జైశ్రీరామ్.
ఈ రోజు పరమ పవిత్రమయిన ఆరోగ్యప్రదమయిన ఐశ్వర్యకారకమయిన
మాఘశుద్ధ సప్తమి...రథసప్తమి. పాఠకమహాశయులందరికీ
ఆ సూర్యభగవానుని ఆశీస్సులు మెండుగా లభించి
ఆయురారోగ్యానందైశ్వర్యములతో
నిరంతరం వర్ధిల్లుతూ ఉండాలని కోరుకొంటున్నాను.
ఈ దందర్భముగా నేను రచించిన సూర్యశతకము.
శ్రీ వసంత తిలక సూర్య శతకము.
రచన. చింతా రామకృష్ణా రావు
పద్మినీ ఉషా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః.
శ్రీ వసంత తిలక సూర్య శతకము.
1. శ్రీకామితార్థదుఁడ. చిన్మయ పూర్ణ తేజా! - లోకేశ్వరా! మనసులోపల వెల్గుమయ్యా.
శ్రీకారమున్ గొనుమ చిత్ప్రభఁగొల్ప మాకున్. - మాకింక నీవె కద మాన్యుఁడ సూర్యదేవా!
2. వేదంబులందు కనిపించెడి విశ్వవేద్యా! - మోదంబుతోడ జగమున్ దగ వృద్ధి చేసే
నీ దివ్య తేజసము నేవిధి పొందితో. స - మ్మోదంబుతోడ గను, పూజ్యుఁడ! సూర్య దేవా.
3. నీ తీక్ష్ణ తేజసమునే భరియింప నౌనా. - నీ తాపమే ప్రజను నేలను కూల్చు చుండన్,
నీతీరు మార్చుకొన నేరవదేలనయ్యా. - భూతాపమున్ గనుమ, పూజ్యుఁడ! సూర్యదేవా!
4. ఆకాశ వీధి నడయాడుచు పృథ్వినేలన్ - శ్రీ కారమెప్పుడు ప్రసిద్ధిగ చుట్టినావో.
రాకేశుఁడున్ వెలుఁగు రాత్రులు నీదు కాంతిన్. - నీ కాంతిచే వెలుఁగు నేలయు సూర్యదేవా.
5. వృక్షంబులన్ సతము పృథ్విని నిల్పుదీవే. - రక్షింతువీవె తనరారఁగ రమ్య తేజా!
సుక్షేమమున్ గొలుపు సుందర సుప్రకాశా! - మోక్ష ప్రదుండ! మము బ్రోవుము సూర్యదేవా!
6. శిక్షార్హులీ ధర వశించుచు వ్రేచుచుండన్ - శిక్షింపవేమిటికి. శ్రీకర చిద్విభాసా.
రక్షింప నిన్ మది నిరంతరమున్ నుతింతున్. - నిక్షేపమీవెకద నిస్తుల సూర్యదేవా.
7. ఆరోగ్యమిచ్చెడిమహాత్ముఁడ వీవె కాదా. - మా రోగముల్ తొలఁగ మమ్ము గనంగలేవా.
కోరంగ నేల నను కూర్మిని జూచు నిన్నున్ - భారంబొ నేను సురవందిత సూర్యదేవా.
8. జీవాళికాదరవు చింతన చేయ నీవే. - భావింప మా తరమ వర్ధిలు నీదు తేజం
బో వందనీయ. పరమోద్ధతి కొల్పు దీవే. - భావింతు నిన్ సతము భాగ్యద సూర్యదేవా.
9. నీ నామ రూపముల నే కన లేను దేవా. - మౌనంబుగా మదినె మన్ననఁ జేయనిమ్మా
దీనావనా సుగుణ తేజస మిమ్ము మాకున్. - జ్ఞానోజ్వలా! సతము కావుము సూర్యదేవా.
10. ఆదిత్య దైవమ! గ్రహాధిప వందనంబుల్. - నీ దివ్య శక్తిని పునీతమగున్ జగంబుల్.
సాధారణోష్ణము సుసంపద. చాలు మాకున్. - మోదంబుతో కనుమ పూజ్యుఁడ.సూర్యదేవా.
11. ప్రారబ్ధ కర్మలను పారఁగఁద్రోలుమయ్యా. - శ్రీ రాఘవున్దలపఁజేయుచు పుణ్యమిమ్మా.
ధీరోద్ధతిన్ గొలుపు దేవుఁడ కొల్పుమయ్యా. - నీరక్ష కోరు మహనీయులు.సూర్యదేవా.
12. జీవాత్మవై ప్రబలి జీవులనుందువీవే. - నీవేడి ప్రాణమయి నిత్యము నిల్పు మమ్మున్.
శ్రీ విశ్వనాథుఁడవు శ్రీహరి వీవె మాకున్ - నీవారమయ్య. మననీయుమ, సూర్యదేవా.
13. శ్రీ సప్తవర్ణయుత చిద్విలసన్మణీ! నే - వేసారితిన్ కుటిల భీకర దుర్మదాంధుల్
మోసంబులన్ సతము భూమిని వ్రేచుచుండన్. - మోసంబులన్ మడచి ప్రోవుము. సూర్యదేవా!
14. భూమిన్ రహించెడి భూజములెల్ల నీచే - క్షేమంబుగా వరలి శ్రీప్రదమౌను దేవా.
నీమంబుతోడను వినీలమహాంబరానన్ - సేమంబుగా తిరుగు శ్రీప్రద సూర్య దేవా!
15. చిత్తంబులో నిను వసింపఁగ చేయనిమ్మా. - ఉత్తేజమే కలుగునో కరుణాంతరంగా.
మత్తత్వమీవె కనుమా కమలాప్త మిత్రా. - హృత్తేజమై నిలుమ శ్రీ కర సూర్య దేవా!
16. దీనావనా! దినపతీ! జగదేకమూర్తీ! - జ్ఞానాక్షమై హరిని కాంచఁగఁ జేయు వాడా.
ప్రాణంబుగా నిలిచి వర్ధిలఁజేయుదీవే - నేనున్ నినున్ మదిని నిల్పెద సూర్య దేవా!
17. ఈ భారతావని సుహృజ్జన పూర్ణ. నీవే - శోభాయమానముగ చూచుచు. తేజమిమ్మా.
నా భారతాంబ గణనాథుని తల్లి. సృష్టిన్ - శోభించు భద్రగుణ సుందరి. సూర్య దేవా!
18. నీ కాంతియే కనఁగ నేర్పున చేయు సృష్టిన్. - నీకాంతియే నిజమనిత్యము సేయునెల్లన్.
శ్రీ కాంతుఁడైన దరిసింపఁగ లేడు పృథ్విన్ - నీ కాంతి లేక, మహనీయుఁడ! సూర్య దేవా!
19. ఆరోగ్య భాగ్యదుఁడ! హారతులందుమయ్యా. - నీ రాకకై కనెడి నీరజపాళి మేమే.
తారాడు చీకటులు ధాత్రిని వీడి పోవన్ - మారాడఁబోక కనుమామది సూర్యదేవా!
20. మా కర్మ సాక్షివి. సమస్తము కాంచుదీవే. - లోకేశ్వరుండ! నరలోకపు దుష్టపాళిన్
నీకన్నులంగనుచు నిత్యము త్రుంచుమయ్యా - నీ కాకతోడ మహనీయుఁడ సూర్యదేవా!
21. జ్ఞానంబు తేజసమె. కావున నిన్నెఱుంగన్ - జ్ఞానంబు కల్గునటగా కరుణాలవాలా.
దీనావనా సుగుణ తేజసమిమ్ము మాకున్. - జ్ఞానంబదే కొలుపు గాంచఁగ సూర్యదేవా!
22. ఆరోగ్య సౌఖ్యములనాదిగనిచ్చువాడా! - నీ రాక మాకిటననేకశుభంబులిచ్చున్.
భారంబు నీదె. జయ భాగ్యద. కావు మమ్మున్. - నీరేజమిత్ర! మము నిల్పుమ సూర్యదేవా!
23. తారాడు గర్వనిశి దంబమడంచు వీరా! - స్వైరంబుగా తిరుగు పాప వినాశకారీ.
భారంబు నీదెకద, వందనమాచరింతున్. - కారుణ్యమొప్ప ననుఁ గావుమ సూర్యదేవా!
24. సాగింప వచ్చెదవు జాగృతిఁ గొల్పి సృష్టిన్. - నీ గాత్రమే యరుణ నిర్భర వర్ణమొప్పన్
వేగంబె వచ్చి కనువిందుగనుందువయ్యా. - నేఁ గాంచి మ్రొక్కెదను నిన్ మది సూర్యదేవా!
25. జీవాత్మవీవె. జయశీలమునిత్తువీవే. - భావోన్నతంబు పరివర్ధన చేతువీవే.
నీవాడ నన్ గనుము నీవిక ప్రేమతోడన్. - దేవాదిదేవ! వినుతింతును సూర్యదేవా!
26. ప్రాతర్నమామి దినరాజ! అనంత తేజా! - చైతన్యమున్ గొలుపు సత్పరిపూర్ణభాసా.
నీ తత్వమెన్ను మహనీయులె లేరు ధాత్రిన్. - ఖ్యాతి ప్రదా. విజయ కారక. సూర్యదేవా!
27. సప్తాశ్వముల్ కనఁగ సప్త వివర్ణ మాలల్ - లుప్తంబయెన్ తెలుపు లోపల చేరియుంటన్.
గుప్తార్థమిందు కనుగొన్న ప్రభాత వేళన్ - దీప్తంబగున్ మహిత తేజము సూర్యదేవా!
28. వేదస్వరూప! నిను వేడెద పేదవారిన్, - నీ దాసులన్ గనుము నిత్యమనంత తేజా.
బోధన్ కృపంగొలిపి పుణ్యము గట్టుకొమ్మా. - మోదంబుతోఁ గొలుతు పూజ్యుఁడ సూర్యదేవా!
29. నారాయణా! భరమ? నా దరి చేర నీకున్. - కారుణ్యమే మదిని కానఁగ లేదదేమో.
ధీరాత్ములన్ సతము తేల్చెడి దివ్య తేజా - ప్రారబ్ధముల్ కనుచుఁ బాపుమ సూర్యదేవా!
30. ఆనందదాయివి గ్రహాధిప! లోకబంధూ! - జ్ఞానంబె తేజముగ కల్గగ చేయుమయ్యా.
నీనామ సంస్మరణనే విడనీకుమయ్యా. - జ్ఞానాక్షి దాతవయి కావుమ సూర్యదేవా!
31. పచ్చందనంబునకు భాస్కర హేతువీవే. - మెచ్చున్ నినున్ ధరణి మేలగు కాంతినొప్పన్.
నచ్చున్ గదా ప్రకృతి నవ్యమనోజ్ఞ కాంతిన్. - సచ్చిత్ ప్రభాస గుణ సన్నుత సూర్యదేవా!
32. నిత్యాన్నదాన మహనీయులు, దైవ భక్తుల్ - సత్యవ్రతుల్, సుపధ చారులు, యుద్ధవీరుల్
స్తుత్యల్ పతివ్రతమతుల్ నిను చేరుటెల్ల న్ - సత్యమ్ముసత్యమది శాశ్వత! సూర్యదేవా!
33. నీ లీలచే జగతి నిర్మితమయ్యెనయ్యా. - ఆలింపు మా వినతి హాయిగనుండనిమ్మా.
చాలింపుమా జ్వలన సంస్కృతి సద్వరేణ్యా! - పాలింపుమా హృదయపద్మము సూర్యదేవా.
34. పుణ్యంబునంద కవి పూజ్యులు కైతలందున్ - గణ్యంబుగా నిను ప్రకల్పనఁ జేయువారే.
ధన్యాత్ములీ కవివతంసులు. కావుమర్థిన్. - మాన్యుండ శంకలను మానుము సూర్యదేవా!
35. మేఘంబునన్ జలమమేయము చేర్తువీవే. - మాఘంబునన్ శుభమమాంతము కూర్తువీవే.
ఆఘాతముల్ నిలిపి యార్తులఁ గాతువీవే. - ఆఘాటదూరుఁడ! మహాత్ముఁడ! సూర్యదేవా!
36. సూర్యుండ. నీకృపయె చూడఁగఁ జేయునెల్లన్. - సౌర్యంబు నీ కళయె సత్యము కాంతిపూర్ణా!
కార్యార్థులెన్నుదురు గౌరవమొప్ప నిన్నున్. - ధుర్యుండ! నే కొలుచుదున్ కను సూర్యదేవా!
37. మిత్రుండనన్ రవియు మిత్రుఁడు గాన నిన్నున్ - మిత్రుండుగా తలచ మేలుగనుండి యొప్పున్.
పాత్రుండ నన్నెలమి వర్థిలఁ జేయుమయ్యా! - స్తోత్రంబు చేసెద వసుంధర సూర్యదేవా!
38. అజ్ఞాన శర్వరమునంతము చేయుదీవే. - విజ్ఞాన తేజమును వింతగ గొల్పుదీవే.
ప్రజ్ఞాప్రభావమును వాసిగ చూపుదీవే. - సుజ్ఞానమీయగను చూడుము.సూర్యదేవా!
39. వాసించు ధీవరుల ప్రాభవ వర్తనంబుల్ - శేషాహియున్ వినుతి చేయగ చాలఁడయ్యా.
ఈ సృష్టికన్నిటికినీవెగ సాక్షివెన్నన్. - నీ సాక్షిగా కలరనేకులు సూర్య దేవా!
40. లోకేశ్వరా జగతిలో దురపిల్లువారల్ - నీకంటిలో పడరొ? నీ మది క్రుంగిపోదో.
చీకాకులన్ దొలఁగఁజేయఁగ బుద్ధి పోదో. - నీ కంట గాంచి మననీయుము సూర్యదేవా!
41. హే సూర్య! పుట్టితివదెప్పుడు? తెల్పుమయ్యా! - భాసింతు వేపగిది భాస్కర నేర్పుమీరన్?
పోషింతువీవెయని పూజ్యుల వాక్కులయ్యా! - నా సన్నుతుల్ గొనుమనంతుఁడ! సూర్యదేవా!
42. నూత్నోదయంబుల వినూతన తేజమెంచన్ - రత్నాకరుండును నిరంతరమెంచు నిన్నే.
పత్నీసమేతులును, భక్తులు వార్త్రు నీకై. - నూత్నత్వమిమ్ము. సుమనోహర! సూర్య దేవా!
43. రాగోదయంబవ, వరంబుగ వత్తువయ్యా - బాగోగులన్ గనఁగ భక్తుల కీవు దేవా!
యాగాదులన్ నిను నహంబులఁ గొల్తురయ్యా. - యోగంబు నీవె శుభయోగద! సూర్య దేవా!
44. నీ భాతిఁ గాంచఁగనె నేర్పున భక్తితోడన్ - శోభింపఁ జేయఁగను సూర్య నమస్కృతంబుల్
మా భాగ్యమంచు నిను మన్ననఁ జేయువారిన్ - శోభాకరా! కనుమ శోభిల సూర్య దేవా!
45. నీకున్న శక్తిఁ గననేర్తురు సత్కవీంద్రుల్. - మాకున్న శక్తివి సమస్తము నీవె చూడన్.
నీకన్న దైవమును నేను కనంగ నేరన్. - లోకంబునే కను సులోచన సూర్య దేవా!
46. ప్రత్యక్ష దైవమని ప్రార్థన చేయువారల్ - నిత్యుండ! నిన్ను కరుణింపఁగ కోరువారే.
స్తుత్యుండ! పూజ్య గుణ శోభితులైన వారిన్ - నిత్యంబు కావగదె నేర్పున సూర్యదేవా!
47. దివ్యాంగులన్ కనుమ దీన జనార్తహారీ! - భవ్యాత్ము లాదుకొన, వారికి మేలు కల్గున్.
సవ్యంబుగా బ్రతుకు సాగఁగఁ జేయుమయ్యా! - నవ్యంబుకాన్ సతమనంతుఁడ! సూర్యదేవా!
48. గోరంత దీపశిఖ కూర్చఁగ జ్ఞాన దీప్తిన్ - నీరాక కొల్పెడి వినిర్మల శక్తి యెంతో?
శ్రీ రాఘవుండె మది చింతన చేసి నిన్నున్ - కోరెన్ శుభంబులను కొల్పఁగ సూర్యదేవా!
49. నిస్సారమౌ జగతి నిత్యమటంచు మూర్ఖుల్ - దుస్సాధమున్ జరుపు ధోరణినుందురేలో.
నిస్సంశయంబుగ వినిర్జన చేయరావా. - దుస్సాంద్రులన్, కలివిదూరుఁడ! సూర్యదేవా! .
50. మానాభిమానములు మాకిల పెంచుమెమ్మిన్. - ప్రాణప్రదంబుగ నిరంతర మేలు మమ్మున్
జ్ఞానాక్షయాంచిత వికాసము గొల్పు మాలోన్ - నీ నా విభేదము గణింపక సూర్యదేవా!
51. ఉర్వీజనాళికి మహోన్నత భక్తినిమ్మా. - సర్వత్ర సౌఖ్యములు సంపదలొప్పనిమ్మా
పర్వంబులన్ జగతి వర్ధిల, సాగనిమ్మా. - గర్వాపహా! సుగుణ కల్పక సూర్యదేవా!
52. రేయింబవళ్ళనొనరింతువు నీవె దేవా. - మాయావృతంబయిన మాపఁగఁ జాలుదీవే
శ్రేయంబులన్ కలుఁగఁ జేసెద నీవె మాకున్. - సాయంబుగా నిలుము సంస్తుత సూర్యదేవా!
53. నీటిన్ సృజించె విధి. నీవటనాకసానన్ - వాటంబుగా తిరిగి వారిద పంక్తి చేరన్
నీటిన్ గ్రహించి కడు నేర్పుననిత్తువయ్యా. - పాటించి నిన్ గొలుతు భక్తిని సూర్యదేవా!
54. హే దేవ! చిద్విభవ! హే దిన రాజ! సూర్యా! - ఈ దీనునిన్కరుణనేలుమ లోకబంధూ!
మోదంబుతో కనుచు మోహము బాపుమయ్యా. - శ్రీ దుండ! వందనము చేకొను సూర్యదేవా!
55. నీకే కదా జగతి నిత్యము కన్పడున్ నీ - రాకే కదా శుభము ప్రాగ్దిశనుండి తెచ్చున్.
మాకే కదా సకలమంగళముల్లభించున్. - శ్రీ కారపూర్వక సుచేతన సూర్యదేవా!
56. ధారాగతిన్ చలువధారలు భూమికీయన్ - రేరేనికిన్ గొలిపి ప్రేమను కాంతి కల్మిన్
నీరేజబాంధవుఁడ! నిత్యమనేక శక్తుల్ - కారుణ్యమున్ గొలిపి కాచితె సూర్యదేవా!
57. స్వార్థంబు లేని భగవానుఁడ! భాస్కరా! మా - స్వార్థంబుఁ బాపి మము చక్కఁగనుంచలేవా?
సార్థక్యమున్ గొలుపు సద్వర జన్మకున్, నిన్ - బ్రార్థింతు భక్తిమెయి భవ్యుఁడ! సూర్య దేవా!
58. అంతంబు లేని కరుణాకర! లోకబంధూ! - సాంతంబు నన్ గనుమ సద్గుణమిచ్చి నాకున్.
శాంతస్వరూప! విలసన్నుత! శాంతినిమ్మా. - భ్రాంతుల్ విడన్ తరుము వర్థిల సూర్యదేవా.
59. బ్రహ్మంబు నీవనుచు ప్రాగ్దిశ కాంతుమయ్యా - బ్రాహ్మీముహూర్తమున పావన రూప నీకై.
బ్రహ్మన్ జరించగను బాటను చూపువాఁడా! - బ్రహ్మాండమీవె శుభవర్ధక సూర్యదేవా!.
60. ఆకాశ గామివయి హారతులందువాఁడా. - నీకెవ్వరీడగు పునీతుఁడ సృష్టిలోనన్?
రాకేశుఁడైన తనరారును నీదు దీప్తిన్. - శ్రీకామితార్థదుఁడ! చిన్మయ! సూర్యదేవా!
61. దేదీప్యమాన వర తేజమునొప్పు వాఁడా! - మోదంబుఁగూర్చఁగను బుద్ధిని గొల్పరావా?
నీ దివ్య భాతి మహనీయతఁ గొల్పుఁ గాదే. - ఆదిత్యనామ పరమాత్ముఁడ సూర్యదేవా!
62. శ్రీ భారతాంబనలరించు శుభాళి. ఎన్నన్ - మా భాగ్యమీ జనని మాకు లభించుటెల్లన్.
శోభాయమానముగ చూడుము నీవు మమ్మున్. - శ్రీ భాస్కరా! సుగుణశేఖర సూర్యదేవా!
63. నిత్యప్రదీప! కరుణించుము నిర్వికల్పా! - సత్యంబు, నీ కృపనె సర్వము వెల్గుచుండున్.
స్తుత్యంబు నీ గమన ధుర్యత హే సుధీ! యా - దిత్యాఖ్య! వందనము తెల్పెద సూర్యదేవా!
64. స్వర్ణంబు పోలెడి యసాదృశ వర్ణభాతిన్. - వర్ణంబులొక్కటిగ భాసిలునేడు నీలోన్.
పర్ణంబులాదిగ ప్రపంచము వ్యాప్తి చెందెన్. - పూర్ణాకృతిన్వెలుఁగు పూజ్యుఁడ సూర్యదేవా!
65. పాపాత్ములన్ దునిమి భక్తులఁ గావ రావా. - నీ పాదముల్మదిని నిత్యము నిల్పువారిన్
కాపాడు ధర్మమది కాంచవొ నీదటంచున్? - మా పాపహారివగు మాన్యుఁడ! సూర్యదేవా!
66. రైతన్నలన్ గనుచు రక్షణఁ గొల్ప రావా! - పోతన్న రైతు. ఘన మోక్షదుడయ్యె ధాత్రిన్.
భాతిన్ రచించెనుగ భాగవతామృతమ్మున్. - రైతుల్ కృపాళురు. సురక్షక! సూర్యదేవా!
67. ప్రాతర్నమామి యని భక్తిగ నిన్నుఁగొల్తున్. - భూతాత్మవీవెకద పూజ్యుఁడ పుణ్యమూర్తీ!
శీతాంశు కీర్తి వికసింపఁగ చేయుదీవే. - నీ తీరు నెన్నుదును నిత్యము సూర్యదేవా!
68. అజ్ఞాన మేచికమునంతము చేయువాఁడా! - విజ్ఞాన రోచులకు వేల్పయి కొల్పు వాఁడా!
ప్రజ్ఞాప్రభాస! వర భాస్కర భవ్య తేజా! - సుజ్ఞానమిమ్మికను శోభిల సూర్యదేవా!
69. భాసా! శిరీష సుమ వర్ణమునొప్పువాఁడా! - శేషాహియున్ పరవ శించఁడె నిన్నుఁ దెల్పన్?
నీ సామ్య మెన్న ధరణిన్ దగువారు లేరే. - నా సన్నుతుల్ గొనుమనంతుఁడ! సూర్యదేవా!
70. జీవాత్మవై వెలుఁగు శ్రీకర దివ్య తేజా! - భావార్ణవోద్భవుఁడ! వర్థిలఁ జేయువాఁడా!
సేవింతు నిన్ దెలిసి చిత్తము పొంగ నాలో. - నీవేకదా విధివి నిర్జర సూర్యదేవా!
71. నీ రాకచే దిశలనేకము వెల్గుచూచున్. - నీరాకరంబునను నీరజ పాళి పొంగున్.
ధారాళమౌ వర సుధారస దాన శీలా! - వారింపుమా దురితపాళిని సూర్యదేవా!
72. ఆకాశమందున నహర్నిశ లెట్లు మిత్రా! - యేకాగ్రతన్ తిరుగుదీవు? మహాద్భుతంబే.
నీకెన్నగా విరతి నిర్మల! లేదదేలో? - మాకై చరింతువు సమస్తము సూర్యదేవా!
73. నా భావనాంబర మునన్ తగు వెల్గు నింపే - నీ భావనన్ తిరుగు నిర్మల చిద్వివృద్ధా!
స్వాభావికమ్మగుత శాంతము నాకు. నీవే - నా భావనన్ వెలుఁగు నా ప్రియ సూర్యదేవా!
74. తేజమ్ముకల్గు గుణధీరుల, ధీరలందున్ - స్త్రీ జాతిలోన్ వెలుగు చిందెడిశక్తి వీవే ,
నీ జీవనంబె మహనీయులమార్గమెన్నన్. - నా జీవ శక్తివి. సనాతన సూర్యదేవా!
75. పూర్ణాకృతిన్ వెలుఁగు పూజ్యుఁడవీవు చూడన్. - కర్ణామృతంబు శుభ కారక నీదు గాధల్.
స్వర్ణంబు కూడ భువి చాలదు పోల నిన్నున్. - దుర్నాథులన్ తొలఁగఁ ద్రోలుము సూర్యదేవా!
76. క్షీరాన్నమున్ గొనఁగ చిత్తమదేల నీకున్? - శ్రీరమ్య భోజ్యములు చేఁ గొనరాదొ నీవే.
మారాము చేయకుము. మాయెడ జాలి లేదా? - శ్రీరామ సేవ్య గుణశేఖర! సూర్యదేవా!.
77. సాహిత్య మార్గమది చక్కఁగ నిన్నుఁ జూపున్. - మోహాదులే తొలఁగు, ముక్తిద! నిన్నుఁ జూడన్.
సాహిత్యమీవె. విలసన్నుత! కొల్పు మాకున్. - దేహస్థ! కొల్పుమయ దీప్తిని సూర్యదేవా!
78. నీ వృత్తమున్ దెలుప నేనెటు చాలువాఁడన్? - జీవాళి కెమ్మెయిని జీవము నీవె కాదా.
భావింప సాధ్యమెటు? భక్తికె లొంగువాఁడా! - నీవారలన్ గనుమ నేర్పున సూర్యదేవా!
79. ఆకాశ హర్మ్యమున హాయిగ సంచరించే - లోకేశుఁడా! శుభ విలోకన భాగ్యమిమ్మా.
శ్రీ కల్పనా చతుర! చిన్మయ తేజమిమ్మా. - నీకున్నతుల్ తెలుపనిమ్మయ. సూర్యదేవా!.
80. నీవే మహాత్ముఁడవు. నిర్మల దివ్య తేజా! - నీవే జగత్పతివి నిర్భర పుణ్యభాసా!
నీవే ప్రపూజ్యుఁడవు నిత్యము మాకు పృథ్విన్. - నీవే మమున్ నడుపు నేతవు సూర్యదేవా!..
81. పాదాభివందనము భక్తిగ చేయు వారిన్ - మోదంబుతో గనుచు పూజ్యతఁ గొల్పు వాఁడా!
నీ దారిలో నడుచు నిర్మల తత్త్వమిమ్మా. - బోధన్ మదిం గొలిపి, ప్రోచెడి సూర్యదేవా!.
82. బ్రహ్మజ్ఞులన్ కృపను వర్ధిలఁ జేయుదీవే. - బహ్మైక్య మార్గమును భాసిలఁ గొల్పు మాకున్.
బ్రహ్మంబు నీవె కద పండితపాళి మిత్రా! - బ్రహ్మస్వరూప! గుణ భాసిత సూర్యదేవా!
83. సంసారసాగరము చక్కఁగ దాటఁజేయన్, - హింసావిదూరునిగనెల్లరినెన్ని ప్రోవన్,
కంసారికైననిల కావలె నిక్కమీవే. - హంసాకృతిన్ వెలుగుమా మది సూర్యదేవా!
84. ఛాయాసతీ సహిత! సారస వృత్త వర్తీ! - మాయావిమోహములు మమ్ముల వీడిపోవన్
చేయంగ నీకు తగు. చేయుము ధ్వాంతహారీ! - శ్రేయంబులే కలుగఁజేసెడి సూర్యదేవా!
85. ఉగ్రాకృతిన్ గని మహోగ్రుల, సంహరింపన్ - వాగ్రూప సత్ కృతిగ భవ్యుఁడ! వెల్గుమయ్యా!
అగ్రేసరుండవయి హారతులందుమయ్యా! - వ్యగ్రుండ. వ్యగ్రతను బాపుము సూర్యదేవా!
86. సంతోషమిచ్చునది సద్గుణమే తలంపన్. - శాంతాత్మయున్ సతము సంతస మందఁజేయున్.
శాంతాత్మనిమ్ము మనసారగ నాకికన్. నే - చింతాన్వయున్. గనుమ చిన్మయ సూర్యదేవా!
87. సాయాహ్నమున్ హరివి చక్కఁగ కావ మమ్మున్. - నీయందు చూచెదము నిత్యుని దేవదేవున్.
ధ్యేయంబు కొల్పుము మహేశ్వర మాకు నీవే - సాయంబు కమ్ము కొనసాగఁగ సూర్యదేవా!
88. జాగ్రత్ప్రదాతవు ప్రశస్తిగ నిల్పునాలో - నుగ్రత్వమున్ తుడిచి యోగ్య సుశౌచ్యమిమ్మా.
అగ్రేసరుండవయి హాయిగ చూపు దారిన్. - సుగ్రాహ్యమౌసుగతి చూపుమ సూర్యదేవా!
89. నింగిం జరించుటయె నీకు సుఖంబదేలో? - పొంగారు కాంతుల సముద్ధత యేల నీకున్?
భంగంబెఱుంగకయె పర్విడు భద్రతేజా! - బెంగల్ విడన్ గనుమ విశ్వభ! సూర్యదేవా!
90. హే హేమమాలి! ప్రవహించగ భక్తి మాలో - మోహాదులున్ దొలగి ముక్తికి చేరువైనన్
స్నేహంబుతోఁ దరికి చేరుదుమయ్య నీకున్. - నీ హస్తమిచ్చి కరుణించుమ సూర్యదేవా!
91. ఏమేమి? కాల గతి నెప్పటికేని నీలో - నేమార్పు లేకునికి హేతువు కానరాదే!
ధీమంతులిట్టులనె దీపితులౌదురేమో! - సోమప్లవుండవయి శోభిలు సూర్యదేవా!
92. స్వోత్కర్ష లేని గుణ సుందర! త్విట్పతీ! నీ - యుత్కృష్టతన్ దెలుప నుర్విని చాలలేనే.
సత్కార్యముల్ గనుచు సత్యము పల్కనిమ్మా.- మత్కామ్యమున్ గను. సమంచిత సూర్యదేవా!
93. శ్రీమద్ద్యుమంతుఁడ! వశించు మనమ్మునన్ నీ - నామంబు నే పలుకు నైపుణినీయ నాకున్.
ప్రేమన్ సదా కనుచు, విజ్ఞత కొల్పి కావన్. - మామీద చూపుమభిమానము సూర్యదేవా!
94. నిత్యాన్నదానమును నే పచిరింపఁజాలన్. - సత్యోన్నతిన్ దెలిసి చక్కగ పల్కనెంతున్.
స్తుత్యుండ నీదు కృపతో నడిపించుమట్లే. - నిత్యంబు నిన్ గొలుతు నేర్పున సూర్యదేవా!
95. విద్యాసుగంధమునపేక్షను పొందనున్నన్ - సద్యఃఫలంబగును చక్కఁగ నీకు మ్రొక్కన్.
హృద్యాద్భుతంబగు ప్రవృద్ధియు కాన వచ్చున్. - సద్యోవిభాతి గల సన్నుత సూర్యదేవా!
96. భద్రాకృతింగొలిపి భక్తిని గొల్పు వాఁడా! - నిద్రాస్థితిన్ మడఁచి, నిస్పృహఁ బాప రమ్మా.
భద్రేభరక్షకుని పావన దర్శనంబున్ - మద్రక్షకా! కొలుపు మాకిక సూర్యదేవా!
97. దర్పోద్ధతుల్ కలరు, తప్పవు దండనాదుల్. - కర్పూరహారతులు గౌరవమొంది పొందన్.
తూర్పారఁబట్టి యిక త్రుంచుము దుర్జనాళిన్ - కార్పణ్యమున్ మడఁచు జ్ఞానద! సూర్యదేవా!
98. స్త్రీ జాతికిన్ శుభము చేయఁగ జాగదేలో? - భూజాతయున్ పుడమినోర్చెను బాధలెన్నో.
స్రీ జాతిఁ బ్రోవ మనసే కరువాయె నీకున్. - రాజిల్ల చేయుము. పరాత్పర! సూర్యదేవా!
99. నీచే సమస్తమును నిండుగ సాగుచుండున్. - నీచే ప్రజాపతియు నేర్పగ మెల్గుచుండున్.
నీచే కవిత్వ కమనీయత వెల్గుచుండున్. - నీచే మనంగను మనీషులు సూర్యదేవా!
100. ఆరోగ్యమిచ్చుచు, మహాత్ముఁడ! పాఠకాళిన్ - వీరోచితంబుగనె వెల్గఁగఁ జేయుమయ్యా.
నీరేజ మిత్ర! మననీయుము సజ్జనాళిన్. - నీ రమ్య నామమె గణింతును సూర్యదేవా!
101. కన్నార నీ ద్యుతిని గాంచఁగ లేడొకండున్. - హృన్నేత్రమొప్పు కన దృష్టిని పెట్టి చూడన్.
పన్నిద్దరంచు కని భక్తులు పల్కు నిన్నున్. - మన్నించి కావుము సమస్తము సూర్యదేవా!
102. ప్రార్థింతు నిన్ సుకవి పాళిని కావుమంచున్. - స్వార్థంబుఁ బాపగను, వర్థిలఁ జేయ మంచిన్.
సార్ధక్యమున్ గొలుప సద్వర జన్మకెమ్మిన్. - మూర్ధన్యవర్తివయి ప్రోచెడి సూర్యదేవా!
103. దాసోZహమంచు గుణధాములు నీకు తెల్పన్, - నీ సాటి లేరు కరుణించెడివారలుర్విన్.
భాసింపఁ జేయుమయ భక్తులనంశుమంతా! - నీ సద్గుణంబు ప్రగణించెద సూర్యదేవా!
104. కర్తవ్యమున్ దెలిపి గౌరవ వర్తనానన్, - గుర్తించి మెల్గునటు కోరుచు చేయుమా. మో
హార్తిన్ దొలంగగ మహాత్మ యొనర్పుమీవే. - ఆర్తాళిగాచెడినహర్పతి సూర్యదేవా!
105. దైవత్వమబ్బు కన దక్షుఁడ! నిన్నునెమ్మిన్. - శ్రీవక్షుసాక్షిగ వసించెడి కర్మ సాక్షీ!
మావాడివౌచునిక మా మది వెల్గరాదా? - నీవే మహాత్మ! కరుణింతువు సూర్యదేవా!
106. చింతాన్వయుండనయ. శ్రీకర! రామకృష్ణన్. - భ్రాంతిన్ రచించితిది పాఠకపాళి కోరన్.
సాంతంబు దీనిని భృశంబు పఠించువారిన్ - స్వాంతంబునన్ గనుమ చల్లగ, సూర్యదేవా!
107. జ్ఞానాగ్ని దగ్ధ నిజ కర్ములఁ జేయు మమ్మున్, - ప్రాణప్రదంబయిన భక్తిని కొల్పు మాకున్.
నీ నామ సంస్మరణనే విడనీక, మాలో - ప్రాణంబుగానిలుము రక్షక సూయదేవా!
108. మాంగళ్య నామ కొనుమా జయ మంగళంబుల్. - మాంగళ్య రూప! శుభ మార్గ చరా!శుభంబుల్.
మాంగళ్య తేజ! గుణ మాన్యుఁడ! మంగళంబుల్ - మాంగళ్య మూర్తివయ మంగళ సూర్య దేవా!
అంకితము.
శ్రీ సూర్యదేవ విరచించితి నీ కృపాబ్ధిన్, భాసించు నీకు వరభాస్కర! యిత్తు దీనిన్,
నీ సత్కృపన్ గొనుమ నీ విది ప్రేమతోడన్, భాసింపఁ జేయుము ప్రభాకర! భక్తపాళిన్.
పండితాభిప్రాయములు.
ఆదిత్యాయ నమస్తుభ్యమ్
అవధాని రత్న, సాహిత్య శిరోమణి డా.మాడుగుల అనిల్ కుమార్
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర !
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోజ్స్తు తే ||
అసామాన్య ప్రజ్ఞా పాటవాలు శ్రీ చింతా రామకృష్ణా రావుగారి తోబుట్టువులు. సరససుధాధారాపాతము వీరి కవిత్వ గుణత. అత్యంత సరళపదబంధముతో, అర్థౌచిత్యముతో వైదర్భీరీతిలో వీరి కలమునుండి కవితామృతధారలు జాలువారినవి. సంస్కృతములో ప్రసిద్ధమైన వసంతతిలక వృత్తాన్ని ఆలంబనగా చేసుకొని ఆంధ్రభాషను ఉద్దీపింపజేస్తూ సాగిన వీరి పద్యాలు పఠిస్తూంటే పద్యాలు చదువుతున్నామా? వినువీధిలో విహరిస్తున్నామా? అనే సందేహం కలుగక మానదు.
పృథివ్యప్తేజోవాయురాకాశాలనే పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, యజ్ఞదీక్షయందుండు సోమయాజి అను ఎనిమిది రూపాలు శివుని అష్టమూర్తులు. వీరిలో సర్వభూతములకు చైతన్య ప్రదుడైన, కర్మసాక్షియైన సూర్యభగవానుడు కులమతజాతులకతీతంగా ప్రతి ఒక్కరి చేత నిత్యపూజ లందుకొంటున్నాడు. శైవము, వైష్ణవము, శాక్తేయము, గాణాపత్యము, సౌరము అను వీటిని పూజించే ఆచారాన్ని పంచాయతనమంటారు. ఇలా పంచాయతన దేవతార్చనములో సూర్యడు ప్రాధాన్యత వహించినాడు. జ్యోతిష శాస్త్ర ప్రకారం సూర్యుడు శరీర కారకుడు. అందుకే శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు సూర్యుని స్తుతించి అనారోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. మయూరుడు అనే కవి సూర్య శతకాన్ని రచించి కుష్టురోగవిముక్తుడైనాడు. ఇలా వేద, వేదాంగ, సాహిత్యాలలో సూర్యదేవునికి ప్రత్యేక స్థానమున్నది. అందుకే శ్రీ సూర్యదేవుడు ప్రాతఃస్మరణీయుడు.
“జీవాత్మవై ప్రబలి జీవులనుందువీవే. - నీవేడి ప్రాణమయి నిత్యము నిల్పు మమ్మున్.
శ్రీవిశ్వనాథుఁడవుశ్రీహరివీవెమాకున్.-నీవారమయ్య.మననీయుమ,సూర్యదేవా!” .12
అనే ఈ పద్యంలో "అహం వైశ్వానరో భూత్వా", "ఆదిత్యానామహం విష్ణుః" అనే భగవంతుని వచనాలను మృదుమధురంగా వ్యక్తపరచినారు శ్రీ చింతా రామకృష్ణారావు గారు.
"సప్తాశ్వముల్ కనఁగ సప్త వివర్ణ మాలల్ - లుప్తంబయెన్ తెలుపు లోపల చేరియుంటన్. గుప్తార్థమిందు కనుగొన్న ప్రభాత వేళన్ - దీప్తంబగున్ మహిత తేజము సూర్యదేవా! " .27
అనే ఈ పద్యంలో శ్రీ చింతా రామకృష్ణా రావు గారు తమ అంతరిక్ష శాస్త్రవిజ్ఞానాన్ని అద్భుతంగా వెలువరించారు. సప్త వర్ణాలు అనేవి అసలు లేనే లేవు. ఉన్నది ఒక్క శ్వేతవర్ణం మాత్రమే. అందులోనే తక్కిన వర్ణాలన్నీ విభిన్నంగా కనబడుతున్నాయి. అదే అంతరార్థాన్నే ఈ పద్యం వివరిస్తున్నది.
"పచ్చందనంబునకు భాస్కర! హేతువీవే. - మెచ్చున్ నినున్ ధరణి మేలగు కాంతినొప్పన్. నచ్చున్ గదా ప్రకృతి నవ్యమనోజ్ఞ కాంతిన్. - సచ్చిత్ ప్రభాస గుణసన్నుతసూర్యదేవా! .31
నీటిన్ సృజించె విధి. నీవటనాకసానన్ - వాటంబుగా తిరిగి వారిద పంక్తి చేరన్ నీటిన్ గ్రహించి కడు నేర్పుననిత్తువయ్యా. - పాటించి నిన్ గొలుతు భక్తిని సూర్యదేవా!” .53
అనే ఈ పద్యాలలో సూర్య కిరణాలలో వర్షహేతువైన కిరణాలు వేరుగా కలవని, సస్యశ్యామలత్వాని కవసరమైన కిరణజన్య సంయోగక్రియను గూర్చి వర్ణించినారు.
“దివ్యాంగులన్ కనుమ దీన జనార్తహారీ! - భవ్యాత్ము లాదుకొన,వారికి మేలు కల్గున్. సవ్యంబుగా బ్రతుకు సాగఁగఁ జేయుమయ్యా! - నవ్యంబుకాన్ సతమనంతుఁడ! సూర్యదేవా!” .47
అనే ఈ పద్యంలో శ్రీ చింతారామకృష్ణారావు గారికి దివ్యాంగులపై ఉన్న అపార కారుణ్యము, దివ్యాంగులను ఉద్ధరించవలెననే తపన వ్యక్తమౌతున్నది.
“పాదాభివందనము భక్తిగ చేయు వారిన్ - మోదంబుతో గనుచు పూజ్యతఁ గొల్పు వాఁడా! నీ దారిలో నడుచు నిర్మల తత్త్వమిమ్మా. - బోధన్ మదిం గొలిపి,ప్రోచెడి సూర్యదేవా!” .81
అను ఈ పద్యం సూర్య నమస్కారములు చేస్తే లభించే ప్రయోజనాన్నీ, ఔన్నత్యాన్ని తెలియజేస్తున్నది.
ఇలా ఈ శ్రీ సూర్య దేవుని అష్టోత్తరశతకంలో ఎన్నెన్నో విలువైన శాస్త్ర విషయాలు లెక్కలు మిక్కిలిగా ఆవరించి చదువరులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ కావ్యం ప్రాతఃకాలంలో పారాయణము చేసుకొనుటకు ఎంతో అనువుగా ఉన్నది. పద్యధార కావలెనని కోరుకొను కవిపండితులకు శ్రీ వసంతతిలక సూర్య శతకము పద్య విద్యాపాటవాన్ని పెంపొందించేదే కాకుండా సకలాభీష్టసిద్ధిని కలుగజేస్తుందని నమ్ముతున్నాను. నాపై అనురాగంతో అభిప్రాయాన్ని అందజేయమని పునఃపునః శ్రీ వసంతతిలక సూర్య శతకమును చదివే అవకాశాన్నిచ్చిన బ్రహ్మశ్రీ చింతా రామకృష్ణా రావు గారికి నమశ్శత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అభినందన పంచ రత్నములు.
వసం. తి. శ్రీ రామ కృష్ణ కవిచే శతకంబు కూడెన్
నోరార సూర్యుని మనోహరుజేరి కొల్వన్
వారించి దుఃఖబడబానలమాదిదేవుం
డీరూపమెంచి కృతకృత్యులజేసె తెల్పన్ ||
మ. భవదీయాద్భుత భావనాగరిమతో భావించి సప్తాశ్వునిన్,
కవితాధారసుధారసాననభిషేకంబిట్లొనర్పంగ, వై
భవమొప్పారగ సూర్యదేవుని నమోవాకంబులన్ భక్తి సం -
స్తవనంజేయరె పాఠకోత్తములు చింతా రామకృష్ణాహ్వయా !
శా. ధౌతస్వాంత! కవీంద్ర! శ్రీసహిత చింతా రామకృష్ణాహ్వయా!
చేతఃపద్మమొసంగి భక్తియుతులై శ్రీ సూర్య నారాయణుం
బ్రాతఃకాలము రోజుకొక్కొకటియౌ పద్యమ్మునన్ గొల్వగా
నేతత్సత్ శతకమ్మునేర్పడె తరించెన్ పాఠకవ్యూహమున్ ||
శా. శ్రేయఃకారణమెన్ని లోకమునకై శ్రీకారముంజుట్టి ధౌ
రేయుండై భువి సూర్యదేవుని సమర్చింపంగ పద్యావళి.
మీ యత్నంబున మీకు మాకును లసన్మిత్రుండు సంతుష్టుడై
ఆయుర్దాయమొసంగు రోగపరిహారంబంతగావించుచున్ ||
తే.గీ. ఆయురారోగ్యమైశ్వర్యమస్త్వటంచు - నాదిదేవుండు సూర్యుడే అభయహస్త
మాదరంబుగ మీకివ్వనాత్మదలతు - భక్తి, రామకృష్ణారావు వర్య! సతము.. స్వస్తి
ఇట్లు బుధజన విధేయుడు అవధాని రత్న, సాహిత్య శిరోమణి
డా.మాడుగుల అనిల్ కుమార్ యం.ఏ; బి.యెడ్; పీహెచ్.డి.
సంస్కృత విభాగాధ్యక్షులు,
శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల, తిరుపతి.
శ్రీ సూర్యాష్టోత్తర శతనామావళిః
శ్లో. ధ్యేయఃస్సదా సవితృమండల మధ్యవర్థీ - నారాయణ సరసిజాసన సన్నివిష్ఠాః
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి - హారి హిరణ్మయ వపుధృత శంఖచక్రా
ఓం అరుణాయ నమః
ఓం శరణ్యాయ నమః
ఓం కరుణారససింధవే నమః
ఓం అసమానబలాయ నమః
ఓం ఆర్తరక్షణాయ నమః
ఓం ఆదిత్యాయ నమః
ఓం ఆదిభూతాయ నమః
ఓం అఖిలాగమవేదినే నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం అఖిలజ్ఞాయ నమః ౧౦
ఓం అనంతాయ నమః
ఓం ఇనాయ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం ఇజ్యాయ నమః
ఓం ఇంద్రాయ నమః
ఓం భానవే నమః
ఓం ఇందిరామందిరాప్తాయ నమః
ఓం వందనీయాయ నమః
ఓం ఈశాయ నమః
ఓం సుప్రసన్నాయ నమః ౨౦
ఓం సుశీలాయ నమః
ఓం సువర్చసే నమః
ఓం వసుప్రదాయ నమః
ఓం వసవే నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ఉజ్వలాయ నమః
ఓం ఉగ్రరూపాయ నమః
ఓం ఊర్ధ్వగాయ నమః
ఓం వివస్వతే నమః
ఓం ఉద్యత్కిరణజాలాయ నమః ౩౦
ఓం హృషికేశాయ నమః
ఓం ఊర్జస్వలాయ నమః
ఓం వీరాయ నమః
ఓం నిర్జరాయ నమః
ఓం జయాయ నమః
ఓం ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః
ఓం ఋషివంద్యాయ నమః
ఓం రుగ్ఫ్రంతే నమః
ఓం ఋక్షచక్రాయ నమః
ఓం ఋజుస్వభావచిత్తాయ నమః ౪౦
ఓం నిత్యస్తుతాయ నమః
ఓం ఋకార మాతృకావర్ణరూపాయ నమః
ఓం ఉజ్జలతేజసే నమః
ఓం ఋక్షాధినాథమిత్రాయ నమః
ఓం పుష్కరాక్షాయ నమః
ఓం లుప్తదంతాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం కాంతిదాయ నమః
ఓం ఘనాయ నమః
ఓం కనత్కనకభూషాయ నమః ౫౦
ఓం ఖద్యోతాయ నమః
ఓం లూనితాఖిలదైత్యాయ నమః
ఓం సత్యానందస్వరూపిణే నమః
ఓం అపవర్గప్రదాయ నమః
ఓం ఆర్తశరణ్యాయ నమః
ఓం ఏకాకినే నమః
ఓం భగవతే నమః
ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః
ఓం గుణాత్మనే నమః
ఓం ఘృణిభృతే నమః ౬౦
ఓం బృహతే నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం ఐశ్వర్యదాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం హరిదశ్వాయ నమః
ఓం శౌరయే నమః
ఓం దశదిక్ సంప్రకాశాయ నమః
ఓం భక్తవశ్యాయ నమః
ఓం ఓజస్కరాయ నమః
ఓం జయినే నమః ౭౦
ఓం జగదానందహేతవే నమః
ఓం జన్మమృత్యుజరావ్యాధి వర్జితాయ నమః
ఓం ఔన్నత్యపదసంచారరథస్థాయ నమః
ఓం అసురారయే నమః
ఓం కమనీయకరాయ నమః
ఓం అబ్జవల్లభాయ నమః
ఓం అంతర్బహిః ప్రకాశాయ నమః
ఓం అచింత్యాయ నమః
ఓం ఆత్మరూపిణే నమః
ఓం అచ్యుతాయ నమః ౮౦
ఓం అమరేశాయ నమః
ఓం పరస్మైజోతిషే నమః
ఓం అహస్కరాయ నమః
ఓం రవయే నమః
ఓం హరయే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం తరుణాయ నమః
ఓం వరేణ్యాయ నమః
ఓం గ్రహాణాంపతయే నమః
ఓం భాస్కరాయ నమః ౯౦
ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః
ఓం సౌఖ్యప్రదాయ నమః
ఓం సకల జగతాంపతయే నమః
ఓం సూర్యాయ నమః
ఓం కవయే నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరేశాయ నమః
ఓం తేజోరూపాయ నమః
ఓం శ్రీం హిరణ్యగర్భాయ నమః
ఓం హ్రీం సంపత్కరాయ నమః ౧౦౦
ఓం ఐం ఇష్టార్థదాయ నమః
ఓం సుప్రసన్నాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం శ్రేయసే నమః
ఓం భక్తకోటిసౌఖ్యప్రదాయినే నమః
ఓం నిఖిలాగమవేద్యాయ నమః
ఓం నిత్యానందాయ నమః.
ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః ౧౦౮
శ్రీ సూర్యాష్టోత్తర శతనామావళిః సంపూర్ణమ్.
జైహింద్.
చింతా రామ కృష్ణా రావు. ం.ఆ., కృతికర్త.
విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.
ఫ్లాట్ నెం. ఆ 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.
తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165
రచనలు.
1) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)
2) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
3) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
4) అశ్వధాటి సతీ శతకము.(ఒక్క రోజులో ప్రాస నియమముతో, ప్రతీపాదమునా
మూడు ప్రాసయతులతో వ్రాసినది.)
5) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
6) వసంతతిలక సూర్యదేవ శతకము.
7) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
8) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)
9) శివ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
10) శ్రీ అవధాన శతపత్ర శతకము.
11) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
12) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత నృసింహనామాంచిత 118
ఛందో గర్భ చిత్ర సీసపద్య శతకము.)
13) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
14) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము.(బంధచిత్రకృతి ఒకే
శతకమున మూడు మకుటములతో మూడు శతకములు.)
15) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.
16) విజయభావన శతకము.
17) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)
18) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు, సీతాన్వయముగా తేటగీతి
పద్యములు, హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో సుందరోత్పల
నక్షత్రమాల.)
19) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.
20) నేరెళ్ళమాంబ సుప్రభాతము.
21) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.
22) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.
23) శ్రీచక్రబంధ మంగళాష్టకము.
24) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.
25) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.
26) రుద్రమునకు తెలుగు భావము.
27) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత సూక్తిశ్లోకములకు తెలుఁగు
పద్యానువాదము.
28) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మార్చన.
29) బాలభావన శతకము.
30) ఆంధ్రామృతమ్, పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగుల నిర్వహణ.
31) భగవద్గీత … తెలుఁగుపద్యానువాదము.
32. శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మరచన.
33. ౨౨౦౦.ఽనంత ఛందము కొరకు శతకము.
34. స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో అష్టోత్తర శత పాద ఉత్పలమాలిక
35. వేదప్రస్తుతి....చిత్ర కవితా నక్షత్రమాల.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.