గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, డిసెంబర్ 2009, సోమవారం

చెప్పుకోండి చూద్దాం 29.

ఆర్యులారా!
మనం కొన్ని కొన్ని విషయాలు ఎన్ని పర్యాయాలు విన్నా సరే మళ్ళీ వింటున్నప్పుడు వినాలనే అనిపిస్తాయి. అందుకు కారణం ఆ విషయాలలోనున్న చమత్కారం. కొన్ని కొన్ని పద్యాలైతే ఆలోచనామృతాలే అనిపిస్తాయు.

ఇప్పుడొక తమాషా పద్యాన్ని మళ్ళీ మనం చూద్దాం. గద్వాలు సోమరాజును పొగడుతూ ఒక కవి ఎంత గమ్మత్తుగా ఆకాశానికెత్తాడో మీరే చూడండి.

నలుగురు బలికిరి సరియని
నలుగురు బలి కిరి సురూప నయ దాన ధరా
వలయ ధురా చరణోన్నతి
పొలుపుగ గద్వాల సోమ భూపాల నకున్ !

గద్వాల సోమ భూపాలుడికి సురూప నయ దాన ధరావలయ ధురాచరణోన్నతిలో నలుగురు బలికిరి సరియని నలుగురు బలికిరట.

మీకేమైనా అర్థం సుగమ మనిపిస్తోందా? నాకైతే ఆలోచింపచేస్తోందే కాని సుగమ మనిపించటం లేదు. కొంచెం లోతుగా వివరణాత్మకంగా ఆలోచించి, కవి ఉద్దేశంలో నుండే అభిప్రాయాన్ని వ్రాయ వలసినదిగా మనవి చేసుకొనుచున్నాను.

జైహింద్.

Print this post

5 comments:

mmkodihalli చెప్పారు...

అందమున నలుడును, నయమందు గురుడు
దానమిచ్చుటయందున తా బలియును
మరి ధరావలయము మోయ కిరి సరియని
భూపతికి పలికిరికదా భూమి జనుల్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

కోడీహళ్ళి కులోద్భవా!బుధనుతా!కూర్మిన్ సమాధానముల్
చాలా చక్కఁగ చెప్ప నేర్చిరి కదా! సన్మాన్యతన్ వృత్తముల్
మేలౌ రీతిగ చెప్ప నొప్పును కదా? మీ రేల గీతాదులన్
గేలున్ గల్గిన కందుకంబు పగిదిన్ గ్రీడింపగా నేర్చిరో?

mmkodihalli చెప్పారు...

తీయని తేనెలూరు ఘన దేశపు భాషల కెల్ల ధీటుగా
పాయక నిల్చు నా తెలుగు పద్యము పాడగ వృత్త ప్రక్రియన్
నా యెద పర్వులెత్తు తగునా యిటు వేయగ కుప్పిగంతులన్
శ్రీయుతులౌ కవీశ్వరుల చెంతన నేనని జంకు చూపెదన్

mmkodihalli చెప్పారు...

చిన్న మార్పు:

తీయని తేనెలూరు ఘన దేశపు భాషల కెల్ల ధీటుగా
పాయక నిల్చు నా తెలుగు పద్యము పాడగ వృత్త ప్రక్రియన్
నా యెద పర్వులెత్తు తగునా యిటు వేయగ కుప్పిగంతులన్
ధీయుతులౌ కవీశ్వరుల ధీమతి ముందని జంకు చూపెదన్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సంతోషంబుగ నుండె నాకు.మురళీ సమ్మోహనా!మీరు నా
కెంతో నచ్చిరి, సత్కవిత్వమనగా నింపార సద్వృత్తముల్
భ్రాంతిన్ జక్కగ వ్రాయఁగల్గుదురదే భవ్యంబుగా నెంతు. మీ
చింతన్ వీడి రచించుటొప్పు ఘన రాశిభూత వృత్తావళిన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.