గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జూన్ 2024, ఆదివారం

నమోఽస్తుతే జగన్మాత! 50పాదముల శార్దూల వృత్త మాలిక .. తన .. చింతా రామకృష్ణారావు. తే.21 - 7 - 2023.

జైశ్రీరామ్.

శార్దూల వృత్త మాలిక.

అమ్మా! నిన్ గనుచుంటి సర్వమున నాహా! పొంగుచున్ సర్వదా.

సమ్మాన్యంబగు సుస్వరూపముగ. భాషా సుందరోద్భాసి! వే

దమ్మున్ గల్గిన తేజ మీవె మహిళా తత్వార్థ సంభాసితా!

ఇమ్మున్ భారత నారిగా ప్రబలితే! ఈశాని! నీ తేజసం


బెమ్మిన్ దాల్చిన కాంతలే శుభములన్ హృష్టాత్ములై పంచుచున్,

దమ్ముం జూపఁగఁ జాలువారు, కవితా దర్పంబునన్ వెల్గుచున్

సమ్మానంబుల నందువారు, విలసత్ సత్కార్యముల్ చేయువా

రమ్ముల్ బట్టి రణంబు చేయుప్రతిభుల్ హర్మ్యాది నిర్మాణముల్,


సమ్మోదంబుగఁ జేయ గల్గు మహితుల్, సత్కార్య నిర్వాహకుల్,

కమ్మందేనియ పల్కులన్ సుజనులన్ కారుణ్యముం జూచువా

రమ్మా యంచును బిల్చినంతనే మదిన్ హర్షించి ప్రేమామృతం

బమ్మై పంచెడి వార లక్షయ కృపన్ త్యాగాకృతిన్ వెల్గువా


రమ్మోహాదుల గెల్చినట్టి ఘనులున్, యత్నించి దైవంబునే

రమ్మంచున్ బిలువంగఁ జాలు ప్రతిభల్, ప్రాణంబులన్ నిల్పు బ్రో

చమ్మల్, సంతత సన్నుతాత్ములు, కృపా సామ్రాజ్య రాజ్జీమణుల్,

నమ్మన్ వారిని వమ్ము చేయక కృపాణమ్మై సదా కాచువా


రమ్మా! నీ ప్రతి రూపులై వెలుగు మాయందున్ సదా. దైవ కా

ర్యమ్ముల్ చేయఁగఁ జేతురమ్మ గని సౌర్యంబిచ్చి సత్ప్రేరణన్.

తమ్ముం దాము తలంచుచాత్మనిను మాతా గాంచి పూజ్యంబుగా

సొమ్ముల్దాల్తురు ప్రేమతోడ మదిలో శోభిల్ల నీరూపు, వే


దమ్మున్ వెల్గెడి దేవదేవి! కృపతో. తత్వార్ధ పూర్ణాకృతిన్

మమ్మున్ గావగ నీవె వీరగుచు ప్రేమన్ మాకు గన్పింతు వో

యమ్మా! నీవె కృపాంతరంగవయి మోహాదుల్ విడంజూడుమా!

నమ్మంజాలని దుష్టసంస్కృతులచే నశ్యంబగున్ సర్వమున్.


క్రమ్మున్ వేగమె మానవాళిని, మహత్కాఠిన్య గాఢాంధమున్

గ్రమ్మంజేయును. పాపభీతి సణచున్, బ్రఖ్యాతి పోకార్పుచున్

వమ్ముంజేయు మహత్వ సంస్కృతి గతిన్, వర్ధిల్లు కాంతాళిపై

క్రమ్మున్, దుర్గతిపాలు సేయు నవతన్ గాంక్షింపఁగాఁ జేయుచున్


నమ్మంజాలని ధర్మహీనగతులన్ నర్తింపఁగాఁ జేయు, మౌ

నమ్ముందాల్పఁగఁ జేయు శిష్టజనులన్, నక్షత్ర వారాశినాన్

క్రమ్మం జేయును దూరదర్శనములన్ గానంగ సిగ్గౌనటుల్.

మమ్ముంజూడుడటంచురేగునటులన్ మౌనంబుగా చేయు, మా


యమ్మా గాంచగరాని తీరునిడి మోహాంధంబునే గొల్పుచున్

సమ్మోహమ్మును గొల్పి దుష్ట గతులన్ చాంచల్యమున్ గొల్పు, హే

యమ్మా దుర్గతి పాలు సేయుచును మాయన్ గొల్పు. పూబోడులన్

సమ్మోదమ్మున కాచుమమ్మ కరుణన్. సంధించు బాణమ్ములన్.


సమ్మాన్యుల్ మఃహిళామణుల్ ధరణిపై శశ్వన్నయోపాసకుల్.

క్రమ్మంజేయకు మమ్మ దుర్గుణ తతిన్ కాపాడుమా వారలన్.

నెమ్మిన్ దుర్మద దూర సంస్కృతిని క్షీణింపన్ గృపం జేయుమా!

కొమ్మా! వందన మాచరింతు జననీ! కూర్మిన్, భవానీ సతీ!

ఇట్లు .... అమ్మకు భక్తితో

శ్రీచింతా రామకృష్ణారావు 

ప్రజాపత్రికలో 21 - 7 - 2023.



జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.