గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, సెప్టెంబర్ 2022, ఆదివారం

ఆచార్య అనుమాండ్ల భూమయ్య నహోదయులకు గడియారం సాహిత్య పురస్కారం.

 జైశ్రీరామ్

                      ఆచార్య అనుమాండ్ల భూమయ్యకు గడియారం సాహిత్య పురస్కారం

    - డా॥ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి

కార్యదర్శి, రచన సాహిత్య వేదిక, కడప

ప్రసిద్ధ కవి, విమర్శకులు, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య ‘మహాకవి’ డా॥ గడియారం వేంకట శేషశాస్త్రి 41వ సాహిత్య పురస్కారానికి ఎంపికయినట్లు రచన సాహిత్య వేదిక కార్యదర్శి డా॥ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి పేర్కొన్నారు. పురస్కార ప్రదాన సభ రచన సాహిత్య వేదిక మరియు గడియారం కుటుంబీకుల సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబరు 9 ఆదివారం సాయంత్రం 5-30 గంటలకు ప్రొద్దుటూరు అనిబిసెంట్ మునిసిపల్ హైస్కూలులో జరుగుతుందని అన్నారు. 1982 నుండి ప్రతి ఏటా రాష్ట్రస్థాయిలో కావ్యాలకు పోటీ నిర్వహించి ఎంపికైన కావ్యానికి బహూకరిస్తూ వస్తున్న ఈ అవార్డును 2020 నుంచి ఆయా సాహితీవేత్తల కృషిని పరిగణిస్తూ అందజేస్తున్నట్లు, ఆ క్రమంలో ఆచార్య అనుమాండ్ల భూమయ్యకు అవార్డు, రూ.10,000/- నగదు బహుమతి, పురస్కార పత్రం, ప్రశంసాపత్రం అందజేయబడుతుందని అన్నారు.  

ఆచార్య అనుమాండ్ల భూమయ్య అనేక పద్యకావ్యాలు, పలు గేయ రచనలు, అసంఖ్యాకంగా విమర్శ  గ్రంథాలు రచించిన ప్రతిభాశాలి అని, ఆయన వేయినదుల వెలుగు, వెలుగు నగల హంస, అగ్నివృక్షం, జ్వలిత కౌసల్య, చలువ పందిరి, అష్టావక్రగీత, త్రిజట, అరుణాచల రమణీయం, గురుదత్త శతకం, అమృతసేతువు మొదలైన పద్యరచనలు, ఆనందగీతి, శివానందగీతి, సౌందర్యలహరి గీతాలు, శాంతిగర్భ, అపరోక్షానుభూతి : గేయామృత స్రవంతి, సినారె వైభవం అనే గేయ రచనలు, కొఱవి గోపరాజు సాహత్య విశ్లేషణ, నాయని సుబ్బారావు కృతులు : పరిశీలన, వేయిపడగలు : ఆధునిక ఇతిహాసం, వ్యాసభారతి, ఆద్యుడు కట్టమంచి, మాలపల్లి : అభ్యుదయ మహాకావ్యం,  వ్యాసభూమి, నాయనితో కాసేపు, ఆధునిక కవిత్వంలో దాంపత్యం, కర్పూర వసంతరాయలు : కథా కళా ఝంకృతులు వంటి విమర్శ గ్రంథాలు కలసి మొత్తం 45 రచనలు చేశారని, ఇంకా ప్రాచీన కావ్యాలు, ముసలమ్మ మరణం, విమర్శిని 10, విమర్శిని 11, ఆధునిక కవిత్వం, విమర్శిని 18, సంప్రదాయ కవిత్వం పురాణ వ్మాయ సమాలోచన వంటి 18 గ్రంథాలకు సంపాదకత్వం వహించారని అన్నారు.   

ఆచార్య అనుమాండ్ల భూమయ్య జూనియర్‌ కళాశాల తెలుగు ఉపన్యాసకులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి కాకతీయ విశ్వవిద్యాలయం ఆచార్యులుగా ఎదిగారని, ఆ తర్వాత పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌గా, డా॥ బి.ఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇన్‌చార్జ్‌ వైస్‌ ఛాన్సలర్‌గా పనిచేశారని అన్నారు. ఆచార్య అనుమాండ్ల భూమయ్య కవితా  ప్రతిభకు, సాహిత్య కృషికి గుర్తింపుగా గతంలో పలు సత్కారాలు అందుకున్నారని, తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ పద్యకావ్య పురస్కారం, గరికిపాటి సాహిత్య పురస్కారం, తణుకు నన్నయ భట్టారక పీఠం వారి తంగిరాల వెంకటకృష్ణ సోమయాజి సాహిత్య పురస్కారం, సినారె కవితా పురస్కారం, వానమామలై వరదాచార్య పురస్కారం, కుమారి రచన సాహిత్య పురస్కారం వంటి  పలు  పురస్కారాలతో గౌరవింపబడ్డారని అన్నారు.

రచన సాహిత్య వేదిక అధ్యక్షులు, ప్రముఖ రచయిత విహారి (జె.యస్‌.మూర్తి) అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ప్రముఖ అవధానకవి డా॥ నరాల రామారెడ్డి, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమీషనర్ పి.వెంకట రమణయ్య, రచన సాహిత్య వేదిక ఉపాధ్యక్షులు యం.జానకిరాం, మరో ఉపాధ్యక్షులు గడియారం వేంకట శేషశర్మ, కార్యదర్శి డా॥ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, కార్యవర్గ సభ్యులు యస్‌.ఆర్‌.ప్రతాపరెడ్డి, డా॥ మూలె రామమునిరెడ్డి, ముడియం కిశోర్‌, అన్నవరం రామ్ కుమార్‌, ఎన్. సుధీర్‌ రెడ్డి తదితరులు పాల్గొంటారని అన్నారు.

            కార్యదర్శి 

డా॥ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి18.09.2022

     జైహింద్,

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.