గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, ఏప్రిల్ 2017, ఆదివారం

పద్యరచనలో దశ దోషములు

  జైశ్రీరామ్.
దశ దోషములు

1.ఛందో భంగము :-
గురువుండ వలసిన చోట లఘువు; లఘువుండ వలసిన చోట గురువు ప్రయోగించిన ఛందో భంగము అను దోషమగును.
గోవింద యనవలసిన చోట ముకుంద యనిన ఛందోభంగము అను దోషమగును.

2.యతి భంగము :-
యతి ఉండవలసిన చోట కాక మరియొక చోట పాటింప బడనిచో యతి భంగము అను దోషము.
ఆంధ్ర ప్రజల సాటి అరయ లేరు. అన వలసిన చోట ఆంధ్ర ప్రజల సాటిని అరయముగ!

3.విసంధికము :-
సమాస గతములగు పదముల మధ్య సంధి చేయనిచో విసంధికము అను దోషము.
అమృతోదధిశయనఅనిఉండవలసిన చోట అమృత ఉదధి శయన అని వ్రాసినచో విసంధికము అను దోషము.

4.పునరుక్తి దోషము :-
ఇది రెండు విధమ్లు.శబ్ద పునరుక్తి; అర్థ పునరుక్తి.
తొలుతపలికిన శబ్దమునే మరల పలికిన శబ్ద పునరుక్తి.
కాంతి చంద్రుడతడు కళలు జిందెడి శశి. అనినచో శబ్ద పునరుక్తి దోషము.
పూర్వోక్తమగు అర్థమే పునరుక్తమైన అర్థ పునరుక్తి దోషమగును.
కాంతినమృత చంద్రుడని యశో మృగాంకుడనినచో అర్థ పునరుక్తి దోషమగును.

5.సంశయము :-
పద్యమున భావము నిస్సంశయముగా నుండునట్లు వ్రాయబడ వలెను. ఆ విధముగ కాక భావము సంశయాస్పదమైనచో అది సంశయమను దోషము.
అతని కలయిక వలన కదా ఇంతపట్టు జరిగినది? జరిగినది లాభమా? నష్టమా? సంసేహముగానున్నందున సంశయము అను దోషమిందుకలుగు చున్నది.

6.అపక్రమము :-
క్రమాలంకారము ఉండవలసిన చోట అపక్రమముగనున్న అపక్రమ దోషమనబడును.
విష్ణువు హృదయము నాభికమలము పాదము గంగ లక్ష్మి బ్రహ్మల నివాస స్థానములు. ఇందు క్రమ విరుద్ధముగ నున్నందున అపక్రమ దోషము కలిగినది.

7.న్యకుమ :-
మొదట పలికిన పదముల కనుగుణము కాని వ్యర్థ పద ప్రయోగము చేసిచో న్యకుమ లేదా వ్యర్థము అను దోషము .
నీవు త్యాగివి. నాలుగు కాసులెవ్వరికీ ఈయవు. ఇందు త్యాగికి  సరిపడు గునమునకు విరుద్ధముగ పిసినారి యనుపద ప్రయోగము వలన పరస్పర విరుద్ధమైనందున వ్యర్థము అను దోష భూయిష్టము.

8.అపార్థము :-
వాక్యమునందలి పదములకన్యోన్యాకాంక్ష యుండ వలెను. అట్లు లేకపోయినచో సముదాయార్థము స్ఫురింపనందున అపార్థముఅను దోషమగును.
కరిచర్మము గైరిక శిల సురగిరి అని వ్రాసినచో పరస్పరాన్వయము లేనందున అపార్థమను దోషమిందు కలుగు చున్నది.

9.అప శబ్దము :-
౧.కుసంధి; ౨.దుస్సంధి; ౩.చుట్టుంబ్రావ; ౪.వైరి వర్గము; ౫.నిడుదలకాకుదోషము; ౬.కుఱుచ కాకు; ౭.తెలుగునకు జొరని సంస్కృత క్రియల దుష్ప్రయోగములు; ౮.సర్వ గ్రామ్యములు ప్రయోగింపఁబడిన అప శబ్ద దోషమనఁబడును.

౧.కుసంధి :-
దీని+ఒడయడు=దీని యొడయడుసాధువు. దీనొడయడు అసాధువు. 

౨.దుస్సంధి :-
అతడు+అతడు=అతడునతడు. సాధువు. అతడున్నతడు.

౩.చుట్టుంబ్రావ :-
అసలారు వందలకు వడ్డీ మూడు వందలు బలాత్కారముగ లాగుకొని జీవించువాడు ఇదిగో వచ్చు చున్నాడు. అని ఈ విధముగా చెప్పభడినచో చుట్టుంబ్రావ యను దోషము.

౪.వైరి వర్గము :-
సంస్కృత పదమును తత్సమము చేసి తెలుగు పదముతో సమసింప జేయుట సరి అయిన పద్ధతి.
అట్లు గాక పూర్వ పదమున కాంధ్ర విభక్తి చిహ్నము చేర్చక సంస్కృత ప్రాతిపదికమునకే తెలుగు పదము చేర్చి సమాసము చేసినచో వైరివర్గము అను దోషమగును.
పుష్ప విల్లు. వైరి వర్గము. ముజ్జగములు. ముల్లోకములు మున్నగునవి నిర్దోషములు.
వాటిపై మరల ముజ్జగద్వంద్యుఁడు; ముల్లోక పూజ్యుఁడు అని యుండిన వైరివర్గము చేరును.

౫.నిడుదలకాకుదోషము :-
హ్రస్వముండవలసిన చోట దీర్ఘముంచినచో అది నిడుదల కాకు దోషమగును.
llపొగడ దండలు అను చోట పొగాడ దండలు అని ప్రయోగించరాదు.

౬.కుఱుచ కాకు :-
దీర్ఘములుంచ వలసిన చోట హ్రస్వముంచిట.
llనాయెడన్ కు బదులు నయెడన్ అనిప్రయోగింపరాదు.

౭.(తెలుగునకు జొరని సంస్కృత క్రియల) దుష్ప్రయోగములు :-
సంస్కృత విభక్త్యంత పదములను తెలుగు విభక్త్యంత పదములతోఁ గలిపి ప్రయోగించుట.
సత్వరము నృపస్య పదం గత్వాయాతఁడు నిహత్యకంటకుల సఖీ భూత్వా మెలగెడు. అని ప్రయోగింపరాదు.

౮.సర్వ గ్రామ్యములు ప్రయోగింపఁబడుట :-
గ్రామీణుల వాడుక భాషను ప్రయోగింపరాదు.

10.విరోధములు :-
౧.సమయ విరోధము. ౨.ఆగమ విరోధము. ౩.లోక విరోధము. ౪. కాల విరోధము. ౫.కళా విరోధము. ౬.దేశ విరోధము అని ఆరు విధములు.

౧.సమయ విరోధము :-
ఆచార విరుద్ధము సమయ విరుద్ధమని గ్రహింప వలెను. బాహువుల యందు కుండలములు ధరించినాఁడు అని వ్రాసిన సమయ విరోధముగా గ్రహింపదగును.

౨.ఆగమ విరోధము :-
అనగా శాస్త్ర విరోధము.
llహింసా పరమో ధర్మః అనిన అది ఆగమ విరోధముగా గ్రహింపనగును.

౩.లోక విరోధము :-
లౌకికమునకు విరోధముగ వ్రాసిన దోషము.
llతనయునకు పాద సేవను తల్లి చేసె. అనిన దోషము.

౪. కాల విరోధము :-
దేశ కాలానుగుణముగా వ్రాయ వలసినదిగా నియమముండగా తద్విరుద్ధముగా వ్రాసినచో దోషమగును.
ll.సుగుణాకర పట్ట పగలు చుక్కలు పొడిచెన్.

౫.కళా విరోధము :-
ఏయే కళలకు తగిన పరికరముల నాయా కళలందు చెప్ప బడుటకు బదులు తద్విరుద్ధముగా చెప్పుట.
llతాళము బట్టక చదువును, పుస్తకము పట్టక పాడు ఘనుడీతడు. అనిన దోషమే కదా!

౬.దేశ విరోధము :-
ప్రదేశమును బట్టి కాక తద్విరుద్ధముగా చెప్పిన దోషము.
llఎడారిలో నూతులనుండి నీరు పొంగి ప్రవహించు చున్నదని చెప్పినచో దోషము.
జైహింద్.
Print this post

4 comments:

సో మా ర్క చెప్పారు...

మంచి పోష్టు రామ కృష్ణారావుగారూ!
నేటికాలంలో రచనలు చూసినచో వీటికన్న ఎక్కువ దోషాలుంటాయి.కాబట్టి కాలంతో పాటు సర్దుకొని ముందుకు పోక తప్పదేమో?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సోమార్క గారూ! పద్యరచనకు ఎలాగైతే ఛందస్సు అనుసరిస్తున్నామో అలాగే దోషాలన్నవేవో తెలిస్తే కనీసం ఆదోషాలు లేకుండా వ్రాసే ప్రయత్నం చేసేవారుంటారనే భావంతో వ్రాసానండి. దోషలన్నవేంటో అన్నది తెలియకపోతే ఇక ఎలా సరి చేసుకోగలుగుతారు? అని భావించానండి.

అజ్ఞాత చెప్పారు...

సర్
నమస్తే
మీ వివరణ ప్రకారం ఒకే అర్థం రెండు సార్లు వస్తే పునరుక్తి దోషం అవుతుంది. కానీ కొంత మంది ఒక పదాన్ని రెండో సారి వాడితే పునరుక్తి దోషం అంటున్నారు ప్రయోగం అర్థవంతంగా వున్నప్పటికీ. వివరించ ప్రార్థన.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఔనండి ఒకేపదాన్ని రెండుపర్యాయాలు ప్రయోగిస్తే శబ్దపునరుక్తిగా, ఒకే అర్థంలో పదాల్ని రెండ్శుపర్యాయాలు ప్రయోగిస్తే అర్థపునరుకు దోషంగా మన శాస్త్రాలు చెప్పుతున్నాయండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.