న వేరెవరు నాదారియౌదురు సతీ!
భావము.
ఓ సతీ మాతా! మహోజ్వలముగా ప్రకాశిచు నీ దివ్యమయిన స్వరూపమును 
ఆనంద పారవశ్యముతో చూచుటకైఏ మార్గమూ కానరాక, నీ యొక్క 
గొప్పవయిన పాదములనే దారిగా చేసుకొని యుంటినమ్మా. వాదులాట 
యేలనమ్మా, నన్ను ఇష్టముతో చూడుము తల్లీ! భూమిపై నీవు నన్ను 
చూడరాదా యేమి? ఓ దేవీమాతా! నీవే కాదన్నచో నాకు మార్గము 
యింకెవరగుదురమ్మా? తప్పక నీవే నాకు దారిగా అగుము తల్లీ!

75. ఓ పార్వతీ. ప్రతిభనే పంచి పద్యములు దీపించ వ్రాయు పటువున్
నాపైద యన్ గొలిపి శ్రీపాదముల్ మదిని స్థాపించినిల్పితివిలన్.
కాపాడు తల్లివికదా. పాపముల్ తుడిచి దీపించ మంచి నిడుమా.
నా పుణ్య సత్ఫలమ నాపాలి దైవతమ.దీపాకృతిన్గల సతీ!
భావము.
దీపస్వరూపమున నున్న ఓ సతీ మాతా! ఓ పార్వతీ జననీ! ప్రతిభను నాకు 
పంచి, ప్రకాశించునట్లు పద్యములు వ్రాయు శక్తిని నాకునీకు నాపై ఉన్న 
దయతో కొలిపి, నీ మంగళప్రదమయిన పాదములు నాహృదయములో 
స్థాపించితివమ్మా. నాపుణ్యమువలన లభించిన మంచిఫలితంవమ్మా నాకు 
నువ్వు. నాపాలిటి దేవతవు. కాపాడే స్వభావము గల తల్లివికదా, అట్టి నీవు 
మంచి దీపించుటకు గాను నాలోని పాప పంకిలమును తుడిచివేయుమమ్మా. 

76. భూమిన్ జనించు మము నీ మానసంబునను బ్రేమన్ గనన్ మరచితో?
ఏమేమి పాపములు మేమెన్ని చేసితిమొ శ్రీమాత తెల్పఁదగదో?.
ప్రేమామృతాత్మవని మేమున్ నినున్ దలచి నీమంబుతోఁ గొలువమా?
మా మానసంబెఱిఁగి ప్రేమన్ మమున్ గనుమ భూమిన్ శుభాస్పద సతీ!
భావము.
శుభములకు స్థానమయిన ఓ సతీ మాతా! ఈ భూమిపై జనించెడి మమ్ములను 
నీ మనసులో ప్రేమతో చూచుట మరచిపోయినావా తల్లీ?  ఓ శ్రీ మాతా! 
ఎటువంటి పాపకార్యములను మేము గుర్తించి ఆచరించియుంటిమో నీవు 
మాకు తెలియఁజేయ కూడదా తల్లీ? ప్రేమాంఋతమయమయి మా 
త్మస్వరూపిణివని, మేము నిన్ను ఊహించి, నెయమము కలిగి నిన్ను 
సేవింపమా జననీ?భూమిపై మా మనస్సును నీవు తెలుసుకొని, ప్రేమతో 
మమ్ము చూడుమమ్మా. 

77. విజ్ఞానమీవె కద. విజ్ఞాన తేజము మనోజ్ఞంబుగా నొసగు మీ
యజ్ఞానమన్ నిశిని విజ్ఞాన తేజమున  ప్రాజ్ఞుల్ కనన్ విడిచెదన్.
సుజ్ఞేయమౌ నిను నవజ్ఞన్ గనన్ జనక విజ్ఞానదూరునయితిన్
విజ్ఞానమిచ్చి కను జ్ఞానంబునిమ్ము నిను. రాజ్ఞీ! గుణోన్నత సతీ!
భావము.
మహోన్నత గుణ ప్రకాశినివయిన ఓ సతీ మాతా! విజ్ఞానమనగా అది నీవే 
కదా, అందుచే విజ్ఞానప్రకాశమును మాకు మనోజ్ఞముగా 
ప్రసాదించుమమ్మా. ఈ నాలో ఉన్న అజ్ఞానమనెడి రాత్రిని విజ్ఞానమనెడి 
కాంతిచేయప్రాజ్ఞులు గుర్తించి చూచు విధముగా విడిచిపెట్టుదునమ్మా. 
గొప్పగా యెఱుగఁబడు నిన్ను నిర్లక్ష్యముచే  చూడలేక విజ్ఞానమునకు 
దూరమయితిని. ఓ మాహా రాణీ! నాకు విజ్ఞానమును ప్రసాదించి నిన్ను 
చూచెడి జ్ఞానమును ప్రసాదింపుమమ్మా. 

78. సారస్వతంబు కన నోరాజ్ఞి నీవె కద. నీరాక మాకు వరమే.
నీ రాకకై వలతు నే రాత్రియున్ బవలు. చేరన్ననున్ తలచవా.
చేరన్ నినున్ మనసు మారున్ సుబోధఁ గని శ్రీరామరక్షయగునే.
యో రాక్షసాంతకి సుధారాశి రమ్మికను ధీరాత్మ నీయఁగ సతీ!
భావము.
ఓ సతీ మాతా! ఓ మహారాజ్ఞీ! సారస్వతమును పరిశీలించినచో అందు నీవే 
కదా ఉందువు. నీవు వచ్చినచో అది మాకు వరమేనమ్మా. నేను నీవు 
వచ్చెదవని ఎదురు చూచుచు ఉందునమ్మా. నన్ను నీవు చేరవలెనని 
ఆలోచించకుందువా తల్లీ! నిన్ను చేరినచో మనసునకు బోధకలిగి నాలో 
మార్పు సంభవించి అది నాకు శ్రీరామరెఅక్షగా ఉండునమ్మా. ఓ రాక్షస 
సంహారిణీ! ఓ అమృతరాశీ! నాకు ధీరత్వమును పొందిన 
ఆత్మను దయ చేయుట కొఱకు రావమ్మా.

79. శ్రీమార్గమున్ గొలుప క్షేమంబుఁ గొల్పగను నీ మానసంబు నిలదో.
నా మార్గమీవగుచు నామీద లేదొ కృప శ్రీమాతరో తెలుపుమా.
యో మాత నీవె తగు ప్రేమామృతంబిడిన క్షేమంబె నాకుఁ గలుగున్.
స్త్రీమూర్తులందొదిగి ప్రేమన్ గనంబరచు మామాత వీవెగ సతీ!
భావము.
ఓ సతీ మాతా! నాకు మంగళప్రదమయిన మార్గము కలిగించుట యందును, 
క్షేమమును కలిగించుటయందును నీకు మనసు నిలవదా తల్లీ! నా మార్గము 
నీవే అయియుండియును నాపై కృప లేకపోయెనా? ఓ శ్రీమాతా! 
నాకెఱిగింపుము.ఓ జననీ! నీవే నాకు తగిన ప్రేమామృత మొసంగినచో నాకు 
మంచియే జరుగునమ్మా. స్త్రీస్వరూపులందు నీవు ఒదిగి యుండి నాపై 
మాతృప్రేమను చూపెడి నా తల్లివి నీవేకదా జననీ!

80. ధర్మానువర్తులిల మర్మంబెఱుంగరుగ ధర్మార్థమే బ్రతుకుచున్.
దుర్మార్గులట్టియెడ దుర్మార్గమున్ నెరపి ధర్మంబునే గెలుతురే 
ధర్మంబె యోడిన యధర్మంబురాజగును ధర్మంబునే నిలుపుమా.
మర్మజ్ఞులన్ దునుమ ధర్మంబునిల్చును సుకర్మల్ వెలుంగును సతీ!
భావము.
ఓ సతీ మాతా! ధర్మమునే అనుసరించువారీ భూమిపై ధర్మతో 
ప్రవర్తించుచు మాయామర్మములెఱుగరుకదా. అట్టి సమయములో 
దుర్మార్గులు దుర్మార్గమున ప్రవర్తించుచు ధర్మముపై విజయము 
సాధించుచుందుకదా. ధర్మమే ఓడిపోయినచో అధర్మమే రాజగును కదా 
జననీ! కావున ధర్మమును కాపాడుమమ్మా. మాయావులను సంహరించినచో 
ధర్మము నిలుచును కదా తల్లీ! అప్పుడు మంచి కర్మలుప్రకాశించును. 
కావున ధర్మమును కాపాడుమమ్మా.

81. హేమాద్రి పుత్రివయి మా మీద సత్కృపను క్షేమంబుఁ గొల్ప వలదా.
మోమాటమే విడిచి ప్రేమన్నదే మరచియే మంచియున్ గొలుపవో.
ధీమంతులెల్ల నిను సేమంబునిత్తువని ప్రేమన్ మదిన్ గొలుతురే.
ఏమాత్రమైన గుణ ధీమంతులన్ గనుమ ప్రేమ స్వరూపిణి సతీ!
భావము.
ప్రేమ స్వరూపిణి వయిన ఓ సతీ మాతా! హిమవంతుని 
పుర్తికవయియుండిననీవు మా మీద మంచి కృప కలిగియుండి క్షేమమును 
కలిగింపవలదా తల్లీ!మోమాటమును పూర్తిగా విడిచిపెట్టి, అసలు ప్రేమనే 
మరచిపోయి ఎటువంటి మంచినీ మాకు కలిగింపకుందువా యేమి? 
బుద్ధిమంతులందరూ నిన్ను క్షేమాన్ని కలిగించే తల్లివని తలంచి ప్ర్తేమతో 
నిన్ను తమ మనస్సులలో ఆరాధింతురు కదా తల్లీ!గుణవంతులునూ 
ధీమంతులునూ అయిన నీ భక్తులను ఏమాత్రమయినాచూడుతల్లీ! 

82. లీలావినోదముగనేలో సృజించుటిది. నీలీల లెన్నఁ దరమా.
జాలంబదేల మము పాలింపగా శుభములే లక్ష్యమై కొలుపుచున్.
బాలుండనమ్మ. మది పాలించు తల్లివిగ. జాలింగనం దగదొకో.
లోలాక్షి నీ దయను పాలింమీ జగతి నే లీలనైనను సతీ!
భావము.
ఓ సతీ మాతా! లీలావినోదముగా ఈ సృష్టిని సృజించుటెందులకు తల్లీ? నీ 
లీలలను గెఅహించుట మా తరము కాదకదా. శుభములను కొలుపుటనే 
లక్ష్యముగా కలిగి మమ్ము పాలించుటలో ఆలస్యము చేయుటెందులకు 
తల్లీ? నేను బాలుఁడనమ్మా. మంస్పూర్వకముగా నన్ను పాలించే తల్లివి నీవే 
కదా. జాలితో నన్ను చూచుట నీకు తగును కదా తల్లీ! ఓ చంచలాక్షీ! నీదయతో 
యే విధముగనైనను ఈ సృష్టిని పాలింపుమమ్మా.

83. రాజిల్లఁ జేయ నను నీ జాతకం బెవరు నీ జాలి చాలదొ భువిన్.
సాజంబుగా తమరి రాజీవ నేత్రములె రాజిల్లఁ జేయును కదా.
యీ జాతి గౌరవము మా జీవమై నిలువఁగాఁ జేసి పొంగుమెదలో.
నేజీవినైనఁ గని సాజంపు ధర్మమున రాజిల్లఁ జేసెడి సతీ!
భావము.
ఏ ప్రాణినైననూసరే నీ సహజమైన ధర్మస్వభావమున రాజిల్లునట్లుగా 
చేసెడి ఓ సతీ మాతా! భూమిపై నన్ను ప్రకాశింపఁ జేయుటకు ఈ 
జాతకమెవరమ్మా? నీకు నాపై గల జాలి చాలదా? మీ ప్రకాశవంతమయిన 
నేత్రములే సహజంగానే రాజిల్లఁ జేయును కదా. ఈ హైందవ జాతి 
యొక్క గౌరవము మా ప్రాణమై నిలుచునట్లుగా చేసి నీవు మదిలో 
సంతసింపుము జననీ! 

84. కష్టంబులేలనిల నష్టంబులేల పరి పుష్టేల మేము గనమో.
దృష్టిన్ సదా నిలిపి యిష్టంబుతోడ నిను పుష్టిం గనన్ గొలిచినన్
కష్టంబులే తొలఁగు నష్టంబులుండవిల దృష్టంబిదేను జననీ.
ఇష్టంబుతో మదిని సృష్టించుమీవిధము. కష్టంబు బాపెడి సతీ!
భావము.
కష్టమును పోకొట్టెడి ఓ సతీ మాతా! మాకు ఈకష్టములెందులకు? ఈ 
నష్టములెందులకు? పరిపుష్టిని మేము ఎందుచేత పొందలేకపోవుచుంటి 
మమ్మా? ఇష్టముతో నిన్ను పుష్టిగా చూడనెంచి దృష్టి నీపై నిలిపి సేవించినచో 
మా కష్టములు తొలగిపోవునుకదా తల్లీ! మాకు నష్టములే ఉండవు కదా. ఇది 
దృష్టము తల్లీ! ఓ జననీ! నీవు ఇష్టాపూర్వకముగా ఈ నేను చెప్పిన విధముగా 
మేము కలిగి ఉండునట్లు సృష్టించమమ్మా.

85. శ్రీచక్ర వాసినివి  శౌచంబుతోడ నిను యాచింప ముక్తిఁ గొలువన్
నీచత్వమున్ దరిమి శౌచంబునే కొలిపి యోచించి ముక్తి నిడుదే,
ప్రాచీన సత్కవులు నీ చిత్స్వరూపమును శ్రీచిత్రపద్యకృతులన్
యోచించి వ్రాసిరి మహాచోద్యమై వరల, మాచింతఁ బాపెడి సతీ!
భావము.
మా యొక్క విచారములను పోఁగొట్టెడి ఓ సతీ మాతా! నీవు శ్రీచక్రమున 
వసియించు తల్లివి. శారీరకముగా మానసికముగా శుచిగా ఉండి నిన్ను ముక్తి 
ప్రసాదింపమని కోరుచూ సేవించినచో మాలోఉండే నీచస్వభావమును 
నశింపఁజేసి,శారీరక మానసిక శుచిత్వమును ప్రసాదించి, మమ్ములను 
కాపాడుటకు నీవుంటివికదా తల్లీ! గొప్పవారయిన పూర్వ కవులు నీయొక్క 
చిత్స్వరూపమును మంగళప్రదమయిన చిత్రకవిత్వములతోనొప్ప 
కృతులలో గొప్ప ఆశ్చర్యకరమై వరలు విధముగా ఎంతగనో ఆలోచిచించి 
వ్రాసి యుండిరమ్మా. 

86. రాజాధిరాజయినఁ బూజింపకున్న నిను నాజీవి వ్యర్థుఁడె భువిన్.
రాజీవ లోచన! విరాజిల్లఁ జేసెదె సదా జీవు లెన్నుటను నిన్.
సౌజన్యమున్ గలుఁగు రాజన్యులన్ నిలుపు మా జీవనైకఫలమా!
నా జీవితాంతమును బూజింపనిమ్ము నిను సౌజన్యరూపిణి సతీ!
భావము.
సౌజన్య స్వరూపిణివయిన ఓ సతీ మాతా! రాజాధిరాజే అయినప్పటికీ 
నిన్నుపూజింపనివాడయినచో వాని జన్మమే నిరర్థకమమ్మా.  పద్మములవంటి 
కన్నులుగల ఓ తల్లీ! నిన్నెల్లప్పుడూ జీవులు భావించుచుండునంతనే 
వారిని విరాజిల్లునట్లు చేసెదవు కదా. సౌజన్యమూర్తులయిన పాలకులను 
చక్కగా కాపాడుచూ నిలుపుము తల్లీ! మా జీవనమున ముఖ్యమయిన 
ఫలమయిన ఓ తల్లీ! నాజీవితాంతమునునిన్ను పూజించనిమ్ము!

87. కామాంధు లీ జగతి నేమాత్రమున్ వరుసలేమీ గణింపరు మదిన్.
ప్రేమన్ నటించుచును కామంబు తీర్చుకొని  యేమాత్రమున్ దొరకరే.
ఓమాత! దుష్టతతినేమాత్రమున్ విడకసేమంబు కొల్లగొనుమా.
రామామణీ. జనుల ప్రేమానురాగముల నీమంబు కొల్పుము సతీ!
భావము.
ఓ సతీ మాతా! ఈ సృష్టిలో కామాంధులుఏమాత్రమూ వావి వరసలు 
చూడకుండా పైకి ప్రేమను నటించుచు వారి కోరికను తీర్చుకొని, అస్సలు 
బయటపడరమ్మా . ఓ తల్లీ! ఇటువంటి దుర్మార్గులను యెంతమాత్రమూ 
విడిచిపెట్టక వారి క్షేమమును దూరము చేయుము  స్త్రీలలో మణివైన ఓ 
తల్లీ! ప్రజల ప్రేమానురాగమలకునియమ బద్ధతనేర్పరచుమమ్మా. 
నియమబద్ధతనేర్పరచుము.

88. హైమాద్రి పుత్రివగు శ్రీమాత నీ చరణ మేమాత్రమైన తలవన్
కామాదులే తొలగి క్షేమామృతంబొదవు భూమిన్ నిజంబిదెకదా.
మామీద చూపు దయ కేమేమి చేయఁగలమో మాతరో తమకిలన్.
ప్రేమామృతంబువగు మామాతగా కొలుతు మోమంగళాకర సతీ!
భావము.
మంగళములకు స్థానమయిన ఓ సతీ మాతా! ఓ హైమా! హిమవంతుని 
పుత్రికవైన ఓ శ్రీమాతా! నీ పాదములను ఏ మాత్రము భావించినను మాలో 
కామాదులు తొలగిపోయి, క్షేమమనే అంఋతము మాకు లభించునుకదా తల్లీ! 
ఈ భూమిపై ఎదే నిజమమ్మా.  ఓ తల్లీ! ఈ పృథ్విపై మామీద నీవు చూపించే 
దయకు ప్రతిగా మేము నీకేమి చేయగలమమ్మా? ప్రేమాంఋతమువైన నిన్ను 
మా తల్లిగా ఆరాధింతుమమ్మా!

89. ముల్లోకముల్ కొలిపి యుల్లాసమొప్పగను తల్లీ దయన్ విడుచుచున్
గల్లోలముల్ కొలిపి యుల్లంబులన్ కుదుపుటెల్లన్ ముదంబొ కనగా.
చల్లంగ చూచితివొ సల్లీల నిన్గొలుతుముల్లంబులన్ సతతమున్.
గల్లల్విడన్ గొలిపి ౘల్లంగఁ గావుముసముల్లాసివౌచును సతీ!
భావము.
ఓ సతీ మాతా! ఉత్సాహముతో ముల్లోకమలను సృజించిన నీవు దయ వీడి, 
కల్లోలములి పుట్టించి, మా మనస్సులను కుదుపుట నీకు సంతోషదాయకమా? 
నీవు మమ్ములను చల్లగా చూచుచున్నచో మా మనసులో ఎల్లప్పుడూ నిన్ను 
మంచిగా సేవించుదుము కదా. మాలో మాయలను విడుచునట్టులుగా చేసి, 
నీవు ఉత్సాహముతో ఉండి మమ్ములను చల్లగా కాపాడుమమ్మా.

90. ప్రారబ్ధ కర్మ ఫలమేరీతిఁ బాయనగు వారాహి. మాకు చెపుమా.
శ్రీరామ రక్షగ మరేమంత్రమున్నదిల నీరమ్య నామమదియౌన్.
భారంబు నీదె కద పేరాశ బాపఁగను. శ్రీరమ్య తేజస హృదిన్
వారించి దుర్గతి నివారించు తల్లివిగ. శ్రీరమ్య తేజస సతీ!
భావము.
మంగళప్రదమయిన తేజస్వరూపిణివయిన ఓ సతీ మాతా! ఓ వారాహీ! మాకు 
సంభవించు ప్రారబ్ధ కర్మఫలములను ఏ విధముగా మేము 
వదిలించుకొనగలమే సెలవిమ్ముతల్లీ! మాకు శ్రీరామ రక్షగా నిలుచు 
మంత్రమేది యున్నదమ్మా నీ నామ మంత్రము మాత్రమే అగును కదా. 
మాలో చోటు చేసుకొనియుండు పేరాశను పోగొట్టే భారము నీదేనమ్మా. 
మంగళప్రదమయిన తేజస్స్వరూఇణీ! తల్లిగా నీవు పేరాశను పోగొట్టి మా 
దుర్గతిని నివారించుమమ్మా. 

91. దీనావనాభిరత మౌనంబదేల? నను నీ నీడలో నిలుపఁగా. 
జ్ఞానాంజనంబు నిక నానేత్రపాళికిని రాణింపఁ జేయ పులమన్.
దానాది సద్గుణములే నేర్పు నాకికను ధ్యానించి నిన్ను కొలుతున్
నే నేల కోరవలె? నీ నీడనై  నిలుచు నే నీవె కాగను సతీ!
భావము.
ఓ సతీ మాతా! దీనులను కాపాడుటయందు ఇష్టము గల ఓ తల్లీ! నన్ను 
రాణింపఁ జేయుటకు జ్ఞానమనెడి కాటుకను నా కన్నులకు ఆద్దుటకు నీ నీడలో 
నన్ను నిలుపుటకు మౌనము వహించుటెందులకమ్మా? నిన్నే ధ్యానిస్తూ 
సేవించుచు కొలిచెదను నాకు దానము చేయుట మున్నగు సద్గుణములనే 
నేర్పుము తల్లీ! నీ నీడనయి నిలుచుచున్న నేనే నీవు కాగా నేనింక నిన్ను 
యెందులకు కోరవలెనమ్మా? కోరవలసిన అవసరము లేదుకదా. అంతా నీవే 
చూసుకొందువు కదా.

92. రామాభిరామవుగ శ్రీమాతరో సుగుణమే మాతగాఁ దలతుమే.
మామానసంబులను నీమంబుతో సుగుణమై మేలు కూర్చ నిలుమా.
యేమాత్రమున్ దురితమే మమ్ము చేరనటు క్షేమంకరీ! కనఁగదే.
నీ మానసంబునను మేమున్న చాలు నిక. క్షేమంబె మాకిల సతీ!
భావము.
ఓ సతీ మాతా!  స్త్రీలలో అందమయినదానిగాను, మంచిగుణమే నీ 
రూపముగాను మేము నిన్ను భావింతుము  మా మనసులలో 
సుగుణస్వరూపమువై మేలు కలిగించుట కొఱకు నిలిచియుండుమమ్మా. ఓ 
క్షేమమును కలిగించు తల్లీ! చెడు అనునది మా మనసులలోనికి ఏమాత్రమూ 
కూడా చేరకుండా ఉండునట్లు చూడకూడదా తల్లీ? నీ మనస్సులో మేమున్న 
చాలును తల్లీ! మాకెల్లప్పుడూ క్షేమమే కలుగునమ్మా.

93. సృష్టించి లోకములు సృష్టించి బంధనలు కష్టంబులేలనిడితో.
కష్టంబులే కనని సృష్టిన్ సృజించుటను కష్టంబులే కనముగా.
సృష్టించునీవె కని కష్టంబులే కనని సృష్టిన్ సృజించుమికపై.
సృష్టిన్ శుభాస్పదగ సృష్టింప నీకగును. సృష్టించు మమ్మరొ సతీ!
భావము.
ఓ సతీ మాతా! లోకములను సృష్టించి, మాకు పరస్పర అనురాగ బంధములు  
కలుగజేసి, కష్టములనెందుకు కలుగజేసితివమ్మా? చూచుకు కష్టములే 
లేనటువంటి సృష్టిని సృజించుటవలన కష్టములను మేము చూడముకదా. 
ఈ సృష్టిని చేయు నీవే ఆలోచిచించి చూచికష్టములు లేనటువంటి సృష్టిని 
యికపై సృజించుమమ్మా.ఈ సృష్టి శుభములకు ఆలవాలముగా సృష్టించుట 
నీకు సాధ్యమగునమ్మా. కావున సృష్టించుము తల్లీ!

94. పాపంబులన్ దుడువ కోపంబులన్ దరుమ నీపాదముల్ శరణమౌన్.
నీ పాద దర్శనము నీ పాద చింతనము దీపింపఁజేయును ననున్.
హే పర్వతీ! జనని! శాపంబులన్ దుడిచి నీపైన భక్తిఁ గొలుపన్
నే పుణ్యసత్ఫలమునే పొందుదున్, గనుదె? యో పాపహారిణి! సతీ!
భావము.
పాపములను హరించు ఓ సతీ మాతా! పాపములను తుడిచివేయుటకు, 
కోపాదులను తరిమివేయుటకు నీ పవిత్రమయిన పాదములే మాకు 
శరణమమ్మా.  నీ పాదములు చూచుట, నీ పాదములు తాకుట యనునవి 
నన్ను ప్రకాశింప జేయునవేనమ్మా. ఓ పార్వతీమాతా! నన్ను వెంటాడు 
శాపములను తుడిచివేసి, నీపై భక్తి నాకు కలుగునట్లు చేసితివేని, నేను 
పుణ్యప్రదమయిన మంచి ఫలితమునే పొందుదును. కావున ఆ విధముగా 
చూచెదవా తల్లీ! తప్పక చూడుము.

95. ఆచార బోధిత సమాచారముల్ తెలిసి శ్రీచక్ర పూజ సలుపన్ 
శ్రీచక్రవాసినివి నీచే శుభావళులె మాచెంత నిల్చును కదా.
యాచించి నిన్ గొలుచు స్త్రీ చేతనన్ వెలిఁగి కాచున్ కుటుంబమునిలన్.
స్త్రీ చేతనత్వమది నీ చేతనే కలుఁగు శ్రీచిత్ప్రభా కన సతీ!
భావము.
మంగళప్రదమయిన చిత్తేజమా! ఓ సతీ మాతా!  అనూనముగా 
కొనసాగుచున్న ఆచారములచే బోధితమగుచున్న సమాచారమును 
తెలుసుకొని మంగళప్రదమయిన శ్రీచక్ర పూజ చేసినచో 
శ్రీచక్రమునిలయముగా కల నీచేత మంగళములే మాముందు 
నిలఁబడునుకదా తల్లీ! కాపాడేటువంటి నిన్ను సేవించు స్త్రీజాతి 
చైతన్యముతో వెలుగుచు కుటుంబమును భూమిపై కాపాడుచుండునమ్మా. ఆ 
స్త్రీజాతిలో చేతనత్వమనునది నీచేతనే సంభవించును కదా తల్లీ!

96. అమ్మా నినున్ దలవనిమ్మా నిరంతర సుఖమ్మందగాఁ గరుణతో
నిమ్మా యనుజ్ఞ వరమిమ్మా ప్రమోదముగ సమ్మోదముం గొలుపుమా.
నమ్మంగ నిన్ మదిని కొమ్మంచు శోభనములమ్మా యొసంగెదవుగా.
మమ్మున్ సదా కనుచు నెమ్మిన్ భరింతువు ఘనమ్మిద్దె మాకిల సతీ!
భావము.
ఓ సతీ మాతా! ఎల్లప్పుడూ సుఖమును పొందు నిమిత్తము కరుణామూర్తివై  
నిన్ను స్మరింపనిమ్ము! నిన్ను స్మరించుటకు అనుజ్ఞనిమ్ము తల్లీ! 
సంతోషముతోమాకీ వరమును ప్రసాదింపుమమ్మా! మాకు ఆనందమును 
కలుగఁజేయుమమ్మా! మామనసులలో నిన్ను నమ్ము విధముగా స్వీకరింపమని 
శుభములను నీవు మాకు ఇచ్చెదవు కదా. మమ్ములనెల్లప్పుడూ కనిపెట్టి 
చూచుకొనుచు మమ్ము నీవు భరించుచుంటివి. భూమిపై మాకిది యెంతయో 
గొప్పవిషయమమ్మా.

97. దీనావనా! జనని. ప్రాణంబె నీవు కద. మానంబు కాతువుగదా.
మానావమానములు నేనెట్లు మోయుదును?. జ్ఞానమ్మునే గొలుపుమా,
యేనాటికైన నిక నీనవ్య తేజమది క్షోణిన్ బ్రభన్ నిలుచుతన్ 
రాణింపఁ జేయుచుఁ బ్రమాణంబుగా నిలిపి, ప్రాణంబుగా కను సతీ!
భావము.
మానాభిమానప్రదవయిన తల్లీ! శ్రేష్ఠురాలివయిన, నన్ను రాణింపఁజేయుచు 
ప్రమాణముగా నిలిపి ప్రాణముగా చూచుకొనెడి ఓ సతీ మాతా! 
దీనజనరక్షకురాలివైన ఓ తల్లీ! ఓ జగన్మాతా! మా ప్రాణమే నీవు కదా. మా 
మానరక్షకురాలివి కదా. మానావమానములను నేనేవిధముగా 
మ్రోయగలనమ్మా?నాకు జ్ఞానమును ప్రసాదించుము. ఏనాటివరకయినను ఈ 
సృష్టి నీ నిత్యనూతనమయిన ప్రకాశమే భూమిపై ప్రభతో నిలుచు గాక.

98. శ్రీకల్వపూడి కుల రాకాసుధాకరులు నాకూర్మి రాఘవ గురుల్
నాకైతకున్ బలము నాకున్ బ్రభాకరులు. నాకున్న శక్తి కనగా.
నేకోరినట్టిఫల మీకావ్య సద్రచన నాకున్ బ్రసాద మరయన్.
నాకున్న సద్గురునికీ కైతనంకితము నే కొల్పెదన్ గొన సతీ!
భావము.
ఓ సతీ మాతా! నాకు ప్రియమయిన నా గురువులు మంగళప్రదమయిన 
కల్వపూడి కులావతంస పూర్ణిమ చంద్రులు. ఎంచి చూడగా నా 
కవిత్వమునకు వారే బలము. నాకు వారు సూర్యభగవానులు. నాకున్న 
శక్తియు వారే. సద్రచన అయిన ఈ కావ్యము నేను కోరుకొరుకొనిన 
ఫలమే. చూడగా ఇది నాకు మహాప్రసాదము. నాకు ఉన్నటువంటి 
సద్గురువులయిన శ్రీమాన్ కల్వపూడి వీరవేంకట రాఘవాచార్యులవారు 
స్వీకరించునట్లుగా ఈ శ్రీ అష్టోత్తరశత సతీ అశ్వధాటి యగు సతీ శతకమును 
అంకితము చేసెదనమ్మా. 

99. చింతా వరాన్వయుఁడ నంతా ననున్ గృపను సంతోషులై కనుదురే.
చింతావిదూరునిగ సాంతంబుఁ జేసి నను భ్రాంతిన్ గృపన్ గనఁగదే.
అంతా త్వదీయ కృప. సుంతైన నిన్ దెలిసి శాంతిన్ గనన్ శుభమగున్.
శాంతిన్ మదిన్ నిలిపి సంతోషమున్ గొలుపొకింతైన నాకిక సతీ!
భావము.
ఓ సతీ మాతా! నేను చింతావారియొక్క శ్రేష్టమయిన వంశమువాడను. 
అందరూ కృపతో నన్ను ప్రేమగా చూచుదురు. జీవితాంతము నన్ను 
చింతలకు దూరముగా నిశ్చింతగా ఉండునట్లు నీవు చేసి, భ్రాంతితో కృపతో 
నన్ను చూడవచ్చును కదా తల్లీ! అంతా నీ కృప. కొంచెమయినను 
నిన్నెఱిగి శాంతిని పొందినచో శుభమగును తల్లీ. ఇంక కొంచెమయినను నా 
మనసున శాంతిని నెలకొల్పి సంతోషమును కలుగజేయుము తల్లీ!

100. భ్రాంతిన్ శివా శతకమంతా పఠించు గుణవంతుల్ శుభంకరులుగా
చింతించి నీకృపను సాంతంబు పొందునటు పంతంబుతో నిలుపుమా.
అంతా శివానుభవ కాంతిన్ మనంబులను కొంతైన చూడఁ గనుమా,
శాంతస్వభావమిడి భ్రాంతుల్ మదిన్ దుడిచి సాంతంబుఁ గావుము సతీ!
భావము.
ఓ సతీ మాతా! చదువవలెననెడి భ్రాంతితో ఈ శివా శతకమును అంతయూ 
చదివెడి గుణవంతులు శుభములను కలుగజేయువారేనమ్మా.  నీవు బాగుగా 
ఆలోచించి పట్టుదలతో వారిని నీ కృపకు పాత్రులగునట్లు 
నిలుపుమమ్మా.  అంతయూ శివునకు సంబంధించిన కాంతినే నా మనసులో 
కొంతైనా చూడనిమ్ము. నాకు శాంత స్వభావమును యిచ్చి,  నాలోని 
భ్రాంతులను మనసు నుండి పూర్తిగా తుడిచివేసి, తుదివరకు నన్ను 
కాపాడుమమ్మా.

101. అంగీకరించెద ననంగున్ జయింపకనె సంగీత రూపిణి నినున్ 
మాంగళ్యదాయినిగ బంగారు రూపిణిగ పొంగార గాంచమనుచున్.
బంగారు తల్లివి యనంగున్ జయించెద శుభాంగీ భవత్కృపనిలన్,
బెంగల్ తొలంగగ ననుం గాంచు మెల్లెడ భృంగార తేజమ! సతీ!
భావము.
ఓ స్వర్ణప్రకాశమా! సతీమాతా! కామమును జయించకుండా 
ఉండినచో సంగీత రూపిణివయిన నిన్ను మంగళములు ప్రసాదించు 
తల్లివిగా, బంగారమువలె ప్రకాశించు మాతగా, మనసున పొంగిపోవుచు 
చూడలేమని నేను అంగీకరించుదునమ్మా. ఓ శుభాంగీ! నీవు నా బంగారు 
తల్లివి. నీ కృపచే భూమిపై నేను అనంగుని జయించుదునమ్మా. నేను బెంగలు 
విడిచివేయునట్టుల చూచుచు అంతటా నన్ను కాపాడుచుండుమమ్మా. 

102. శక్తి ప్రదా! కనుచు రక్తిన్ సదా ప్రజను, యుక్తంబుగా నడుపుమా.
భుక్తి ప్రదా! ధిషణ శక్తి ప్రదాయివయి. రక్తిన్ నినున్ గొలవనీ 
యుక్తి ప్రదా జనుల శక్తిన్ వెలుంగు మిల నక్తంచరాళికిని స
న్ముక్తి ప్రదాయివిగ, . ముక్తావళిన్ గొనుమ శక్తీ! దయామయ సతీ!
భావము.
దయతో నిండిన ఓ సతీ మాతా! ఓ శక్తిస్వరూపిణీ! శక్తిప్రదాతవయిన ఓ తల్లీ! 
అనురాగముతో చూచుచు ఎల్లప్పుడూ ప్రజలను తగినట్లుగా 
నడిపించుమమ్మా. మాకు ఆహారమును ప్రసాదించెడి తల్లీ! మాకు 
బుద్ధిశక్తినొసగుదానివయి, అనురాగముతో నిన్ను సేవించనిమ్ము. మాకు 
యుక్తిని ప్రసాదించు జననీ! ప్రజలయొక్క శక్తిలో నీవే 
ప్రకాశింపుము, నిశాచరులగు చోరాదులకును ముక్తినొసగు తల్లీవి! 
ఈ పద్యములనెడి ముత్యముల సమూహమును స్వీకరింపుము. 

103. కష్టాష్టకంబునిల సృష్టించి మమ్ములను నష్టంబులన్ నిలిపితే
సృష్టించు శక్తివిదె యష్టార్ఘ్యముల్ గొనుమ కష్టాళిఁ బాపు జననీ
దృష్టిన్ సదా నిలిపి యిష్టంబుతో కొలుతు నష్టాళి పో నడుపుమా..
అష్టార్థసిద్ధినిడ సృష్టిన్ గనంబడుమ.యిష్టార్థదాయిగ సతీ! 
భావము.
ఓ సతీ మాతా! అష్ట కష్టములు 1. ఋణము 2. యాచన 3. ముసలితనము 4. 
వ్యభిచారము 5. దొంగతనము 6. దారిద్ర్యము 7. రోగము 8. ఎంగిలి తిని 
బ్రతుకుట అనువాటిని సృష్టించి మమ్ము నష్టములలో నిలిపితివా తల్లీ! 
సృష్టిని చేయు తల్లివి కదా, ఎదే  మేము సమర్పించు అష్ట అర్ఘ్యాలు ( 
౧.పెరుగు ౨.తేనె. ౩.నెయ్యి. ౪.అక్షతలు. ౫.గరిక. ౬.నువ్వులు. ౭.దర్భ. 
౮.పూలు) స్వీకరింపుమమ్మా.  మా కష్టములను 
పరిహరింపుమమ్మా.ఎల్లప్పుడూ నీపై దృష్టి నిలిపి ఇష్టముగా నిన్ను 
సేవించెదనమ్మా. నష్టములను నశింపఁ జేయము. అష్టైశ్వర్యాలు (దాసీ 
జనం, భృత్యులు(ఉద్యోగులు), సంతానం, బంధువులు, వస్తువులు, 
వాహనములు, ధనము, ధాన్యము.) మాకు ప్రసాదించుటకు ఇష్టమయిన 
అర్థములు ప్రసాదించు తల్లిగా  ఈ సృష్టిలో మాకు కంటికి కనఁబడుము. 

104. కాలప్రవాహమునకే లేదుగా తుదియె, నీ లీల కాలము కనన్,
లీలావతీ! గడుచు కాలంబుతో సుగుణ జాలంబు చేర్చుము మదిన్,
నీ లీలలెన్నుచును,హేలన్ కవిత్వసుధ కాళీప్రభా కలితమై
శీలప్రభన్ గొలిపి క్రాలంగ వ్రాయుదును, నా లక్ష్యమీవెగ సతీ!
భావము.
ఓ సతీ మాతా! కాలగమనమునకు అంతమన్నదే లేదు. అది నీ లీలయేకదా 
తల్లీ! ఓ లీలావతీ! గడిచే కాలముతో పాటు నా మనసులో మంచిగుణముల 
సమూహమును చేర్చుమమ్మా. నీ లీలలను గుర్తించుచు విలాసముగా నీపై 
కవితామృతమును కాళీ ప్రభతో నొప్పారునట్లుగా శీలము యొక్క ప్రభను  
అందరిలోనూ కొలిపి ఒప్పునట్లుగా వ్రాయుదునమ్మ. నా లక్ష్యము నీవే 
కదా తల్లీ!

105. అంబా విషాద వలయం బేల చుట్టె నను. సాంబున్ సదా కొలుతునే,
సాంబుండు  నాకును వరంబై సదానిలువ బింబోష్ట నిన్ గొలుతు,హే
రంబున్ మదిన్ దలతు నంబా శుభాస్పద. కరంబీవె కానవలె నన్.
బింబాధరా! ఘనతరంబౌ కృపన్ గనుము, డంబంబు  పాపెడి సతీ!
భావము.
డంబముగా ప్రవర్తించుటను నశింపఁజేసెడి ఓ సతీ దేవీ! ఓ అంబా! నన్ను 
విషాదవలయము చుట్టుకొనినదేలతల్లీ? నేనెల్లప్పుడూ సాంబుని 
కొలుచుచుందునే సాబుఁడు నాకు వరమై లభింపఁజేయుటకు నిన్ను 
సేవింతునమ్మా. హేరంబుని మనసులో తలంచెదనుతల్లీ! శుభమునకు 
ఆలవాలమయిన ఓ తల్లీ! నీవే గొప్పగా నన్ను కాపాడవలయునమ్మా. 
దొండపండువంటి అధరము కల తల్లీ! నన్ను ఘనతరమయిన కృపతో 
చూడుమమ్మా.  

106. దీనాళి నేలెడి సుధీ నామొరన్ వినుమ జ్ఞానంబునే కొలుపుమా.
మౌనంబు వీడి మము ప్రాణంబుగా కనుచు జ్ఞానంబిడన్ బలుకుమా.
నేనేమి పల్క నది క్షోణిన్ శుభంబవఁగ  రాణింపఁ జేయఁ గనుమా
జ్ఞానప్రదా! మధుర గానంబుతోఁ గొలుతు నేనే  సభక్తిగ సతీ!                                                         
భావము.
ఓ సతీ మాతా! దీనజనులను పాలించెడి జ్ఞానవంతురాలివయిన ఓ తల్లీ! నా 
మొర ఆలకింపుము. నాకు జ్ఞానమును కలిగింపుము. నీ మౌనమును విడిచిపెట్టి, 
మమ్ములను ప్రాణముగా చూచుకొనుచు, జ్ఞానమును మాకు 
లభించువిధముగా మాతో మాటలాడుమమ్మా.  నేను ఏది పల్కుదునో అది 
భూమిపై శుభమగునట్లుగా నన్ను రాణింపఁ జేయు విధముగా నన్ను చూడుము 
తల్లీ! జ్ఞానమును ప్రసాదించు ఓ జగన్మాతా! నేనే భక్తియుక్తుఁడనయి నిన్ను 
మధురమయిన గానముతో సేవించెదనమ్మా.

107.  కామేశ్వరీ! కృపను బ్రేమామృతంబు నిక నామీద జిల్కఁ దగదా?
నీ మాతృ వత్సలత, నా మీదఁ జూపుచును క్షేమంబు గొల్పఁ దగదా?
యేమాత్ర మేనెఱుఁగ నీ మాన్యతన్ , దెలిపి నా మీద నీదు కృపతో
హేమాద్రి పుత్రి! వర ధామంబుగా నిలుము, ప్రేమన్ భజించెద సతీ!
భావము.
ఓ సతీ మాతా! కామేశ్వరీతల్లీ! నీవు కృపతో ప్రేమాంఋతమును నాపై 
చిలుకుట నీకు తగదా? నీ మాతృ వాత్సల్యము నాపై చూపుచు నాకు 
క్షేమమును కలుఁగఁ జేయుట నీకు తగదా తల్లీ? నీ గొప్పతనమును నేను 
ఏమాత్రమూ ఎఱుఁగనమ్మా. నామీద నీకు గల కృపతో అది నాకు 
తెలియఁజేసి, ప్రేమతో శ్రేష్ఠమయిన ధామముగా నాకొఱకు నీవు 
నిలిచియుండుమమ్మా.

108. శ్రీమంగళాంగివి. సదామంగళంబులను క్షేమంబుఁ గూర్చుచు మమున్
శ్రీమంతమార్గమున శ్రీమంత భావనల ప్రేమన్ వసింపఁ గనుమా.
నీ మంగళాకృతికి శ్రీమంగళంబగుత, భూమిన్ శుభాకరముగా
నీమంచితోఁ గొలిపి ధీమంతులన్ గనుమ శ్రీమాతరో! శుభ సతీ!
భావము.
శుభప్రదవైన ఓ సతీ మాతా!  మంగళప్రదమయిన అగములు 
వేదవేదాంగములు కల తల్లీ! ఎల్లప్పుడూ మంగళములను, క్షేమమును, మాకు 
కల్పించుచు మమ్ములను మంగళప్రదమయిన మార్గముననే 
మంగళప్రదమయిన భావములతో సంచరించునట్లు చూడుమమ్మా. నీ 
మంగళప్రదమగు  జగదాకారమునకు లక్ష్మీప్రద మంగళము అగునుగాక. 
భూమిపై శుభములకు ఆధారముగా ధీమంతులను నీమముతో కల్పించి 
చూడుమమ్మా. 
వేడుకోలు.
అశ్వధాటి.  
నే రామకృష్ణుఁడను నారీశిరోమణిరొ! నీ రూప తేజములిలన్
ధీరాళి చూచునటు ధీరాశ్వధాటినిట నీరీతి వ్రాసితి, దయన్
శ్రీ రమ్య గాత్రుఁడు, కుమారాన్వయుండు గుణవారాశి పాడె వినగన్,
నీ రక్షవారికిడి, శ్రీరామరక్షవయి ధీరాళిఁ గావుము సతీ!
భావము.
ఓ సతీమాతా! ఓ నారీశిరోమణీ! నేను చింతా రామకృష్ణారావు నామాంకితుఁడను. 
శారీరక మానసిక ధీరోపేతులయినవారు తమ మనసులలో నీ రూపము కాంతీ 
చూచుకొను విధముగా ధీరముగా పరుగులు తీయు అశ్వధాటీ వృత్తములలో ఈ 
విధముగావ్రాసియుంటినమ్మా. రమ్యమయిన గాత్రమాధుర్యముతో నొప్పు 
కుమార వంశములో పుట్టినట్టిన సద్గుణములకు మహా సముద్రము 
వంటివాడును అయిన సూర్యనారాయణ మనోహరముగా పాడి 
వినువారౌ అందరికీ ఆనందము కలిగించెనమ్మా.  వారికి నీ యొక్క రక్షణను 
నిరంతము కలిగించుమమ్మా. శ్రీరామ రక్షగా నీవు ఉండి సద్గుణదీరులను 
కాపాడుమమ్మా. నీకు నమస్కరించి వేడుకొనుచున్నాను.

స్వస్తి.

కవిపరిచయము.
కృతికర్త.  
చిత్రకవితా సమ్రాట్…కవికల్పభూజ.పద్యకవితాభిరామ, చిత్రకవితాసహస్రఫణి,  చింతా రామ కృష్ణా రావు. భాషాప్రవీణ, P.O.L., M.A., 
విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.
ఫ్లాట్ నెం. A 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.
తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165 


రచనలు.
 1) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.
 2) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో, ప్రతీపాదమునా మూడు     
    ప్రాసయతులతో ఒక్క రోజులో వ్రాసినది.)
 3) ఆంధ్రసౌందర్యలహరి.
 4) ఆంధ్రామృతమ్,  పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో అనేక స్వీయ రచనలు.
 5) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.
 6) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.
 7) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
 8) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)
 9) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.
10) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.
11) బాలభావన శతకము.
12) మూకపంచశతి పద్యానువాదము.
13) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.
14) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
15) రాఘవా! శతకము.
16) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
17) రుద్రమునకు తెలుగు భావము.
18) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
19) వసంతతిలక సూర్య శతకము.
20) విజయభావన శతకము.
21) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
22) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు. 
23) శ్రీ అవధానశతపత్రశతకము.
24) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.
25) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.
26) శ్రీచక్రబంధ మంగళాష్టకము.
27) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.
28) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.
29) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత నృసింహనామాంచిత 
      118 ఛందో గర్భ చిత్ర సీసపద్య శతకము.)
30) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)
31) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.
32) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
33) శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.
34) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.
35) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. (బంధచిత్రకృతి ఒకే శతకమున 
      మూడు మకుటములతో మూడు శతకములు.) 
36) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)
37) శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క రోజులో వ్రాసినది.)
38) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త శివశతకము.
39) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు, సీతాన్వయముగా తేటగీతి 
    పద్యములు, హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో సుందరోత్పల నక్షత్రమాల.)
40) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)
41) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో అష్టోత్తర శత పాద    
    ఉత్పలమాలిక. 
42) శ్రీరామ పట్టాభిషేకం. తేదీ. 10 - 3 -2025 మరియు 11 - 3 - 2025.తేదీల మధ్యవిరచితము.
43) శాంభవీ శతకము.(మధ్యాక్కర గర్భ చంపకోత్పలాలు.)( ఏకదిన విరచితము) 20 – 4 – 2025.




Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.