జైశ్రీరామ్.
🌹శ్రీపంచమీ శివకామనలు 🌹
🌹ఐం సరస్వత్యై నమః🌹
🌹సరస్వతి అంటే ఎవరు ? ఎలాచూడాలి ?
ఎలా ఆరాధించాలి ?రూపం ఎలా చిత్రించు కోవాలి🌹
🌹 ఆమ్నాయో హృదయాయతే ,
స్మృతిచయో మేధా సుధాభూయతే ,
షట్ఛాస్త్రం నయనాయతే , శ్వసనతా
పౌరాణికం సౌరభమ్ ,
కావ్యౌఘ స్తిలకాయతే , కవి బుధ
స్తోమస్తు జిహ్వాయతే
యస్యాః గాత్ర రుచిస్తు గాన ఫణితి
స్తాం నౌమి వాగ్దేవతామ్. 🌹
🌹1.వేదాలే అమ్మవారి హృదయం.అనగా హృదయస్థానంలో వేదాల్ని చిత్రించాలి.సనాతన మైన మన సంప్రదాయాలు అందరూ హృదయగతం చేసుకోవాలన్నమాట.మన సంస్కృతుల్ని ఎప్పుడూ విస్మరింపకూడదు. ఇది విద్యాదేవి ప్రధాన భూమిక.🌹
2. జీవన చైతన్యాలైన ధర్మశాస్త్ర సంపదలే సరస్వతీ దేవి బుద్ధిగా లిఖించుకోవాలి. అనగా స్మృతి ధర్మాల కాంతిలో మనం పయనిస్తే అది సమాజ శ్రేయస్సు అవుతుంది.ఇది సరస్వతి రెండో భూమిక.
🌹3 .మన విద్యాదేవికి మూడవ స్థానం వ్యాకరణాది ఆరు శాస్త్రాలు.అవి అమ్మవారి చక్షుః స్థానీయాలు గా గుర్తించుకోవాలి.అంటే దేన్నైనా శాస్త్రీయంగా గమనించినప్పుడే యథార్థ జ్ఞానం కలుగుతుంది.
నేటి విజ్ఞానశాస్త్రం కూడా అందులో ఒకభాగమే.
🌹4.ఇక పురాణాల జ్ఞానమే అమ్మవారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు. అందులో ఇతిహాసాలూ కలుస్తాయి. నిజానికి అనేక కల్పభేదాల పురాణాల విస్తృత రూపాలే ఇతహాసాలని .అనగా వాగ్దేవి నాసికాస్థానంలో పురాణ ఉపపురాణాల్ని నిక్షేపించుకోవాలి.అవి మనకు అనుభవాల జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి.వాని సౌరభం మనం ఎప్పుడూ పీలుస్తూనే ఉండాలి.
🌹5 సంస్కృతాంధ్ర కావ్యాలన్నీ అమ్మవారి ఫాలంమీద ప్రకాశించే కుంకుమ స్థానీయాలు.
స్త్రీ మూర్తి ఎంత అందంగా ఉన్నా బొట్టు లేకపోతే కొంత కాంతి లేనట్లే.నుదుటి కుంకుమ రేఖ ఆమూర్తి లో చైతన్యం మరింత మిలమిల లాడించి మనోహరం చేస్తుంది. కావ్యాలు ఉన్న విషయాన్ని మరింత అందంగా చెప్పి కాంతాసమ్మితంగాఆహ్లాదపరుస్తాయి.
🌹6 మరైతే అమ్మవారి నాలుకో ! ఆస్థానం ఎవరిదంటే ? కవులూ , పండితులూ , వ్యాఖ్యాతలూ , రచయితలూ , విమర్శకులున్నూ. వీరంతా అమ్మవారి వేల లక్షల నాలుకలు. వారి పలుకులే రసమయ జగతిని సృష్టించే జిహ్వాస్రోతస్వినులు.
🌹7 అట్టి ఆమ్మవారి దేహం ఎలా ఉండాలి ?
సంగీత ప్రపంచమే సరస్వతీ దేవి నఖశిఖ పర్యంతమైన మనోజ్ఞ దేహభూమిక.
ఇలా సంగీతమూ సాహిత్యమూ కలబోసి పెనవేసుకొని ఉంటే అప్పుడా మూర్తి పరిపూర్ణ విద్యాస్వరూపం అవుతుంది. అందుకే
🌹సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం 🌹
అన్నారు పెద్దలు.అదే మనం ఉపాసింప వలసిన సమగ్ర తత్త్వం.అట్టి శారదా దేవిని శ్లోక ప్రసూనంతో నమస్కరిస్తున్నాను.🌹
🙏 ధూళిపాళ మహాదేవమణిః. 🙏
ఇంత చక్కగా వివరించిన ఆర్యులకు ధన్యవాదములు.
ధీవర ధూళిపాళ గుణదీపిత సంస్తుత భవ్య సన్మహా
దేవమణిప్రభాకలిత దివ్య వచోనిధి నున్న తేనియల్
భావ సువాక్స్వరూపిణిని బాసర వాసిత శారదాంబ స
చ్ఛ్రీవర తేజమున్ గనగ చిత్తము పొంగగ జేసె, ధన్యుడన్.🙏
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.