జైశ్రీరామ్
శ్లో. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే|
కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. || 17-27 ||
తే.గీ. దానముల, యజ్ఞ తపములలోననిలిచి
యుండుటయె సత్తనందురు మెండుగాను,
దీని కొరకు చేసెడికర్మ దియును సత్తు,
నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.
భావము.
యజ్ఞ దాన తపస్సులలో నిలిచి ఉండడం"సత్"అని చెప్పబడుతుంది. దాని కోసం
చేసే కర్మని కూడా "సత్"అనే అంటారు.
శ్లో. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్|
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ. || 17-28 ||
తే.గీ. అట్టి మహనీయ శ్రద్ధ లేనట్టి తపము,
హోమ దానముల్, క్రియలు నహో యసత్త
టంచు గ్రహియింపుమర్జునా! యెంచి చూడ
యిహపరంబులనీయవీ మహిని, నిజము.
భావము.
అర్జునా! అలాంటి శ్రద్ధలేని హోమం, దానం, తపస్సు, మరి యే క్రియ అయినా సరే
అది"అసత్"అని చెప్పబడుతుంది. అలాంటి కర్మ ఇహంలో కానీ, పరంలో కానీ ఫలం ఇవ్వదు.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
శ్రద్ధాత్రయవిభాగయోగో నామ సప్తదశోऽధ్యాయః.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.