సంసారిక మైన ఈతి బాధలతో సతమతమయే మనకు సుఖాన్నందించఁ గలిగిన వాటిని గూర్చి తెలుసుకొందాం.
సంసార విష వృక్షస్య ద్వే ఫలే అమృతోపమే.
కావ్యామృత రసాస్వాదః, సంగమస్సజ్జనైస్సహ.
తే:-
అరయ సంసార విష వృక్ష మందు గలవు
రెండు ఫలములు సుధలొల్కు నిండుగాను.
కావ్య సుధఁ గ్రోలు టొక్కటి ఘనతరముగ.
సజ్జనుల సంగ తొక్కటి చక్క నొప్పు.
భావము:-
సంసారమనే యీ విష వృక్షమున రెండే రెండు అమృత ఫలము లున్నవి.
మొదటిది కావ్యామృత రసాస్వాదనమున్నూ, రెండవది సత్ పూరుష సహ వాసమున్నూ.
కావున చక్కని కావ్య పఠనము, సాజ్జన సాంగత్యము తప్పక చేయుట మనకు యుక్తము.
జైహింద్.
3 comments:
మేలైన రీతిలో మన సాంప్రదాయ కవిత్వపు సొగసులని, మేలిమి బంగారు వన్నెతో విలసిల్లే విధంగా ప్వకీయమైన ఆంధ్రానువాదంతో అందిస్తున్న మీకివే హార్దిక అభినందనలు.
మేలు బంగరు కాంతుల మేలుబంతి
పద్య రచనలు చేయుచు పలికితీవు
వాసి కెక్కితి గద మన వారి లోన
వాణి దయసేత కరుణించె వాస్తవమ్ము
ప్రియ మిత్రమా!
మేలైన చదువు చదివితి,
మేలుఁ గొలుపు మిత్రులొద్ద మెలగితిని. జగ
మ్మేలెడి దైవము తోడయె.
మేలు కవిత రాకయున్నె? మిత్ర వరేణ్యా.
మీరానందపడినందుకు సంతోషం.
ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.