సాహితీ ప్రియులారా!
చెప్పుకోండి చూద్దాం అనే శీర్షికలో ఉంచిన అన్నిపద్యరూప ప్రశ్నలకూ చక్కగా స్పందించి కొందరు వచన రూపంలోను, ఎక్కువమంది పద్య రూపంలోను చక్కగా సరైన సమాధానాలిచ్చారు. అందరికీ నాహృదయపూర్వక అభినందనలతోపాటు కృతజ్ఞతలు.
ఈ రోజు మీ ముందుకొస్తున్న ప్రశ్నకు కూడా మీ నుండి ప్రతిస్పందన చక్కగా ఉంటుందని నమ్ముతున్నాను.
చూడండి ఆ ప్రశ్నేంటో.
తే:-
అరయ నాల్గక్షరముల శివాఖ్య యొప్పు
వాని తలఁ గొట్ట యిందిరా వల్లభుడగు.
వాని తలఁగొట్ట నర్థంబు భర్త యగును.
అట్టి పదమేదొ తెలుపుడీ! ఆర్యులార.
చూచారు కదా! మరెందు కాలస్యం? వెంటనే సరైన సమాధానాలు పంపండి.
జైహింద్.
6 comments:
నను బ్రోవు ముమాపతి దయ
నను బ్రోవుము మాపతి కరుణామృత ధారన్
నను బ్రోవుమా పతీ యని
వింతించెను ఇంతి ఉదయ వేళల దినమున్
ఉమాపతి
మాపతి
పతి
ఫణిగారు, మీ పద్యం చాలా బాగుంది!
రామకృష్ణా రావుగారు,
మీ పద్య ప్రహేళికలకి పద్యాలలోనే సమాధానం చెప్పే ధీమంతుడు మీకు దొరికారు! పసందుగా ఉంది.
ఔనండీ కామేశ్వరరావుగారూ! నిజంగానే నాకు
ఎవరెష్టెక్కి నంత ఆనందంగా ఉందండి.
సహజ కవిత్వమీ ఫణిప్రసన్నకుమారుని కబ్బి యుండుటన్
గహనముకాదు సత్కవిత, కమ్మగ వ్రాయగ నౌనటంచు,తా
నహరహమిచ్చు ప్రశ్నలకు హాయిగనుత్తరముల్ రచించుచున్
సహృదయ భావసంపదలు చక్కగ నాకు నొసంగునొప్పుగన్.
ఈ సందర్భంగా ఫణి ప్రసన్న కుమార్ గారికి, మీకు నా ధన్యవాదాలు తెలియఁ జేస్తున్నాను.
చిన్నప్పుడు చందస్సు నేర్చుకొన్నప్పుడు ఉత్సాహం కొద్దీ పద్యాలు రాయటమే కానీ తరువాత వాటి గురించి మరిచే పోయాను. ఇన్నాళ్ళకి ఆంధ్రామృతం, తెలుగు పద్యం, నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం, వాగ్విలాసం లాంటి పద్య ప్రక్రియను ప్రోత్సహిస్తున్న బ్లాగుల వల్ల మళ్ళీ పద్యాలపై ఉత్సాహం కలుగుతోంది. ఏదో ఛందోబద్ధంగా రాయటమే కానీ భాషా పరిజ్ఞానం, కవిత్వ దృష్టి అంతంత మాత్రమే. నాలాగా ప్రయోగాలు చేసే వారిని అంధ్రామృతం చక్కటి అవకాశాన్నివ్వటం, విజ్ఞులు ప్రోత్సహించడం నిజంగా నా అదృష్టం. ధన్యవాదములు.
ఫణి ప్రసన్న కుమార్ గారికి అభినందనలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.