గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, డిసెంబర్ 2008, శనివారం

తల్లి దండ్రులే పిల్లల కాదర్శం 1

భూమాత ముద్దు బిడ్డలారా! భావి పౌరుల తల్లి దండ్రులారా! మీ అందరికీ నా మనవి. దయతో మీరూ ఆలోచిస్తారని నమ్మి మీకీ విన్నపం చేస్తున్నాను.

మీ జీవితాలుమీవి. మీ ఆనందాలు మీవి. మీ ఆశయాలు మీవి. మీ ఆశయాలలో ముఖ్యమైనది మీసంతానం మంచి పేరు ప్రఖ్యాతులతో అభివృద్ధి మార్గంలో నడవడం. అందు కొఱకు మీలో చాలా మంది శక్తివంచన లేకుండా అహర్నిశలూ శ్రమిస్తుంటారు. ఔనో కాదో మీరూ ఆలోచించండి. మీ శ్రమ ఫలం మీ పిల్లల అభి వృద్ధే కదా! ఐతే మీరు పడుతున్న శ్రమ సక్రమంగా వుందా? అని ఒక్కసారయినావెను తిరిగి ఆలోచించారా? అలాచేసి వుంటే మీ పిల్లలలను మీరు కోరుకొన్న విధంగా తయారు చేసుకోవడం కోసం మీరు శ్రమించే పద్ధతి నూటికి నూరు పాళ్ళు సరయినదేనని మీకు నమ్మకం కలిగిందా? మీరీ విషయం సరిగ్గా ఆలోచించి మరీ చెప్పండి.

పిల్లల ప్రవృత్తికి మూలం వారి జన్మ కారకులైన తల్లిదండ్రులు, వారిప్రవర్తన, నివసించే పరిసరాలు. ఔనంటారా? కాదంటారా? భగవద్గీతలో చెప్పిన " యద్యదా చరతిశ్రేష్ఠః తత్తదేవేతరే జనః తయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే " అన్న శ్లోకం మీకు తెలియనిది కాదు కదా! పిల్లల విషయానికొస్తే వారికి శ్రేష్టులు ముందుగా తల్లి, ఆపిదప తండ్రి. ఆ తల్లి దండ్రుల ప్రవర్తనే పిల్లలకు మార్గ దర్శకాలు.

భావి తరానికి మార్గదర్శకాలయిన తల్లి దండ్రులు వారు పిల్లల ముందు ప్రవర్తించే ప్రవర్తనలో ఎంత మెలకువ కలిగి వుండాలో చెప్పాలంటే చాలా కష్టం. పిల్లల నెంత గొప్పగా చూడాలనుకొంటామో అంత జాగ్రత్తగా మెలకువతో, కించిత్తయినా పొరపాటున కూడా పొరపాటు రాకుండా చూసుకొంటూ ప్రవర్తించాలి. ఇది చలా చాలా చాలా ముఖ్యమైనదిగా మీకు తెలుసు. ఐతే మీరలా లక్ష్య సిద్ధి కోసం ఒక యజ్ఞంలాగా మీరు కోరుకున్నట్టుగా మీ పిల్లలుండాలనే లక్ష్యంతో ప్రవర్తిస్తున్నారా? ఒక్కసారి, ఒక్కసారంటే ఒక్కసారి మీరూ ఆలోచించండి. ఆత్మ పరిశోధన ద్వారా యదార్ధాన్ని గ్రహించడానికి సంశయించకండి. యదార్ధాన్ని మీకు మీరు మీకొరకు ఒప్పుకొంటే ఆ ప్రవర్తనలోని సదసద్వివేచన కలుగుతుంది. పిల్లలకు మంచి మార్గ సూచి అనుకొనే మీ మంచి ప్రవృత్తిని పెంచుకోండి. అసత్ ప్రవర్తన మీలో వుంటే దానిని సమూలంగా తృంచివేయండి. తప్పదు. అస్సలు తప్పదు. ఎందుకంటారా . భూమాత మన జన్మకు సంతోషించాలి. అలాగే మన పిల్లల విషయంలో కూడా. పిల్లలు ఆదర్శవంతంగా బ్రతికేలాగా తల్లిదండ్రులే తీర్చి దిద్దాలి. ఆదర్శ వంతులైన తల్లి దంద్రులు ఆదర్శ వంతులైన పిల్లలను తయారు చేయగలరు. సందేహం లేదు. మీరు ఆదర్శవంతులైన తల్లిదంద్రులు. మీరు తీసుకోవలసిన మెలకువలు మరోమారు అవకాశం కుదుర్చుకొని మీకు వివరించే ప్రయత్నం చేయగలనని మనవి చేసుకొంటూ ధన్యవాదాలు తెలియ జేసుకొంటున్నాను. .
జైహింద్. Print this post

2 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

title is TALLI DANDRULU . not taalli dandrulu. wrongli translated. unfortunately not observed and posted. sorry.

రాఘవ చెప్పారు...

నిజమే రామకృష్ణారావుగారూ... బహుశా ఇందువల్లనేనేమో మన ధర్మశాస్త్రాలలో తల్లిదండ్రులెలా ఉండాలో కూడా చక్కగా వివరించారు. బాధ్యతాయుతమైన మనుష్యులతో పృథివి నిండితే పుడమే కదా స్వర్గసీమ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.