గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, డిసెంబర్ 2008, ఆదివారం

తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి.

తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి అన్నారు పెద్దలు. ఏం రామాయణం లేదా? భాగవతం లేదా? వినడానికి? భాగవతమే ఈందుకు వినాలి? అని చాలా మందికి సందేహం వస్తుందని తెలిసే భారతం లో గల ప్రత్యేకతను వ్యాస భగవానులవారు ఈ క్రింది విధంగా సెలవిచ్చారు చూడండి.

శ్లోకము:-
యద్ధర్మేచార్ధేచ కామేచ
మోక్షేచ భరతర్షభ!
యదిహాస్తి తదన్యత్ర
యన్నేహాస్తి నతత్క్వచిత్.

కందము:-
ధర్మార్థ కామ మోక్షము
లర్మిలి భారతమునందు నద్భుతమొప్పెన్.
ధర్మాదు లిందు లేనివి
ధర్మజ్ఞుడ! లేవవెచట. తలచిన. పార్థా.

ధర్మార్థ కామ మోక్షములు భారతంలో వున్నవే మిగిలన యేగ్రంథంలో నైనా వున్నయి. ఈ భారతంలో లేని ధర్మార్థ కామమోక్షాలు ఈ గ్రంథములో లేనివి మరే గ్రంథములోనూ లేవని గ్రహింపుము. అని అర్జునునితో శ్రీ కృష్ణ పరమాత్ముని చేత భారతంలో చెప్పించారు వ్యాస భగవానుల వారు.
మానవ జీవితం ధర్మార్థ కామ మోక్షాలతో ముడిపడి వుంది. ఈ మానవ సమాజం లోని పాత్రలే భారతంలో మనకి అడుగడుగునా ప్రత్యక్షమవతాయి. ఆ సమాజంలోనివారమగు మన జీవన సరళిని సూచించాలంటే మన నిజ జీవితంతో సారూప్యంగల భారత పాత్రలకే అది సాధ్యమౌతుంది. అందుకే వ్యాసభగవానులవారు ఆవిధంగా వివరించారు. గ్రహించుకొంటే అర్థమౌతుంది.
జైహింద్. Print this post

2 comments:

Kathi Mahesh Kumar చెప్పారు...

ఏవరేమన్నా, మహాభారత మంత ఆసక్తికరమైన పుస్తకం మరోటి లేదు. ఎన్ని పాత్రలు. ఎంత వైవిధ్యం.ఎన్ని మానవీయ కోణాలు. నిజంగా the best work of literature ever produced on earth.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

భారతానికి భగవద్గీత ఆత్మ,పాండవుల చరిత్ర శరీరం,చతుర్విధ పురుషార్థ విజ్ఞానం జీవితం, ఇతిహాసాలు,ఉపాఖ్యానాలు జవసత్వాలు అన్నారు.మానవజీవితమనే మహాసముద్రాన్ని చిలికి వ్యాసభగవానుడు మానవాళికి అందించిన అమృతకలశం మహాభారతం.మహాభారతం వేదాలు మొదలుకొని పురాణాలవరకు గల భారతీయ వాజ్ఞ్మయం యొక్క సారాంశాన్ని అందించడమేగాక, ఆయా అంశాలకు వైరుధ్యం ఏర్పడినప్పుడు, వాటికి సామరస్యపూర్వక మార్గాన్నినిర్దేశించే సమన్వయ సంహితగా పేరు గాంచింది.
అందుకే శౌనకాది మునులకు భారత కథనంతా సూతుడు చెప్పి చివర అంటాడు భారతంలో ఉండేదే ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది ఎక్కడా లేదని.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.