సామాజిక జీవనం సాగించే మానవుడు అవశ్యాచరణీయ ధర్మాలు మన వేదాల్లో అత్యద్భుతంగా వివరించబడ్డాయి. తైత్తరీయారణ్యకములో విశదము చేసిన మానవ ధర్మాలను చూద్దాము.
తైత్తరీయారణ్యకము:-
01.
సత్యం వద. ధర్మం చర.
స్వాధ్యాయాన్మా ప్రమదః
క- సత్యము పలుకుత. ధర్మము
నిత్యము పచరించుగాత. నిర్మల మతితో
స్థుత్యపు స్వాధ్యాయమునౌ
న్నత్యముతో గనుత విడక. నరులున్నతికై
భావము:-
నరులు సత్యమును పలుకుదురు గాక.
ధర్మమును అనుష్టింతురు గాక.
స్వాధ్యాయము నేమఱకుందురు గాక.
ఔన్నత్యమును పొందుదురు గాక.
02.
ఆచార్యాయ ప్రియం ధనం ఆహృత్య ప్రజా తంతుం మా వ్యవచ్ఛేత్సీః .
సత్యాన్న ప్రమదితవ్యం.
ధర్మాన్నప్ర,మదితవ్యం.
క:-గురునకు ప్రియ ధన మొసగిన
తరువాతనె వంశవర్ధ తనయుల గనుతన్.
సు రుచిర సత్యము మఱువక
స్థిరమగు ధర్మంబువిడక తేజము గనుతన్.
భావము:-
గురువునకు ప్రియమగు ధన మార్జించి యిచ్చిన పిమ్మట వంశము నిలుపుటకై సత్ సంతానమును బడయ నగును.
సత్యమార్గము నేమఱకూడదు.
ధర్మ మార్గమును వీడ రాదు.
03.
కుశలాన్నప్రమదితవ్యం.
భూత్యైనప్రమదితవ్యం.
స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నప్రమదితవ్యం.
తే:-కుశల, కల్యాణ కర్మల, కోరుకొను స
మృద్ధి, స్వాధ్యాయ ప్రవచన వృద్ధి యెడ ప్ర
మాద మనునది నొందక మసలు గాత.
మానవులు భువిపైన తా మనుత సతము.
భావము:-
కుశలము నుండి, కల్యాణ కర్మల నుండి, సమృద్ధి నుండి, స్వాధ్యాయ ప్రవచనముల నుండి, ప్రమాదమునొంద కుందురు గాక.
04.
దేవ పితృ కార్యాభ్యాం నప్రమదితవ్యం.
మాతృ దేవో భవ.
పితృదేవో భవ.
ఆచార్య దేవో భవ.
అతిథి దేవో భవ.
తే:- దేవ పితరుల కార్యముల్ దీక్ష జేసి,
తల్లి దండ్రియు, గురువును దైవమనగ
అరసి, యతిథి దైవము గాంచి యాదరించి,
జ్ఞాన మొప్పగ నడచుత! మానవుండు.
భావము:- దేవ పితృ కార్యములను విడువ కుందురు గాక.
తల్లిని, తండ్రిని, గురువును, దైవముగా భావింతురు గాక.
అతిథిని దైవముగా భావించి గౌరవింతురు గాక.
05.
యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని, నో ఇతరాణి.
యాన్యస్మాకగ్ ం సుచరితాని తాని త్వయోపాస్యాని, నో ఇతరాణి.
తే:- నింద్య కర్మలు విడిచి, యనింద్యములను
చేయు గావుత! మాయందు చేయ దగిన
వేవి సత్కర్మలుండెనో నీవు కూడ
చేయ దగినవి. తప్పులు చేయ రాదు.
భావము:- అనింద్య కర్మ లేవి కలవో వాటినే అచరింతురు గాక.
నింద్య కర్మలు ఆచరింప కుందురు గాక.
ఆర్యులు ఆచరించిన సత్ కర్మ లేవి యుండునో వాటినే ఆచరింతురు గాక.
ఇతరములగు నింద్య కర్మలు విడిచి పెట్టుదురు గాక.
06.
ఏకేచాస్మ చ్ఛ్రేయాగ్ ం సో బ్రాహ్మణాః తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం.
క:- మన శ్రేయము వాంఛించెడి
గుణ మణులగు బ్రాహ్మణులను కూరిమితోడన్
మనమాదరించి సద్ బో
ధనలను గ్రహియింపనగును. ధర్మంబిదియే.
భావము:- సత్ పురుషులు ఎవరు మనకు శ్రేయస్కాములో వారిని సుఖాసీనులను జేసి,
సేద తీర్చి వారి బోధనల సారమును గ్రహింతురు గాక.
07.
శ్రద్ధయా దేయం.. అశ్రద్ధయా z దేయం.
శ్రియా దేయం. హ్రియా దేయం.
భియా దేయం. సంవిదా దేయం.
క:- ఈయగ వలయును శ్రద్ధగ,
ఈయగ తగు హెచ్చుగాను. యించుకెయనుచున్
ఈయగ వలయును సిగ్గున.
ఈయగ తగు భయముతోడ. నిచ్చెడి వేళన్.
భావము:- గురువులకు ఏదైనా సమర్పించు నపుడు శ్రద్ధతో ఈయవలెను.
అశ్రద్ధతో నీయ రాదు.
హెచ్చుగా ఈయలేదని సిగ్గుతో ఈయవలెను.
భయముతో ఈయవలెను.
సంపదకు తగినట్లుగా ఈయవలెను.
08. అథ యది తే కర్మ విచికిత్సా వా వృత్తి చికిత్సా వా స్యాత్ అథా భ్యాఖ్యాతేషు యే తత్ర బ్రాహ్మణాః సమ్మర్శినః యుక్తా అయుక్తాః అలూక్షాః ధర్మ కామాః స్యుః యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః
తే:- ధర్మ సందేహ మొందిన తఱిని మనకు
ధర్మ సుజ్ఞాన గణులు, సత్ కర్మ పరులు
ధర్మ కర్ములు సౌమ్యులు దార్శనికులు.
వారు చూపిన మార్గముల్ వలయు నెపుడు.
భావము:- ధర్మ సంశయము కలిగినప్పుడు ధర్మాధర్మ నిర్ణయ సమర్థులు, ఆచార్య పురుషులు, కర్మ స్వతంత్రులు, పరమ సౌమ్యులు, ధర్మ కాములు అగు మహానుభావు లెట్లాచరించిరో ఆయా సందర్భములలో అట్లే ఆచరింప తగును.
09.
ఏష ఆదేశః
ఏష ఉపదేశః
ఏషా వేదోపనిషత్
ఏతదనుశాసనం
ఏవ ముపాసితవ్యం.
ఏవ ముచైతదుపాస్యం.
క:- ఈ చెప్పిన దాదేశము
ఈ చెప్పిన మాట నిక్క మిది యుపదేశం
బీ చెప్పినయది వేదము.
ఈ చెప్పుట శాసనంబు నెఱుగుచు నడుమా!
భావము:- ఈ పైన చెప్పినదే ఆదేశము.
ఇదే ఉపదేశము,
ఇదే వేద రహస్యము.
ఇదే ఈశ్వరానుశాసనము.
దీనిని ఆచరింతురు గాక.
ఇదే ఆచరణీయము.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.