జైశ్రీరామ్.
|| 5-15 ||
శ్లో. నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః|
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యన్తి జన్తవః.
తే.గీ. పుణ్య పాపంబులన్ గొనని పూజ్యుడు హరి,
జ్ఞాన మదికప్పబడెడు నజ్ఞానమునను,
భ్రాంతిలో మున్గి ప్రాణులు వర్తిలుటను
తేలియవచ్చును చూచినన్ తెలివి గలిగి.
భావము.
భగవంతుడు పాపాలను కాని, పుణ్యాలని కాని స్వీకరించడు. జ్ఞానం
అజ్ఞానంచేత కప్పబడుతుంది. అందుచేత ప్రాణులు భ్రాంతులౌతారు.
|| 5-16 ||
జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః|
తేషామాదిత్యవజ్జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్.
తే.గీ. పూర్ణ సుజ్ఞాన బలముచే పూర్తిగాను
వసుధ నజ్ఞాన మెవనిలో పాపబడునొ
వానిలో దైవతేజంబు భానునివలె
చూడ గనిపించు నిజమిది సుగుణతేజ!
భావము.
ఎవరిలో నయితే సమగ్రమైన జ్ఞానం ద్వారా అజ్ఞానం నాశనం చేయబడినదో
వారిలో ఆ పరమాత్మ జ్ఞానము సూర్యునివలె ప్రకాశింప బడుతుంది.
.జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.