గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, నవంబర్ 2014, శనివారం

అవధాన రాజధాని కార్యక్రమంలో నేను దత్తపది పృచ్ఛకునిగా వ్యవహరించిన తీరు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! సభా కల్పతరుం వందే అని నేను సభాముఖంగా సమర్పించిన పద్యాలు చూడండి.
శ్రీ హస్తినాపురములో (తే.02-11-2014 08-11-2014)
డా. మాడుగుల నాగఫణి శర్మగారు అవధాన పీఠము తరపున
అవధాన రాజధాని కార్యక్రమము నిర్వహించిన సందర్భముగా
సభాకల్పతరుం వందే.
శా. శ్రీమద్భారత భవ్య ధాత్రి విలసత్ శ్రీవాఙ్మనోజ్ఞాకృతుల్,
ప్రేమోద్భాసిత సత్కవుల్, పురజనుల్, విజ్ఞాన తేజోనిధుల్,
నామీదన్ గృపఁ జూపునట్టి సుజనుల్, నా సోదరీసోదరుల్.
నీమంబొప్పఁగ మిమ్ముఁ గొల్తు, కనుడీ. నే రామకృష్ణాఖ్యుఁడన్.
హస్తినాపుర సంస్తుతి. ద్వివిధ కంద - గీత గర్భ చంపకమాల.
ధర కవితాప్రభారవి వధాన విరాజిత రాజధాని నాన్
నిరుపమవైతివే మహిత నిర్మల సత్కవిమండనంబ! య
క్షర శివకంఠ సత్ ప్రణవ సంభవ హస్తిన! భాగ్యధాత్రి! వా
గ్వరమిడు మాతవీభరతకల్ప వరాక్షయ భవ్యపుత్రికా!
చంపక గర్భస్థ  కందము ౧.
కవితాప్రభారవి వధా - న విరాజిత రాజధాని నాన్, నిరుపమవై
శివకంఠ సత్ ప్రణవ సం - భవ హస్తిన! భాగ్యధాత్రి! వాగ్వరమిడుమా!
చంపక గర్భస్థ  కందము ౨.
శివకంఠ సత్ ప్రణవ సం - భవ హస్తిన! భాగ్యధాత్రి! వాగ్వరమిడుమా!
కవితాప్రభారవి వధా - న విరాజిత రాజధాని నాన్, నిరుపమవై.
చంపక గర్భస్థ  గీతము.
రవివధాన విరాజిత రాజధాని! - మహిత నిర్మల సత్కవిమండనంబ!
ప్రణవ సంభవ హస్తిన! భాగ్యధాత్రి! - భరత కల్ప వరాక్షయ భవ్యపుత్రి!
అవధాన సరస్వతీ ప్రశంస.
ద్వివిధ కంద ద్వయ   గీత  గర్భ  చంపకమాల.
మహితులలోన తా నెగడు మాడ్గుల నాగఫణిప్రపూజ్యుడున్,
మహి కననౌన్ సుధిన్ సభిక మాన్య నగాధిపు సత్కవీశునన్.
రహి కలుగున్ గనన్ కవన రాజ్య లసద్వర కాంతి రూపు. సత్
స్పృహ మనలోన్ మహా కవిని విజ్ఞునిఁ గాంచినఁ గాంక్ష తీరుచున్!
చంపక గర్భస్థ  కందము ౧.
తులలోన తా నెగడు మా - డ్గుల నాగఫణిప్రపూజ్యుడున్, మహి కననౌన్.
కలుగున్ గనన్ కవన రా - జ్య లసద్వర కాంతి రూపు. సత్స్పృహ మనలో.
చంపక గర్భస్థ  కందము ౨.
కలుగున్ కనన్ కవన రా - జ్య లసద్వర కాంతి రూపు. సత్స్పృహ మనలో.
తులలోన తా నెగడు మా - డ్గుల నాగఫణిప్రపూజ్యుడున్, మహి కననౌన్.
చంపక గర్భస్థ  కందము ౩.
కననౌన్ సుధిన్ సభిక మా - న్య నగాధిపు సత్కవీశునన్. రహి కలుగున్
మనలోన్ మహాకవిని వి - జ్ఞునిఁ గాంచినఁ గాంక్ష తీరుచున్! మహితులలో.
చంపక గర్భస్థ  కందము ౪.
మనలోన్ మహాకవిని వి - జ్ఞునిఁ గాంచినఁ గాంక్ష తీరుచున్! మహితులలో.
కననౌన్ సుధిన్ సభిక మా - న్య నగాధిపు సత్కవీశునన్. రహి కలుగున్.
చంపక గర్భస్థ  గీతము.
నెగడు మాడ్గుల నాగఫణిప్రపూజ్యు - సభిక మాన్య నగాధిపు సత్కవీశు.
కవన రాజ్య లసద్వర కాంతి రూపు. - కవిని విజ్ఞునిఁ గాంచినఁ గాంక్ష తీరు.
శుభమస్తు.
ఇక
అవధాన రాజధాని కార్యక్రమంలో నేనొసగిన దత్తపది చూడండి.
అవధానిశేఖరా! ఈ సభాస్థలి సాక్షాత్ కైలాసంలాగ భాసిస్తోంది.
మీరు
రక్షణ
శిక్షణ
భక్షణ
ప్రోక్షణ
అనే పదాలను స్వీకరించి  ఉత్పలమాలలో కైలాసాన్ని ఆవిష్కరించ వలసినదిగా నా కోరిక.
నేనొసగిన అంశాన్ని నేనిచ్చిన దత్తపదుల అవధాని డా. నాగఫణి శర్మగారుపయోగించి కైలాసగిరిని ఉత్పలమాలలో ఆవిష్కరించినారు. అది చూడండి.
హాసము.పార్వతీ మధుర హాసము. రక్షణ మీకు, మాకు. కై
లాసము నేలపై దిగిన లక్షణ శిక్షణ కల్గె నేడు. అ
భ్యాస పరోపకారి శివుఁడా విష భక్షణఁ జేసె. రాశిగా
పోసిన పుణ్యమై యతఁడు ప్రోక్షణ చేసె శిరస్థ గంగలన్.

అవధానిగారు చేసిన కైలాస ఆవిష్కరణకు పులకరించిన నేను వారిని ప్రశంసించిన విధము చూడండి.
అవధాన రాజధానిని 
నవనీతము పంచినారు నాగ ఫణీంద్రా!
కవితామృత ధార లుమా
ధవు దర్శన భాగ్యమొసగె. ధన్యతఁ గొలిపెన్.

వామభాగమునందు వర్ధిల్లు రేణుకై పార్వతీసతి మీదు ప్రభను పెంచె.
జడలోని గంగమ్మ వడివడిపరుగిడి వాఙ్మయంబుగ నోట వచ్చుచుండె.
నుదుటిపైన విభూతి సుధలు చిందెడి చంద్ర్రరేఖయై మిమ్ములఁ బ్రేమ గొలిచె.
మెడలోని పూదండ మేలగు నాగమై మీకలంకారమై మేలుఁగొల్పె.
నాగఫణినామధారివౌ నాగభూష - ణుఁడవు. సన్మార్గమునమమ్ము నడుపుచుండి
తెలుగు తేజము పెంచెడి దివ్య పురుష! అంజలించెద.కొనుమయ్య ఆది దేవ!

నేను చేసిన ప్రశంసను ఆమోదించి 
అభిమాన పూర్వకంగా అవధానిగారు తన శ్రీమతిగారితో కలిసి నన్ను సత్కరించినారు.
నన్ను సత్కరిస్తున్న దృశ్యం.

అవధాన రాజధానిలో ఎందరో, ఎందరెందరో మహానుభావులు ఆదరణతో ఆప్యాయంగా నన్ను చూచి, తమ అవ్యాజానురాగం చూపించి, నన్ను ఆనంద పరవశునిగా చేసియున్నారు. వారందరికీ నేను హృదయ పూర్వకంగా పేరు పేరునా నా కృతజ్ఞతాపూర్వక నమస్కృతులు తెలియజేసుకొంటున్నాను.
ఈ విషయాలను మీముందుంచుచున్నందుకు ఆనందంగా ఉంది. ఎది చదివి, మీ అభిమానాన్ని చూపుతున్న మీకు కూడా నా ధన్యవాదములు.
జైహింద్.
Print this post

8 comments:

గిరి Giri చెప్పారు...

mee aMSAnni cakkagA nirvahiMcAru

కథా మంజరి చెప్పారు...

అబినందనలు అనే మాట చాలా చిన్నదై పోయింది. ఇంకేమి పెద్ద పదం వాడాలో తెలియక సరిపుచ్చు తున్నాను. నీ ప్రతిభకు ఎల్లలు లేవు. నా మిత్రుడవని చెప్పుకో డానికే నాకు చాలా గర్వంగా ఉంటుంది. విజయోస్తు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రియమైన గిరీ! నీ అభిమానానికి ధన్యవాదములు.
సహృదయ శ్రీమాన్ జోగారావు సహోదరా!
నీ మాన్యత్వము నీ మనోజ్ఞ గుణమున్, నీ వాక్ప్రభావంబిలన్
నీమంబొప్పగ చేరెనన్ను. కనగా నీమైత్రిచే కల్గె! హే
ధీమాన్! నీ సహచారినైన ఫలమే. దీపించె నాలో భవత్
ప్రేమోద్భాసిత భావనా గరిమ. సన్మాన్యంబు నీదే సుమా!
అన్నా! నీ అభిమానామృతలహరిలో నన్ను తడిసి ముద్దయేలా చేశావు.
నీకు హృదయ పూర్వక నమస్సులు, ధన్యవాదములు.

కంది శంకరయ్య చెప్పారు...

చాలా సంతోషం కలిగింది. అభినందనలు.

P.suryanarayana rao చెప్పారు...

Manam kalasi unna madhura kshanalu chira swaraneeyalu.

ఏల్చూరి మురళీధరరావు చెప్పారు...

మాన్యులు శ్రీ రామకృష్ణారావు గారికి
నమస్కారములతో,

అమోఘమైన మీ కవితామృతధార ఆంధ్రీపుణ్యావాసాలపై చిత్రచిత్రభంగీభణితులతో ప్రవహించి వింత సోయగాలను వెలారుస్తున్నది. మీ ప్రతిభా ప్రతిభానత అపూర్వం.

సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! మురళీధరా! నమస్తే. మీ అవ్యాజానురాగానికి నా కృతజ్ఞతాంజలులు.

క. సరళ వచోద్భరసుందర!
మురళీధర! మాన్య వర్య! పూజ్యంబగుచున్
తరళంబగు నా కవన మ
విరళంబగు మీ నుడులను. విజ్ఙానఖనీ!

ద్వివిధ కంద ద్వయ గీత గర్భ చంపకమాల.
ప్రియ మురళీధరా! కవికి విశ్వ రహస్యము కానిపించు స
త్ప్రియ గణనన్. సుహృజ్ జనులు ప్రీతిని చూపిన చాలునయ్య. ధీ
శ్రియ వరమౌ నదే కవన రీతి రహిం గని క్రాలునయ్యదే
నయ గుణధీమతుల్ మదిని నర్తన చేయుచు మాన్య యౌనురా!

గర్భ కందము.
మురళీధరా! కవికి వి
శ్వ రహస్యము కానిపించు సత్ప్రియ గణనన్.
వరమౌ నదే కవన రీ
తి రహిం గని క్రాలునయ్యదే నయ గుణధీ!

గర్భ కందము.
గణనన్ సుహృజ్ జనులు ప్రీ
తిని చూపిన చాలునయ్య. ధీ శ్రియ వరమౌ
గుణధీమతుల్ మదిని న
ర్తన చేయుచు మాన్య యౌనురా! ప్రియ మురళీ!

గర్భ గీతము.
కవికి విశ్వ రహస్యము కానిపించు
జనులు ప్రీతిని చూపిన చాలునయ్య.
కవన రీతి రహిం గని క్రాలునయ్య!
మదిని నర్తన చేయుచు మాన్య యౌను!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

Kandula Varaprasad
8:21 [PM] (10 గంటల క్రితం)
గురుదేవులకు వినమ్ర వందనములు
మీ దత్త పది చాలా బాగున్నది, అవధాని గారి పూరణ బహు బాగున్నది, మీ వంటి వారు పద్య రచన లోని అమృతమును పది కాలములు మా వంటి పామరులకు పంచు నటుల జేయు మనుచు భగవంతుని ప్రార్థిస్తూ ...
మీ శిష్యుడు
వరప్రసాదు ,

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.