గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జూన్ 2024, బుధవారం

వృద్ధ బాల శిక్ష ( నీతి శతకము ) రచన:- చింతా రామ కృష్ణా రావు. తేదీ. 31 - 12 - 2011.

 జైశ్రీరామ్. 

వృద్ధ బాల శిక్ష

( నీతి శతకము )

రచన:-  చింతా రామ కృష్ణా రావు.

వృద్ధ బాల శిక్ష

( నీతి శతకము )

రచన:-  చింతా రామ కృష్ణా రావు.

అంకితము

కీ.శే.శ్రీమతి సాధు సీతాకుమారి సహోదరికి 

ఆ.వె.  ప్రాభవముననొప్పు రామకృష్ణాఖ్యుఁడ,

కవిని, నే రచించి ఘన శతకము

వృద్ధబాలశిక్ష పృథ్విపై సీతాకు

మారికంకితముగ మదినొసగితి.


.వె.ll శ్రీ ప్రదంబు లైన జీవిత గమ్యమ్ము  

లరసి చూప, మదిని హరికి మ్రొక్కి,

పెద్ద పిన్న లరయ  సుద్దులు చెప్పెద,  

వృద్ధ బాల శిక్ష  వినిన మేలు.                               .


.వె.ll తనువు గాయ పడిన తగ్గిపోవును కాని,  

మనసు గాయ పడిన మానదు కద?

మనసు గాయ పరచి మన్నింప వేడుదే

వృద్ధ బాల శిక్ష  వినిన మేలు.                             .


.వె.ll శ్రీలఁ బొంగఁ జేయు జీవ గడ్డను పుట్టి  

బేల వోలె నుండుటేల జనులు?

కష్టపడిన కూడు కలుగదే భూమిపై?  

వృద్ధ బాల శిక్ష  వినిన మేలు.                                     .


.వె.ll కాల యాపనమున కర్తవ్య దూరులై  

యంధకార మలమ, యలమటింత్రు,

చేయ వలయు పనులు చేయుడు వెంటనే,

వృద్ధ బాల శిక్ష  వినిన మేలు.                         .


.వె.ll మంచి చెడ్డలకును  మాటయే మూలము,  

మాటలందున పొరపాటు తగదు,

మంచినెంచి మనము మాటలాడుట మేలు,  

వృద్ధ బాల శిక్ష  వినిన మేలు.                        .


.వె.ll చేయు పనులె మనకు చేకూర్చు మంచైన  

చెడ్డయైన. కాన చెడును విడిచి

మంచిఁ గొలుపు పనులు మరిమరి చేయుఁడు!  

వృద్ధ బాల శిక్ష  వినిన మేలు.                    .


.వె.ll తలపులందు మంచి  కలిగిన వాడిలన్  

మంచి మాటలాడు, మంచి చేయు,

మంచి చేయ మనకు మంచియే కలుగును.

వృద్ధ బాల శిక్ష  వినిన మేలు.                          .


.వె.ll నిరుపమానమైన నిద్రాణ శక్తులు  

కలిగి యున్న గొప్ప ఘనులు మీరు,

వెలికి తీసి, మెలఁగి, విఖ్యాతి పొందుఁడు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                             .


.వె.ll అంతరంగమందు నత్యద్భుతంబైన 

భావ జాలమున్న భవ్యులార!

వెలువరించుఁడయ్య విలువైన భావాలు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                              .


.వె.ll భూమిపైన నున్న పూజ్యుల నడవడిఁ  

గనుచు నట్టి నడత కలుగ వలయు,

పూజ్య వర్తనమున పూజార్హులగుదురు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                ౧౦.


.వె.ll సంఘ జీవనమున సమరస భావంబు  

కలిగి బాధ్యతలను గాంచ వలయు,

తప్పు చేయఁ బోక గొప్పగా నుండుఁడు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                              ౧౧.


.వె.ll ఒకడు  తప్పు  చేయ నొరులు పాడగుదురు,  

తప్పు చేయ నేల ధరణి పైన?

ఒరుల మంచి మనకు నొడగూర్చు శుభములు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                  ౧౨.


.వె.ll కాల గతిని యాపగా సాధ్య మెవరికి?  

గడచు కాలము మరి కదలి రాదు,

కాల గతిని విడరు కర్తవ్య సాధకుల్  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                     ౧౩.


.వె.ll కాల గతికి మించి కర్తవ్య సాధకుల్ 

పనులు చేసి భువిని ప్రబలుదురుగ!

బద్ధకంబు విడిచి పని చేయుడెన్నడున్  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                             ౧౪.


.వె.ll శాశ్వతంబు కాని స్వశరీర వాంఛలు 

తీర్చ గోరుటెల్ల తెలివి యగునె?

తెలివి యున్న వారు తృప్తులై యుందురు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                        ౧౫.


.వె.ll విద్య నేర్వ వినయ విజ్ఞానములఁ గూర్చు,  

మంచి చెడ్డ విద్య యెంచి చూపు,

మంచి లేని విద్య మనకేల నేర్వగ

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                      ౧౬.


.వె.ll పాఠశాలలోన పంతుళ్ళు చెప్పెడి  

విద్య వలనఁ గలుగు వినయ ధనము,

వినయ మబ్బుచున్న విద్యలబ్బుచునుండు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                      ౧౭.


.వె.ll విద్య నేర్పు వారు ప్రీతితో నోర్పుతో  

నేర్ప వలయు తమదు నేర్పు మీర,

ఓర్పు నేర్పు లున్న నుత్తమ గురువగు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                               ౧౮.


.వె.ll తల్లిదండ్రులార! పిల్లల నెప్పుడున్  

గొట్ట రాదిల భయ పెట్ట రాదు,

కొట్టకుండ చెప్ప గొప్పవారగుదురు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                    ౧౯.


.వె.ll తల్లి ప్రేమ వలన పిల్లలు మంచిగా  

నెదుగ గలరు. ప్రేమ మదికి బట్టు,

తల్లి కారణంబు పిల్లల ఘనతకు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                       ౨౦.


.వె.ll చెడ్డ తండ్రి వలన చెడును బిడ్డలు కూడ

చెడ్డ బిడ్డ వలన చెడును పనులు,

చెడ్డ తండ్రి యరయ చేటుకు హేతువు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                           ౨౧.


.వె.ll చేయు పనుల మీద చిత్తంబు నిలిపుడు

మెప్పు పొందు రీతి నొప్పునపుడు,

చిత్తశుద్ధి లేని చేతలు సరికావు.  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                          ౨౨.    

                                

.వె.ll పెదవి దాటు మాట పృథివిని దాటును,  

మాటలాడు నిజము మన్నన గన,

తప్పు మాటలాడి తలదించుకోనేల?  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                  ౨౩.


.వె.ll పెద్దలాడు మాట పిన్నలనుకరించు,  

చెడ్డమాటలాడ చేటు కలుగు,

మంచి మాటలాడ మన్నించి, నేర్తురు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                               ౨౪.


.వె.ll దీన జనులఁ జూచి ప్రాణమే పెట్టెడి  

జ్ఞానులెల్ల భువికి ప్రాణమరయ,

దీన జనుల లోన దేవుండు కలడండ్రు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                            ౨౫.  


.వె.ll భావమరసి మనము పఠియింప వలెనయ్య,  

భావమెఱుగనట్టి పఠనమేల?

భావమెఱుగ మదిని భద్రమై నిలుచును 

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                             ౨౬.


.వె.ll స్వార్థ బుద్ధితోడ సర్వంబు తనదని  

మెలగు వారు కడకు తొలగు వారు,

స్వార్థ బుద్ధి విడిన భవ్యుడై వర్ధిల్లు,

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                      ౨౭.


.వె.ll మదికి పదును పెట్ట మహిమలు కనఁ జేయు

మత్త చిత్త వృత్తి మాని చూడ,

మదిని కలుగు శక్తి మాధవ శక్తియే  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                       ౨౮.


.వె.ll యంత్రములను మరఁగి హాయిగా పవళించి 

పను చేయ జూడ పరువు పోవు,

కొంత కాలమునకు సాంతంబు కోల్పోవు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                              ౨౯.


.వె.ll దీక్ష తోడఁ జేయ ధ్యేయంబు చేరరా?  

ధ్యేయ రహితమైన దీక్ష కలదె?

ధ్యేయ యుక్తమైన దీక్షను బూనుఁడు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                   ౩౦.


.వె.ll నమ్మకంబు గొలిపి నటియించు వారిని  

నమ్మి మోసపోకు నటనమెఱిగి,

నమ్మినట్లు మీరు నటియించి మెలఁగుడు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                           ౩౧.


.వె.ll పాపి భీతి తోడ భక్తిగా దేవుని 

కొలిచి ధనము లొసగి కోర్కెలడుగ

లంచగొండి కాడు లక్ష్మీ సమేతుండు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                   ౩౨.


.వె.ll కోప తాపము లవి శాపాలు మనలకు

కోపి సుఖము గనడు. పాపి యగును,

శాప ఫలము వంటి కోపంబు నీకేల?  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                     ౩౩.


.వె.ll భూమిపైనఁ బుట్టిపుడకల పాలగు  

దేహమన్న మనకు మోహమేల?

మోహమనిన గొప్ప దాహంబు, తీరునా?  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                               ౩౪.


.వె.ll మనసు మాట వినక మర్యాద పోఁద్రోచు  

దుష్ట చేష్టితములఁ దొడరనేల?

మనసు చెప్పు మాట మన్నించుమెప్పుడున్, 

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                       ౩౫.


.వె.ll పుట్ట నట్టి బిడ్డఁ బట్టి యాడించము,  

గిట్టినట్టి బిడ్డ కేలు విడుచు,

పుట్టు గిట్టు మధ్య పుడమిపై  భ్రమలేల

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                              ౩౬.


.వె.ll మనసు నందు భ్రాంతి మనిషి నాడించును

బ్రాంతి తొలగి పోవ శాంతి నిలుచు.

భ్రాంతి పొరల మధ్య బ్రహ్మంబు దాగెను,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                          ౩౭.


.వె.ll నిత్య పూజ చేసి, నిరతంబు హరి గాంచి,  

దేవ శక్తి పొందు దీక్షితులును

మాయలోన చిక్కు మదినెంచి మెలఁగుఁడు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                        ౩౮.


.వె.ll క్షణము సుఖము కోరి కడ దాక దుఃఖమ్ము  

ననుభవించు వాఁడు మనుజు డగునె?

చేర తగిన దాని కోరుట ధర్మంబు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                       ౩౯.


.వె.ll వేష భాషణముల విజ్ఞత లేకున్న  

సంఘ జీవనంబు సలుప లేరు,

వాసి గొలుపు వేష భాషణన్ నరునకు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                 ౪౦.


.వె.ll మంద మతిని గాంచి, మర్యాద తీయక  

మనసు దోచ వలెను మంచి చేసి,

సకల జనులలోన సర్వేశుఁ గాంచుడు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                               ౪౧.


.వె.ll పొగడ దగిన వారిఁ బొగడక, దుష్టులఁ  

బొగడ వలసి వచ్చు నగణితముగ,

సభలలోనఁ దెలియు సత్యంబు నెఱుగరా?

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                         ౪౨.


.వె.ll పర్ణ శాలలోన బ్రతుకు చుండియు సీత  

పతిని తిట్ట లేదు. భక్తిఁ గొలిచె,

భార్య మనసు గొన్న భర్తయే ధన్యుడు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                 ౪౩.


.వె.ll దూర దర్శనములు దుర్మార్గమును పెంచు 

చిత్రములను జూప చెడరె ప్రజలు?

సత్య దూరమైన సన్నివేశము లేల

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                   ౪౪.


.వె.ll భూమిలోని చమురు, బొగ్గును పెకలించి  

గుల్ల చేయుచుండ కుమిలి పోవు,

కంప మొంది భూమి కొంపలే కూల్చును,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                           ౪౫.


.వె.ll కొండ కొల్ల గొట్టి పిండి చేయుచునుండ  

కొండ జాతు లెచట నుండ నగును?

కొండ కోన లందు కొలువుండు దేవతల్,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                             ౪౬.


.వె.ll కాల సర్ప విషము కాగల దమృతంబు

మందునందు చేరి మనిషిఁ గాచు,

అమృత మూర్తు లేల హాలాహలము గ్రక్కు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                       ౪౭.


.వె.ll బుద్ధి కుశలురైన పెద్దల వర్తన  

వృద్ధి చేయు, జ్ఞాన వృద్ధి చేయు,

పెద్దవారి మాట పెడచెవిఁ బెట్టకు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                     ౪౮.


.వె.ll సూర్య చంద్ర గతులు చోద్యంబు మింటను  

పట్టు లేని చోట కట్టుపడిరి,

భూ జనులు ఘటించు పూజలందుదురయ్య,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                    ౪౯.


.వె.ll గ్రహము లెల్ల తిరుగు మహిమాన్వితంబగు  

ఫలములిచ్చు మనకు ప్రకృతి లోన,

గ్రహ గతులవి శుభము కలిగించు బుధులకు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                    ౫౦.


.వె.ll జ్ఞాన సాధనమున కష్టాలు కలుగును

జ్ఞాని యైన పిదప కలుగు సుఖము,

జ్ఞానివగుము లోక కల్యాణ కరముగ,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                    ౫౧.


.వె.ll బాలలందు సుగుణ భావంబులను గొల్పు,  

బాలలేను భావి పౌరులరయ,

భాగ్య రేఖ వారు భారతావనికెన్న,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                       ౫౨.


.వె.ll ఎదుగు చున్న మనసు కెదురగునవి యెట్టి  

మంచి చెడ్డలైన మదికి చేరు,

పిల్లలందు మంచి పెంచంగ కృషి సల్పు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                          ౫౩.


.వె.ll నియమ నిష్టలు కల నియతాత్ములుగ తీర్చ  

బాల లలరు భువిని భవ్య గతిని,

భవ్య భవిత పొందు భారతి వారిచే,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                    ౫౪.


.వె.ll శిష్య కోటి యలరు శిక్షణ నిచ్చిన,  

గురువు పరువు నిలుపు నిరుపమ గతి,

శిక్ష లేనినాడు చెడిపోవు బాలలు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                       ౫౫.


.వె.ll తల్లి దండ్రి కెదురు పిల్లలు చెప్పక 

వారి మాట లరసి వర్ధిలఁ దగు,

కన్న తల్లి దండ్రి కనిపించు దేవుళ్ళు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                              ౫౬.


.వె.ll మంద బుద్ధి కైన మంచిగా చెప్పిన  

వినును, నిజము నెఱుగు, కనును శుభము,

బోధ చేయు వారు బాధింపఁ బని కాదు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                               ౫౭.


.వె.ll నీర మున్న పండు నిత్య పంటలు భువి

వీరులున్న పండు విజయ ఫలము,

వీర వర్తనమున వెలయుత బాలలు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                  ౫౮.


.వె.ll పాఠ శాల కేగి ప్రఖ్యాతి నొందెడి  

బాలలకును విద్య వరము కనగ,

భక్తి భావమున్న పాఠంబు రాదొకో

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                      ౫౯.


.వె.ll పెద్దలాడు మాట పెడచెవి పెట్టక

యాలకించి, మంచి నరయ వలయు,

పెద్దవారి మాట చద్దియన్నపు మూట,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                  ౬౦.


.వె.ll పెంకి తనము తోడ మంకు పట్టును పట్ట 

రంకె వేయు తండ్రి జంకు గొలుప,

పెంకి తనము వీడి పెరుగుత బాలలు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                               ౬౧.


.వె.ll తెలియ నట్టిదాని తెలుపును గురువిల,  

తెలుప నట్టి దాని తెలియ దగదు,

తెలియ దగిన దాని తెలియుచు వర్ధిల్లు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                             ౬౨.


.వె.ll పలుక రాని మాట పలుకక బాలలు  

పలుకఁ దగిన మాట పలుక వలయు,

చిలుక పలుకులటుల చెలువొందు మాటలు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                     ౬౩.


.వె.ll రమ్య గుణుడెవండు రామ రావణులందు?  

కథను చదివ తెలియుఁ గాదె మీకు,

చదువ నేర్చి, మంచి చక్కగా నరయుఁడు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                          ౬౪.


.వె.ll మదికి నచ్చు  మాట మంచినే చేయునా?  

మంచి మాట లెల్ల మంచి చేయు,

మంచి మాట లాడి మహితులై వెలుఁగుఁడు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                       ౬౫.


.వె.ll నోటి కిష్టమైన వాటినే తినినచో 

చేటు చేయ వచ్చు చిత్రమిదియె,

పథ్యమైన నవియె భక్షింపఁ దగు నిల,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                ౬౬.


.వె.ll జీర్ణ శక్తి లేని జీవుం డపథ్యంబు  

భక్షణంబు సేయ కుక్షి చెడును,

జీర్ణమయెడునవియె సేవింప వలయును,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                          ౬౭.


.వె.ll గోవు పాలు పట్టి, గోరు ముద్దలు పెట్టి  

కాచు బాల్యమందు కన్న తల్లి,

అట్టి కన్నతల్లి యారాధ్య దైవము,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                      ౬౮.


.వె.ll చిన్న నాఁడు ప్రేమ చిందించి పెంచరే   

తల్లి, దండ్రి, మామ్మ, తాత, మిమ్ము?

పెద్దయైన వారిఁ బ్రేమతో జూడుఁడు 

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                 ౬౯.


.వె.ll కష్ట పెట్ట లేరు, కొట్ట లేరయ మిమ్ము 

తిట్టి, మంచి నడత తీర్చి దిద్దు

నట్టి పెద్దవారి హాయినే కోరుఁడు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                         ౭౦.


.వె.ll పిల్లల మన మెఱిగి పెద్దలు  నడచిన  

వృద్ధి పొందు వారు హద్దు లెఱిగి,

హద్దు మీరనీక యరసి కాపాడుడు  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                       ౭౧.


.వె.ll ప్రజ్ఞ పెంచ వచ్చు ప్రఖ్యాతిఁ గొలుపఁగ,  

విజ్ఞు లైన బాల వృద్ధు లనగ,

కీర్తి నొందు గురుల స్ఫూర్తిచే బాలలు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                 ౭౨.


.వె.ll పాఠ్య పుస్తకముల భారంబు మోయుచు,  

పఠన శక్తి యుడిగి పతనమయెడి

బాలల గని మనము పరవశింపగ రాదు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                              ౭౩.


.వె.ll పలక బలప మిచ్చి పాఠాలు నేర్పిన  

మనసులందు కుదురు, మఱచిపోరు,

యంత్ర పాఠముల కుతంత్రాన చెడుదురు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                      ౭౪.


.వె.ll ఎక్కములను పట్టి యినుమారు ముమ్మారు  

నొక్కి చదువఁ జేయ నోట పట్టు,

యంత్ర వేద్యమున స్వతంత్ర శక్తి యుడుగు.  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                      ౭౫.


.వె.ll లలిత కళల లోన రాణించు బాలలు,  

నేర్పు మీర నేర్ప, నేర్పరులగు,

లిలిత భావ దములు లలిత కళ లరయ,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                           ౭౬.


.వె.ll చిత్తమందు శాంతి చేకూరమది నిల్పి

పనులు చేయఁ గలము, ప్రతిభ చూపి,

చిత్త శాంతి నిలుచు చీకాకు వీడిన,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                      ౭౭.


.వె.ll చెప్పి నేర్ప వలదు, చేయించి నేర్పుఁడు,  

చేయ బూన నదియె చేతనగును,

బాలలందు విద్య ప్రఖ్యాతమై నిల్చు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                 ౭౮.


.వె.ll కొట్టి , తిట్టి, నేర్ప కొంచెమైనను రాదు 

బాలలకును పాఠ శాలలందు,

విద్య నేర్పు వారు విద్యార్థి యగు టొప్పు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                             ౭౯.


.వె.ll సంఘ జీవనంబు, సమయ పాలనయును 

నాత్మ నిగ్రహంబు నరయ మేలు,

బాలలందు కొలుప, ప్రఖ్యాతిఁ గాంతురు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                           ౮౦.


.వె.ll మాట మాయ చేయు మాట మహిమ గొల్పు

మాటకారి నరసి మసల బోకు.

మనసు కొల్లగొట్టు మాటల గారడీ

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                       ౮౧.


.వె.ll భయము మప్పరాదు, మర్యాద మప్పుడు 

పాఠశాలలందు బాలలకును,

భయము నెఱుగనట్టి నయమును మప్పుడు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                     ౮౨.


.వె.ll లంచ మిచ్చి బడికి పంచుట సరి కాదు,  

మంచి మాటలాడి పంచ తగును,

పిల్ల లందు లంచ బీజంబు పడరాదు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                               ౮౩.


.వె.ll పారిశుద్ధ్య మరసి యారోగ్య మలరార 

బ్రతుక నేర్ప వలెను బాలలకును,

రుచిర విద్య గరయు  శుచిఁ గల్గు బాలలు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                          ౮౪.


.వె.ll రోగ కారణములు రూపించి చెప్పిన  

బాలలుంద్రు రోగ పథము వీడి,

రోగ దూర బాల యోగులు వికసింత్రు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                               ౮౫.


.వె.ll నేర మెద్ది యగును? నేర ఫలమెయ్యది?  

తెలియ జెప్ప  వలయు సులభ రీతి,

నేర దూర నీతి నేర్తురు వారలు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                          ౮౬.


.వె.ll దొంగతనము చేయ దుష్టుడందురనియు,  

మంచి వారు మెచ్చ మసలమనియుఁ

జెప్ప, బాలలందుఁ జేరును సుగుణంబు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                            ౮౭.


.వె.ll దేశ భక్తి గరప దేశ భక్తుల కథ  

లెన్ని చెప్ప వలయు నెదలఁ దాక,

బాలలందు దేశ భక్తి పెంపగునట్లు, 

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                    ౮౮.


.వె.ll ప్రకృతి లోని జంతు, పక్షి, వృక్షాదులన్  

బాలల కిలఁ జెప్ప వలయుఁ దెలియ,

బ్రకృతి పైనఁ బ్రేమ పరిఢవిల్లునపుడె, 

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                             ౮౯.


.వె.ll జీవ కోటి పైనఁ జిత్తంబులోఁ బ్రేమ   

బాలలందు మిగుల ప్రబలఁ జేయ,

సున్నితంపు భావ సుజనులై వర్ధిల్ల,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                    ౯౦.


.వె.ll తప్పు  చేయ రాదు, తప్పు చెప్పగ రాదు,  

బాల లెదుట మంచి పలుక వలయు,

మంచి బాల లెఱిగి మర్యాదగా నుంద్రు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                           ౯౧.


.వె.ll మాతృ భాషను కల మహనీయ శక్తిని 

బాలలకునుఁ దెల్ప భక్తి పెరుగు,

భక్తి యుక్తులైన బాలలదే భావి

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                          ౯౨.


.వె.ll బాలల మది లోన పన్నిన భావంబు 

లరసి బోధ చేయ వరల గలరు,

బాలల మది నెఱిఁగి పాఠంబు చెప్పుడు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                              ౯౩.


.వె.ll నీతి పద్యములను నేర్పుడు బాలలు 

నీతిమంతులగుచు ఖ్యాతిఁ బెంచు,

నీతి లేని వారు జాతికి శాత్రవుల్,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                        ౯౪.


.వె.ll మంచి నెంచి గొనుట మహనీయ తత్వంబు.  

చెడ్డ విడుచు టెల్ల దొడ్డ తనము,

బాలలందు మంచి బలపడ వలయును,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                           ౯౫.


.వె.ll భారతాంబ సంతు నేర దూరులటంచు  

విశ్వ మెల్లఁ బొగడ వెలయునటుల

శిక్షణంబు నీయ చెలువొందు బాలలు,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                               ౯౬.


.వె.ll మంచివారి పగిది మాటలాడుచు నుండి 

చెడ్డ పనులు చేయు చెడ్డవారు,

చెడ్డ నేర్వకుండ బిడ్డలన్ గాచుఁడు

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                   ౯౭.


.వె.ll కలిమి బలిమి కలుగ గర్వమ్ము నొందుచు 

కానకుండువారు కలుష మతులు,

గర్వ దూరులుగనె కాచుఁడు బాలలన్,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                               ౯౮.


.వె.ll ఆత్మ శక్తి మరచి హాయిగా యంత్రాల  

సాయమొంది పనులు చక్క జేయ

నాత్మశక్తి పోవు నారయ లేరేల?  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                           ౯౯.


.వె.ll పలకరించు నపుడు పరి హసింపగ రాదు

చిన్న నవ్వు నవ్వి చెలిమి చూప

నాలకించు వారి కానంద మొదవును

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                               ౧౦౦.


.వె.ll పెద్ద బాల శిక్ష సుద్ది చింతా రామ  

కృష్ణుఁడేన వ్రాసి తృప్తి గంటి

నొక్క దినము నందె నొప్పుగా, నరయుఁడు  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                     ౧౦౧.


.వె.ll పెద్దవార లరసి ప్రీతితోఁ జదువగ

పిన్నవారు చదివి ప్రీతిఁ బొంద,

ధర్మ యుక్తమైన కర్మలు తెలిపితి

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                  ౧౦౨.


.వె.ll దోషములను వీడి, తుల లేని ధర్మంబు  

లరసి, యాచరించి, హాయి గనుఁడు,

నీతి బాట నడచి ఖ్యాతినే గనుఁడయ్య,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                            ౧౦౩.


.వె.ll చదువులమ్మ నన్నుఁ జక్కగా కరుణించి,  

వ్రాయఁ జేయ నిద్ది వ్రాసినాఁడ

నొక్క దినము లోనఁ జక్కగా వ్రాయించె

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                         ౧౦౪.


.వె.ll మంచి చెడ్డ లరసి, మంచినే గ్రహియించి,   

చెడ్డ వీడి, తెలుగు బిడ్డ లెదుగు,

చెడ్డ వారు దీని నడ్డగించిన నేమి

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                                   ౧౦౫.


.వె.ll పెద్ద బాల శిక్ష ప్రతిభను కనఁ జేసి  

భారతాంబ కీర్తి ప్రబలఁ జేసి,

రామ దేవ! మమ్ము రక్షింపు మని వేడు,   

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                           ౧౦౬.


.వె.ll మంచి సూక్తి ప్రజల మదులకు నెక్కుచు

మంచి మార్గమందు నుంచెనేని,

శతక రచన ఫలము సమకూరినట్టులే,  

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                            ౧౦౭.


.వె.ll మంగళంబు దీని మది నెంచు వారికి.  

మంగళంబు మంచి మనుజులకును,

మంగళంబు హరికి, మహిత   శ్రీ లక్ష్మికి

వృద్ధ బాల శిక్ష వినిన మేలు.                           ౧౦౮.

 

శ్రీమచ్చింతా వంశ సంభవ సద్గుణ శోభిత  జానకీ రామమూర్తి దంపతుల పౌత్రుండును, సుగుణ సంపన్న ప్రఖ్యాత జ్యోతిశ్శాస్త్ర పారంగత వేంకట రత్నమాంబా వేంకట సన్యాసిరామారావు పుణ్య దంపతుల పుత్రుండునుశ్రీమాన్ కల్వపూడివేంకటవీరరాఘవగురుదేవుల శిష్యుండును చిత్రకవితాసమ్రాట్, కవికల్పభూజ, పద్యకవితాభిరామ మున్నగు బిరుదాంకిత రామ కృష్ణా రావు నామధేయుండనగు నాచే

ఏక దినావధి విరచిత

వృద్ధ బాల శిక్ష యనఁ బరగు

నీతి శతకము

సర్వము సంపూర్ణము.

మంగళం                         మహత్.                    శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ

తేదీ. 31 - 12 – 2011.

కృతికర్త

భాషాప్రవీణ చింతా రామ కృష్ణా రావు. P.O.L., M.A., విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.

ఫ్లాట్ నెం. A 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.

తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165

కృతికర్త

చిత్రకవితాసమ్రాట్కవికల్పభూజ పద్యకవితాభిరామ భాషాప్రవీణచింతా రామ కృష్ణా రావు. P.O.L., M.A.,     

విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.

ఫ్లాట్ నెం. A 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.

తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165

 

రచనలు.

 1) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.

 2) అశ్వధాటి సతీ శతకము.

     ప్రాస నియమముతో, ప్రతీపాదమునా మూడు ప్రాసయతులతో ఒక్క రోజులో వ్రాసినది.

 3) ఆంధ్రసౌందర్యలహరి.

 4) ఆంధ్రామృతమ్పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో అనేక స్వీయ  రచనలు.

 5) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.

 6) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.

 7) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

 8) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)

 9) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.

10) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.

11) బాలభావన శతకము.

12) మూకపంచశతి పద్యానువాదము.

13) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత సూక్తిశ్లోకములకు తెలుఁగు

       పద్యానువాదము.

14) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

15) రాఘవా! శతకము.

16) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

17) రుద్రమునకు తెలుగు భావము.

18) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

19) వసంతతిలక సూర్య శతకము.

20) విజయభావన శతకము.

21) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

22) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు.

23) శ్రీ అవధానశతపత్రశతకము.

24) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.

25) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.

26) శ్రీచక్రబంధ మంగళాష్టకము.

27) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.

28) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.

29) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.      

       (118 వృత్తాదులు గర్భస్థమైయున్న సీసపద్యములు)

30) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)

31) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.

32) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

33) శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.

34) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.

35) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. (బంధచిత్రకృతి ఒకే

      శతకమున మూడు మకుటములతో మూడు శతకములు.)

36) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)

37) శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క రోజులో వ్రాసినది.)

38) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త శివశతకము.

39) (సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు, సీతాన్వయముగా తేటగీతి

     పద్యములు, హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో సుందరోత్పల నక్షత్రమాల.

40) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)

41) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో 

      అష్టోత్తర శతపాద ఉత్పలమాలిక.

 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.