ఓం నమశ్శివాయ.
అష్టావధాని "పండిత" శ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు గారు
ఉ:8 గం లకు విశాఖపట్టణంలో శివైక్యం చెందారు అన్న వార్తకు దిగ్భ్రాంతి చెందాను.
'పండిత' నేమాని రామజోగి సన్యాసిరావు 'అష్టావధాని' ఇకలేరు.
ప్రముఖ సాహిత్యవేత్త, ఆధ్యాత్మిక ఉపన్యాసకులు, కవి, పండితులు, అష్టావధాని శ్రీ నేమాని రామజోగిసన్యాసిరావుగారు (70 సంవత్సరాలు) గురువారం ఉదయం 8 గంలకు పరమపదించారు. వీరి సతీమణి బాలాత్రిపురసుందరి కూడా రచయిత్రి. వీరికి ఇద్దరు కుమారులు కుమార్తె ఉన్నారు. సన్యాసిరావుగారు కంపెనీ సెక్రటరీగా అనేకప్రాంతాల్లో పనిచేసి విశ్రాంతి తీసుకున్నారు. చిన్నప్పటి నుండి పద్యరచనమీద వీరికి పట్టుంది. శ్రీరావూరి వేంకటేశ్వరులుగారి ప్రోత్సాహంతో అవధానాలు ప్రారంభించి 25 అష్టావధానాలు చేశారు. వేదాంతశాస్త్రంలో దిట్టతనం, ఛందో వైవిధ్యంతో పద్యంచెప్పగల చేవ వీరి సొంతం. చతుర్విధ కవిత్వంలో వీరికి ప్రవేశముంది. సుప్రభాతం, వాక్ప్రశస్తి, శివానందలహరి, శ్రీగిరిమల్లికార్జున శతకం, సర్వమంగళాస్తోత్రం, ఆనందమయి, శ్రీ లక్ష్మీనృసింహ శతకం మెదలయిన రచనలతో పాటు ఎన్నో పద్యఖండికలను వెలువరించారు. 'ఆచార్య సార్వభౌమ' వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రిగారి సాహచర్యంతో సంస్కృత అధ్యాత్మరామాయణాన్ని స్వతంత్రమైన బృహత్తర పద్యకావ్యంగా 2400 పద్యాలుగా తెలుగులోకి అనువదించి ఆంధ్రసాహిత్యచరిత్రలో చెరగని ముద్రవేసుకున్నారు. చిత్రకవిత్వంలో వీరికి వీరే సాటి. వీరు ఆశుకవి. సుకవి. విశాఖసాహితి వీరిని 'పండిత' బిరుదుతో సత్కరించింది. అమెరికా, లండన్ మొదలయిన దేశాల్లో ఆధ్యాత్మిక, సాహిత్యోపన్యాసాలతో మన సంస్కృతీసంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేశారు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకొంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకొంటున్నాను.
శివశివా.
3 comments:
పూజ్యనీయులు, గురువర్యులు , కవివతంస ,శ్రీమదాధ్యాత్మ రామాయణ కృతికర్త , పుణ్యపురుషులు నైన అన్నయ్యగారు శ్రీ పండిత రామజోగి సన్యాసి రావు గారు శివైక్యము చెందిన వార్త విని చాలా విచారించాము. గొప్ప కవియే కాక పెక్కు మంది కవులకు గురుస్థానమును వహించి వారిని తీర్చి దిద్దిన ఘనులు వారు. రామాయణముతో పాటు గొప్ప కావ్యములను రచియించి జన్మసార్ధకమును చేసుకున్న ఉత్తమ పురుషులు ఆయన. వారి లోటు తీర్చలేనిది. అద్వైత సిధ్ధాంతమును నమ్మిన, ఆధ్యాత్మిక జ్ఞానసంపన్నులైన వారు భగవదైక్యమును పొంది ముక్తి గాంచారు. వారిని కోల్పోయి దురదృష్టుల మైన మన యందఱికీ ఆ భగవంతుడు మనోస్థైర్యము నొసగ వలెనని ప్రార్ధిస్తున్నాము.
గన్నవరపు నింహమూర్తి.
పూజ్యులు, గురుదేవులు, తెలుగు ఆధ్యాత్మరామాయణాది బహుగ్రంథకర్త, ప్రముఖ అష్టావధాని, సత్కవి, పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారి యాకస్మిక మరణమునకు విస్మిత వదనుండనై, దుఃఖిత మనస్కుఁడనై , కడసారి వారి పాదపద్మ సంపూజనమునకై యర్పించుకొను పద్యకుసుమము...
సీ.
శంకరాభరణ సత్సాహితీ కవిగణ
స్ఖాలిత్య సవరణఁ జేసినావు;
స్వయముగా నెన్నియో సత్పూరణమ్ములఁ
జేసి, కీర్తినిఁ బ్రతిష్ఠించినావు;
తపసివై యష్టావధానమ్ములనుఁ జేసి,
తెలుఁగు కవుల లోటుఁ దీర్చినావు;
రమణమై యధ్యాత్మ రామాయణమ్మునుఁ
దెలుఁగు భాషనఁ దీర్చిదిద్దినావు;
తే.గీ.
ఇట్టి వైశిష్ట్య గురుమూర్తి వీవు మమ్ము
నేఁడు విడనాడి, కైవల్య నిధినిఁ గోరి,
స్వర్గమేగిన నేమాని పండితార్య!
మృడుఁడు మీ యాత్మకిల శాంతి నిడునుఁ గాత!
-oO: "స్వస్తి" :Oo-
క:పండిత నేమానీ తమ
రండగ నుండగ కవితల నానందముగా
దండిగ వ్రాసితి మిచ్చన్
చండిక పతి చేరినావ సత్కవి చంద్రా!
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.