గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, డిసెంబర్ 2008, మంగళవారం

పరోపకారాయ ఫలంతి వృక్షాః. మేలిమి బంగారం మన సంస్కృతి 29

పరోపకార ప్రకృతి.
మానవులను మాన్యులూ, సామాన్యులూ అని రెండు తెగలుగా చెప్ప నర్హమగును. మాన్యులు పరుల కొఱకు బ్రతుకుతారు, సామాన్యులు పరులవలన బ్రతుకుతారు. ఐతే వృక్షములు, మున్నగునవి పరుల కొఱకే బ్రతుకుతాయి. ఈ విషయంలో చక్కని శ్లోకమొకటుంది చూడండి.
శ్లో:-పరోపకారాయ ఫలంతి వృక్షాః
పరోపకారాయ వహంతి నద్యః
పరోపకారాయ దుహంతి గావః
పరోపకారార్థమిదం శరీరం.

ఆ:-పరుల కుపకరింప ఫలియించు వృక్షముల్.
పరులకుపకరింప పారు నదులు.
పరులకుపకరింప పాలిచ్చు గోవులు.
పరులకుపకరించి పరగ వలయు.

భావము:-పరోపకారార్థమే వృక్షములు ఫలించుచున్నవి. పరోప కారము కొఱకే నదులు ప్రవహించు చున్నవి. పరోపకారముకొఱకే ఆవులు పాలిచ్చుచున్నవి. ఈ శరీరములు పరోపకారము కొఱకే సుమా.
మానవులు మాత్రమే సృష్టిలోని వనరులనన్నిటినీ తనకనుకూలముగా మార్చుకొని ఉపయోగించుకొనుచున్నాడు. ప్రకృతిలోని ఒక్క మానవుడు తప్ప మరే ప్రాణీ స్వలాభాపేక్షతో పరోపకారము చేయుటలేదు కదా! వాటినన్నింటినీ చూచైనామానవుడు పరోపకార పరాయణుడై ప్రవర్తించాలికదా! మనమందరం పరోపకారాన్నే మనసులో పెట్టుకొని స్వ ప్రయోజనమును విడనాడి సేవాభావం మాత్రమే దృక్పథంగా కలిగి ప్రవర్తిద్దామా .
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.