గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, జులై 2023, శనివారం

శ్రీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసము...ఉపోద్ఘాతము....వేదము వేంకటరాయశాస్త్రి

 జైశ్రీరామ్.

శ్రీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసము...ఉపోద్ఘాతము


     ఆంధ్ర వాజ్మయపరిణామమును బట్టి విమర్శకులు దాక్షిణాత్యాంధ్ర వాజ్మయకాలమును క్షీణయుగ మనిరి గాని వాస్తవముగా మధుర తంజావూరు పుదుకోట మొదలైన ప్రదేశములలో తెలుగు పలుపలు విధముల వర్ధిల్లినది. ఆంధ్రభాషావధూటికి అలంకారప్రాయములైన అమూల్యాభరణములవంటి ప్రబంధరాజములను ప్రసాదించినది. అట్టి మహాకావ్యములలో నీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసమొకటి. భాషావధూటికి వట్టి అలంకారప్రాయము మాత్రమేగాదు శబ్దాలంకార అర్థాలంకార వాజ్మయమునకు ఆదర్శప్రాయమై శిఖరమును తాకినది. చతుర్విధకవితలను గుఱించి ఎందఱో చెప్పియున్నారు. చేసినవారు చాల తక్కువ. వారి రచనలన్నియు మనకు దక్కనులేదు కాని ఇతఁడు చేసినంత గ్రంథము మఱియొకటి మనకు లభింపలేదు. చిత్రకవిత్వములో ఇంతటి కావ్యముగాని దీనికి ఇంచుమించు దగ్గరదిగానో రెండవదిగానో చెప్ప దగిన కావ్యము గాని లేదు. తమ తమ కావ్యములలో ఎక్కడనో చిత్రబంధ కవిత్వములను రుచి చూపినవారున్నారుగాని ఈ విధముగా ఆంధ్రభాషలోనే ఆలంకారికులు చెప్పిన లక్షణములు కన్నిటికీని లక్ష్యసాగరముగా నొక కావ్యమును వ్రాసినవాడు ఇంకొకఁడు లేఁడు.

     ఈ యపూర్వకావ్యమును నేటికి 88 సంవత్సరముల క్రింద నెల్లూరి శ్రీపూండ్లరామకృష్ణయ్యగారు సంపాదించి ఐదాఱు ప్రతులు తెప్పించి పరిశోధించి చక్కని పీఠికతో ప్రకటించినారు. ఆ ప్రతులు ఇప్పుడు దొరకవు సరిగదా అక్కడక్కడ మిగిలియుండు ఒకటిరెండు ప్రతులుకూడా తాకిన పొడి పొడియై పోవు స్థితిలో నున్నందున ఇప్పుడు నా కోరికను మన్నించి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీవారు దీని పునర్ముద్రణమునకు ఉద్యుక్తులగుటయేగాక ఆ సంపాదక కార్యమును కూడ నాకే అప్పగించినందున వారికి కృతజ్ఞుఁడను. ప్రౌఢమును అలంకారభూయిష్ఠమును అపూర్వపదప్రయోగభూయిష్ఠమునైన యీ ప్రబంధమునకు చక్కని వ్యాఖ్యయు చిత్రబంధాదులకు కావలసిన చిత్ర ​పటములు అత్యంతావశ్యకములేగాని ఆ పని వట్టి ధనమాత్రసాధ్యముకాదు. పాండిత్యమును కాలమును పరిశ్రమయు ఆవశ్యకములు. కాఁబట్టి ప్రస్తుతము అకాడమీవారు తమ సార్వజనీన ప్రచురణములలో (ఫొపులర్ ఎదితిఒన్ సెరిఎస్) నొకటిగా ఈ గ్రంథము యొక్క ప్రతులు లభ్యము లగునట్లు దీనిని వెలువరించుట ముదావహము. ఇందువలన ఒక కొలత తీరి సవ్యాఖ్వాముద్రణ భాగ్యము గ్రంథమునకు మున్ముందు కలుగునుగాక.

1. కవియొక్కకాలము

ఈకవియొక్క కాలము ఇప్పుడు చక్కగా క్రీ. శ. 1620 నుండి 1880 నడుమనని తెలియున్నది. ఇదివరలో చరిత్రకారులు పరి పరి విధముల నిర్ణయించినారు. (వివరములకు చూ. నేలటూరి వెంకటరమణయ్యగారి దాక్షిణాత్యాంధ్ర సాహిత్యము ద్వితీయ ముద్రణము పుట 54-61). (1) దీనిని మొదట ప్రకటించిన శ్రీపూండ్ల రామకృష్ణయ్యగారు ఇతనిని శ్రీకృష్ణరాయలకును అప్పకవి ఇతనిని ఉదాహరింపనందున అప్పకవికిని (1650) యీవలివాడని తలఁచిరి. (2) కందుకూరి వీరేశలింగముపంతులుగారు పదునేడవ శతాబ్దమునకు లోపలివాఁడు కాఁడనియు మఱికొన్ని యుదాహరణములచేత 17వ శతాబ్దమునకును పదునెనిమిదవ శతాబ్దమునకును కొనిపోయిరి. (౩) కొత్తపల్లి సూర్యారావుగారు 18వ శతాబ్ద మనియ కూచిమంచి తిమ్మకవికి సమకాలికుఁడనియు 'కర్ణాటకుండీర చోళపాండ్యమండల ప్రముఖాభి...' ఇత్యాదికములచే నిర్లయించినారు. వీనినెల్ల విమర్శించి శ్రీనేలటూరి వెంకటరమణయ్యగారు చారిత్రకాధారములచేత ఈకవి కర్ణాటకుండీరమండలేశ్వరులచేత సత్కారము పొంది నది క్రీ. శ. 1648-9 లకు ముందై యుండవలెననియు అందులకు సాక్ష్యము ఇతని చండ విద్యావతీదండకరాజమనియు తేల్చినారు. ఈ దండకము క్రీ. శ. 1673లో తంజాపురిని పాలించుచుండిన ముద్దళగిరిమీఁద చెప్పబడినది. తుండీర ప్రభువులలో వరదప్పనాయకుఁడు విద్యా ప్రియుఁడు విద్యాపోషకుఁడు. కర్ణాటక రాజులలో పెద వేంకటపతిరాయలు 1630-1642 కవిజనాశ్రయుఁడు. “కావున గణపవరపు వేంకటకవిని సమ్మానించిన కర్ణాటక తుండీరప్రభువులు పెదవేంకటపతి దేవమహారాయలును చెంజివరదప్పనాయకుఁడునై యుందురు. అగునేని యతఁడు క్రీ. శ. 1620 మొదలు 1680వఱకును వర్దిల్లెనని చెప్పవచ్చును." ​అని నిర్ణయించినారు. ఇందులకు ప్రబలకారణము కర్ణాటతుండీర మండలములలో క్రీ. శ. 1648-9నాటికి హిందూరాజ్యములు పోయి మహమ్మదీయ రాజ్యములు వచ్చినవి. ఈ యభిప్రాయమునే పూర్తిగా వెలిబుచ్చుచు శ్రీ ఆరుద్రగారు తమ సమగ్రాంధ్ర సాహిత్యములో(క్షిభా.పు165) క్రీ.శ. 1659నుండి1682 దాకా మధురరాజ్యాన్ని చొక్కనాథనాయకుఁడు పాలించేవాఁడు. అతనికి ముద్దుఅళగిరి అనే సవతి తమ్ముడు ఉండేవాడు ......వెంకటకవిని పోషించాడు". అని వ్రాసినారు. కాని వెంకటరమణయ్యగారు వ్రాసినట్లు క్రీ. శ. 1673 నాటికి ముద్దుఅళగిరి, చోళ మండలము నాక్రమించుకొన్నందునను వెంకటకవిని చోళ రాజులును పోషించి యుండినందున 1678 నాటికి ముందేయై యుండవలెను. ఆరుద్రగారి యభిప్రాయమును ఇదియే, "ఈ విద్యావతీ దండకం అంతకుముందు వ్రాసినదే అవుతుంది'-అని (చూ సమగ్రాం . క్షి పు 167).

2.కవియొక్క ఊరు - వంశము

గణపవరపు వేంకటకవి యొక్క తండ్రి అప్పయార్యుఁడు. తల్లి మంగమ్మ; నందవరీక శాఖకు చెందిన యమాత్యుఁడు. అలసాని పెద్దన తాళ్లపాకవారు మున్నగువారందఱు నందవరీకులే పెద్దన తండ్రి చొక్కయామాత్యుఁడు నియోగులలో ఆఱువేల ప్రాఙ్నాటి వారేగాక నందవరీకులు నుండిరి. కవి వసిష్ఠ గోత్రుఁడు. ఆశ్వలాయన సూత్రుఁడు. ఇతని యూరేదో తెలియదు. గణపవరము ఒకప్పుడు ఊరుగానుండి ఇంటి పేరుగా మాఱియుండును. అవతారిక 41వ పద్యములో 'కాటెపల్లీ ముఖ్య గణపవర గ్రామ శేఖర' అని చెప్పుకొన్నా డు. శ్రీపూండ్ల రామకృష్ణయ్యగారు ఇట్లు వాసియున్నారు కాటెపల్లీ మజరా గ్రామమగు గణపవర మితని స్వగ్రామమని యేర్పడుచున్నది. ఈ గణపవర మెచ్చటనున్నదని విచారించగా నీమండలములో (నెల్లూరు) నుదయగిరి తాలూకా లో నున్నట్లును, నచ్చటఁ బూర్వము కవులెవ్వరో నుండినట్టు కొందఱు బట్రాజులు చెప్పెదరేగాని యిక్కవి యచ్చట జీవించియున్నట్టు వారు చెప్పుటఁగానము. ఇంతియగాక కొన్ని తాళపత్రప్రతులయందు ‘గామేపలి ముఖ్యగణపవర గ్రామ’ మని వ్రాసియున్న ది. ఆపక్షమునఁ గామేపలియనుగ్రామము అప్పకవి నివాస గ్రామమై యున్నది. ఇది మా మండలములోని కందుకూరు తాలూకాలోనిది. ఇందైనను నిక్కవివృత్తాంతముఁ జెప్పువారు లేరు వెండియు గోదావరి జిల్లా తణుకు వీరవాసరమునందు గణపవరమని యొక గ్రామమున్నదిగాని యచ్చటను ​నివృత్తాంతమేమియుఁ జిక్కినదిగాదు. బట్టు రామరాజభూషణకవి వసుచరిత్ర యందు దనవృత్తాంతమును వ్రాయక హరిశ్చంద్ర నళోపాఖ్యానమున వ్రాసినట్టుగా నిక్కవియుఁ దక్కిన తన గ్రంథముల యందుఁ దన యుదంతమేమైన వ్రాసియుండునో విచారించుఁడు." ఆరుద్రగారికిని ఎక్కువ దొరక లేదు “ఈ ఊరు ఎక్కడుందో సరిగ్గా చెప్పలేం. కామేపల్లినే పొరపాటున లేఖకులు కాటేపల్లి అని వ్రాసుకొని ఉంటారు. గుంటూరు జిల్లా నరసారావు పేట తాలూకాలో కామేపల్లి గణపవరాలు ఉన్నాయి. కవి బహుశా అక్కడివాఁడే కావచ్చు." ఇటీవల కందుకూరు శ్రీవిద్వాన్ కే. రామానుజాచార్యులను నాంధ్రపండితులు ఈ కావ్యము పై నాసక్తి గలవారు ఈ గణపవరము చిలకలూరిపేట కడ నుండు గణపవరమని తమ యాశయమని తెలిపిరి. ఇతర ప్రమాణములు దొరకునంతవఱకు ఇది ఇంతే. ఇతఁడు గణపవరమువాఁడు. గణప' శబ్దముచే నీది. కాకతీయ గణపతి చక్రవర్తి యిచ్చిన యగ్రహారమేమో! కాని తాను జీతమును గడపినదంతయు దక్షిణదేశమునగదా చూడుఁడు -

     “ఇది శ్రీమత్పెరుంబూదూరి యతిరాజాచార్యవర్య కరుణాకటాక్ష సంప్రాప్తాంధ్రకవితా సామ్రాజ్యధురంధర నీతియుగంధర నందవరకుల కలశ జలధి పూర్ణిమాచంద్ర సత్యహరిశ్చంద్ర వాసిష్ఠ గోత్ర పవిత్రస్తాశ్వలాయ సూత్ర కార్యఖడ్గప్రవీణ కామినీజన పంచబాణ కర్ణాట తుండీర పాండ్యమండలాధీశ ప్రముఖాఖిల మహీమండలాఖండలదత్త మత్తసింధుర సైంధవాందోళికాచిరత్న రత్నాంబరాదివస్తు ప్రశస్తమందిర నిరంతరవసంతేందిందిర సకల కలావిచక్షణ నిఖిలశుభలక్షణ లక్షణకవి వేంకటపత్యమాత్యవర విరచితంబును మంగమాంబాసమేత గణపరాప్పయమంత్రిమణి విఖ్యాతమజ్జనకరూ పాల్మేల్ మంగాసనాథ తిరువేంగళనాథాంకితంబును నగు వేంకటేశ్వర నిఘంటువు”

     అని యున్న దానిని (శ్రీపూండ్లవారు ఉదాహరించిరిగాని వ్యాఖ్యానింప లేదు. ఆరుద్రగారు దీనిని ఉదాహరింపనేలేదు. కాని దీనిని అరసిచూడఁగా నీతఁడు తనకాలములోనో తండ్రికాలములోనో మదరాసు ప్రాంతమునకు వచ్చి యుండవలయును. మొదటివిషయము చరిత్రకారుని దృష్టినాకర్షించునది “నీతి యుగంధర’ ‘అమాత్య’ ‘మంత్రి' శబ్దములును ‘కార్యఖడ్గప్రవీణ' యనునది. మొన్న మొన్నటివఱకును ఆంధ్రకవివరు లందఱును నియోగులే, రాజామాత్యులే. వారు ఎంతటి సాహితీసార్వభౌములో అంతటి సమరాంగణసార్వభౌములునుగా ​ నుండిరి. శ్రీకృష్ణరాయలవలె నన్నయభట్టుకాదుగదా తత్పూర్వ మెంత కాలము నుండియో కొందఱు బ్రాహ్మణులు రాజమంత్రులుగానుండి అమాత్య శబ్దవాచ్యులై యుద్ధవీరులై తమ రాజులను దేశములను రక్షించుచుండిరి. ఈ ‘కార్యఖడ్గ ప్రవీణ' శబ్దమునకు ఇదే యర్థము. తిక్కనామాత్యుని వంటివారు. ఈ విషయమునే మాతాతగారు తమ తిక్కన సోమయాజివిజయమను నుపన్యాసమున నిట్లు వ్రాసియున్నారు. (పుట3) ‘కవులు రాజామాత్యులైన నియోగి బ్రాహ్మణులయందు క్షత్రియ వీరోచితములయిన బలనీతి పరాక్రమ వైరిజయ శస్త్రాస్త్ర ప్రయోగ ప్రావీణ్యాది గుణవిశేషము లెల్లను విప్రోచితములై న వేదాది విద్యాధనత్వ కర్మఠత్వాది ప్రభావముంగూడను వర్ణింతురు', ఇది వట్టి వర్ణన మాత్రము కాదనియు ఎందఱో నియోగులు యుద్ధవీరులై రణమరణము నందియుండిరనియు, నేటి చరిత్ర పరిశోధనచే తెలియుచున్నది. ఖడ్గతిక్కన మనకు తెలిసినవాఁడే. ఆట్టివారెందఱో. పైగా వైదికుల కవిత బాగుండదను నభిప్రా యము గలవాఁడీకవి యనుట 'శ్రోత్రియుని తెలుఁగుకవిత' నీతడు నిరసించుటచే తెలియఁగలదు. (ప్రబం. 752)

     కాని ఈ వేంకటకవి గాని, అతని తండ్రి అప్పయ మంత్రిగాని ఎవరి మంత్రులుగా నుండిరో తెలియదు వీరు నందవరీకులు. నియోగులలో ఆఱువేలవారు, ప్రాఙ్నాటి (పాకనాటి) వారు మాత్రమేగాక నందవరీకులును నున్నారు. అల్లసాని పెద్దన చొక్కయామాత్యుని పుత్రుఁడు. కాఁబట్టి వేంకట కవి కుటుంబమువారు ఎప్పుడో గణపరము వదలి రాజామాత్యులై మదరాసు ప్రాంతమునకు వచ్చియుండవలెను.

     నాఁడు ఇంత పెద్ద మదరాసు లేదు. 1840 ప్రాంతములో ఇంగ్లీషువారప్పుడప్పుడే కోటను కట్టుకొని పైకి వచ్చుటకు ప్రయత్నించుచుండిరి. అందువలన నేటి మదరాసు ప్రాంతము నాటి తుండీర మండలము (తొండై మండలము) అనఁగా చెంజి రాజ్యము. దాని పాలకుఁడు చెంజివరదప్ప నాయకుఁడనియు నాతని కాలము క్రీ. శ. 1620-1660 ప్రాంతమని ముందుదాహరించితినిగదా. అతనికడ మంత్రులలో నొకఁడుగా నుండి యుండవలయును గణపవరపు అప్పయామాత్యుఁడు.

     ఇందుల కనుగుణముగా వేంకటపతి యొక్క గురువు యతిరాజ వర్యుఁడు శ్రీమత్పెరుంబూదూరివాఁడు. ఈ యూరు మదరాసునకును కంచికిని నడుమ నుండు శ్రీ పెరుంబూదూరు. వైష్ణవులకు ఉనికిపట్టు, శ్రీమద్రామానుజాచార్యులవారు జన్మించినచోటు; చెంజి (తుండిర) రాజ్యములోనిది. అంతటి అమాత్యుని కుమారుఁడు తమ రాజధానికి సమీపపుటూరిలోని సుప్రసిద్ధ పండితునికడ వట్టి విద్యాభ్యాసమే గాదు 'ఆంధ్ర కవిత'ను నేర్చుకొనుట ఏమాశ్చర్యము. పైగా నీతడు 'కర్ణాట తుండిర పాండ్యమండలాధీశ ప్రముఖాఖిల మహీమండలాఖండల దత్త వస్తువులు గలవాఁడు. అనఁగా పూర్తిగా మదరాసు నుండి రామేశ్వరము వఱకు నీతని విహారభూమి. రాజభోగములలో తేలుచుండినవాఁడు గాని సామాన్య గృహస్తుడుగాఁడు. కవిత చెప్పి ధనార్జన కుపక్రమింపవలసిన గ్రహచోర మీతనికి లేదు. ఈతఁడు కరణము (అనఁగా నియోగి.) కవిత్వ మీతనికొక ఉపకరణము. రాచకార్యములకు రాజులు ఇట్టి వారినే రాయబారులుగా, సాంధివిగ్రహికులుగా పంపెడివారు. శ్రీనాథుఁడు అట్టివాఁడే. ఈతని తిరుపతి వేంకటేశ్వర భక్తి ప్రాంతవర్ణనయు ఈ ప్రాంతము తోడి సన్నిహిత సంబంధమునకు మఱియొక సాక్ష్యము. ఇదంతయు చూడగా, నీ కవి యొక్క పెద్దలు ఎక్కడివారై యుండినను, ఇతడు మాత్రము దాక్షిణాత్యుఁడనియే చెప్పవలెను.

3. ఈ కవి రచనలు...

     ఈ కవి, శ్రీనాథుఁడు ఆత్మస్తుతి చేసికొనినట్లుగా, తన రచనలనిట్లు పేర్కొన్నాడు. 'శ్రీకరంబుగఁ బది రెండవయేట’ సీసపద్యము చూడఁదగును. దీనినెల్ల సంగ్రహించి శ్రీ పూండ్ల రామకృష్ణయ్యగారు ఇట్లు వ్రాసినారు. ఈ కవి గ్రామణి తన పది రెండవయేట దారావళులు, మునిముని మీసంబు మొనయునేట యమశతకము, యిరువదవయేట శృంగార రసమంజరి, యిరువది యేనవయేటఁ గృష్ణమల్లకథ, యౌవనమందు బాల రామాయణ ద్విపదము, చాటు పద్యములు, పాణిని లింగానుశాసనము, రామకవి లింగనిర్ణయము[1]ను జేర్చి యొక గ్రంథము, తెలుగు ప్రతాపరుద్రీయము , తెలుఁగు రసమంజరి, అభినవాంధ్ర నిఘంటువు,(యిదే వేంకటేశ్వర నిఘంటువు) ​ఆంధ్రకౌముది. గణ యతి ప్రాస లక్షణ సీసమాలిక, ఆంధ్రప్రయోగ రత్నాకరము, రేఫజకార నిర్ణయపద్ధతి, షట్ప్రత్యయముల ప్రస్తారసరణి , యిర్వదాఱు ఛందముల వచనము, అలంకార సారము, పరమ భాగవత చరిత్రము, ఆంధ్ర ద్విరూపకోశము కల్పితకల్పలత, తెలుఁగు వసంతతిలక భాణము, కఠినప్రాస శతక రాజము, ఆంధ్రప్రక్రియా కౌముది, జాంబవతీ విలాసమను చిత్రకావ్యము, చండవిద్యావతీదండకరాజము, చక్రతారావళి, పురాణసారమను పేర్లంబరఁగు (25) నిరువదియైదు గ్రంథముల రచియించినట్టును, యిట్టి గ్రంథరచనవలనఁ దన జిహ్వాంచలంబు తనవినొందదను కారణమునఁ గులదేవతావతంసమగు వేంకటేశ్వర చరణారవింద మహిమ నవనవోన్మేష వర్ణనలచేనొప్పు నీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసమును రచియించినట్టుగా నవతారికా పద్యముల యందు వ్రాయబడియున్నది. ఇక్కవికృతులలో నొక్క వేంక టేశ్వర నిఘంటువు తప్పఁ దక్కిన గ్రంథములు నామావశిష్టములై యున్నవి. ఈ కవిచే రచియింపఁబడిన గ్రంథజాలమునకై ప్రయత్నించఁగా వేంకటేశ్వర నిఘంటువు మాత్రము లభించినదిగాని తక్కిన ప్రబంధములు 'ప్రాచ్యభాషా లిఖిత గ్రంథ సరస్వతీ భండారము” (ఓరియంటల్ లైబ్రరీ) లోఁ గూడా నేత్రముల కగోచరములై యున్నవి. నేత్రగోచరమైన వేంకటేశ్వర నిఘంటువును జూడఁగా నీ ప్రబంధరాజమున నవతారిక యందలి 49 వ పద్యమునఁ జెప్పియుండు రీతి ‘బిరుదుగద్య' ఆ నిఘంటు కడపట నివ్విధముగా వ్రాయబడియున్నది” అని బిరుదుగద్య, 'ఇది శ్రీమత్పెరుంబూదూరు' ఇత్యాది ఉదాహరించినారు. ఇది ముందే ఇందుదాహృతము..

    పై గ్రంథముల గూర్చి ఇంతకన్న నెక్కువ తెలియరాదు. “నన్నయ పెద్దన, యెఱ్ఱన, తిక్కన, వీరన, తిమ్మన, పెద్దనాదులవలె[2] నిక్కవిరాజాశ్రయుండై తన గ్రంథముల నరాంకితములు జేయక నారాయణాంకితములుగాఁ జేసి మనిన ధన్యుండు” అని వ్రాసి 'ఇమ్మనుజేశ్వరాధముల' ‘బాలరసాలసాల' పద్య ​ముల నుదహరించి పోతనయొక్క భోగినీ దండకమును ఉదాహరించి యిక్కవి తన గ్రంథముల నన్నిటిని వేంక టేశ్వరస్వామికి నర్పించిన మహాపురుషుండు” అని వ్రాసినారు. వీరి కాలమునకు “చండ విద్యావతీ దండకము' (పుష్పకోదండము) వెలువడలేదుగాన నిట్లు వ్రాసినారు గాని ఇతఁడును భోగినీ దండక రచయిత వలెనే, ఆ ఫక్కిలోనే తన దండకమును వ్రాసిన విషయము శ్రీ ఆరుద్రగారు విశదీకరించినారు. (చూ. సమ. సా. Xఈ 166-7) ఈ కవి ఏ యే గ్రంథములను ఎవరెవరికిచ్చినాఁడో ఆ గ్రంథములు దొరకినగదా తెలియును. రాజాశ్రయము చేయనివాఁడుగాఁడు. వారివలన నెంతో ఐశ్వర్యమును పొందినాడు. పోతన కూడ సర్వజ్ఞ సింగమనాయని ఆశ్రితుఁడే : మనఁకు నాఁటి చరిత్ర చక్కగా తెలియరాలేదు గాని సింగమనాయుఁడు (మూఁడవవాఁడు) తుది దినములలో చాలా బాధలుపడి ఓరుగల్లు తెలంగాణ ప్రాంతములను వదలి గుంటూరుసీమకు వచ్చినట్లున్నాఁడు. ఆతని మరణానంతరమే పోతరాజు భాగ వతమును రచించియుండును. భాగవతాంకితమును గూర్చిన కథలన్నియు పుక్కిడి పురాణములుగా తర్వాతివారు కల్పించి యుందురు. వాస్తవమునకు ‘బాల రసాల' పద్యము మంచన కేయూరబాహు చరిత్రలో (క్రీ శ. 1300), పోతన్న కు దాదాపు రెండువందల యేండ్లకు ముందుండియు కనఁబడుచున్నది. 'ఇమ్మను జేశ్వరాధముల' పద్యము కూడ ఎవరిదో ! కాటుక కంటినీరు' పద్యము కూడ సందేహాస్పదమే. సింగమనాయఁడు కర్ణాటకుఁడా ! పైగా సర్వజ్ఞ బిరుదాంచితుఁడు అట్లు వ్యవహరించునో ? ఈ రాజాంకిత నరాంకితాది విషయకమై పండితులు పరిశోధింప వలయును. త్యాగరాజు వంటివాఁడు మాత్రము కాఁడు. అట్లు చూచిన వీరెవరును కారు.

     గణపవరపు వేంకటకవి తన కైశ్వర్యమబ్బిన విధమును స్పష్టీకరించినాఁడుగదా. 'తానోకార్యఖడ్గప్రవీణుడు' కార్యఖడ్గ పటిమధురీణుండును. మంత్రి అనఁగా ఉద్యోగస్తుఁడు, రాజనియోగి. పరంపరగా రాజుల నాశ్రయించు వంశమువాఁడు. పైగా 'కామినీపంచబాణుఁడు' శ్రోత్రియుఁడుగాఁడు. “కర్ణాట తుండీర పాండ్యమండలాధీశ ప్రముఖాఖిలమహీమండలాఖండలదత్త మత్త సింధుర సైంధవాందోళికా చిరత్న రత్నాంబరాదివస్తు ప్రశస్త మందిరుఁడు.” మఱి వారినిగుఱించి ఒక మంచిమాటయైనను చెప్పక ‘ఇమ్మనుజేశ్వరాధములు' ఆని నీతీరున నుండిన త్యాగరాజువంటివానికి ఈ యైశ్వర్యమంతయు ఆ యా రాజులవలన అబ్బునా?. తన యైశ్వర్యానుభవమును ఎంతో గొప్పగా చెప్పు ​కొన్నాఁడు గదా. (27వ వచనము.) శ్రీవేంక టేశ్వర చరణారవింద మహిమను వర్ణింపఁ దలంచుచుండ 'నొక్కనాఁడు' అని మరల (శ్రీ పెరుంబూదూరు - ఇత్యాది వంటి వచనమునే ఇంక కొంతమార్చి పెంచి) వ్రాసినాడు. 'కర్ణాట తుండీర చోళ పాండ్య దేశాధీశముఖ నిఖిల ధరణీవరమణిదత్త మత్తేభ ఖత్తలాణిక పల్యాంకి కాందోళికాది చిరత్నరత్నఖచిత రుచిరాభరణగణ ప్రకాశిత విభవుండును, సద్గుణ ప్రభవుండును, కార్యఖడ్గ పటిమధురీణుండును చతుష్షష్టి విద్యా ప్రవీణుండును, సనక్షత్రా త్రినేత్రోద్భవోపమానాచ్చ ముక్తా గుళుచ్చచ్ఛవి సంకీర్ణ కర్ణ భూషా విశేష వదనుండును, దిగంతాయాత విద్వత్కవి వ్రాతబంధు జనావన సదనుండును.........ప్రభుసందేశ సకల లోకోపకార కృత్ర్పచారుండును, ......... అసాధారణ మేధా ఘటిత మంత్ర తంత్ర సంధానా బంధన గంధవాహ బాంధవ నిర్గంధిత గంధాంధ దండనాథ యూధ స్కంధాపార పారా వారుండును, ...... [3]పరస్త్రీ, పరధన పరాఙ్ముఖశీలుండును, ......నగునేను బహువిధభోజ నామూల్య జాంబూనదాంబర సార గంధసార రుచిర విచికిల ఘన సార తాంబూల ప్రియకామినీ సంగీత గోష్ఠీ సుమశయ్యాష్ట భోగాభోగ సంగతుండనై, హంసతూలికా తల్పంబున వేకువఁ దేకువ సుఖసుప్తి నున్న సమయంబున” ఇదంతయు రాజాశ్రయము చేతను “నరస్తుతి’ వలనను వచ్చినదే.

     అట్లనుటచేత దైవభ క్తిలో ఎవరికిని తీసి పోయినవారు కారు కవులైన రాజామాత్యులు. ఈ వెంకటకవియు వేంకటేశ భక్తుఁడు. పైన చెప్పుకొన్న విధముగా నీతఁడు “సుఖసుప్తి నున్న సమయంబున వేకువజామువేళ బాలవేంకట శౌరి ప్రత్యక్షమై’ ప్రబంధరాజమును అంకితము కోరినట్లును ఈతఁడు పరమానందభరితుఁడై ఆట్లే యొనరించినట్లును కలదు. తిక్కన మొదలు నేటివరకు కూడ మన యాంధ్రకవులకు ఇట్టి స్వప్నములు క్రొత్తకాదు. దీనిపై వ్యాఖ్య యనవసరము. మన కవులలో భక్తులు లేరాయేమి ? ​

4. కావ్య స్వరూపము - ఇందలికథ

     ఇది ఏకాశ్వాస ప్రబంధము. సాధారణముగా కావ్యములు ఆశ్వాసములుగా విభక్తములగు చుండనిది మాత్రమిట్లు వ్రాయఁబడుట. అందును 882 పద్యములను ఒక్క గుక్కలో చెప్పుట, ఆలోచింపఁ దగినదే. శ్రీ పూండ్లవారు “ ఈ కావ్యమువలె నేకాశ్వాసముగా విరచింపఁ బడినది యిదివఱకు దృష్టిగోచరముగాలేదు...విభజించి వ్రాసియుండిన జదువువారలకుఁ గొంత గ్రుక్క ద్రిప్పుటకు వసతిగల్గి యుండును ...... కారణమేయ్యదియో విచారించు కొనుఁడు” అని వ్రాసిరి. ఆరుద్రగారు ఏమియు వ్రాయలేదు. వారి కెట్టి శంకయు పొడమలేదు. కాని నాకిట్లు తోచుచున్నది. ఈయన కాలమున యక్షగానములు బహుళ ప్రచారమునకు వచ్చినవి. వానిలో, అవి ప్రదర్శన యోగ్యములైనను, అంక విభజన లేదు. పాత్ర ప్రవేశ నిర్గమనాదుల వలన కథజరిగి పోవుచుండును. రాత్రియంతయు నాటకమాడువారు. ఈయన కావ్యములో యక్షగాన రచనా ప్రక్రియలు చాలా గలవు. వట్టికావ్యముగాక , చిత్రకావ్యమునుగాక, సంగీత కావ్యముగా కూడ దీనిని గ్రహింపవలసియున్నది. కాగా, వానివలెనే, కవి దీనిని ఏక శ్వాసముగా వ్రాసెనేమో. ఇది నృత్య నాటిక గా కూడ కొద్దిమార్పులతో ఆడదగినదిగా కనఁబడుచున్నది. హరికథా కాలక్షేపమునకు చాల తగియున్నది. సంగీతవిషయముల నెన్నిటినో కవియిందు చేర్చియున్నాడు. పైగా పూండ్ల వారు ఆశ్వాసాంతమున, అనగా నిచ్చట గ్రంథాంతమున గద్యవ్రాయక పద్యమే వ్రాసినాడు. ఇందులకు ఇతనికి మార్గదర్శకము ఆముక్తమాల్యదయనియు, ఆధునికులలో మండపాక వారొకరట్లు వ్రాసిరనియు తెలిసిరి. కాని వీరి కందఱికిని గురువు నైషధకావ్యకర్త, భట్ట శ్రీహర్షుడేల కారాదు? ఆతఁడు ప్రతియాశ్వాసముతుదను ఆముక్తమాల్యద పద్యములవంటి శ్లోకములు వ్రాసినాఁడు పైగా నాటకములలో భరతవాక్యము శ్లోకమేగావున ఆస్వరూపము కలుగుటకు కూడ కవి యిట్లొనరించి యుండును. ఈ భావముననే కాఁబోలు ఇట్లు భగవంతుని యాజ్ఞగా చెప్పుకొన్నాఁడు.

ప.33. 'మునుపు నిపుడుఁ గవులొనర్చు ననువుఁ దెనుఁగుఁ

గబ్బములలోనఁ దెరనాటకంబు లెస్స

గా వినికి సేయుగతి నలంకార సరణి

వెలయ రచియించు యప్పయ వెంకటార్య'

ఇది వినికి సేయు' నాటకమా?

     ఇందలికథ :- “ఈ గ్రంథము కథాప్రారంభము మొదలుకొని వేంకటాచల పట్టణవర్ణనము. నలిబిలిగోపురాది వర్ణనము, స్వామిపుష్కరిణి వర్ణనము, బయకానికోన పాండుతీర్థాకాశగంగాదుల వర్ణనము, వేంకట శైల వర్ణనము, శ్రీవేంకటేశ్వరస్వామి వర్ణనమును, శ్రీవారి వాహ్యాళి వర్ణనము, తిరునాళ్ల మహోత్సవాది వర్ణనమును, మొదటి 58 పద్యములవఱకు వ్రాయబడి యున్నది. అది మొదలు సాయంతనవర్ణనాదులు, జాతివార్తలు, స్వామివారి యెదుట జరుగు సంగీతమేళముల వర్ణనములు, లోనగు వృత్తాంతములు 112 పద్యముల వఱకు వ్రాయఁబడియున్నవి అవ్వల శ్రీవారి కేలిడేగ ఆకాశ రాజచంద్రుని సుతయగు నాంచారుదేవి యుపవనమున వ్రాలుటయుఁ దోడ్తోన శ్రీవా రచ్చటికి మంత్రి సహితుండైఁ విచ్చేసి యవ్వెలంది యుదంత మరయుటకు మంత్రిం బంపఁగా, నతనివలన దానామె వృత్తాంతము విని యవ్వెలఁదినిఁ జూచి వర్ణించుటయుఁ, దర్వాత నాకాశరాజు మంత్రివలన వేంకటేశ్వర స్వామివారి యభిప్రాయ మెఱింగి తనసుతనిచ్చి వివాహంబొనర్చి స్వగృహమునకు నగ తనయయగు దన తనయను బంపునపుడు త్రోవలో స్వామివారికిని, నాగదత్తుఁడను చోరునకును యుద్ధము సంప్రాప్త మగుటయుఁ జోర వ్రజంబు స్వామి పుష్కరిణింబడి సారూప్యం బందుటయు, నష్టదిక్పాలకులు శ్రీ వేంకటేశ్వర స్వామిని స్తుతించుటలోనగు పద్యములచేఁ దక్కిన గ్రంథంబంతయు నొప్పుచున్న ది. ఈ గ్రంథమునందుఁ గథ విశేషముగ వ్రాయఁబడి యుండలేదు. అయినను తన నేర్పఱితనమును లోకమునకుఁ దెలుపుటకై కవియిది యొక వ్యాజము గల్పించుకొని యిట్టి లక్ష్య గ్రంథమును వ్రాసియున్నాఁడు” (పూ.రా).

     నాగదత్తునికథ :- స్వామివారి కథకన్న పెద్దది, స్వారస్యమైనది. ఇతఁడు కందుకూరి రుద్రకవి యొక్క నిరంకుశునికి, తెనాలి రామకృష్ణయ్య నిగమశర్మకును అపరావతారము. ఏ మాత్రము మార్పులేదు. - తిరుపతి పురములో మాధవుఁడనెడు శోత్రియుఁడు సకలశాస్త్రవేది యుండెను. ఆతనికి బహు కాలమునకు గలిగిన పుణ్యపు పంట నాగదత్తుఁడు బాల్యములో చక్కగా చదివి, “తండ్రికన్నను నెఱవాది తనము మంచితనము గ్రామణితనము వర్తనముగలిగి... కీర్తనీయుఁడై " యుండెను. వివాహము కూడనైనది. కాని యింతలో 'ఆళ్వారు తీర్థము చెంతఁ గొంతకాలంబు' ... 'వీతాచారుఁడు దుర్మదాంధుఁ డగుచున్ వేశ్యాంగనావాటులన్ ... చేతోజాత వశం వశంవదుండయి జరించెన్'. 'దుర్విత్తి

​     నథిగమించి ... విటవిద్యకు బిరుదవేసి” జూదమునేర్చి, “తీండ్రవయసెచ్చఁ జే కత్తిగాండ్రఁ గూడి ...' చరించుచు “ఒక వెల యాలిమీఁద నిలుపోపని కూరిమి గల్గి, యుండ, ఆజవ్వనియు 'యెవ్వని నిచ్చమెచ్చకే' యితని తోడనే ‘మారక , తన చాతురి న్నిలువరమ్ముగ గూడి చెలంగె నయ్యెడన్.' అది చూచి, వేశ్యా వృత్తి కిది పనికిరాదని వేశ్య మాతయు, కుమార్తెకు హిత ముపదేశించి, దానిమనసుమార్చి నాగదత్తుని ధనమంతయు నపహరించి, వెడలఁ గొట్టించినది. ఇంటికి మరలి వచ్చిన నాగదత్తునికి మర్యాద యెక్కడిది. అందును చీదరించుకున్న వారే. తల్లికి మాత్ర మట్లుండునా ? ప్రేమతో, వచ్చినదే చాలునని, పిలుచుకొనిపోయి, సకలోపచారములు వాని భార్యచేత చేయించి, ఎంతోబుద్ది చెప్పినది. కాని ఆతఁడు చలింపలేదు, ఒక్కమాట బదులాడలేదు. తల్లి చాల దుఃఖించినది. అది చూచి తాను మారి నట్లభినయించినాడు. తల్లి ఉబ్బిపోయినది. తన సొమ్ముల నన్నిటిని కోడలికి పెట్టి శృంగారించి కుమారుని పడుక టింటికి పంపినది. పాపము, మోస పోయినది. ఆ కుమారుఁడు ఆనగల నన్నిటిని దోచుకొనిపోయి, రాత్రికి రాత్రియే, ఆ వెలయాలికి సమర్పించినాఁడు. త్వరలోనే ఆ సొమ్మంతయు ఐపోగా, వేశ్య మరల ఉద్వాసనము చెప్పగా, దారి దోపిడితనమునకు దిగి...

ఆయన సేయనిపాతక

మేయనువు లేకఁబురికి నెడయై జని దా

బోయల గూడుగ దెఱువుల

నాయకు లేతేర తాను నడుమ నడచుచున్'

........ రాజుల నగరములు జొచ్చిరాయిడి, జేయుచున్' ... 'తిరిగి తిరిగి యున్మత్తుఁడై నాగదత్తుఁడు ....... తద్బటులంతరంగంబున...... తుందుడుకు సామిసొమ్ము దోచు' టకు బొక్కసమును దోఁచగా హరిభటులుపైకొని యుద్దమాయెను. దొంగలగుంపు ఓడిపోయి స్వామిపుష్కరిణి లోబడి మరణింపగా వారికి, అందువలన, మోక్షమబ్బి దివ్యవిమానములు వచ్చి, కొనిపోగా, వారందఱు 'విధునిపదముల కరిగిరి’ అటు తర్వాతి గ్రంథమంతయు దేవతలు వేంకటేశ్వరస్వామిని స్తుతించుటతో సరిపోయినది.

     ఈ విధముగా తక్కువకథతో కవి తన కావ్యమున తన పాండిత్యమును, లోక జ్ఞానమును, చిత్రకవిత్వ బంధకవిత్వాది సాముగరిడీల ప్రదర్శనమును, ఆంధ్రవాఙ్మయములోనే ఎవరును చేయని విధముగా చేసినాడు. ​

5.ఈ కవియొక్క లాక్షణికత

     శ్రీ పూండ్లవారి వ్రాత—“ఇక్కవి గొప్పలాక్షణికుఁడు, తాను నేర్చిన లక్షణముల కన్నింటికి లక్ష్యముల నీ గ్రంథమునం దుదాహరించియున్నాఁడు. ఆంధ్రభాషలో లక్ష్యలక్షణములను దెలుపు గ్రంథము లొండురెండుగాని విశేషములు లేవు. అవి యనఁగా కావ్యాలంకార చూడామణియు, నరస భూపాలీయము అనునవి. ఇందు మొదటి గ్రంథమును విశ్వేశ్వరుఁడను ప్రభువు పై విన్నకోట పెద్దనయను మహాకవి యంకితం బిచ్చియున్నాడు. ఇది బహు పురాతన గ్రంథము. ఇయ్యది పోతన శ్రీనాథుల కాలమునకు శ్రీకృష్ణరాయల వారి కాలమునకుఁ బూర్వమువ్రాయఁబడినది[4]. ఇందు వ్యాకరణ విషయము, అలంకార విషయము, ఛందశ్శాస్త్రవిషయము, కావ్యలక్షణము, నాయకనాయికాది గుణములు, బంధకవిత్వ గర్భకవిత్వ చిత్రకవిత్వాది విషయములు వ్రాయఁబడి యున్నవి. ఇఁక రెండవ గ్రంథము నరసభూపాలీయము. ఇప్పుడు ముద్రితమై యున్నదిగాన దీనిని గుఱించి మేము విశేషముగ వ్రాయఁ బనిలేదు. ఈ రెండు లక్షణ గ్రంథములును నరాంకితము లగుటచే నిక్కవి తానొక లక్షణగ్రంథమును వ్రాయఁ దల పెట్టియు నిదివఱకే యిద్దఱు లాక్షణికులు లక్ష్యలక్షణములు వ్రాసి యున్న లక్ష్యములగు పద్దియములు నర స్తుతులు యెంచి వానిని నోరగ్రుచ్చ మనసురాక తాను మరలఁ గొత్త లక్ష్యములగు పద్యములను మాత్రము వ్రాసి వానిని శ్రీ వేంకటేశ్వర స్వామికి నంకితంబిచ్చి యీగ్రంథమును వ్రాసి యున్నాడు. ఇది కవి యభిప్రాయము గానినాఁడు తాఁ దిరుగ లక్షణమును గ్రంథమునందు వ్రాసియే యుండును. కాఁబట్టి యీగ్రంథమందుండు లక్ష్యములగు పద్యముల కన్నిటికి లక్షణమిదియని కవియే వాసియున్నాఁడుగాని, యా లక్షణములను వివరించియుండ లేదు. కావున మఱియొక గ్రంథమునుండి లక్షణములను దెలిసికొని యిందలి లక్ష్యములను గ్రహించ వలయును." ​“ఈ గ్రంథమునందు గర్భ చిత్రకవిత్వము విశేషముగ వ్రాయబడి యున్నది. ఆంధ్రగ్రంథములలో నీ కవిత్వసంబంధమగు పద్యము లనేకములు వ్రాయఁబడియున్నవిగాని వానిక న్నింటికి లక్షణమెచ్చటను గానఁబడదు. కావ్యాలంకార చూడామణియందుఁ గొన్ని బంధములకు లక్షణము వ్రాయఁబడి యున్నది. ఈ గ్రంథమిప్పటికి[5] నముద్రితమగుటచే దీనియందలి విషయములు లోకమున కందనిమ్రానిపండ్లై యున్న యవి. ఇఁక ముద్రింపఁబడియుండు నరస భూపాలీయమునందై నను నాలవ యాశ్వాసమునందు “అష్టదళపద్మ బంధ చక్రబంధములకుఁ దప్పఁ దక్కిన బంధములకు లక్షణమెచ్చటను గనుపడదు. ఈ ప్రబంధరాజమునందు బంధములన్నియు నరువదికి మించి (60) యున్న యవి. ఈ బంధములనన్నిటిని యీకవి వానివాని స్వస్వరూపములతో, లిఖించియున్నాఁడు. అయ్యవి ముందు బ్రకటింపఁ బడు....... మనుచరిత్ర యందు అల్లసాని పెద్దనగారు గద్యమునందు “చతుర్విధకవితామతల్లి కాల్లసాని చొక్కయామాత్య పుత్ర పెద్దనార్యప్రణీతము” అనియు, వసుచరిత్రమునందు రామరాజభూషణకవి “సంస్కృతాంధ్రభాషాసామ్రాజ్య సర్వంకష చతుర్విధ కవితా నిర్వాహక సాహిత్యరసపోషణ రామరాజ భూషణ ప్రణీతము' అనియు వ్రాసికొన్నారేగాని వారు వారివారి గ్రంథములందొక రైనను 'బంధకవిత్వ గర్భకవిత్వములను గూర్చి యొక పద్యమైనను వ్రాసియుండరైరి. ఇందుకుఁ గారణము విచారించుకొనునది."

     ఇదంతయు దాదాపు 85 సంవత్సరముల క్రింది పండితాభిప్రాయము. ఆంధ్రవాఙ్మయ చరిత్రకారులెవ్వరును ఆంధ్రవాఙ్మయ పరిణామమును గుఱించి గాని, అందులో చిత్రబంధ కవిత్వాదుల చరిత్రలను గుఱించిగాని నేటివఱకును వ్రాయలేదు. ఒక్క వంగూరి సుబ్బారావుగారు 1920 ప్రాంతములలో కొంత ప్రయత్నించిరిగాని తర్వాత వారు, శ్రీ వీరేశలింగము పంతులు వారిని గూర్చి శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు చెప్పినట్లు, 'తెలుఁగుకవుల జాతకములనే వ్రాసిరి. కవివెనుక కవి, ఆయా కవుల గ్రంథములనే జాపితాలుగా వ్రాయిం చుటయేగాని భావములలో మార్పు, ఆంధ్రవాఙ్మయములో రచనా ప్రక్రియలలో ​క్రొత్త పోకడలు, కావ్యనిర్మాణాలంకారాదిక రచనలలో నూతన వర్ణనా విధానములు, ఇత్యాదులను తల పెట్టిన వారేలేరు, 'గతానుగతికోలోక' కాఁబట్టి తెలుఁగులో చిత్ర బంధకవిత్వాదుల చరిత్రను చూచుట యుక్తము.

అలంకారముల పెంపకము

6. తెలుఁగులో చిత్రబంధకవిత్వాదులు

     వీని చరిత్రమును నేను నా నన్నెచోడుని కవిత్వ విమర్శలోను(1968) శృంగారనైషధ ద్వితీయ ముద్రణావతారిక లోను (1961) చాలవఱకు వాసి యున్నాను. మరల సంగ్రహముగా వ్రాసెదను. నన్నయ వ్రాయలేదు. ఆయనది కథాకథన మార్గము. 'ప్రసన్న కథాకవితార్ధయుక్తి, అక్షరరమ్యత' తాను “నానారుచిరార్థ సూక్తినిధి.' తిక్కనయు ఆంతే. కథాకథన కుశలుఁడు 'రసాభ్యుచిత బంధముగ వ్రాసినవాఁడు. నన్నయ్య చతుర్విధ కవితలను ప్రస్తావించినాఁడని కొందరు పెద్దలు తలంచి, నన్నయ భారతావతారికలో ‘మృదుమధుర చిత్రవిస్తర నవరస భావభాసుర రచనా విశారదులైన మహా కవులు' అను పాఠముదాహరించిరి. (ఆ1-8) అట్లే శ్రీనాథునిలో 'మృదు మధుర చిత్రవిస్తరకవితా విలాస వాగీశ్వరులగు కవీశ్వరులును' అను వాక్యములకు మాతాతగారు నైషధవ్యాఖ్యలో చతుర్విధ కవితలపరముగా అర్థము చెప్పక వానిని విశేషణములుగా గ్రహింపఁగా, ఆక్షేపించిరి. దీనికి నేను సమా ధానము వ్రాసితిని. నన్నయవాక్యములు -'అఖిలజలధి వేలావలయిత ... మృదు మధుర రసభావభాసురవార్థ వచనరచనా విశారదులైన మహాకవులును? ఈపాఠమునే వంగూరి సుబ్బారావుగారు గ్రహించినారు. వారు “మృదుమధుర చిత్ర విస్తర' పాఠమును సూచింపనైనలేదు. ఈకవులెవ్వరని శ్రీసుబ్బారావుగారు తర్కించి తెలుగు కవులే' యని తేల్చినారు. 'అయినచో వారు వ్రాసిన కావ్యము లెవ్వి? కానఁబడవు” అనియు వ్రాసినారు. (చూ. వారి ఆంధ్రవాజ్మయ చరిత్రము.) అప్పకవి (క్రీ. శ. 1656) నాటినుండియు వీనికి ఆశుబంధ గర్బ. చిత్రకవిత్వములను మత మేర్పడినది. నన్నయ శ్రీనాథు లిరువురును ఆశువునకు 'మృదు' వని వాడియున్నారు. మధురమో? ఆశువే మృదుమధురమై తర్వాత బంధకవిత్వమాంధ్రకవితా వధూటికొక బంధమైనదా ? చూతము.

     నన్నయ తర్వాత తిక్కన కేతన మారన మంచనలలో ఈ రీతులు కానరావు. శివకవులైన పండితారాధ్య పొల్కురికి సోమనాథాదులలో లేదు. ​శ్రీవంగూరి సుబ్బారావుగారి యాంధ్రవాజ్మయ చరిత్రను పునర్ముద్రించుచు శ్రీనిడదవోలు వెంకటరావుగారే ఇట్లు వ్రాసిరి. “చిత్రబంధకవిత్వము నన్నె చోడుని నాటినుండియు వెలసినది. భారత కవులు- శ్రీనాథుయుగమునాటి కవులు దీనిని చేపట్టలేదు. క్రీ శ. 16వ శతాబ్దినుండియు విస్తరిల్లినది.” వావిళ్లవారి నన్నె చోడ కుమారసంభవ ద్వితీయముద్రణమున “వాజ్మయమున దొలుత బంధకవితను, గర్భకవితను, చిత్రకవితను ప్రవేశ పెట్టినవాఁడు నన్నె చోడుఁడు” అనియు, “కావ్యాలంకార చూడామణి, కావ్యాలంకార సంగ్రహము, అప్ప కవీయము, మొదలగు నాలంకారిక గ్రంథముల యందీ బంధకవిత్వ ప్రస్తావమున్నది. తరువాతి ప్రబంధకవులు దీని నభివృద్ధిచేసిరి.” అనియు వ్రాసిరి.

     ఆంధ్రవాజ్మయమున చాల తర్వాత వెలసినది ఈ చిత్రబంధకవిత్వ పద్దతి. నన్నెచోడుఁడు ప్రాచీనుఁడని భ్రమపడి నన్నయకు ముందుండియు నీ మార్గమున్నదని తలంచి ఎందుచేతనో ప్రాచీనులు చేపట్టలేదని మనవారు తలఁచినారు. నన్నెచోడుఁడు ప్రాచీనుఁడు కాఁడని తిక్కనకు తర్వాతి వాఁడని నేను నిర్ణయించితిని. ప్రాచీనులెవరును చేపట్టని' చిత్రబంధ కవితా రీతులను చేపట్టుట యొకటియే చాలును ఈతఁడు అర్వాచీనుండనుటకు, మిగిలిన యుపపతుల నటుంచి.

     క్రీ. శ. 1402లో (శ్రీనాథుఁడు కొండవీటిలో విద్యాధికారియైన సంవత్సరము) వ్రాయబడిన కావ్యాలంకార చూడామణిలో కొంతలక్షణమున్నది. అంతకుముం దే కవియు వ్రాసిన జాడలేదు. జయ దేవ గోకర్ణాదుల ఛందోగ్రంథములు కనఁబడవు. కవి జనాశ్రయము వట్టి సాఫీకవిత్వమునకు మాత్రమే. కావ్యాలంకార చూడామణికారుఁడు 'లవి నన్యోన్యముఖావలోకనము లీలంజేయఁగా లేని యా విలసత్కావ్యకళా చతుష్టములోలిం బర్వనేకస్థ లింబరఁగిం'చినాడు. లక్ష్యములను బట్టి లక్షణము లేర్పఁడుననుట పరిణామ మార్గము, లోక స్వభావము. కాని తెనుఁగునకు మాత్రమట్లుకాదు. కావ్యప్రక్రియలనన్నిటిని మనవారు సంస్కృతమునుండియే గ్రహించినందున ఆంధ్రవాజ్మయ చరిత్ర యంతయు సంస్కృత మర్యాదలను మనము తెచ్చుకొన్న విథపు చరిత్రయే. తెలుగులో మొదట మొదట పద్యరచనకు వలయు ఛందశాస్త్ర గ్రంథములు, తర్వాతవ్యాకరణము- కేతన యొక్ష ఆంధ్రభాషాభూషణము మొదటిది-అటువెనుక అలంకార గ్రంథములు, తర్వాత భావరసాదులు, చిట్టచివర చిత్రబంధాది ​కవితలు, ఇవన్నియు కొంత కుదురుపాటునకు వచ్చునప్పటికి ఆంధ్రాలంకార గ్రంథములు వచ్చినవి గాని అంతవఱకు సంస్కృతలక్షణ గ్రంథములే యాధారములు. తెలుఁగురచనలు అంకితమిచ్చి ధనము సంపాదించుటకేగాని సందేహములు తీర్చుటకు సంస్కృత గ్రంథములే. ఉదా- ధర్మశాస్త్ర వైద్య శాస్త్రాదులకు తెలుఁగు గ్రంథములు కలవా? ఆంధ్రులైన విద్యానాథామృతానందాదులు సంస్కృతమునందే వ్రాసిరి.

     కాఁగా - ఆంధ్రవాజ్మయ ప్రారంభ యుగపు కవులందఱును పౌరాణికులు, కథకులు, వారిది పురాణకథన శైలి. తమంతట దొరలిన యలంకారములేగాని ప్రయత్నపూర్వకముగా కూర్చుట కానరాదు. విన్నకోట పెద్దన లక్షణము వ్రాసినను సమకాలికాంధ్రరచన కానరాదు. తన లక్షణములకు లక్ష్యములను తానే కల్పింపవలసివచ్చినది. ఆతఁడు ఆలంకార ప్రకరణములో అర్థాలంకార శబ్దాలంకారములతోనే చిత్రబంధ కవిత్వమును కలిపినాఁడు.

కం. “శ్రీలింపవలయుమది శ

బ్దాలంకారంబులైన యమకాది విచి

త్రాలిఖిత బంధభేదము

లోలిన యొక కొన్ని వాని నొనరింతుఁదగన్."

     అని చిత్రబంధ కవిత్వములను ప్రత్యేకింపక ఒకటిగానే చెప్పినాడు. కవితారీతుల భేదములలో చతుర్విధములనిగాని మృదుమధుర చిత్రవిస్తరములని వ్రాయలేదు. కారణము నాటికి లేనందుననే.

     [6]మనతెలుఁగు ప్రబంధములలో మొట్టమొదట ఇట్టి విచిత్ర రచన చేసినవాడుగా ప్రసిద్ధుఁడు జక్కనతాత పెద్దయ. ఈతని రచన లేవియు కానరావు గాని ఈతనిం గూర్చి జక్కనయే తన విక్రమార్క చరిత్రమున నిట్లు వ్రాసినాడు. (సీసమాలిక)

సంస్కృత ప్రాకృత శౌర సేన్యాదుల

ఘటికలో నొకశతకంబుఁజెప్ప,

బ్రహసన ప్రకరణ భాణాదిబహువిధ

రూపకంబులయందు రూఢిమెఱయఁ

జక్ర చతర్భద్ర చతురుత్త రాధిక

క్షుద్రకావ్యములు పెక్కులు రచింప,

నాంధ్ర కవిత్వంబునందుఁ బ్రబంధంబు

మేలునాదజ్ఞులు మెచ్చఁజెప్ప,

నిమ్ముల నేరీతి నే ధాతువులనేమి | రసముననైన వర్ణనము సేయ,

సరియేక సంధా, ద్విసంధా త్రిసంధల | దొడరినఁ బొరిఁబొరిఁగడవఁజదువ,

నెవ్వఁడేయవధాన మెఱుఁగు నయ్యవధాన ! మునవాని కించుముల్లు సూప,

వృత్త కందముఁ గందవృత్తంబునుఁ జతు | ష్కందంబు మొదలు గాఁగలుగుగర్భ

కావ్యవర్గముఁ జెప్పఁగాఁ బ్రబంధంబులు | గ్రొత్తలు పుట్టించుకొని లిఖింపఁ

గా, నక్షరచ్యుతకంబు మాత్రాచ్యుత | కంబుబంధచ్యుతకంబు నామ

గోప్యంబులుం శ్రియా గోప్యంబులును భావ ! గోప్యంబులుం జెప్పగోష్టియందుఁ

బద్యంబుగీతి కార్భటి నొగిఁ జదువంగ | నెల్ల విద్యల నంచులెఱుఁగనేర్తు,

తే. ననుచు నెల్లూరి తిరుకాళమనుజ విభుని| సముఖమ్మున సాహిత్య సరణి మెరసి,

మహిమగాంచిన పెద్దయామాత్యసుకవి | మనుమఁడవు నీ వంశమహిమయొప్పు.”

     ఈ పెద్దయ కాలమును శ్రీమల్లంపల్లి సోమశేఖరశర్మగారు తమ రెడ్డిరాజుల చరిత్రమున (హిస్తొర్య్ ఒఫ్ థె ఋఎద్ద్య్ ఖింగ్దొంస్ ఆంధ్ర ఊనివెర్సిత్య్) చక్కగా నిర్ణయించినారు. పెద్దయామాత్యుఁడు నెల్లూరి తిరు కాళ మనుజ విభుని సముఖమ్మున నుండినవాఁడు. తిరుకాళరాజులు ఇరువురుండిరి. మొదటివాఁడు తిక్కనకు ప్రభువైన రెండవ మనుమసిద్ధికి తండ్రి చోడతిక్కరాజు, రెండవవాఁడు ఈ రెండవమనుమసిద్ది కొమారుఁడు. మొదటి చోడతిక్క రాజునకు మనుమఁడు. ఈతఁడు పదమూఁడవ శతాబ్ది చివరి కాల మువాఁడు. జక్కన తాతయైన పెద్దయామాత్యుఁడు ఈ రెండవ తిక్కరాజు కాలమువాఁడని శ్రీ శర్మగారి యభిప్రాయము. క్రీ. శ. 1285 ప్రాంతము లేదా 1281.

     దాదాపు 13వ శతాబ్ది చివరికాలమున, గ్రంథస్థములు కాకపోయినను, కవితాగోష్టులలో బంధకవిత్వ చిత్రకవిత్వాదులుండినవని నిశ్చయింపనగును. మఱి పెద్దయ తెనుఁగునందా లేక సంస్కృతమందా తన కవితాశక్తిని చూపినది అను శంకకు అవకాశమే లేకుండునట్లు జక్కనయే 'ఆంధ్రకవిత్వంబునందు’ అనిచెప్పినాఁడు. అప్పటి కింకను తిక్కనగతించి చాలకాలమై యుండదు. కవిత్రయమునందలి కవిద్వయమే వెలసియుండినది. ఆరణ్యపర్వశేషమును ఎఱ్ఱన యింకను పూరింపలేదు. అదియింకను పురాణకవిత్వములకాలమే. అట్టి కాలమున జక్కనతాత పెద్దయ 'ఆంధ్రకవిత్వంబునందుఁ బ్రబంధంబు, మేలునాఁదజ్ఞులు మెచ్చఁజెప్ప ... గర్భకావ్యవర్గముఁజెప్పఁగాఁ బ్రబంధంబులు ​గ్రొత్తలు పుట్టించుకొని లిఖింపఁగా...మహిమగాంచి’ యుండెను. సమకాలిక రాజస్థానములలో కవితా గోష్ణులలో ప్రసిద్ధములగు నూతన కవితా రీతులు దేశమందు పర్వుటకు ఒక్కొక్కప్పుడు చాలకాలము పట్టదు. ఆంధ్రకవితక్రొత్త పోకడలు పోవుకాలమది. తిక్కనవంటివాఁడే కేతన సాహచర్యముచే షష్ఠ్యంతములను గ్రహించి వానికొక నూతన స్థానమేర్పఱచిపోయినాఁడు. అంకితముల పద్దతియు మారినది. అప్పుడే కాకతీయ రాజధానియందు కవులును ఆలంకారికులును సంస్కృత మర్యాదల ననుసరించి అష్టాదశవర్ణనలను పేర్కొనిరి. నానారాజ సందర్శనము చేయు నమాత్యులకు కవిత్వమొక వినోదకరణము.

 'అని మీతండ్రి మహత్వము | జనవినుత రసప్రసంగ సంగతకవితా

ఘనతేజులు కవిరాజులు | గొనియాడుదు రఖిలరాజకుంజర సభలన్'

అని జక్కన తండ్రినే పొగుడువారు. తాతను పొగడకుందురా? తెనుఁగున ప్రబంధ పద్దతి కీతఁడే జనకుఁడేమో: నాటి కాకతీయ శాసన వాఙ్మయ మీ విషయమును ఊర్జితము సేయుచున్నది.

     సమకాలిక కాకతీయ సామ్రాజ్యమందలి శాసనకవులలో క్రీ.శ.1277 నాటికి ఈశ్వరభట్టోపాధ్యాయుఁడు లేక ఈశ్వర సూరి యనునాఁతడు చిత్ర బంధాదికవి కనఁబడుచున్నాఁడు. ఈయన రచించిన శాసనములు మూఁడు, క్రీ. శ. 1259, 1272, 1279 నాటివి మల్యాల వంశస్థులవి. బూదపూరు, (మహబూబునగరు) లో దొరికినవి. (హ్య్దెరబద్ ఆర్చేఒలొగిచల్ శెరిఎస్ ణొ 13-ఈన్స్చ్రిప్తిఒన్స్ నొ 52, 51, 50).

'...మల్యాల గుండదండాధీశ్వరుండు మంత్రిపురోహిత సేనాపతి దేవారిక మహా ప్రధానానంతసుభట విషవిదూషక పాఠక పీఠమర్దనట నర్తక రసిక రంజక కవిగమకి వాది వాగ్మివందివైతాళిక హావకభావక గాయకాద్యనేక విద్వజ్జనంబులుం గొలువ సుఖోపవిష్ణుండై యిష్ట కథావినోదంబులనుండి పాణినీయ వ్యాకరణ విచిత్రకవిత్వతత్త్వజ్ఞుండును పద క్రమయుత యజుర్వేద పారగుండును నాత్రేయగోత్ర పవిత్రుండును మయూరార్య పుత్రుండును నైన యీశ్వరసూరిం గారుణ్యదృష్టిం జూచి...'

     శాసనమేమో తెనుఁగే శ్లోకములు మాత్రము సంస్కృతము. చిత్ర కవిత. ఈ శ్లోకములకు ముందు ఇట్లు నిర్దేశించినాఁడు -'నిర్దంతము-ఆర్యా గర్భము-క్రియా పదభ్రమకము, పునరుక్తాభాస, పాదాదియమకము, క్రియా ​పద త్రయ గోపకము, ఇందు విభాషపదాలు ఆఱు, స్తబకావళి, మిథునావళి, నిరోష్ఠము, అక్షర ముష్టిక నిర్మూర్ధనము, అపశబ్దాబాష అనావృతాక్షరము, ఈపద్మబంధమునందు శ్రీగుండయ అనేది నామమున్నది. ఈశ్లోకము రెండు గోమూత్రికలు. ఈ రెండుంగూడ జాలబంధము, ఈ పద్మవృత్త మునందు వాసినది గూఢ చతుర్ధమైన పద్మవృత్తము. ఇది చదివేక్రమము ప్రమొదలుగాను రేకులు తుదల మొదలిఅక్షరాలు పాదము, ద్విమొదలైన మొదలి అక్షరాలు రెండవపాదము, విమొదలైన రెండవ అక్షరాలు మూడవ పాదము, నాల్గవపాదము ఈ మూఁడు పాదాలందునున్నది, ఈపాదము లరిత కౌతుక రసప్రభతోషిత కాచకమ్ ... 'చక్రబంధము.'

     ఒక చిత్రమేమనఁగా పెద్దయామాత్యుఁడును ఈశ్వరభట్టోపాధ్యాయులును సమకాలికు లగుచున్నారు. ఏక కాలమున దేశమందు ఈ చిత్ర బంధకవిత్వాదుల స్పురణమును విచిత్రమే. ఇట్లు తిక్కన చేయని, ఆయన శిష్యులను చేయని, యీచిత్రకవిత్వమును తిక్కనకు తర్వాత అచిరకాలములోనే తెనుఁగున కొందఱును, సంస్కృతమున సరే ఎట్లును పూర్వమార్గము ననుసరించిన కొందఱును చేయుచుండిరనఁగా నిదిదేశమందు కలిగినదే. సామర్థ్యము పై నాధారపడినందున అంతవ్యాప్తికి రాలేదని తెలియుచున్నది. జక్కన కాలము సుమారు క్రీ. శ. 1375. ఎఱ్ఱన కించు సమకాలికుఁడు, శ్రీనాథుని కన్నను పెద్దవాఁడు, తనకాలవు కవితారీతుల నిట్లు చెప్పినాఁడు.

“ప్రతిభాగుణధురీణ పౌరాణిక త్రాణ, సకలపురాణశాస్త్రములయందు,

బరమార్థ చరితార్థ భారత రామాయణాది ప్రబంధకావ్యములయందు,

గల్పాంతరస్థాయి గద్యపద్యపాయకమనీయ చిత్రకావ్యములయందు,

రసికజనానంద రససుధానిష్యంద విలసిత నాటకావలులయందు.

సకల దేశ భాషా విశేషములయందు,

వం సఁ బ్రఖ్యాత మనఁగ నుత్పాద్యమనఁగ

మిశ్రమననొప్పు సత్కథామేళనంబు

లెన్ని యన్నియువిన్నాఁడ బిన్ననాఁడ."

     ఇవన్నియు సిద్ధయామాత్యుఁడు చెప్పినట్లు జక్కన వ్రాసినాఁడు. తెలుఁగునుగూర్చియా సంస్కృతమును గూర్చియా? తెలుగులో నాటకము లేవియుండినవి, నాఁడు లేవే! సంస్కృతాంధ్రములు రెంటిని కలిపి ​ఉమ్మడిగా చెప్పుటయా, రాజరాజ నరేంద్రుఁడు నన్నయ్యతో 'విమలమతింబురాణములు వింటి ననేకములు. ..ఉదాత్తరసాన్వితమైన కావ్యనాటక క్రమములు పెక్కుచూచితి...' నని చెప్పినది తెలుఁగునుగూర్చి యుండదు. ఏలన నాటికి ఆంధ్రమహాభారతమే యింకను పుట్టలేదు. సంస్కృతమును గూర్చి చెప్పినదే. జక్కనదిగూడ గీతమునుండి 'సకలదేశభాషా' ఇత్యాది తెలుగును గుఱించినదిగా గ్రహింపవచ్చును. కాని క్రీ. శ. 1300కు చాల ముందుండియు ఇట్టి వాఙ్మయము ఆంధ్రదేశమందు (భారతదేశమందే) అభివృద్ధియగుచు వచ్చినది. వాఙ్మయమందు కావ్యము ప్రఖ్యాతము ఉత్పాద్యము మిశ్రము అని మూఁడుతెగలుగా విభక్తమైనది. ఇదికూడ తెనుఁగును గుఱించియా సంస్కృతమును గుఱించియా? చిత్రకావ్యములును గుఱించికూడ ప్రస్తావించియున్నాడుగదా, అవేవీ? ఏ వాఙ్మయములో, మఱి 1300 నాటికే ఇవి ఆంధ్రవాఙ్మయమున నుండి యుండినయెడల కవిత్రయమువారిని వదిలినను, శ్రీనాథ పోతనాదులు కూడ దీనిని చేపట్టక తర్వాతికవులే ఎక్కువగా చిత్రకవిత్వమందు విజృంభించినది పరిశోధనీయముగాదా?

      జక్కనకు, ఎఱ్ఱనకును ముందువాఁడు మడికిసింగన సకలనీతి సమ్మతమున, తన నీతితారావళినుండి యీ క్రింది పద్యము నుదహరించినాఁడు.

      'పలుకుల తీపును సరసము

       చెలువము నడఁబెడఁగు బంధచిత్రముసొబగున్

       గలకలనఁ జూపవలదే

       కలకంఠియుఁ బోలెఁగవిత కందనమంత్రీ.'

మఱితానేమి ‘బంధచిత్రము' వ్రాసినాఁడు? కానరాదు.

       ఎఱ్ఱననుగూర్చి జక్కన - 'ఈత్రయిఁదాఁ బ్రబంధపరమేశ్వరుఁడై ... ఆచిత్రకవిత్వ వాగ్విభవజృంభితుఁ గొల్చెద'నని వ్రాసినాఁడుగదా, బంధచిత్ర కవిత్వ మీతని రచనలో లేనందున వట్టి రచనాధోరణినిగూర్చినదిగా తోఁచు చున్నది. తన నృసింహ పురాణము ప్రబంధమని చెప్పుకొన్నాఁడుగాని మనుచరిత్ర వంటిదా? కాదు. ‘చిత్రకవిత్వ' మనఁగా అర్థాలంకార శబ్దాలంకారములను పూర్వులకన్న నెక్కువగా వాడినాఁడనియే భావము.

       మనకు మూలాధారమైన సంస్కృతవాఙ్మయమందన్ననో శిశుపాలవధాది కావ్యములయందు కనఁబడుచుండుటచేత మాఘుని కాలమునకే అనఁగా  క్రీ.శ. 700 ప్రాంతముగాన ఎనిమిదవ శతాబ్దమునకే చిత్రబంధరచన ప్రాముఖ్యమునకు వచ్చినది. ఇందులో సంప్రదాయభేదములు కవుల ప్రతిభ చేతనో లేక దేశకాల వ్యత్యాసములచేతనో కనఁబడుచున్నవి. చక్రబంధములు ఆంధ్రమున చాలవఱ కొక్కతీఱుఁగా నున్నవిగాని ఇటీవలివాడైన వావిలాల వాసుదేవశాస్త్రిగారు తామే మార్చిరో లేక ఏదైన సంప్రదాయ మనుసరించిరో తెలియదు. (చూ. ముందు) అందరిని మించి మనకింకను చిక్కులు పెట్టుటకు నన్నె చోడుఁడు తన చక్రబంధమున కృతిపతి కృతిక రృ నామములు వచ్చునట్లు వ్రాయలేదు. వలయమునందు మూఁడవ యక్షరములను చేర్చిన ‘ములకం సేషైక” అనియు, ఆఱవ యక్షరములను చేర్చి చదివిన “నామమందై దేవ' అనియు నగుచున్నవి. అర్ధమేమో తెలియుటలేదు. ఇది నన్నెచోడును ప్రాచీనత కొక కారణము.... ఈవిధముగానే కవి రాజమార్గమను ప్రాచీన తమ కావ్యములో నీ నియతి కానరాదు. ఈ మర్యాద యిటీవల బుట్టెనని తోఁచుచున్నది' అని శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారు 1914 లో (కు. సం. ద్వి. భాగ పీఠిక) వ్రాసినారు. ఒకవిధముగా ప్రాచీనతను సూచించుట వాస్తవమేగాని ఏ కాలమును? ఈశ్వర భట్టోపాధ్యాయుని చక్రబంధమున కవియొక్కయు కృతిపతియొక్కయు నామములు గలవు. కాని శ్లోకమది. సంస్కృతము. శాసనముయొక్క తారీఖు క్రీ. శ. 1259 దీనినిబట్టి నన్నె చోడుడు సంప్రదాయమును ఎఱుగఁడని చెప్పవలయును. ఆట్లైన 1259కి ముందువాఁడగును. అది కుదురదు. 1259 నాటి తిక్కన యున్నాడు. షష్ఠ్యంత సప్తసంతాన కృతి ప్రారంభకర్త వ్యాద్యనేక విషయములచేత ఇతడు తిక్కనకు తర్వాతివాఁడుగాని ముందువాఁడు కానేరడు. కాబట్టి ఈతఁడు భిన్న సంప్రదాయ మైనను అనుసరించి యుండవలెను, లేదా ఈశ్వరభట్టుని సంప్రదాయ మింకను ఆంధ్రకవిత్వములోనికి ప్రవేశింపలేదని యైనను చెప్పుకొనవలయును. కావ్యాలంకార చూడామణిలో ఈశ్వరసూరి పద్దతియే యున్నది. విద్యానాధుని లక్షణ లక్ష్యములలో ఈశ్వర సూరి పద్ధతి వచ్చిన తర్వాతనే ఆంధ్రకవు లీమార్గమును గ్రహించిరేమో ! ఇందువలన నొక విషయము తెలియుచున్నది. గీర్వాణాలంకారికుల పద్దతులు ఒక వాహినిగా ఒక్కుమ్మడిగా ప్రవేశింపలేదని నన్నెచోడుడిందువలన ఈశ్వర సూరి విద్యానాధుల నడిమివాఁడు కాఁదగును.

     శ్రీ పూండ్ల రామకృష్ణయ్యగారు ఈ కవియొక్క బంధగర్భ చిత్ర కవిత్వాదులను గుఱించి చాల వ్రాసియున్నారు. వీరియుపోద్ఘాతముకూడ మరల ​నెప్పటికి పునర్ముద్రణభాగ్యము నొందునో తెలియదుగాన అందలి ప్రధానాంశములునైనను ఇచ్చట తెలుపుట మంచిదని వ్రాయుచున్నాను. “ఈ గ్రంథము నందు బంధకవిత్వ గర్భకవిత్వ చిత్రకవిత్వములు విశేషముగ వ్రాయబడి యున్నవి. ఇందుదహరింపఁబడిన గర్భకవిత్వ చిత్రకవిత్వ బంధకవిత్వములలో 808 వ సీసపద్యమును బోలిన పద్యమిదివఱకు నాంధ్రగ్రంథములలో నెచ్చటను వ్రాయబడియుండలేదు. ఈపద్యమునందు గర్భితములన్నియు నఱువదికిఁ బయిగా నున్నయవి. ఈ యఱువది గర్భితములును రకార ప్రాసఘటితములై యున్న యవి. ఇందుఁ గంధములుగఁ తేటగీతులు, ఆటవెలదులు శోభాన మంగళారతులు, శ్లోకములు, చౌపదములు, వృత్తములు, అష్టకములు ధవళములు, అర్థ చంద్రికలు, ఉత్కళికలు రగడలు, దరువులు, ఉభయభాషాకందములు లోనగు గర్భితములు వ్రాయబడియున్నవి. ఇంతియగాక యీ సీస తేటగీతి యంతయుసర్వలఘువులతో గూర్పబడిఁ యున్నది. వెండియు సీసములలోనుండి వింశతిబంధకందము కూడ వ్రాయబడియున్నది. ముంజేతి కడియమున కద్దమేల? ఇప్పుడీ పద్యము ముద్రింపబఁడి మీ యెదుటఁ బెట్టబడియున్నదిగాన మేము విశేషము దీనింగుఱించి వ్రాయఁబనిలేదు.

     “ఇట్టిపద్యమిదివరకుఁ దెలుగు గబ్బములలో నెవ్వరును వ్రాసియుండ లేదు...807, 809, 810, 817, 818. 821, 822,825, 826, 827, 831. 832, 847, 850, 863, 870 లో నగు పద్యములు గర్భితములచే వెలయుట చూడగా నిక్కవిని జతుర్విధ కవితా నిర్వాహకుండని చెప్పుటకు నించుక యైనను సందియములేదు. బంధ కవిత్వ చిత్రకవిత్వాదులకుఁ గొన్ని లక్షణములగపడు చున్నవిగాని గర్భక విత్వాదులకు లక్షణములు బొత్తుగఁ గనిపింపవు. అప్పకవి గర్భకవిత్వమునకు లక్షణమును వ్రాయకనే తాను కొన్ని గర్బితవృత్తములు వ్రాసియున్నాఁడు. ఒక్క చతుర్విధ కందమునకుఁదప్ప మఱి దేనికిని నప్పకవీ యమునందు లక్షణమగపడదు గర్భకవిత్వ చిత్రకవిత్వములు కవియొక్క పాండిత్యాతిశయము పై నెక్కొనినట్లున్న యవి. అట్లుగానిచో పై నుదహరించిన సంఖ్యగల యీ గ్రంథములోని గర్బిత పద్యములు వ్రాయుట కీకవికి లక్షణ మెట్లుండునని యూహజేయగలము. అఱువదినాల్గు గర్భితములు మాత్రము వ్రాయవలసినట్టు లక్షణముండునా? ఉండదు కాబట్టి వారివారి పాండిత్య ప్రగల్భత ననుసరించి గర్భకవిత్వమును వ్రాయవచ్చునని యూహజేయుచున్నారము. ​“ఇఁక చిత్రకవిత్వ విధమెట్టిదనఁగా ననులోమ విలోమమము, ఓష్ణ నిరోష్ఠ్యము, తలకట్టులు, గుడులు, శృంగములు, అక్షరవిలోమము, పద్యభ్రమకము, ఎకపది ,ద్విపద, త్రిఁపది, యేకాక్షరి, ద్వక్షరి, నిస్తాలవ్యము , నిష్టంఠ్యము, నిర్దంత్యము, నిర్మూర్దన్యము, నిరంతస్థము, నిర్మూష్మకాదులచేఁ బద్యములు వ్రాసిరేని యది చిత్రకవిత్వమనిపించుకొనును. ఈ చిత్రకవిత్వమును నిక్కవియు నీగ్రంథ మునందు 75, 214, 221, 222, 230, 366, 392, 807, 808, 832 లో 1, 2, 849, 877, 878 యీ పద్యములలో వ్రాసియున్నాడు. వీనికి లక్షణములు అప్పకవీయాది తెలుగుగ్రంథములయందుండును సాహిత్య రత్నాకరములోనగు సంస్కృత గ్రంథములయందును వ్రాయఁబడియున్నవి.

     “ఈ గ్రంథమునందు గోమూత్రీకాబంధము, ఛత్రబంధము, నాగ బంధము, ఖడ్గబంధము, చక్రబంధము, గుచ్ఛబంధము, హలబంధము, అష్టదళ పద్మబంధము, రథబంధము, పట్టిసబంధము, త్రిశూలబంధము, పాదహబంధము, చతుర్దశగర్భితద్వాదశ దళపద్మబంధము, పుష్పమాలికా బంధము, మహా నాగ బంధము, లోనగు బంధములు వ్రాయబడియున్నవి. ఈ బంధగ్రంథగ్రంథములు వ్రాయబడిన తాళదళసంపుటములు మాకు హస్తగతమై, బంధస్వరూపములు తెలిసినను బంధ లక్షణములు తెలిసికొనుటకు ప్రయత్నించగా కావ్యాలంకార చూడామణీ నరసభూపాలీయములయందుఁ గొన్ని బంధములకు మాత్రము ఈ క్రింద వ్రాయబడిన విధముగ లక్షణము వివరించి యున్నది. 

(అ) కావ్యాలంకార చూడామణియందు.... (చూ. కావ్యా. “వలయదళంబు ' నర. భూ.

పదిచుట్లు నాఱురేకులు...

         “... పై లక్షణకారుల పద్యములు చక్రస్వరూపమును తెలిసికొనుటకు చాలదని విచారించి సాహిత్యరత్నాకరమును చూడగాఁదద్వాఖ్యాన కర్తయగు బ్రహ్మశ్రీమల్లాది లక్ష్మణ సూరి విరచితమగు మందరమను పేరుగల వ్యాఖ్యానము నందు నీ క్రింది లక్షణము శ్లోక రూపముగ వ్రాసియున్నది.


     శ్లో. బధ్యతే షడరం చక్రం ప్రత్యరం తన్న వాక్షరం

         త్రయాణామపి పాదానాం దశమం కర్ణికాక్షరం

         ఆదితస్స్వస్వతుర్యారై స్త్రయః పాదాశ్చతుర్థగాః

         వర్షాఃషష్టాణంత్యమారభ్య సంవదంతేంతి మాక్షరైః

         మధ్యేద్వౌద్వౌవిసంవాదౌ షడరేషు క్రమాద్భవేత్

         చతుర్థేసప్తమైర్వర్ణేర్వర్ణనం కవివర్ణ్యయోః"

​అని వ్రాసియుండుటవలనఁ జక్రబంధమునకు లక్షణము పూర్ణముగాఁ దెలిసినది. బంధములలోఁ గృతిపతి పేరు, కృతికర్త పేరు నిమిడియుండు బంధమిది యొకటి గాని మఱి గనుపడవు. బంధస్వరూపమునందెన్ని నియమములగుపడుచున్నవో యవి యన్నియు శ్లోకమునఁ గూర్పబడియున్నవి. ఈ చక్రబంధమునందు శార్దూలవృత్తము ప్రాయికము... ఈ విధి ప్రకారము వ్రాసి చదివినయెడల మూఁడవవలయమునఁ గవి పేరును, ఆఱవవలయమునఁ గృతిపతిపేరును గోచ రించును. ఈ నియమము మఱికొన్ని చక్రబంధములలో మఱియొక విధముగా గనుపించుచున్నదిగాని నాల్గవ వలయమునందెక్కడను గృతిపతి పే రగుపడదు. ఇది బ్రహ్మశ్రీ వావిలాల వాసుదేవశాస్త్రులు బి.ఎ గారు రచించిన “ఆంధ్ర రఘువంశము" లో ముద్రింపఁబడియుండు చక్రబంధమునందు 'గ్రిగ్గుదొరపతి' యని నాలవ వలయమున నగపడుచున్నది" తర్వాత వీరు ఆంధ్రవాఙ్మయము నందలి లెక్కలేని ప్రబంధములయందుండి ఉదాహరణములు చూపి... “నాలవ వలయమున నెవ్వరును వ్రాసియుండలేదు... పైన వ్రాయఁబడిన చక్రబంధ పద్యములయం దన్నిటను 3-6 వలయములయందు కవి కృతిపతుల పేళ్లగుపడుచున్నవి. వాసుదేవ శాస్త్రులవారి చక్రబంధమునందు నాఱవ వలయమునఁ గవి పెరగుపడుచున్నను...ఏలకో...'వాసుదేవకృతి' యని తమ పేర ప్రదక్షిణంబు గను బంధమున నెలకొల్పియున్నారు ఇది. చింత్యము”

ఈ ప్రబంధరాజములోని 881 వ పద్యమగు చక్రబంధమునందు మూడవ వలయమున “కవి వేంకటాద్రి' యనియు, నాఱవ వలయమున 'ప్రబంధ రాజము' అనియు వ్రాసియున్నది. ఇట్లు వ్రాయుటకుఁ గారణ మూహించునది. సాహిత్యరత్నాకరములోని ఈ క్రింద నుదహరించిన చక్రబంధ శ్లోకమున మూఁడవ వలయమునందు 'ధర్మ సూరికృతిః' అనియు, ఆఱవవలయమున 'రామ గుణ నుతిః' యనియు, 'రథపదబంధ' మనియు వ్రాయబడియున్నది. ఇది చూడగా నీ చక్రబంధము నేర్పఱచుటయందుఁ బాండిత్యము ననుసరించి చిత్రముగాఁ గవి తన కిచ్చవచ్చినట్టు నేర్పఱుపవచ్చునని తోఁచుచున్న ది.

     “ఇఁక సాహిత్యరత్నాకరములోని చక్రబంధ శ్లోకమున చూడుడు

 శ్లో. “దర్బాంధ ప్రసరాసురస్థిరమద ప్రాణప్రహార క్రియో

       విష్ణుర్మన్మథ మన్మథస్థ్సిరశివం భానుక్షపాకృత్ప్రభాం

       దత్తాం సూనృత గుర్విపద్దర విధస్ఫాతిః ప్రహేతిః పరం

       రమ్యోమే దయయా విరాధదమనో యోగీంద్ర భావ్యశ్చిరం.

ఆత్ర తృతీయవలయే 'ధర్మసూరి కృతిః' షష్ఠే 'రామగుణనుతిః' అష్టమే ‘రథపదబంధః ' ఇతిచ ప్రతీయతే, బవయో రభేదాత్ | ” అని సాహిత్యరత్నాకరములో వ్రాయఁబడియున్నది.

“ఈ చక్రబంధమును 'షడరచక్రబంధము' అని మఱియొక నామమున బిలుచుచున్నారు. 808వ సీసపద్యములోని వింశతిభేద బంధకందము చక్ర బంధముతో నిమిడ్చి వ్రాసియున్నది. ఇందులకుఁ గారణము మృగ్యము. వెండియు ద్విచతుష్క చక్రబంధమనియు, చతురస్ర చక్రబంధమనియు, గరుడ గతి చక్రబంధ మనియు, అష్టాక్షర చక్రబంధమనియు నీ పేర్లం బరగు కొన్ని బంధములను వానివాని స్వరూపములను బళ్లారి జిల్లాలోని చినబల్లాపుర వాస్తవ్యులగు శ్రీమాన్ గోపాలాచార్యులవారు గురుమూర్తి నాయనింగూర్చి వ్రాసి యున్నారు. ఈ బంధభేదములకు లక్షణమువిచారించునది. శ్రీమాన్ గోపాలా చార్యులు విరచించిన బంధములన్నియు వాని నిజరూపములతో 1872 సంవత్సరమునందు ముద్రింపబడియున్నవి గాన వాని స్వరూపముల నాపటములందుఁ జూచుకొనునది.

     (బ్) ఇక గోమూత్రికాబంధ లక్షణము కావ్యాలంకార చూడామణి యందు నివ్విధముగా వ్రాసియున్నది.

      20. తే. “వర్ణములుమూఁడు పంక్తుల వరుసవ్రాసి

               మూలలం దోలి గోమూత్రలీలఁ జదువ

               నుక్త్య పద్యంబు దానగు చుండెనేనిఁ

               దనరు గోమూత్రికాఖ్య బంధంబుననగ.”

ఈ గోమూత్రీకాబంధనమునకు లక్షణ మితర గ్రంథములయం దగుపడదు. సాహిత్యరత్నాకరమునందు గోమూత్రికాబంధ, చక్రబంధ, మురజబంధ, అష్టదళపద్మబంధ, క్షురికాబంధ, సర్వతోభద్రబంధ, ఖడ్గబంధ, హలబంధ, చాపబంధ, గుచ్చబంధ, మత్స్యబంధములు వ్రాయబడియున్నవిగాని వ్యాఖ్యా నమునందు లక్ష్మణసూరిగారు అష్టదళపద్మబంధ, నాగబంధ, చక్రబంధములకు దప్పఁ దక్కిన బంధములకు లక్షణము వ్రాయరైరి. ప్రతాపరుద్రీయ వ్యాఖ్యానమునందును నిమ్మూటికి మాత్రమే లక్షణము వ్రాయఁబడియున్నది.

(చ్) ఇఁక అష్టదళ పద్మబంధమునకు నరసభూపాలీయమున నివ్విధముగ లక్షణము వ్రాయబడియున్న ది. ​

21 చ. "కనుఁగొన ఱేకు లెన్మిదియుఁ

                    గర్ణిక చుట్టిడి స్రగ్ధరాంఘ్రుల

         న్మునుపటి యేడువర్ణములు

                    నుంగడ యేడుఁ బ్రవేశ నిర్గతు

         ల్పనుపడ నాల్గు దిగ్దళము .

                    లన్లిఖియించి విదిగ్ధళంబులం

         దెనయఁగఁ బాదమధ్యగము

                    లేడును వ్రాయఁగఁ బద్మబంధమౌ."

ఇందుకు సమమగు శ్లోకము సాహిత్యరత్నాకర వాఖ్యానమునందు నివ్విధముగ వ్రాయబడియున్నది.

     శ్లో. కర్ణికాది విభేద్వరాన్ క్రమాద్దిక్షు విదిక్షు చ

         సకర్ణికాంత్సప్తదిక్షు విదితక్షుతువికర్ణికాన్

         ప్రవేశ నిర్గమాఖ్యాంచ దిక్షుతేస్యు శ్చతుర్దశ

         వ్యవధానేన తానాద్యే దళేన్యత్రత్వనంతరాన్.

నరసభూపాలీయము దీనిని స్రగ్ధరావృత్తముతో వ్రాయవలయునని విధించినను కావ్య ప్రకాశికయందు నీ యష్టదళ పద్మ బంధము స్రగ్ధరావృత్తముతో వ్రాయఁబడక అనుష్టుప్ శ్లోకముతో నివ్విధముగ వ్రాయబడియున్నది. ఎట్లనగా

     శ్లో. “భాసతే ప్రతిభాసార | రసాఖాతా హతా విభా

         భావితాత్మ శుభావాదే | దేవా భావ తతేసభా”

సాహిత్యరత్నాకర ప్రతాపరుద్రీయముల యందు స్రగ్ధరలతోఁ గూర్చబడియే యున్నది,

     (ద్) ఇఁక సాహిత్యరత్నాకర వ్యాఖ్యానమందు నాగబంధ లక్షణము

     శ్లో. రేఖాభ్యాం చతురశ్రాణి చతుష్కోష్ఠాని కల్పయేత్

          రేఖా ద్వయాంతరాళే స్వాద్యథాకోష్ఠే గృహష్టకం

          విదిక్షు కుండలీకూర్వా త్తద్రేఖాగ్రైర్యథాక్రమం

          దిగ్రేఖాగ్రాణి బాహ్యాని యోజయే ద్దిక్త్రయేమిథః.

   శ్లో.  ఏకత్రతు ఫణ పుచ్చమేళనం కల్పయే త్తథా

         అంతరాణ్యక్షయీ కుర్యాత్సం దంతాస్స్యుర్యథావిథః

         వర్ణావృత్తిస్థలాన్యత్ర కోష్ఠకోణాని షోడశ

         సందంశానాం చతుష్కంచ కంఠశ్చేత్యేకవింశతిః.

  శ్లో. ఆవృత్తిద్యుగ్మ వర్జానాం నేతరేషా మిహక్వచిత్

       అర్కేశానదశ బ్రహ్మ వర్ణః పాదచతుష్కగాః

       ఆవర్తేన్నైరృతాది కుండలేష్వ ప్రదక్షిణం

       యదై వంస్యాత్తధావర్ణా స్ఫణాతో విన్యసేత్క్రమాత్.

శ్లో. త్రించడష్టావింశతిశ్చ షడ్వింశతిరను క్రమాజ్

     వేష్టనత్రితయేవర్ణస్స మాప్తిస్తు గుళాంతరే

     సర్వమ్ తన్ని ధాయాంత స్సంగృహీతం మహాత్మభిః.

శ్లో. విదిక్థ్సలే కుండలితం స్వమంగం

    స్వేనత్రిరావేష్ట్య విభంగి భంగం

    క్షిప్త్వాగళేపుచ్చమహేస్థితస్య

    పాద్యః ఫణాతః ఫణిబంధ ఏషా.

అని నాగబంధలక్షణము సాహిత్య రత్నాకరమున వ్రాయబడి యున్నది. ఆంధ్రలక్షణ గ్రంథములలో నెచటను దీని లక్షణమగు పడనందున సంస్కృత శ్లోకమునే వ్రాసితిమి. వాసుకిద్వయబంధమనియుఁ గృష్ణ సర్ప ద్వయ బంధమనియు నాగలింగబంధమనియుఁ గొన్ని భేదములగుపడుచున్నవి. వీనికి లక్షణము విచారించునది

    (చ్) రథబంధకందమునకు సంస్కృతాంధ్రములయందు లక్షణ మగుపడదు ఈ గ్రంథమునందలి 854 వ పద్యమగు రథబంధ కందమునందలి 1, 3, 7, 21, 29, 35, 39, 40 యీ సంఖ్యలు గల యక్షరములను జేర్చి చదివినచో 'శ్రీవేంకటేశ నీవేగతీ' అని బంధ మధ్యమునం దేర్పడుచున్నది. ఈ రథబంధమును సీసపద్యముతోఁ గూడా బ్రహ్మశ్రీ గోపీనాధము వేంకయగారి కృతమగు శిశుపాల వధమహాకావ్యమున వ్రాయఁబడియున్నది. అందలి నడిమి యక్కరములఁ జేర్చి చదివినయెడల “శ్రీరాజ గోపాలకృష్ణ యాచేంద్రమ హీరమణ" అని చిత్రము గనుపడుచున్నది. ఈ రథబంధములు చిన్నవిగను పెద్దవిగకు నానావిధములుగఁ గవులు వ్రాసియున్నవి పెక్కులు గనుపడు చున్నవి. వీనికన్నిఁటికి లక్షణము విచారించునది.

18) ఇతర గ్రంథములలోని బంధకవిత్వ చిత్రకవిత్వ గర్భకవిత్వ పద్యముల నామములఁ దెలుపు పట్టిక.

​1. పెద్దన ముకుందవిలాసమునందు వృత్త కంద గర్భిత సీసము. ద్విపద చౌపదలాలీశోభానమంగళారతి సువ్వాల ధవళాది వివిధ భేద సీసము కందద్వయ గర్బిత చంపకమాలికావృత్త విశేషబంధచిత్రకందము, శైలబంధ చిత్ర కందము, పుష్పగుచ్ఛ బంధ చిత్ర పంచచామరవృత్తము, చక్రబంధ చిత్ర శార్దూలము , ఛత్రబంధ చిత్రకందము, గోమూత్రీకాబంధ చిత్రసుగంధి వృత్తము, నిరోష్ఠ్య ద్వివిధకందము.

2. కనుపర్తి అబ్బయకవి కవిరాజమనోరంజనములోనఁ గంద ద్వయ రుగ్మవతీ కమలవిలసితగర్భ క్రౌంచపద వృత్తము, గోమూత్రికా బంధకందము, గోమూత్రీకాబంధ ఉత్సాహవృత్తము ఛత్రబంధకందము చక్ర బంధశార్దూలము ఖడ్గబంధకందము, పుష్పమాలికాబంధ చంపకమాల, నాగబంధ చంపకమాల, పాదభ్రమక కందము, ఓష్ఠ్యకందము, నిరోష్ఠ్య మహాస్రగ్ధర, సర్వతోభద్రబంధశ్లోకము, ద్వక్షరకందము, ఆంధ్ర గీర్వాణ భాషాశ్లేషకందము.

౩. పారిజాతాపహరణమునందుఁ బాదభ్రమకకంద, గోమూత్రీకాబంధ కందము, నాగబంధ చంపకమాల, ఛురికాబంధకందము, చక్రబంధశార్దూలము, ద్వక్షరకందము, ద్విపద క్రౌంచపదవృత్తము, గర్భిత భుజంగప్రయాత స్రగ్విణి.

4. బట్టుమూర్తిగారి నరసభూపాలీయమునందు అష్టదళ పద్మబంధము, వృత్త కంద గర్భసీసము, చక్రబంధము.

5. భరతాభ్యుదయమునందుఁ బుష్పమాలికా బంధ సీసము, పుష్ప గుచ్చబంధ విద్యున్మాలావృత్తము, మత్తేభ మణిగణనికర వృత్తద్వయ గర్భిత సీసము, కందపద్య గర్భిత చంపకము చక్రబంధ తరళవృత్తము, నిరోష్ట్య కందము, సర్వౌష్ఠ్యకందము, అచలజిహ్వోక్తిగీతము, పాదభ్రమక కందము.

6. ఓగిరాల జగన్నాధముగారి సుమనోమనోభిరంజనమునందు నాగబంధచంపకమాల, ఛత్రబంధకంద ము, మర్దలబంధకందము, పుష్పమాలికాబంధ చంపకము, గోమూత్రీకాబంధకందము, పుష్పగుచ్ఛ బంధమాణవక వృత్తము. ​

7. సూరయవేంగనగారి రామరాజీయమున చక్రబంధ శార్దూలము , నాగబంధ చంపకమాల, గోమూత్రీకాబంధకందము, చతుశ్చరణ గర్భకందము , ద్వికంద గర్భక్రౌంచపద వృత్తము, నవగ్రహాష్ట దిక్పాలక దశావతారనామ గర్భకందము.

8. కూచిమంచి తిమ్మన్న గారి రసికజనమనోభిరామమునందుఁ గందమణిగణ నికరవృత్తము సగర్బ స్రగ్విణీ భుజంగప్రయాత ద్రుతవిలంబిత వృత్త సీసము సగర్భమత్తేభకంద సీసము.

9. పిండిప్రోలు లక్ష్మణకవిగారి లంకావిజయమున నాగబంధ స్రగ్ధరా వృత్తము, కందమణి గణనికరవృత్తము, చతుర్విధ కందము, పుష్పగుచ్చ స్రగ్ధరా వృత్తము, ఉభయభాషాకందము.

10. అడిదము సూరన్న కవిజనరంజనము నందుఁ జతుర్విధ కంద గర్భిత మణిగణనికరవృత్తము, చతుర్విధ కందగర్భిత ప్రమితాక్షరవృత్తము.

11. సుబ్రహ్మణ్య విజయమను విద్వత్కర్ణామృతమున చిత్ర గర్భిత వచనములో సీసగర్భిత పాదము, పుష్పమాలికాబంధ భాగము, నాగబంధ భాగములోనగునవియు, ముక్తపదగ్రస్త కందద్వయ గర్బిత చంపకమాలికా నాగబంధము, శైలబంధకందము, మణిగణనికరగర్బిత కందము, భుజంగ ప్రయతగర్బిత స్రగ్విణి, తరువోజ సమపాదోత్సాహవృత్తావతంస భుజంగ ప్రయాత స్రగ్విణీవృత్త ద్విపదమంజరీగర్భిత దండకరూప చిత్ర సీసానుచర చతురంగతురంగ సకలగృహవార ప్రచార దేశిక చిత్రగీత సీసము, మణిగణనికర గర్బితకంద పుష్పమాలికాబంధము, కాంభోజీరాగ పదగర్భిత చిత్రసీసము, సహనాఖ్యరాత పదగర్బిత సీసము, ముఖారిరాగ పదగర్బిత సీసమాలిక, ఆనంద భైరవిరాగ కీర్తనాగర్బిత సీసము, ముఖారిరాగ పదగర్భిత సీసమాలిక, చతుర్థ పాద గోపనకందము.

12. బహుజనపల్లి సీతారామచార్యులవారి సుందరరాజ శతకమునందు ఖడ్గబంధకందము.

13. మచ్చ వేంకటకవిగారి శుద్ధాంధ్ర నిరోష్ఠ్యనిర్వచనకుశరాట్చరిత్రమునందుఁ బుష్పబంధ చంపక మాల, కందగర్భ చంపక మాల. ​సుగంధివృత్తము, సగర్బకంంద మణిగణనికరవృత్త తేటగీతి, సగర్బ మత్తకోకిల వృత్త సీసము, శకటబంధ కందము, అనులోమ కందము.

24. సింహాద్రి వేంకటనామధేయ విరచితమగు చమత్కార మంజరి యందుఁ బుష్పబంధ స్రగ్ధరావృత్తము, చక్రబంధ శార్దూలము.

25. రామకృష్ణోపాఖ్యానమను శ్లేష కావ్యమునందుఁ గందగీత గర్భిత చంపక మాల, పుష్పమాలికబంధ చంపకము, స్రగ్విణీగర్భ భుజంగప్రయాత వృత్తము, కందగర్భ మణిగణ నికరవృత్తము.

28. ధరణి దేవుల నాగయ్య విరచితమగు దశావతారచరిత్రమున నోష్ట్యాంచలజిహ్వద్వ్యక్షరీ కందము, పుష్పమాలికబంధ చంపకమాల, గోమూత్రి కాబంధ చంపకమాల, ఛత్రబంధ కందము, నాగబంధ స్రగ్ధరావృత్తము, పాదగోపన చంపకమాల, అనలోమ విలోమకందము, అష్టదళ పద్మబంధ స్రగ్ధర మంజుభాషిణీగర్భ యుత్పలమాల.

27. వేదాంతదేశిక విరచితమగు పాదుకాసహస్రమునం దుత్తర భాగమున గోమూత్రీకాబంధము, ముర జబంధము, శరబంధము, గరుడగతిచక్ర బంధము, ద్విశృంగాటక చక్ర బంధము, ద్విచతుష్క చక్రబంధము, చతురర్త చక్రబంధము, అష్టదళ పద్మ బంధము, సకర్ణిక షోడశ పద్మబంధము, చతురంగ తురంగ పదబంధము సర్వతోభద్ర యివి వ్రాయబడియున్నవి. వెండియు బ్రహ్మశ్రీ వఠ్యము పరబ్రహ్మ శాస్త్రులవా రనేక బంధములు సంస్కృతాంద్రముల యందు వ్రాసి యున్నారు. వానిలోఁ గంకణబంధము మిగులఁ జిత్రముగనుక నిందుఁ బొందు పఱచుచున్నాము. ఈ కంకణబంధమున నెచట నారంభించి చదివినను శ్లోక మేర్పడుచున్నది గాన నిందు 84 విద్యున్మాలా వృత్తములుగల కంకణ బంధము లగుపడుచున్నవి.

    శ్లో. వ్యాసాద్యావా కామాధ్యాయా

        పాల్యాత్వా గాత్రీలాత్రాశా

       స్త్రాధారాభా టీక్యాభ్యాప్యా

        లీనామేహా వైస్మాస్యాభా.

(విద్యున్మాలావృత్తాని 64 కంకణబంధోదితాని) పై నుదహరించిన గోమూత్రీకాబంధ పుష్పమాలికాబంధ పుష్పగుచ్ఛబంధ ఛత్రబంధనాగబంధములు, ​తెలుఁగుఁ గబ్బములలో నానావిధ పద్యములతో వ్రాయఁబడియున్నవి-ఎట్లనఁగా గోమూత్రీకాబంధము సుగంధివృత్తము నందును ఉత్సాహవృత్తము నందును చంపకము నందును గందము నందును; పుష్పమాలికాబంధము సీసమునందును స్రగ్ధరయందును, చంపకమునందును, రథబంధ కందమునందును సీసము నందును; పుష్పగుచ్చబంధము పంచచామర వృత్తమునందును, విద్యున్మాలా వృత్తమునందును మాణవక వృత్తమునందును స్రగ్ధరావృత్తము నందును, నాగ బంధము చంపకమాలయందును; నాగబంధము చంపకమాల యందును స్రగ్ధరా వృత్తమునందును నిమిడ్చి వ్రాసియున్నది. ఒక బంధమునే వివిధపద్యములతో వ్రాయుటకు లక్షణ మెయ్యదియో విచారించునది.

(19) సర్వఘు సీసము. అవకలివడి సీసము, అక్కిలివడి సీసము, సర్వతః ప్రాససీసము, విషమసీసము, వడి సీసము, సమసము అను సప్త విధ సీసములలో నీ గ్రంథమునందుఁ గొన్ని భేదములు 1 12-47-75-221-224 547-802-813–814 పద్యములలో వ్రాయఁబడియున్నవి. వీని కన్నింటికి లక్షణ మప్పకవీయములో వ్రాయబడియున్నది చూడుడు.

(20) హయప్రచార రగడ, తురగవల్లన రగడ, విజయమంగళ రగడ, ద్విరదగతి రగడ, విజయభద్ర రగడ, మధురగతి రగడ , హరిగతి రగడ, హరిణగతి రగడ, వృషభగతి రగడ అను నీ తొమ్మిది విధముల రగడ లలో, నీ గ్రంథమునందు నైదు విధముల రగడలు మాత్రమే యుపయోగించి యున్నాఁడు. అవి యనఁగా ముప్పైతొమ్మిదవ పద్యమునందు హరిగతిని, 253వ పద్యమునందు మధురగతిని, 256-263 పద్యములలో వృషభగతిని, 369-808 లో గర్భితము (25) పద్యములలోఁ దురగవల్గనమును, 877వ పద్యములో ద్విరదగతిని మాత్రము నుపయోగించియున్నాడు. కొన్ని ప్రబంధములలో వీని భేదములు గల పద్యములు వ్రాయఁబడియున్నవి. ఆ యాఱు భేదములకు లక్షణము అప్పకవీయమునందు వ్రాయఁబడియున్నది. ఇంతియకాక నీ గ్రంథము నందు 805 పద్యమును శృంఖలిఖిత రగడమని వ్రాయబడియున్నదిగాన నీదాని లక్షణము విచార్యము, దీని లక్షణ మప్పకవీయమునఁ గనుపడదు.

(21) కందము, పథ్య, విపుల, చపల, ముఖచపల, జఘనచపల, అని యప్పకవీయమునందుఁ జెప్పఁబడిన కందభేదములలోఁ గందము తప్పఁ ​దక్కిన కందభేదము లీ గ్రంథమునం దొక్కటియైన నగుపడదు. 372వ పద్యము మాత్రము ఛన్నకందమని వ్రాయఁబడియున్నది. దీనిలక్షణ మెచ్చటను గన్పట్టదుగాన నిది విచార్యము. ఈ కందషట్కమునకు నప్పకవీయమున లక్షణము వ్రాసియున్నది. ఈ కంద భేదము లెచ్చటను ప్రయోగింపఁబడని కతన వాని లక్షణములను నిందు వ్రాయుట ననుపయోగమని యెంచి పీఠికావిస్తరణ భీతిచే విరమించుచున్నారము.

(22) ఈ గ్రంథమునందు 144వ పద్యము ఆర్యాగీతిరూపకందమని వ్రాయఁబడియున్నది. అప్పకవీయమున నుద్గీతి, యుపగీతి, ఆర్యాగీతి, కమలనగీతి పవడ గీతి యని వ్రాయఁబడియున్నవి. ఈ గీతి భేదము రెండును బ్రయోగింపఁ బడియుండుట గానము. ఇందుఁ బొందుపఱపఁబడిన ఆర్యాగీతికి మాత్రము లక్ష ణము వ్రాయుచున్నాము.

          22. “సమురిదీత పథ్యాకం

               దముకన్నను నొక్క గురువుఁ దాఁకించినచో

               క్షమనార్యగీతి యగున్

               గమలాప్రాణేశ సహజ కందం బదియే.”

ఇఁక పథ్యాకందలక్షణము జూడుఁడు.

          23. “ధరలోఁ బథ్యాకందము

               హరియగు నాఱవయెడ నల మాఱింటింబై

               విరతియుఁ గూడఁగ మూటను

               నెరయుఁ జతుర్గణములుగము నిలిచిన చోటన్.

(23) నరసభూపాలీయమున నరసరాజు మూర్తికవిచంద్రుని

          24. సీ. బాణవేగంబును భవభూతి సుకుమార

                        తయు మాఘశైత్యంబు దండి సమత

                 యల మయూర సువర్ణకలన చోరుని యర్థ

                        సంగ్రహమ్ము మురారి శయ్యనేర్పు

                 సోమప్రసాదంబు సోమయాజుల నియ

                        మంబు భాస్కరుని సన్మార్గఘటన

                 శ్రీనాథుని పదప్రసిద్ధ ధారాశుద్ధి

                        యమరేశ్వరుని సహస్రముఖ దృష్టి

        గీ. నీక కలదటుగాన ననేకవదన

           సదన సంచార భేదంబు సడలుపఱచి

           భారతీదేవి నీజిహ్వఁ బాదుకొనియె

           మూర్తికవిచంద్ర విఖ్యాత కీర్తిసాంద్ర

అని వర్ణించినట్లుగా నీ గ్రంథముగ వేంకటేశ్వరుండీ కవిని యీ క్రిందిపద్యముచే వర్ణించినట్లుగాఁ గవి వ్రాసుకొనియున్నాఁడు ఎద్దియనిన

   25. సీ. ఆల విన్నకోటపెద్దన లక్షణజ్ఞత -

                     శబ్దశాసనకవి శబ్దశుద్ది

            ప్రాబంధిక పరమేశ్వరుని యర్థమహిమం

                     బుభయకవిమిత్రుని పదలలితము

            శ్రీనాథు వార్తాప్రసిద్ది నాచనసోము

                     భూరికాఠిన్యంబు పోతరాజు

            యమకవిధము మల్లయమనీషిచిత్రంబు

పింగళ సూరకవి వరుశ్లేష

            నాంధ్రకవితాపితామహు నల్లికబిగి

            ముక్కుతిమ్మన తేటయు భూషణంబ

            లంకృతయు నీకకలదౌ తలంప లక్ష

            ణకవి యప్పయ వేంకట సుకవిచంద్ర

ఈ పోల్కింబోలిన పద్యము లీ రెండు గ్రంథములయందుఁ దప్ప దక్కిన గ్రంథములయం దగుపడవు.

నరసభూపాలీయమును ఈ కవి చక్కగా చదివి దానిని చాలవఱకు అనుకరించిన భాగములు శ్రీ పూండ్లవారు ఎంతో విపులముగా వ్రాసియున్నారు.

 (24) ఈ ప్రబంధరాజము లోని 806వది యగు నాది ద్విప్రాసదళ మధ్య త్రిప్రాసనియమాంత్య ద్విప్రాసదళ చరణాక్కిలివడి సీసమును బోలిన పద్యము దశావతారచరిత్ర 8వ యాశ్వాసమున వ్రాయఁబడియున్నందున నిందు సూచించుచున్నారము..

    26. సీ. స్మరహరాదిక సురాసుర దురాసద

                   ధరాధరవరాతిగ రథోత్కరముతోడ

         మదవదాయతనదాస్పద పదావదఘనాం

                   గదమదావళరాజ ఘటలతోడ

         మృగహయాదికరయా హృతిజయాహతభయా

                   వహ హయాత్యుత్తమావళుల తోడ

         నలికులానలవలాహక బలాహితబలా

                   ర్ణవకులాచల భద్రతతులతోడ.

ఈ పద్యమునకును బైనుదహరించిన ప్రబంధరాజమునందలి పద్యము నందలి పద్యమునకు నించుక పోలిక యగుపడుచుండినందున దీని నిందు బొందుపరచితిమిగాని వేఱొండు యభిప్రాయముచేఁ గాదు.

(25) ఈ గ్రంథమున 789వ పద్యము ప్రాసభేదమని స-శలకు బ్రాసము జెప్పఁబడియున్నది, భారతాదులయందు నీ ప్రాస మగుపడదు. అప్పకవీయమునందు స-ష ల ప్రాసమైత్రి యున్నట్లు చెప్పియున్నదిగాని స-శ లకు జెప్పియుండలేదు. అయినను నీ ప్రబంధరాజమునం దుదహరింపఁబడిన 'ఆశల ద్రువ' అను పదమును ‘ఆసలద్రువ' నని వ్రాసినచో లక్షణవిరుద్దము లేకయుండును. వ్రాతప్రతులయం దన్నిటను నీ పద్యమునకుఁ బ్రాసభేదమని నామమిడి వ్రాయబడియున్నందున స-శ లకు నెచ్చటనైన ప్రాసముండునా యని విచారించగ మూర్తికృతమగు నరసభూపాలీయము తృతీయాశ్వాసమున నీ క్రింది పద్య మగుపడుచున్నది.

27.మ. అసిజెండాడి విపక్షవృక్షముల శౌర్యాగ్నిచ్చటం బేల్చి శ

       స్త్రశరచ్ఛేదమున వ్రణోర్వితలము స్సంక్షుణ్ణముం జేసి వై

       ర్యసృగార్ద్రం బొనరించి ప్రోఁది గొన కుద్యత్కీర్తి సస్యౌఘముల్

       వెస సిద్ధించునె యంచుఁ బల్కు నరసోర్వీనాథు యోధావళుల్.

మఱియు నల్లసాని పెద్దనగారి చాటువు అని చెప్పఁబడు యీ క్రింది పద్యమునను గానఁబడుచున్నది ఎట్లనిన,

28.ఉ. కాశియు నీకరాసి కెనగాదు నృసింహుల కృష్ణరాయ యా

          కాశిని జచ్ఛువారలకుఁ గల్గును జేతికిఁ బుఱ్ఱె నీమహో

          గ్రాసిని ఖండతుండములుగాఁ బడిగూలిన వైరికోట్లకున్

          భాసురరంభకుంభ పరి .......... ... ... ...

ఇట్టి ప్రాసములు పెద్దన్న గారి గ్రంథములయందెటనుఁ గనుపడవు.

29.క. ఈసరణిఁగామతంత్రా

      భ్యాస పరిశ్రాంతి మిగులఁ బరవశమైనన్

      [7]నా శిలిధాతుక్షయమై

      మాసములోపలన వాఁడు మరణమునొందున్. జై.భా.

అని ప్రయోగద్వయ మగుపడుచున్నందున వీని కాధారమెయ్యదియని విచారించగా వేములవాడ భీమకవి రచితమగు నీ క్రింది చాటుపద్యము మాత్రమగుపడుచున్నది. ఎద్దియన

30.చ. బిసరుహ గర్బువ్రాఁతయును విష్ణుని చక్రము వజ్రివజ్రమున్

       దెసలను రాముబాణము యుధిష్ఠిరు కోపము మౌనిశాపమున్

       మసకపుఁ బాముకాటును గుమారుని శక్తియుఁ గాలుదండమున్

       బశుపతి కంటిమంటయును బండితవాక్యము రిత్తవోవునే.

అను నీ పద్యము భీమన చెప్పినట్టు తెలియుచున్నది గాఁబట్టి పై చాటువును నాధారము జేసికొని సశలకుఁ బ్రాసమును గల్పించినారు. అయినను నిట్టి ప్రయోగములు భారతాదులయం దగుపడని కారణమును బట్టి దీనిఁ బ్రశస్తమైన ప్రయోగమని జెప్పుటకు సంకోచించుచున్నాము.

(26) ఈ గ్రంథమున 684-778 పద్యములు ప్రాసభేదమని వ్రాయఁబడియున్నవి. క్రారవట్రువ సుడులకుఁ బ్రాసము భారతాదులయం దగుపడుచున్నది.

31. ఉ. క్షత్రియవంశులై ధరణిఁ గావఁగఁ బుట్టినవారు బ్రాహ్మణ

         క్షత్రియ వైశ్య శూద్రులనఁగాఁ దగు నాలుగు జాతుల న్స్వచా

         రిత్రము దప్పకుండఁగ బరీక్షితు కాచినయట్లు రామమాం

         ధాతృరఘుక్షితీశులు ముదంబునఁ గాచిరె యేయుగంబునన్.

అని ప్రయోగ మగుపడుచున్నది. మఱియు 688వ పద్యము ప్రాస భేదము వ్రాయఁబడియున్నది. ఈ ప్రాసభేదమున కప్పకవీయమున

32.తే. రలలు తమక్రిందనుండఁ బైగ్రాలు వ్రాలు

      ప్రాసవర్ణంబులై వానిఁ బాసియైన

      గూడియైనను బెఱయడుగులను నిలుచు........

అని లక్షణము వ్రాయఁబడి యున్నదిగాన నీ గ్రంథమునందలి 638వ పద్యములోని నాల్గవపాదమగు 'నీ క్రియ సత్పుత్రకులు చరింతురుపుత్రా' అను ప్రాసమును సాధువని గ్రహించునది, వెండియు నిందు 781వ పద్యము ప్రాసభేదమని వ్రాయబడియున్నది. ఈ లకారశ్లిష్ట ప్రాసమునకు రాఘవపాండవీయ మునఁ బ్రయోగమగుపడుచున్నది. ఎద్దియనిన

33.శా. లోకత్రాణరతిం దదాదిమ మహీలోకప్రవేశోత్కథా

       షాకౢప్త ప్రథమ ద్వితీయపదగుం జన్మంజుమంజీర గ

       ర్ణాకల్పామల రామ భారతకథా సర్గంబుల న్మించు వా

       ల్మీకి వ్యాసులఁ గొల్చెదం దదుభయ శ్లేషార్థ సంసిద్ధికిన్.

అని ప్రయోగమగుపడుచున్నందున 781 వ పద్యమునందలి “నాకౢప్తకాంచుడంచును" అను నీ ప్రయోగము సాధువని గ్రహించునది.

     (27) ఈ గ్రంథములోని 876వ పద్యము అష్టభాషా సీసము వ్రాయఁబడియున్నది. సంస్కృతము ప్రాకృతము శౌరసేవి, మాగధి, పైశాచి చూళిక, అపభ్రంశము, ఆంధ్రము ఇవి ఆష్టభాషలనఁబడును. వీనిలో సంస్కృతంబు ప్రకృతియనియుఁ బ్రాకృతంబు వికృతియని వ్యవహరింపఁబడుచున్నది. ఇందు భారతీదేవి శైశవభాషితంబు ప్రాకృతము నాఁబడు. ప్రాకృతంబు సౌరసేని మాగధి పైశాచి అపభ్రంశము అని ప్రాకృతంబు అయిదు విధములై నది. పైశాచియందు భేదమించుకంతగలిగి చూళికా పైశాచియన నొప్పె. ప్రాకృతాదులు చెడి తదృవములగుచు ననేకవిధములుగఁ దమలోఁ గలసి యుండుకతన నీ యాంధ్రం బేర్పడెగాఁబట్టి సంస్కృత ప్రాకృతాదులు రెండును, ప్రాకృత భేదములగు శౌరసేన్యాదులైదును నాంధ్రభాష యొకటియు జేరి యష్టభాషలు నాఁబడు. చక్కఁగ సంస్కరింపఁబడినదిగాన సంస్కృత మనఁబడును. ఇది యెల్లభాషలకుఁ దల్లియగుకతన స్వర్లోకప్రశస్తము. మహారాష్ట్ర దేశీయంబు ప్రాకృతంబు. శూరసేని దేశీయంబు శౌరసేని. మగధ దేశీయంబు మాగధి పాండ్యకేకయబాహ్లికానూప గాంధార నేపాళకుంతల సుధేష్ణ భోజకన్నోజకంబులఁ బొసఁగు మాటలు పైశాచి చూళికలనంబడు. ఆభీరవిషయ జాతము అపభ్రంశము. ఇయ్యాంధ్రదేశములోని భాష ఆంధ్రమనఁబడు, కావ్య నాటకాదులయం దొక్కక తెగవారికి నొక్కొక భాషవిధింపఁబడియున్నది, ... పైనుదహరించిన భాషాష్టకోత్పత్తి వివరణము అప్పకవీయము, అహోబల పండితీయమునుంచి యిందు వ్రాయఁబడెనుగాన నందుఁ జూచిన విశదముగఁ గోచరించును. దశావతారచరిత్రయందు బ్రాకృతభాషాగ్రధితమగు నొకసీస పద్యము మాత్రము గనుపడుచున్నది. ఇయ్యష్టభాషామిళితమగు పద్యములు గ్రంథములయందగుపడుట యరుదుగ నున్నయది.

     (28) ఈ గ్రంథమునందలి 880వ, నమస్కారశబ్దలక్షిత కంద ద్వయ గర్బిత వచనమున నూటయెనుబది దివ్యతిరుపతులను గుఱించి వ్రాయబడియున్నది...నమస్కారశబ్దపర్యాయము లుభయభాషలలోనివి జేర్పఁబడినవి. ఇట్టి విషయములను దెలుపు పద్యము లెచటను గన్పట్టవుగాని యయ్యలరాజు నారాయణామాత్యునిచే రచియింపఁ బడిన 'హంసవింశతి' పద్యకావ్యము చతుర్థాశ్వాసమున మంజుగతి రగడయందు దివ్యతిరుపతులను గుఱించి వ్రాయఁబడియున్నది. ఈ గ్రంథద్వయములోని నమస్కారశబ్దలక్షితములను దివ్యతిరుపతుల నామములను పోల్చిచూచిన నించుమించుగా సరిపోవుచున్న వి గాన నీ గ్రంథముల పౌర్వాపర్యము నరయునది. దివ్యతిరుపతియనఁగా వైష్ణవ ఆళ్వారాదులచే మంగళాశాసనము చేయఁబడిన శ్రీవైష్ణవ క్షేత్రమునకుఁ బేరు. అనఁగా దీర్థప్రసాదాదుల కర్హక్షేత్రము.

     (29) ఈ గ్రంథమునందు 288వ పద్యము మొదలు 321 వఱకును మఱియు 393 మొదలు 510 వఱకును నలుమేలుమంగాభివర్ణనము వివిధాలంకారములతో వ్రాయఁబడియున్నది. సమిష్టిమీఁద నూఱు నూటయేఁబది స్త్య్రవయవవర్ణనమునకై వినియోగింపఁబడియున్నవి. తెలుఁగుప్రబంధములయం దన్నిటను నిట్టి పద్దియములు కవులువ్రాసియే యున్నారు. ఒక తెలుఁగు గబ్బముల యందేగాదు సంస్కృతమునందును వ్రాయఁబడియున్నవి.............

     శ్రీపూండ్లవారి గ్రంథము దొరకనందువలనను, ఇదంతయు మరల నెప్పుడు ఎవరు సేకరించి ముద్రింతురో యనుశంక చేతను, చక్కని విషయముండుటచేతను, చదువరులకు యథాతథముగా నుదహరించితిని. ఇక శ్రీపూండ్లవారు హెచ్చరించి, వివరింపక విడిచినది, హంసవింశతితోడి పోలిక. తెలుఁగుకవులకు నాచనసోముని కాలమునుండి ఒక అలవాటు కనఁబడుచున్నది. అదేదనఁగా అష్టాదశ వర్ణనలలోగాని వాని అంతర్బాగములలో గాని తమకాలపు శాస్త్రవిషయములను, పర్యాయపదములను ప్రయోగించుచుండిరి. నాచనసోముని కోటవర్ణనాదికముల పదములకు నేడు అర్థముచెప్పుట సులువుగాదు. అట్లే వృత్తులు వచ్చినప్పుడుకూడ, ఈ ప్రబంధరాజకవి ప్రతివిషయమునందును తన కవితా నైపుణితో తన సకలశాస్త్ర కలావేత్తృతను వెల్లడించినాఁడు.

     (1) తన కవిత్వములో గల గుణములనిట్లు చెప్పుకొన్నాఁడు - 'సీ. అలవిన్న కోట పెద్దనలక్షణజ్ఞత' ఇత్యాదిముందే యుదాహృతము. ఒక్క సీసపద్యములో ఆంధ్రవాజ్మయ చరిత్ర సారమునిమిడ్చి, ఆ గుణములన్నియు తనలో కలవన్నాడు. తెలుగులో నాటి కేర్పడిన రచనా ప్రక్రియలన్నిటిని ఒక చేయి చూచినాడు.

     (2) పెక్కువిషయముల కిది యొక నిఘంటువో లేకపోయిన జాపితావంటిది. భగవంతునికి అంకితముగా తాను వ్రాయనీకావ్యమునకు గల సాహిత్యలక్షణములను మొదటి వచనమందే చెప్పినాడు-- “అంకితంబుఁగా శబ్దశాస్త్రరీతికి విఖ్యాతియును, ధ్వనులకునికియును, ఉక్తాత్యుక్తాదిగాగల యిరువదాఱు ఛందంబులకుఁ జందంబును, కావ్యాలంకార చూడామణికి కావ్యాలంకార సంగ్రహమ్మును, సకలా లంకారమ్ముల కలంకారంబును...' ఇత్యాదిగా కావ్య శాస్త్రవిషయమును గుప్పించినాఁడు.

     వేంకటాచల పట్టణవర్ణనలో, వచనమున ‘మఱియు నప్పురవరంబు మందాక్రాంతఫల సదవవన మంజరీ మందార సరజితోత్పలమాలికా...' అని యారంభించి 'మంగళమహాశ్రీ' వఱకుగల వృత్తములనన్నిటిని వరుస కూర్చినాఁడు. ​

     78 వ జాతివార్తా వచనమున స్వామి 'వేంచేయునవసరంబున గురు మహా ప్రధాన మాండలికసామంత ...' ఇత్యాదిగా ప్రారంభించి రాజాస్థానముల యందలి దెబ్బది రెండు నియోగాలవారిని చెప్పినాఁడు.ఆంధ్రవాఙ్మ యములో వీనిని మొదట పేర్కొన్నవాడు పాల్కురికి సోమనాథుడు. (క్రీ.శ. 1800– 1828) ఆ వచనమందే ఉత్సవయాత్రావర్ణనలో జనుల వేషభాషావైఖరుల వర్ణించుచు అపూర్వపదములను జాపితాగా గ్రుచ్చివాని సంఖ్యలను కూడ తెలిపినాడు. 'చౌశీతి బంధపు వ్రాతపని ప్రతిమల చుట్టంచు చందురుకావి దుప్పటి బంగరు చెఱఁగులవలె వాటులును’ తర్వాత 'పదిరెండుదండ' లట, 'పదిరెండు పరువడు'లట 'గతులు పదిపండ్రెండట,'పదిరెండు గాయమానంబు' లట, “పది రెండు మొనలట ఇట్టి వెన్నియో! సంగీతవర్ణన వచ్చినచోట సంగీతశాస్త్రోపన్యాసమే. నాట్యవర్ణనమునకు ప్రారంభించిన భరతనాట్య గ్రంథమునకు పునరుక్తియే. ఒకనాట్య ప్రదర్శనమునే వర్ణించినాఁడు. భోజనాదినైవేద్య వర్ణనల సందర్భమున నాటి ధాన్యపు దినుసుల, జాపితాను, భక్షణముల పణ్యారముల జాపితాను, పండ్లదినుసులు, తేనెలదినుసులు, చక్కెర పిండి వంటకముల దినుసుల జాపితాను,- ఈ విధముగా భాషకేగాక నాటిదైనందిన వ్యవహారమున నుండిన సకలవస్తు జాలమునకును, సకల విషయములకును సకలానుభవములకును, జాపితాలను తన కావ్యములోకూర్చి సాంఘిక చరిత్రకారులకు కావలసిన సాధన సామగ్రిని నిఘంటువువలె ఇచ్చినాఁడు. వీరి నెల్లనొక యకారాది క్రమమున వ్రాసినయెడల అదియొక చక్కని సాంస్కృతిక విషయనిఘంటువగును.

     ఇట్లెంతైనను వ్రాయుటకు అవకాశముకలదు. ఆంధ్రవాఙ్మయ మందుగాని సంస్కృత వాఙ్మయమందుగాని ఈకవి యెఱుఁగని లోతు పాతులు గాని, చెప్పని విషయములుగాని కానరావు. ఈతనిగుఱించి తమ దాక్షిణాత్యాంధ్ర సాహిత్య చరిత్రలో శ్రీ డా. నేలటూరి వేంకటరమణయ్యగారిట్లు వ్రాస నారు. “వేంకటపతిని కవియని పేర్కొనుట కంటె శాస్త్రకర్తయనుట యుక్తము. పద్యములను ఛందోవ్యాకరణాది దోషములు లేక వ్రాసినంతటనే కవితాప్రతిభ లేనివాఁడు కవి కాజాలఁడు. వేంకటపతి వ్రాసిన గ్రంథములలో నేయల్పసంఖ్యా కములోతప్ప తక్కినవన్నియు ఛందోవ్యాకరణాలంకార శాస్త్రములకు సంబంధించినవే. శాస్త్ర విచారమునందు కవితా ప్రదీపనమునకుగాని భావవిలసనమునకుగాని యవకాశ మధికముగనుండదు. .... కాని ఎట్టి యుత్తమలక్షణ గ్రంథమైనను

​     వేంకటపతి కవిత్వాతిశయమును నిర్ధారించుటకది సహకారి కాజాలదు...లభించిన గ్రంథములలో నితని ప్రబంధరాజవేంకటేశ్వర విజయవిలాసము గొప్పది. అదియు నమూల్యమైన లక్షణగ్రంథమేకాని, తన్మూలమున నతని కవితాశ క్తిని కొంతవఱకు గనుగొనవచ్చును. అతఁడు మహాసమర్థుఁడని యఱమరలేక పల్కవచ్చును. అతని పాండిత్య మద్వితీయము, శాస్త్రపరిచయమును లోకజ్ఞానమును అసాధారణమైనవి. ఛందోవ్యాకరణాది శాస్త్రవిచారమున కొంతయెగుడు దిగుడు గానవచ్చుచున్నను శైలి మొత్తముమీద సా ఫైనదే. పదముల కూర్పునను గర్భచిత్రకవిత్వ రచనలయందితని నేర్పు మఱియెవ్వరికిని లేదు ......బళి ! బళి ! యని మెచ్చదగదా యిట్టి యనన్యసామాన్య రచనా కౌశలమును. కాని ఇది యంతయు శతసహస్రావధాన కౌశలమువంటిదిగాని యుత్తమ జాతికవిత్వము కానేరదు."

     ఈ మహాకావ్యమునకు చక్కని విపులవ్యాఖ్యను మహాపండితు లెవరైనను వ్రాయుట దేశోపకారకము. ఈ విధముగానై నను ఈముద్రణమును ప్రకటించుటకు నాకీయవకాశమిచ్చిన ఆంధ్రప్రదేశ్ సాహిత్యఅకాడమీవారికి చాల కృతజ్ఞుడను.

30_11_1976

వేదము వేంకటరాయశాస్త్రి

మదరాసు_1

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.