గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, డిసెంబర్ 2008, శుక్రవారం

న సా సభా యత్ర న భాతి కశ్చిత్మే...లిమి బంగారం మన సంస్కృతి 25

సభలలో పరస్పర గౌరవము యొక్క ఆవశ్యకత.
మనం చూస్తుంటాం. చాలా చోట్ల సభా నిర్వహణలు యే ఒక్కరిద్దరో నిర్వహిస్తూ వుండడం. ఆద్యంతం ఆ వ్యక్తులే అన్నీ అయి నిర్వహించడమే కాక, మరొకడు సమర్ధుడైనను, మహనీయుడైనను, అతని ప్రమేయాన్ని వారు స్వాగతించుటకిష్ట పడరు. బహుశా వారి నిర్వహణ మీద వారికున్న మితిమీరిన దురభిప్రాయం అయివుంటుందనుకొంటాను. అలాగే వారికి వచ్చే కీర్తి తగ్గిపోతుందని వారనుకొంటారనుకొంటా. ఈ విషయంలో ఒక శ్లోక రాజముంది పరిశీలిద్దాం. చూడండి.
శ్లో:-న సా సభా యత్ర న భాతి కశ్చిత్
న సా సభా యత్ర విభాతిచైకః
సభాతు సైవాస్తి యథార్హ రూపా
పరస్పరం యత్ర విభాతి సర్వే

తే:-ఒక్క డైనను వెలుగని, ఒక్కరుండె
వెలుగు సభ యది సభ కాదు. వెలుగ వలయు
సభికు లెల్లరు సభలోన. సభికు లొకరి
కొకరు వెలుగ జేయ వరలు సకల సభలు.

భావము:-మనమేదైనా సభనిర్వహించినచో ఆ సభలో ఒక్కడు కూడా ప్రకాశించనిచో అది సభ కానేరదు. అట్టులే ఏ ఒక్కడో మత్రమే ఆ సభలో ప్రకాశించిననూ అదియూసభ కానేరదు. సభ నిర్వహించినప్పుడు ఆ సభలో పాల్గొన్నవారందరూ పరస్పర సహకారంతో ఆ సభలో రాజిల్లవలెను. అట్టి సభయే సభ యనబడును. అట్టివి కానివి సభలు అనుటకు వీలులేదు.
సభా నిర్వాహకులు సభికులందరికీ ప్రాధాన్యతనిచ్చి అందరినీ సంతోష పెట్టవలెను. అప్పుడే ఆ సభకు పరిపూర్ణత చెకూరును. ఏఒక్కరినీ అలక్ష్యము చేయరాదు. చూచారుకదా! ఈమాటలు ఎంత యదార్థములోకదా!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.