శ్రీ షిరిడీశ దేవ శతకము
రచన:- చింతా రామ కృష్ణా రావు
పండితాభిప్రాయములు.
అభివందనం
శ్రీ షిరిడీశదేవశతకముపై సమీక్ష.
డా. ఎల్.ఎస్.యాజ్ఞవల్క్య శర్మ, M.A.; M.Phil., Ph.D.;
ప్రశాంతి నిలయం,
పాయకరావుపేట.
ఆధునికాంధ్ర వాఙ్మయం అనేక ప్రక్రియలతో శాఖోపశాఖలుగా విస్త్రుతమైనప్పటికీ శతక ప్రక్రియ మాత్రం అప్పుడూ యిప్పుడూ నవనవోన్మేషమై తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. తాను నమ్మిన దైవాన్ని గాని, వ్యక్తిని గాని, లేదా తన ఆత్మను గాని స్తుతిస్తూ స్వాభిప్రాయాన్ని నిష్కర్షగా ఆవిష్కరించే స్వేచ్ఛ శతక రచయితకుంటుంది.
ఇటీవలి కాలంలో శ్రీ చింతా రామ కృష్ణా రావు కవి వర్యుల కలం నుండి జాలువారిన" శ్రీ షిరిడీశ దేవ శతకం " ఒక ఉత్తమ రచనగా శ్రీ బులుసు వేంకటేశ్వర్లు వంటి కవి పండితులచే ప్రశంసలందుకుని ఆంధ్ర లోకాన్నిఆకట్టుకుంటోంది. భక్తి రస ప్రథానమైన యిటువంటి ఆర్షసాహితీ మరందాన్ని ఆస్వాదించే భాగ్యం ఆంధ్ర లోకానికి కలిగించినందుకు శ్రీ రామకృష్ణాగ్రజులకు కృతజ్ఞతాభివందనలు సవినయంగా తెలుపుకుంటున్నాను.
నేటి కాలంలో భారతీయుల్ని ఆకట్టుకున్న దైవం షిరిడీశుడంటే అత్యుక్తి కాదేమో. సర్వ దేవతాతీత స్వరూపునిగా ఆ స్వామి అశేష భారత ప్రజలచే నీరాజనాలందుకుంటున్న విషయం లోక విదితమే. అటువంటి సాయి తత్వాన్నిఈ కవి అష్టోత్తరశత చంపకోత్పలాలతో అర్చించి, సాయి కరుణకు పాత్రుడైనట్లు మనకు తెలుస్తుంది.
షిరిడీశ దేవునే మనం ఎందుకు కొలుస్తాం? అంటే
చ:- అనితర సాధ్యమైన మహిమాన్విత శక్తులు చూపు చుండి, మ
మ్మనువునఁ బ్రోతు వీవు. పరమాత్ముఁడ వంచు భజింతు మేము. ని
న్ననయముఁ గొల్చు చుండి, సుగుణాకర చిత్తులమై మెలంగఁ జే
య, నిను మదిం దలంతుము. మహాద్భుత! శ్రీ షిరిడీశ దేవరా! 7.
అని తన ఆర్తిని మహాద్భుత శక్తి కలిగిన స్వామికి నివేదించారు కవి.
అలాగే ఈ క్రింది పద్యంలో భగవంతుడు సర్వాంతర్యామి అని చక్కగా వివరిస్తూ ఇలా అంటారు.
ఉ:- కొందరు భక్త కోటి నిను కోవెల లోపలఁ గాంచు చుండ నిం
కొందరు సన్నుతాత్ములకు గుండెలలో కలవంచు గాంతు రిం
కొందరు దీను లందు కడు కూర్మిని నిన్ గని పొంగు చుండు. ని
న్నందరి లోన గాంచుటయె న్యాయము. శ్రీ షిరిడీశ దేవరా! 22.
స్త్రీవాద కవిత్వంలో స్త్రీ జనోద్ధరణకు పాటుపడ్డ కవులలో వీరు కూడా అగ్రగణ్యులు. ఈ శతకంలో అనేక పద్యాలు కాలానుగుణంగా స్త్రీల పట్ల జరిగే అన్యాయాలు అకృత్యాలు స్పష్టపరుస్తున్నాయి. సమస్యా పరిష్కారం కోసం కవి తన ఆవేదనను సాయికి నివేదించడం ఈ పద్యాల్లో మనం చూస్తాం. ఇందుకో ఉదాహరణ పద్యం చూడండి.
చ:- మగువలఁ గాంచి, మూర్ఖత నమానుష హింసల నేచు మూర్ఖులన్
భగ భగ మండు యగ్నిశిఖ పాలొనరింపు ముపేక్ష యేల? యీ
మగువలఁ గావకున్న వర మాతృ జనంబిక మృగ్య మౌను. నీ
తెగువనుఁ జూపి, బ్రోవుమయ తీరుగ! శ్రీ షిరిడీశ దేవరా! 60.
అనాదిగా స్త్రీకి ఓ ప్రత్యేక ప్రతిపత్తి గల్గిన యీ దేశంలో మహిళలకు జరుగుచున్న అన్యాయాలను ప్రతిబింబింపఁ జేసిన పద్యాలు చదివితే సహృదయ పాఠకుల మనసుల్ని కలిచివేస్తాయనడంలో సందేహం లేదు.
సామాజిక స్ఫృహ గలిగిన కవిత్వం వీరిది అనడానికి ఈ పద్యం ఒక్కటి చాలు.
ఉ:- హైందవ భావ ప్రేరణము నాత్మల ముస్లిము లొందఁ జేసి, యీ
హైందవ జాతి ముస్లిముల యద్భుత ప్రేరణ మొందఁ జేసి, జై
హిందను భారతీయులుగ హిందువు ముస్లిము లిద్దరొక్కటై
పొందిక నుండఁ జేసితివి పూజ్యుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 73.
ఇంకా
ఏది సతం బనిత్యమన నేది?......
నమ్మిన వారి చిత్తమున........
లోకమనంతమయ్య........
వృక్షములాదిదేవతలు........
గుమ్మడిపండు చందమున........
వంటి అనేక నానుడులు, పోలికలు, సందర్భోచితంగా వివరించి కవి తన లోకజ్ఞతను చాటుకున్నారు.
తన తల్లిదండ్రులను, గురువులను స్మరిస్తూ వ్రాసిన పద్యాలు కవికి వారిపట్ల గల అనన్య సామాన్య భక్తికి నిదర్శనాలు.
ఉ:- కాణ్వ విరాజ నామమునఁ గ్రాలెడు సత్ శుభ శాఖజుండ. చిం
తాన్వయ సంభవుండ. చరితార్థుడ నీ ధర. రామ కృష్ణుడన్.
నిన్ వినుతించి, మ్రొక్కి, మది నిన్ గని, " శ్రీ షిరిడీశ దేవ " పే
రన్ విరచించి తీ శతక రాజము. శ్రీ షిరిడీశ దేవరా! 101.
అని కాణ్వ శాఖపై తనకు గల అభిమానాన్ని వ్యక్తీకరించడం అభినందనీయం.
ఉభయ భాషా ప్రవీణులు, నిరంతర రామాయణ పఠనా శీలురు, మహర్నటులు అయిన శ్రీమాన్ కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల పట్ల తనకు గల గురు భక్తిని ఈ పద్యంలో ఇలా చాటారు.
ఉ:- ఆర్యులు. కల్వపూడి వినయన్విత వేంకట వీర రాఘవా
చార్యుల పాద ధూళి విలసన్నుత జ్ఞాన ప్రబుద్ధిఁ గొల్పగా
వీర్యుడ! నీ కృపామృతము బ్రీతిగ నీ శతకంబు లోన నే
నార్యులు మెచ్చ వ్రాసితిని హాయిగ. శ్రీ షిరిడీశ దేవరా! 103.
ఆచార్య దేవోభవ అన్న దానిని సత్యం చేశారు శ్రీ రామ కృష్ణగారు.
కీ.శే. ముత్యం రామమూర్తి కవి పండితుల కోర్కెకు ప్రతీకగా ఈ శతక రచన గావించినట్లు మనకనిపిస్తుంది. వీరిద్దరి సంబంధం అటువంటిది. ఇలాంటి ఇద్దరు ఉద్దండ కవి పండితులు లభించడం " చోదవరం " ప్రజలు చేసుకున్నపూర్వ పుణ్యఫలం.
షిరిడీశునిపై తనకు గల అపార భక్తికి ఈ ఒక్క పద్యం " కలికి తురాయి ".
ఉ:- నీ దరహాస చంద్రికలు నిత్యముఁ గ్రోల చకోరమౌదునా?
నీ దరి కాంతులీను మహనీయ సముజ్వల జ్యోతినౌదునా?
నీ దరిఁ జేరు భక్తుల పునీతపు పాద రజంబునౌదునా?
నీ దరి కెట్లు జేర్చెదవొ? నిత్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 90.
అని తన వినమ్రతను తెలుపుకున్నారు.
ఈ శతకం చదివిన పాఠక లోకానికి అన్నీ శుభాలే జరుగుతాయని నా ప్రగాఢ విశ్వాసం.
జగమెఱిగిన యీ కవి పుంగవులు ఇంతటితో ఆగకుండ, మరిన్ని తెలుగు రచనలు వెలువరించి, పాఠక లోకాన్నిఆనందింపఁ జేస్తారని తలుద్దాం. ఆ షిరిడీశుడు శ్రీ చింతా రామ కృష్ణా రావు గారికి ఆయురారోగ్యాలు సదా యిస్తూ, ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను.
ఇక సెలవు.
భవదీయ,
డా. ఎల్.ఎస్.యాజ్ఞవల్క్య శర్మ.
తే. 02 - 03 - 2009.
శ్రీ షిరిడీశ దేవ శతకము. కవితాబినందనం.
కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు,
తెలుగు సాహిత్యంలో శతక రచన అగ్ర స్థానం పొంది యున్నది. కవులు తమ అనుభవాల్ని -ఆశల్ని - ఆర్తితో - ఆనందంతో చెప్పుకొనడానికి చక్కని వీలుంది శతక రచన లోనే! లౌకిక అలౌకిక భావాలు ప్రక్క ప్రక్కనే చెప్పుకోడానికి ఒక్క శతక ప్రక్రియలోనే అవకాశం కలుగుతుంది.
పూర్వం అంటే ఇప్పటికి ముప్ఫై నలభై ఏళ్ళ క్రితం పల్లెల్లో సాధారణ రైతులు కూడా సమయోచితంగా శతక పద్యాల్ని తమ సంభాషణల్లో ఉదహరిస్తూ మాటలాడేవారు. అలాగే అప్పటి గృహ లక్ష్ములు కూడా చక్కని తెలుగులో జాతీయాల సౌరభాలు గుబాళించే లాగ మాటలాడే వారు. ఇప్పటి తరం పిల్లలకి అనివార్యంగా సంకర తెలుగు మాటలాడే దౌర్భాగ్యం వచ్చింది. సాధారణంగా ఏ ఉద్యమమైనా ప్రజలనుంచి వస్తేనే అది కార్య రూపం ధరిస్తుంది. కొందరు విద్యావంతుల ఆశల్ని ముందుగా పసిగట్టి రాజకీయ నాయకులు వారిని సంతృప్తి పరచడం కోసం ఆయా విషయాల్ని ఉద్యమాలుగా ప్రచారం చేస్తారు. దానితో అది రాజకీయ అజెండాలో చేరి ఒక పార్టీ ప్రణాళికలో అంశంగా చేరిపోతుంది. అంతే ఇంక అది ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్నట్లు తయారు అవుతుంది. పది మందిలో పాము చావదు అన్నట్లు
కాలంలో బడి నలుగుతూ ఉంటుంది. ప్రస్తుతం తెలుగు భాష ఔజ్వల్యం అలాగే తయారయింది. అందుకనే మాతృ భాషలో విద్యా బోధన అనే విప్లవం ప్రజల్లోంచి రావాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశ పెట్టినప్పుడు ప్రజల్లోంచి తగినంత స్పందన రాలేదు.ఈ నేపథ్యం అంతా ఎందుకంటే ప్రస్తుతం అధునిక కవులు కూడా శతకాలు వ్రాస్తున్నారు. శతక ప్రక్రియ వెనక బడ లేదు. కొంచెం తన ప్రణాళీకను మార్పు చేసుకొని, అనేకానేక అంశాలు స్పృశిస్తూ ముందుకు సాగుతోంది. భక్తి శతకమే అయినా అనివార్యంగా సమాజం లోని అనేక కోణాల్ని చూపుతోంది ఈనాటి శతకం. శ్రీ షిరిడీశ దేవరా! అన్న మకుటంతో 108పద్యాల్లో సాగిన ఈ శతకం మిత్రులు శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు రచించారు.వీరు తెలుగు అధ్యాపకునిగా పని చేసారు. సాహిత్య మిత్రులు. ఆంధ్ర, ఆంగ్ల సాహిత్యాలను ఆపోశన పట్టిన పండితులు. సమాజాన్ని నిశితంగా పరిశీలించే హృదయం కలవారు. దీనులయెడ సహానుభూతి కలిగిన ఉత్తమ సంస్కారవంతులు. అందుకే ఈ శతకం నిండా సమాజం లోని చీకటి కోణాల నుండి అనేకానేక అసమంజస
విషయాలపై కవి తీర్పు లుంటాయి. వేదన లుంటాయి. ఆశావహ దృక్పథంతో కూడిన సందేశాలుంటాయి. ఏతావాతా శ్రీ చింతా రామ కృష్ణా రావు గారి ఈ శతకం భక్తితో పాటు లోకజ్ఞతను కూడ పంచి పెడుతుంది పాఠకులకు. పద్య నిర్మాణంలో కూడా ఈ కవి చాలా సిద్ధ హస్తులు. పద్యం గోదావరిలా సాగి పోతుంది. భావ కూలంకషయై మనల్ని నివ్వెఱ పరుస్తుంది. అభ్యుదయ భావాలు, దేశ భక్తి ప్రపూర్ణమైన భావనలూ ఈ శతకంలో దర్శనమిస్తాయి.
యువ తరాన్ని ఎంతగా శ్లాఘించారో ఈ కవి.
ఉ:- భారత మాత రక్షణము, భవ్య మహోజ్వల భావిఁ గొల్పగా,
ధీరులు, సజ్జనావళి విధేయులు, మా యువ భారతీయులే
కారణ భూతులయ్య. కలి కల్మష దూరులఁ జేయుమయ్య. నీ
వారికి శక్తి నీయుమయ భవ్యుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 47.
యువతకు దేశ భక్తి - రక్షణా శక్తి - యీయుమని సాయిని ప్రార్థించడం హర్షణీయం.
అలాగే స్త్రీలను వేధించే వారిని వీరు చాలా గర్హించారు.
"అద్వైతం సుఖ దుఃఖయోః" అంటూ దాంపత్య బంధాన్ని ఎంత గొప్పగా భవభూతి చెప్పాడో. అట్టి దాంపత్య బంధాల్ని తృణీకరించే "పురుష పుంగవుల్ని" వీరు చాలా సూటిగా, కరుకుగా విమర్శించారు. "
కన్నులఁ బెట్టి కావుమయ! కాంతల" నంటూ సాయి దైవాన్ని ప్రార్థిస్తారు. చాలా పద్యాల్లో వీరి
సంస్కార హృదయం దర్శనమిస్తోంది. చక్కని పోలికలు కూడా కనిపిస్తాయి.
" శరీరము గుమ్మడి పండులా గుట్టుగా కుళ్ళి నశిస్తుంది" అని అంతారు. ఎంత మంచి పోలిక!
గుమ్మడి పండు కంటికి బాగానే కనిపిస్తున్నట్లుంటుంది. కాని లోపల కుళ్ళిన సంగతి మనకు తెలియదు దానిని తాకేదాకా!
ఉ:- నీ దరి చేరువాఁడనయ! నీ శతకంబుఁ బఠించు వాఁడ. స
మ్మోదము తోడఁ గాంచుమయ! మూలము నీవయి కావుమయ్య! యా
వేదనఁ బాపుమయ్య! సమ దృష్టి నొసంగి రహింపఁ జేయుమా!
మేదిని పైన నన్ గనుమ మేలుగ. శ్రీ షిరిడీశ దేవరా! 98.
పద్యం వీరి భక్తి, మోక్షము యెడల వీరికి గల కాంక్ష, సాయిపై గల ప్రేమనూ ప్రత్యక్షరం ప్రత్యక్షం చేస్తున్నది. ఇలా శతక మంతా ఉదహరించ వలసి వస్తుంది మంచి మంచి పద్యాల కోసం. పాఠకులుగా మీరు శతకంలోఎలాగూ ప్రవేశిస్తారు. కాబట్టి ఈ ముందు మాటను ముగిస్తున్నాను.
శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు తమ చిక్కని, చక్కని భావాల్ని పద్య రూపంగా మలచి, శిరీష కుసుమ పేశలంగా సాయి శతకంగా రచించి, ఆ దేవ దేవునకు సమర్పించి, మనకు
చక్కని మాధుర్య కవిత్వ ప్రసాదం పెట్టారు. ఈ శతకాన్ని కన్నుల కద్దుకొని ఆస్వాదించ వచ్చును. మిత్రులు శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు ఇతోధికంగా సాహిత్య సేవ చేస్తూ - పరిణతి చెందిన తమ కవితాధోరణిని మంచి కావ్యాలు రచించాలని, మనసారా ఆకాంక్షిస్తూ -
అభినందిస్తున్నాను.
బులుసు వేంకటేశ్వర్లు,
కల్ప వృక్షం,
చిట్టివలస.
శ్రీ షిరిడీశదేవ శతకము
రచన:- చింతా రామ కృష్ణా రావు
అంకితము
ముత్యము రామ మూర్తికి, ప్రపూజ్య చరిత్రునకున్, పవిత్రులన్
నిత్యము గౌరవించి, మహనీయతఁ గొల్పిన స్థుత్య మూర్తికిన్,
సత్య జగంబునం వెలుఁగఁ జక్కగ నంకితమిత్తునయ్య! యీ
స్తుత్యతనొప్పు గ్రంథమును శోభిల శ్రీ షిరిడీశ దేవరా!
శ్రీ షిరిడీశదేవ శతకము
రచన:- చింతా రామ కృష్ణా రావు
ఉ:- శ్రీద! విరూప! భాగ్యదుఁడ! చెన్నుగ నా మనమందు నిల్చి, స
మ్మోదము నాపయిన్ నిలిపి, ముక్తిని గొల్పి, తమో గుణాదులన్
నాదరిఁ బాయఁ జేయుమయ. నాధుఁడ! నిన్ గని ప్రస్తుతించెదన్.
నీ దరిఁ జేర్చి కావుమయ! నిత్యుఁడ! శ్రీ షీరిడీశ దేవరా! 1.
ఉ:- సుందర సత్ ప్రబంధముగ సూనృత! నీ మహిమాదికంబు సద్
బంధుర సత్ పదంబులను పన్నుగ గైకొని, వ్రాయఁ గోరి, మున్
ముందుగ నీపయిన్ శతకమున్ భువి వ్రాయగఁ బూనితయ్య! ఇ
బ్బందులు పారఁ ద్రోలి, నిలు ప్రాపుగ. శ్రీ షిరిడీశ దేవరా! 2.
చ:- ప్రమద గణాభిసేవితము పావన శ్రీ షిరిడీ పురంబు. స
ద్విమల యశో విరాజితము, విస్తృత సత్కృతికాకరంబు, మా
భ్రమలను రూపు మాపి, గురు పాద యుగంబునుఁ గొల్వఁ జూపి, నే
రములను సేయనీయదయ !, నిత్యుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 3.
ఉ:- శ్రీ సమ! సాయి నాధ! గుణ శేఖర! శ్రీ షిరిడీ నివాస! నీ
ధ్యాస యొకింత కల్గి, పర తత్వము గాంచి, భజించు వారికిన్
మోసములంటనీయవుగ! ముక్తిని గొల్పి రహింపఁ జేతువే!
నీ సరి దైవమేడి? మహనీయుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 4.
ఉ:- కన్నుల నిచ్చినావు నినుఁ గన్గొను భాగ్యమునీయనెంచి, మా
కన్నులవేమి జూచు? కళ కాంతులఁ గోల్పడు భౌతికమ్ములన్.
పన్నుగ నీదు రూపమును ప్రస్ఫుటమొప్పగఁ జూడగా వలెన్
కన్నులు గల్గు భాగ్యమది కాదొకొ? శ్రీ షిరిడీశ దేవరా ! 5.
చ:- అతులిత పాప పంకిలము లంటగ, నెన్నగ రాని బాధలన్,
మతి చెడి దుష్ట చింతన లమానుష దుష్కృతిఁ జేయఁ జేయ, దు
ర్మతులగు లోక నిందితులు రక్షణఁ గోరుచు నిన్నఁ జేఱ సం
తతమును బ్రోచు చుందువయ, దక్షుఁడ ! శ్రీ షిరిడీశ దేవరా! 6.
చ:- అనితర సాధ్యమైన మహిమాన్విత శక్తులు చూపు చుండి, మ
మ్మనువునఁ బ్రోతు వీవు. పరమాత్ముఁడ వంచు భజింతు మేము. ని
న్ననయముఁ గొల్చు చుండి, సుగుణాకర చిత్తులమై మెలంగఁ జే
య, నిను మదిం దలంతుము. మహాద్భుత! శ్రీ షిరిడీశ దేవరా! 7.
ఉ:- మోసము చేయుటే పనిగ మూర్ఖులు కొందఱు చేయు చుండ, నా
మోస మెఱుంగ లేమి, మది ముమ్మొన వాలు విధంబు నాటఁగా,
గాసిలి, వారు నిన్ను మదిఁ గాంచిన తోడనె బ్రోతువయ్య! నీ
ధ్యాసయె రక్షగా నిలుచు ధాత్రిని. శ్రీ షిరిడీశ దేవరా! 8.
చ:- మలినపు కావి వస్త్రమును మచ్చునకై తమ మేనఁ దాల్చి, నీ
సులలిత సుందరాకృతిని జూపుచు నిల్తురు కొందఱత్తరిన్
పలుమఱు నీవె యౌదువని, భక్తిని సేవలు చేయు భక్తులన్
తెలివిని గొల్పి కావుమయ! తీరుగ. శ్రీ షిరిడీశ దేవరా! 9.
ఉ:- ఎంతటి రోగమున్న, మనమేగతిఁ జింతలఁ సోలుచున్న, ర
వ్వంత విభూతి నీ ధునిది హాయిగ దాల్చినఁ జాలు మేన, మా
వంతలు బాపి, ప్రోచునయ వర్ధిలఁ జేయుచు, నట్టి భూతి ధ
న్వంతరి కీవొసంగితివొ? పావన! శ్రీ షిరిడీశ దేవరా! 10.
చ:- పదిలము తోడ నా షిరిడి వాసముఁ జేయుచు నుండకుండ, మా
మదులను దేవళమ్ములుగ మన్ననఁ జేయుచు నుంటివీవు. నీ
హృదయము మా పయిన్ నిలిపి, ప్రీతిగ నిత్యము రక్ష సేయ గో
రెదవుగ! మమ్ము. నీ కృప గరీయము. శ్రీ షిరిడీశ దేవరా! 11.
ఉ:- మానవ మూర్తిగా వెలసి మమ్ముల బ్రోచెడు కన్న తండ్రి! నీ
జ్ఞానము వేద సారమయ! జాగృతమై నినుఁ గాంచఁ జేయ, న
జ్ఞానము రూపు మాపి, విలసన్నుత చేష్టలు మాకుఁ జూపి, నీ
జాణ తనంబుఁ జూపెదవు చక్కగ. శ్రీ షిరిడీశ దేవరా ! 12.
చ:- అఖిల జగంబులోన పరమాప్తుఁడ వీవని గాంచ లేక, నే
సఖులుగ నెంచి నాడ విలసన్నుత మూర్తుల, సన్నుతాత్ములన్.
నిఖిలము నీవె కాగ మరి నీవని, వారని భేద మేమి? నీ
వఖిలమునై రహింపఁ గల వాత్మల. శ్రీ షిరిడీశ దేవరా! 13.
ఉ:- ప్రాణము లుండు దాక మము వర్ధిలఁ జేయుచు బ్రోతువయ్య! మా
ప్రాణము పోవు నాఁడు మము పాప ఫలంబులు వెంట నంటు నీ
ప్రాణ ప్రయాణ వేళ నినుఁ బాయక చిత్తము లోనఁ జేర్చు సు
జ్ఞాన పథంబుఁ జేర్చుమయ! సన్నుత! శ్రీ షిరిడీశ దేవరా! 14.
ఉ:- భోగము, భాగ్యమున్ గొలిపి, పొందగ చేసిన నాఁడు నేను నా
యోగము నీవె యంచు, కడు యోగ్యుఁడ వంచు, నుతింతునయ్య ! దు
ర్యోగము వెంబడింపఁగ నయోగ్యుఁడ వీవని నింద సేతు. స
ద్యోగ మొసంగి గొల్పుమయ యోగ్యత! శ్రీ షిరిడీశ దేవరా! 15.
చ:- వరములనిచ్చుటందు నల బ్రహ్మకు, భక్తుల కల్ప వల్లి యా
హరునకు సాటి లేరనుచు నందురు కొందరు. నిన్నుఁ గూర్చి వా
రెరఁగుడు చేసి, కాంచి, కలరీయిల సాయి, నిజంబు, కోరినన్
వరముల నిచ్చు నండ్రు. తమ భక్తులు. శ్రీ షిరిడీశ దేవరా! 16.
చ:- కరుణ రసాల మంచు, వర కామిత సత్ ఫలదుండటంచు, నిన్
మరిమరి పల్కుచుండ మహి మాన్యుడ! నీ కృపఁ గన్న భక్తులా
హరియును, బ్రహ్మ, రుద్రుడు నయాచిత సత్ ఫల దాయి సాయిగా
స్థిరముగఁ బుట్టె నండ్రు కద. దివ్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 17.
ఉ:- ఆదియు మధ్యయున్ మఱియు నంతము లెన్నగ లేవు నీకు, మే
మేదియు దారి లేక పరమేశ్వర! నిన్ మదిఁ గొల్చినంతనే
నీదగు చిత్ స్వరూపమును నీటుగ మా మది లోన నిల్పి, స
మ్మోదముఁ గూర్చు నట్టి గురు మూర్తివి. శ్రీ షిరిడీశ దేవరా! 18.
ఉ:- అందరి దైవ మొక్కడని, యద్భుత బోధనఁ జేతు వీవు.నీ
కందువుగా గణించి, నను కన్నులలో నిడి, కాచు చుండి, నీ
సుందర చిత్ స్వరూపమును జూపుచు, దోష మడంచుచుండి, యా
నందపు వెల్లువై నిలుమ నాయెడ. శ్రీ షిరిడీశ దేవరా! 19.
చ:- హృదయము నీపయిన్ నిలిపి, యీప్సిత మొప్పగ నుండ వాంఛ నా
మదిని వసింపఁ జేసి నిను. మాయలఁ గూర్చుచు దుష్ట చింతనల్
పదిలములౌచు నామదిని, పావను నిన్ మదిఁ వీడఁ జేయు. నా
మదిని వసించి, దౌష్ట్యములు మాపుము. శ్రీ షిరిడీశ దేవరా! 20.
కా:- పరమ దయానిధీ! పతిత పావన! భక్త మనోజ్ఞ రూప! మ
మ్మరమర లేక కాచెదవు హాయిగ. నీకృప నెన్న నౌనె? నిన్
పరిపరి మా మదిన్ దలచి, భవ్య మనస్కుల మౌదుమన్న, సు
స్థిరముగ నుండదీ మనసు తృప్తిగ. శ్రీ షిరిడీశ దేవరా! 21.
ఉ:- కొందరు భక్త కోటి నిను కోవెల లోపలఁ గాంచు చుండ నిం
కొందరు సన్నుతాత్ములకు గుండెలలో కలవంచు గాంతు రిం
కొందరు దీను లందు కడు కూర్మిని నిన్ గని పొంగు చుండు. ని
న్నందరి లోన గాంచుటయె న్యాయము. శ్రీ షిరిడీశ దేవరా! 22.
ఉ:- ధర్మము బోధ చేయుట, స్వ ధర్మమునే పచరించుచుంట, యే
మర్మము లేక వర్తిలుట, మంచిగ నుండుట, నేర్చినాము. దు
ష్కర్ములు మాయ వర్తనల సైచుట బాధగ నుండె. నేది సత్
త్కర్మయొ? దుష్టమో? తెలిపి, కావుము. శ్రీ షిరిడీశ దేవరా! 23.
ఉ:- మాటల ముత్యముల్ సుజన మార్గములన్ విరచించెనయ్య. నీ
మాటలె వేద వాక్యముగ, మానవ జాతి గ్రహించె నయ్య. నీ
సాటి కృపాబ్ధి లేడనుచు సన్నుతి చేయుచు నుందురయ్య! నీ
వేటికిఁ జూడ రావయ! మునీశ్వర? శ్రీ షిరిడీశ దేవరా! 24.
ఉ:- ఎంతటి వస్తువైననగు, నెచ్చటనైనను పోయెనేని, మా
వంతను నీకుఁ దెల్ప, గ్రహ పాటును మార్చి, యొసంగెదీవు. నీ
చెంతనె చిత్తముంచి, సహ జీవనమున్ ప్రభ గాంచు భక్తులన్
వింతగ బ్రోచుచుండెదవు వేగమె. శ్రీ షిరిడీశ దేవరా! 25.
ఉ:- శ్రీ శుభ దాయి సాయి. మన క్షేమముఁ గాంచుచునుండు సాయి. యా
వేశముఁ బాపు సాయి. సుమ పేశల మానసమిచ్చు సాయి. మా
యాశలు తీర్చు సాయి. సుమహార్ణవ జీవన మీదఁ జేయు లో
కేశుఁడె సాయి యండ్రు నిను నీశ్వర. శ్రీ షిరిడీశ దేవరా! 26.
చ:- గురువన సాయి యొక్కఁడగు. కూర్మిని బోధలు సేయు సాయి సద్
గురువు, నిజంబు. కూటికిని గుడ్డకు జీవన మార్గ మెన్ని, సద్
గురువుల మంచు, బోధనలు కోరుచుఁ జేయు గురున్ గురుండనన్
కరరుహమున్ ఘనంబనుట కాదొకొ? శ్రీ షిరిడీశ దేవరా! 27.
ఉ:- బాల్యము నందు నిన్ గొలుచు భాగ్యము శూన్యము జ్ఞాన హీనతన్.
బాల్యము దాటి పోవు తఱిఁ బాశవికత్వము క్రమ్ము మమ్ము. సౌ
శీల్యము నీ వొసంగిన సు శీలురమై నినుఁ జేరఁ గల్గు. దౌ
ర్బల్యముఁ బాపి, ప్రోవుమయ! రక్షక! శ్రీ షిరిడీశ దేవరా! 28.
ఉ:- భౌతిక మైన వాంఛ లెడఁ బాయక, నామది నిండె నయ్య! సం
ప్రీతిని పొంద దీ మనసు పేలవ చిత్త ప్రవృత్తిఁ గల్గి, య
జ్ఞాత భవాంధకారమును కానఁగ నేర దదెంత చిత్రమో!
ఏ తఱి నన్నుఁ గాచెదవొ? యీశ్వర! శ్రీ షిరిడీశ దేవరా! 29.
ఉ:- నిశ్చల భక్తి భావమున నిన్ను భజింపగ వేడుకొంటి. నీ
నిశ్చయ మేమిటో యెఱుగ. నిర్దయతో పలు దుష్ట చింతనల్
దుశ్చరితంబుఁ గొల్పి, నను దుష్టుగఁ జేసితి వీవ. యింక నా
నిశ్చిత భావ మిచ్చి, నిలు నీడగ. శ్రీ షిరిడీశ దేవరా! 30.
చ:- వెలయగఁ జేసినావు భువి వేలకు వేలుగ జీవ కోటి . కో
వెలగ మనంబులన్ గొలిపి ప్రీతిగ మానవులందె నీవు, నీ
తలపులె రూపు కాగ కడు తాల్మి వసింతు వదెంత భాగ్యమో!
తలపుల వీఁడఁ జేయకుమ! దక్షుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 31.
చ:- వర గుణ ధామ! యో పరమ పావన! భక్త శరణ్య! నీ కృపన్
వరముగ నొందినట్టి గుణ వర్యులు ధన్యులు. పాప కర్మముల్
దరి కిక చేర రావు. వర దాయివి. శ్రీ షిరిడీ నివాస! మ
మ్మరయుచు నుండుమయ్య! పరమాద్భుత! శ్రీ షిరిడీశ దేవరా! 32.
ఉ:- బాల్యమునందు సద్ గురుని ప్రాపు లభింప నమోఘమైన సౌ
శీల్య సుధా ఫలంబు ప్రవచింతురు. నిక్కము. నేటి బాలకుల్
బాల్యము నుండి బాధలను, పాపపు కర్మములన్ గ్రహింతు రీ
బాల్యము నందు నీవె కన బాగగు! శ్రీ షిరిడీశ దేవరా! 33.
ఉ:- శీల మహత్వమున్ దెలిపి క్షేమముఁ గూర్చెడి సద్గుణాన్వితుల్
మూలము లార్య సంస్కృతి సమూలముగా వివరించి నేర్పు. దు
శ్శీలు రదెట్లు నేర్పు? శుభ శీలము, జీవము, నీవె కాదె? సత్
శీల సమృద్ధి నిచ్చి , దరి చేర్చుమ! శ్రీ షిరిడీశ దేవరా! 34.
చ:- ధనముఁ గడింప వచ్చు. పర తత్వ ధనంబు గడింప లేము. సా
ధనమున సాధ్యమౌను. వర దాయివి నిన్ను స్మరించు నాడు ని
ర్ధనుఁడు ధనుండు. నీ స్మరణ తప్పిన నాడగు నిర్ధనుండు. మా
ధనమది నీదు సత్ కృప. యథార్థము. శ్రీ షిరిడీశ దేవరా! 35.
ఉ:- మానవ జన్మ మెత్తి, యసమాన సుదుర్లభ శక్తి యుక్తులన్
జ్ఞాన సమృద్ధి, భక్తి, పరికల్పిత దైవ బలంబుఁ గల్గి, య
జ్ఞానపు చీకటుల్ తనను క్రమ్మగ నేమియుఁ జేయ లేక, నిన్
దీనత రక్ష వేడు. కను దీనుల. శ్రీ షిరిడీశ దేవరా! 36.
చ:- శుభ కర సత్ స్వరూపమును చూడగ నెంచి, రచించినావు నీ
విభవముతో శుభాకృతిగ విశ్వము. సర్వము నీవ. కాని, దుష్
ప్రభవ మెలర్చె. దౌష్ట్యములు రాజిలె. దౌష్ట్యము నుండి కావుమా.
ఉభయులకున్ శుభంబది. సముజ్వల! శ్రీ షిరిడీశ దేవరా! 37.
ఉ:- భార వహుండు సాయి యని భావనఁ జేయుచు నెల్ల వేళ మా
భారము సాయి నాధునిది, పన్నుగఁ గాచు నటంచు, నమ్మినన్
కోరక మున్నె తీర్తువట కోర్కెలు. నీ పద పంకజంబులన్
తీరుగ మా మదిన్ నిలిపి, తేల్చుమ! శ్రీ షిరిడీశ దేవరా! 38.
చ:- సుఖము సుఖమ్ము లంచు మనుజుల్ దరిఁ గానక స్రుక్కు. నీదు స
మ్ముఖమున నిల్చి, నిన్ను వరముల్ కరుణించి యొసంగుమండ్రు. యే
మఖములఁ జేయ నేల? నిను మా మది నిల్పినఁ జాలదొక్కొ? యీ
నిఖిలము నందు సౌఖ్యమది నీ కృప! శ్రీ షిరిడీశ దేవరా! 39.
ఉ:- జ్ఞాన మొసంగి మాకు కరుణాది గుణంబుల నిచ్చినాడవే!
మానము మంటలోఁ గలుపు మాయని దుర్గుణ మేల యిచ్చితో!
ప్రాణము లుండు దాక నినుఁ బాయని భక్తి ప్రపత్తులిమ్ము. య
జ్ఞాన విరుద్ధ మార్గ మిడి కావుమ! శ్రీ షిరిడీశ దేవరా! 40.
ఉ:- స్త్రీల స్వభావ సిద్ధమగు శీల మహా ధన రక్షణంబు నే
డేల నశించి పోయె? కనవేల మదోన్మద దుష్ప్రవర్తనల్?
శీలము చేలమున్ మహిళ సిగ్గును వీడి త్యజించుటేలనో?
శీలముఁగొల్పి కావుమయ స్త్రీలను. శ్రీ షిరిడీశ దేవరా! 41.
చ:- యువకులు కొందరీ భువిని యుక్తి కుయుక్తుల బుద్ధి నేర్పునన్
భవితను భారతావనికి పన్నుగ నాశన మొందఁ జేయఁ గా,
నవిరళ దుష్ట చేష్టలను హాయిగఁ జేయుచు నుండ్రి. , చూచితే?
భువి కిక రక్ష నీవె కద! పూజ్యుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 42.
ఉ:- మంచిది చూచి మానవులు మంగళ కార్యము లాచరింతురే!
సంచిత పాప కర్మ ఫల సంపదలే వెను వెంట నుండ నీ
మంచిది మంచిఁ జేయునె? సమంచిత చిత్తులు నిన్నె మంచిగా
నెంచుచు మంగళంబుఁ గన నెంచరె? శ్రీ షిరిడీశ దేవరా! 43.
ఉ:- ఏది సతం బనిత్య మన నేది? నిజంబన నేది? కానగా
నేది యబద్ధమౌను? కన నేది గుణం బగునయ్య? నిర్గుణం
బేది? ప్రకాశ మేది? వల పేది? కనుంగొన నిక్కమేది? యీ
పేదకు నీవె చూపుమయ వేద్యుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 44.
ఉ:- ఎందుకు మంచి మార్గముల నెంపికతో రచియింపకుండ, మా
ముందున చెడ్డ మార్గములు ముచ్చటతో రచియించినాడ, వి
బ్బందులు గొల్పి, నిన్ గొలువ, వర్ధిలఁ జేయఁ దలంచినావొ? యా
నందమె యెందు కీయవయ? నన్ గను శ్రీ షిరిడీశ దేవరా! 45.
ఉ:- మంచిని మాత్రమే పెనిచి, మారుగ చెడ్డను పెంచకున్న నీ
వంచనలేమియున్ భువిని వర్ధిల వంచు భ్రమించినాడవో?
మంచిని పెంచుమా కృపను. మా యెద నీ చెడు త్రుంచుమయ్య! మ
మ్ముంచుము మంచి వారి మది నొప్పుగ. శ్రీ షిరిడీశ దేవరా! 46.
ఉ:- భారత మాత రక్షణము, భవ్య మహోజ్వల భావిఁ గొల్పగా,
ధీరులు, సజ్జనావళి విధేయులు, మా యువ భారతీయులే
కారణ భూతులయ్య. కలి కల్మష దూరులఁ జేయుమయ్య. నీ
వారికి శక్తి నీయుమయ భవ్యుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 47.
ఉ:- లక్ష్యముఁ గల్గి చేయ, మన లక్ష్యము సత్ ఫల మందఁ జేయు. నిర్
లక్ష్యము దుష్ఫలంబొసగు. లక్ష్యమె నీవయి యున్న నాడు , దుర్
లక్ష్యము లేక సత్ ఫలములన్ గన నౌను. నిజంబు. మాకు స
ల్లక్ష్యముఁ గొల్పి బ్రోవుమయ దక్షుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 48.
ఉ:- పుట్టుకతోనె జీవులకు పూర్వ సమార్జిత పుణ్య పాపముల్
పుట్టుకు వచ్చునేమొ! పరి పూర్ణ వివేకము తోడఁ గొందరున్,
నెట్టన దుష్ట చింతనము నిండి వసించుచు నుంద్రు కొందరున్.
పట్టుగ పాప పంకిలముఁ బాపుమ! శ్రీ షిరిడీశ దేవరా! 49.
చ:- సుగుణ సుమాల సౌరభము సూనృత వాక్కులఁ గొల్పఁ గోర్కె. ని
న్నగణిత భక్తి తత్పరత నందరుఁ గొల్వఁగ జేయఁ గోర్కె. యీ
జగము ననంత దౌష్ట్యములు చాలగ నన్ను వహించి వ్రేచు. నా
దిగులును బాపి కోర్కెలను తీర్చుమ! శ్రీ షిరిడీశ దేవరా! 50.
ఉ:- సద్గుణ! సాయినాధ! వర శబ్దమె నీవట! తీర్థ పాలకా!
సద్గురు! వేద వేద్య! విలసన్నుత! ద్వారక మాయి సంస్థితా!
మద్గురు! నాధ నాధ! స్మృతి మాత్ర ప్రసన్న! విభూత! నిర్గుణా!
సద్గతిఁ జూపి కావుమయ! సన్నుత! శ్రీ షిరిడీశ దేవరా! 51.
చ:- సురుచిర సుందరాత్ములను, సూనృత సువ్రతులన్ సృజించి, మా
దరి నిడినాడ వీ వనుచు, దక్షుఁడవంచుఁ దలంచు నంత, మా
పరువును మంటలో కలుపు పాపపు కృత్య నికృష్ట చిత్తులన్
దరిఁ గొనఁ జేసితేల? సుకృతంబొకొ? శ్రీ షిరిడీశ దేవరా! 52.
ఉ:- దేవుఁడ వీవె కాగ పలు దేవుల సృష్టికి హేతువేమి? మా
భావ మెఱుంగ సాధ్యమని పావన! నీవు గ్రహించినాఁడవో?
దీవన లిచ్చి బ్రోచుటకొ? దేవులుగా మదులందు నిల్చి, సద్
భావన లిచ్చి ప్రోచుటకొ? దక్షుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 53.
ఉ:- సజ్జనులందు నిన్గనుచు, సద్గుణముల్ గొని సంచరింపఁగా
వెజ్జల తోడు కావలయు. వెజ్జలు కొందరు ఘోర దుష్కృతుల్
లజ్జిలఁ జేయు చుండిరిల. లక్ష్యము లాత్మ జయంబు కావలెన్.
సజ్జను డప్పుడౌను కద! సద్గురు! శ్రీ షిరిడీశ దేవరా! 54.
ఉ:- ఎన్నఁగ రాని పాపముల నెన్నిటినో యిటఁ జేసినాఁడ. నే
నెన్నడు నీ కృపామృతము నిచ్ఛగ భక్తిని గ్రోల లేదు. నా
కన్నుల నీదు రూప మను కాంతిని నింపి సుఖింప లేదు. సం
పన్నుల మ్రొక్కి కీడ్పడితి. పాపిని. శ్రీ షిరిడీశ దేవరా! 55.
ఉ:- భారతి, నాది దేవత భవానిని, శ్రీ సతి నమ్మ లండ్రు యీ
భారత భూమిపై. తమ ప్రభావముఁ జూపెడి స్ర్తీల నమ్మగా
చేరి భజింప రేల? తమ చేష్టల బాధలఁ గొల్ప నేలనో?
వారి మనంబు మార్చుమయ! భవ్యుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 56.
చ:- అహ రహమున్ శ్రమించి, కడు హాయి నొసంగెడి స్త్రీలు జాతికిన్
నిహిత విశేష లబ్ధ మహనీయ సుధా రస మయ్య! మాతగా,
సహచర మూర్తిగా, సుతగ, సన్నుత సోదరిగా మెలంగు. నీ
మహిమను స్త్రీలఁ గావుమయ! మాన్యుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 57.
చ:- ధర నవమాన భారము లతా కుతలంబొనరింపఁ గృంగి, యే
తెరువు నెఱుంగ లేక, సుదతీ మణు లెందరొ భారతావనిన్
పరితప మొందుచున్ తమదు ప్రాణములన్ విడుచుండ్రి. స్త్రీల నీ
ధర నిక కావుమయ్య పరితప్తుల! శ్రీ షిరిడీశ దేవరా! 58.
చ:- మగ సిరిఁ గల్గి యుండుటయె మానిత మంచు దలంచి, మూర్ఖులై
పగఁ గొని నట్లు భార్యలను, పాప మెఱుంగని పంకజాక్షులన్
వగవఁగ హింస వెట్టు కుల పాంసను లేలఁ జనింతు రిద్ధరన్?
మగువల పాలి దుష్టులను మాపుమ! శ్రీ షిరిడీశ దేవరా! 59.
చ:- మగువలఁ గాంచి, మూర్ఖత నమానుష హింసల నేచు మూర్ఖులన్
భగ భగ మండు యగ్నిశిఖ పాలొనరింపు ముపేక్ష యేల? యీ
మగువలఁ గావకున్న వర మాతృ జనంబిక మృగ్య మౌను. నీ
తెగువనుఁ జూపి, బ్రోవుమయ తీరుగ! శ్రీ షిరిడీశ దేవరా! 60.
ఉ:- శ్రీకర! సాయినాధ! తమ సేవల నిన్ బరితృప్తుఁ జేసి, నీ
రాకకు వేచియుండి, తమ రక్షణఁ జేతు వటంచు నమ్మి, పల్
భీకరమైన బాధలను ప్రేమగ సైతురు స్త్రీలు. వారిపై
నీకిక జాలి కల్గదొకొ? నిత్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 61.
చ:- వనితల నేలఁ గొల్పితివి? వారికి రక్షణ నీయవేల? నీ
పనితన మంతఁ జూపగనొ? వారిజ నేత్రలు సద్గుణాలయల్.
వనిత వసంత శోభ. బలవన్మరణంబులు పొందుచుండ్రి. నీ
సు నిశిత దృష్టిఁ గావుమయ! సుందర! శ్రీ షిరిడీశ దేవరా! 62.
ఉ:- అన్నయ! తమ్ముడా! యనుచు హాయిగఁ బిల్తు రనంత భావ సం
పన్నలు భారతీమణులు భ్రాంతిగ సోదర భారతీయులన్.
మన్నికఁ గొల్పఁ జేసితివొ! మాన్యుల, సద్గుణ శీల భామలన్.
గన్నులఁ బెట్టి కావుమయ! కాంతల. శ్రీ షిరిడీశ దేవరా! 63.
ఉ:- సున్నిత మైన దేహమున సూదులు గ్రుచ్చు నొకండు. దుష్ట సం
పన్నుడొకండు దౌష్ట్యములు పల్కుచు గాయము సేయు గుండెలో.
నెన్నని యోర్చుకో గలరు? ఎవ్వరి కేమని చెప్పు కొంద్రు? నీ
కన్నులఁ గావుమయ్య! కుల కాంతల. శ్రీ షిరిడీశ దేవరా! 64.
ఉ:- అంబ భవాని సత్ కృపల నందగ దీక్ష వహింతు రెందరో.
అంబకు మారు రూపమగు నంగనలన్ గని దుష్ట కాముకుల్
సంబర మొప్ప, పొంగగను, చాల కలంగ భరింప లేక యా
యంబ శపించు. లేదు పరిహారము. శ్రీ షిరిడీశ దేవరా! 65..
చ:- పురుషులు, స్త్రీలు, తాము తమ పూర్వ ఫలంబునఁ బుట్టుచుంద్రు. సు
స్థిరముగ నన్ని జన్మలను తీరుగ నట్టులె పుట్ట లేరు. సత్
పురుషుడ వీ వొకండవెగ! పుట్టిన వారిక స్త్రీలె యౌదు, రా
సురుచిర కృష్ణ భక్తి యిదె చూపును. శ్రీ షిరిడీశ దేవరా! 66.
చ:- అతులిత శక్తి యుక్తులను హాయిగ నీ భువి నందఁ జేసి, సం
స్తుత మతులన్ సృజించితివి శోభిల. శాంతము తక్కు వౌట నా
గతులను విస్మరించి, చెడుఁ గాంచరు. దౌష్ట్యము లాచరింత్రు. దుర్
మతులను బాపి, బ్రోవుమయ మాన్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 67.
ఉ:- చేసెద సాయి పాద యుగ సేవలు సమ్మతి నంచు భక్తు, లా
యాస మనంబునన్ గలిగి, యన్యము వీడి, చరించుచుంద్రనా
యాసత నీతి బాధ సుమహార్ణవ మంతయు నీది యీది, తా
గాసిల కుండ దాటుదురు. కాంచితె? శ్రీ షిరిడీశ దేవరా! 68.
ఉ:- ఆశ్రిత పక్షపాతి వని, యాప్తుఁడ వీవని నిన్ను నమ్ము నా
డాశ్రయ మిచ్చువాఁడి వని, యార్తుల యార్తిని బాపుదీవనీ.
ఆ"శ్రమ" జీవ కోటికి సహాయుఁడ వీవని చెప్పు కొందురే!
ఆశ్రిత కోటిఁ బ్రోవగదె? హాయిగ. శ్రీ షిరిడీశ దేవరా! 69.
ఉ:- ఎందుకుఁ బుట్టఁ జేసితివొ? ఇంతటి బాధల నెందు కిచ్చితో?
కందె మనమ్ము నాకిట కకావికలై , నినుఁ గొల్వ నేర దే
మందును? పాప తప్తుఁడ. మహాత్ముఁడ! పాపుము పాప తాపమున్,
డెందమునన్ వసించు షిరిడీ పుర శ్రీ షిరిడీశ దేవరా! 70.
ఉ:- పావనమైన జన్మ మిది. భక్తి ప్రపత్తులు గల్గి దైవమున్
భావన నైనఁ గానము. స్వభావమొ? పాప ఫలంబొ? దుష్టమౌ
భావనలే స్పృశించు మది. భాగ్య విహీనుడ. భక్తి హీనుడన్.
దేవుడ! కావుమయ్య! ప్రణుతింతును. శ్రీ షిరిడీశ దేవరా! 71.
చ:- అరుదగు రూపుఁ దాల్చి, పురుషాకృతితో మముఁ బ్రోవ నెంచి, నీ
కరుణను జూపఁ గల్గితివి. కాంక్షను హిందువు ముస్లి మొక్కటై,
స్థిరముగఁ బుట్టినట్టి పగిదిన్ బ్రభవించితివయ్య! దుష్ట సం
హరణముఁ జేసి కావుమయ! హాయిగ. శ్రీ షిరిడీశ దేవరా! 72.
ఉ:- హైందవ భావ ప్రేరణము నాత్మల ముస్లిము లొందఁ జేసి, యీ
హైందవ జాతి ముస్లిముల యద్భుత ప్రేరణ మొందఁ జేసి, జై
హిందను భారతీయులుగ హిందువు ముస్లిము లిద్దరొక్కటై
పొందిక నుండఁ జేసితివి పూజ్యుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 73.
చ:- కలి కృత కర్మ బద్ధులయి కానరు కొందరు నిన్ను. కల్మిచే
మలిన మనస్కులై సతము మాయలలో విహరించుచుండి. నిన్
బలుకఁగ నైన నేర్వరుగ! పావన మూర్తులె పుణ్య కర్ములై
తెలియుదురయ్య నీ విమల తేజము. శ్రీ షిరిడీశ దేవరా! 74.
ఉ:- నమ్మిన వారి చిత్తమున నర్తన చేయుచు నుందువీవు. లో
కమ్మున భక్త కోటి వర కామితముల్ నెరవేర్తువీవు. వే
దమ్ముల సార మీవిచట దక్షతతో మముఁ గాంతువీవు. జీ
వమ్ముగ నుంటివీవు. గుణ వర్ధన! శ్రీ షిరిడీశ దేవరా! 75.
ఉ:- లోక మనంతమయ్య! భివి లోకమునందొక భాగమయ్య! మా
లోకము నీవెనయ్య! మము లోకువచే విడఁబోకుమయ్య! మా
లో కనువిప్పుఁ గొల్పుమయ! లుబ్ధ గుణం బెడఁ బాపుమయ్య! నీ
లోకముఁ జేర్చుమయ్య! వర లోచన! శ్రీ షిరిడీశ దేవరా! 76.
ఉ:- బంగరు భాగ్య సీమ లిడి, పాడియుఁ బంటయుఁ గొల్పి నాడ, వే
బెంగలు లేక తేజరిలె తృప్తిగ జాతి యొకప్పు డిప్పుడో?
హంగుల కాశ చెంది, భువి హాలికు లమ్మిరి భాగ్య సీమలన్.
మ్రింగఁగ ముద్దదెట్లొదవు మేదిని? శ్రీ షిరిడీశ దేవరా! 77.
ఉ:- హారము లుండ వచ్చు. గుణ హారమునన్ వెలుగొంద వచ్చు. నా
హారము లేక జీవనము హాయిగ సాగదు. పంట భూములన్
బేరము వెట్టి యమ్ముటను పెల్లగు నాకలి కేక. కావుమా
హారము నిచ్చు భూములను హాయిగ. శ్రీ షిరిడీశ దేవరా! 78.
చ:- ధరణి నమోఘ మూలికలు తన్మయతన్ బ్రభవింపఁ జేసి, యా
వరణము శోభఁ గొల్పి, మము వర్ధిలఁ జేయఁ దలంచినావుగా!
పరశువు పట్టి త్రుంచుటను పాడయిపోయె వనంబు లన్ని. నీ
వరయుచుఁ గావ వేమి? పరమాత్ముడ! శ్రీ షిరిడీశ దేవరా! 79.
ఉ:- వృక్షము లాది దేవతలు. వృద్ధి యొనర్చును జీవ కోటి. పల్
పక్షుల కాకరంబు. తమ స్వార్థముతో పెకలించు వారికిన్
జక్షు వినాశనం బగును. సద్ గుణ వర్ధన! కొల్పుమయ్య మా
కక్షయమైన జ్ఞానము, గుణాంభుధి! శ్రీ షిరిడీశ దేవరా! 80.
ఉ:- మంచిని చేయగా దలచి, మానవ జాతిని సృష్టిఁ జేసి, మా
వంచన భావముల్ కనవు వర్ధిలఁ జేయఁగ కోరు చుండి. మా
సంచిత పుణ్య మట్లు మముఁ జక్కగ జూచుచుఁ బ్రోచునట్టి ని
న్నుంచెదమయ్య మా మదుల నొప్పుగ. శ్రీ షిరిడీశ దేవరా! 81.
చ:- పశులకు, మానవాళికిని భౌతిక భేద మెఱుంగు మానవుల్
పశువులు, పక్షులున్, మరియు పాముల వోలె చరించు టొప్పునో?
నిశిత విచక్షణంబు, మహనీయతఁ గల్గి చరించు టొప్పునో?
దిశను గ్రహింపఁ జేయుమయ దివ్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 82.
ఉ:- ఆపదఁ బాపు వాఁడ! పరమాప్తుఁడ! సద్ గురు సాయి నాధ! ని
న్నే పగిదిన్ భజింపఁ గల నిచ్ఛగ నా మది కోరకుండ? యే
పాపముఁ బుణ్యమున్ గనను. భక్తుల కీవ వరం బటంచు సం
స్థాపనఁ జేతు నిన్ మదిని చక్కగ. శ్రీ షిరిడీశ దేవరా! 83.
ఉ:- బంగరు మేడ లుండ నగు. భాగ్య నిధానము లుండగా నగున్.
రంగుల జీవనమ్ము నలరారగ నౌను. రహింప వచ్చు. తా
నింగిత మించుకేని విడ నెవ్వని కైన క్షయంబు నిక్కమౌ
నింగిత మిచ్చి బ్రోవుమయ! యీశ్వర! శ్రీ షిరిడీశ దేవరా! 84.
ఉ:- ఎందరు బంధువుల్ కలుగ రిందరిలో నిట నొక్కడైన నీ
బంధము, నాత్మ తత్వమున, ప్రార్థన చేయు క్రమంబు తెల్పిరే!
ఎందుల కయ్య! బంధు జను లెవ్వరు వత్తురు పోవు నాడు. నీ
సుందర రూపు ముక్తి నిడు చూచిన. శ్రీ షిరిడీశ దేవరా! 85.
చ:- త్రికరణ శుద్ధిగా గొలువఁ దేజము శక్తి నొసంగె దీవు. నీ
వొక పరి మావలెన్ నిలిచి, యోర్పుగ నుండి, జయింపఁ గోరె దీ
తికమక పెట్టు శత్రువులఁ దేలును నీ పస. సాయి నాధ! నీ
విక నయినన్ గృపం గనుమ యీశ్వర! శ్రీ షిరిడీశ దేవరా! 86.
ఉ:- గుమ్మడి పండు చందమున గుట్టుగ క్రుళ్ళి కృశించు దేహమున్
నమ్ముచు నుండి, కీడ్పడుట, నాశము నొందుట వింత గాదె? వే
దమ్ముల సార మీవ యని, దారిని చూపెద వీవ యంచు, నిన్
నమ్మియు, మాయలో పడు జనమ్ములు. శ్రీ షిరిడీశ దేవరా! 87.
ఉ:- నాది యనంగ నేది? మననంబున మన్మన మందె సందియం
బాదిని నే నదెట్లొదవె? యాశ నిరాశల మూలమేది? యా
వేదన మూల మేది యగు? వేద్య మదేది? యవేద్యమేది? నా
బాధ నెఱింగి తెల్పుమయ పావన! శ్రీ షిరిడీశ దేవరా! 88.
చ:- పరమ దయా పరుండవయి భక్తుల పాలిట నుందువీవు! ఏ
వరములు కోరకుండగనె భక్తుల కిచ్చెదవీవు! నిన్ను నే
వరదుడవంచుఁ గొల్చెదను. భక్తి ప్రపత్తులు నిల్పి నా మదిన్.
ధర ననుఁ గావుమయ్య! వరదాయివి. శ్రీ షిరిడీశ దేవరా! 89.
ఉ:- నీ దరహాస చంద్రికలు నిత్యముఁ గ్రోల చకోరమౌదునా?
నీ దరి కాంతులీను మహనీయ సముజ్వల జ్యోతినౌదునా?
నీ దరిఁ జేరు భక్తుల పునీతపు పాద రజంబునౌదునా?
నీ దరి కెట్లు జేర్చెదవొ? నిత్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 90.
చ:- నట, విట, గాయ కాళి కడ నాకు లభించిన కాల మంత, నే
కుటిలుడనై చరించితిని. గుట్టుగ నా మది నున్న నిన్ను నే
నిటుల మదాంధతన్ గనఁగ నేమఱి యుంటి. మరెట్లు కాచెదో
పటు తరమైన మృత్యువును బాపుచు. శ్రీ షిరిడీశ దేవరా! 91.
ఉ:- జన్మ పరంపరన్ గడుపఁ జాలక నా మది సోలెడిన్ బునర్
జన్మము లేని మార్గమును చక్కగఁ జూపుచుఁ బ్రోచు దైవమా!
నిన్మది బాయ కుండ మహనీయ విభూతిని దాల్పఁ జేసి, మ
మ్మున్మదిఁ గాంచి బ్రోవుమయ ముద్దుగ. శ్రీ షిరిడీశ దేవరా! 92.
చ:- క్షణము యుగమ్ముగా గడుపగా మది తల్లడ మందు చుండె. నీ
క్షణమునఁ బ్రోవ నెంచితివొ? గమ్యముఁ జూపుచుఁ బ్రోవు మయ్య. ర
క్షణ వలయమ్ము నీ స్మరణ. కాలుని బారికిఁ బంపెదో? సు శి
క్షణము నొసంగి బ్రోచెదవొ? కాంచెద. శ్రీ షిరిడీశ దేవరా! 93.
చ:- పటుతరమైన నీదు శుభ పావన రూపముఁ గాంచనిమ్ము. సం
కటములఁ దేలు వేళ నినుఁ గాంచి సుఖంబు కనంగ గోరినన్
గుటిల ప్రయత్నమే యగును. గొప్పగ నిన్ గని కొల్చు భాగ్య మీ
తృటి నిడి, కావుమయ్య నను తీరుగ. శ్రీ షిరిడీశ దేవరా! 94.
ఉ:- నేను గ్రహించినాడ మహనీయుల కెగ్గులు కల్గు చుండుటన్.
నేను గ్రహించి నాడ ధరణిన్ కుల పాంసను గౌరవించుటన్.
నేను గ్రహింప లేను మహనీయుల పాపము, దుష్టు పుణ్యమున్.
గాన, గ్రహింపఁ జేసి ననుఁ గావుము. శ్రీ షిరిడీశ దేవరా! 95.
చ:- కనుల కనంత శక్తి నిడి, కాంచఁగ నీ నిజ రూప మిచ్చియున్,
కనఁగ ననంత దౌష్ట్యముల కల్పనఁ జేసితి వేలనయ్య? మా
కనులు గ్రహించు నయ్యవియె. కాంక్షలు గొల్పి, భ్రమింపఁ జేయు. నన్
గనుఁగొని బ్రోవుమయ్య! వర కామ్యద! శ్రీ షిరిడీశ దేవరా! 96.
ఉ:- పుట్టిన దాదిగా ధనము, భుక్తి, సుఖాప్తికి నాశ చేసి, నే
నిట్టుల మోస పోతి కద! యెట్టుల నిన్ గరుణింప వేడెదన్?
నెట్టన పాప కర్మములు నిన్నుఁ గనుంగొననీయవయ్య. నీ
వెట్టుల కాతు వయ్య? పరమేశ్వర! శ్రీ షిరిడీశ దేవరా! 97.
ఉ:- నీ దరి చేరువాఁడనయ! నీ శతకంబుఁ బఠించు వాఁడ. స
మ్మోదము తోడఁ గాంచుమయ! మూలము నీవయి కావుమయ్య! యా
వేదనఁ బాపుమయ్య! సమ దృష్టి నొసంగి రహింపఁ జేయుమా!
మేదిని పైన నన్ గనుమ మేలుగ. శ్రీ షిరిడీశ దేవరా! 98.
ఉ:- పిన్నలఁ బెద్దలం గనుము ప్రీతముగా వర సద్గుణాళితో
మన్నన లందు నట్లు గుణ మాన్యులుగా నెలకొల్పి ప్రోవుమా!
ఎన్నని విన్నవింతునయ! ఏమని కోర్కెలు తీర్చమందు? నీ
వున్నది మాకు, నిక్కము. మహోద్భవ! శ్రీ షిరిడీశ దేవరా! 99.
ఉ:- పండిత పామరాళి కడు భక్తిగ నిన్ మదిఁ గొల్చు వేళలన్,
మెండుగ కష్టముల్ తమకు మించి స్పృశింప కృశించు వేళలన్,
పండుగ వేళ లందు, వర భావన నీ షిరిడీశ పద్యముల్
మెండుగ వల్లె వేయ, కను మేలును. శ్రీ షిరిడీశ దేవరా! 100.
ఉ:- కాణ్వ విరాజ నామమునఁ గ్రాలెడు సత్ శుభ శాఖజుండ. చిం
తాన్వయ సంభవుండ. చరితార్థుడ నీ ధర. రామ కృష్ణుడన్.
నిన్ వినుతించి, మ్రొక్కి, మది నిన్ గని, " శ్రీ షిరిడీశ దేవ " పే
రన్ విరచించి తీ శతక రాజము. శ్రీ షిరిడీశ దేవరా! 101.
ఉ:- ముత్యము రామ మూర్తి కడు ముచ్చటతో ననుఁ గోరినారు "నే
మృత్యువు నొందు లోపలనె మీ రొక గ్రంథము వ్రాయు" డంచు. నౌ
న్నత్యము గొల్పు కోరికను నా మది నుంచి రచించి నాడ, నీ
స్తుత్యత నొప్పు పద్యములు శోభిల. శ్రీ షిరిడీశ దేవరా! 102.
ఉ:- ఆర్యులు. కల్వపూడి వినయన్విత వేంకట వీర రాఘవా
చార్యుల పాద ధూళి విలసన్నుత జ్ఞాన ప్రబుద్ధిఁ గొల్పగా
వీర్యుడ! నీ కృపామృతము బ్రీతిగ నీ శతకంబు లోన నే
నార్యులు మెచ్చ వ్రాసితిని హాయిగ. శ్రీ షిరిడీశ దేవరా! 103.
ఉ:- శ్రీ షిరిడీశ దేవు కృపఁ జెన్నుగ నీ శతకంబు వ్రాయగా
నా షిరిడీశ భక్తులు మహాద్భుత భక్తిఁ బఠించుచుండు గా
దే! సిరి సంపదల్ గొలిపి, తేజముఁ గొల్పుము దేవ దేవ! నిన్
శ్రీ షిరిడీశ! యన్నఁ దరి జేర్చుమ! శ్రీ షిరిడీశ దేవరా! 104.
ఉ:- ఎంతగ నేర్చినన్, గుణము లెన్నిక నెన్నిటినైనఁ గూర్చినన్
సంతస మందఁ జేయవుగ సద్గుణు లెంచి, పఠించు వేళ ర
వ్వంతయు దోషమున్న. బుధు లందరి మన్నన లందు నట్లుగా
చెంతను చేరి చేయుమయ . శ్రీకర! శ్రీ షిరిడీశ దేవరా! 105.
ఉ:- వ్రాసితి భక్తి భావమున. వ్రాసితి నే కనుగొన్న వన్నియున్.
వ్రాసితి సాయినాధు కృప. వ్రాతలలో గుణ మెంచుచున్ గృపన్
దోషము లున్న వీడి, పరి తోషము, సత్ ఫల మందఁ జేయగా
నీ సరి దైవ మింక కన నేరను. శ్రీ షిరిడీశ దేవరా! 106.
చ:- కరుణ రసామృతాబ్ధి ననుఁ గాంచిన వేంకట రత్న మమ్మకున్,
వెరవరి తండ్రిగారయిన వేంకట సన్యసి రామ రావుకున్
చరణములంటి మ్రొక్కెదను. చక్కగ నీ శతకంబు వ్రాసి, యా
గురువుల వాంఛ తీర్చితిని. కోమల! శ్రీ షిరిడీశ దేవరా! 107.
ఉ:- మంగళ హారతిన్ గొని, యమంగళముల్ తొలగించి, నీదు సన్
మంగళ రూప దర్శనము మానవ కోటికిఁ గల్గఁ జేసి, యే
బెంగలు లేక, నిన్ మదిని ప్రేమగ నిత్యముఁ గొల్వఁ జేయు మో
మంగళ రూప! మంగళము మాన్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 108.
పూజ్య కాణ్వ శాఖోద్భవ, శ్రీ చింతా వంశ సంభవ, జానకీ రామ మూర్తి దంపతుల పౌత్ర , వేంకట రత్నం సన్యాసిరామారావు పుణ్య దంపతుల పుత్ర , శ్రీమాన్ కల్వపూడి వేంకట వీర రాఘావాచార్య ప్రియ శిష్య, రామ కృష్ణా రావు నామధేయుండనైన నాచేత విరచింపఁబడిన శ్రీ షిరిడీశ దేవ శతకము సమాప్తము.
మంగళం మహత్ శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
చింతా రామ కృష్ణా రావు . భాషాప్రవీణ., M.A,. Telugu.
,
పుట్టిన తేదీ:- 06 - 10 - 1051 ( తూర్పు గోదావరి జిల్లా - వేట్లపాలెంలో )
తల్లి దండ్రులు:- చింతా వేంకట రత్నం, చింతా సన్యాసి రామా రావు.
స్వగ్రామం:- విశాఖపట్టణం జిల్లా - సర్వసిద్ధి.
తేదీ 01 - 03 - 1974 నుండి తేదీ 30 - 6 - 2008 వరకు ఉద్యోగం చేసిన గ్రామాలు.
ప్రథమాంధ్రోపాధ్యాయునిగా:-
దిమిలి, యస్.రాయవరం, పాయకరావు పేట.
జూనియర్ లెక్చరర్ గా:-
మక్కువ, రాజాం, కొత్తకోట, వడ్డాది, చోడవరం,
సీనియర్ లెక్చరర్ గా:-
చోడవరం.
రచనలు:-
శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము.
శ్రీ శివ అష్టోత్తర శత పంచ చామరావళి (శివ శతకము)
పురుష సూక్తానువాదము,
కాళిదాస కృత అశ్వధాటికి తెలుగు పద్యానువాదము.
"ఆంధ్రామృతము", మరియు "యువతరంగము", మరియు "పద్య విపంచి" అను అంతర్జాల పత్రికలు ( బ్లాగులు ) నిర్వహణ ద్వారా అనేక వైవిధ్య భరిత పద్య రచనలు.
Image
కృతికర్త.
భాషాప్రవీణ., చిత్రకవితాసమ్రాట్., కవికల్పభూజ., చిత్రకవితా సహస్రఫణి., చింతా రామ కృష్ణా రావు. M.A.,.
విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.
ఫ్లాట్ నెం. A 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.
తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165
రచనలు.
1) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.
2) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో,
ప్రతీపాదమునా మూడు ప్రాసయతులతో ఒక్క రోజులో
వ్రాసినది.)
3) ఆంధ్రసౌందర్యలహరి.
4) ఆంధ్రామృతమ్, పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో
అనేక స్వీయ రచనలు.
5) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.
6) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.
7) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
8) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)
9) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.
10) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.
11) బాలభావన శతకము.
12) మూకపంచశతి పద్యానువాదము.
13) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత
సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.
14) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
15) రాఘవా! శతకము.
16) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
17) రుద్రమునకు తెలుగు భావము.
18) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో
వ్రాసినది.)
19) వసంతతిలక సూర్య శతకము.
20) విజయభావన శతకము.
21) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
22) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు.
23) శ్రీ అవధానశతపత్రశతకము.
24) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.
25) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.
26) శ్రీచక్రబంధ మంగళాష్టకము.
27) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.
28) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.
29) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత
నృసింహనామాంచిత118 ఛందో గర్భ చిత్ర సీసపద్య
శతకము.)
30) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)
31) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.
32) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
33) శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.
34) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.
35) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము.
(బంధచిత్రకృతి ఒకే శతకమున మూడు మకుటములతో
మూడు శతకములు.)
36) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)
37) శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క
రోజులో వ్రాసినది.)
38) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త
శివశతకము.
39) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు,
సీతాన్వయముగా తేటగీతి పద్యముల
హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో సుందరోత్పల
నక్షత్రమాల.)
40) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)
41) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార
ప్రాసతో అష్టోత్తర శత పాద ఉత్పలమాలిక.
//స్వస్తి//
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.