జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
ఆత్మస్వరూపులారా!శుభాకాంక్షలతో వందనములు.
మన దినచర్య ప్రాతః కాలాన్నే శయ్యపైనుండి లేచినదగ్గరనుండి ప్రారంభమై మరల రాత్రి సమయమున శారీరక మానసిక అలసట పోవుటకొఱకు శయ్యపైకి చేరేవరకు అనేక విధములుగా అవసరమైన, అత్యవసరమైన, అనవసరమైన, పనులను మన ఇంద్రియముల ప్రేరణతో, ఆత్మేంద్రియప్రేరణతో చేస్తూ ఉంటాము. అంతేకాని మన ప్రమేయం యేదీకూడా ఇందులో ఉండదని గ్రహించాలి.
మనకనిపిస్తుంది మంచిగానే జీవించాలనుకొంటున్నాను. మరి నన్ను మంచిగా నడుచుకోడానికి మన ఇంద్రియప్రేరణ జ్ఞానేంద్రియ ప్రేరణ బాగా ఉండాలంటే ఏమి చెయ్యాలి అని.
ఆలోచిద్దాం.
ప్రాతః కాలాన్నే ప్రకృతి చాలా చల్లగా హాయిగా ప్రారంభమవుతుంది.చల్లని పిల్లగాలులు, పక్షుల కిలకిలారావములు, చిఱువెచ్చని బాలభానుని కిరణాలు మనసునకెంతో ఆహ్లాదకరంగా ఉంటాయి.
ఈ సజ ప్రకృతి సిద్ధమయిన ఆనందం మనం అనుభవించాలంటే మనంకూడా ప్రకృతితోపాటు ఆహ్లాదజనకంగా ఉండాలి. ఇదెలాసాధ్యం? అన నవసరం లేదు. మనం లేస్తూనే చేసే పనులతోనే ఇదంతా ముడిపడి ఉంది.
మనము అంటే
ఐదు కర్మేంద్రియములు,
ఐదు జ్ఞానేంద్రియములు,
ఐదు కర్మేంద్రియములు,
ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన మరియు సమాన అనే ఐదు ప్రాణవాయువులు,
1అన్నమయము 2ప్రాణమయము 3మనోమయము 4విఙ్ఞానమయము 5ఆనందమయము అనెడి 5కోశములు,
వీటితో పాటు మనలో ఉండే ఒక ప్రాణము.
వీటన్నింటితో కూడిన ఒక యంత్రము యీ శరీరము. దీనినే మనము మనముగా భావిస్తాము.
ఈ ఇరువదొక్కింటిని పరిశుభ్రముగా ఉంచుకో గలిగితే మన కోరిక సాధ్యమౌతుంది.
అదెలాగో మాకు తెలియదే అని చింతించే పని లేదు.
వృక్షం గొప్పగా ఉండాలంటే మనం విత్తు వేసినప్పుడే శ్రద్ధ తీసుకోవాలి. అలాగే మనం మనంగా ఆత్మతేజంతో ప్రకాశించాలంటే అది ప్రాతఃకాలాన్నే మనం అన్నిటికీ మూలమయిన శక్తి ఏదో ఆశక్తియే అన్నిటికీ ప్రారంభంలో ప్రార్థింపఁబడుతుంది.
ఉదాహరణకు
మనం పూజకు కూర్చున్నప్పుడు ఏమంటాము? ఓం శ్రీగురుభ్యో నమః అనికదా అంటాము. ఆచమనమప్పుడు కూడా మనం ఓం కేశవాయ నమః అనే కదా అంటున్నాము. గణపతిని ప్రార్థించాలన్నా మనం ఓం గం గణపతయే నమః అనే కాదా అంటున్నాము? దీనిని బట్టి మనకేమి అర్థమౌతోంది? ఓం కారం లేకుండా మనకేదీ లేదనే కదా అర్థమౌతుంది? మనం చెవులు మూసుకొంటే మనకు వినిపించేదేమిటి? ఓం కారమే కదా? సాగర ఘోష ఓంకారమే కదా? శంఖనాదం ఓంకారమేదా?
అసలు ఈ ఓం కారం ఏమిటి అని మనం తెలుసుకుంటే ఓం ప్రాధాన్యత అర్థమౌతుంది.
అ+ఉ+మ్=ఓం ఈ మూడుస్వరములూ సృష్టి స్థితి లయ లకు మూలములు. ఆమూలమయినది శ్రీ లలితాపరాభట్టారికయే కదా. ఇందులో మొదటి వర్ణము అ యే కదా? సృష్టికి మూలము ఇదే కదా? అమ్మ లేకుండా సృష్టి లేదు కదా? అందుకే మూలమయినదానిని అమ్మగా గౌరవిస్తాము.అమ్మేకదా సృష్టికి మూలము? అమ్మలేకుండా సృష్టియే ఉండదు కదా?
కావున ఈ ఓంకారం మనం నిద్దుర లేస్తూనే పైన చెప్పిన ఇరువదొక్కింటిని పవిత్రముగానడుపుటకు ఇరువదొక్కపర్యాయములు స్పష్టంగా పలికి లేచుట అలవాటు చేసుకో గలిగితే మనం ఆత్మప్రేరణ కలిగి కోరుకొన్న స్థాయిలో మనం జీవించుచు రాణించగలుగుతాం.
ఓం హరిః అని కాని, ఓంశ్రీమన్నారాయణా అని కాని, ఓం నమో వాసుదేవా అనికాని, ఓం శ్రీమాత్రే నమః అనికాని ఇరువదొక్కపర్యాయములు జపించి,
కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతీ, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కర దర్శనమ్. అని చేతులలో కొలువై ఉన్న ముగ్గురమ్మలకీ నమస్కరించుకొని,
అమ్మా భూమాతా నిద్దురలేచినదొ మొదలు నిన్ను నా పాదములతో త్రొక్కుతున్నాను. నన్ను క్షమించమ్మా అని భూమికి నమస్కరించె పాదం భూమిపై పెట్టి మనం మన పనులకుపక్రమించాలి.
మరి మీరేమంటారు?
ఓం నమో భగవతే వాసుదేవాయ.
సజ్జనవిధేయుఁడు
చింతా రామకృష్ణారావు.తే.౨౫ - ౬ - ౨౦౨౪.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.