పాఠక ప్రకాండులారా!
మనం రోజూ వినే దైవ స్తోత్రాలలో ఉండే ఛందస్సులు మన తెలుగులో ఉన్నాయన్న సంగతి మీకు తెలియనిది కాదు. అట్టి వాటిని మీకిక్కడ పరిచయంచేయ దలిచాను.
సావధానంగా వినఁగలిగే మీకు అర్థం కాక మానవని నా నమ్మకం
వసంత తిలక వృత్తము:- { "శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం" లో యిమిడియున్న ఛందస్సు.}
{ ఈ వృత్తము " సింహోన్నతము - ఔద్ధర్షిణి - శోభావతి - మధుమాధవి " అని కూడా పిలువఁబడుతుంది.}
" త - భ - జ - జ - గగ." అను గణములు ప్రతి పాదమున వచ్చును.
{ UUI - UII - IUI - IUI - UU.}
యతి 8 వ అక్షరము.
ప్రాస నియమము కలదు.
ఉదాహరణ:-
ఆంధ్రామృతం బవని నాంధ్రుల కల్పకమ్మై
ఆంధ్రేతరుల్ కనుచు నందగ లేక కృంగన్,
ఆంధ్రత్వ మాంధ్ర పలు కద్భుతమై వెలుంగన్.
ఆంధ్రావళిన్ నిలుపు నాకస వీధి లోనన్.
మాలినీ వృత్తము:- { "కర చరణ కృతం వా కర్మ వాక్కాయజం వా --" అనే ప్రార్థనా శ్లోకంలోని ఛందస్సు }
" న - న - మ - య - య." అను గణములు ప్రతి పాదమున వచ్చును.
{ III - III - UUU - IUU - IUU.}
యతి 9 వ అక్షరము.
ప్రాస నియమము కలదు.
ఉదాహరణ:-
భువన విజయమందున్ పూజ్యులౌ సత్ కవీశుల్
కవన విజయమొందన్ కల్పనా శక్తి తోడన్
రవి కననివి కూడన్ రంగుగా గాంచి, చూపున్.
హవణిక లవి. ఈ యాంధ్రామృతంబంది యిచ్చున్.
పంచచామర వృత్తము:- { రావణ కృత శివ తాండవం. ఈ ఛందస్సులోనే వ్రాయబడింది.}
" జ - ర - జ - ర - జ - గ." అను గణములు ప్రతీ పదమున వచ్చును.
{ IUI - UIU - IUI - UIU - IUI - U.}
యతి 10 వ అక్షరము.
ప్రాస నియమము కలదు.
ఉదాహరణ:-
సరస్వతీ ప్రసాద సిద్ధ సత్‍కవీశ్వరుల్ కృపన్
వరాల వర్షమట్లు హృద్య పద్యముల్ పఠింపగా,
విరించి వారి మధ్య నిల్చె వింత కోర్కెఁ జూచుచున్
సరస్వతీ స్వరూపులంచు చంచలించు మేనుతో.
మత్తకోకిల వృత్తము :- { అన్నపూర్ణాష్టకం సుమారు ఈ ఛందస్సుకు దగ్గరగా ఉంటుంది.}
" ర - స - జ - జ - భ - ర." అను గణములు ప్రతీ పాదమున వచ్చును.
{ UIU - IIU - IUI - IUI - UII - UIU.}
యతి 11 వ అక్షరము.
ప్రాస నియమము కలదు.
ఉదాహరణ:-
శ్రీ కృపాంభుధి. భక్త కోటిని చిత్తమందు గణించుచున్
ప్రాకృతంబగు దోష సంహతిఁ బాపుచున్ దయఁ గాంచుఁగా !
ప్రాకృతంబగు దోషముల్ గని పాయుటొప్పగు. సజ్జనుల్
"శ్రీ కృతజ్ఞులఁ గాచుఁ" గావున చిత్త మొప్పుఁగ నుండుతన్.
తరళ వృత్తము:- { మత్తకోకిల వృత్తమే మొదటి గురువు 2 లఘువులవడంతో ఈ తరళం గా రూపు దాల్చింది.}
" న - భ - ర - స - జ - జ - గ." అను గణములు ప్రతీ పాదమున వచ్చును.
{ III - UII - UIU - IIU - IUI - IUI - U.}
యతి 12 వ అక్షరము.
ప్రాస నియమము కలదు.
ఉదాహరణ:-
సిరి కృపాంభుధి. భక్త కోటిని చిత్తమందు గణించుచున్
పర కృతంబగు దోష సంహతిఁ బాపుచున్ దయఁ గాంచుఁగా !
పర కృతంబగు దోషముల్ గని పాయుటొప్పగు. సజ్జనుల్
"సిరి కృతజ్ఞులఁ గాచుఁ" గావున చిత్తమొప్పుఁగ నుండుతన్.
కవిరాజ విరజితము అను వృత్తము:- { అయిగరి నందిని ----- అనే అమ్మవారి ప్రార్థనా స్తోత్రం ఈ వృత్తంలోనే వ్రాయఁబడింది.}
"న - జ - జ - జ - జ - జ - జ - లగ." అను గణములు ప్రతీ పాదమునవచ్చును.
{ III - IUI - IUI - IUI - IUI - IUI - IUI - IU }
యతి 1తో - 8వ - 14వ - 20వ అక్షరములు.
ప్రాస నియమము కలదు.
ఉదాహరణ:-
సమరస భావము, సద్గుణ శీలము, సౌమ్య ప్రవృత్తియు, సంపదలై
యమరిన వారిని హాయిగ చూడగ నద్భుత రీతిని యా కవితల్
సుమధుర రీతిని చొప్పడు, నిక్కము సూక్తుల యట్టుల శోభిలుచున్.
సుమధుర ఛందము సొంపుగ పాడగ శోభిలఁ జేయును సుశ్రూతమై.
చూచారు కదండి. తెలుసుకోవాలనుకొనేవారికి ఎంత చెప్పినా చెప్పాలనే ఉంటుంది. వారికి ఎంత తెలుసుకొన్నా తెలుసుకోవాలనే ఉంటుంది కదండీ? మీరుత్సాహ పడితే మరి కొన్ని విషయాలు సావకాశంగా తెలియఁ జేయఁ గలనని మనవి చేయుచున్నాను.
జైహింద్.
Print this post
2 comments:
శివతాండవం, మహిషాసుర మర్ధనం నేను తఱచూ వింటూంటాను. వృత్తాల పేర్లు యతి స్థానాలు తెలిపినందుకు పెక్కు ధన్యవాదములు.
శ్లోకాల లోని ఛందస్సులను వివరించి నందుకు ధన్య వాదములు . మరి మిగిలిన " అష్టకాలను [ అదే లింగాష్టంకం , మున్నగు నవి ] ఇంకా " శివ పంచాక్షరీ ,షడక్షరీ , లాంటివి ఇవన్నీ ఏ చందస్సులో ఉంటాయి ? ఇలా ఛాలా ఉన్నాయి కదా ?
అసలు నాసందేహాలు సరియైన వైతే తెలుప గలరు . అభినందనలతో
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.