ప్రియ పాఠక మహోదయులారా!
ఎవరైనా ఒకరు ఆంగ్ల తేదీని చెప్పి " ఏ వారమో చెప్పండి చూద్దాం ", అని అడిగితే అయ్యో, అది నాకు రాదే అని మీరేమీ జంకకండి.
ఉదాహరణకి:- 15-8-1947 అని తేదీ ఇచ్చారనుకోండి.
ఈ క్రింది పద్ధతి నర్థం చేసుకొని, ప్రయత్నించండి.
తెలియకపోతే మీ సందేహం తెలపండి.
ఇప్పుడు నేను వ్రాసిన ఈ క్రింది పద్యాలను చూడండి.
సీ:-
ఈప్సితమగు(Date) తేది నిచ్చిన దానిలో
వత్సరమ్మును ముందు పట్టవలయు.
పందొందివందలు పరిధిగా గమనించి
పై పడ్డ సంఖ్యను పట్టి, పిదప
భాగించి నాల్గుచే, భాగఫలముఁ గల్పి,
తేదీని కలిపినఁ దేలు కొంత.
మాస సంకేతమ్ముమరల దానికి కల్పి,
ఏడుచే భాగింపనేది మిగులు?
తే:-
శేష మొకటైన ఆది గా చెప్పవలయు.
రెండు మూణ్ణాల్గు ఐదారు నిండు సున్న
సోమ మంగళ బుధ గురు శుక్ర శని గ
వారమును తెల్పి వర్థిల్ల వచ్చు మనము.
ఆ:-
ఆంగ్ల తిథికి వార "మాంధ్రామృతము" మీకుఁ
జెప్పె. జనవ(JANUARY)రాది కొప్పు వరుస
నొ్కటి, నాల్గు, నాల్గు. ఒద్దికతో ఏడు,
రెండు. ఐదు, ఏడు, ఉండు, పిదప
మూడు, ఆరు, ఒకటి, ముచ్చట తో వచ్చు
నాల్గు, ఆరు, వచ్చు. నయత నొప్పు.
ఆంగ్ల మాస క్రమము నరయు పద్ధతి యిదే.
ఆర్యులార! దీని నరసి కనుడు.
ఇంతేనండి. ఈ మాటు ఏతేదీ ఏవారమో అన్న విషయాన్ని మీరే అద్భుతంగా చెప్పఁగలరు.
అర్థమైంది కదండీ! ఐతే ఇక ప్రయత్నించండి.
ఉదాహరణకు మీరు పుట్టినతేదీ, లేదా మీకు ముఖ్యమైన తేదీ తీసుకోండి. యత్నించి సాధించి తెలియఁ జేయండి.
జైహింద్.
Print this post
2 comments:
బావుంది మాష్టారు మీ గణిత గుళిక
ధన్యవాదాలు వాసుగారూ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.