జైశ్రీరామ్
శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే భక్తియోగో నామ ద్వాదశోధ్యాయః.
అర్జున ఉవాచ|
భావము.
అర్జునుడు పలికెను -
|| 12-1 ||
శ్లో. ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే|
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః.
తే.గీ. సగుణ నిర్గుణ రీతులన్ సతతము నిను
భక్తియుక్తులై కొలుతురు భక్తులిలను,
రెంట నేయోగముత్తమరీతియనగ
తగుచునున్నదో తెలుపుమా దయను నీవు.
భావము.
ఓ కృష్ణా! అనన్యభక్తితో పూర్వోక్తరీతిగా నిరంతరము నిన్నే భజించుచు,
ధ్యానించుచు, పరమేశ్వరుడవైన నీ సగుణ రూపమును ఆరాధించువారును,
కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘననిరాకార పరబ్రహ్మవైన నిన్ను
అత్యంతభక్తిభావంతో సేవించువారును కలరు. ఈ రెండు విధములైన
ఉపాసకులలో అత్యుత్తమ యోగవిదులెవరు?
శ్రీభగవానువాచ
భావము.
శ్రీ భగవానుడు ఇట్లనెను.
|| 12-2 |||
శ్లో. మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే|
శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః.
తే.గీ. నిరత మేకాగ్రతను భక్తిని నను గొలుచు
వారు యోగులు, శ్రేష్టులున్, వారె ఘనులు,
సగుణ నిర్గుణోపాసనా సరళి కొలుచు
ధన్యులర్జునా గ్రహియించు మాన్యసుగతి.
భావము.
పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై, నిరంతరము
నా భజనధ్యానాదులయందే నిమగ్నులై, అత్యంతశ్రద్దాభక్తులతో
నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు -
అని నా అభిప్రాయము.(వారు సగుణోపాసన లేదా
నిర్గుణోపాసన లలొ ఏది ఐనను అనుసరించవచ్చు)
జైహింద్
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.