గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, డిసెంబర్ 2008, మంగళవారం

తల్లి దండ్రులే పిల్లలకాదర్శం 2

తల్లి దందులే పిల్లల కాదర్శం 1 వ భాగంలో తల్లి దంద్రులు పిల్లలకే విధంగా ఆదర్శమో తెలుసుకొన్నాం కదా! ఇప్పుడు ఆ తల్లి దంద్రులు ఆదర్శవంతంగా వుండాలంటే ఎలాగుండ వచ్చో చూద్దాం.

సాధారణంగా దంపతులు తాము తల్లి దండ్రులం కాబోతున్నాం అనువిషయం వారి మనసులో పడేసరికి అనిర్వచనీయమైన దివ్యానుభూతిని పొందుతారు. గర్భస్థ శిశువు ఆరోగ్యం కోసం అనేకమైన జాగ్రత్తలు తీసుకొంటారు. బిడ్డ పుట్టిన తరువాత కూడా చాలా శ్రద్ధగా చూసుకొంటారు. ఐతే ఆ బిడ్డడు ప్రతీ క్షణం తల్లిదంద్రుల, పరిసరాల, పరిశీలన తోనే ప్రపంచ జ్ఞానం క్రమ క్రమంగా పొందుతున్న విషయం సరిగా గుర్తించకపోవడం వల్లో, లేక నిరంతర ప్రక్రియ కావున అంత లోతుగా ఆలోచించక పోవడంవలననో తిండి ఆరోగ్యం విషయాలలో చూపే శ్రద్ధ పిల్లలపై ప్రభావం చూపించే పరిసరాలపై కాని, తమ ప్రవర్తనలపై కాని, చూపడంలో నిర్లక్ష్యం చేస్తారనడం సత్య దూరం కాదనుకొంటాను. ఐతే నేను చెప్పేది చాలామంది తల్లి దండ్రుల విషయంలో మాత్రమే.ఎలా ఉంటే బాగుంటుందో మనం పరిశీలిద్దాం.

ఏ గూటి చిలుక ఆ గూటి పలుకు పలుకుతుందంటారు. మన పిల్లలు మనలాగే మనం గౌరవించే సంప్రదాయాలనే గౌరవిస్తూ, మన మనసుకు నచ్చినట్లుగా ఉండాలనుకొంటే శిశువు జ్ఞానానికి ఆధారమైన మన ప్రవర్తన పిల్లలలో మనం కోరుకొనే సల్లక్షణాలను పెంచేవిగా వుండాలన్న విషయం మనం మరువ కూడదు.

ప్రాతః కాలాన్నే మనం క్రమం తప్ప కుండా లేస్తూ వుండాలి. లేవగానే సృష్టిని దానితో పాటు మననూ నడిపే ఆ పరమాత్మను స్మరించుకోవడమే కాదు. బిగ్గరగా అందరికీ ప్రస్ఫుటమయే విధంగా ప్రార్థన చేయాలి.

కరాగ్రే వసితే లక్ష్మీ
కర మధ్యే సరస్వతీ
కర మూలే స్థితే గౌరీ
ప్రభాతే కర దర్శనం.

అని,, తమ చేతులలోనున్న ముగ్గురమ్మలను చూసుకొని కండ్లకద్దుకొని ప్రార్ధించాలి.

మనము నిదుర లేచినది మొదలు మరల పరుండు వరకూ మనకు ఏ భూమాత ఆహారాదులకు మూలాధారమో ఆ భూ మాతను మన పాదములతో త్రొక్కుతూ జీవిస్తున్నాం. ఈ చర్య అనివార్యం కాబట్టి ఆ తల్లికి మనం నిదుర లేస్తున్నప్పుడే క్షమాపణలు వేడుతూ ప్రార్ధించాలి

విష్ణు పత్నీ మహద్భూతే
శంఖ వర్ణే మహీ తలే
అనేక రత్న సంపన్నే
భూమి దేవీ నమోస్తు తే.

సముద్ర వసనే రమ్యే
పర్వత స్తన మండితే
విష్ణు పత్నీ మహా దేవీ
పాద తాడాం క్షమస్వ మే.

ఈ విధముగా ప్రార్థన చేసి మనం ఆ భూమాతకు నమస్కరించి ఆమెపై మన పాదం మోపాలి.
పిదప మనం అతి పవిత్రంగా భావించే మన దైవ స్థానమైన పూజా మందిరంలోనికి వెళ్ళి మన యింట కొలువై యున్న సకల దేవతలకూ నమస్కరిచాలి.
మనం సంఘంలో సత్ ప్రవర్తనతో మసలుకోవడానికి ఆ దైవాలను నిరంతరం మనకు అండగా నిలిచి, ప్రమాదములకు విరుద్ధంగా మనలను నడపమని ప్రార్థించాలి.
ఈ సమస్థమూ మనల ననుసరించే మన పిల్లలకూ ఉగ్గుపాలతో అలవడేలాగ చేయడానికి మన యీ ప్రవర్తన చాలా ఉపయోగ పడుతుంది. ఈ విషయంలో మనం అశ్రద్ధ చేస్తే ఆ తేడా పిల్లలలో మనం చూడక తప్పదు భవిష్యత్తులో.
ఇంకా యేం చెయ్యాలనే అంశాలను తరువాత అవకాశం చేసుకొని మీముందుంచగలనని విన్నవించుకొనుచున్నాను. ఈ సదవకాశం భగవంతుదు నాకిచ్చినందుకు ఆ పరమాత్మకు శత సహస్రానేక వందనములు. మీ అభిప్రాయాల్ని వినమ్రతతో స్వీకరించగలను.
జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.