గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జూన్ 2025, శనివారం

శ్రీరామాష్టోత్తరశత నామాంచిత అష్టోత్తరశతచ్ఛందశ్శ్రీ రాఘవ శతకము...రచన .. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.

శ్రీరామాష్టోత్తరశత నామాంచిత అష్టోత్తరశతచ్ఛందశ్శ్రీ

రాఘవ శతకము

రచన  ..  చింతా రామకృష్ణారావు.  

ఆపదామపహర్తారం – దాతారం సర్వ సంపదామ్,

లోకాభిరామం శ్రీరామం – భూయోభూయో నమామ్యహమ్.

ఓం శ్రీరామాయ నమః.

రాఘవా! శతకముపై పండితాభిప్రాయములు.

శ్రీరామనీనామమెంతోరుచిరా

వాగ్విదాంవర  .. బ్రహ్మశ్రీ నారుమంచి వేంకటఅనంతకృష్ణ.

శ్రీచింతారామకృష్ణారావుగారుఅన్నదిప్రతిక్రొత్తకవికళ్ళలోకనిపించేఒక దివ్యమైనమెరుపు.  నిరహంకారము, సహనము, సహాయశీలత, అల్పసంతోషమువంటి అనేకసద్గుణాలు ఒకచోటకలబోసి చూస్తే మా చింతా అన్నగారౌతారు. వీరి పద్యరచన ఆశువేగముతో సాగుతుంది.  24 గంటలు, అంతకన్నా తక్కువ సమయములో శతకములు వ్రాయడములోను,  ఆశువుగా చిత్రబంధకవిత్వము వెలయించుటలోను అందెవేసిన చేయివారిది.  ఇకప్రకృతములో శ్రీరామఅష్టోత్తరశతనామావళిగర్భితముగా, అష్టోత్తరశతభిన్న వృత్తములలో ‘రాఘవా’ మకుటముతో శతకమును వ్రాసినారు.

రామాష్టోత్తరశతనామావళిలోని ప్రతి నామాంకితముగా ఒకపద్యము వ్రాయాలి, మకుటము గురు+లఘు+గురువులు కనుక చివర రగణమున్న వృత్తములనే ఎన్నుకోవాలి. ఆయా నామాక్షరాలకు సరిపడుగణప్రస్తారముతో పాదాంతముర గణము ఉండేటటువంటి వృత్తములను మాత్రమే ఎన్నుకోవాలి. ఇలా స్వీయనిబంధనల క్లిష్టత ఉన్నప్పటికీ అమ్మదయతో ఆశువేగముతో శతకము పూర్తి చేసారు. అలాగే నాబోంట్లకు పాఠములాగా వృత్తనామము, లక్షణము కూడా పద్యాదిలో పొందుపరిచారు. అలాంటి చక్కని శతకానికి ఈ నాలుగు మాటలు వ్రాసే అదృష్టం నాకు దక్కడం అమ్మదయ, వారి వాత్సల్యము కారణము.   

శ్రీమన్మంగళ దేవదేవ అని మగణారంభ పద్యముతో శతకము మొదలౌతుంది.  ఆలంకారికులు, ఛందోహృదయ మెఱిగినవారు మగణారంభమునకు పెక్కు వైశిష్ట్యములు చెప్పినారు.  ఇక పద్య భావము చూద్దాం.  రామమార్గ గాములకు, రామచరిత్ర చదువువారికి, శ్రీరామభక్తులకు, ఈ మంత్రాక్షర బద్దమైన పద్యాలు రామతేజముగానే గోచరిస్తాయిట.  అంటే ప్రతి పద్యమునకు మంత్ర వ్యాఖ్యస్థాయిని సంకల్పించి వ్రాయబడిన శతకమిది. క్రమముగా వ్రాయకున్నను వాల్మీకములోని ముఖ్య ఘట్టములన్నిపద్య భావములై వెలసినవి. ఒక విధముగా ఇది సంక్షిప్తరామాయణము వంటిదనవచ్చునేమో.  మరొకవిశేషము. సమవృత్తములు, విషమ వృత్తములు అని రెండు రకములు. విషమ వృత్తములలో సాధారణముగా సరిపాదములు ఒకవిధముగా, బేసిపాదములు ఒకవిధముగా ఉంటాయి.  అయితే ఇక్కడ కొన్నివృత్తములలో ప్రతి పాదము భిన్నగణములు, భిన్న యతి స్థానములతో వ్రాయబడుట వినూత్నప్రయోగము. ఉదాహరణముగా (11),(58), (75)పద్యములుచూడగలరు.

ఈ శతకములోని మరొకవిశేషమేమిటంటే సంబోధనలు.  రామ వైభవ సారముగా అనేకసంబోధనలను చింతావారుకల్పించారు.  ఇవే మరొక అష్టోత్తరము కన్నాఎక్కువనామాలనే అందిస్తాయి.  ఒకవిధముగారామత్రిశతిఅనవచ్చునేమో.  

     ఇలా మొత్తం శతకహృదయము చూసినట్లైతే స్వార్థ రహిత ప్రార్థనలు,లోకహితైషికత ద్యోతకమౌతాయి. వృత్తములు పఠనములో కాఠిన్య మేమాత్రము లేనివి, లయాత్మకమైన నడకతో హృద్యముగా ఉన్నవి. చింతావారు తాముచేసిన అనేక వినూత్న ప్రక్రియల వలె ఇదియునూ మరొక వినూత్న ప్రయోగమును సఫలతతో నిర్వహించి మాబోంట్లకు మార్గదర్శనము చేసినారు. వారిపద్యసేద్యము నిర్విరామముగా సాగాలని, దానికి వలయు ఆయురారోగ్యభాగ్యములను అమ్మ ప్రసాదించాలని ప్రార్థిస్తూ… స్వస్తి.

గురుపాదధూళి

నారుమంచి వేంకట అనంతకృష్ణ.

భాగ్యనగరము. 

05 - 5 - 2024.

అవధాన భారతి . సాహితీచతురానన. ఛందో వైవిధ్య నిష్ణాత. ఛందస్సవ్యసాచి. స్వర్ణ కంకణ కవిగండ పెండేరపు సత్కార గ్రహీత –

విద్వాన్. చక్రాల లక్ష్మీకాంత రాజారావు ఎం.ఎ.,

విశ్రాంత సంస్కృతాంధ్రోపన్యాసకులు,

హైదరాబాద్. చరవాణి 9291333880

ఛందోభారతీ నమో೭స్తుతే

     ఆధునిక కవీశ్వరులను - వారి కావ్య రచనలను పరిశీలింపగా నానా ఛందస్స్వర్ణ భూషా లంకృతయై శ్రీ భారతీదేవి - ఆంధ్ర భాషా సాహితీ రంగస్థలమందు కరకమలములతో కచ్ఛపీ వీణానాదము చేయుచు పాఠక లోకమును అలరింపఁ జేయుచున్నట్లు కనిపించుచున్నది. పద్య సాహితీరంగమందు ఛందో೭మ్శమందునూహించని యొక క్రొత్త మార్పు. 

     ఇరువది ముప్పది వృత్తములతో పద్యకావ్యము లల్లిన ప్రాచీన కవీశ్వరుల పోకడలకు _ వేలాది ఛందములు గైకొని రమణీయమైన కావ్యములు వ్రాయుచున్న ఆధునిక కవుల పోకడలకు భేదము గమనించగా- వారి వారి ప్రతిభా వ్యుత్పత్యభ్యాసములందు - గురువుల బోధనలందు- కాలగమనమ్మునందు - అభి మానించెడు పాఠకుల జిజ్ఞాస యందు - పట్టుదలలందు - కృషి యందు - ఆలోచనా విధానములందు - పెను మార్పులు రావడ మొక కారణముగా కనిపించుచున్నది. నేటి కవుల మధ్య నేదో తెలియని పోటీతనము, తమకున్నప్రతిభా సంపత్తిని అనేకానేక కావ్యరచనలతో తెలుఁగువారికి తెలియ జేయాలనే ఆకాంక్ష - అందునా వివిధములైన ఛందములతో వ్రాయాలనే తపన, అజరామరమయిన కీర్తిని పొందాలనే ఆశ - యున్నట్లు తోచుచున్నది. ఇట్టి ఆలోచన ప్రశంసనీయమేకదా. 

     ఇంతటి యుపోద్ఘాతమేలనగా- నేటి తెలుఁగు కవుల యాలోచనలు - వారి కావ్యరచనలు - పాఠకుల సాహిత్యాభిమానము - కావ్యముద్రణకు నార్థిక సహాయమందించుటకు తమవంతుగా ముందుకు వచ్చుచున్న వ్యక్తులు - వీరి బంధాలు- అనుబంధాలు చూచి ఆనందించు వారిలో

నేనుండడమే.

     పద్యమునకు కాలము చెల్లిందని పలుకు నీ తరములో ఇలా వివిధరీతులగు ఛందములందు కావ్యములు రచించి పద్యభారతీ పాదపద్మారాధకులుగా అనేకులగు కవులు దర్శనమీయడము- తెలుఁగు జాతి ఆదరించడము ముదావహమగు విషయము.

     ఈ విధముగా పద్యమునకు జీవమునిచ్చి, ఆంధ్ర భాషా వాఙ్మయరంగాన వివిధచ్ఛందములలో పద్య కావ్యరచన చేయుచున్న కవీశ్వరులలో నాకు తెలిసిన వారిలో శ్రీ చింతా రామకృష్ణ రావు గారొకరు. వీరు సంస్కృతాంధ్ర భాషా విశారదులు. సహృదయులు . వీరు పద్యకావ్యరచనలను జేయుచు జై మాతృకులగు కవులను ప్రోత్సహించుచు - వారిచేత కావ్యరచనలు చేయించి నిరంతరము భాషాభి వృద్ధికి తమవంతు కృషి చేయుచున్నారు.

     శ్రీ చింతా వారి అష్టోత్తరశతఛందశ్శ్రీ రాఘవశతకమును చదివితిని. ఇందు ప్రతిపద్యమున మకుటము "రాఘవా" అను శుభప్రద పదము. మరియు ప్రతి పద్యమున శ్రీరామనామ ములందుండు శ్రీరామస్తుతి పదమొకటి. ఇలా రెంటికి సరిపడు వృత్తచ్ఛందమును పద్యచ్ఛందో దర్శిని మందు పరిశీలనము చేసి- ఆవృత్తమున—దైవస్తుతినిగానీ, సామాజికాంశమునుగాని అనుసంధానము చేసి వ్రాయుటలో కవిగారెంతటి శ్రమను ఓరిమిని చూపినారో పద్యము వ్రాసిన తరువాత నెంతటి ఆనందమును పొందినారో నేనునూహించగలను.

     పద్య రచనకు సరియగు భావసంపద దొరికినచో వీరి లేఖని పరుగులు దీయును, చిత్ర కవిత్వము నందు, గర్భ కవిత్వము నందు, నన్నివిధములగు గద్య, పద్య, గేయ, కథారచనలందు వీరు చేయి తిరిగిన వారగుటచే_ ఎవరైనను - ఏవిశేషాంశమునందైననూ, ఎటు వంటి ప్రక్రియయందైనను - రచింపుడని శ్రీ చింతా వారిని అడుగుటయే తడవు _ వీరు ఆనందముతో నంగీకరించి - వారడిగినట్టుల రచించి గడువులోపల నందించగలరు. అంతటిమృదు మధుర కావ్యకర్తలు, భాషాభిజ్ఞులు వీరు. ఇట్టి సాహితీ సంపత్తి గలవారగుటచే ఆధునిక కవిపండితులలో తలలోని నాల్కగా నిలిచినారు.

     వీరు తమ శతకారంభమందు నాందీపద్యముగా శ్రీకారముతో ప్రారంభించి - కావ్యలక్షణములందు ముఖ్యమగు "విశ్వశ్రేయః కావ్యమ్" అను దివ్యోక్తికి ప్రథమ తాంబూలమందించినారు.  నాటి అప్పకవీయాది చ్ఛంద శ్శాస్త్రగ్రంథములను నేటి అనంతచ్ఛంద మను బృహత్తర ఛందశ్శాస్త్ర గ్రంథమును పరిశీలించి - అందుగలవృత్త ములలో శ్రీరామనామములకు పనికివచ్చు వృత్తములను అష్టోత్తరశతములను గ్రహించి ఎంతో శ్రమించి, భక్తిరసమును రంగరించి, ఒక భక్తిశతకముగా, నేటి సామాజికాంశములను కావ్య వస్తువుగా స్వీకరించి, కరుణ రసమును చిలుకరించి - ఒక సామాజికాంశశతకముగా వీరు రచించినారు.

     విభూతి, కౌముది, చారుహాసికి, నాగరము, మంజరి, మనోరమ - వంటి వివిధ చ్ఛందోవృత్తములతో శతకరచన చేసి - శ్రీ చింతావారు - ఛందః పండితులచేత నతులు నుతులు అందుకొన్నారు. 

     పద్యసాహితీ రంగాన వాడుకలో నున్న పద్యములను గాయకులు, నటులు పాడగా మనము వింటున్నాము, విని ఆనందించుచున్నాము. మరి - యిలా - క్రొత్తగా వచ్చిన పద్యములను మనము మనకు ననుకూలమయిన రాగములో పాడుకొని _ ఆనందించి - ఆదివ్యానందమును అందరికీ పంచు యత్నము చేయాలి. అపుడే మిగులు పద్యములకు - వ్రాసిన కవులకు-నామసహిత కీర్తి కాంతులు - తెలుఁగు భాషా సరస్వతికి నవ్యదివ్య హారతుల కాంతులు,

     అట్టి ప్రయత్నం చేసి కాబోయే ఛందః కవులకు ఇలా వ్రాయుచున్నశ్రీ చింతా రామకృష్ణారావు వంటి కవులకు ప్రోత్సాహమందిద్దాం.


కంII ఇంతింతగ ఛందములన్

భ్రాంతిన్ గొని వ్రాసినట్టి పండిత కవికిన్,

చింతావారికి వాణీ

కాంతామణి వాసి, రాశి, కలిగించు లలిన్.

ఇట్లు

బుధజనవిధేయుఁడు

చక్రాల లక్ష్మీకాంత రాజారావు

హైదరాబాదు,

06 - 5 - 2024.

అభినందన పద్య పంచకము 

సమస్యాపృచ్ఛక చక్రవర్తి శ్రీ కంది శంకరయ్య

కంII  శ్రీరఘురాముని నామ సు 

ధా రస పానమ్ముఁ జేసి తన్మయులై మీ

రీ రాఘవ శతకమ్మును

కోరి లిఖించితిరి జనులకున్ మోదమిడన్. 


కంII  ఛందోవైవిధ్యముతో

సుందరపదబంధములు విశుద్ధ మనమునన్

సందడి సేయఁగ మధురా

స్పందముగా వ్రాసినట్టి సత్కవి! ప్రణతుల్.


కంII  ఆటాడి ఛందములతో

వాటముగా నాశుగతినిఁ బద్యమ్ములలో

మేటిగ రాఘవు మహిమల

నోటు వడక చెప్పి జనుల కొసఁగితిరి కదా!


కంII  రైలెక్కి దిగెడి లోపల

వాలాయమ్ముగ శతకము వ్రాసితిరట! నే

నే లీల మిమ్ముఁ బొగడుదు

శ్రీలలితాకృపను గాంచి చెలఁగెడి సుకవీ!


కంII  ఎనలేని గర్భకవితా

ఘనతను గుర్తించి చిత్ర కవితా సమ్రా

ట్టనుచుం గవిపండితు లె

ల్లను మెత్తురు మీదు కావ్యమాధురిఁ గనుచున్.

కంది శంకరయ్య

06 - 5 - 2024.

నన్ను ఈ శతకరచనకు ప్రేరేపించిన మహనీయులు

బ్రహ్మశ్రీ ఊలపల్లి సాంబశివరావు.

శ్రీరఘురామ సచ్ఛతకచిద్వరగ్రంథము వ్రాసియున్నచో

మీరలు పంపుడంచునను మేలుగఁ గోరిరి యూలపల్లి, నో

రారగ పల్కి సాంబశివురావు మహాత్ములు, వారి ప్రేరణన్

శ్రీరఘురామ! వ్రాసితిని, చిన్మయ! దీనిని, కావు వారలన్.


నివేదన.

     శ్రీమన్మంగళస్వరూపిణి శ్రీలలితాంబ కృపావిశేషంబున సుప్రసిద్ధ భాగవతగణనాధ్యాయి బ్రహ్మశ్రీ ఊలపల్లి సాంబశివరావు సహృదయులు దూరవాణిలో నన్ను పలుకరించి, నాచే రచింపఁబడిన శ్రీరామునిపై శతకముంటే పంపమని కోరిరి. నేను సరే అని పలికి సంభాషణ ముగించిన పిదప నేను ఆలోచించుకొంటిని. నేను ఇంతవరకు శ్రీరామునకు సంబంధించి రామాన్వయ కంద సీతాన్వయ గీత గర్భ హనుమదన్వయ సుందరఉత్పలనక్షత్రమాల(సుందరకాండ)

మాత్రమే రచించియున్నందున, గణనాధ్యాయి కోరిన శతకము ఇంతవరకు నాచే రచింపఁబడనందున, వారికి నాపైగల, ఆ రామునిపైగల విశ్వాసము వొమ్మవకుండా చేయుటకు వారు కోరిన శతకమును వ్రాసి యిచ్చిన సరిపోవును కదా అని భావించి యుంటిని.

ఇంతలో సమస్యాపృచ్ఛక చక్రవర్తి శ్రీ కందిశంకరయ్య గారు నాతో చరవాణిలో మాటాడుచూ శృంగేరిలో చిరంజీవి లలితాదిత్య శతావధానానికి వెళ్ళుతున్నాం కదా, అందుకని నేను ఆ శృంగేరి శారదాంబ అష్టోత్తర శతనామములు పాదాదినుంచి అష్టోత్తరశత ఛందములలో శారదా శతకమును వ్రాయదలచుకొని ముందుగా మీకు చెప్పుచున్నాను, ఎందువలననగా మీరు లలితాసహస్రమును, లక్ష్మీ సహస్రమును, శ్రీనృసింహ అష్టోత్తరశత నామములను పద్యములలో రచించియుండిరి. అదియే నాకు ప్రేరణ అని తన మనోగతమును తెలిపి యున్నారు. అలా అంటూ మీరు మాత్రము శారదపై వ్రాసెయ్యకండి అన్నారు. ఆ మాట నాలో ఆలోచనను రేపింది.  రామునిపై శతకము వ్రయవలసియున్నదికదా,  నేనును కందివారు చెప్పినట్లు శారదాంబపై కాక రామునిపై వ్రాసిన గణనాధ్యాయి కోరిక తీర్చినట్లవుతుంది అని భావించి శ్రీ కందివారికి తెలియఁజేశాను. చాలా మంచి ఆలోచన. తప్పక వ్రాయండి అన్నారు. కందివారు శారదా! అను మకుటమును స్వీకరించగా నేను రాఘవా అనే మకుటాన్ని ఎంచుకున్నాను. రగణము అంతమందుండే వృత్తములను అప్పకవీయమునుండి, ఇతరఛందోగ్రంథములనుండి, అనంతచ్ఛందమునుండి గ్రహించి రచనకుపక్రమించితిని. ఆ లలితాంబ దయ అపారమైనది. ఆ శ్రీరాముఁడు దయాంతరంగుఁడు. నా ప్రయత్నము వ్యర్థము కాకుండా నేను కోరుకొనిన విధముగా శతకమును వారముదినములలో నాచే వ్రాయఁజేసిరి. ఈ శతకావిర్భావమునకు ప్రేరణ, పూరణ అన్నియు అమ్మవారే. ఒక పది నామములకు మాత్రము అవి ఇమిడెడి వృత్తములు నేను గ్రహించలేకపోవుటచే, కందివారిని, సహోదరులు బ్రహ్మశ్రీతోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారిని అడిగితిని. వారి అనంతఛందమునుండి కొన్ని ఛందములను సూచించినంతనే ఆ పది పద్యములునూ పూరించుట జరిగినది. శ్రీ కందిశంకరయ్యగారు నేను పరస్పరము ప్రోత్సహించుకొంటూ వారు శారదా శతకము, నేను రాఘవా శతకము వారము రోజులవ్యవధిలో వ్రాయుట జరిగినది.

అనంతచ్ఛంద నిర్మాత శ్రీ తోపెల్ల సహోదరులకు, నిరంతరము ప్రోత్సహిస్తూ తమ అమూల్యమయిన అభిప్రాయము వ్రాసిన శ్రీ కంది శంకరయ్యగారికి నా ధన్యవాదములు. ఈ సృష్టి అంతయూ అమ్మయే అని నిరంతరము అమ్మ ధ్యానమగ్నిలైయుండు నా సహోదరులు చిరంజీవి నారుమంచి వేంకట అనంతకృష్ణ అమూల్యమయిన అభిప్రాయమును వ్రాసి నాకు ఆనందప్రదులైరి. వారికి అమ్మ ఆశీస్సులను అర్థిస్తున్నాను. బ్రహ్మశ్రీ చక్రాల రాజారావు మహోదయులకు పరిశీలనార్థం యీ రాఘవా శతకము పంపగా వారు ఆద్యంతము పరిశీలించి అక్కడక్కడ అవసరమయిన మార్పులకు సూచనలు చేసి తమ అమూల్యమయిన అభిప్రాయమును వ్రాసి దీవించియుండిరి. వారికి నా హృదయపూర్వక నమశ్శతములు తెలియఁజేసుకొంటున్నాను. శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారు నా శతకమును పంపగనే అది చదివి అభిమానంతో వారు తమ అమూల్యమయిన అభిప్రాయమును వ్రాసిపంపిరి. వారికి నా ధ్జన్యవాదములు తెలియఁజేసుకొంటున్నాను. ముఖ్యముగా శతకమును వ్రాయుటకు ప్రేరణ కలిగించిన బ్రహ్మశ్రీ ఊలపల్లి సాంబశివరావు మహోదయ దంపతులకు నా ప్రణామములు తెలియఁజేసుకొంటున్నాను.

బుధజన విధేయుఁడు,

చింతా రామకృష్ణారావు.

06 - 5 - 2024.

అంకితము.

నిరంతరలలితాధ్యాన తత్పర శ్రీమతి ఊలపల్లి లలితాంబకు.

 

శా.  శ్రీమద్రాఘవ దివ్యనామశతమున్ చిత్రంపు భిన్నంబులౌ

శ్రీమద్వృత్తములన్ రచించితిని రాశీభూత ఛందః ప్రభన్!

ధీమచ్ఛ్రీలలితాంబ! శంభుని సతీ! శ్రీశాంభవీ! నీకు నే

ప్రేమన్ జేసెదనర్పణంబు గొనుమా, శ్రీ రాజ రాజేశ్వరీ!



శ్రీరామాష్టోత్తరశత నామాంచిత అష్టోత్తరశతచ్ఛందశ్శ్రీ

రాఘవ శతకము

౧ . ఓం శ్రీరామాయ నమః.

శార్దూలవిక్రీడితము (మ స జ స త త గ. యతి ౧౩)

శాII  శ్రీమన్మంగళ దేవదేవ! శుభదా! *శ్రీరామ!* సన్మంగళం

బౌ మాన్యంబగు నీదు మార్గచరులౌ భవ్యాత్ములౌవారికిన్,

బ్రేమన్ నీ సుచరిత్రపాఠకులకున్, శ్రీరామ భక్తాళికిన్,

నీ మంత్రాక్షర నామ పద్యములనన్ నీ తేజమే రాఘవా!


౨ . ఓం రామభద్రాయ నమః.

అతిశక్వరి (ర-జ-ర-జ-ర యతి 9)

సౌమ్యరూప! సుస్వభావ సారమీవె చూడగా,

గమ్యమేది మాకు? చూపి కావు సద్వరప్రదా!

సామ్యమెన్న లేదునీకు సన్నుతాత్మ సంస్తుతుల్,

రమ్య సద్గుణప్రదుండ! *రామభద్ర!* రాఘవా!


౩ . ఓం రామచంద్రాయ నమః.

విభూతి (ర జ గ)

*రామచంద్ర!* తాటకిన్

నేమమొప్ప కూల్చితే!

నీ మనోజ్ఞ జన్మమే

క్షేమదంబు, రాఘవా!


౪ . ఓం శాశ్వతాయ నమః.

ఉత్సుకము (భ భ ర)

శ్రీకరమై భువి చెల్గు ని

క్ష్వాకు కులప్రభ! *శాశ్వతా!*

నీకిల సాటిఁక నీవె, ధీ

రా! కమలాక్షుఁడ! రాఘవా!


౫ . ఓం రాజీవలోచనాయ నమః.

నారాచము (త ర వ)

*రాజీవలోచనా!* హరీ!

స్త్రీజాతిఁ గావుమా భువిన్

పూజింత్రు భక్తితో నినున్,

రాజీవె కావ, రాఘవా!


౬ . ఓం శ్రీమతే నమః.

కౌముది (న త త గ.  యతి ౬)

ధరణి *శ్రీమంత!* నిన్ గొల్చినన్

నిరుపమా! శాంతి కల్గున్ గదా,

శరణమన్నన్ జయప్రాప్తియౌ

వరద! రక్షింపవా రాఘవా!


౭. ఓం రాజేంద్రాయ నమః.

అయోధ్య. స్వయంకల్పితము

అంగజాస్త్రము.   (౧.౨.పాదములకు-భ మ స గ. యతి ౬    

                     ౩.౪.పాదములు-మ స జ గ.  యతి ౬)

వ్రాసిరి *రాజేంద్రా!* కవులెన్నో

భూషగ కావ్యంబుల్ తగ నీపై

ధ్యాసన్ నే శతధా రచింపగా

నాసన్ బూనితినయ్య రాఘవా!


౮ . ఓం రఘుపుంగవాయ నమః.

అపరాజిత (న న ర స వ. యతి ౯)

అగణిత *రఘుపుంగవా!* యసురాంతకా!

సుగుణుల నిలఁ బ్రోచుచున్  గను దైవమా!

ప్రగణిత గుణ మీయవా, సురపూజితా!

నిగమ విదిత! పావనీ నుత రాఘవా!


౯ . ఓం జానకీవల్లభాయ నమః.

నదీప్రఘోషము. 

      (౧వ పాదమున (స్రగ్విణి) ర ర ర ర. యతి ౭ 

      ౨వ పాదమున (వంశస్థ) జ త జ ర. యతి ౮

      ౩వ పాదము (భుజంగప్రయాత) య య య య. యతి ౮

      ౪వ పాదము (ఇంద్రవంశ) త త జ ర.  యతి ౮)

*జానకీ వల్లభా!* సత్యవాక్యప్రియా!

మనంబు నీపైననె మన్ననన్నిడన్

మనంగా వరంబున్ రమానాథ! యిమ్మా!

జ్ఞానంబుతోఁ గొల్తు, నగణ్య! రాఘవా!


౧౦ . ఓం జైత్రాయ నమః.

క్షమ (క్షప) (న న త త గ.   యతి ౮)

కనితివి శబరిన్ కన్నులన్ *జైత్ర!* ని

ల్పి, నిజ మరయ నీవే కృపన్ ముక్తినే

ఘనముగనిడి, లోకాన నీవే ఘనం

బనగనిలిచినావా! హరీ! రాఘవా!  


౧౧ . ఓం జితామిత్రాయ నమః.           

      చారుహాసికి (ప్రవర్తిక - పరాంతిక) 

      (౧వ పాదమున- న న ర వ/ యతి ౬.

      ౨వ పాదమున- స భ ర వ/ యతి ౭.

      ౩వ పాదమున- న ర జ గ/ యతి ౫.

      ౪వ పాదమున- స ర ర వ.   యతి ౬)

భజన చలుప నేరనయ్య నే

నిజమెన్నన్, గననిమ్ము నిన్ సదా,

సృజననిచ్చి కావుమయ్య! రా

మ! *జితామిత్ర!* మన్నించు రాఘవా!                 


౧౨ . ఓం జనార్దనాయ నమః.

కదంబ మంజరీ(జ ర ర జ జ గ. యతి 9)  

*జనార్ధనా!* దురాత్ముల్ ప్రజా విరోధులు, దుష్కృతుల్

పొనర్చుచుండిరే,  యో ప్రభూ! క్షమించక వారలన్

మనంబు పెట్టి చంపన్, సమస్తమున్  శుభమౌనుగా,

ప్రణామ మీకు సంహారివై రహించుము రాఘవా! 


౧౩ . ఓం విశ్వామిత్రప్రియాయ నమః.        

హరి (న న మ ర స లగ. యతి 10) 

ధరణిజ పతి! *విశ్వామిత్రప్రియా!* సుగుణాకరా!

వర మునిజన వంద్యా! దేవా! ప్రభాకరవంశజా!

పరమ పురుష! కావన్ రావా ననున్? గణియింపుచున్,

నిరుపముఁడ! పరంధామా నీవెకావుమ, రాఘవా!


౧౪ . ఓం దాంతాయ నమః.

ప్రమాణి (జ ర వ)

మురారి! *దాంత!* నీ కృపన్

ధరాతలంబునందునన్

చరించు సజ్జనాళికిన్

వరించు మేలు రాఘవా!


౧౫ . ఓం శరణత్రాణ తత్పరాయ నమః.       

రసోదత (త జ భ త ర. యతి-7) 

రామా! ననుఁ గావరా, *శరణత్రాణ తత్పరా!*

కామాదులు వీడఁ గాంచుము, రక్షించు నన్నిలన్,

శ్రీమంతుఁడ! నాదు చిత్తమునందుండి ప్రోవుమా,

ప్రేమాంబుధి! భవ్య విత్తము నీవేను, రాఘవా!


౧౬ . ఓం వాలిప్రమథనాయ నమః. 

భుజంగవిజృంభితము (మ.మ.త.న.న.న.ర.స.వ. యతి ౯.౧౯)

పాపాత్ముండౌ వాలిన్  *వాలిప్రమథన!* తునిమి శుభము 

                                 వర్ధిలన్ బొనరించితే?

శ్రీ పద్మాక్షుండా! నీ వాడన్, శ్రితజన వరదుఁడ! ననుఁ

                                 జేయనీ శుభకృత్యముల్,

నీపై ప్రేమన్ భక్తిన్, సమ్మానితముగ నొసగుమ, హరి! 

                               నెమ్మితో, దయఁ జూడుమా!

ప్రాపై నీవున్నంతన్ జీవింపఁగ భయమును మది విడు,

                                   భక్తి నిల్పుచు, రాఘవా!


౧౭ . ఓం వాఙ్మినే నమః.

నాగరము (భ ర వ) 

రాముఁడ! *వాఙ్మి!* వాగ్ఝరిన్,

బ్రేమగ నాకు నీయుమా,

నా మదిలోన నుండుమా

నీ మది నిల్పి, రాఘవా!


౧౮ . ఓం సత్యవాచేనమః.

వల్లరి (ర ర) 

*సత్యవాచా!* రమా

స్తుత్య సద్బాంధవా!

నిత్యమున్ గొల్తు నిన్

భృత్యఁడన్ రాఘవా!


౧౯ . ఓం సత్యవిక్రమాయ నమః.

ఇంద్రవంశము (త త జ ర. యతి ౮)

సత్యంబు పాలింపగ *సత్యవిక్రమా!*

నిత్యంబు నీవుంటివి నిర్మలప్రభన్,

స్తుత్యంబుగా కొల్చెద సుందరాంగ! యౌ

న్నత్యంబుతోనిల్పుమ నన్ను రాఘవా!


౨౦ . ఓం సత్యవ్రతాయ నమః. 

మంజరి (స జ స య లగ. యతి 9)

పరమాత్ముఁడా!  కన నుపాయమున్ దెల్పుమా

నిరతంబు నిన్, మదిని నిల్ప, *సత్యవ్రతా!*

పరమంబునే గనఁగ వచ్చు, నిన్ జూచినన్,

సరిలేరునీ కిలనుసన్నుతా! రాఘవా!


౨౧ . ఓం వ్రతధరాయ నమః.

సుధాధామ (న త గ) 

*వ్రతధరా!* కాచితే

నుతి నహల్యా సతిన్,

బ్రతుకు పండించితే

నతులు శ్రీ రాఘవా!


౨౨ . ఓం సదా హనుమదాశ్రితాయ నమః. 

ప్రియంవద (న భ జ ర. యతి ౮)

*హనుమదాశ్రిత!* సురార్చితా! హరీ!

నిను నుతింతును వినీలదేహుఁడా!

క్షణము లోపలనె కంటికానుమా,

ఘనతరంబుగను గణ్య రాఘవా!


౨౩ . ఓం కౌసలేయాయ నమః. 

ద్రుతవిలంబితము (న భ భ ర. యతి ౭)

ప్రణవ రూపుఁడ! భాగ్యద! *కౌసలే

య!*నిను నామదినాశగ నిల్పెదన్,

గనుము నిచ్చలు కమ్మని ప్రేమతో,

వినుమ నామొర ప్రీతిని రాఘవా!


౨౪ . ఓం ఖరధ్వంసినే నమః. 

మృత్యుంజయ (త మ లగ) 

దేవా! *ఖరధ్వంసీ!* హరీ!

భావంబులో నీవుండుమా,

జీవాత్మ వీవే కాంచగా,

గోవిందుఁడా! మా రాఘవా!


౨౫ . ఓం విరాధవధపండితాయ నమః. 

చంపకమాల (న జ భ జ జ జ ర. యతి ౧౧)

ప్రవరుఁడవౌ *విరాధ వధపండిత!*నీకు నమస్కరించెదన్,

శ్రవణ కుతూహలంబగును శ్రావ్యపు నీ చరితంబు దేవరా!

భవములు పాపువాఁడవని భవ్యుఁడ నమ్మితిమయ్య, నీవె మా

జవమును సత్వమున్ నిజము, సాకుము మమ్మిల రామ! రాఘవా!


౨౬ . ఓం విభీషణ పరిత్రాత్రే నమః. 

మత్తేభము (స భ ర న మ య వ. యతి ౧౪)

కుమతిన్ రావణు సంహరించితివి, నీకున్ సాటి లేరంచనన్, 

రమణుండా! ఘనుఁడా! *విభీషణ పరిత్రాతా!* జగద్రక్షకా!

రమసీతమ్మను కాచి తెచ్చితివి, నన్ రక్షించగా రావ? నే

మముతో నిన్ను నుతింతు పద్యములలో మాన్యుండ! శ్రీ రాఘవా!


౨౭ . ఓం హరకోదండ ఖండనాయ నమః. 

ఉపమాలిని (న న త భ ర. యతి 9) 

సుగుణ గణుఁడ! దీవించు నన్నుఁ గృపాబ్ధి! నీ

డగ నిలు *హరకోదండ ఖండన!* నిత్యమున్,

నిగమ విదిత దేవా! నినున్, మదినెంచెదన్,

జగము నడుపు వాడా! జయంబిడు రాఘవా!


౨౮ . ఓం సప్తతాళప్రభేత్రే నమః. 

గౌరీ (న-న-ర-ర. యతి 8) (చంచలాక్షీ, ప్రముదితవదనా, మందాకినీ, ప్రభ, ప్రభాత)        

పరమపురుష!  *సప్తతాళప్రభే

త!* రమణ! కన నూత మీవే కదా,

స్థిర వర గుణ రాశి నిమ్మీవె నీ

స్మరణ విడువ శ్రీశ! మా రాఘవా!


౨౯ . ఓం దశగ్రీవశిరోహరాయ నమః. 

౪౭.కరపల్లవోద్రతా.  ..  య య స జ గ.  యతి ౭.

వరాత్మా!*దశగ్రీవశిరోహరా!* పరా

త్పరా! దివ్య సద్భావ! సుపూజ్య! దేవరా!

పరంబీవె దివ్యా! పరమార్థమిమ్ము,నే

వరంబేమి కోరన్! వరలంగ రాఘవా!


౩౦ . ఓం జామదగ్న్య మహాదర్పదలనాయ నమః.

దర్పనాశిని (న ర స భ స వ.  యతి ౧౦) 

ధరణి *జామదగ్న్య మహాదర్పదలన!* శ్రీహరీ! 

స్మరణ వీడనయ్య! మహేశా! కరుణను చూడుమా,

పరమ వీరరాఘవ! నా బంధమునిఁక పాపరా,

నిరుపమాన రాముఁడ! సాన్నిధ్యము నిడు, రాఘవా!


౩౧ . ఓం తాటకాంతకాయ నమః.   

మనోరమ (న ర జ గ.  యతి ౭)  

తలఁప *తాటకాంతకా!* నినున్

గలుచువారికిన్ ముదాత్మతన్

సులలితాత్ముఁడా! శుభంబులన్

కలుగఁ జేయుమింక రాఘవా!


౩౨ . ఓం వేదాంతసారాయ నమః. 

కుటజగతి (న జ మ త గ. యతి 9)

అహరహమున్ నినున్ దేవా! *వేదాంతసా

ర!* హరి! స్మరించుచో ధారాపాతంబుగా

మహిమముతోడ, ఛందోమార్గంబందునన్

బహువిధ పద్యముల్, తా వచ్చున్ రాఘవా!


౩౩ . ఓం వేదాత్మనే నమః. 

లత (ర య లగ) 

శ్రీకరుండ! *వేదాత్మ!* నే

లోకమందు శోధించినన్

నాకుఁ దోచు నీ రూపమే,

లోక రక్ష! శ్రీ రాఘవా!


౩౪ . ఓం భవరోగస్యభేషజాయ నమః. 

రథోద్ధతము (ర న ర వ. యతి ౭)

ప్రోవరావ, *భవరోగభేషజా!*

నీవె కావవలె నిర్మలాత్ముఁడా!

జీవమీవె కద, చిత్ స్వరూపుడా!

రావణాంతక విరామ! రాఘవా!


౩౫ . ఓం దూషణత్రిశిరోహంత్రే నమః.                                                                                  

కుంజ (త జ ర స ర. యతి ౯)    

నా దైవము నీవ, *దూషణత్రిశిరోహంత!* నా

మీదన్ దయఁ జూపి, నన్నుమేలుకొనంగన్ హరీ! 

మోదంబునఁ జేయుమో సుపూజ్యుఁడ!శ్రీ రాముఁడా!

వేదాత్మవు, శ్రీశ! విశ్వవేద్యుఁడ! మా రాఘవా!                                                     


౩౬ . ఓం త్రిమూర్తయే నమః. 

చంద్రిక (న న ర వ. యతి ౯)

అజుఁడు శివుఁడు నీవెరా! ధరన్

సుజన నుత! *త్రిమూర్తి!* సుందరా!

నిజ కళలను జూపు నిత్యుఁడా!

ప్రజల మదుల లోని రాఘవా!


౩౭ . ఓం త్రిగుణాత్మకాయ నమః. 

ఉత్పలమాల (భ ర న భ భ ర వ. యతి ౧౦)

*ఓ త్రిగుణాత్మకా!* శుభమహోజ్జ్వలతేజుఁడ! వందనంబు, మా

దౌ త్రిగుణంబులుండెను, మహాత్ముఁడ చూచుచు నిల్పు సత్వమున్,

స్తోత్రము చేసి మ్రొక్కెదను సుందరపద్యములందు నిన్ను, నా

యాత్రము నెన్ని కావుము మహాత్ముఁడ! పెన్నిధివైన రాఘవా!


౩౮ . ఓం త్రివిక్రమాయై నమః.

కరశయాకిశోరము (న భ ర)

కృపను గాంచు *త్రివిక్రమా!*

యపజయంబులు బాపరా,

యుపవసింతును నిత్యమున్

ప్రపవు, నీదరి రాఘవా!


౩౯ . ఓం త్రిలోకాత్మనే నమః.

కుసుమిత (న ర ర) 

కనుమయా! *త్రిలోకాత్మ!*నన్,

వినుమయా ప్రభాపూర్ణమౌ

ఘనుఁడ! నీ ప్రభావంబునే

వినుతులందు నో రాఘవా!


౪౦ . ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః. 

పృథ్వి (జ స జ స య లగ. యతి 12)

మునీశ్వరులు నిన్ను గొల్చుదురు *పుణ్యచారిత్ర కీ

ర్తనా!* నిను రమేశ! నేనును  నితాంతమారాధనన్

గణించి, మదిఁ జేయుదున్, సుగుణగణ్యుఁడా! చూడవా?

మనంబునను దల్పవా? కనవ మన్ననన్? రాఘవా!


౪౧ . ఓం త్రిలోక రక్షకాయ నమః.           

చంపకకేసరి (స జ స స స వ. యతి ౯)

సుకవుల్ నినున్ సతము శోభిలఁ బల్కు, *త్రిలోక ర

క్షక!* గణ్యులా కవులు, కామితముల్ నెరవేరు వా

రికి, నీ కృపన్ సతము తృప్తిగనుందురు, కర్మలన్

సకలంబుపాపుమయ, సన్నుతు చేసెద రాఘవా!


౪౨ . ఓం ధన్వినే నమః.   

మనోహర (ర-జ-ర-జ-గ. యతి 9) 

రామ! *ధన్వి!* చూడవయ్య రాక్షసాంతకా!

ప్రేమతోడఁ గొల్తు నిన్ను విశ్వసించుచున్,

భూమిపైన వేదసార పూజ్యులుండిరే,

నీమమొప్పకావుమయ్య నీవె, రాఘవా!


౪౩ . దండకారణ్యకర్తనాయ నమః. 

కళాధర (ర ర జ ర వ. యతి 7)

*దండకారణ్యకర్తనా!* దయానిధీ! హరీ!

నిండుగా గుండెలో నినున్ వహింతు భక్తితోఁ,

బండువై యుండు లోపలన్ బ్రభాకరుండవై

యండవీవే కదా, యజాండ భాస, రాఘవా!


౪౪ . ఓం అహల్యాశాపశమనాయ నమః.     

కాంత (య భ న ర స లగ. యతి 11)          

*అహల్యాశాపశమన!* విమోహమున్ విడఁ జేయుమా,

మహాత్మా! శాపవశుఁడను,  రామ నామము పల్క రా

దహో! వాగ్రూపమున, ధన దాహమే విడదేలనో?

స్పృహన్నీవే గొలిపి, నను బ్రోచి నిల్పుము, రాఘవా!


౪౫ . ఓం పితృభక్తాయ నమః‌.          

చంద్రశేఖర (న-జ-ర-జ-ర.  యతి 13)        

నుత *పితృభక్త!* రామదేవరా! ఘనుండ! ని

న్నతులితశక్తి పూర్ణ భాగ్యుడంచునందురే 

క్షితి మతిమంతులున్, మహాత్ములున్, బ్రసిద్ధ! స

ద్వ్రతఫలమీకృతిన్ గనంగ లేవొ? రాఘవా!


౪౬ . ఓం వరప్రదాయ నమః‌.         

పుష్పగుచ్ఛము (జ ర జ గ. యతి 7) 

*వరప్రదా!* శుభాస్పదా! నతుల్,

నిరంతరంబు నిన్నె కొల్చెదన్,

పరాత్పరుండ! దైవమీవెరా,

వరప్రదుండ! భవ్య రాఘవా!


౪౭ . ఓం జితేంద్రియాయ నమః‌.            

భోగవిలసిత (భ స జ గ. యతి 7) 

శ్రీకరుఁడ! *జితేంద్రియా!* హరీ!

శోకహరుఁడ! నీ శుచిత్వమున్

ప్రాకటముగ భూప! యిమ్మయా,

చీకటులను త్రుంచి రాఘవా!


౪౮ . ఓం జితక్రోధాయ నమః‌.         

వంశస్థము (జ త జ ర. యతి 8) 

హరీ!*జితక్రోధ!*యహంబు బాపరా,

పరాత్పరా! భావభవా! కనంగ రా,

ధరాసుతాత్మన్ వినుతా! వసింతువే,

వరంబువై కన్పడు, భవ్య రాఘవా!


౪౯ . ఓం జితామిత్రాయ నమః‌.         

నిశ (న న ర ర ర ర.  యతి 9) 

అనుపముఁడవయా, *జితామిత్ర!* నీ సాటి లేరెవ్వరున్,

ఘనతరమగు నీదు కల్యాణ తేజంబు చూడంగనే

మునులకునుప్రమోదమున్ గొల్పునో శ్రీహరీ! నిత్యమున్

మనమున ననుఁ గాంచుమా, రామ భూపాల! శ్రీ రాఘవా! 


౫౦ . ఓం జగద్గురవే నమః‌.

మత (న ర న ర.  యతి 7)

కరుణఁ జూడుమా ఘనుఁడ! మమ్మిలన్

వరశుభంబులే పరమ పావనా!

నిరతమొందనౌ నిజముగా *జగ

ద్గురు!* నుతింతు సద్గుణుఁడ! రాఘవా!


౫౧ . ఓం ఋక్షవానర సంఘాతినే నమః‌.                 

మురళి (స భ ర ర ర.  యతి ౯)       

పరమాత్మా! ననుఁ జూడవా? ప్రేమగా *ఋక్షవా

నర సంఘాత!*మనోజ్ఞ! నాపై సదా ప్రేమతో

కరుణన్ జూడుము, నాయకా! నా యెదన్ నిల్వుమా,

చరణంబుల్ కొలుతున్, నిజంబయ్యరో రాఘవా!


౫౨ . ఓం చిత్రకూటసమాశ్రయాయ నమః‌.   

మత్తకోకిల (ర స జ జ భ ర.  యతి ౧౧)

శ్రీకరుండవు జానకీపతి! *చిత్రకూటసమాశ్రయా!*

నీకు మ్రొక్కెద నీ ప్రవృత్తిని నేర్పుగా కరుణాకరా!

నాకునొప్పుగ వచ్చునట్లు, ఘనంబుగా నొనరింపుమా,

శ్రీకవీశులుశోభఁగాంచఁగఁ జేయుమా శుభ రాఘవా!


౫౩ . ఓం జయంతత్రాణవరదాయ నమః‌.     

మణిమంజరి (య భ న య జ జ గ.  యతి ౧౩)

*జయంతత్రాణవరద!* జయరామా! జయంబగు నీకు, నీ

ప్రియంబౌ సీతకును, మహిత! దేవేరితో శుభ సంహతిన్

శ్రియానేకంబులను గొలుపుచున్ వాసి జాతికి గొల్పుడీ,

నయాదుల్నాకమరఁగనుమ, భావోన్నతా! వర రాఘవా!


౫౪ . ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః‌.            

ప్రతాపావతారం  (య య ర ల గ.  యతి ౭)

పునీతా! *సుమిత్రాపుత్రసేవితా!* 

ధనాదుల్ నిజంబా? ధర్మ రక్షకా!

మనోవాంఛలేలో? మంచి చాలదా?

ప్రణామంబు నీకో భవ్య రాఘవా!


౫౫ . ఓం సర్వదేవాధిదేవాయ నమః‌.                    

నందనము (న జ భ జ ర ర. యతి 11) 

జనకజకాత్మలో నిలిచి, చక్కగాను నీ వుంటివే,

ఘనతను గాంచితే, సుజన గణ్య!*సర్వదేవాధిదే

వ!*నను కనంగ లేవుగద? భక్తిఁగల్గువాడన్ గదా,

ప్రణుతులు స్వీకరించు, వర పావనా హరీ! రాఘవా!


౫౬ . ఓం మృతవానరజీవనాయ నమః‌.  

మనోజ్ఞ (న జ జ భ ర. యతి ౧౦)

హరి! *మృతవానరజీవనా!* దురితాపహా!

నరవరుఁడా! శుభసాధనా కుశలా! ప్రశ

స్తరవిసుతేజ!ప్రశాంతతన్, వరమీయుమా,

స్మరణము చేసెద నిన్ బ్రశస్తుఁడ! రాఘవా!


౫౭ . ఓం మాయామారీచహంత్రే నమః .   

కాంచీ/వాచాలకాంచీ (మ ర భ య ర ర. యతి ౧౨)

*మాయామారీచహంతా!* కనఁగ లేమా నిన్ను సర్వేశ్వరా!

మాయామోహాదులే నన్ విడవె? రామా! నన్ను రక్షింపవా?

నీ యాజ్ఞన్ నే రచింపంగ కృతి ధన్వీ! సాధ్యమాయెన్, హరీ!

యే యాశల్ లేవయా నాకిలను తండ్రీ! కావుమా రాఘవా!


౫౮ . ఓం మహాదేవాయ నమః‌.    

       వియోగిని. 

       (౧.౩. పాదములందు స స జ గ. యతి ౬.

       ౨.౪. పాదములందు స భ ర వ. యతి ౭.)

సమయం బిక చాల దో రమే

శ! *మహాదేవ!* నిజంబుగా నినున్

ప్రముదంబునఁ బ్రార్థనన్ గనన్

రమణుండా! కృప రమ్ము, రాఘవా!


౫౯ . ఓం మహాభుజాయ నమః‌.        

ఉజ్జ్వల (న న భ ర.  యతి 8) 

పురుష వర! *మహాభుజ!* జానకీ

వరుఁడ! మహిత భావ సుధార్ణవా!

చరణకమల దర్శన మీయరా!

కరుణఁ గనర, మంగళ రాఘవా!


౬౦ . ఓం సర్వదేవస్తుతాయ నమః.                               

అంబురుహ (భ భ భ భ ర స లగ. యతి 13)

నిస్తుల! పోలరు నిన్నెవరున్ ధర నీరజాక్షుఁడ! *సర్వదే

వస్తుత!* వందనమందుమ చేసెద బ్రహ్మతేజ పరాత్పరా!

వస్తువులేలను భక్తినొసంగుము వాసవాది సురార్చితా!

ప్రస్తుతమంతయు నీవె యెఱుంగవె? వందనంబులు రాఘవా!


౬౧ . ఓం సౌమ్యాయ నమః‌.              

శ్యేని (ర జ ర లగ. యతి 7)  

జ్ఞాన రూప! భవ్య! *సౌమ్య!* రామయా!

నే నినున్ నుతింతు నిత్యశోభనా!

దీన బాంధవా! సుధీ వరాశ్రితా!

కాను శత్రువేను గాంచు రాఘవా!


౬౨ . ఓం బ్రహ్మణ్యాయ నమః‌.  

లలితము(గౌరీ) (న న మ ర. యతి 7) 

వరదుఁడవయ, * బ్రహ్మణ్యా!* రామయా!

నిరుపముఁడవు, నిన్నే నేఁ గొల్చెదన్,

కరుణఁ గనుమ గణ్యాత్మా! శ్రీధరా!

పరమొసఁగుము ప్రఖ్యాతిగా రాఘవా!


౬౩ . ఓం మునిసంస్తుతాయ నమః‌.         

శుద్ధవిరాటి (మ స జ గ. యతి 6) 

శాంతంబున్ *మునిసంస్తుతా!* సదా

పంతంబొప్పగ వర్ధిలన్, చెడున్,

దాంతంబౌనటు తాలిమిన్ హరీ

శాంతిన్ జేయుమ, జ్ఞాన రాఘవా!


౬౪ . ఓం మహాయోగినే నమః‌.  

స్రగ్విణి (ర ర ర ర. యతి 7)                            

ఓ*మహాయోగి!* నీవుండుమా నా మదిన్,

బ్రేమతో నిత్యమున్, విజ్ఞతన్ గొల్పుమా,

నామదిన్ గందు నిన్ నావిభుండంచు నేన్,

క్షేమమున్ గూర్చుమా, శ్రీధరా రాఘవా!


౬౫ . ఓం మహోదారాయ నమః‌.    

భిన్నపదము (భ భ జ గ.  యతి ౬)

శ్రీ రఘు రామ! నృహరీ! *మహో

దార!* జనస్తుత! శుభాకరా!

చేరెద నిన్ను జిత మానసా!

ధీరుఁడ! పెన్నిధివి, రాఘవా!


౬౬ . ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః‌.       

శిలీముఖోజ్జృంభితము (మ స జ న జ త గ.  యతి 13)

*సుగ్రీవేప్సితరాజ్యదా!* నుతమతి! శుభమ్ములన్ గూర్చుమా,

యగ్రాహ్యంబులు వీడఁజేయుమయ, భయదూర! సద్భక్తి న

త్యగ్రస్థానమునందు మానసమున నజస్రమున్ గొల్చెదన్,

సుగ్రీవున్ దయఁ జూచినట్లు కనుము సుభద్రుఁడా! రాఘవా!


౬౭ . ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః‌.                    

అవిరళరతికా (భ న జ ర.   యతి ౮)          

వ్యాధుల డులుపు మహాత్మ *సర్వపు

ణ్యాధికఫల!* సుగుణాలము నీవెరా,

బోధఁ గొలుపుమయ పూజ్యపాదుఁడా!

సాధనమగుమయసాధ్య రాఘవా!


౬౮ . ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః‌.             

ప్రవరవిలసితము (య మ న న త గ. యతి 10)                                      

ధనాదుల్ కోరన్ నిన్, సుఫలద! *స్మృతసర్వాఘనా

శనా!*నా మాటల్ నమ్ముమ, సుచరణ! భాస్వంతుఁడా!

మనంబందున్ నీవేను నిలుమ! శుభ సన్మార్గదా!

జనానీకంబే నిన్ గొలుచు సతతమున్, రాఘవా!


౬౯ . ఓం ఆదిపురుషాయ నమః‌. 

కవికంఠభూషణము (స జ స స స జ గ.  యతి ౯)

సరియెవ్వ *రాదిపురుషా!* నినుఁ బోలగ నో శుభంకరా!

పరమార్థమున్ గనెడి భాగ్యము! నీ కృపచే గడింపనీ,

శరణాగతుండను, ప్రశాంతిని, ముక్తిని,పొందనిమ్ము నన్,

చరణంబులన్ గొలుతు, చక్కని వాడవటంచు రాఘవా!


౭౦ . ఓం పరమపురుషాయ నమః‌.   

తురగము (న న న న స జ జ గ.  యతి ౧౫)

*పరమపురుష!* దశరథ సుత! వర భాస్కరాక్షర వంశజా!

నిరుపమమగు వరదుఁడవని, ధరణిన్ నినున్ సుజనుల్ సదా

శరణము గనఁ గొలుతురు కద, గుణసాంద్ర! కోర్కెలుతీర్చవా?

మరువకుమయ, నినుఁ గొలిచెడి నుతమాన్యులన్ గను, రాఘవా!


౭౧ . ఓం మహాపురుషాయ నమః‌. 

భూతిలకము (భ భ ర స జ జ గ. యతి ౧౨)

జానకి భార్యగ నో*మహాపురుషా!*లభించెను, గొప్పగా

ధీనిధి! కీర్తిని పొందితీవు, నుతింతు నిన్, శుభ పాలకా!

నేను ధరన్ నిను గాంచఁగానగు నీ కృపేక్షణ లేనిచో,

మౌనము వీడుము, రామయాజయమంగళాకర! రాఘవా!


౭౨ . ఓం పుణ్యోదయాయ నమః‌.   

గరుడరుతము (న జ భ జ త గ.  యతి 10)

కనుదును నీదు రూపమె ఘనుండ! *పుణ్యోదయా!*

వినెదను నీ చరిత్రమె, విశాల ముఖాబ్జుడా!

యనెదను నీదు నామమె, హరీ! యటంచున్ సదా

వినుతులు నీకె చేయుదు, వినంగ శ్రీ రాఘవా!

౭౩ . ఓం దయాసారాయ నమః‌.                  

ప్రముదితవదన (న న ర ర. యతి 8)

ధరణిజ సుతతో *దయాసార!* నీ

వరయు మధిప! మోహపాశాళి నే

తరుమఁ, బరము నొందగాచేయగాఁ,

గరుణను గను శ్రీకరా! రాఘవా! 


౭౪ . ఓం పురాణపురుషోత్తమాయ నమః‌. 

వసంతమంజరి (న భ భ న ర స వ.  యతి 13)

నెపమునెన్నక నన్నిక నిలుపు నిత్యుఁడా మహితా! *పురా

ణ పురుషోత్తమ!* నీకృపఁ గనిన నాకు ముక్తి సుసాధ్యమౌన్,

కపికుమారుని కాచిన సుజన కల్పవృక్షము నీవయా,

తపన బాపుమ, ముక్తి నొసగుమ,ధర్మ తేజమ! రాఘవా!


౭౫ . ఓం స్మితవక్త్రాయ నమః‌.           

మధుర. 

                 { (ప్రభాత)౧వ పాదమున- న జ జ ర గ. యతి ౮

                  (అపరాజిత)౨వ పాదమున- న న ర స వ. యతి ౮౯

                  (మాలిని)౩వ పాదమున- న న మ య య.యతి ౮౯

                           ౪వ పాదమున- న స జ జ  జ గ. యతి ౯ }                                                       

వరముగఁ బొందితి భద్రుడా! నినున్ నేన్

స్థిరదుఁడ! కరుణావధీ! *స్మితవక్త్ర!* దు

ష్కరమొకొ హరి! నాశ్వాసన్ వసింపంగ నీకున్?

పరమపురుషా! నతుల్, భగవంతుఁడ!  రాఘవా!

     

౭౬ . ఓం మితభాషిణే నమః‌.              

ప్రభాకలిత (న జ జ భ ర స వ. యతి ౧౩)

సురవినుతా! *మితభాషి!* నిన్నిల సుందరా కననిమ్మురా,

నిరవధికంబుగ నీదు నామమునే బఠించగ చేయుమా,

వరగుణ! జానకి పొంగు నిన్ గని, భక్తులన్ గనువాడివం

చరయుమ నన్నును నీవు ప్రేమగనచ్యుతా! వర రాఘవా!

        

౭౭ . ఓం పూర్వభాషిణే నమః‌.        

ఉపస్థిత (త జ జ గ. యతి 7) 

ధీరా! పరమావధి వీవెరా,

శూరా! ననుఁ గాంచుచు *పూర్వభా

షీ!* రామ! మదిన్ వసియించుమా,

నా రాజ! యశోధన రాఘవా!


౭౮ . ఓం రాఘవాయ నమః‌. 

భారతి/మృగి (ర)

ఔఘమా!

ఓఘమా!

మేఘమా!

*రాఘవా!*


౭౯ . ఓం అనంతగుణగంభీరాయ నమః‌. 

కవికాంత (భ భ ర న మ స జ గ. యతి ౧౩) 

కామిత దాయివిగా, *యనంత గుణ గంభీరా!* నినునాశ్రయింతురే       

లేమిని బాధలఁ జిక్కువారు, కనలేరే యన్యము నిన్ను మాత్రమే

ప్రేమను జేరుదురయ్య నీవె కని ప్రీతిన్ గావుము వారినందరిన్,

రామయ! నిన్నునుతించెదన్, శుభద! రమ్యాకారుఁడ! భవ్య రాఘవా!


౮౦ . ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః‌. 

అనవద్యా (న భ భ మ స ల గ.  యతి ౧౦)

స్తిమిత మేదిర దేవర? *ధీరోదాత్తగుణోత్తమా!*

సుమ సుపేశల దేహుఁడ! శూరాగ్రేశ! నమస్కృతుల్,

సముచితంబుగ పాఠకసంస్తుత్యాళిని కావరా!

సమధికోన్నతి నిమ్మయ! సంతోషంబుగ రాఘవా! 


౮౧ . ఓం మాయామానుషచారిత్రాయ నమః‌.  

గగనమణి (భ మ స భ ర.  యతి ౧౧)               

రాముఁడ! *మాయామానుషచారిత్ర!* మనోహరా!

నేమము తోడన్ నే తగు రీతి న్విరచించితిన్,

క్షేమము కూర్పన్ శ్రీ శతకమ్మున్ శ్రితవత్సలా!

నీ మహిమంబున్ గాంచుచు శోభాన్విత రాఘవా!


౮౨ . ఓం మహాదేవాదిపూజితాయ నమః‌.        

గలితనాలా (జ భ య ర.  యతి ౫)      

స్తుతింతు నీశుఁడ! *మహాదేవాదిపూ

జితా!* గ్రహించి, నను కాపాడంగ రా,

సతంబు ధ్యాసను నినున్ ధ్యానింతు, జీ

వితాంత మీవె మదినొప్పన్, రాఘవా!


౮౩ . ఓం సేతుకృతే నమః.

రుచిరము.    జ భ స జ గ. / యతి ౯.

శ్రితుండ, *సేతుకృత!* హరీ! మనోజ్ఞుఁడా!

నితాంతమున్ నినుఁ గననీ! సుపూజితా!

నుతింతు, సేతువయి ననున్ భవంబునే

గతింపఁ జేసెదవు ప్రగణ్య! రాఘవా!


౮౪ . ఓం జితవారాశయే నమః‌. 

వనమాలి (స భ ర లగ.  యతి 7) 

*జితవారాశి!* వసించుమా! మదిన్,

నుత కీర్తుండ! వినూతనంబుగా

స్తుతమౌ పద్యపు శోభగా నినున్

క్షితిఁ జూపించితి శ్రీద! రాఘవా!


౮౫ . ఓం సర్వతీర్థమయాయ నమః‌. 

భద్రకము.   న న ర వ. / యతి - ౭

ప్రముదమిడుమ రామ! *సర్వతీ

ర్థమయ!* కని, సుధా నిధానమా!

సుమనసుడ! వసుంధరన్, విశే

షముగ నిడుమ శాంతి, రాఘవా!


౮౬ . ఓం హరయే నమః‌.

సుకాంతి (జ గ)

*హరీ!* రమా

ధరా! పరా

త్పరుండ! వీ

వు, రాఘవా!


౮౭ . ఓం శ్యామాంగాయ నమః‌.

పథ్య (ర య జ గ. యతి 6) 

ధ్యేయ మీవె శౌరీ! గడింతు నిన్,

మాయవీడి రామా! శుభాకరా!

న్యాయ మార్గమీవయ్య! వీత మో

హా! యనంత! *శ్యామాంగ!* రాఘవా!


౮౮ . ఓం సుందరాయ నమః‌.

ప్రవహ్లిక (భ జ ర)

వందనము దివ్య *సుందరా!*

డెందముననుండుమెప్పుడున్,

కందు నెడబాపు ధీర! నా

కందుము సతంబు రాఘవా!


౮౯ . ఓం శూరాయ నమః‌.   

పంచచామరము (జ ర జ ర జ గ. యతి ౧౦)     

జయంబు నీకు సంస్తుతుండ! జానకీ మనోహరా!

ప్రియంబుతోడఁ గాంచుమా రవిప్రభాన్వితా హరీ!

నయంబుతోడ *శూర!* మాకు నవ్యదివ్య మార్గమున్

భయాపహా! కనంగఁ జేసి, భక్తినిమ్ము రాఘవా!


౯౦ . ఓం పీతవాససే నమః‌.

భుజంగసంగత (స జ ర) 

వరమీవెరా, శుభాకరా!

నిరపాయమార్గ మే సదా

కరుణించి యిమ్ము*పీతవా

స!* రమేశ్వరుండ! రాఘవ!


౯౧ . ఓం ధనుర్ధరాయ నమః‌ 

విదగ్ధకము (ర లగ)    

ఓ *ధనుర్ధరా!*

బాధ బాపరా!

శ్రీధరా! రమా

నాథ! రాఘవా!


౯౨ . ఓం సర్వయజ్ఞాధిపాయ నమః‌.  

మదన దర్పణము (భ స జ ర జ గ. యతి ౧౧)                                               

మాధవ! సురసేవితుండ! క్షేమమిచ్చు *సర్వయ

జ్ఞాధిప!* నిను నే నుతింతునే, గణించి నన్, గృపన్

బాధలువిడఁజేసి, కావుమో పరాత్పరా! హరీ!

శోధనలవి యేల? కావగా శుభాక్ష! రాఘవా!


౯౩ . ఓం యజ్వినే నమః‌.            

మణిభూషణము (ర న భ భ ర. యతి ౧౦)                                        

మంగళాంగుఁడవు! *యజ్వి!* సుమంగళ కార్యముల్

రంగుగానొనరఁ జేయు పరాత్పర! నిత్యమున్

బెంగలన్ డులిపి రక్షణ బ్రీతిగ గొల్పుచున్

మంగళంబులిడు రాజువు మాన్యుఁడ! రాఘవా!


౯౪ . ఓం జరామరణవర్జితాయ నమః‌.         

హల్లకమాలిక (న న జ స స స జ గ.  యతి ౧౨)

భయము విడువ *జరామరణవర్జిత!* చేయుము, శాశ్వతంబుగన్,

నయము కదుర వసింపగ ననంతుఁడ! చేయుము, నిశ్చితంబుగన్,

ప్రియము తలర వచింపగను, విజ్ఞత నొప్పగ భాసురంబుగన్

జయద! కృపఁగని చేయర, విశాల సునేత్రుఁడ! దివ్య రాఘవా!


౯౫ . ఓం విభీషణప్రతిష్ఠాత్రే నమః‌. 

లలిత (త భ జ ర- యతి 9)  

జ్ఞానీ! *విభీషణ ప్రతిష్ఠ!* రామయా!

జ్ఞానార్థి నిన్ దెలియు మార్గ మారయన్

నీ నామకీర్తనలనే నిరామయా!

మౌనంబుతో సలుపు, రామ రాఘవా!


౯౬ . ఓం సర్వావగుణవర్జితాయ నమః‌. 

మత్తహంసిని (జ త స జ గ. యతి ౭)

గుణాఢ్య! *సర్వావగుణవర్జితా!* హరీ!

ప్రణామమో శ్రీకర! నవాంబుజాక్షుఁడా!

గణింపుమా మామక కవిత్వ సంపదన్,

గుణంబులన్ మానకుమహాత్మ! రాఘవా!


౯౭ . ఓం పరమాత్మనే నమః‌. 

డిండిమ (జ-స-న-జ-ర.  యతి 11)

జయంబు *పరమాత్మ!* నుత విశాల నేత్రుఁడా!

జయంబు శుభసంయుత! గుణసాంద్ర! సత్ప్రభా!

జయంబగుత నీదు సతి ప్రశస్త  సీతకున్,

జయంబు ప్రియభక్తులకును, సౌమ్య! రాఘవా!


౯౮ . ఓం పరస్మైబ్రహ్మణే నమః‌. 

ఖచరప్లుతము (న భ భ మ స స వ.  యతి ౧౨)

పరమపావన నామ! *పరస్మైబ్రహ్మ!*శుభాకర! రామయా!

కరుణఁ జూపర, సన్నుతుఁడా! శ్రీకామిత దాయివి, నీవెగా,

స్థిరము నా మదికిన్ దయనిమ్మా, చిద్విభవా! కరుణామయా!

భరము కాదుర నీకిది, నా దేవా! దయఁ జూడర, రాఘవా!


౯౯ . ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః‌. 

తనుమధ్యమా (య-మ-య-న-ర-ర.  యతి 1. 8. 15)

అహం బీ నాలో నిల్చెరా! దేవ! వర *సచ్చిదానందవి

గ్రహా!* నన్నున్ గావంగ రా, నీవె యహమెన్నరా, త్రుంచరా

స్పృహన్ నీవే నాకున్ హరీ! కొల్పి, మదిలో చేరి పాపరా!

సహాయంబున్ జేయన్ వశంబై, నిలుము ధీవశా! రాఘవా!


౧౦౦ . పరస్మైజ్యోతిషే నమః‌. 

హరనర్తనము (ర స జ య భ ర.  యతి ౯)

దీన రక్షక! దేవ! ధాత్రి *పరస్మైజ్యోతి!* రమాపతీ!

జ్ఞానదుండవు, నీవు కాక పరంబున్ గొల్పగ లేరుగా,

ప్రాణమీవెగ? నన్నుఁ బ్రోవవ? సర్వజ్ఞా! నతులందుమా,

నేను వ్రాసిన పద్యపున్ గృతి నీవే చూడర, రాఘవా!


౧౦౧ . ఓం పరస్మై ధామ్నే నమః‌. 

దీపకమాల (భ మ జ గ.  యతి 7)

మాన్య! *పరస్మై ధామ!* సన్నుతుల్,

ధాన్యము, జ్ఞానంబున్, ధనాదులన్

ధన్యత గొల్పంగా దయాంబుధీ!

గణ్యతనిమ్మొప్పంగ, రాఘవా!


౧౦౨ . ఓం పరాకాశాయ నమః‌.

నందిని (స జ స ర వ.  యతి ౭)    

కరుణించు నాయక! *పరాకాశ!* మాధవా!

ధరణిపతీ ముదము గాచూడు! కేశవా

పరమీయుమీవె పరమార్థంబు  నీవెరా

వరమీవె నా కపర దైవంబ! రాఘవా!


౧౦౩ . ఓం పరాత్పరాయ నమః‌.

అభ్రక  (త భ జ జ గ / యతి ౯)

దీనాళిఁ గాచెడు సుధాబ్ధి! *పరాత్పరా!*

మా నాయకుండ! మము ప్రేమను గాంచుమా,

మా నోట నీదయిన నామము పల్కనీ,

నీ నామ మేప్రణవ మెన్నిన  రాఘవా!


౧౦౪ . ఓం పరేశాయ నమః‌.   

పద్మకము (న భ జ జ జ గ. యతి ౧౧)

వర *పరేశ!* నినుఁ జూచెడి భాగ్యము కల్గునా?

పరము పొందెడి మహాద్భుత భక్తిని యిత్తువా?

చరణ సేవలను చేసెడి సద్వరమిత్తువా?

పరమ పావన! శుభాకర! భవ్యుఁడ! రాఘవా!


౧౦౫ . ఓం పారగాయ నమః‌.   

మంజుభాషిణి (స జ స జ గ. యతి ౯) (కనకప్రభా, జయా, నందినీ,ప్రబోధితా, మనోవతీ, విలంబితా, సునందినీ, సుమంగలీ)                                               

విను *పారగా!* ధనము వెల్లువై ప్రజన్

మనునట్లుగా గనుత మంగళాంగుఁడా!

వినయంబునే గొలిపి వెల్గ జేయుమా,

నిను నేను కోరుదిదె నిత్య రాఘవా!


౧౦౬ . ఓం పారాయ నమః.

వ్రీళ (త గ) 

*పారా!* నతుల్,

నా రక్ష నీ

వేరా సదా,

శ్రీ రాఘవా!


౧౦౭ . ఓం సర్వదేవాత్మకాయ నమః‌. 

మహాలక్ష్మి(ర ర ర) 

రక్షకా! *సర్వదేవాత్మకా!*

శిక్షణన్ గొల్పుమా భక్తినే

నక్షయంబౌ విధిన్ నేర్వగన్,

అక్షరాకారుఁడా! రాఘవా!


౧౦౮ . ఓం పరస్మై నమః‌.

కలహంస (స లగ)

కరుణాక రా

క్షర! నీకగున్

*పర!* మంగళ

మ్ముర రాఘవా!

స్వస్తి

వేడుకోలు.

కం.  రామాష్టోత్తరశత మిది

భూమిన్ భవ తాప హరము పుణ్యప్రదమున్,

శ్రీమంతంబును, చదువుడు,

ధీమంతులు మూడుపూట్ల దీపిత భక్తిన్.

ఫలశ్రుతి.

కం.  నూటెనిమిది ఛందమ్ముల

నూటెనిమిది నామములకనూనసుభక్తిన్,

బాటించి వ్రాసినాడను,

ధాటిక పఠియింప పుణ్యదంబగు ధరణిన్.

అంకితము.


చింతా రామకృష్ణారావు కవి విరచిత

శ్రీరామాష్టోత్తరశత నామాంచిత అష్టోత్తరశతఛ్ఛంద

రాఘవ శతకము సంపూర్ణము.

26 – 4 – 2024 నుండి 03 – 5 – 2024.

ఏతత్ సర్వం శ్రీ రామచంద్రపరబ్రహ్మార్పణమస్తు.

 

కృతికర్త.  

చిత్రకవితాసమ్రాట్....కవికల్పభూజ....పద్యకవితాభిరామ....

చిత్రకవితా సహస్రఫణీ....పుంభావ భారతి.

చింతా రామ కృష్ణా రావు. భాషాప్రవీణ P.O.L.,  M.A., విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.

ఫ్లాట్ నెం. ఆ 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.

తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165

రచనలు.

 1) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.

 2) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో, ప్రతీపాదమునా 

      మూడు ప్రాసయతులతో ఒక్క రోజులో వ్రాసినది.)

 3) ఆంధ్రసౌందర్యలహరి.

 4) ఆంధ్రామృతమ్,  పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో అనేక 

      స్వీయ రచనలు.

 5) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.

 6) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.

 7) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

 8) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)

 9) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.

10) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.

11) బాలభావన శతకము.

12) మూకపంచశతి పద్యానువాదము.

13) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత సూక్తిశ్లోకములకు 

       తెలుఁగు పద్యానువాదము.

14) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

15) రాఘవా! శతకము.

16) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

17) రుద్రమునకు తెలుగు భావము.

18) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

19) వసంతతిలక సూర్య శతకము.

20) విజయభావన శతకము.

21) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

22) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు. 

23) శ్రీ అవధానశతపత్రశతకము.

24) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.

25) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.

26) శ్రీచక్రబంధ మంగళాష్టకము.

27) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.

28) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.

29) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత 

       నృసింహనామాంచిత118 ఛందో గర్భ చిత్ర సీసపద్య శతకము.)

30) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)

31) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.

32) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

33) శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.

34) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.

35) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. (బంధచిత్రకృతి 

       ఒకే శతకమున మూడు మకుటములతో మూడు శతకములు.) 

36) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)

37) శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క రోజులో 

       వ్రాసినది.)

38) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త శివశతకము.

39) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు, 

       సీతాన్వయముగా తేటగీతి పద్యములు, హనుమదన్వయముగా 

       ఉత్పలమాలలుతో సుందరోత్పల నక్షత్రమాల.)

40) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)

41) సువర్ణమాలా స్తుతి. శంకరుల శ్లోకములకు పద్యానువాదము

42) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో 

       అష్టోత్తర శత పాద ఉత్పలమాలిక. 

43) శ్రీరామ పట్టాభిషేకం  

44) శాంభవీ శతకము 

స్వస్తి.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.