గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, జులై 2023, శుక్రవారం

ముక్తా విద్రుమ శ్లోకమునకు పద్యానువాదము. .....చింతా రామ కృష్ణా రావు.

సీ. ముత్యమ్ము పగడమ్ము పుత్తడి నీలమ్ము వజ్ర వర్ణములొప్పు పంచ ముఖిని,

మూడు కన్నులతోడ పొడమెడి  తల్లిని, చంద్ర రత్న మకుట చంద్రముఖిని,

తత్వార్థ వర్ణాత్మ తానై ప్రకాశించు సత్వ స్వరూప మహత్వ నిధిని.

పాశాంకుశంబులన్, వర కపాలంబును, గద శంఖము చక్రముల్ కలిగి మరియు  

తే.గీ. కరములన్ బద్మ యుగళంబు కలుఁగు జనని 

నమిత ప్రేమామృతోదధి నఖిల జగతి

నలరు సద్యుక్త గాయత్రి నమిత శక్తి

నహరహమ్మును సేవింతు నమిత భక్తి.

భావము. ముత్యము, పగడము, బంగారము, నీలము శ్వేత వర్ణములతో నొప్పియున్న ఐదు ముఖములు కల జననిని, మూడు కన్నులతో నొప్పియున్న మాతను, చంద్రమణియుక్త మకుట ధారిణియైన చంద్రుని పోలు ముఖముతో ప్రకాశించు లోకేశ్వరిని, తత్వ ప్రబోధాత్మకములగు వర్ణచయము తానో అయి ప్రకాశించెడి సత్వ భావముతో ప్రకాశించు మహత్వమునకు స్థానమైన అమ్మను, పాశము అంకుశము, కపాలము, గద, చక్రము, పద్మద్వయములతోనొప్పియుండెడి లోకమాతను, అనంత ప్రేమ వారాశియై సమస్త్అజగతిని అలరుచున్నటువంటి ఒప్పిదమై యున్నట్టి అమితమైన శక్తి స్వరూపిణియైన గాయత్రీమాతను అమితమైన భక్తితో నేను ప్రతీ దినమూ సేవించెదను

చింతా రామ కృష్ణా రావు.

జైహింద్


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.