గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జులై 2023, శుక్రవారం

వార్ధకం వయసానాస్తి.. రచన..ఆచార్య రాణీ సదాశివమూర్తి.... మేలిమి బంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

ఆచార్య రాణీ సదాశివమూర్తి

శ్లో.  వార్ధకం వయసానాస్తి  -  మనసానైవతద్భవేత్

సన్తతోద్యమశీలస్య  -  నాస్తివార్ధక్యపీడనమ్.

తే.గీ.  మసలు మన భావమునవచ్చు ముసలితనము,

అట్టి భావంబు లేనిచో నదియు రాదు.

సంతతోద్యమశీలురకింతయైన

ముసలితనమన్నదే రాదు, పూజ్యులార!

భావము.  వృద్ధాప్యమనేది వయసులోనూ లేదు. మనసులోనూ ఉండకూడదు. 

ఎల్లపుడూ ఉత్సాహం, క్రియాశీలత, కలమానవుడికి, వృద్ధాప్యపీడ ఉండదు.

ముసలితనం రెండు రకాలుగా వస్తుంది. వయోభారంతో వచ్చేది శారీరకం.

 దుఃఖం వల్ల వచ్చేది భావజం. వయోభారం వల్ల వచ్చేది కూడా 

ఆపాదింపబడిన ముసలితనమే. కొంతమంది యాభయ్యవ

 పడిలోకి రాగానే వృద్ధులయ్యారంటారు. కొందరు 

అరవై సంవత్సరాలకు ముసలివారనిపించుకుంటారు.

70 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉండేవారు మరికొందరు. 

శరీర బలం తగ్గి, అవయవాలు పటుత్వం కోల్పోయి, 

నరాల కండరాల పట్టు సడలినా.. బుద్ధిబలంతో నిత్యం 

విజయాలను సాధించేవారు ఉన్నారు. కొందరికి 

సోమరితనం వల్ల వృద్ధాప్యం వస్తుంది.

 

పని చేయడానికి బద్ధకించి పని సామర్థ్యాన్ని కోల్పోతే 

దాన్ని మించిన వార్ధక్యం మరొకటి లేదు. అటువంటివారు 

సమాజ ప్రగతికే కాక సొంత ప్రగతికి కూడా శత్రువులే. 

మద్యపానం, ధూమపానం, మత్తుమందుల వాడకం వంటి 

దురలవాట్లు శరీరంలో అనేక సామర్థ్యాలను బలహీనపరుస్తాయి. 

అకాల వార్ధక్యానికి దారి తీస్తాయి. ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయి. 

అటువంటి వృద్ధులు తమ కుటుంబాలకు సమాజానికి కూడా 

భారమే. మానసిక ఒత్తిడులు, కుంగుబాటు వల్ల వచ్చే ముసలితనం 

చెదపురుగులాంటిది. మనిషి భవితను సమూలంగా తినేస్తుంది.

 

మానసిక వృద్ధాప్యం అంటే.. ‘నాకు ముసలితనం వచ్చేసింది’ 

అనే భావన. అలాంటి వృద్ధాప్యాన్ని రానీయకూడదు.

 ‘సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక పీడనం’ అన్న మాటలను 

గుర్తుపెట్టుకుని ఏదో ఒక పని పెట్టుకోవాలి. భారతీయ సంప్రదాయంలో 

జ్ఞానవార్దక్యాన్ని అంగీకరించారుగానీ వయో వార్ధక్యాన్నికాదు. 

భరద్వాజ మహర్షి మూడు ఆయుర్దాయాల కాలం తపస్సు చేసి 

జ్ఞానాన్ని సంపాదించాడని పురాణ ప్రతీతి.

నిత్యవ్యాయామం, యోగాభ్యాసం, సద్గ్రంథ పఠనం, 

సతతక్రియాశీలత, మితాహారం, హితాహారం, ఇష్టదేవతా ఉపాసనం, 

ఇవి ఉన్న చోట ముసలితనం ఉండదు.

ఆచార్య రాణీ సదాశివమూర్తి.

ఇంత చక్కటి సూక్తిని అందించిన ఆచార్యవర్యులకు నా నమోవాకములు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.