జైశ్రీరామ్.
ఆర్యులారా! మహా కవి జాషువా రచించిన శిశువు ఖండికను గాన గంధర్వుఁడైన గంటశాల వేంకటేశ్వరరావు గారి గాత్రంద్వారా విని ఆనందించండి.
శిశువు గురించి శ్రీ జాషువా కవి పద్యాలు
గానమాలింపక కన్ను మూయని రాజు
అంబ కౌగిట పంజరంబు చిలుక
కొదమ కండలు తేరుకొను పిల్ల వస్తాదు
ఉయ్యేల దిగని భాగ్యోన్నతుండు
ఉ ఊలు నేర్చిన యొక వింత చదువరి
సతిని ముట్టని నాటి సాంబ మూర్తి
ప్రసవాబ్ధి తరియించి, వచ్చిన పర దేశి
తన యింటి క్రొత్త పెత్తనపుదారు
ఏమి పని మీద భూమికేతెంచి నాడొ !
నుడువ నేర్చిన పిమ్మట నడుగ వలయు
ఏండ్లు గడచిన ముందు ముందేమొ కాని
యిప్పటికి మాత్రమేపాప మెఱుగడితడు !
నవ మాసములు భోజనము నీర మెఱుఁగక
పయనించు పురుటింటి బాట సారి
చిక్కు చీకటి చిమ్ము జేనెడు పొట్టలో
నిద్రించి లేచిన నిర్గుణుండు
నును చెక్కిళుల బోసి నవ్వుల లోన
ముద్దులు చిత్రించు మోహనుండు
అక్షయంబైన మాతృ క్షీర మధుధార
లన్నంబుగా తెచ్చుకున్న యతిథి
బట్టఁగట్టడు బిడియాన పట్టువడడు
ధారుణీ పాఠ శాలలో చేరినాడు
వారమాయెనొ లేదొ? మా ప్రకృతి కాంత
కఱపి యున్నది వీనికాకలియు నిద్ర.
ఊయేల తొట్టి యే ఉపదేశ మిచ్చునో
కొసరి యొంటరిగ ఊ కొట్టు కొనును
అంబతో తన కెంత సంబంధ మున్నదో
యేడ్చి యూడిగము సేయించు కొనును.
పరమేశ్వరుండేమి సరసంబులాడునో
బిట్టుగా కేకిసల్గొట్టు కొనును
మూన్నాళ్ళ లోన నెప్పుడు నేర్చుకొనియెనో
పొమ్మన్నచో చిన్నబుచ్చు కొనును
ముక్కు పచ్చలారి పోయి ప్రాయము వచ్చి
చదువు సంధ్య నేర్చి బ్రతుకు నప్పుడు
‘ నాదు పసిడి కొండ నా రత్న’ మని తల్లి
పలుకు పలుకు లితడు నిలుపు కొనునె ?
తన చేతి గిలక పండునకు ముచ్చటలు సెప్పు
పలుక లేదని కోపంబు సేయు
పొరుగింటి యిల్లాలి సరస చీదర చెంది
పరులన్న భేద భావమునుఁజూపు
మకరందమునకు సమ్మతిఁజూపి నోరూరి
దరిఁజేరి రుచుల భేదములు తెలియు
ప్రతి శబ్దమీను నుగ్ర ధ్వానమాలించి
కంపించి తల్లిని కౌగిలించు
దాయలార్గురు నొకరు నిద్దరును తప్ప
చేరుకున్నారలీతని చిత్త వీధి
జగతి నీతని జాతక చక్రమందుఁ
బొంచి యుండునదప యశంబొ ? యశంబొ ?
దివంగతులైయున్న ఇరువురు మహనీయులకు జోహారులు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అసలు జాషువా గారి కలమే ఆద్భుతం అనుకుంటే ఇంక గంటసాల వారి గళం అమృత వర్షమే చాలా బాగుంది ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.