సుజనులారా!
మనమెంత మంచిగా ఉన్నను మనకెదురయే దుస్థితులు మన కాందోళన కలిగిస్తున్నప్పుడు బాధపడుతూ ఆభగవంతుణ్ణి ప్రార్థిస్తాము.
పూర్వ జన్మమునకాని, ఈజన్మలోనే కాని మనము చేసుకొన్న కర్మఫలములే మన సంపాదనగా మన వెంట నంటి ఉంటాయి. దానినే పెద్దలు నుదుటి వ్రాత అంటారు. దానినెవరో మనకివ్వలేదు.మనం సంపాదించుకొన్నదే. దానిని ఎవ్వరూ మార్చలేరు. అనుభవింప వలసినదే అనే విషయాన్నే ఈ క్రింది శ్లోకం మనకు తెలియఁ జేస్తుంది. గమనించండి.
శ్లో:-
హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి
లలాట లిఖితా రేఖా పరిమార్ష్టుం నశక్యతే.
క:-
హరియును హరుడును బ్రహ్మయు
సురగణములు కూడ తగరు చుట్టిన కర్మల్
చెరుపగ. కర్మ ఫలంబులు
నరు నుదుటను గలుగు వ్రాత, నడపును సతమున్.
భావము:-
నుదుట వ్రాయఁబడిన వ్రాతను చెరుపుట హరి హర బ్రహ్మలకు గాని, దేవతలకు గాని సాధ్యము కాదు కదా !
మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం సత్యమనే అనిపిస్తోంది.
జైహింద్.
Print this post
1 comments:
అనువాదం కందపద్యంలో అందంగా ఒదిగింది. మంచి శ్లోకాన్ని, మంచి అనువాదాన్ని అందించారు. ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.