జైశ్రీరామ్.
త్రింశదర్థపద్యరత్నము
పోకూరి కాశీపతి (1893-1974)
గుంటూరు జిల్లా పల్నాడు తాలూకాలోని బోదిలవీడు గ్రామంలో జన్మించిన ఈ కవి చిన్ననాటనే ఛందోవ్యాకరణాది శాస్త్రాలను, పురాణాలను, కావ్యాలను అభ్యసించి 16 ఏటనే 'ధూర్జటి శతకము' రచించాడు. 1916లో నరసారావుపేటలో మొదటి అష్టావధానం చేశాడు. గద్వాల ఆస్థానకవిగా నియమింపబడ్డాడు. పెక్కు అష్టావధానాలు, శతావధానాలు చేశాడు.
కవిసింహ, కవిజటిలాఖ్య, కవిశిరోమణి, కవితాప్రవీణ, కవిశిఖామణి, ఆశుకవిపుంగవ, ఆశుకవికోకిల మొదలైన బిరుదులు పొందారు.
శివనిందాస్తుతి, నిరోష్ఠ్య నిర్వచన శుధ్ధాంధ్ర హరిశ్చంద్రోపాఖ్యానము, సారంగధరీయము (త్యర్థికావ్యము), సునీతి శతకము, కేశవేంద్ర శతకము, సిద్ధయోగి చరిత్ర, అలమేలు మంగ వేంకటేశ్వర సంవాదము, వీర తిమ్మమాంబా చరిత్రము, మన్నెముకొండ వేంకటేశ్వర శతకము, నారసింహప్రభు శతకము (ఏకప్రాస), నరసింహ నిరసన స్తుతి, త్రింశదర పద్యరత్నము, శౌరి శైశవలీల, సత్యనారాయణ వ్రతకల్పము, సుజ్ఞాన ప్రబోధిని, హనుమత్ప్రభు శతకము, శ్రీశైల మల్లేశ శతకము, చమత్కృతి మొదలైన గ్రంథాలను రచించాడు.
త్రింశదర్థ పద్యరత్నము - పోకూరి కాశీపతి
ఆ.వె. భూరి జఠర గురుఁడు నీరజాందిక భూతి మహిత కరుఁ డహీన మణి కలాపుఁ డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.
మొదటి అర్ధము - గణపతి స్మరణ
భూరి = పెద్దయగు
జఠర = కడుపు గలవారిలో
గురుఁడు = గొప్పవాడును,
నీరజ = నీటఁ బుట్టిన యగ్ని
అంబక = నేత్రముగాఁ గల శివునకు
భూతి = పుట్టినవాఁడును,
మహిత = అతిశయమైన
కరుఁడు = తొండము గలవాఁడును,
అహీన మణి = సర్పరాజ శ్రేష్టము
కలాపుఁడు = అలంకారముగా గలవాఁడును,
అలఘుసత్ = అధిక శ్రేష్టమైన
గణేశుఁడు = గణేశ నామము గలవాడును,
అగ్ర = ముఖ్యమైన
గోపుఁడు = వాక్కులు గల ప్రభువైనవాఁడును,
మహా = గొప్పయగు
అమర్త్య సింహుఁడు = దేవతాశ్రేష్టుఁడును (అగు గణపతి)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
రెండవ అర్ధము - శివ స్మరణ
భూరి జఠర = పెద్ద కడుపు గల విఘ్నేశ్వరునకు
గురుఁడు = తండ్రియైనవాడును,
నీరజ + అంబక = అగ్ని నేత్రము యొక్క
భూతి = సత్తా గలవాఁడును,
మహిత = శూలము
కరుఁడు = హస్తమందు గలవాఁడును,
అహీన మణి = సర్పరాజ శ్రేష్టము
కలాపుఁడు = భూషణముగా గలవాఁడును,
అలఘు = ఘనతరమైన
సత్ + గణేశుఁడు = శ్రేష్టమైన ప్రమథగణమున కధీశుఁడైనవాడును,
అగ్ర = చివరిదైన
గోపుఁడు = దిక్కున కధిపతి యైనవాఁడును,
(5)
అగ్ర = పై భాగమున (అనగా సిగయం దనుట)
గోపుండు = కళాపతి (చంద్రుఁడు) గలవాఁడును,
మహా + అమర్త్య సింహుఁడు = గొప్ప దేవతాశ్రేష్టుఁడును (అగు శివుడు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
మూడవ అర్ధము - బ్రహ్మ స్మరణ
భూరి = బంగారము
జఠర = పొట్టగా గల
గురుఁడు = గొప్పవాడును,
నీరజ + అంటక = కమలాక్షుఁడగు విష్ణువునకు
భూతి = పుట్టినవాఁడును,
మహిత = అధికమైన
కరుఁడు = హస్తములు గలవాఁడును,
అహీన = హీనము కాని
మణి కలాపుఁడు = రత్న భూషణములు గలవాఁడును,
అలఘు = ఘనతరమైన
సత్ + గణేశుఁడు = సాధు (మరీచి, అత్రి, అంగీరసాది మహర్షి) గణమున కద్యకుఁడైనవాడును,
అగ్ర గోపుఁడు = తొలి పలుకులకు ప్రభువైనవాఁడును,
(ड)
అగ్ర = ముఖ్యమగు
గోపుఁడు = వాకృతి (సరస్వతీ వల్లభుఁడు) ఐనవాఁడును,
మహా = గొప్పయగు
అమర్త్య సింహుఁడు = దేవతాశ్రేఘ్రుఁడును (అగు బ్రహ్మ)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
నాలుగవ అర్ధము - విష్ణు స్మరణ
భూరి జఠర = కనకగర్భుఁడగు బ్రహ్మదేవునకు
గురుఁడు = తండ్రి యైనవాడును,
నీరజ = పద్మముల వంటి
అంటక భూతి = నేత్రశ్రీ గలవాఁడును,
మహిత = అధికమైన
కరుఁడు = హస్తములు గలవాఁడును,
అహీన = ఘనతరమైన
మణి కలాపుఁడు = రత్న భూషణములు గలవాఁడును,
అలఘు = విస్తారమైన
సత్ + గణేశుడు = (నారద, ప్రహ్లాదాది) సాధుగణాధీశుఁడైనవాడును,
అగ్ర = ప్రధానమైన
గోపుండు = (కృష్ణావతారమున) గోపాలకుఁడైనవాఁడును,
మహా = గొప్పయైన
మర్త్య సింహుఁడు = నరసింహుఁడైనవాఁడును (అగు మహావిష్ణువు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
ఐదవ అర్ధము - ఇంద్ర స్మరణ
భూరి జఠర గురుఁడు = బ్రహ్మకు పెదతండ్రి యైనవాడును,
నీరజ = పద్మముల వంటి
అంటక భూతి = నేత్ర సంపద గలవాఁడును,
మహిత కరుఁడు = గొప్ప కప్పములు గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = అధికమైన రత్నాలంకారుఁడైన వాఁడును,
అలఘు సద్గణేశుడు = ఘనమైన సుమనస్సముదాయమునకు అధిపుడైనవాఁడును,
అగ్ర గోపుఁడు = మొదటి (తూర్పు దిక్కున కధిపతి యైనవాఁడును,
మహామర్త్య సింహుఁడు = గొప్ప దేవతాశ్రేష్టు డైనవాఁడును (అగు దేవేంద్రుఁడు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
6వ అర్థము – అగ్ని దేవ స్మరణ
భూరి జఠర గురుఁడు = పెద్ద కడుపు గలవారిలో గొప్పవాడును (సర్వభక్షకుఁడు),
నీరజ = పద్మములు
అంటక = బాణములుగా గల మన్మథుని యొక్క,
భూతి = భస్మము గలవాఁడును,
మహిత కరుఁడు = అతిశయమైన కిరణములు గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = గొప్పతనమే మణిభూషలుగా గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = గొప్ప సోమయాజులు మున్నగు సాధుగణముల కధీశుఁ డైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ముఖ్య దిక్పతి యైనవాఁడును,
మహామర్త్య సింహుఁడు = గొప్ప దేవతాశ్రేష్టు డైనవాఁడును (అగు అగ్నిదేవుఁడు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
7వ అర్థము – యమ స్మరణ
భూరి జఠర = పెద్ద కడుపు గల భీమునకు,
గురుఁడు = పెదతండ్రి యైనవాడును,
నీరజ అంటక =అగ్గికంటి అయిన శివుని వలన
భూతి = పుట్టిన వాడును,
మహిత కరుఁడు = అతిశయ మైనవాఁడును,
అహీన = సర్పరాజమును
మణి కలాపుఁడు = మణికట్టున భూషణముగా గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = గొప్ప యొప్పుల కుప్ప యగు ప్రభువైనవాఁడును,
అగ్ర గోపుడు = ముఖ్య (దక్షిణ) దిక్పతి యైనవాడును,
మహా +అమర్త్య సింహుఁడు = గొప్ప దేవతాశ్రేష్టు డైనవాఁడును (అగు యముఁడు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
8వ అర్ధము - నిరృతి స్మరణ
మారి జఠర గురుఁడు = గొప్ప కఠినులగు వారికి (రాక్షసులకు) రాజైన వాడును,
నీరజ అంటక =అగ్గికంటి అయిన శివుఁడే
భూతి = ఐశ్వర్యముగా గలవాఁడును,
మహిత కరుఁడు = అతిశయ మైనవాఁడును,
అహీన = వృత్రాసురుఁడను ప్రభువుకు
మణి కలాపుఁడు = రత్నభూషణము వంటివాఁడును,
అలఘు సద్గణేశుడు = మిక్కిలి యొప్పుల కుప్ప యగు ప్రభువైనవాఁడును,
అగ్ర గోపుఁడు = దిక్పాలకాగ్రణి యైనవాఁడును,
మహా మర్త్య సింహుడు = మిక్కిలిగా మానవులకు సింహప్రాయుఁ డైనవాఁడును (అగు నిరృతి)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
9వ అర్ధము. వరుణ స్మరణ -
మారి జఠర గురుఁడు = బ్రహ్మయే తాతగా గలవాడును, (బ్రహ్మ సంతానమగు కర్దమ ప్రజాపతి పుత్రుఁడు)
నీరజ అంటక =అగ్గికంటి అయిన శివుని వంటి
భూతి = ఐశ్వర్యముగా గలవాఁడును,
మహిత కరుఁడు = అతిశయ మైనవాఁడును,
అహీన మణి కలాపుఁడు = సర్పరాజమును మణికట్టున భూషణముగా (నాగపాశము) గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = గొప్ప యొప్పుల కుప్ప యగు ప్రభువైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ప్రధానమగు జలమునకు అధిపతి యైనవాడును,
మహామర్త్య సింహుఁడు = గొప్ప దేవతా శ్రేష్టుఁ డైనవాఁడును (అగు వరుణుఁడు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
10వ అర్ధము - వాయుదేవ స్మరణ
మారి జఠర = పెద్ద కడుపు గల భీమునకు
గురుఁడు = తండ్రి యైనవాడు,
నీరజ అంటక =అగ్గికంటి అయిన శివునకు
భూతి = పుట్టినవాఁడును,
మహిత కరుఁడు = ఆధిక్యత గలవాడును,
అహీన మణి కలాపుఁడు = అతిశయమే రత్నభూషణముగా గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = ప్రాణాయామ మొనర్చు వాయుభక్షకులగు సాధువుల కధీశ్వరుఁ డైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ?
మహామర్త్య సింహుఁడు = గొప్ప దేవతా శ్రేష్టుఁ డైనవాఁడును (అగు వాయుదేవుడు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
11వ అర్ధము - కుబేర స్మరణ
మారి జఠర గురుఁడు = బ్రహ్మయే తాతగా గలవాడును, (బ్రహ్మ సంతతి యగు పులస్త్యబ్రహ్మ కుమారుఁడు),
నీరజ అంటక భూతి = శివుని వలన లభించిన సంపద గలవాడును,
మహిత కరుఁడు = అతిశయ మైనవాఁడును,
అహీన మణి కలాపుఁడు = ఘనతరమైన మణి సముదాయము గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = విశేషమైన పుణ్యజన సముదాయమున కధీశ్యుడైన వాఁడును,
అగ్ర గోపుఁడు = కడపటి (ఉత్తర) దిక్కునకు ప్రభువైనవాఁడును,
మహామర్త్య సింహుఁడు = మృతి లేనివారిలో మిక్కిలి శ్రేఘ్రుఁడైనవాఁడును (అగు కుబేరుఁడు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
12వ అర్ధము - అష్టదిక్పాలక స్మరణ
మారి జఠర గురుఁడు = లంబోదర జనకుఁడగు నీశానుడును,
నీరజ అంటక భూతి = అగ్గికంటి వలన శ్రీమంతుఁడగు కుబేరుఁడును,
మహిత కరుఁడు = ఆధిక్యము గల వాయుదేవుఁడును,
అహీన మణి = వృత్రునకు ప్రభురత్నమైన నిరృతియు,
కలాపుఁడు = కాంతుల కధిపతియగు నగ్ని హోత్రుఁడును,
అలఘు సద్గణేశుడు = గొప్ప సుమనోనాయకుఁడగు నింద్రుఁడును,
అగ్ర గోపుఁడు = ప్రధాన జలాధిపతియగు వరుణుఁడును,
మహామర్త్య సింహుఁడు = ఘనమైన దేవతలలో సింహప్రాయుఁడైన యముఁడును,
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
13వ అర్ధము -నవగ్రహ స్మరణ
మారి జఠర గురుఁడు = మిక్కిలి కఠినులగు వారికి (రాక్షసులకు) గురువైన శుక్రుఁడును,
నీరజ అంటక భూతి = విష్ణుజన్ముఁడైన యంగారకుఁడును,
మహిత కరుఁడు = ఘనతరమైన కిరణములుగల సూర్యుండును,
అహి = రాహుయుక్తమైన
ఇనమణి = రాజసర్ప విశేషమగు కేతువును (రాహుకేతువులును),
కలాపుఁడు = విద్యల కధిపతియగు బుధుఁడును,
అలఘు సద్గణేశుఁడు = విస్తారమైన నక్షత్ర చయమున కధీశుఁడగు చంద్రుఁడును,
అగ్ర గోపుఁడు = ప్రధాన గీష్పతియగు బృహస్పతియును,
మహామర్త్య సింహుఁడు = గొప్పయగు దేవతలలో సింహప్రాయుఁడైన శనియును,
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
14వ అర్ధము -సూర్య స్మరణ
మారి జఠర గురుఁడు = బ్రహ్మయే తాతగా గలవాఁడును,
నీరజ అంటక భూతి = ఈశ్వరుని వంటి (తరగని కిరణముల) యైశ్వర్యము గలవాఁడును,
మహిత కరుడు = అధికతరమైన హస్తములు గలవాఁడును (సహస్రకరుఁడు),
అహీన మణి కలాపుఁడు = ఘనతరమైన శమంతకాది మణిసముదాయము గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = అధికమైన సాధు గణాధీశ్వరుఁడైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ముఖ్య నేత్రమైన ప్రభుఁడును,
మహామర్త్య సింహుఁడు = గొప్ప దేవతా శ్రేష్టుఁడైనవాఁడును (అగు సూర్య భగవానుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
15వ అర్ధము – చంద్ర స్మరణ
మారి జఠర గురుఁడు = బ్రహ్మకు మామయైనవాఁడును (బ్రహ్మ విష్ణుపుత్రుఁ డైనందున లక్ష్మి సోదరుఁడు చంద్రుఁడు బ్రహ్మకు మామ యగును)
నీరజాంబక = పద్మమే తల్లిగా గల బ్రహ్మయొక్క
భూతి = పుట్టువు గలవాఁడును,
మహిత కరుఁడు = గొప్ప కాంతి గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = గొప్ప రత్న భూషలు గలవాఁడును,
అలఘు సద్గణేశుడు = అధికమైన నక్షత్రగణాధీశ్వరుఁ డైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ముఖ్యమైన చంద్రుఁడను ప్రమఁ డైనవాఁడును,
మహామర్త్య సింహుఁడు = గొప్ప దేవతా శ్రేష్టుఁడైనవాఁడును (అగు చంద్రుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
16వ అర్ధము – సముద్ర స్మరణ
భూరి జఠర గురుఁడు = పెద్ద కడుపు గలవారలలో గొప్పవాఁడు (సర్వ నదులను భరించు కడుపు గలవాఁడు),
నీరజాంబక భూతి = చేపలే నేత్రసంపదగా గలవాఁడును,
మహిత కరుఁడు = అతిశయమైనవాడును,
అహీన మణి కలాపుఁడు = గొప్ప రత్న సముదాయము గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = ఘనమైన సాధుగణాధ్యకుఁ డైనవాఁడును (సముద్రస్నాన ఫలాపేక్షితుల కనుట),
అగ్ర గోపుఁడు = ముఖ్యమైన జలాధిపతి యైనవాఁడును,
మహామర్త్య సింహుఁడు = నాశనము లేనివారిలో మిక్కిలి శ్రేష్ఠుఁడైనవాఁడును (అగు సముద్రుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
17వ అర్ధము - మేఘ స్మరణ
భూరి జఠర గురుఁడు = పెద్ద కడుపు గలవారిలో గొప్పవాఁడును (దొడ్డ జలోదరుఁడు),
నీరజాంబక భూతి = అగ్ని బాణ సత్తా (పిడుగులు) గలవాఁడును,
మహిత కరుఁడు = మిక్కిలి వడగండ్లు గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = గొప్ప మణికాంతులు (మెఱుపులు) గలవాఁడును,
అలఘు సద్గణేశుడు = మిక్కిలి యొప్పులకుప్ప యగు నేలిక యైనవాఁడును (జీవకోటికి జీవమిచ్చు దాత),
అగ్ర గోపుఁడు = పైభాగమున స్వర్గాధిపతియగు నింద్రుఁడు గలవాఁడును (ఇంద్రునకు వాహనము),
మహామర్త్య సింహుఁడు = గొప్ప మృత్యుకాలమున సింహప్రాయమైన మేఘ గర్జనలు
గలవాఁడును (అగు మేఘుఁడు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
18వ అర్ధము - హిమవన్నగేశ్వర స్మరణ
భూరి జఠర గురుఁడు = లంబోదరుఁడగు గణపతికి తాత యైనవాఁడును,
నీరజాంబక భూతి = అనలాకుఁడగు శివునివంటి యైశ్వర్యము గలవాడును,
మహిత కరుఁడు = గొప్ప (మంచుకొండ) కాంతి గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = అధికతరమైన మణిసముదాయము గలవాఁడును (పర్వత సానువులందు మణు లుండును),
అలఘు సద్గణేశుడు = మిక్కిలి సాధుమున కధీశ్వర్యుడైనవాఁడును (తాపసోత్తముల కునికిపట్టయినవాడు),
అగ్ర గోపుఁడు = పై భాగమున దికృతులు గలవాఁడును,
మహామర్త్య సింహుఁడు = మృతి లేనివారిలో మిక్కిలి శ్రేష్ఠుడైనవాఁడును (అగు హిమవంతుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
19వ అర్థము –ఆదిశేష స్మరణ
భూరి జఠర గురుఁడు = గొప్ప కడుపు గలవారిలో దొడ్డవాఁడును (తల, తోక తప్ప తక్కిన భాగమంతయు కడుపు),
నీరజాంబక భూతి = చేపకన్నులవంటి నేత్రసంపద గలవాఁడును (రెండువేల కన్ను లనుట),
మహిత కరుఁడు = (తన శరీరమునే కరముగా చేసుకొని దేనినైనను పట్టుకొనుట చేత) గొప్ప చేయి గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = ఘనతరమైన మణిసముదాయము గలవాఁడును (శేషాహి పడగలయందున మాణిక్యము లుండు ననుట ప్రసిద్ధము),
అలఘు సద్గణేశుడు = మిక్కిలి సాధువుల కధీశ్వరుండైనవాఁడును (నాగపూజ లాచరించువారి కనుట),
అగ్ర గోపుఁడు = ముఖ్యమైన భాష గలవాఁడును (భాషాదాతుర్యము గలవానిని భాషయం దపరశేషుఁడనియు, భాషాశేషుఁ డనియు వర్ణించుట కవి సమయము),
మహామర్త్య సింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్టుడైనవాఁడును (అగు ఆదిశేషుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
20వ అర్ధము - గరుడ స్మరణ
భూరి జఠర గురుఁడు = బ్రహ్మయే తాతగా గలవాఁడును (బ్రహ్మ సంతతి యగు కశ్యపుని కొడుకు),
నీరజాంబక భూతి = కమలాక్షుండే యైశ్వర్యముగా గలవాఁడును (విష్ణుభక్తుఁడు),
మహిత కరుఁడు = ఘనతరమైన హస్తములు గలవాఁడును (ఇంద్రు నోడించి అమృతమును దెచ్చిన దోర్బలశాలి),
అహీన మణి కలాపుఁడు = సర్పరాజముల మణిసముదాయము గలవాఁడును (నాగుల పడగలు చప్పరించి యుమ్మివేసిన రత్నములు తన యింటినిండ ఉండును),
అలఘు సద్గణేశుడు = గొప్ప యొప్పులకుప్ప యగు ప్రభువైనవాఁడు (ఖగేశ్వరుఁడును),
అగ్ర గోపుఁడు = పైభాగమున భూభర్త యగు విష్ణువు గలవాఁడు (విష్ణువునకు వాహనము),
మహామర్త్య సింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్టుడైనవాఁడును (అగు గరుడుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
21వ అర్ధము – గజేంద్ర స్మరణ
భూరి జఠర గురుఁడు = పెద్ద కడుపు గలవారిలో గొప్పవాఁడును (ఏనుఁగులకు పెద్ద కడుపుండుట సహజము),
నీరజాంబక భూతి = కమలాక్షుండే యైశ్వర్యముగా గలవాఁడును (విష్ణుభక్తుఁ డనుట),
మహిత కరుఁడు = గొప్ప తొండము గలవాఁడు,
అహీన మణి కలాపుఁడు = ఘనతరమైన మణిసముదాయము గలవాఁడును (ముది యేనుఁగుల కుంభస్థలములలో ముత్యము లుండుట సహజము),
అలఘు సద్గణేశుడు = మిక్కిలి సాధుచయాధ్యకుఁ డైనవాఁడును,
అగ్ర గోపుఁడు = లెస్సయైన వాక్కు (ఘీంకారము) గలవాడును,
మహామర్త్య సింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్టుడైనవాఁడును (అగు గజేంద్రుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
22వ అర్థము –ఆంజనేయ స్మరణ
భూరి జఠర గురుఁడు = పెద్ద కడుపు గల భీమున కన్నయైనవాఁడును (ఇరువురు వాయుపుత్రు లైనందున),
నీరజాంటక భూతి = శివ సంభూతుఁ డైనవాఁడును.
మహిత కరుఁడు = ఘనతరమైన కరములు గలవాఁడును, (గిరులను తరులను పేరుకు భజబలము గల్గినందున),
అహీన మణి కలాపుఁడు = గొప్పతనమునే భూషణములుగా గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = అధికతరమగు సాధుగణమునకు (హనుమదుపాసకులకు) ఏలిక యైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ముఖ్య వాక్కుల కధీశుఁడైనవాఁడును (సూర్యునివద్ద అభ్యసించిన వ్యాకరణవేత్త),
మహామర్త్య సింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్టుడైనవాఁడును (అగు ఆంజనేయుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
23వ అర్ధము - నందీశ్వర స్మరణ
మారి జఠర గురుఁడు = వినాయకుఁడే రాజుగా గలవాఁడును (నందీశ్వరాది ప్రమథులకు గణపతి ),
నీరజాంబక భూతి = శివుండే యైశ్వర్యముగా గలవాఁడును (శివభక్తుఁడు),
మహిత కరుఁడు = గొప్ప (ధవళ) కాంతి గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = గొప్ప రత్న భూషలు (మణియుక్తములగు మువ్వల పట్టెలు) గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = ఘనులైన ప్రమథవర్యులలో శ్రేష్ఠుడైనవాఁడును,
అగ్ర గోపుఁడు = గోవులకు ముఖ్యాధీశుఁ డైనవాఁడును
మహామర్త్య సింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్టుడైనవాఁడును (మృతిలేనివాఁడును) (అగు నందీశ్వరుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
24వ అర్ధము - వీరభద్ర స్మరణ
మారి జఠర గురుఁడు = వినాయకుఁడు అన్నగా గలవాఁడును,
నీరజాంబక భూతి = రుద్రుని వలన బుట్టినవాఁడును,
మహిత కరుఁడు = మహత్తరమైన కరములు గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = గొప్పతనమే మణిభూషలుగా గలవాఁడును,
అలఘు సద్గణేశుడు = మిక్కిలి బలిష్టమైన సేనకు (రుద్రగణమునకు) అధ్యకుఁడైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ముఖ్యమైన బాణములకు (ఆగ్నేయ సమ్మోహనాస్త్రములకు) అధీశుఁడైనవాఁడును,
మహామర్త్య సింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్టుడైనవాఁడును (అగు వీరభద్రుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
25వ అర్ధము – కుమారస్వామి స్మరణ
మారి జఠర గురుఁడు = బ్రహ్మయే మామగా గలవాఁడును (గంగ, బ్రహ్మ విష్ణువునకు జనించినందున గాంగేయుఁడగు కుమారస్వామికి బ్రహ్మ మాయ యగును),
నీరజాంబక భూతి = (రాక్షస సంహారమందు) విష్ణుని వంటి సత్తా గలవాడును,
మహిత కరుఁడు =
అహీన మణి కలాపుఁడు =
అలఘు సద్గణేశుడు = మిక్కిలి బలము గల దేవతాసైన్యమున కధ్యకుఁడైనవాడును,
అగ్ర గోపుఁడు = ముఖ్యమైన శక్తి బాణమున కధీశుఁడైనవాఁడును,
మహామర్త్య సింహుడు = మిక్కిలి దేవతా శ్రేష్టుడైనవాఁడును (అగు కుమారస్వామి),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
26వ అర్థము – మన్మథ స్మరణ
భూరి జఠర గురుఁడు = బ్రహ్మయే అన్నగా గలవాఁడును (బ్రహ్మ, మన్మథుడు హరి కుమారులు),
నీరజాంబక భూతి = పద్మ బాణముల సత్తా కలవాఁడును (లేక కమలాక్షునకు బుట్టినవాఁడును),
మహిత కరుఁడు = అతిశయమైన వాఁడును,
అహీన మణి కలాపుఁడు = ఘనమైన మణిభూషలు గలవాడును,
అలఘు సద్గణేశుఁడు = గొప్ప సాధువుల సేన కధ్యకుఁడైనవాఁడును (పేక శారికాది సాధు పక్షుల కనుట),
అగ్ర గోపుడు = ముఖ్యమైన బాణములకు నాయకుఁడైనవాఁడును (ఉత్పత్తికి కారణమైన మోహమును గలిగించు బాణముల కనుట),
మహామర్త్య సింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్టుడైనవాఁడును (అగు మన్మథుఁడు),
మనలన్ = మనలను.
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
27వ అర్ధము - నారద స్మరణ
భూరి జఠర గురుఁడు = బ్రహ్మయే తండ్రిగా గలవాఁడును,
నీరజాంబక భూతి విష్ణువే యైశ్వర్యముగా గలవాఁడును (హరిభక్తుఁ డనుట),
మహిత కరుఁడు = గొప్ప (ధవళ) కాంతి గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = గొప్పతనమే మణిభూషలుగా గలవాఁడును,
అలఘు సద్గణేశుడు = మిక్కిలి సాధు గణములకు (దేవర్షి గణములకు) అధ్యక్షుఁడైనవాడును,
అగ్ర గోపుండు = ముఖ్యమైన (హరినామ సంకీర్తనా) వాక్యముల కధిపుఁడైనవాఁడును,
మహామర్త్య సింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్టుడైనవాఁడును (అగు నారదుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
28వ అర్థము – దత్తాత్రేయ స్మరణ
భూరి జఠర గురుఁడు = బ్రహ్మయే తాతగా గలవాఁడును (బ్రహ్మ సంతానమగు అత్రి కుమారుఁడైనందున),
నీరజాంబక భూతి = విష్ణువు యొక్క పుట్టుక గలవాఁడును (అనసూయ కోర్కె ప్రకారము విష్ణువు దత్తాత్రేయుఁడుగా గల్గినందున),
మహిత కరుఁడు = అధికమైన (త్రిముఖుఁ డైనందున ఆరు) చేతులు గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = ఘనమగు రత్నభూషలు గలవాఁడును (తన జాతకర్మోత్సవమున దేవతలు కానుకగా ఇచ్చిన రత్నభూషలు ధరించినందున),
అలఘు సద్గణేశుఁడు = అలఘుతరమగు సాధు గణముల కధ్యకుఁడైనవాఁడును,
అగ్ర గోపుఁడు = వేదవాక్య పరిపాలకుడైనవాఁడును,
మహామర్త్య సింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్టుడైనవాఁడును (అగు దత్తాత్రేయుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
29వ అర్ధము - విశ్వకర్మ స్మరణ
మారి జఠర గురుఁడు = కనకగర్భుని వంటి జగద్గురుడైనవాఁడును,
నీరజాంబక భూతి = అనలాక్షుని వంటి పుట్టువు గలవాఁడు (పంచముఖుఁడు),
మహిత కరుఁడు = అధికమైన (పది) చేతులు గలవాఁడు,
అహీన మణి కలాపుఁడు = ఘనతరమైన మణిభూషలు గలవాఁడును,
అలఘు సద్గణేశుడు = మిక్కిలి సాధు గణములకు అధ్యక్ష్యుడైనవాఁడును,
అగ్ర గోపుఁడు = తొలిపల్కులకు (వేదములకు) అధీశుఁడైనవాఁడును,
మహామర్త్య సింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్టుడైనవాఁడును (అగు విశ్వకర్మ),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
30వ అర్ధము - వీరబ్రహ్మ స్మరణ
భూరి జఠర = బ్రహ్మ యను పేరుగల,
గురుఁడు = దేశికుఁడైనవాఁడును,
నీరజాంబక భూతి = విష్ణువు యొక్క పుట్టువు గలవాఁడును (లేక) ఈశ్వరాంశ సంభూతుఁడును,
మహిత కరుఁడు = అతిశయము గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = గొప్ప మణిభూషలు గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = ఘనతరమైన సాధుగణాధీశ్వరుఁ డైన వాఁడును,
అగ్ర గోపుఁడు = గోపాలకాగ్రణి యైనవాఁడును (గరిమరెడ్డి అచ్చమ్మ యింట ననుట) లేక ముందు వాక్కుల కధీశుఁడైనవాఁడును (అనగా నికముందు జరుగబోవు వాక్యములు గల స్వరచిత కాలజ్ఞానమున కనుట),
మహామర్త్య సింహుఁడు = మిక్కిలి మానవ శ్రేష్ఠుడైనవాఁడును (అగు వీరబ్రహ్మేంద్రుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.