గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, డిసెంబర్ 2009, శనివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 70.

శ్లోll
అకృత్వా పర సంతాపం అగత్వా ఖల మందిరం
అక్లేశయత్యచాత్మానం యదల్ప మపి తద్బహుః.
తే.గీll
పరుల సంతాప హేతువై ప్రబల రాదు.
చెడుగు సహవాసమెన్నడు చేయరాదు.
సుకృత లేశంబులవియెయౌన్ చూచుచుండ
ఘనతరంబుగ మనకిది కనగ నగును.
భావము
ఇతరులకు సంతపము కలిగించకయు; ఖలులతో సహవాసము చేయకయు; గావించిన కొలది సుకృతములు కూడా మహత్తరమైనవగుచున్నవి.
ఈ క్రిందిశ్లోకాదులు మేలిమి బంగారం మన సంస్కృతి 62.న గలవి పునరుక్తమైనవి.

పాఠక మహాశయులారా!
సంసార విష వృక్షముపై జీవనము సాగించు చున్న మానవాళికి అమృతోపమైన ఫలములను గూర్చితెలియఁజేస్తున్న ఒక మంచి శ్లోకం ఉంది. చూడండి.
శ్ల్లో:-
సంసార విష వృక్షస్య ద్వే ఫలే అమృతోపమా.
కావ్యామృత రసాస్వాదః, సంగమ స్సజ్జనై స్సహ.
గీ:-
అరయ సంసార విష వృక్షమందు రెండు
ఫలము లమృ తోపమము లుండె, భవ్యమైన
కావ్య సుధఁ గ్రోలు టొక్కటి, ఘనతఁ గన్న
సజ్జనులతోడి సన్మైత్రి సలుపు టొకటి.
భావము:-
సంసారమనే యీ విష వృక్షమునకు అమృతోపమైన ఫలములు రెండే రెండు కలవు. ఒకటి కావ్యామృత రసాస్వాదనము, రెండు సజ్జన సాంగత్యము.
ఇవి అనుభవైక వేద్యాలు మాత్రమే. ఆవిషయం మీకూ తెలియనిది కాదు కదా!
జైహింద్.
Print this post

1 comments:

Unknown చెప్పారు...

అవునండి. నిజంగా నిజం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.