గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, డిసెంబర్ 2008, మంగళవారం

కవి సామ్రాట్ విశ్వనాధ భావుకత 9

కవి సామ్రాట్ విశ్వనాధ భావుకతను కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు ఉపన్యసించిన విషయాలలో ఎనిమిది పద్యాలను మీముందింతవరకు ఉంచగలిగాను. ఇప్పుడు తొమ్మిదవ భాగమును మీ ముందుంచుతున్నందుకు ఆనందంగా ఉంది.


రామాయణ కల్ప వృక్షము. కిష్కింధా కాండలో .1-9.
చంపకమాల:-
పొరి చిఱు పిందెలున్ ముదురు పూతల దేలిన నింబ వృక్షముల్
విరిసి కషాయ వాసనల వెల్లువలై నవ వత్సరంబు దు
ర్భరమయి సేవ్యతా గుణము వాసిన యట్టులు దోచు, శాఖికా
విరుదిత వాయసీకుల దవిష్ట ఫలాగమ సంధి బంధమై.

ప్రకృతి పరిణామ శీలం కలది. కాల గమనం ఒక్కొక్క సారి ప్రమోదం గాను, ఒక్కొక్క సారి అసహ్యం గానూ అనిపించ వచ్చు. ఎండా వానా, చీకటీ వెలుగూ, శిశిరం వసంతం, అన్నీ మనిషికీ , మనిషికీ ఆస్వాదనీయతలో అనుభవంలో వేఱవుతాయి.

సీతాన్వేషణ చేస్తున్న శ్రీ రామునికి పంపా సమీప అరణ్యములో విరగ బూసిన వేప చెట్లు కనిపించాయి. ఆ వేప పూత వల్ల గాలి కషాయ వాసనా బంధురంగా వుంది. చైత్ర మాసపు క్రొత్త సంవత్సర ప్రారంభ దినాల్లో విరగ బూసిన ఆ వేప వృక్షాల కొమ్మలపై గుంపులై కాకులు వాలుతూ కూస్తూ ఉన్నవి. ఈ దృశ్యాన్ని కవి పై పద్యంలో అద్భుతంగా వర్ణించాడు.

చిన్న చిన్న పిందెలతో ముదురు పూతలతోనున్న వేపచెట్లు గాలిని కషాయ పరిమళ బంధురంగా చేస్తున్నాయి. కాకులకు ఈ క్రొత్త సంవత్సరం దుర్భరంగా వుండి, సేవ్యతా గుణము పోగొట్టునట్లు కనిపిస్తొంది. వేప కొమ్మపై కాకులు సుదూర కాలంలో నైనా లభించే ఫలాగమమందలి ఆశతో కూస్తూ ఉన్నవి.

సముచిత పద ప్రయోగంలోనే కవి ప్రతిభ వ్యక్తమౌతుంది. పద్యంలోని నవ వత్సరము, దుర్భర సేవ్యతా గుణము, దవిష్ఠ ఫలాగమం, మొదలైన పదాల ద్వారా అద్భుతమైన వ్యంగ్యార్థాన్ని కవి సాధించాడు.

ఇది శ్రీ రాముని వనవాస కాలంలో చివరి సంవత్సరము. చిట్ట చివర సంవత్సరంలోని ఈ వసంతాగమనం సీత దగ్గర లేకపోవడం వల్ల పాపం శ్రీరామ చంద్రునికి దుర్భరంగా ఉంది. గడిచిన పదకొండు వసంతాలు సీతా రామ చంద్రులకు మధురంగా, సమ్మోహనంగా గడిచాయి. వానియందు సేవ్యతా గుణము ఉన్నది. ఈ వసంతంలో లేదు. కాకులు పూతతో నిండిన వేప చెట్టును వదలి వెళ్ళడం లేదు. ఎందుకనగా గతంలో ఆ చెట్లు పైననే తీయని వేప పండ్లు తిన్నాయి. ఇప్పటి పిందెలు పండ్లుగా మారడానికి చాలా వ్యవధి వుంది. ఐనా కొంత కాలంలో ఇక్కడ ఫలాగమ ప్రాప్తి ఉందనే ఆశతో వేపకొమ్మలను ఆశ్రయించి ఉన్నాయి. ప్రస్తుత కాలం శ్రీరామునికి గడ్డుగా దుర్భరంగా వున్నా మున్ముందు కాలంలో సీతా సమాగమమునందలి ఆశను ఈ పద్యం ద్వారా వ్యక్తం చేయడంలో శ్రీ విశ్వనాధుని భావుకత మనకు అర్థమౌతుంది. సాదృశ్యాలంకారంతో ఒప్పుచున్న ఈ పద్యం కవి భావుకతకూ, నైపుణ్యానికి గొప్ప తార్కాణము.

చూచారు కదా! విస్వనాధ భావుకత. త్వరలో మరొక పద్యాన్ని మీ ముందుంచేందుకు ప్రయత్నిస్తాను.
జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.