గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, డిసెంబర్ 2009, శుక్రవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 64.

శీల మహా ధన మహిమ:-

మన భారత మాత గర్భాన పుట్టిన మహనీయుల మహద్వచనము లమోఘములు, నిత్యమూ అనుసరణీయములు. మన సంస్కృతికి అద్దం పట్టే ఈ క్రింది శ్లోకాన్ని చూద్దాం.

శ్లో:-
మాతృవత్ పర దారేషు
పర ద్రవ్యేషు లోష్ఠవత్
ఆత్మవత్ సర్వ భూతేషు
యః పశ్యతి స పండితః.


క:-
పరసతులను తన తల్లిగ
పర ధనమును మట్టివోలె పరికించుచు తా
పరులను తన వలె తలచుచు
చరియించెడి వాడె భువిని సత్ పండితుడోయ్.


భావము:-
భూమిపై యెవరయితే పర కాంతలను తన కన్న తల్లిగాను, పరుల ధనాదులను మట్టి వలెను, చూచే జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ అన్ని ప్రాణులను తనవలె భావిస్తూ అత్యద్భుతమైన సత్ప్రవర్తన కలిగి వుంటారో వారే నిజమయిన పండితులు.

మనకు ఎంత పాండిత్యమున్నా సచ్ఛీలమనే సంపద లేనట్లయితే మన పాండిత్యము బూడిదలో పోసిన పన్నీరే సుమా. మనవద్ద శీల సంపద వున్నట్లయితే అంతకుమించిన గౌరవప్రదమైన ధనము వేరే లేదుకదా!
పోతన ప్రహ్లాదుని గూర్చి చెప్పుతూ
" కన్నుదోయికి నన్య కాంత లడ్డంబైన మాతృ భావము జేసి మసలువాడు "
అని చెప్పాడు.

అర్ధ రహితమైన ఆలోచనలతో అంతరాత్మ చెప్పుతున్నా వినకుండా అన్య కాంతలను పొందాలని ప్రయత్నిస్తూ, అన్యుల ధనాదులు అయాచితంగా తనకే సంప్రాప్తమవాలని నిరంతరం కాంక్షిస్తూ, ఆ కారణంగా నిత్యం పరుల ఉసురు పోసుకొంటూ పాప కూపంలోకి కూరుకుపోవడం మంచిదంటారా? లేక మహాత్ముల మహనీయ వచనములననుసరించడం ద్వారా అనంతమైన అత్మానందాన్ని పొందుతూ అందరి మన్ననలనూ అందుకోవడం మంచిదంటారా? మనం బాగా ఆలోచించుకొంటే మనమెలా ప్రవర్తించాలో మనకు తెలియకపోతుందా? కర్తవ్యం మన చేతుల్లోనే వుంది . మరి ఆలోచన గలిగి ప్రవర్తిద్దామా?

జైహింద్.
Print this post

3 comments:

రవి చెప్పారు...

ఈ శ్లోకం ఎక్కడ నుంచి గ్రహించారో తెలుసుకోవాలని ఉన్నది. పండితుడికి అర్థం, కొన్ని శ్లోకాలలో బుద్ద దేవుడు చెప్పినట్టు, అందులో కొన్ని అజంతా, ఎల్లోరా గుహలలో లిఖించబడి ఉన్నట్టు ఓ పుస్తకంలో చదివాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చిరంజీవీ!(భా)రవీ!
ఇంత చిన్న వయసులో నీకు గల అంత చక్కటి ఆలోచనాసరళి అది పూర్వజన్మ సుకృత ఫలం. "భావస్థిరాణి జననాంతర సౌహృదాని" అన్న కాళిదాసు మాటలు నగ్న సత్యాలనిపిస్తున్నాయి.

ఇక ఈ శ్లోకం విష్ణు శర్మ చెప్పిన హితోపదేశంలో ఉంది.

Unknown చెప్పారు...

ఉపనిషద్ వాక్యం అండి అది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.