గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, డిసెంబర్ 2009, శనివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 69.

మిత్రులారా!
మానవులమైన మనం నిత్యం సుఖ దుఃఖాల ననుభవిస్తూ సుఖానుభూతిలో ఎంత కాలాన్నైనా లెక్ఖ చెయ్యం కాని, దుఃఖాన్ని అనుభవించ వలసి వస్తే మాత్రం చాలా ప్రతిస్పందింస్తూ, గడుపుతున్న ప్రతీ ఒక్కక్షణమూ వెత చెందుతూ, ఆఖరికి దైవానికి మొరపెట్టుకొంటాం.
ఐతే దుఃఖ హేతువులైన అనుభవాలన్నీ కూడా మన కర్మఫలాలుగా గ్రహించ లేము. సరి కదా, వీటికి మరెవరో కారణమని నిందిస్తూ ఉంటాము.
ఈ క్రింది శ్లోకాన్ని చూడండి.

శ్లో:-
రోగ, శోక, పరీతాప, బంధన, వ్యసనానిచ,
ఆత్మాపరధ వృక్షాణాం ఫలాన్యేతాని దేహినాం.

క:-
మనిషికి రోగము, శోకము,
ఘన బంధన, వ్యసనము లివి కలుగుట, తన చే
సిన కర్మ విష ఫలంబులు.
మనమునఁ గని చేయకుంట మంచిది మనకున్.

భావము:-
మనుజులకు రోగము, దుఃఖము, పరితాపము, బంధనము, వ్యసనము మొదలైనవి తాము గావించు తప్పు పను లనెడి విష వృక్షము యొక్క ఫలములే సుమా.

పైన చెప్పిన విషయం యదార్థానికి దర్పణం పట్టుతోంది కదూ?

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.